ఈమాట » ఈమాట పూర్వాపరాలు - నా జ్ఞాపకాలు II

Expand to right
Expand to left

ఈమాట పూర్వాపరాలు - నా జ్ఞాపకాలు II

పదేళ్ళ ఈమాట మాట

ఇప్పుడు పదేళ్ళ నిద్రగన్నేరు చెట్టు ఈమాట. కిచకిచమనే రచనల శబ్దం వినిపించే చిలకలు వాలిన చెట్టు ఈమాట. ఈ పదేళ్ళుగా ఈమాట బాలారిష్టాలు దాటుకుంటూ ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఇలా పెరగడానికి కారణం ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే.

మొదట్లో రచనలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈమాట ప్రచురణలకై సంపాదకులే అప్పుడప్పుడు రాస్తూ ఉండేవారు. తనకున్న సంస్కృత పరిచయంతో, కొంపెల్ల భాస్కర్ రాసిన ‘స్వప్న వాసవదత్తం’, ‘మన ఛాందసులు’, ‘ప్లే స్టేషన్’, ‘గంధర్వులెవరు?’ వంటి రచనలు మంచి ఆదరణ పొందాయి. కర్ణాటక సంగీతంలో ఒక్కొక్క రాగాన్ని తీసుకొని శాస్త్రీయంగా పరిచయం చేస్తూ, సినిమా పాటలు ఉదాహరణలుగా ఇస్తూ లక్ష్మన్న విష్ణుభొట్ల సంగీత వ్యాసావళి రాసేవారు. తెలుగు, సంస్కృతాల్లో పద్యాలు, ఛందస్సులు కెవియస్ రామరావుకి, కొంపెల్ల భాస్కర్‌కి బాగా ఇష్టమైన వ్యాపకాలు. అందువల్ల వీరిద్దరూ సంప్రదాయ సాహిత్యాన్ని ఈమాట సాహితీ గ్రంథాలయంలో ఉంచడానికి, తేలిక తెలుగు అనువాదాలతో వీటిని ఈమాట పాఠకులకి పరిచయం చేయడానికి ఎంతో శ్రమించేవారు. 20వ శతాబ్దికి వీడ్కోలు చెబుతూ, 1999లో వెల్చేరు నారాయణ రావు, జంపాల చౌదరి, కె. వి. ఎస్. రామారావులతో కలిసి ఆ శతాబ్దంలో గణించదగ్గ 100 పుస్తకాల జాబితా తయారు చెయ్యడం ఒక మరపురాని అనుభవం.

శ్రీనివాస్ పరుచూరి సంపాదక వర్గంలో సభ్యుడుగా లేకపోయినప్పటికీ, ఈమాట పత్రికకు అండదండగా నిలుస్తూ గత పదేళ్ళుగా ఆయన మాకు అందించిన సహకారం మరువలేనిది. ఈమాట వ్యాసాలను సమీక్షించడంలోనూ, చారిత్రకాంశాలను పరిశీలించడంలోనూ, పాత గ్రంధాలను సేకరించడంలోనూ ఈమాటకు ఆయన చాలా సహాయం చేసారు. ఈమాట ఆడియో గ్రంథాలయంలో ఇప్పుడు ఉన్న శబ్దతరంగాలలో ఎక్కువ భాగం ఆయన సేకరించి మాకందించినవే. తొలినాళ్ళ నుంచి ఈమాట రచయితలుగా, సమీక్షకులుగా , శ్రేయోభిలాషులుగా ఉంటూ మాకు సహాయం చేసిన ప్రముఖులలో కనకప్రసాద్‌, కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, కన్నెగంటి చంద్ర, వెల్చేరు నారాయణరావు, మాచిరాజు సావిత్రి ప్రభృతులను ప్రత్యేకించి పేర్కొనటం సమంజసం.

