ఘంటసాల చర్చావేదిక
SCITలో సినీమా, సంగీత, సాహిత్యాల పై ఉత్సాహంగా చర్చలు జరుగుతున్న రోజుల్లో శ్రీధర్ బసవరాజు అనేయువకుడు తాను ఘంటసాల అభిమానని, ఘంటసాల గురించి ఒక ప్రత్యేక చర్చావేదిక ఏర్పాటు చెయ్యలని తన కోరికగా ఉందని SCIT లో ప్రకటించాడు. రెండవ తరం ప్రవాస భారతీయుల్లో ఒకడైన శ్రీధర్, ఘంటసాల గురించి ఇంత అభిమానాన్ని కనపర్చడం చూసి ఎంతో ఆనందపడ్డ శ్రీనివాస్ పరుచూరి, తానే చొరవ తీసుకొని తన మిత్రుడైన రత్నాకర్ శొంఠి చదువుతున్న విస్కాన్సిన్ లిస్ట్ సర్వర్ ద్వారా 1995 ఏప్రిల్‌లో ఘంటసాల మెయిలింగ్ లిస్టుని సృష్టించాడు. నాకు తెలిసినంత వరకు, తెలుగుకు సంబంధించిన విషయాలకు చర్చించుకోవడానికి సృష్టింపబడిన మొట్టమొదటి మెయిలింగ్ లిస్ట్ ఇది. ఈ లిస్టు ఆర్కైవులు కొన్ని ఇప్పటికీ విస్కాన్సిన్ యూనివర్సిటీ ftp సైటులో దొరుకుతాయి. ఈ మెయిలింగ్ లిస్ట్ ఇప్పటికీ యాహూ ద్వారా అప్రతిహతంగా నడుస్తోంది. ghantasala.info సైటు ఈ మెయిలింగ్ లిస్టుకి అనుబంధం.
తెలుసా – తెలుగు సాహిత్యం చర్చావేదిక
“ఇసుక రేణువులో సమస్త విశ్వాన్నీ,
గడ్డి పువ్వులో స్వర్గాన్నీ చూసి,
అరచేతిలో అనంతాన్ని,
ఘడియలో శాశ్వతత్వాన్ని బంధించడం.”
– విలియమ్ బ్లేక్
SCITలో స్పామ్, క్రాస్‌పోస్టుల రణగొణధ్వని ఎక్కువై అర్థవంతమైన చర్చల శాతం తగ్గిపోయిన రోజుల్లో, ఘంటసాల మెయిలింగ్ లిస్ట్ స్ఫూర్తిగా, తెలుగు సాహిత్యానికి సంబంధించిన చర్చలకోసం రామకృష్ణ పిల్లలమఱ్ఱి గారి ఆధ్వర్యంలో తెలుసా ఏర్పడింది. ఘంటసాల లిస్ట్ లాగే, ఇది కూడా విస్కాన్సిన్ యూనివర్సిటీ లిస్ట్ సర్వర్ మీద నడిచేది. అప్పటిదాకా, SCIT లో సినిమాల గురించి, రాజకీయాల గురించి, ఇతరత్రా లోకాభిరామాయణాల గురించి జరిగే చర్చల మధ్య సాహిత్యానికి సంబంధించిన చర్చల్ని వెతుక్కునే సాహితీ ప్రియులకు కేవలం తెలుగు సాహిత్యానికి సంబంధించిన చర్చల కోసమే ఏర్పడిన తెలుసా, అయాచితంగా అందివచ్చిన వరమయ్యింది. ఇరవయ్యొక్క మంది సభ్యులతో ప్రారంభమైన ఈ చర్చావేదిక త్వరలోనే వంద మందికి పైగా కొత్త సభ్యులను చేర్చుకొంది. తెలుగు సాహిత్యంపై చేసే చర్చలు నేరుగా తమ మెయిల్ బాక్సులలో రావడంతో ఈ చర్చలలో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.
