త్యాగరాజు జాతకం
త్యాగరాజు చనిపోయిన తేదీ ఖచ్చితంగా తెలిసింది కానీ, ఆయన జన్మదినం మాత్రం సుమారు 1920 వరకూ ఇదమిత్థంగా తెలీదు. ఎవరికి తోచిన లెక్కలు వారు కట్టారు. త్యాగరాజు 84 ఏళ్ళు బ్రతికాడనీ కొంతమంది రాస్తే, కొంతమంది 89 ఏళ్ళని రాసారు. మరికొంతమంది 74 ఏళ్ళని చెప్పారు. అసలు త్యాగరాజు జన్మదినం తాలూకు పలువురి సిద్ధాంతాలూ ఏలా వచ్చాయో, అసలు సరైన తేదీ ఎలా తెలిసిందో పరిశీలిద్దాం. అసలు త్యాగరాజు జన్మదినం గురించి కాస్త వివరంగా చెప్పింది ‘త్యాగరాజ – ది గ్రేట్ మ్యుజీషియన్ సైంట్’ రాసిన ఎం.ఎస్.రామస్వామి అయ్యర్. ఈయన తనకి లభించిన వివరాలన్నీ శాస్త్రీయంగా పరిశీలించి త్యాగరాజు జన్మదినాన్ని నిర్ధారించారు.
త్యాగరాజు శిష్యుల్లో ఒకడైన తిల్లైస్థానం రామ అయ్యంగార్ శిష్యుడు పంజు భాగవతార్ ‘త్యాగరాజ చరితం’ అనే పుస్తకంలో – “త్యాగరాజు పుష్య బహుళ పంచమి, ప్రభవ నామ సంవత్సరం కలియుగం 4948న సిద్ధిపొందారు” అని రాసారు. ఆది అండ్ కో శ్రీనివాస అయ్యంగార్, పి.వి క్రిష్ణ స్వామి అయ్యర్ మొదలగు వారు ఇదే తేదీని సంగ్రహించారు. కానీ తంజావూరు ప్రభుత్వ ప్రతుల్లో 1842 అనుంది. దీన్ని వి.నాగమయ్య అనే అధికారి పొందుపరిచారు. ఈయనకీ సమాచారం వేదాద్రిసదశ ముదిలియార్ ద్వారా వచ్చింది. టి.లక్ష్మణ పిళ్ళై మాత్రం జనవరి 6, 1847 అని త్యాగరాజుపై రాసిన వ్యాసాల్లో చెప్పారు. ఈ తేదీననుసరించి ఒక్కొక్కరూ ఒక్కో వయసు చెప్పారు. త్యాగరాజు వయసు, సి.తిరుమలయ్య నాయిడు 75 గానూ, సుబ్బరామ దీక్షితార్ 77 గానూ, నాగమయ్య 82గానూ, లక్ష్మణ పిళ్ళై 80 గనూ, ఆది అండ్ కో శ్రీనివాస అయ్యంగార్ 89 గానూ, పంజు భాగవతార్ త్యాగరాజు వయసు 88 గా చెప్పారు. వేదాద్రిసదశ అయ్యంగార్ ద్వారా రామస్వామి అయ్యర్కి త్యాగరాజు 88 ఏళ్ళు బ్రతికినట్లు చెప్పినందువల్ల, ఆయన పుట్టిన ఏడు 1759 అయ్యుంటుందనీ నిర్ధారించేసారు. చాలాకాలం వరకూ త్యాగరాజు వయసు 88 గానే అందరూ అనుకున్నారు.

