మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా

భార్య అయిన జిక్కీ కంటే రాజా చిత్రాలలో ఎక్కువగా సుశీల పాడారు. అలా అని జిక్కీ పాటల మాధుర్యం తక్కువేమీ కాదు. రాజా దర్శకత్వంలో బహుశా జిక్కి పాడిన అత్యుత్తమమైన పాట ‘తుళ్ళాద మనముం తుళ్ళుం’ (తెలుగులో ‘పులకించని మది పులకించె’). పెళ్ళికానుక సినిమాలో మిగిలిన అన్ని పాటలూ ‘కల్యాణ పరిశు’ మెట్టులోనే ఉన్నా ‘కన్నులతో పలుకరించు వలపులు’ మాత్రం కొత్తది. దీనికి కారణం తమిళంలోని ‘ఆశయినాలే మనం’ అనే పాట, పాండురంగ మాహాత్మ్యములోని ‘వన్నెల చిన్నెల నేరా’ అనే పాట పల్లవుల ఆధారం. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాజాను 1959లో అత్యుత్తమ సంగీత దర్శకునిగా గౌరవించింది.

‘పెళ్ళి కానుక’ విడుదలతో రాజాకు మరిన్ని అవకాశాలు రాసాగాయి. జెమినీ గణేశన్ గొంతుకు రాజా ఒక అద్దం అయ్యారు. తరువాత శ్రీధర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ చిత్రమైన ‘విడివెళ్ళి’కి (శుక్రతార) రాజా సంగీతాన్ని నిర్దేశించారు. తన స్వంత చిత్రంలో శివాజీ గణేశన్ సౌందరరాజన్‌ను కాక రాజాను పాడమన్నాడు. శ్రీధర్ దర్శకుడైన మరొక చిత్రం ‘మీండ శొర్గం’ (మరలి వచ్చిన స్వర్గము, తెలుగులో ‘స్త్రీ జీవితం’గా 1959లో విడుదలైంది). దీనికి సంగీత దర్శకుడు చలపతి రావు. ఇందులోని ‘కలైయే ఎన్ వాళ్కైయిన్ దిశై మాట్రినాయ్’ అనే పాట రాజాకు అపారమైన కీర్తిని తెచ్చి పెట్టింది. వైజయంతీమాల, జెమినీ గణేశన్‌లతో శ్రీధర్ కాశ్మీర్‌లో షూట్ చేసిన ‘తేన్ నిలవు’కి (1960, తెలుగులో “విరిసిన వెన్నెల”గా డబ్బింగు చేయబడింది) కూడా సంగీత దర్శకుడు రాజాయే. ఇందులోని హంసానంది రాగంలో ‘కాలైయుం నీయే మాలైయుం నీయే’ అనే పాట, సుశీలతో పాడిన యుగళగీతం ‘నిలవుం, మలరుం’ చక్కనైన పాటలు. ఈనాడు కూడా తమిళనాడులో ఈ చిత్రంలో నటించిన జెమినీ గణేశన్‌ను, పాటలను పాడిన రాజాను పదేపదే తలచుకొంటారు.

పులకించని మది – పెళ్ళి కానుకకలైయే ఎన్ వాళ్కైయిన్ – మీండ శొర్గంకాలైయుం నీయే – తేన్ నిలవునిలవుం, మలరుం – తేన్ నిలవు

ఒక కోణంనుండి చూస్తే ఈ చిత్రం అతని జీవితానికి పెద్ద అడ్డంకిని కూడా కలిగించింది. ఎందుకో కానీ ఈ చిత్రపు రీరికార్డింగు (నేపథ్య సంగీతం) విషయంలో రాజా ఆలస్యం చేశారట. దానితో శ్రీధర్ ఈ చిత్రాన్ని సమయానికి విడుదల చేయలేక పోయారట. ఎం. జీ. రామచంద్రన్ మధ్యవర్తిత్వం చేసి రాజాచే పని పూర్తి చేయించారట. ఐనా కూడా శ్రీధర్ ‘నెంజిల్ ఒరు ఆలయం’ (తెలుగులో ‘మనసే మందిరం’) చిత్రానికి రాజానే సంగీత దర్శకుడుగా ఎన్నుకొన్నారట. మరెందుకో రాజా అంగీకరించలేదు. దీనితో ఆయన పతనం ప్రారంభమయింది.

