ఈమాట పుట్టుక
రక్త ప్రసరణము లేని శరీరము ఎట్లు మరణావస్థ నొందునో,
అట్లే భావసంచారము లేని సంఘము నిర్జీవ స్థితి గాంచును.
– గూడూరి నమశ్శివాయ (తెలుగు పత్రికల గురించి మాట్లాడుతూ)
1997-98 ప్రాంతాలలో అమెరికాలో నివసించే తెలుగు సాహితీ ప్రియులు గుర్తుంచుకునే సంఘటనలు రెండున్నాయి. మొదటిది, 1997 లో తానావారు నవలల పోటీ పెట్టి బహుమతిగా లక్ష రూపాయలను ప్రకటించడం. నాకు తెలిసి అంతకు పూర్వం ఆటా, తానా సంస్థలు కథల, నవలల పోటీలు నిర్వహించినా బహుమతి సొమ్మెప్పుడూ పదివేల రూపాయలను మించలేదు. మురళి చందూరి, జంపాల చౌదరిల ఆధ్వర్యంలో లక్ష రూపాయల బహుమానంతో ప్రకటించిన నవలల పోటీ అటు ఆంధ్ర దేశంలోనూ, ఇటు అమెరికాలోనూ సంచలనం సృష్టించింది; “అయ్యబాబోయ్ లక్షరూపాయలే” అంటూ అందరి చేతా అనిపించింది. బహుమతి పొందిన చంద్రలత నవల ‘రేగడి విత్తులు’ కూడా అందరి ప్రశంసలు పొందింది. అప్పటిదాకా కమర్షియల్ నవలల ఉధృతితో మంచి తెలుగు నవలకు కాలం చెల్లిందని అనుకునే వారు కూడా ఈ లక్ష రూపాయల బహుమతి స్ఫూర్తిగా మళ్ళీ కొన్ని మంచి నవలలు వచ్చే సూచనలు కనబడుతున్నాయని హర్షం వెలిబుచ్చారు. అమెరికాలో ఉంటూ కూడా తెలుగు సాహిత్యగతిని కొంతైనా ప్రభావితం చేయవచ్చునని ఈ పోటీలు మా అందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు.
రెండవది 1998 మే లో అట్లాంటాలో జరిగిన వంగూరి సాహితీ సదస్సు. అప్పటిదాకా యూజ్‌నెట్, తెలుసా వంటి అభౌతిక చర్చావేదికల్లో పరిచయమై స్నేహితులుగా మారిన సాహితీ మిత్రులందరినీ ఈ సదస్సుల మూలంగా ముఖాముఖిగా ఒక్కచోట కలుసుకోవడం మాలో చాలా మందికి ఒక మరపురాని అనుభూతి. అంతకు పూర్వం మందపాటి సత్యం, వంగూరి చిట్టెన్రాజు తో కలిసి ఆస్టిన్లో నిర్వహించిన టెక్సస్ ప్రాంతీయ సాహితీ సదస్సుకూడా టెక్సాస్ లో నివసిస్తున్న సాహితీ ప్రియులను, రచయితలను కలిపే వేదికగా పనికివచ్చింది.
