తెలుగు సాఫ్ట్‌వేర్ చరిత్ర
మొదటినుండీ కంప్యూటర్ టెక్నాలజీ నిర్మాణానికి, ఉపయోగానికి వాడుకున్న భాష ఇంగ్లీష్ భాష. కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పని చేస్తాయి. ఒక్కో అక్షరానికీ లేదా వర్ణానికీ ఒక్కో సంఖ్యని కేటాయించి నిక్షిప్తం చేసుకొంటాయి. యూనీకోడ్ ప్రవేశానికి పూర్వం భాషలోని అక్షరాలకు సంఖ్యలను కేటాయించడానికి సార్వజనిక ప్రమాణంగా ఉన్న ASCIIలో 128 సంకేత స్థలాలు (code points) మాత్రమే ఉండేవి. ఇంగ్లీష్ భాషకు అవసరమైన అన్ని అక్షరాలు, విరామ చిహ్నాలను పూర్తిగా నిక్షిప్తం చేయడానికే ఈ సంకేత స్థలాలు సరిపోయేవి కాదు. ఆ తరువాత మిగితా యూరోపియన్ భాషలలోని అదనపు అక్షరాలకోసం నిర్మించిన Extended ASCII ప్రమాణాలలో 256 సంకేత స్థలాల వరకూ వాడుకోవచ్చు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన టైప్‌సెటింగ్ (Typesetting) సాఫ్ట్‌వేర్ వాడితే గానీ తెలుగు వంటి మిగతా ప్రపంచ భాషలలోని అక్షరాలను నేరుగా చూపించడం సాధ్యమయ్యేది కాదు.
TeluguTeX
కనూత్ నిర్మించిన టెక్ (TeX) టైప్‌సెటింగ్ వ్యవస్థ ఆ రోజుల్లో యూనివర్సిటీలోనూ, పరిశోధనా సంస్థలలోను చాలా విరివిగా వాడేవారు. ఈ టెక్ (TeX) ముద్రణ వ్యవస్థ ఆధారంగా తెలుగు అక్షరాలు, ఒత్తులు, గుణింతాలకు అవసరమైన మెటాఫాంట్(METAFONT) మాక్రోలతో, లాటెక్ (LaTeX)కు పొడిగింపుగా నిర్మించిన తెలుగుటెక్ (TeluguTeX) నాకు తెలిసినంతవరకూ తెలుగు టైప్‌సెటింగ్ చరిత్రలో మొట్టమొదటి కృషి. దీన్ని 1990-1992 లో అయోవా స్టేట్ యూనివర్సిటీ ( Iowa State University) లో చదువుకుంటున్న లక్ష్మీ ముక్కవల్లి, లక్ష్మణ్ కుమార్ ముక్కవల్లి దంపతులు సృష్టించారు.
RIT/ RTS
ముక్కవల్లి దంపతులు సృష్టించిన తెలుగుటెక్ (TeluguTeX) తమ తమ యూనిక్స్ మెషీన్లపై ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని పనిచేసేట్టుగా చేయడం ఎంతటి ప్రోగ్రామర్ కైనా కష్టసాధ్యంగానే ఉండేది. అంతే కాకుండా, ముక్కవల్లి వారు వాడిన ఫోనెటిక్ ఇన్‌పుట్ స్కీమ్ కొంత అసహజంగా, అనియతంగా ఉండేది. వారి ఇన్‌పుట్ స్కీమ్ బదులుగా RTS (Rice Transliteration Standard) అన్న కొత్త స్కీమును తయారు చేసి, తెలుగుటెక్ సాఫ్ట్‌వేర్ ఇన్స్టలేషన్ సులభతరం చేయడానికి అవసరమైన స్క్రిప్టులతో RIT (Rice Inverse Transliterator) అన్న కొత్త సాఫ్ట్‌వేర్ రాసి అందజేసినవారు వారు రామారావు కన్నెగంటి, ఆనంద కిశోర్ ద్వయం. RIT, RTS మొట్టమొదటి వెర్షన్ 1992లో విడుదల అయ్యింది. RTS పద్ధతిని RIT సాఫ్ట్‌వేర్ కోసమే సృష్టించినా, ఈ సాఫ్ట్‌వేర్‌తో సంబంధం లేకుండా తెలుగు మాటల్ని ఇంగ్లీష్ లో రాయడానికి, చదవడానికి వీలుగా ఈ స్కీముని విరివిగా స్కిట్ లోనూ, WETD లోనూ ఉపయోగించడంతో, ఈ పద్ధతి యూజ్‌నెట్లో నిశ్శబ్దంగా అంగీకరింపబడిన ప్రమాణమైపోయింది. తెలుగు భాష మాత్రమే కాకుండా, కన్నడ, సంస్కృతం, ఒక్కోసారి తమిళం రాయటానికి కూడా RTS పద్దతిని పాటించడం ఇతర భారతీయ చర్చవేదికల్లో కనిపించేది.