2006 ఎప్రిల్ లో పద్మ ఇంద్రగంటి ఈమాట సంపాదక వర్గంలో ప్రవేశించడం సాంకేతిక పరంగా ఈమాటకు ‘నిరుపేదకబ్బిన నిధి’. అప్పటిదాకా కొత్త సాంకేతికతను ఈమాటలో వాడడానికి దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న నాకు పద్మ తోడ్పాటు అయాచితంగా అందివచ్చిన వరం. అప్పడప్పుడే ప్రాచుర్యం పొందుతున్న web 2.0 ఇంటారాక్టివ్ ఫీచర్లను అభివృద్ధి చెయ్యడానికి Zopeతో గానీ, Drupalతో గానీ ప్రయోగాలు చెయ్యాలన్న ఆలోచనల్లోనే నేను కాలం వెళ్ళబుచ్చుతున్న రోజుల్లో, వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చెయ్యమని సలహా ఇచ్చి, నాకు తగిన విధంగా సహాయ సహకారాలందిస్తూ తను చేరిన ఇరవై రోజుల్లోనే ఈమాటను వర్డ్‌ప్రెస్‌కు తరలించిన ఘనత పద్మగారికే దక్కాలి.గత రెండేళ్ళలో సంపాదకులుగా చేరిన మాధవ్ మాచవరం, పాణిని గార్లు ఈమాట నిర్వాహణ బాధ్యతను తమ భుజస్కంధాల మీద మోస్తూ , ఈమాటకు చేరవచ్చే రచనలను జాప్యం చేయకుండా సమీక్షించి రచయితలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించడంలోనూ, పత్రికాపరంగా చేసే నిర్ణయాలను పాఠకులకు తెలియజెప్పడంలోనూ, ఈమాట ఉన్నత ప్రమాణాలను కాపాడడంలోనూ, ఎంతో సమయాన్ని వెచ్చించి, అంకిత భావంతో పనిచేస్తున్నారు. 2008 లో సంపాదకుడిగా పనిచేసిన నాసీ శంకగిరి తన బ్లాగులో నిర్వహించిన కథల పోటీల ద్వారా కొన్ని మంచి కథలను ఈమాటకు అందించడంలోనూ, కొత్తతరం బ్లాగర్లలో ఈమాట గురించి ప్రచారం చేయడంలోనూ ఎంతో కృషి చేసారు.

WETD-SCIT-తెలుసా-రచ్చబండ చర్చావేదికల ద్వారా పెంపొందిన సంఘీభావం, ఆ వేదికల ద్వారా మేము సమిష్టిగా అలవర్చుకున్న సంప్రదాయాలు, విలువలే ఈమాట పదేళ్ళుగా మనగలగడానికి దోహదం చేసాయి. ఇంతకాలం పాటు మా మీద నమ్మకం ఉంచి ఆదరించి ప్రోత్సహించిన పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు మా అభివందనాలు.

ముక్తాయింపు

అదేం దురదృష్టమో గాని మన తెలుగు వారికి కొన్ని సంప్రదాయాలు, విలువల ఆధారంగా సమిష్టిగా సంస్థల నిర్మాణం చేయడం అంతగా అలవాటు లేదనిపిస్తుంది. కొంత ప్రతిభా పాటవాలున్న ఒక వ్యక్తి ఒక సంస్థను స్థాపించడం, ఆ వ్యక్తి తెరమరుగు కాగానే ఆ సంస్థ కుప్పకూలడం మనకు తెలిసిన సంగతి. ఉదాహరణకి, పేరెన్నిక గన్న వావిళ్ళవారి ప్రెస్ , కాశీనాథుని ఆంధ్రపత్రిక, భారతి వంటి సాహితీ పత్రికలు కూడా ఒక వ్యక్తి ప్రోద్బలం వల్ల పనిచేసినవే. ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఒక్క సాహితీ సంస్థలే కాదు, పత్రికలు, ప్రచురణ సంస్థలు, చివరకు రాజకీయ పార్టీలు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి నిర్మింపబడిన సంస్థలే. ఇందులో కొన్ని సంస్థల కార్యకలాపాలన్నీ కేవలం ఆ సంస్థ వ్యవస్థాపకుని ఆత్మోత్కర్ష కోసం చేసే ప్రదర్శనలే కావటం శోచనీయం.

ఇందుకు భిన్నంగా అమెరికాలో నాకు తెలిసిన పత్రికాసంస్థలు, ప్రచురణ సంస్థలు వారి సంస్థలను నడపడానికి తమ తమ సంప్రదాయాలను, విలువలను ప్రతిబింబించేలా తమదైన ఒక వ్యవస్థను (system) ఏర్పరచుకుంటాయి. తొలినాళ్ళలో ఆ సంస్థ ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల శక్తియుక్తుల మీదే ఆధారపడి పనిచేసినా, ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడిన తరువాత ఆ వ్యవస్థే సంస్థను నడిపిస్తుంది. ఆ పై ఎంతమంది వ్యక్తులు కొత్తగా చేరినా వారంతా ఆ వ్యవస్థ నిర్మాణ చట్రానికి లోబడే పనిచేస్తారు; అంతేకాక ఆ వ్యవస్థ కు కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేస్తూ ఆ వ్యవస్థ మరింత పటిష్ట పడడానికి తోడ్పడుతారు. ఇదీ నాకు తెలిసి సమర్థవంతంగా పనిచేసే సంస్థల విజయరహస్యం.