త్యాగరాజు జాతకము
వెంకటరమణ భాగవతార్కి కవి వెంకట సూరి అనే శిష్యుడొకాయన ఉండేవాడు. ఇతను త్యాగరాజుదీ, వెంకటరమణ భాగవతార్ల జాతకాలు భద్రంగా పొందుపరిచాడు. నౌకా చరిత్రాన్ని సంస్కృతంలోకి అనువదించిందీ కవి వెంకటసూరే! 1910 తరువాత వెంకటరమణ భాగవతారూ, తంజావూరు రామారావు పేర్లతో వున్న త్యాగరాజు కృతుల తాళపత్ర గ్రంధం వాలజపేట శిష్యులు పొందుపరిచిన వాటిల్లో దొరికింది. ఈ కృతుల చివర్న త్యాగరాజు జాతకం వుంది. ఆ జాతకంలో ఈ క్రింది విధంగా ఉంది.
“స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన గత శకాః, 1689 గత కల్యబ్దః 4858 వ్యవహారిక సౌర చంద్రమానాభ్యాం సర్వజిన్నామ సంవత్సర మేష మాసం 25వ తేదీ వైశాఖ శుద్ధ 6 సోమవారం 14-50 పునర్వసు 6-8 శూల 21-29 తైతుల 14-50 దివి 26-29 ఈ శుభ దినమందు సూర్యోదయది ఘ. 14-56 విఘడియలకు భరద్వాజ గోత్రోద్భవుండునూ శ్రీ మద్రామాయణాది ప్రసంగ నిపుణులగు శ్రీ రామ బ్రహ్మస్వామి వారికి శ్రీమత్ పుణ్య తృతీయ పుత్ర జననం”.
ఈ త్యాగరాజు జాతకాన్ని 1947 లో త్యాగరాజు శతాబ్ది సంచికలో వాడ్రేవు సూర్యనారాయణ సవివరంగా చర్చించారు. శ్రీరాముడి జన్మ నక్షత్రాన్నే (పునర్వసు) త్యాగరాజూ జన్మించాడు. ఇది యాదృచ్చికంగా అనిపిస్తుంది. పైన చెప్పిన ‘1689 గత కల్యబ్దః 4858’ వివరం ఇంగ్లీషు సంవత్సరాల ప్రకారం మే 4, 1767 అవుతుంది.
ఈ వివరాలు లభించాక రామస్వామి అయ్యర్ పరిశోధన సరికాదని తేలిపోయింది.
త్యాగరాజు ఆరాధనోత్సవం
త్యాగరాజు సిద్ధి పొందిన తరువాత ఉమైయాల్పురం శిష్యులు ప్రతీ ఏటా పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారొచ్చి సమాధిని సందర్శించేవారు. ఇది మాత్రం విధిగా 40 ఏళ్ళు పైగా చేసారు. ఆ తరువాత ఎవరి ఊళ్ళల్లో వాళ్ళే కచేరీలు చేసేవారు. దాదాపు 1905 వరకూ ఇలాగే జరిగింది. సమాధి శిధిలావస్థలో ఉండడం చూసి ఉమైయాల్పురం సుందరేశ భాగవతారూ, కృష్ణ భాగవతారూ సమాధికి మరమ్మత్తులు చేయాలని సంకల్పించారు. సంగీత ప్రియుల వద్దనుండి విరాళాలు సేకరించి ఒక్కడ ఒక పూజార్ని పర్యవేక్షకుడిగా నియమించారు. 1907 తరువాత నుండీ త్యాగరాజు సమాధికి కొత్త రూపొచ్చింది. కొత్త శకమొచ్చింది. త్యాగరాజ ఆరాధన పేరుతో ఉత్సవంగా భజనలూ, సంగీత కచేరీలూ జరపడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో తిల్లయిస్థానం నరసింహ భాగవతార్ త్యాగరాజు కృతులు సేకరిస్తూ తిరువయ్యారు వచ్చాడు. అక్కడ పంజు భాగవాతార్నీ, తిరుచురాపల్లి గోవిందస్వామి పిళ్ళైని కలిసి త్యాగరాజ ఆరాధనోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. అది చూసి 1908 లో ఉమైయాల్పురం శిష్యులు పంచాపకేశ అయ్యర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంగీత విద్వాంసుల్ని రప్పించారు. దాంతో తిల్లైస్థానం వారికీ, ఉమైయాల్పురం వారికీ విబేధాలొచ్చాయి. నరసింహ భాగవతారంతలా పెద్ద ఎత్తున చేయలేకపోయినా, సమాధి బాగోగులు మాత్రం ఉమైయాల్పురం శిష్యులే చూసేవారు.
