వెబ్ ప్రపంచంలో తెలుగు
1994లో మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ హోం పేజ్ సైటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వెబ్ సైట్లలో మొట్టమొదటిదని చెప్పవచ్చు. దీనిని పద్మ ఇంగ్రగంటి గారి సహాయంతో జార్జ్ మేసన్ యూనివర్సిటీలో చదివే శ్రీనివాస్ సవరం, ఒక్లొహోమా లో చదివే సుజాత నీలం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రాథమిక వివరాలు(భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక వగైరా) ఇందులో పొందు పరచారు. క్లిక్ చేయగలిగే ఆంధ్రప్రదేశ్ పటం అప్పట్లో ఈ సైటు ప్రత్యేకత. సుజాత, శ్రీనివాస్ లిద్దరూ చదువు ముగించుకుని వెళ్ళిపోవడంతో ఈ సైటు ఒక సంవత్సరం మించి నడవలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు తరవాత మరొక దశాబ్దానికి కానీ మొదలవలేదు.
తెలుగు లిటరరి హోం పేజ్
SCIT లో ప్రముఖ రచయితల రచనలు సేకరించి, ఒక్కచోట ఉంచాలన్న ప్రయత్నంతో నేను, పద్మ ఇంద్రగంటిగారు కలిసి 1994-95 సంవత్సరాలలో నిర్మించిన మొట్టమొదటి తెలుగు వెబ్ సైట్ ఇది. అప్పటికే, వెబ్ సైట్ నిర్మాణంలో మెళకువలు తెలుసుకున్న పద్మతో కలిసి పనిచేయటంతో, నాకు ఈ వెబ్ సైటు నిర్మించడం తేలికయ్యింది. SCIT రచనలే కాకుండా, తెలుగు భాషా చరిత్ర, తెలుగు సాహితీకారుల జీవిత చరిత్రలు, సాహితీ గ్రంథాలు, ఆంగ్ల అనువాదాలతో దీనిని ఒక సాహితీ విజ్ఞాన సర్వస్వంగా రూపుదిద్దాలని ఆ రోజుల్లో మా సంకల్పం. మొదట్లో, turnpike.net అన్న చోట ప్రారంభించి, వారిచ్చే డిస్క్ స్పేసు సరిపోకపోవడంతో దీన్ని బౌలింగ్ గ్రీన్ యూనివర్సిటీకి మార్చాము. ఈ వెబ్సైట్ మేము బౌలింగ్ గ్రీన్ యూనివర్సిటీకి మార్చిన కొద్ది రోజులకే ప్రొఫెసర్ కె. వి. రావుగారు దీన్ని సొంతం చేసుకోవడంతో ఆ వెబ్ సైట్ పైన తిరిగి మళ్ళీ పనిచెయ్యలేకపోయాం.(1995 లో ఈ సైట్ ప్రతిరూపాన్ని మా ఆర్కయివుల్లో చూడవచ్చు).
lekha.org
వెబ్ ఆవిర్భావానికి పూర్వం లాటెక్(laTeX), పేజిమేకర్ వంటి టైప్‌సెట్టింగ్ సాఫ్ట్‌వేర్ లోనూ ప్రింట్ చేసువోవడానికి వీలుగా తయారు చేసే పోస్ట్ స్క్రిప్ట్ ఫైల్లో మాత్రమే తెలుగు వాచకం కనబడేది. RIT సాఫ్ట్‌వేర్ వాడాలంటే, లాటెక్ సాఫ్ట్‌వేర్ ఉన్న యూనిక్స్ మెషీన్ తప్పనిసరి. వెబ్‌లో వాడకానికి అనుకూలంగా తెలుగు సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసి, ఆ పద్ధతిని భారతీయ భాషలన్నింటికి వర్తింపజేయాలన్న సంకల్పంతో రమణ జువ్వాడి 1996 లో lekha.org స్థాపించాడు. ఆ రోజుల్లో, తెలుగు సాఫ్ట్‌వేర్ మీద పనిచెయ్యాలనుకునే మా వంటి ఔత్సాహికులందరికీ, లేఖ (lekha.org) కేంద్ర స్థలంగా మారింది. DOS, Macintosh మెషీన్లపై పనిచేసేటట్టుగా RIT సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసాం. వెబ్‌లో వాడకానికి అనుకూలంగా తిక్కన ఫాంట్లు తయారయ్యాక నేరుగా వెబ్పేజీలు తయారుచెయ్యడానికి లేఖ సాఫ్ట్‌వేర్లో మార్పులు చేసాం. RTS లిప్యంతరీకరణ పద్ధతిని భారతీయ భాషలన్నింటికి పనికివచ్చే విధంగా విస్తరించి ISC అనే కొత్త స్కీమ్ ప్రతిపాదించిన వారు రమణ, అతని మిత్రుడు అరుణ్ గుప్తా. వారు ఆ రోజుల్లోనే, రెండవ సంతతి ప్రవాస భారతీయులు చడవడానికి వీలుగా డయాక్రిటిక్స్‌తో తెలుగు వాచకాన్ని చూపించడానికి వీలుగా Lekha Transliteration Scheme (LTS) కూడా ప్రతిపాదించారు. SCIT ఆటో-మాడరేషన్ కోసం, తెలుసా చర్చావేదికలోని చర్చలను నేను రాసిన ఒక ప్రోగ్రామ్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి ఆర్కైవ్ చెయ్యడానికి కూడా lekha.org పనికి వచ్చింది (ఆ రోజుల్లో http://telusa.lekha.org ద్వారా తెలుసా ఈమెయిళ్ళు నేరుగా తెలుగులో చదవడానికి, రాయడానికి వీలుండేది). ఈమాట పత్రిక కూడా 2002 జనవరి దాకా eemaata.lekha.org అన్న అడ్రస్‌తో lekha.org నుండే వెలువడేదని ఈమాట పత్రికను తొలినుండి చదువుతున్న పాఠకులకు తెలుసు.