స్కిట్ లో ఉన్నప్పుడు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవారందరూ ఒక జట్టుగా మసలినా, సాహిత్యానికి ప్రత్యేకించిన తెలుసా వేదికపై మా మధ్య అభిప్రాయభేదాలు ప్రస్ఫుటంగా పొడచూపాయి. తెలుగు సాహిత్యాభిమానుల్లో సంప్రదాయ కవిత్వం మాత్రమే చర్చించడానికి ఇష్టపడేవారు కొందరైతే, ఆధునిక సాహిత్యం గురించి మాట్లాడని చర్చలన్నీ ఛాందసమని భావించేవారు మరికొందరు. కొంతమంది స్త్రీవాద సాహిత్యానికి అభిమానులైతే, కొంతమంది విరసం సభ్యులు, మరికొందరు సాహిత్యంలో రాజకీయాలు తగవని భావించే వారు. కొంతమందికి ఛందస్సు దాని లక్షణాల వివేచన ముఖ్యమైతే, మరికొందరికి భాషాశాస్త్రం, పదాల వ్యుత్పత్తి మీద ఆసక్తి మెండు. తెలుసా సభ్యులలో కొంతమంది స్వయంగా కవులు, రచయితలు అయినా, చాలా మంది కేవలం సాహితీ ప్రియులు. తెలుగు సాహిత్యంపై ఎన్ని రకాల భిన్నాభిప్రాయలకు తావు ఉందో అన్ని రకాల అభిప్రాయాలు తెలుసా చర్చల్లో వ్యక్తమయ్యేవి. ఇన్ని రకాల అభిప్రాయభేదాలున్నా, సభ్యత వీడకుండా, అద్భుతమైన సమాచారంతో, లోతైన విశ్లేషణతో చర్చలు సాగించడం తెలుసా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.
‘కవిత్వానికి ఛందస్సు అవసరమా?’ అన్న చర్చ మీద తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తం అయిన రోజుల్లో, రోజుకు 70కి పైగానే ఈమెయిళ్ళు వచ్చేవి. మార్క్సిజం గుణదోషాల గురించిన చర్చలో ప్రపంచ రాజకీయాల గురించి, హెగెల్, కాంట్ ఫిలాసఫీల గురించి, నియో మార్క్సిజం గురించి, కాపిటలిస్ట్ ఎకానమీల గురించి ఉన్నత స్థాయి చర్చలు జరిగేవి. ప్రబంధ సాహిత్యంలో శృంగారం పై చర్చ ఈస్థటిక్స్, లాక్షణీకుల సాహితీ సిద్ధాంతాలపై చర్చగా మారేది. తెలుగులో విరామ చిహ్నాల పై చర్చ భాషాశాస్త్ర పరమైన పదవిభజన సిద్ధాంతాల విశ్లేషణకు దారి తీసేది. అయితే, యూజ్‌నెట్ చర్చలలో గాడ్విన్ సూత్రం (Godwin’s Law) లాగా, తెలుసాలో ఏ చర్చ అయినా చాలా రోజులు సాగదీస్తే, అది చివరకు శ్రీశ్రీ-విశ్వనాథల మీద చర్చగానో, ఛందో-వచన కవిత్వాల మీద చర్చగానో పరిణామం చెంది ఆగిపోయేది.
తెలుసా ద్వారా ఇస్మాయిల్, స్మైల్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఓల్గా, జయప్రభ, శివారెడ్డి, త్రిపుర, కనకప్రసాద్, విన్నకోట రవిశంకర్ వంటి కొంతమంది సమకాలీన రచయితల గురించి నేను తెలుసుకోగలిగాను. కవిగా, కథకుడిగా, వ్యాసకర్తగా ఆధునిక సాహిత్యాన్ని, సంప్రదాయ సాహిత్యాన్ని పరామర్శించి విమర్శించగల కె. వి. ఎస్. రామారావుగారి పరిచయం, శాస్త్రీయ సంగీతం గురించి ఓపిగ్గా, వివరంగా రాసే విష్ణుభొట్ల లక్ష్మన్నగారి పరిచయం తెలుసా ద్వారానే జరిగింది. ‘చేరాత’ల ద్వారా చేకూరి రామారావు గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో కొత్తగా వినిపించే కవిత్వపు విభిన్న ధోరణులను, ఆయా కవులను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసినట్టే, వేలూరి గారు ‘ఆధునిక కవితా పరిచయం’ అన్న శీర్షికతో వెలువరించిన వ్యాస పరంపర ద్వారా కొత్తగా వచ్చే తెలుగు కవిత్వాన్ని లోతుగా విశ్లేషించి, ఆయా కవులను ఇంటర్నెట్టు ప్రపంచానికి పరిచయం చేసారు.