రాజాతో మెలగడం కొద్దిగా కష్టమని వినికిడి. తాను కూర్చిన స్వరాలను ఎవరైనా దొంగిలిస్తారానే అపోహ ఉండేదట. ఏది ఏమైనా రాజా మార్కెట్ దిగజారింది. తెలుగు చిత్రసీమలో నాగేశ్వరరావు, ఎన్. టీ రామారావుల పాటలను ఘంటసాల గొంతుతో తప్ప మిగిలినవారి గళముతో వినడానికి ప్రజలు ఇష్టపడలేదు. ముఖ్యంగా ఆ కాలపు ఇద్దరు హీరోలకు ఎక్కువగా పాటలు ఘంటసాల పాడారు. ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు. తమిళములో పీ. బీ. శ్రీనివాస్ అదే సమయంలో ప్రవేశించారు. కొందరు దర్శకులు రాజాకు బదులు అతనిచేత పాడించారు. మరొకటి, సంగీత దర్శకుడైన తరువాత మిగిలిన సంగీత దర్శకులు అతనిచే పాడించడానికి కొద్దిగా సందేహించారేమో, తెలియదు. ఈ సంఘటనలు రాజాను మాత్రమే కాదు, అతని భార్య జిక్కిని కూడా తాకాయి. మెల్లమెల్లగా సినిమా రంగంనుండి నిష్క్రమించి తన పాటలను సభలలో, కార్యక్రమాలలో భార్యతో కూడా పాడసాగారు (ఆ కాలంలో అతని ఆర్కెస్ట్రాలో మరొక రాజా గిటార్ వాయించేవాడు. అతనే ఇప్పటి ఇళయరాజా. ఈయన చాలా యేళ్ళ తరువాత 1990లలో జిక్కిచే మళ్ళీ పాడించారు). అదీ కాక రాజా తాను సంపాదించే కాలంలో కొన్ని టాక్సీలను కొని నడిపించే వారు. కాబట్టి జీవితం గడవడానికి కష్టమేమీ లేకపోయింది.

రాజా గాయకుడు దర్శకుడు మాత్రమే కాదు, ఒక నటుడు కూడా. ‘పక్కింటి అమ్మాయి’ (1953) చిత్రంలో రాజా నటనను అందరూ మెచ్చుకొన్నారు. ఇందులో ఒక విచిత్రమేమంటే, ఇదే పాత్రను హిందీ చిత్రంలో (పడోసన్, 1968) గాయక దర్శకుడు కిశోర్ కుమార్ వేయగా, మళ్ళీ తీసిన (1976) తెలుగు చిత్రంలో ఈనాటి గాయక దర్శకుడు బాలసుబ్రహ్మణ్యం పోషించారు. ఇంత ఆదరణ పొందిన ఈ చిత్రానికి ‘పాషేర్ బారీ’ అనే బెంగాలీ నాటకం (సినిమాగా 1952లో) మాతృక. రాజా తెలుగు, తమిళ చిత్రాలలో మాత్రమే కాక మలయాళం, కన్నడ, హిందీ, సింహళ చిత్రాలలో కూడా పాడారు. మలయాళ సినీ రంగంలో హీరో సత్యన్‌కు గాత్రదానం ఎక్కువగా చేసింది రాజాయే. మలయాళంలో రాజా సంగీత దర్శకత్వం కూడా చేశారు. 1987లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్‌లోని ఒక ఇంటర్వ్యూలో రాజా ఇలా అన్నారట:

“నా పాటలను ప్రజలు ఇంకా ఆదరించి మెచ్చుకొంటున్నారనే విషయం నాకెంతో సంతోషం. నేను కూడా ఆ పాటలను స్టేజిపైన పాడుతూ జీవితాన్ని గడుపుతున్నాను. అందుకే సంగీత దర్శకుడునిగా నా జీవితంలో సంభవించిన ఒడిదుడుకులకు నాకేమీ విచారం లేదు. అంతా విధి లీల. కాని నేననుకొన్నది సాధించాను. అయినా కూడా ఇంకా బాగా చేయాలనే ఆశ పోలేదు. ‘కల్యాణపరిశు’, ‘తేన్ నిలవు’ పాటలకంటె ఇంక మంచి పాటలే కట్టగలను. ఏదేమైనా నేను సంతృప్తితోనే ఉన్నాను. సినిమాలలో పాటలు పాడాలనుకొన్నాను, పాడాను. మంచి సంగీత దర్శకుడు కావాలనుకొన్నాను, అయినాను. ఇది చాలు నాకు”.

రాశి నల్ల రాశి – వీట్టు మాప్పిళ్ళైసిరిమల్లె సొగసు – పుట్టినిల్లు మెట్టినిల్లు

ఆ తరువాత 1970 ప్రాంతంలో మళ్ళీ రాజా ‘వీట్టు మాప్పిళ్ళై’ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో రాజా, జిక్కీ కలిసి పాడిన ‘రాశి నల్ల రాశి’ అనే పాట ప్రజల మన్ననకు పాత్రమయింది. శంకర్-గణేశ్ దర్శకత్వంలో కూడా వీరు 1970లలో పాడారు. ఇదే సమయంలో తెలుగులో, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ అనే చిత్రంలో కూడా ‘సిరిమల్లె సొగసు’ అనే పాటని సుశీలతో పాడారు. కానీ అప్పటికే శ్రోతల అభిరుచులు, చిత్ర గీతాలలో హంగులు మారాయి. ఫలితంగా రాజాకు ఆదరణ ఎక్కువగా లభించలేదు. కాని రాజా-జిక్కీలు దేశవిదేశాలలో తమ పాటల కచేరీలు చేస్తూనే వున్నారు. వాటికి ఆదరణ మాత్రం తగ్గలేదు. 1989 ఏప్రిల్ నెల ఏడవ తారీకు ఒక కచేరికి వెళ్ళుతున్నప్పుడు పరిగెత్తే రైలు ఎక్కుతున్నప్పుడు కాలు జారి పట్టాల కింద పడి రాజా మరణించారు. పెట్టె లోపలనుండి భార్య జిక్కీ ఇదంతా చూడడం ఆమె దురదృష్టం. ఈ సంవత్సరంలో ఏ. ఎం. రాజా 80వ జయంతి, 20వ వర్ధంతులను పునస్కరించుకుని ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే ఈ వ్యాస రచనకు మాకు ప్రేరణ నిచ్చింది.