ఈ రెండు సంఘటనలు మమ్మల్ని చర్చలను దాటి ఇంకా పెద్ద ప్రాజెక్టుల గురించి తలపెట్టడానికి స్ఫూర్తిగా పనికి వచ్చాయి. 1998 మే, జూన్ నెలల్లో కె. వి. ఎస్. రామారావు, కనకప్రసాద్, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్, నేనూ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ ఆవరణలో ప్రశాంతంగా ఉండే ఓ చర్చ్ పార్కింగ్ లాట్‌లో కలిసి లంచ్ చేస్తూ సాహిత్యం సంగతులు ముచ్చటించుకునే వాళ్ళం . SCIT, తెలుసా వంటి చర్చావేదికల్లో చర్చకు ఉన్నంత ప్రాధాన్యత కొత్త రచనలకు లేదని, అందువల్ల ఇక్కడ తెలుగులో రాసే రచయితలకు తమ రచనలు ప్రచురించటానికి ఇండియాలోని పత్రికలు తప్ప మరో చెప్పుకోదగ్గ మార్గాలు లేకపోవడం ఒక పెద్ద లోపమని చర్చించుకొనే వాళ్ళం. తెలుగుదేశంలో భారతి వంటి ఉత్తమ స్థాయి పత్రికలు మూతబడడానికి కారణం ముద్రణాభారం భరించలేకపోవడమేనని, కొత్త టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే ఆర్థిక సమస్యలు లేకుండా ఉన్నత ప్రమాణాలతో ఎలక్ట్రానిక్ పత్రికలను నడుపవచ్చునని అనుకునేవాళ్ళం. మనమే ఓ ఎలెక్ట్రానిక్ పత్రిక మొదలెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఉత్సాహంగా ప్రతిపాదించిన వారు కె. వి. ఎస్. రామారావు. ఆ తరువాత, లక్ష్మన్న, భాస్కర్, నేను ఈ విషయం గురించి కె. వి. ఎస్. రామారావుగారి ఇంట్లో రెండు మూడు వారాంతాలు కలిసి చర్చించాం. ముందుగా కొందరు పరిచితులైన అనుభవజ్ఞుల అభిప్రాయాల కోసం వారిని సంప్రదించాం. దాదాపుగా అందరూ ఉత్సాహం చూపించారు; జాగ్రత్తలుచెప్పి ముందుకు సాగండని ప్రోత్సహించారు. డైనమిక్ ఫాంట్ వాడమని సలహా ఇచ్చి, దాని గురించిన సమాచారాన్ని అందించిన వారు రామారావు కన్నెగంటి.
1998 విజయదశమికి ఈమాట మొదటి సంచిక వెలువడింది. అయితే, ఆస్టిన్ నుండి అట్లాంటాకు ప్రతి వారాంతంలో నేను తిరుగుతూ ఉండడం వల్ల, డైనమిక్ ఫాంట్ టెక్నాలజీతో వెబ్‌సైట్ తయారు చేయడంలో జాప్యం జరిగింది. అందుకని, 1998 విజయదశమి రోజు నాడు ఈమాట తొలి సంచికను ఇమేజీలతో ప్రచురించబడింది. ప్రసాద్ చోడవరపు అందించిన సాయంతో తిక్కన డైనమిక్ ఫాంట్లు తయారు చేసి తొలిసంచికను eemaata.lekha.org సైట్ నుండి ముందు అనుకున్న విధంగానే డైనమిక్ ఫాంట్ టెక్నాలజీతో దీపావళి నాటికి తిరిగి వెలువరించాం.
1999 పూర్వార్ధంలో ఏదో యూనివర్సిటీ పని మీద వెల్చేరు నారాయణ రావుగారు ఆస్టిన్ రావడం తటస్థించింది. మా పత్రిక నిర్వాహణ గురించి ఆయనతో చర్చించడానికి మాకు ఈ పర్యటన బాగా పనికివచ్చింది. వాదాలతో, నినాదాలతో, సిద్ధాంతపు పడికట్టు మాటలతో, పద్యం ఎలా కట్టాలో తెలియని రోకలిబండ వచనపద్యాలతో తెలుగుభాష విసిగిపోయిందని, ఏదో ఒక పురోగమన దృక్పథం వుంటే చాలు కవిత్వం అయిపోతుందనే దృష్టి ఏర్పడిందనీ చెబుతూ, దేశం వదిలి రావడం వల్ల మనకు కలిగిన ఎడబాటు, మనలో ఒక స్వతంత్రతకీ, ధైర్యానికీ, ఒక కొత్త అనుభవాన్ని చెప్పడానికీ, కావలసిన మాటలు ఏరుకోడానికీ అవకాశం ఇచ్చిందని, ఈ వాతావరణాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త విమర్శాప్రమాణాలూ, కొత్త సాహితీ ధోరణులు (genres) ఏర్పడడానికి మా పత్రిక దోహదం చేయగలదననీ వెల్చేరు వివరించారు. మేము అప్పటికే పాటిస్తున్న పీర్ రివ్యూ పద్ధతిని ప్రశంసిస్తూ, భావకవిత్వం రోజుల్లో కవులు ఒకరి పద్యాలు ఇంకొకరికి చూపించుకొని ఆ పద్యాలను మెరుగు పెట్టడానికి సలహాలు పొందేవారని, అది వారికి ఆ కాలంలో సమవుజ్జీ సమీక్ష (Peer Review) గా పనికివచ్చిందని చెప్పారు. మా ప్రయత్నాలకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మాకు కొండంత బలానిచ్చినట్టనిపించింది.