ప్రాథమిక స్థాయి స్పెల్ చెక్కర్‌తో RIT 2.0 వర్షన్ 1993లో విడుదల అయితే, 1994-95లో జువ్వాడి రమణ, దేశికాచారిగారి తిక్కన ఫాంట్లకు సపోర్ట్ జతకూరుస్తూ దీన్ని పూర్తిగా తిరగ రాసి RIT 3.0 గా విడుదల చేసారు. ఆనంద కిశోర్ గారు, నేను కొంతకాలం స్పెల్ చెక్కర్ మీద పనిచేసి దాన్ని RIT 3.0కు అనుబంధ సాఫ్ట్‌వేర్‌గా జతచేసాము. అయితే, తెలుగు పదాలను విడగొట్టగలిగే మార్ఫలాజికల్ అనలైజర్ (Morphological Analyzer), సరైన నిఘంటువులు లేకుండా చక్కటి తెలుగు స్పెల్ చెక్కర్ నిర్మాణం దుస్సాధ్యమని మా ప్రయత్నాలవల్ల తెలిసింది.
పోతన ఫాంట్లు, సాఫ్ట్‌వేర్
1985 లో తన కావ్యం ‘హనుమప్ప నాయకుడు’ ప్రచురించినపుడు ఆ కావ్యంలో దొర్లిన ముద్రారాక్షసాలు చూడలేక, తన కావ్యాలని తనే టైప్‌సెట్టింగ్ చేసుకోవాలన్న సంకల్పంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మాకింటాష్ (Macintosh) కంప్యూటరుపై అందమైన తెలుగు ఫాంట్లను కూర్చిన ఘనత దేశికాచారి గారిది. ఆంధ్ర భాగవత కర్త అయిన పోతనపై తనకున్న అభిమానంతో మొదటి ఫాంటుకు ‘పోతన’ అని పేరు పెట్టారీయన. మొట్టమొదటగా 1990 లో బిట్-మాపింగ్ ఫాంట్లుగా కూర్చి, ఆ తరువాత 1993 లో వీటిని పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్లుగా వెలువరించారు. ఈ ఫాంట్లను ఉపయోగిస్తూ తెలుగు టైప్ చెయ్యడానికి వీలుగా పోతన కీబోర్డ్ ను డిజైన్ చేసి, అందుకు తగిన సాఫ్ట్‌వేర్ కూడా తనే స్వయంగా రాసారు. అమెరికాలో నివసించే చాలామంది తొలితరం తెలుగువారు తెలుగులో రాయడానికి ఉపయోగించింది దేశికాచారి గారి పోతనా సాఫ్ట్‌వేరే.
