మనకు తెలియని మన త్యాగరాజు – 5

త్యాగరాజులా కొత్త కొత్త రాగాలు కనుక్కోకపోయినా శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన రాగాల్లోనే కృతులు స్వరపరిచాడు. ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’ వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.

ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’ అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు. శ్యామకృష్ణ అన్నది వీరి కృతి ముద్ర. శ్యామశాస్త్రి పుదుకుట్టయి ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడే బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ జరిగిందని కొంతమంది రాస్తే, ఆ కథని మరి కొంతమంది త్యాగరాజుతో జరిగినట్లుగా రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!


శ్యామశాస్త్రి తపాలా బిళ్ళ

శ్యామశాస్త్రి 1827లో కన్నుమూసాడు. తండ్రి పోయిన తరువాతే సుబ్బరాయ శాస్త్రి త్యాగరాజు వద్ద శిష్యుడిగా చేరాడు. త్యాగరాజు అంత్య దశలో తిరువయ్యార్ లోనే ఉన్నాడు. పంజుశాస్త్రి ముగ్గురు కొడుకుల్లో ఒకడైన రామకృష్ణ శాస్త్రి కొడుకు, నటేశ శాస్త్రి ద్వారా శ్యామశాస్త్రి కృతుల ప్రతులు దొరికాయి. పిల్లలు లేని సుబ్బరాయ శాస్త్రి అన్నగారి ఆఖరి కొడుకు అన్నస్వామి శాస్త్రిని పెంచుకున్నాడు. ఈయన దగ్గర నటేశశాస్త్రి తాతగారు స్వరపరిచిన కృతులన్నీ నేర్చుకున్నాడు. ఈ నటేశ శాస్త్రి దాదాపు 94 ఏళ్ళు బ్రతికాడు. ఈయన 1950 లో చనిపోయాడు. ఈయన ద్వారా శ్యామ శాస్త్రి గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంబమూర్తి ఈయన్ని అనేకసార్లు కలిసి శ్యామశాస్త్రి కృతుల వివరాలు సేకరించినట్లుగా రాసారు. అందువల్లే శ్యామశాస్త్రి రచనలు 1915 దాటాకే పదిమందికీ తెలియడం మొదలు పెట్టాయి.

శ్యామశాస్త్రి, త్యాగరాజు మంచి స్నేహితులని సాంబమూర్తి గారు ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాస్తూ ఓ కథ చెప్పారు. శ్యామశాస్త్రికి తాంబూలం అలవాటు ఎక్కువగా ఉండేది. అస్తమానూ ఉమ్మి వేయడానికి కూర్చున్న చోటునుండి లేచి బయటకు వెళ్ళేవాడు. త్యాగరాజుకి ఎంతో శుభ్రతా నియమాలున్నా శ్యామశాస్త్రి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు మినహాయింపుండేదని చెబుతూ కథలా రాసారు. ఇలాంటి కథలకి ఆధారాలేమిటో తెలీదు. శ్యామశాస్త్రి ఆలయ అర్చకుడు. అలా పదిమంది ముందూ తాంబూలం నమిలినా, అక్కడే ఉమ్మి వేసే ప్రవర్తనుంటుందని ఎవరూ భావించరు. ఇలాంటి కథలు పదిమందికీ చెప్పడంలో ఆంతర్యమేమిటో తెలీదు. ఈ కథ ఇద్దరు వాగ్గేయకారుల్నీ ఓ మెట్టు క్రిందకే దింపుతుందని నా అభిప్రాయం. ఈ ఒక్క సంఘటనా తప్ప, సంగీత పరంగా వేరే సంఘటనలు ఎవరూ ఉటంకించలేదు. త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మిగతా శిష్యులు కానీ ఎవరూ శ్యామశాస్త్రి గురించి రాయలేదు.