ఈమాట విలువలు, సంప్రదాయాలు
సంపాదకుని విధులు
గతం పరిశోధించుకునీ, వర్తమానం సమన్వయించుకునీ, భవిష్యత్తు నిర్ధారణగా రూపించుకోవడమూ, అందుకు తగ్గ ఒక ప్రణాళిక వేసుకొని రచయితలను, పాఠకులను ఆ మార్గాన నడిపించడమూ – ఇవీ సంపాదకుని ముఖ్య విధులు.
– శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
సోక్రటీస్ తనని తాను ఏథెన్స్ నగర వాసుల పాలిటి జోరీగ (gadfly) గాను, మంత్రసాని (midwife) గాను అభివర్ణించుకున్నాడు. జోరీగ లాగా తోటి ఏథేనియన్ల ఆలోచనాశ్వాలను కుట్టి వాటిని పరిగెత్తింపజేస్తానని చెప్పుకునేవాడు. అంతేకాక, మంత్రసానిగా పనిచేసిన తన తల్లి లక్షణాలే తనకు వచ్చాయని చెబుతూ, సాటి మానవుల ఉదాత్త భావాలను ప్రసవింపజేసే మంత్రసానితనమే తన వృత్తి అని కూడా సోక్రటీస్ చెప్పుకునేవాడు. సోక్రటీస్ తన గురించి చెప్పుకున్న లక్షణాలు పత్రికా సంపాదకులకు సరిగ్గా సరిపోతాయని నాకనిపిస్తుంది. రచయితను జోరీగ లాగా కుట్టి, తమ పత్రికకు అనుగుణమైన రచనను కూర్చడానికి ప్రేరేపించడం సంపాదకుని పని. ఆపై ఆ రచన పుట్టుకకు ముందు పురిటినొప్పులతో బాధపడే రచయితకు సాయపడేలా మంత్రసానితనం నెరపడమే సంపాదకుని ముఖ్య కర్తవ్యం.
తెలుగువారిలో ఇప్పటికీ చాలా మందికి సంపాదకుడంటే అచ్చుతప్పులు సరిదిద్ది అచ్చువేసేవాడు అన్న దురభిప్రాయం ఉంది. నిజానికి, పెద్ద పెద్ద ఆంగ్ల ప్రచురణ సంస్థలలో అచ్చు తప్పులు చూసి, విరామ చిహ్నాలు సవరించే యాంత్రికమైన పనిని కాపీ ఎడిటర్లు (Copy Editors) అనబడే చిన్న తరగతి సంపాదకులకు అప్పజెప్పుతారు. Acquisition Editor, Developmental Editor, Production Editor మొదలైన ఇతర శాఖలలోని సంపాదకులే రచనలోని ఇతివృత్తాన్ని, నిర్మాణ శిల్పాన్ని, శైలిని సమీక్షించి, లోపాలు సవరించి, ప్రచురణకు అవసరమైన మిగతా హంగులు సమకూర్చి, రచయితకు పాఠకులకు మధ్య వారధిని నిర్మించే పనిని దాదాపు పూర్తిచేస్తారు.
మా దృష్టిలో సంపాదకుడంటే సగం రచయిత. ఒక రచనను కూర్చడంలో రచయితల, సంపాదకుల శక్తి సామర్థ్యాలు పరస్పర సంపూరకాలు – ఈ ఇద్దరూ తమ తమ బాధ్యతలను నిర్వహిస్తేనే ఒక రచన సంపూర్ణాకృతిని పొందుతుందని మా గట్టి నమ్మకం. రచన కూర్చేటప్పుడు మెదడులో చైతన్యవంతమయ్యే భాగాలు వేరు; కూర్చిన ప్రతిని ఎడిట్ చెయ్యడానికి ఉపయోగపడే మస్తిష్కాంగాలు వేరు. రచయితకు సృజన ప్రధానం; సంపాదకునికి విమర్శక స్పృహతో కూడిన వివేచన ముఖ్యం. రచయితకు రచనా నిర్మాణ దక్షత కావాలి; సంపాదకునికి రచనలోని గుణాగుణాలను గ్రహించగలిగే అనుశీలనా కౌశలం ఉండాలి. రచయిత చూపు సృజనాత్మకం; సంపాదకుని చూపు విశ్లేషణాత్మకం. ఈ రకమైన దృష్టితో చూసినప్పుడు, రచయిత, సంపాదకుడు ఒకే ఆశయ సిద్ధి కోసం రెండు వేర్వేరు చివరలనుండి వ్యతిరేక మార్గాలలో ప్రయాణం చేసే భాగస్వాములని, వారిద్దరూ ఒకే చోట కలిసినప్పుడే వారు పనిచేసిన రచన ప్రచురణార్హతను పొందుతుందని అర్థం చేసుకోవచ్చు.