1995లో జంపాల చౌదరిగారి చొరవతో పొందిన తానా ఆర్థిక సాయంతో దేశికాచారి గారు తన పోతన ఫాంటుని పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి ఒప్పుకున్నారు. పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అయిన RIT 1994 దాకా ముక్కవల్లి ఫాంట్లమీదే ఆధారపడింది. 1995లో, పోతన ఫాంట్లకు ISO ప్రమాణాల స్థాయికై తగువిధంగా మార్పులు చేసిన రమణ జువ్వాడి , వీటిని ‘తిక్కన ఫాంట్స్’ అన్న పేరుతో RIT 3.0 తో పాటు పబ్లిక్ డొమైన్ లోకి 1995లో విడుదల చేసారు. ఆ తరువాతి కాలంలో చోడవరపు ప్రసాద్, రమణ జువ్వాడితో కలిసి వెబ్ లో వాడకానికి అణుగుణంగా ఈ ఫాంట్లకు మరికొన్ని మార్పులు చేసారు. 1998 లో ఈమాట తొలిసంచిక నుండీ 2004 దాకా ఈమాట పత్రిక ప్రచురణ పూర్తిగా తిక్కన ఫాంట్ల సాయంతోనే జరిగింది.
ఇవే కాక, ఆ రోజుల్లో భారతదేశంలో కమర్షియల్ ప్రచురణా సంస్థల నుండి రచన, అను, విజన్, ప్రభుత్వ సంస్థ అయిన C-DAC తయారు చేసిన LEAP ఆఫీస్ సాఫ్ట్‌వేర్లు కూడా లభ్యమౌతూ ఉండేవి. ఇవన్నీ వెబ్ అంతగా ప్రాచుర్యం పొందక ముందు జరిగిన తెలుగు సాఫ్ట్‌వేర్ ప్రయత్నాలు.
World Wide Web (విశ్వ వ్యాప్త వాగురం) ఆవిర్భావం
Gopher, WAIS
1993 దాకా ఇంటర్నెట్టుకు టెల్‌నెట్ (telnet), ఎఫ్.టీ.పీ.(ftp), యూజ్‌నెట్లు ప్రధానాంగాలు. అయితే ఎంతో వేగంగా విస్తరిస్తూ ఇంటర్నెట్టు 1990 నాటికే కేటలాగుల్లేని ఒక మహా గ్రంథాలయంలా తయారయ్యింది. మనకు కావల్సిన సమాచారం ఏ సైటులో ఉంటుందో, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈ సమస్యను తీర్చడానికి యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా వారు గోఫర్ (Gopher) అన్న ప్రోగ్రాంని తయారు చేసారు. ఇంటర్నెట్టుకు కనెక్ట్ అయిన ఏ మెషీన్ నుండైనా ఈ ప్రోగ్రాంని రన్ చేస్తే తన చుట్టుపక్కల ఉన్న సర్వర్లలో ఉన్న సమాచారాన్ని వెతికి వాటిని మెన్యూలుగా చూపెడుతుంది. ఒక మెన్యూని సెలక్ట్ చేసుకొని పక్క సైటుకు వెళ్తే, ఆ సైటులోని సమాచారం, ఆ చుట్టుపక్కల సైట్లలోని సమాచారం మళ్ళీ మెన్యూలుగా కనబడతాయి. ఇలా మనకు కావల్సిన సమాచారం దొరికేంతవరకూ, ఒక మెన్యూ నుండి ఇంకో మెన్యులోకి దూకుతూ ఇంటర్నెట్టంతా విహారం చెయ్యవచ్చు.
మెన్యూల ద్వారా కాకుండా, నేటి సర్చ్ ఇంజన్లలాగా మనకు కావల్సిన సమాచారాన్ని కీలక పదాల ఆధారంగా వెతకడానికి కేంబ్రిడ్జ్ లో ఉండే Thinking Machines సంస్థ వారు WAIS అన్న ప్రోగ్రామును తయారు చేసారు. 1990వ దశాబ్దపు తొలి రోజుల్లో Gopher, WAIS, రెండు జంట సాధనాలుగా ఆ రోజుల్లో నేటి వెబ్ సైట్లు అందించే సమాచారాన్ని ప్రాథమిక స్థాయిలో అందించేవి. వెబ్ పుట్టుక తరువాత వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయి, 1995 కల్లా ఈ సాధనాలు రెండూ లుప్తమైపోయాయి.