ముత్తుస్వామి దీక్షితార్

కర్ణాటక సంగీతంలో దీక్షితార్ కుటుంబానికొక ప్రత్యేక స్థానం వుంది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరుగా చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈయన ‘అష్టోత్తర శత రాగ రత్నమాలిక’ అనే అతి పెద్ద కృతిని స్వరకల్పన చేసాడు. ఇది రాగయుక్తంగా ఆలాపనలతో పాడడానికి ఓ రోజు పైగా పడుతుందని అంటారు. అటువంటి సంగీత విద్వాంసుడింట 1776 లో జన్మించాడు ముత్తుస్వామి దీక్షితార్. హైదరాలీ అకృత్యాలతో తంజావూరు చుట్టుపక్కల వూళ్ళన్నీ ధ్వంసమయిపోతే, రామస్వామి దీక్షితార్ స్వస్థలమైన విరించిపురం వదిలి తిరువదమర్దూరు మకాం మార్చారు. అక్కడ నుండి తిరువారూర్ వచ్చి స్థిరపడ్డారు. ముత్తుస్వామి దీక్షితార్ పుట్టింది తిరువారూర్లోనే!


ముత్తుస్వామి తపాలా బిళ్ళ

ఓసారి మనాలి ముత్తుకృష్ణ ముదలియార్ అనే ఒక యతీంద్రుడు వచ్చినపుడు ఆయన కోరికపై ముత్తుస్వామి దీక్షితార్ని పదిహేడేళ్ళ వయసులో మిగతా కొడుకులిద్దరితోనూ తండ్రి కాశీ పంపించాడు. సుమారు పదేళ్ళు దీక్షితార్ అక్కడే గడిపాడు. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ పెళ్ళయ్యింది. అన్నలిద్దరూ, చిన్న స్వామి దీక్షితార్, బాలస్వామి దీక్షితార్ ఏడాదిలో తిరువారూరు వెనక్కి తిరిగొచ్చేసినా ముత్తుస్వామి దీక్షితార్ మాత్రం కాశీ లోనే ఉండిపోయాడు. కేవలం గాయకుడు మాత్రమే కాదు, ముత్తుస్వామి దీక్షితార్ మంచి వైణికుడు కూడా.

సుమారు 1801 ప్రాంతంలో తిరిగి తిరువారూరొచ్చాడు. అప్పటికే బాలుస్వామి, చిన్నస్వామిలిద్దరూ జంట విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వీరికి మదురై ఆస్థానం నుండి పిలుపు రావడంతో అక్కడకి వెళిపోయారు. అక్కడుండగానే చిన్నస్వామి దీక్షితార్ చనిపోయాడు. అన్నగారి మరణంతో కలత చెందిన బాలుస్వామి కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఎత్తియపురం రాజాస్థానంలో చేరాడు. అప్పటివరకూ అవివాహితుడుగానున్న బాలస్వామికి ఎత్తియపురం రాజుగారు దగ్గరుండి పెళ్ళి జేసారు. ఈ వార్త ముత్తుస్వామి దీక్షితార్ చెవినపడి అన్నగార్ని చూడ్డానికని వెళ్ళాడు. అన్నగార్ని కలిసాక ఎత్తియపురం ఆస్థానంలో సంగీత కచేరీ చేసే అవకాశం ముత్తుస్వామి దీక్షితారుకొచ్చింది.