రాజశేఖరుని కావ్యమీమాంసలో కూడా ఈ ప్రతిభా భేదాలను గుర్తించినట్టు మనకు కనిపిస్తుంది. కారయిత్రీ, భావయిత్రీ అన్న గుణాల గురించి చర్చిస్తూ ఇలా అంటాడు:
కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమే వాపరస్తాం
కళ్యాణీ తే మతిరుభయథా విస్మయం నస్తనోతి
న హ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానా
మేకః సూతే కనకముపల స్తత్పరీక్షాక్షమోఽ న్యః
– కావ్య మీమాంస (తెలుగు సేత: పుల్లెల శ్రీరామచంద్రుడు. 1979)
ఒకడు రచించుటకు మాత్రమే సమర్థుడు. మరియొకడు దానిని వినుటకు (విని పరీక్షించుటకు) మాత్రమే సమర్థుడు. ఉత్తమ గుణములకు ఒకే స్థానమున కలయిక ఉండదు కదా? బంగారము ఉత్పత్తి చేసెడి శిల యొకటి, దానిని పరీక్షణము చేయు శిల మరియొకటి (ఈ శ్లొకాన్ని నాకు సూచించి అందజేసిన వెల్చేరు నారాయణరావు గారికి నా కృతజ్ఞతలు).
అంతేకాక, మన ప్రాచీన కావ్యాలలోని అవతారికలలో పేర్కొన్న విద్వజ్జనులు, రసజ్ఞులు, సుకవి పండితులు మొదలైన వారు, మన కవులకు ప్రమాణంగా ఉండేవారని, కావ్య నిర్మాణ సమయంలో వారి నుండి సలహాలు, సూచనలు పొందేవారని కూడా మనం ఊహించవచ్చు. అల్లసాని పెద్దనదిగా చెప్పబడే చాటువులో “ఒప్పు తప్పరయు రసజ్ఞులు” లేకపోతే కృతి రచించడం శక్యం కాదని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. “పొరి బొరి నొప్ప సలాకల నొరసిన కుందనపు బూదెయును బోలె సభన్ సరసుల సంఘర్షణమున వరకవి కావ్యంబు మిగుల వన్నెకు నెక్కున్” అంటూ సభలో సరసుల మధ్య సంఘర్షణ వల్లే కావ్యం రాటుదేలుతుందని నంది మల్లయ, ఘంట సింగనలు అభిప్రాయ పడ్డారు. అంటే ఆనాటి సభలలో, రాజాస్థానాలలో సాహిత్య చర్చలు జరిపి కావ్యాలలోని మంచి చెడ్డలను విశ్లేషించే వారన్నమాట. నన్నయ్య ఆనాటి రాజాస్థానాన్ని వర్ణిస్తూ “అపార శబ్ద శాస్త్ర పారగులైన వైయాకరణులును భారత రామాయణాద్యనేక పౌరాణికులును … ఆదిగా గల విద్వజ్జనంబు” లున్నారన్నాడు. మారన “వేదవేదాంగ పారగులైన ధారుణీసురులును, సమస్త శాస్త్ర విదులైన విద్వాంసులును, వివిధ పురాణ ప్రవీణులైన పౌరాణీకులును” ఉన్నారన్నాడు. “ఎట్టి కవికైన దనకృతి ఇంపు” కావున “సరసులైన కవుల చెవులకు నెక్కిన గాని” దానికి విలువలేదని తిక్కన విశ్వసించాడు. ఇవి కాక ఆ రోజుల్లో సాహిత్యాన్ని ప్రత్యేకంగా చర్చించే పండిత పరిషత్తులుండేవని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈనాడు సంపాదకుడు నిర్వహిస్తున్న బాధ్యతలని ఆనాటి పండితులు, రసజ్ఞులు, తార్కికులు, పండిత పరిషత్తులు పూరించేవారని చెప్పుకోవచ్చు.