వెబ్ సృష్టి
ఇప్పుడు మనం వాడుతున్న వెబ్ ప్రపంచాన్ని 50 యేళ్ళ క్రితమే ఊహించి, వెబ్ పేజీలలో ఉపయోగించే హైపర్‌లింకులతో కూడిన హైపర్‌టెక్స్ట్‌ని మొట్టమొదటగా ప్రతిపాదించిన ఘనత వానీవర్ బుష్ (Vannevar Bush)కే చెందాలి. మనం భవిష్యత్తులో సాధించగల విషయాలపై తన ఆలోచనల్ని ప్రకటిస్తూ 1945 లో అట్లాంటిక్ మంత్లీ పత్రికలో ‘As We May Think‘ అన్న వ్యాసం రాసారీయన. ఈనాడు అధునాతన ఐటీ టెక్నాలజీగా భావించే పర్సనల్ కంప్యూటర్లు, హైపర్లింకులు, సర్చ్ ఇంజన్ల గురించి ఆయన ఆ వ్యాసంలో ఆనాడే ఊహించగలగడం ఆశ్చకరమైన విషయమే. వానీవర్ బుష్ ఊహించిన హైపర్‌టెక్స్ట్‌ని సాధించడానికి 1980 దశాబ్దంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 1987లో ఆపిల్ సంస్థ (Apple) వారు తయారు చేసిన HyperCard అన్న ప్రోగ్రాము, టెడ్ నెల్సన్ (Ted Nelson) నిర్మించిన Xanadu ప్రాజక్ట్ ఈ ప్రయత్నాలలో చెప్పుకోదగ్గవి.
అయితే, ఇప్పుడు ఇంటర్నెట్టుకు పర్యాయపదమైపోయిన నేటికాలపు వెబ్‌కి అంకురార్పణ జరిగింది స్విస్-ఫ్రెంచ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నయూరోపియన్ హై ఎనర్జీ ఫిజిక్స్ లాబొరేటరీ, CERNలో. అందులో పని చేస్తున్న టిమ్ బెర్నర్స్-లీ నేడు మనం ఉపయోగిస్తున్న HTTP ప్రోటోకాల్ని, HTML భాషని, సైట్లను గుర్తించే URL పద్ధతిని 1990లో సృష్టించాడు. తన సహోద్యోగి అయిన రాబర్ట్ కేలో తో కలిసి CERN టెలీఫోన్ డైరక్టరీని చూపించే వెబ్ పేజీని మొదటి వెబ్ ప్రాజక్టుగా నిర్మించాడు. మొదట్లో CERNకే పరిమితమైన ఈ కొత్త వెబ్ ప్రపంచం గురించి టిమ్ బెర్నర్స్-లీ ఆగస్ట్ 1991 న alt.hypertext గ్రూప్‌లో పోస్ట్ చెయ్యడంతో ఇంటర్నెట్ లో కలకలం సృష్టించింది. ఇంటర్నెట్ సంబంధించిన అన్ని కంప్యూటర్ కాన్ఫరెన్సులలో ఇది చర్చనీయాంశమయ్యింది. అమెరికా లోని విశ్వవిద్యాలయాలలో, పరిశోధనా సంస్థలలో ప్రాథమిక స్థాయి వెబ్ సైట్ల నిర్మాణం మొదలయ్యింది. ఈ వెబ్ సైట్ల నిర్మాణంలో ఎదురయ్యే సాధక బాధకాల గురించి చర్చించడానికి comp.infosystems.www అన్న యూజ్‌నెట్ న్యూస్‌గ్రూప్ కూడా ప్రారంభమయ్యింది. అయితే, తొలి వెబ్ బ్రౌజర్ అయిన లిన్క్స్(Lynx) టెక్స్టు మాత్రమే చూపగలిగేది. అంతేకాక, మొట్టమొదట్లో నిర్మించిన వెబ్ సైట్లన్నీ, మెన్యూలుగానూ, మెన్యూల మెన్యూలుగానో ఉండి అప్పటికే ప్రాచుర్యం చెందిన గోఫర్ సైట్లకు ఏ మాత్రం మించిపోనివనిపించేవి. ఆ కారణం వల్లనేమో ఈ వెబ్ సైట్లు మొదట్లో అంతగా ప్రజాదరణ పొందలేదు.
గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్
ఇదే రోజుల్లో అమెరికన్ కాంగ్రెస్ చేసిన ఒక తీర్మానం వెబ్ టెక్నాలజీ ప్రగతిని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేసింది. 1992లో ఇంటర్నెట్టును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడానికి అనుమతిస్తూ అమెరికన్ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని జారీ చేసింది. ఆల్ గోర్ (Al Gore) తాను సెనేటర్ గా ఉన్నప్పుడు 1991లో ప్రతిపాదించిన ‘National Information Infrastructure’ బిల్లు ఈ ప్రైవెటీకరణకు కారణమని చెప్పక తప్పదు. ఇంటర్నెట్టుకు వెన్నెముక అనదగ్గ NSFNET యొక్క ప్రైవేటీకరణ కూడా ఆ సంవత్సరమే మొదలయ్యింది. ఈ తీర్మానాల ఫలితంగా, తొలినుండి లాభాపేక్ష లేని పరిశోధనా, విద్యా, వైజ్ఞానిక రంగాలకు మాత్రమే పరిమితమైన ఇంటర్నెట్టు, 1993 నుండి వాణిజ్య రంగంలో జరిపే లావాదేవీల కోసం, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం వాడడం మొదలయ్యింది.
గోర్ బిల్లు ద్వారా పొందిన ఆర్థిక సాయంతో 1992-93 లలో NCSA (National Center for Supercomputing Applications)కు పనిచేసే మార్క్ ఆండ్రీసన్ (Mark Andreesen) మొజాయిక్ (Mosaic) అన్న పేరుగల ఒక గ్రాఫికల్ బ్రౌజర్ ను నిర్మించాడు. వచనాన్ని బొమ్మలతోను, లింకులతోను కలిపి చూపించగలిగే ఈ బ్రౌజర్ నిర్మాణం తరువాతనే World Wide Web యొక్క శక్తి సామర్థ్యాలు లోకం అంతా వెల్లడి అయ్యాయి. ఆ సంవత్సరమే, ఇమ్మడి ముమ్మడిగా ప్రపంచమంతా వెబ్ సైట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. అప్పటివరకూ ఇంటర్నెట్టుకు ఉపాంగాలకు ఉన్న ftp, gopher, WAIS వంటి ఇతర సాధనాల స్థానాన్ని వెబ్ పూర్తిగా ఆక్రమించింది. విద్యా, విజ్ఞాన సంస్థలే కాక ప్రైవేట్ సంస్థలు కూడా ఈ టెక్నాలజీ ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టడంతో కనీవిని ఎరుగని రీతిలో ఈ కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అనతికాలంలోనే, ఇంటర్నెట్టు అంటేనే వెబ్, వెబ్ అంటేనే ఇంటర్నెట్టు అన్నంతగా ఎదిగి ఈ వెబ్ టెక్నాలజీ ప్రపంచం అంతటా వేగంగా విస్తరించడం, కంప్యూటింగ్ చరిత్రలో నవశకానికి నాంది పలికింది.
(1999లో గోర్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు, CNNకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానే ఇంటర్నెట్టును కనుకున్నానని చెప్పినట్టుగా పత్రికలు ప్రకటించడం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. నిజానికి ఆ ఇంటర్వ్యూలో గోర్ చెప్పిన వాక్యం ఇది: “During my service in the United States Congress, I took the initiative in creating the Internet.” ఈ వాక్యంలో creating the Internet అని కాకుండా opening up the Internet అనో లేదా privatization of the Internet అనో చెప్పి వుంటే అంతగా నవ్వులపాలయ్యే వాడు కాదేమో).