ముత్తుస్వామి దీక్షితార్ తమిళ, సంస్కృత భాషల్లో ప్రవీణుడు. ఈయన స్వరపరిచిన కృతులన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఒక్క రచనా తెలుగులో లేదు. ముత్తుస్వామి దీక్షితార్ సముదాయ కృతులెక్కువగా రచించాడు. సముదాయ కృతులంటే ఒక స్థలాన్ని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక దైవాన్ని కానీ వుద్దేశించి రచించినవి. ఇవి గుంపుగా 5 లేదా 6 కృతులు కలిపుంటాయి. నవగ్రహ కీర్తనలు, నవరత్న కీర్తనలూ, పంచలింగ స్థల కృతులూ వీటిలో కొన్ని చెప్పుకోదగ్గవి. ముత్తుస్వామి దీక్షితార్ కృతి ముద్ర – ‘గురు గుహ’. సాధారణంగా కృతుల ఆఖరి చరణంలో వాగ్గేయకారుల ముద్ర కనిపిస్తుంది. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కృతుల్లో మాత్రం ఈ ముద్ర పల్లవిలో కానీ, అనుపల్లవిలో కానీ, చరణంలో కానీ వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతుల్లో ‘త్యాగరాజ’ అన్నది కనిపిస్తుంది. ఇది చూసి వాగ్గేయకారుడు త్యాగరాజు పై గౌరవంతో రాసిందిగా కొందరు అపోహపడే అవకాశముంది. ఇక్కడ త్యాగరాజు అంటే తిరువారూర్ గ్రామ దైవం ‘త్యాగరాజ స్వామి’ నుద్దేశించని అనుకోవాలి.

ముత్తుస్వామి దీక్షితార్ పై పశ్చిమదేశ సంగీత ప్రభావం కూడా వుంది. దీక్షితార్ అన్నయ్య బాలుస్వామి కచేరీల్లో పక్క వాయిద్యంగా వయులిన్ వాడకాన్ని ప్రవేశ పెట్టాడు. ఎత్తియపురం రాజాస్థానం ద్వారా బ్రిటీషు పాలకుల పరిచయంతో పాశ్చాత్య సంగీతం తెలిసింది. తెలుగులో నిఘంటువు కూర్చిన సి.పి. బ్రౌన్ కి అంకితమిస్తూ 1832లో ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతులు స్వరపరిచాడు. అప్పటికి సి.పి. బ్రౌన్ చిత్తూర్ జిల్లాకి కలక్టర్ గా పనిజేసేవాడు. ఈ కృతుల వివరాలూ, ఈ విషయమూ సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో ఉన్నాయి. పశ్చిమ సంగీతాధారంగా దీక్షితార్ ‘నొట్టు స్వరములు’ అనేవి స్వరపరిచాడు. ఇంగ్లీషులో నోట్ కాస్తా తమిళంలోకి నొట్టుగా తర్జుమా అయ్యింది. శంకరాభరణంలో ‘సంతతం పాహిమాం’, ‘రామ జనార్ధన’ వంటి నొట్టుస్వర గీతాల్లో కర్ణాటక సంగీతంలో ఉండే గమకాలుండవు. ముత్తుస్వామి దీక్షితార్ సుమారు 400 పైగా కృతులు 120 రాగాల్లో స్వరపరిచాడు. ఈ రాగాలన్నీ వేంకటమఖి సంప్రదాయాన్ననుసరించి వాడుకున్నవే తప్ప కొత్త రాగాలు కావు.

తిరుక్కడైయూర్ భారతి, తేవూర్ సుబ్రహ్మణ్యయ్యర్, శుద్ధ మద్దాళం తంబియప్ప, వీణ వెంకట్రామయ్యర్, కోర్నాడ్ రామస్వామి, తిరువారూర్ అయ్యస్వామి, తంజావూరు చతుష్టయం పొన్నయ్య, చిన్నయ్య, శివనందం, వడివేలు, తిరువారూర్ కమలం, వళ్ళలార్ కోయిల్ అమ్మణి ఈయనకున్న శిష్యగణం. 1935 లో యత్తియపురం రాజ బంధువుల వివాహానికెళ్ళి అక్కడే దీక్షితార్ చనిపోయాడు. ఎ.ఎం.చిన్నస్వామి ముదిలియార్ ‘ఓరియంటల్ మ్యూజిక్’ అనే పుస్తకంలో ఇలా రాస్తారు. “త్యాగరాజ కృతులు చెవిన పడగానే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలాకాదు. ఒకటికి పదిమార్లు విని, శోధిస్తే కానీ ఆ కృతుల్లో గొప్పదనం తెలీదు”.

