రామన్న
“అత్తమ్మా, రామన్నున్నడా?”
బడినుంచి రాంగ రోజడిగెటోణ్ణి.
“ఆడొచ్చినప్పుడు జెప్త పోర”
కసురుకుంట జవాబొస్తుండె.
నేనిప్పుడు దండ మీద కూసొని
సైకిల్ తొక్కుతనని,
సాలోళ్ళ బావిల పల్టీ కొట్టి
దూకొస్తదని,
నాగ్గూడ పాటలకు కంజిర
కొట్టుడొచ్చిందని…
ఏమేమొ ముచ్చట్లు చెప్పుకునేదుండె.
అడవిలకెల్లి ఇస్తరాకులు తెచ్చుకొనీకి
నన్నుగూడ తీస్కపొమ్మని,
మా గోడకంటించనీకి చిరంజీవి
బొమ్మ తీస్కరమ్మని,
నువ్వు లేనప్పుడు నీ డంబెల్
నా దగ్గరుంచుకుంటనని…
ఏమేమొ బతిమిలాడేదుండె.
ఒకపొద్దు బడిగోడ మీద ఎర్రగ రాసిండ్రు
“రామన్న అమర్ రహే” అని.
ఆళ్ళింటి ముంగట్నుండి పోతే
ఇప్పటికి నోరు పెకల్దు నాకు.
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 4, 2009 10:04 am
వినీల్ గారు
కవిత నచ్చిందందామనుకున్న కాని గుచ్చింది, car accident లో పోగొట్టుకున్న దోస్తు యాదికొచ్చి. చివరి లైను కొసమెరుపు.
______
విధేయుడు
-Srinivas
ravikiran timmireddy అభిప్రాయం:
May 8, 2009 11:22 am
వినీల్,
అద్భుతంగా వుంది. ఎందుకు బాగుంది, ఏవి బాగుంది అనే తర్కం కూడా రానంతగా మనసునంతా ఆవహిస్తుంది నీ కవిత. మసకబారిపోయిన గుర్తులేవో ఉలిక్కిపడి లేచి కూర్చొనేలా.. .
రవి
munnaswamy అభిప్రాయం:
December 1, 2009 10:55 am
రచన బాగున్నది. వాళ్ళింటి ముందు నుండిపోతే జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని వినీల్ గారి భావన.