రంగవల్లి / రంగవల్లిక
DOS/Windows, యూనిక్స్, మాకింటాష్ వంటి మెషీన్లన్నింటిపై పనిచేసే జావా (Java) టెక్నాలజీని 1995 లో ప్రకటించడం ఒక కొత్త శకానికి నాంది. ఆ జావా టెక్నాలజీని వాడుతూ ‘రంగవల్లి’ అన్న పేరుతో తెలుగు సాఫ్ట్‌వేర్ నిర్మించిన ఘనత చోడవరపు ప్రసాద్ కు దక్కుతుంది. తరువాత, ఇదే సాఫ్ట్‌వేర్ కు కొన్ని మార్పులు చేసి, Netscape Composer కు ప్లగ్ఇన్‌గానూ, ‘మేఘసందేశం’ అన్న పేరుతో ఈమెయిల్ కంపోజర్ గానూ నిర్మించాడు. ఏ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా వెబ్ ద్వారా తెలుగు లోకి తర్జుమా చేసే ‘రంగవల్లిక‘ ఆ రోజుల్లో అమిత ప్రాచుర్యం పొందింది.
లేఖ, రంగవల్లి మాత్రమే కాక ఆ రోజుల్లో తెలుగు లిపిలో రాయడానికి పబ్లిక్ డొమైన్లో జరిగిన మరో మంచి కృషి శ్రీనివాస్ సిరిగిన తయారు చేసిన తెలుగు లిపి.
తొలితరం తెలుగు వెబ్‌సైట్లు
కుమార్ అంపని, మధుసూదన్ ఓరుగంటి నిర్వహణలో 1996లో ప్రారంభమైన ‘తెలుగు వాణి‘ మొట్టమొదటి తెలుగు వెబ్ చర్చావేదిక అని చెప్పవచ్చు. ఈ చర్చావేదికల్లో అంత్యాక్షరి ఫోరం ఆ రోజుల్లో అమిత ప్రజాదరణ పొందింది. శ్రీనివాస్ పరుచూరి సాయంతో శ్రీకాంత్ బండి తెలుగు సినిమా సమాచారాన్ని అందజేసే Telugu Film Serverని 1996లో ఆవిష్కరించారు. (1998 తరువాత దీనిని lekha.org కు తరలించారు). సిటి కేబుల్‌వారు రవి ప్రకాశ్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వార్తల్ని అందించే మొదటి తెలుగు పోర్టల్‌ని తీసుకువచ్చారు. ఆ తరువాత కొన్ని తెలుగు వార్తా పత్రికలు తమ పత్రికలకు వెబ్ ఎడిషన్లు మొదలు పెట్టాయి. ఇంగ్లీషులో ఉండే తెలుగు సినిమాల పోర్టళ్ళు, పాటల వెబ్‌సైట్లు, తెలుగు సాంస్కృతిక, సాహితీ సంస్థల వెబ్‌సైట్లు కొన్ని సృష్టించబడ్డాయి. డాట్.కాం. బూమ్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు తెలుగుకథ కోసం ప్రత్యేకించి ప్రముఖ కథకుడు ఆర్. ఉమామహేశ్వరరావు సంపాదకత్వంలో ఒక సైట్ నడిచింది. కానీ, అది కొద్దికాలానికే మూతపడింది. ఇంకా అప్పట్లో నిహార్ ఆన్ లైన్, ఇండియాఇన్ఫో లాంటి సైట్లలో వేమన వసంతలక్ష్మి (ప్రస్తుతం ఆంధ్రజ్యోతి లో) ఖదీర్‌బాబు (ప్రస్తుతం సాక్షి పత్రికలో) లాంటివాళ్ళు పనిచేసినప్పుడు సాహితీపరమైన వ్యాసాలకి కొంచెం ప్రాముఖ్యత నిచ్చారు. తెలుగు సాహిత్యం గురించి అరుదైన సమాచారాన్ని అందించే అడ్లూరి శేషుమాధవ రావు తెలుగు భాషా సాహిత్యం సైట్, వాడపల్లి శేషతల్పసాయి నిర్మించిన ఆంధ్రభారతిసైట్ తప్పకుండా చెప్పుకోవలసిన ప్రయత్నాలు. వీటిలో శేషుమాధవ రావు గారి సైటులో చాలా కాలం నించీ కొత్త సమాచారమేమీ లేకపోయినా ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రభారతి సైటు సంప్రదాయ సంగీత సాహిత్యానికీ భాండాగారంగా కొనసాగుతోంది.
