ఒక్కతే… మృత్యువు
అక్కడ ఒంటరి శ్మశానాలు,
ఎముకల నిశ్శబ్దం నిండిన సమాధులు,
ఒక సొరంగం గుండా పోతూ హృదయం
చీకటి, చీకటి, కటిక చీకటి
ఓటారిన ఓడలా, మెల్లగా లోలోపలకి
మనసులోకి మునిగిపోతూన్నట్టు,
ఈ మరణం
చర్మం అంచు పైనుంచి ఆత్మలోకి - ఒక అనంత పతనం.
అక్కడ శవాలున్నాయి
చల్లగా జిగురు జిగురుగా రాతిపలకల అడుగులున్నాయి
ఆ ఎముకల్లో మృత్యువుంది
అచ్చమైన రవంలా
కుక్క లేని మొరుగులా
ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా
జడివానలా
అప్పుడప్పుడూ, ఒక్కడినే, నేను చూస్తూంటాను
శవపేటికలు లంగరెత్తి
చాపకట్టి పాలిపోయిన కళేబరాలు, ఆడవాళ్ళ నిర్జీవ కచభారాలు,
గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు,
గుమాస్తాల పడుచు భార్యల ముడుచుకున్న మొహాలు,
మోసుకుంటూ
నిర్జీవుల నిలువెత్తు నదిని అధిరోహిస్తూ
శవపేటికలు,
క్షతజ కాంతులీనే ఆ నదిలో
పైపైకి, మృత్యు రవానికి ఉబ్బిపోయిన
మృత్యు నిశ్శబ్ద రవానికి ఉబ్బిపోయిన
తెరచాపలతో.
మౌనంలో రవళిస్తూ మృత్యువు వస్తుంది
రాయీ వేలూ లేని ఉంగరంతో
తలుపు తడుతుంది.
ఆమె పిలిచే పిలుపుకి
నోరుండదు, నాలిక ఉండదు, గొంతూ ఉండదు.
అయినా ఆ అడుగుల సడి,
ఆమె దుస్తుల రెపరెపలు, ఒక చెట్టు ఊగినంత మెల్లగా
నీకు వినిపించే తీరుతాయి.
నాకంతగా తెలీదు, అర్థం కాదు, చూడనూ లేను
అయినా, నాకు నమ్మకం. మృత్యుగీతానిది తడి ఊదాపూల రంగు
మట్టితో జతకలిసిన ఊదాపూలది.
మృత్యుముఖం ముదురాకుపచ్చ కాబట్టి,
మృత్యువుది ముదురాకుపచ్చని చూపు కాబట్టి
ఊదా పూరేకుల పదునైన చెమ్మతో
చిక్కబడ్డ శీతకాలపు బూడిద రంగు
అంతేనా, చావు చీపురు పుచ్చుకొని భూమంతా తిరుగుతుంది.
శవాల కోసం నేలంతా నాకుతూ
ఆ చీపురే మృత్యువు
మృతదేహాలకై సాచిన నాలిక,
సూత్రం కోసం వెదికే మృత్యు సూచి.
మడత మంచాల్లో
స్తబ్ధమైన పరుపులు, నల్లని కంబళ్ళలో
అంతటా మృత్యువే
విస్తరించుకొని ఉండి, హఠాత్తుగా ఒక్కసారి ఊపిరి వదుల్తుంది
గట్టిగా ఊదుతుంది, దుప్పట్లన్నీ తెరచాపలై ఉబ్బిపోయే ఒక కటిక రవం…
అప్పుడు రేవులోకి తేలుకుంటూ వచ్చే శయ్యలు
అదిగో అక్కడే ఎదురుచూస్తూ, అడ్మిరల్ వేషంలో.
(* పాబ్లో నెరూడా (Pablo Neruda) ‘సోలో లా ముయెర్తె’ అన్న స్పానిష్ కవిత ఆంగ్లానువాదాల‘Nothing but death’, Only death ఆధారంగా.
** ఈ కవిత అనువాదానికి స్ఫూర్తినిచ్చిన బొల్లోజు బాబాగారికి, స్పానిష్ మూలానికి మంచి వివరణ నిచ్చి ఈ కవితని లోతుగా అర్థం చేసుకొనే సహాయం చేసిన మాధవ్ గారికి కృతజ్ఞతలు.)
bollojubaba అభిప్రాయం:
May 2, 2009 1:25 am
ముందుగా నా పేరు కూడా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.
భలే ఉంది. నేనెక్కడెక్కడ బొక్కబోర్లా పడ్డానో తెలిసింది. (రింగ్ అనే మాటను ఘంటారావం అనే అర్ధంలో అనువదించాను. మీరు ఉంగరం అన్నారు. మీరే కరక్ట్ . ఇంకా చాలాచోట్ల :-) కవిత్వానికి క్లుప్తత ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తూంది.
కొన్ని సందేహాలు
with bakers white as angels, = గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు - అన్నారు ఎందుకు అందంకోసమా? లేక మరేమైనా అర్ధాలున్నాయా?
like a shoe without a foot, like a suit without a man, = ఈ వాక్యాన్ని మొత్తం వర్జించారు. కారణం తెలుసుకోవాలని ఉంది.
మొత్తంమీద అనువాదం బాగా వచ్చింది.
బొల్లోజు బాబా
ravikiran timmireddy అభిప్రాయం:
May 2, 2009 4:37 pm
బాగా అనువాదం చేసారు కామేశ్వరరావు గారు. బల్లోజు బాబా గారు చెప్పినట్లు ఒకటి రెండు ఒమిషన్సు వున్నా, నెరూడా గార్ని చక్కగా తెనిగించారు, మెత్త మెత్తగా, చల్ల చల్లగా, సడి చేయని ఒక ఆఖరి, దీర్గ నిశ్వాసాన్ని బాగా చెప్పెరు తెలుగులో.