ఈ త్రిమూర్తులు ఎప్పుడైనా కలిసారా?

శ్యామశాస్త్రీ, త్యాగరాజు మంచి స్నేహితులని చెబుతూ తరచు వీళ్ళిద్దరూ కలిసే వారన్నట్లుగా అనేకమంది రాసారు. ఈ విషయం 1930 తరువాతొచ్చిన రచనల్లోనే ఇది ఎక్కువ భాగం కనిపిస్తుంది. త్యాగరాజు శిష్యులు పొందుపరిచిన వివరాల్లో ఇది లేదు. ఇద్దరూ దగ్గరూళ్ళలోనే ఉండడం వల్ల ఒకరి గురించొకరికి ఖచ్చితంగా తెలిసే అవకాశముంది. అది కేవలం ముఖ పరిచయమేనా లేక సంగీత పరిచయం కూడా ఉందన్న విషయం రూఢిగా చెప్పలేము. సుబ్బరాయ శాస్త్రి త్యాగరాజు శిష్యుడవడం వలన, ఇద్దరి వాగ్గేయకారులకీ ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవముందనీ, అందుకే శ్యామశాస్త్రి తన కొడుకుని త్యాగరాజు వద్దకు పంపాడనీ చెప్పారు. పరస్పర గౌరవం మాటటుంచి, సుబ్బరాయ శాస్త్రిని మాత్రం శ్యామశాస్త్రి పంపే అవకాశం లేదు. ఎందుకంటే శ్యామశాస్త్రి 1827 లో చనిపోయాడు. త్యాగరాజు 1829 లో ఉత్తరాది యాత్రలు ముగించుకొచ్చేకే సుబ్బరాయశాస్త్రి త్యాగరాజు వద్ద శిష్యరికం జేసాడు.

ఇహ ముత్తుస్వామి దీక్షితార్ విషయమూ ఇలానే వుంది. త్యాగరాజూ, ఈయన కలిసినట్లు ఎక్కడా మచ్చుక్కి ఒక్క ఆధారమూ దొరకలేదు. కలిసారంటూ కథలున్నా వాటికి విశ్వసనీయత లేదు. తిరువయ్యారు గ్రామదేవత ధర్మసంవర్ధిని దేవాలయానికి ముత్తుస్వామి దీక్షితార్ వచ్చి అక్కడ కచేరీ ఇచ్చిన సమయంలోనే, త్యాగరాజు రామాయణ పారాయణ ముగింపు ఉత్సవమూ జరిగిందనీ, అప్పుడే త్యాగరాజు ఇంటికి దీక్షితార్ వెళ్ళాడనీ, అక్కడే మణిరంగు రాగంలో ‘మమవ పట్టాభి రామ’ కృతిని పాడాడనీ – సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ లో రాసారు. ఇదొక్క సంఘటనే తప్ప త్యాగరాజు శిష్యులు వెంకటరమణ భాగవతార్ కానీ, కృష్ణ భాగవతార్ కానీ, సుందరేశ శర్మా ఎవరూ వీరిద్దరూ కలిసినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. రామస్వామి అయ్యర్ కూడా ఎక్కడా రాయలేదు. వడివేలూ, గోవింద మరారూ, గోపాలకృష్ణ భారతీ వంటి ప్రముఖులు త్యాగరాజుని కలిసినట్లుగా రాసిన శిష్యులు, సంగీత స్రష్టలైన శ్యామశాస్త్రీ, దీక్షితార్ల గురించి ఒక్క మాటా రాయకుండా వుండరు. ముగ్గురూ ఇంచుమించు 30 కిలోమీటర్ల పరిధిలో వున్నారు. ఒకరి గురించి మరొకరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుందని నా నమ్మకం.