యూనీకోడ్ విప్లవం
తొలితరం తెలుగు సైట్లలో చాలా తక్కువ సైట్లు మాత్రమే తెలుగు లిపిని ఉపయోగించేవి. తెలుగు లిపిని వెబ్ పేజీలలో చూపించడానికి ప్రామాణికమైన పద్ధతి లేకపోవడం, తెలుగులిపిని బొమ్మల రూపంలో చూపే సైట్లు నడపడానికి కష్టం కావడంతో అవి తొందరగా మూతపడేవి. తెలుగు వంటి ఆంగ్లేతర భాషల/లిపుల కోసం ప్రత్యేకంగా సంకేత స్థలాలను కేటాయించే యూనికోడ్ ప్రమాణం (Unicode) 1991 నుండే అభివృద్ధి చెందినా, దానిని సమర్థించే (support) నిర్వహణా వ్యవస్థ (Operating System) లేకపోవడంతో 2003 వరకు యూనికోడ్ ప్రమాణాన్ని తెలుగు కోసం వాడుకోనే వీలు లేకపోయింది. కానీ, తెలుగు లిపిని కంప్యూటర్ తెరపై చూపడానికి, టైపు చెయ్యడానికి అవసరమైన వ్యవస్థను, వనరులను 2003లో Microsoft XP ఆపరేటింగ్ సిస్టమ్ లోనే పొందుపరచడంతో కంప్యూటర్లపై తెలుగు రాయడం, చదవడం ఎన్నడు లేనంతగా సుళువయ్యింది.
తెలుగు యూనీకోడ్ వాడకానికి, తెలుగులో ఈమెయిళ్ళు రాసుకోవడానికి, తెలుగు లిపిని ఉపయోగించి వెబ్‌సైట్లను నిర్మించడానికి, తెలుగు చర్చావేదికలకు, ఇంటర్నెట్టులోనే వెతకగలిగే తెలుగు డిక్షనరీల నిర్మాణానికి యూనీకోడ్ సరికొత్త ద్వారాలను తెరిచింది. యూనికోడ్ టెక్నాలజీతో పాటు, Web 2.0 ఇంటరాక్టివ్ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి రావడంతో, తెలుగు బ్లాగులు, కొత్త తరం తెలుగు పత్రికలు, తెలుగు వికీపీడియా వంటి బృహత్తర ప్రాజెక్టులకు మార్గం సుగమమయ్యింది. 2004 లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్‌లో తెలుగు టైపు చేయడానికి నేను రాసిన IE Telugu Extension, దాని స్ఫూర్తిగా నాగార్జున వెన్న నిర్మించిన పద్మ సాఫ్ట్‌వేర్, దాని ఆధారంగా వీవెన్ నిర్మించిన లేఖిని వంటి పరికరాల సహాయంతో కంప్యూటర్లపై తెలుగు రాయడం సులభమైపోయింది. యూనికోడ్ లో రాయడానికే కాక, నాన్-యూనికోడ్ ఫాంట్లనుండి ఎన్నో భారతీయ భాషల వెబ్ సైట్లను, ఎన్నో ఫాంట్లను యూనికోడ్ లోకి తర్జుమా చేసే సాధనంగా నాగార్జున వెన్న సృష్టించిన పద్మ సాఫ్ట్‌వేర్ చాలా గొప్ప కృషి. రామారావు కన్నెగంటి, నేను కలిపి నడిపిన డిజిటల్ తెలుగు చర్చావేదిక మొదట్లో యూనికోడ్ ప్రచారానికి ఎంతో ఉపయోగపడింది. యూనికోడ్ ప్రమాణానికి అప్పటివరకూ అందులో లేని 14 తెలుగు అక్షరాలను జత చేయడానికి కూడా ఈ చర్చావేదికే సాధనంగా పనికి వచ్చింది. కంప్యూటర్లో తెలుగు లిపిలో రాయడం గురించి వీవెన్, కిరణ్ కుమార్ చావాల వంటి వారి కృషి ఫలితంగానే తెలుగు బ్లాగుల గురించి ఎనలేని ప్రచారం జరిగి, ఎన్నో కొత్త తెలుగు బ్లాగులు పుట్టుకొచ్చాయి. తెలుగును విస్తృతంగా వాడటం మొదలుపెడితే కానీ సమాచార విప్లవ ఫలితాల్ని తెలుగులో పూర్తిగా అనుభవించలేమని గుర్తించిన కొత్త తరం యువకులు, తెలుగు సాంకేతిక అభివృద్ధి కోసం, కంప్యూటర్లో తెలుగు గురించి ప్రాచరం చెయ్యడం కోసం e-తెలుగు అన్న సంస్థను స్థాపించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిస్తున్నారు.