రవి
గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:
May 3, 2009 7:28 pm
అనువాదాలు కత్తి మీద సాము లాంటివే, అందులోనూ లయ బద్దమైన వాక్య నిర్మాణానికి పెరెన్నిక గన్న నెరుడా కవిత్వానువాదమంటే ఎంతో లోతైన ఆలోచన, కవిత్వం చదివినప్పుడు కలిగిన నిండైన భావావేశం రెండూ కలపోయాలని నా స్వీయానుభవం. లేకపోతే అనువాదం రక్తి కట్టదు.
మొదటి ఏడు పాదాల స్పానిష్ మూలం;
SÓLO LA MUERTE
HAY cementerios solos,
tumbas llenas de huesos sin sonido,
el corazón pasando un túnel
oscuro, oscuro, oscuro,
como un naufragio hacia adentro nos morimos,
como ahogarnos en el corazón,
como irnos cayendo desde la piel al alma.
ఉరామరికగా, స్పానిష్ నుంచి అర్థం:
మృత్యువొక్కటే
అక్కడ ఒంటరిగా శ్మశానాలు
ఎముకలు నిండిన సమాధులు, శబ్దం లేదు
గుండె గుండా ఒక సొరంగం
చీకటి, చీకటి, చీకటి
మనని మృత్యువులో దించిన పగిలిన ఓడన్నట్టు
మన గుండెలోన మనని ముంచినట్టు
మనం తోలు నుండి ఆత్మ లోకి పడినట్టు
ఇక భైరవభట్ల గారి అనువాదం పరిశిలిస్తే: మొదటి పాదం బాగా వచ్చింది, కానీ రెండవ పాదంలో కవి(నెరుడా) హృదయం నిశ్శబ్దం అని కాదు, శబ్దం లేదని (కవిత్వంలో ఈ రెంటికీ చాలా తేడా ఉంది),అలాగే సమాధులు ఎముకల నిశ్శబ్దం నిండినవని కూడా కాదు.
ఇక మూడవ పాదం ఆంగ్లానువాదంలోని తప్పుని ఖరారు చెయ్యడం.
నాలుగవ పాదంలో మూలంలో లేని అనవసరమైన దండుగ్గణం (కటిక)
ఐదు, ఆరు, ఏడు పాదాలు Como అనే పదంతో మొదలైతాయు స్పానిష్ లో, దానర్థం లా, ఉపమానంగ చెప్పినట్టు. “ఈ మరణం” అనేది ఎక్కడ నుండి వచ్చింది? కవితా వాక్య నిర్మాణానికి అనువాదంలో ఎటువంటి స్థానం కల్పింఛారు భైరవభట్ల వారు?
అనువాదాలు చేసేప్పుడు కొన్ని సూచనలు:
1. మూలాన్ని రక్షించండి (మూలో రక్షతి రక్షితః)
2. వివరణల్లోకి పోవద్దు, కవితని కవితగానే ఉంచండి (ఉదాహరణకి పై ఐదు, ఆరు, ఏడు పాదాలు వివరణ)
3. మూల భాషలో కనీస పరిజ్ఞాన్ని పెంచుకోవడం.
మన పద్యాలను సంస్కృతంలో నుంచి జర్మనులోకి పరివర్తించేప్పుడు, ఛందోబద్దంగా అనువదించగలిగితే బాగుండేదని మహకవి గోథే అభిప్రాయపడ్డాడు. ఈ వివరణ భైరవభట్ల గారి కలం నుంచి ఇంకా మంచి అనువాదాలు వెలువడాలనే.
[మరింత చర్చకు వీలుగా ఈ అభిప్రాయాన్ని చర్చావేదికలో కూడా ప్రచురించాము. - సం]
Kameswara Rao అభిప్రాయం:
May 4, 2009 6:10 am
అభిప్రాయాలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. పవన్ గారి అభిప్రాయంలో ఉన్న అంశాలగురించి నా ఆలోచనలని చర్చావేదికలో పెట్టాను. అక్కడ అనువాదాల గురించి మరింత వివరంగా విస్తృతంగా చర్చించుకుందాం. బాబాగారి సందేహాలకి కూడా అక్కడ చర్చలో భాగంగా నా అభిప్రాయాలని వివరిస్తాను.
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 4, 2009 10:41 am
మంచి అనువాదం. కవిత కన్నా అనువాదం కష్టమనుకుంటాను. మూలభాషలో చదివినవాళ్ళను మెప్పించడం ఇంకా కష్టతరం.
“మృత్యుగీతానిది తడి ఊదాపూల రంగు మృత్యుముఖం ముదురాకుపచ్చ కాబట్టి” చదివాక ఏదో తెలియని వెలితి, ఇది రాయడానికి స్ఫూర్తి….
[పూర్తిపాఠం చర్చావేదికలో చూడగలరు -సం.]
బొల్లోజు బాబా అభిప్రాయం:
December 8, 2009 11:08 pm
ఈ క్రింది లింకులో ఇదే కవితకు శ్రీశ్రీ చేసిన అనువాదాన్ని చూడవచ్చును
http://sahitheeyanam.blogspot.com/2009/12/blog-post_09.html
బొల్లోజు బాబా
rama bharadwaj అభిప్రాయం:
December 11, 2009 2:37 pm
బొల్లోజు బాబా గారూ!!నెరూడా మృత్యువుకి శ్రీశ్రీ అనువాదం నీరసంగా ఉంది. అంతకన్నా మీది మెరుగు. మీ కన్నా కామేశ్వర్రావు గారిది ఎక్కువ నయం!
రమ