ఇద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి, తిల్లైస్థానం వాళ్ళు తిరువయ్యారు కళ్యాణ మహల్లోనూ, మరో వర్గం ఉమైయాల్పురం వాళ్ళు తిరువయ్యారు సంస్కృత పాఠశాలలోనూ జరపడం మొదలెట్టారు. ఇలా దాదాపు పదేళ్ళు పైగా నిర్వహించారు. మెల్ల మెల్లగా త్యాగరాజు ఆరాధనోత్సవ విషయం పలువూళ్ళకీ ప్రాకింది. పదిమంది చెవినా పడింది. జనాలు రావడం మొదలెట్టారు. సుమారు 1920 ప్రాంతంలో బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఒకావిడ ప్రవేశంతో మరో కొత్త మలుపు తిరిగింది. అదేమిటో తెలుసుకునే ముందు ఈ నాగరత్నమ్మ గురించీ కాస్త తెలియాలి. ఈ క్రింద చెప్పబోయే కథ 1947లో ‘త్యాగరాజు శతాబ్దిసంచిక’లో, అచ్చ తెలుగులో, బెంగుళూరు నాగరత్నమ్మే స్వయంగా రాసుకుంది.

బెంగుళూరు నాగరత్నమ్మ
బెంగుళూరు నాగరత్నమ్మ మైసూరు సంస్థానంలో దేవదాసీగా ఉండేది. ఈవిడకి కర్ణాటక సంగీతం బాగా వచ్చు, కృష్ణ భాగవతార్ శిష్యుడైన బెంగుళూరు మునుస్వామప్ప శిష్యురాలు. త్యాగరాజు కృతులూ నేర్చుకుంది. అప్పట్లో మద్రాసు సంగీత విద్వాంసులకి నిలయంగా ఉండేది. చివరికి ఈ బెంగుళూరు నాగరత్నమ్మ మద్రాసులో స్థిరపడి సంగీత కచేరీలు ఇచ్చేది. ఓ రోజున ఉమైయాల్పురం పంచాపకేశ భాగవతార్ సంగీత కచేరీకని మద్రాసు వచ్చినపుడు నాగరత్నమ్మ వారిని కలిసింది. ఆయన వద్ద త్యాగరాజు చిత్రపటాన్నొకటి ఏడు రూపాయిలకి కొనుక్కుంది. ఓ రోజు రాత్రి నాగరత్నమ్మకి కలలో త్యాగరాజు కనిపించాడు. ఈ విషయాన్ని సంగీత సమాజ కార్యదర్శి మునుస్వామి నాయుడుకి చెప్పింది. సరిగ్గా అదే సమయానికి తంజావూరు నాగరాజ భాగవతార్ హరికథా కాలక్షేపం నిమిత్తమై మద్రాసు వచ్చారు. ఆయనతో ఈ విషయం చెబితే తిరువయ్యారులో త్యాగరాజు సమాధిని సందర్శించమని చెప్పారు. వారితో కలిసి నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళి, సమాధిని సందర్శించింది. సమాధి సమీపంలో తుప్పలూ, మొక్కలూ పెరిగి అస్తవ్యస్తంగా కనిపించి, ఇక్కడ త్యాగరాజు మందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేసి, పదిమందినీ సంప్రదించింది. తన దగ్గరున్న కొంత ధనాన్ని వెచ్చిచి త్యాగరాజు వంశీకుడైన రాముడు భాగవతార్ కి సమాధి చుట్టూ ప్రాకారం కట్టే పనులు పురమాయించి మద్రాసొచ్చేసింది. ఇది 1925లో జరిగింది.