ఈమాట పత్రిక కొందరు వ్యక్తుల సమిష్టి కృషి ఫలితంగా నడుస్తుంది కానీ, దీనికి ఒక సంస్థాస్వరూపం ఏర్పడిందని అప్పుడే చెప్పలేము. కె. వి. ఎస్. రామారావు గారి నాయకత్వంలో పదేళ్ళ క్రితం ఈమాట ప్రారంభించిన వ్యక్తులలో ఎవరూ ప్రస్తుత సంపాదక వర్గంలో లేరు. అయినా, సంస్థ అని అనడానికి కావలసిన వ్యవస్థ ఈమాటకింకా ఏర్పడలేదు. దానికింకా కొంతకాలం పడుతుందని నా అభిప్రాయం. ప్రస్తుత సంపాదక వర్గం ఉన్నతమైన ప్రమాణాలతో, విలువలతో ఈ పత్రికను నడిపిస్తూ, ఒక వ్యవస్థ గా దీనిని నిర్మించడానికి పాటుపడుతున్నదనీ, ఈమాటను కొన్ని సత్సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఒక సంస్థగా తీర్చిదిద్దుతున్నదనీ నమ్ముతున్నాను. తెలుగు సాహిత్యానికి ఆదరణ ఉన్నంతకాలం ఈమాట పత్రిక ఉంటుందనీ, ఉండాలనీ నా ఆశ, ఆకాంక్ష.

[ఈ వ్యాస రచనలో నాకు ఎంతగానో సహాయపడిన శ్రీనివాస్ పరుచూరి, ఈ వ్యాసాన్ని రాయమని నన్ను ప్రోత్సహించిన వెల్చేరు నారాయణ రావు, కొడవటిగంటి రోహిణీప్రసాద్, పద్మ ఇంద్రగంటి, సలహాలు సూచనలు అందచేసిన కె. వి. ఎస్. రామారావు, శ్రీనివాస్ నాగులపల్లి, లక్ష్మన్న విష్ణుభొట్ల గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. - సురేశ్ కొలిచాల

కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ చరిత్ర గురించి రాయడంలో A History of Modern Computing (Second edition) by Paul E. Ceruzzi పుస్తకం ఆధారం]

ముందరి పేజీ(లు) 1 2 3 4 5 6 7
 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rohiniprasad అభిప్రాయం:

    May 1, 2009 6:01 am

    అక్బర్ ఆస్థానంలో పనిచేసిన అబుల్ ఫజల్ అక్బర్నామా అనే మూడు సంపుటాల చరిత్ర రాశాడు. లియో తల్స్తోయ్ యుద్ధమూ శాంతి అనే తన ప్రసిద్ధ నవలలో తనకు రెండు తరాల ముందు జరిగిన నెపోలియన్ నాటి సంఘటనలను వర్ణించాడు. సురేశ్ గారి ఈ అద్భుతమైన వ్యాసం వాటిని మించుతుంది. సమకాలీన చరిత్రను నమోదు చెయ్యడంలోని లాభాలన్నీ ఈ రచనలో కనిపిస్తాయి.

    ఈ వ్యాసం చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనసులో మెదిలాయి. జర్నలిజంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఇలా ఏ రంగంలోనైనా మొదట కృషి చేసినవారంతా మేధావుల్లా అనిపిస్తారు. కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, తమ శక్తులని వినియోగించే ప్రయత్నాలు చేస్తారు. వారి కృషి ఫలితంగా ఆ పరిజ్ఞానం అందరికీ సులువుగా ఉపయోగపడుతుంది. ఇక ఆ తరవాత మజ్జిగ పలచనవడం ప్రారంభిస్తుంది! తాటాకులూ, గంటాల రోజుల్లో అపూర్వమైన సాహిత్యాన్ని సృష్టించగలిగినవారే రచనలకు పూనుకునేవారు. ఆరణాల కలాలు అందుబాటులోకి వచ్చాక రచయితల సంఖ్య పెరిగిపోతుంది. మళ్ళీ వారిలో ‘పుణ్యపురుషులు’ ఎవరో తేల్చుకోవటానికి సమయం పడుతుంది.