రాజా అన్ని భాషలలో చేర్చి సుమారు ఐదారు వందల పాటలు పాడి ఉంటారని అంచనా (తప్పక వేయికన్నా తక్కువ). వారు బహుశా తెలుగుతో కూడా మొత్తం ఇరవై లేక ముప్ఫై చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసి ఉండవచ్చు. అతని సమకాలీన గాయకులు (ఘంటసాల, టీ. ఎం. సౌందరరాజన్, పీ. బీ. శ్రీనివాస్) వేల సంఖ్యలో పాడారు. సంగీత దర్శకత్వంలో కూడా ఇలాగే. రాసిలో తక్కువైనా వాసిలో ఏమాత్రమూ తక్కువ కానివి రాజా పాటలు. తెలుగులో ఘంటసాల ఆ కాలంలో అందరికన్న మిన్న. కాని తమిళ చిత్రసీమలో నాటికీ, నేటికీ రాజాయే అత్యుత్తమ గాయక-దర్శకుడు. రాజాను గురించి ప్రశంసలు తమిళ సినీపత్రికలలో ఇప్పటికి చదువుతుంటాం. ఈనాటికి కూడా తమిళంలో రాజా పాడిన పాటలు చాలా విరివిగా, సులువుగా దొరుకుతాయి. హెచ్.ఎం.వి/సరెగమ వారు తెలుగులో రెండు రాజా పాటల సంకలనాలను వెలువరిస్తే తమిళంలో విడుదల చేసినవి పదిహేను!

రాజా కంఠంలోని ప్రత్యేకతలు – మార్దవత, స్వరశుద్ధత. ప్రేమగీతాలను పాడడంలో అతని కతడే సాటి. మంద్ర స్వరాలను స్పష్ఠంగా శ్రుతి తప్పకుండా పాడేవారు. అతని సంగీత దర్శకత్వంలో ప్రాధాన్యత మెలడీకే.

మాకెంతో నచ్చిన రెండు పాటలు:కావేరి ఓరం – ఆడిపెరుక్కు (సంగీతం: రాజా)కరుణా లోలా శ్రితజనపాలా – భక్త అంబరీష, 1959 (మాండ్ రాగం, సంగీతం:ఎల్. మల్లేశ్వరరావు, రచన:గబ్బిట వెంకటరావు)

పల్లవికీ చరణానికీ మధ్య అంతరాలలోని వాద్య సంగీతంలో కూడా ఈ మాధుర్యం కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా వేణువు, వాయులీనాలు ఉంటాయి. శోకమయ గీతాలలో గాత్రం లీనమయినా, స్పష్టత కనిపిస్తూనే ఉంటుంది. అనవసర ఉచ్ఛ్వాసనిశ్వాసాలు మనకు గోచరించవు. ఈ విశిష్టమైన గుణాలవల్లే రాజా పాటలు ఇప్పటికీ మన మనసుల్లో చోటు చేసుకున్నాయి. ఇకముందు తరాలలో కూడా ఇలానే నిలిచివుంటాయి.

రాజా పాట అంటే వసుచరిత్రలోని ఈ పద్యం జ్ఞాపకానికి వస్తుంది:

వీనుల విందై అమృతపు
సోనల పొందై యమంద సుమ చల దళినీ
గానము క్రందై యా స్వన
మానంద బ్రహ్మమైన నధిపతి పలికెన్

-రామరాజభూషణుడు, వసుచరిత్ర (2.14)


జ్ఞాపికలు:

  1. A. M. Raja – Song of Summer Breeze – రాజా చిత్రాన్ని ప్రచురించడానికి అనుమతి నిచ్చిన షాజిగారికి కృతజ్ఞతలు.
  2. A.M. Raja – The Melody Maker Who Would Not Compromise – N. Krishnaswamy from The Hindu.
  3. In a class of his own – Legends – A. M. Rajah, The Hindu.
  4. భువినుండి దివికేగిన చల్లని రాజా – మల్లీప్రియ నాగరాజు, “ఆంధ్రప్రభ” వీక్లి, April 1989 [Courtesy శ్రీ కందాడై కృష్ణ, Posted on Usenet group: soc.culture.indian.telugu, 08.April 1994]
  5. రాజా పాడిన మరిన్ని తెలుగు పాటలు ఓల్డ్ తెలుగు సాంగ్స్ సైటులో ఉన్నాయి.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి:

జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...