శ్యామల రావు తాడిగడప, సదానంద, మాధవ్ తురుమెళ్ళ, జెజ్జాల మోహన రావు గార్ల వంటి వారు సంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ చర్చలు సాగిస్తే, న్యాయపతి శ్రీనివాసరావు, ఉదయ భాస్కర్ నందివాడ, చంద్ర కన్నెగంటి మొదలైన వారు ఆధునిక కవిత్వాన్ని సమీక్షించే వ్యాసాలు రాసేవారు. కథా సాహిత్యం, నవలా సాహిత్యం గురించి జంపాల చౌదరి, నారాయణ స్వామి (నాసీ) శంకగిరి, జగదీష్ బిస, ఆరి సీతారామయ్య మొదలైన వారు తీవ్రంగా చర్చించుకొనేవారు. సాహిత్యానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా ఈ చర్చావేదికలో సమాధానం దొరికేదని ఆ రోజుల్లో అనుకునేవారు. వెల్చేరు నారాయణ రావు, చేకూరి రామారావు, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి పండిత విద్వాంసులు కూడా ఈ గ్రూప్ సభ్యులుగా ఉండి అప్పుడప్పుడు చర్చలలో పాల్గొనడం విశేషం. తెలుగు సాహిత్యంలోని చర్చనీయాంశాలన్నింటిపై తెలుసా చర్చావేదికపై ఏదో ఒకరకమైన చర్చ జరిగి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో! తెలుసా అర్కైవులు భావన సైటులోనూ, యాహూ సైటులోనూ ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఎంతో విలువైన సాహితీ సమాచారం వున్న ఆర్కైవులు తెలుసావి.
అయితే, అంతవరకూ విస్కాన్సిన్ యూనివర్సిటీ లో విద్యార్థిగా చదువుకుంటున్న రత్నాకర్ శొంఠి 1999లో చదువు పూర్తి చేసుకొని ఆ యూనివర్సిటీ వదలివెళ్ళడంతో తెలుసా మెయిలింగ్ లిస్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా, శ్రీనివాస్ పరుచూరి రచ్చబండ అన్న పేరుతో ఒక యాహూ గ్రూపును సృష్టించాడు. దాదాపు తెలుసా సభ్యులందరూ ఈ రచ్చబండకు తరలి రావడంతో, తెలుసా వారసత్వాన్ని పుచ్చుకున్న చర్చావేదికగా రచ్చబండ ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈమాట వ్యవస్థాపక సంపాదక వర్గ సభ్యులు, ప్రస్తుత సంపాదకులు, మరెంతో మంది ఈమాట రచయితలు, పాఠకులు SCIT, తెలుసాల ద్వారా ఒకరికొకరు పరిచయమైన వాళ్ళే. ఈమాట వంటి పత్రికను స్థాపించాలన్న ఆలోచన ఈ వేదికలపై తొలినాళ్ళలో మేము సాగించిన చర్చలలోనే మొలకెత్తిందని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈమాట పత్రిక ఇన్నేళ్ళుగా మనగలగడానికి కూడా SCIT, తెలుసా, రచ్చబండ సభ్యులందరి సమిష్టి కృషే కారణమని చెప్పక తప్పదు. SCIT, తెలుసా, రచ్చబండ– ఈ మూడూ ఈమాట పత్రికా సౌధానికి కనిపించని పునాదులు.