    ఈ వ్యాసంలో వర్ణించిన సంఘటనల క్రమం, కొందరి పేర్లూ అన్నీ భవిష్యత్తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. టెక్నాలజీతోనూ, తెలుగుభాషతోనూ, సాహిత్యంతోనూ సాన్నిహిత్యం ఉన్న సురేశ్ వంటి వ్యక్తులు ఎంత అరుదో వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అంతగా చెప్పుకోకపోయినప్పటికీ యూనీకోడ్ వగైరా అంశాలమీద ఆయన చేసిన కృషి చాలా గొప్పది. దాన్ని గురించి ఒక చిన్న వ్యాసాన్నైనా రాయమని నేను ఈమాట సంపాదకులను కోరుతున్నాను. అబుల్ ఫజల్ సంగతి కూడా ఎవరైనా రాయాలి కదా!

  2. విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    May 1, 2009 7:21 am

    మొత్తం మీద సురేష్ చాలా సమాచారం సేకరించి పొందుపరచారు ఈమాటలో! దీని ఉపయోగం ముందుముందు ఇంకా బాగా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగువారు చాలా మందికి ఉన్న కంప్యూటర్ (ఇన్ఫర్మేషన్) టెక్నాలజీతో పరిచయం కూడా ఇంటర్నెట్లో తెలుగు వికాసానికి తోడ్పడింది. రోహిణీప్రసాద్ గారన్నట్టు, తెలుగు యూనీకోడ్ లో సురేష్ కృషి వివరాలు కూడా అక్షరబద్ధం కావాలి!

    అభినందనలతో,
    లక్ష్మన్న

  3. Srinivas Nagulapalli అభిప్రాయం:

    May 1, 2009 7:44 am

    తోచిన సూచనలిచ్చింది నిజమే కాని, ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.

    సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.

    Wordpress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!

    జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం. అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.
    ______
    విధేయుడు
    -Srinivas

  4. rajasankar kasinadhuni అభిప్రాయం:

    May 1, 2009 2:22 pm

    అమెరికాకి విశ్వవిద్యాలయంలో పై చదువులకి కాక, నేరుగా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిడానికి వచ్చిన నాకు సురేశ్ గారి వ్యాసం చదివి ఉండక పోతే, అంతర్జాలాన్ని గురించిన ఇంత చరిత్ర తెలిసి ఉండేది కాదు. తొంభై దశకం మొదట్లో, నేను పని చేసిన కంపెనీలు ఏవీ Internet connectivity మీద ఆసక్తి చూపడం నాకు గుర్తు లేదు (understandably so). చదివిన చదువుకీ చేసే ఉద్యోగానికీ ఎటూ సంబంధం లేదు, మళ్ళీ అమెరికాలో పై చదువులు అవసరమా అని తర్కించుకుంటూ తాపించుకుంటూ Computer Science అధ్యయనం చేసేనాటికి Internet Revolution ముదిరి పరిస్థితి చాలా మారిపోయింది. అందువలన ఈ విషయంలోసురేశ్‌లాంటి వాళ్ళకున్న అనుభవం, అవగాహన నాకు ఉండే అవకాశం లేదు. May be that is the reason I am able to fully appreciate his essay.

    ఓపికగా సురేశ్ గారు తన అనుభవాలు ఈ వ్యాసం ద్వారా పంచుకున్నందుకు, కొత్త విషయాలు తెలిపినందుకు, ముఖ్యంగా తెలుగు Font విషయంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసినందుకు నెనర్లు.

    భవదీయుడు,
    రాజాశంకర్ కాశీనాథుని.

  5. sUryuDu అభిప్రాయం:

    May 2, 2009 12:31 pm

    చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.

  6. Rajesh Devabhaktuni అభిప్రాయం:

    May 7, 2009 4:13 am

    నిజంగా ఈ శిర్షిక ఈ-తెలుగు సాహిత్య లోకం గురించి ఒక కనువిప్పు. చాల చక్కటి సమాచారం అందించారు. ఇక్కడ ఇచ్చినటువంటి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి అన్ని ఫైల్స్ నేను సాఫ్టువేరు ద్వారా దిగుమతి చేసుకున్నాను. ఇది మాత్రమే కాక అద్బుతమైన “As we may Think” లింక్ ఇచ్చినందుకుగాను ధన్యవాదములు.