మా దృష్టిలో సంపాదకుడు రచయితకు తొలి విమర్శకుడు కావాలి. రచయితను ఆత్మీయుడైన మిత్రుడుగా పరామర్శించి, సలహాలు, సూచనలు అందజేయగలగాలి. రచనా నిర్మాణానికి రచయిత చేసిన కృషినంతటినీ గ్రహించి, ఏయే సందర్భాలలో ఎందుకు అతని కృషి విఫలమైందో, ఎక్కడ సఫలమైందో, ఎక్కడెక్కడ తగినంత జాగ్రత్త తీసుకోలేదో మొదలైన విషయాలను సహృదయతతో పట్టి ఇవ్వాలి. ఇవి ఈమాట తొలినాళ్ళ నుండి సంపాదకులుగా మేము అనుసరించడానికి ప్రయత్నించిన సూత్రాలు, స్వీకరించిన బాధ్యతలు.
సమవుజ్జీ సమీక్షలు
సైంటిఫిక్ జర్నల్స్‌లో పేపర్లని పీర్ రివ్యూ చేస్తే కాని ప్రచురించరు. అలాగే కంపెనీల్లో కూడా రాసిన ప్రతీ టెక్నికల్ పేపర్నీ ముందుగా కొంతమంది రివ్యూ చేస్తారు. ఈ పీర్ రివ్యూ పద్ధతిలో సమీక్షకులకి రచయితలెవరో తెలియదు; అట్లాగే, రచయితలకి సమీక్షకులెవరో తెలియదు. ప్రారంభం నుంచీ ఈమాటకి వచ్చిన రచనలని ప్రచురణకి ముందు ఈ పద్ధతిలో సమీక్షించాలని నిర్ణయించుకున్నాం. మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శలు మేలు తప్ప కీడు చేయవని మా విశ్వాసం.
కొత్త టెక్నాలజీనీ, ఉన్నత ప్రమాణాలను తెలుగు వారికి పరిచయం చెయ్యడం
ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం ఈమాట లక్ష్యాలలో ఒకటి.ఆధునిక మానవ జీవితంలో ముఖ్య భాగమైన సమాచార సాంకేతికజ్ఞానాన్ని (Information Technology) తగినట్టుగా ఉపయోగించుకోలేని భాషలన్నీ ఈ శతాబ్దాంతానికి లుప్తమైపోయే ప్రమాదముందని, ఆర్థికపరంగా ఆంగ్లంతో పోటీ పడలేని తెలుగు వంటి భాషల మనుగడకు ఇంటర్నెట్లో భాషాభివృద్ధి అత్యంత అవసరమని మా నమ్మకం. డైనమిక్ ఫాంట్లను ఉపయోగించడంలోనూ, యూనికోడ్ టెక్నాలజీనీ ఉపయోగించడంలోనూ, స్టైల్‌షీట్ల వాడుకలోనూ, వెబ్ 2.0 ఇంటరాక్టివ్ ఫీచర్లు అందించడంలోనూ ఈమాట మొట్టమొదటి సైట్‌గా నిలిచి, మిగతా తెలుగు వెబ్‌సైట్లకు మార్గదర్శకంగా ఉండే ప్రయత్నం చేసింది.
పాఠకుల అభిప్రాయాలు
వ్యక్తిగత దూషణలు లేకుండా విమర్శనాత్మక దృష్టితో రాసిన పాఠకుల అభిప్రాయాలు ఎంత నిష్కర్షగా వున్నాసరే రచనాకారులకు ఎంతగానో ఉపకరిస్తాయని మా గట్టి నమ్మకం. ఒక రచనపై పాఠకుల అభిప్రాయాలనీ, దృక్పథాన్నీ రచయితకు ప్రత్యక్షంగా, వెంటనే తెలియజేయగలగడం ముఖ్యమని తొలినుండి మా భావన. అందుకే, Web 2.0 అందించే ఇంటరాక్టివ్ ఫీచర్లు ఈమాట ప్రారభంలో లేకున్నా, తొలి సంచికనుండీ గెస్ట్ బుక్ ద్వారా పాఠకుల అభిప్రాయాలు తెలుపడానికి సౌకర్యాన్ని కల్పించాం.