సుమారు మూడేళ్ళకి సమాధి చుట్టూ ఓ చిన్న ప్రాకారం కట్టారు. దాదాపు పదమూడేళ్ళ వరకూ ప్రతీ ఏటా నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళొచ్చేది. 1939లో త్యాగరాజు సమాధి మందిరం నిర్మించాలన్న ఆశయమొచ్చింది. సమాధి కెదురుగా వున్న తోట భూములు తంజావూరు రాజబంధువులైన రాజారాం సాహిబ్ విరాళంగా ఇచ్చారు. ఒక కార్య వర్గాన్ని నియమించి సమాధి మందిరాన్ని కడదామనుకుంది. సమాధిపై రామ విగ్రహం పెట్టాలా? త్యాగరాజు విగ్రహం పెట్టాలా? అన్న సందేహం వచ్చి పదిమందినీ సంప్రదిస్తే, త్యాగరాజు విగ్రహం పెడితే బాగుంటుందనీ తీర్మానించారు. ఈలోగా తిల్లైస్థానం వర్గానికీ, ఉమైయాల్పురం వర్గానికీ మరలా గొడవలొచ్చాయి. నాగరత్నమ్మ ప్రవేశంతో ఇద్దరి మధ్యా గొడవలు సమసిపోయి అందరూ కలిసిగట్టుగా సమాధి మందిర నిర్మాణానికీ, త్యాగరాజు విగ్రహ స్థాపనకీ కృషి చేద్దామని నిశ్చయించుకున్నారు. ఆ విధంగా 1939లో త్యాగరాజు విగ్రహ స్థాపన జరిగింది.
త్యాగరాజు విగ్రహం
ఆ సమాధి దగ్గరలోనే త్యాగరాజ ఆరాధనోత్సవం జరపాలని నిర్ణయించారు. సుమారు 1940 నుండి నేటి వరకూ సమాధి వద్దనే ఆరాధనోత్సవం జరుగుతుంది. సమాధి మందిరం కట్టే సమయంలో లోపల గోడలపైన పాలరాతి ఫలకాలపై త్యాగరాజు కృతులు చెక్కిస్తే బావుంటుందన్న ప్రతిపాదన శ్రీరంగం సుందరం అయ్యర్ చేస్తే అందరూ ఆమోదించారు. అందులోనే వాల్మీకి మంటపాన్ని కట్టి వాల్మీకి విగ్రహాన్నీ ప్రతిష్టించారు. ఈ పన్నెండేళ్ళ వివరాలన్నీ అప్పట్లో కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ప్రోద్బలంతో నాగరత్నమ్మ ఆంధ్రపత్రికలో ధారావాహికంగా వ్యాసాలు రాసింది.
1940 నుండీ ఆరాధనోత్సవాలు పెద్ద యెత్తున జరిగేవి. అందులో భాగంగా త్యాగరాజు పంచరత్న కీర్తనలని సమాధి వద్ద పాడే ఆచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడే హరికథలూ, అన్నదానాలూ జరిపేవారు. 1945 లో రేడియో ప్రసారం కూడా చేసారు. 1946లో చిత్తూరు నాగయ్య ఆయనే స్వయంగా నటించి ‘త్యాగయ్య’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఆ సినిమా విజయవంతమైన సందర్భంగా నాగయ్య బెంగుళూరు నాగరత్నమ్మని కలిసినప్పుడు తిరువయ్యారులో త్యాగరాజు భక్తులకోసం ఓ వసతి గృహాన్ని చిత్తూరు నాగయ్యే కట్టించారు. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర అనేకమంది రాసారు. ఈవిడ 1952లో చనిపోయింది. ఈవిడ సమాధి త్యాగరాజు సమాధి ప్రాంగణంలోనే కట్టారు.