  7. mOhana అభిప్రాయం:

    May 7, 2009 9:45 am

    ఈ వ్యాసం చదువుతుంటే పాత డైరీ చదువుతున్నట్లుంది. సురేశ్ గారిని అభినందించడం నా ధర్మం, కర్తవ్యం.

    1) 90లలో గోఫర్ వెదకడంలో అందరికీ మా ల్యాబ్ లో సహాయం చేస్తుండేవాడిని. అక్కడ ఎన్నో శాస్త్రీయ విషయాలపైన సమాచారాలు దొరికేవి.
    2) తెలుగు డైజెస్టు మాత్రమే కాక బవులింగ్ గ్రీన్ లోని వాణీనాథరావుగారి ఆధ్వర్యాన, ఉమా రామమూర్తి గారి సంపాదకత్వంలో (వీరు ఇప్పుడు మెంఫిస్ లో ఉన్నారు) ఇండియా డైజెస్టు వారపు రోజులలో వెలువడేది. ఇండియా న్యూస్ అని డక్కన్ హెరాల్డ్ నుండి పత్రికా సమాచారాలు కూడా వచ్చేవి. నేను ఇండియా డైజెస్టుకు ప్రతి రోజు Today’s Beautiful Gem అని ఒక పద్యాన్ని, లేక ఒక చిన్న వ్యాసాన్ని పంపేవాడిని. క్లుప్తతకు ఇది ఒక నిదర్శనం. 40 పంక్తులకు మించి రాయరాదు ఇందులో! వాటిని ఇక్కడ చదువవచ్చు. http://www.uramamurthy.com/mohan_gems.html
    500లకు పైగా ఉన్నాయి ఇవి. ఇందులోని కొన్ని మణులను పుస్తకరూపంలో ప్రచురించాలనే ఆశ ఉంది.
    3) నన్ను తెలుసాకు పరిచయం చేసింది సదానందగారు. తెలుసాలో నేను ఎక్కువగా పాఠకుడినే, రచయితను కాను. అప్పుడు సుప్రభగారు ఎక్కువగా అందులో పద్యాలు రాసేవారు. వారు ఇప్పుడు శారద అనే
    స్వంత సైటులో రాస్తారు. పద్యాలలో నాకు ఆసక్తి కలిగించింది వారే. ఇప్పుడు కూడా పాత తెలుసా సందేశాలను చదవడమంటే ఖుషీగా ఉంటుంది.
    4) రచ్చబండ వచ్చిన తరువాతే సుప్రభగారి ప్రోత్సాహముతో నేను ఎక్కువగా రాయడానికి ఆరంభించాను. అప్పుడే ఛందస్సు గుంపు కూడ మొదలయింది.
    4) ఈమాట నాకు పరిచయమయింది నాలుగైదు సంవత్సరాల ముందే! ఇప్పుడు కూడా సమయము ఉన్నప్పుడు పాత సంచికలను తిరగవేస్తు ఉంటాను. ఈమాటలోని వైవిధ్యము నిజంగా ప్రశంసనీయమే. కానీ కొత్త రచయితలను ఇది కొద్దిగా భయ పెడుతుందో ఏమో అనే సందేహం వస్తుంది నాకు అప్పుడప్పుడూ.
    విధేయుడు - మోహన

  8. bollojubaba అభిప్రాయం:

    May 11, 2009 10:48 pm

    గూగుల్ సెర్చ్ లో అప్పుడప్పుడూ రచ్చబండ, తెలుసా దారాలు తగులుతూంటాయి. వాటిని చదువుతూంటే ఆశ్చర్యంగా అనిపించేది. తొంభైలలో తెలుగులో ఇంటర్నెట్టులో ఇంతటి వ్యవహారాలు నడిచాయా అనిపించి, అబ్బురమనిపించేది.

    అంతర్జాలంలో తెలుగు అంటే బ్లాగులనే అభిప్రాయమే. వాటికి ముందు మరెంత కృషి జరిగింది, ఎందరు శ్రమించారు వంటి విషయాల పట్ల ఏ మాత్రమూ అవగాహన లేని మాబోటి వారికి మంచి సమాచారం అందించారు.

    శ్రీనివాస్ గారన్నట్లు శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!

    ధన్యవాదములు
    బొల్లోజు బాబా

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a