ఈమాట » బోడి పద్యం

Expand to right
Expand to left

బోడి పద్యం

కృతకమయిన పద్యం రాసిన రాత్రి
కంటి రెప్పల్ని ఇనప తాళ్లతో లాగుతారు, ఎవరో, దేనికో!
నిద్రాశిల్పం పగిలి పగిలి
పది ముక్కలవుతుంది
ప్రతీ శకలం వొక వికృతమయిన నవ్వు.
పద్యానికీ నిద్రపట్టదు
నాకు మల్లెనే!

బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప
గుక్కపట్టి ఏడుస్తోంది
నా గంగానమ్మ మురికి వొడిలో.
సూర్యుడి పొద్దుటి నీరెండ చాదర్ కింద
సూఫీ ఫకీరు చేతుల్లోంచి
గజ్జెల దండ రాలిపోయి
దేవుడి నామాలు ఆరున్నొక మూగ రాగాలు.

భజ గోవిందం భజ గోవిందం
నేనెప్పుడూ మూఢమతినే!
పునరపి ఖననం పునరపి దహనం
నేనెప్పుడూ అష్టా వక్ర పద్య పాదాన్నే!

దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
సంస్కార్ విచ్చిన్నం సంసార స్వప్నక్రీడితం
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
నా పద్యంలానే!

సగానికి కూలిన మసీదు గోడల మీద
పడీ పడీ ఏడుస్తున్నాను ఇవాళ్టికీ!
బ్రోచే వారెవరురా, రా…రామా…రామా!
నేను తిరిగిన వూళ్లలో
నువ్వింకా సుంతీ చేయించుకోనే లేదురా!!
నా రహస్యాంగాన్ని పబ్లిగ్గా చూసిన చిన్నప్పటి నించీ
నువ్వింకా ఏడిపిస్తూనే వున్నావు కదరా!
ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా!
ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తురే
నా ఇప్పటి పద్యం కదరా!

కృతకమయిన పద్యం రాసిన రాత్రి
మనసంతా అశ్లీలం!
వొళ్లంతా నెత్తుటిబుగ్గ
ఆ కుండ మీద కూర్చోబెట్టి కోసినట్టే
కుదిమట్టంగా!

 

(43 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    March 1, 2009 8:05 am

    అఫ్సరుడు గారికి. (”వరద” లో కొట్టుకొచ్చిన ప్రయోగం ఇది)
    గురుతుల్యులు లాటి వారు తప్ప మరొహళ్ళు ఈ “బోడి పద్యానికి” టీకా టిప్పణీ ఇవ్వలేరు.
    “సగం దళితం సగం ఖండితం” అంటే?
    “సగానికి కూలిన మసీదు గోడ మీద
    పడీ పడీ ఏడుస్తున్నాను ఇవ్వళ్టికీ” అంటే? ఎందుకూ?
    “ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా” హమ్మయ్య. మిగిలిన ముక్క సంగతి?
    ఈ మాటకి ధన్యవాదాలు.

  2. rama bharadwaj అభిప్రాయం:

    March 2, 2009 3:13 am

    మీ అశ్లీలమైన పద్యం మీ బలవంతపు బాధ లాగే..బోడి గా ఉంది.

    రమ.

  3. Lakshmi Kallakuri - 'Sailakshmi' అభిప్రాయం:

    March 5, 2009 7:39 pm

    పేరు వచ్చిన వాళ్ళు ఏ మాట రాసినా చెల్లుతుందని ‘ఈ మాట’ వాళ్ళు ప్రచురించడము ఏమీ బాగలేదు. మాటలన్నిటిని మురికి చేసి కుండ మీదబెట్టి కోసి ముక్కలు చేసి నెత్తుటితో దహనము చేసి సూపీని, గంగానమ్మని, గాయతృలను బిస్మిల్లా అంటూ వక్రంగా ఖననము చేస్తూ మూఢమతిని అంటే మెచ్చుకోవాలా?
    ‘సాయిలక్ష్మి’

  4. bollojubaba అభిప్రాయం:

    March 6, 2009 5:56 am

    ఈ కవితలో మంచి ఇమేజెస్ ఉన్నాయి.

    కృతకమయిన పద్యం రాసిన రాత్రి
    కంటి రెప్పల్ని ఇనప తాళ్లతో లాగుతారు, ఎవరో, దేనికో!

    బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప
    గుక్కపట్టి ఏడుస్తోంది

    పద్యానికీ నిద్రపట్టదు
    నాకు మల్లెనే!

    పునరపి ఖననం పునరపి దహనం

    అశ్లీల నీడలు కవితలో తారాడుతున్నా, గొప్ప కవిత్వ కాంతి ధారలో అవి మరుగున పడినట్లు తోస్తోంది.

  5. baabjeelu అభిప్రాయం:

    March 6, 2009 7:24 am

    పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.

    పై కవిత్వంలో “ధార” ఎక్కడుందీ?????

    “(వెర్రి) పీర్లనీ, సంపాదకులనీ దాటుకుని” అశ్లీల నీడలు తారాడుతున్న ఈ గొప్ప కవితాధార” ఇక్కడెలా “లీకు” అయిందీ?

  6. bollojubaba అభిప్రాయం:

    March 6, 2009 8:09 am

    బాబ్జీలు గారు దుడ్డుకర్ర పుచ్చుకొని కూర్చుంటే నేనింకేం మాట్లాడగలనూ.

    నే పైనుటంకించిన ఇమేజెస్ నే మంచి కవిత్వ ధారగా భావించాను.

  7. M.S.Prasad అభిప్రాయం:

    March 17, 2009 3:40 am

    కవిగారే పెట్టిన పేరుకన్నా దీనికి వేరే అభిప్రాయం అనవసరం. ఐతే దీన్నిపద్యం అనడానికి నాకు మనస్కరించటం లేదు. మాత్రా ఛందస్సో లేక వృత్త ఛందస్సో కలిగి ఏ పాదం ఎందుకు ఎక్కడ ఎలా ఆపాలో అనే దానికి విస్ఫష్ట మైన నియమాలు కలిగిన పద్యం అనే సాహిత్య ప్రక్రియకీ దీనికీ ఒకే పేరు తగునా అని సందేహం. బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప అనే పాదంలో “పాప” దగ్గర నెందుకువిరిచారో అవగతం కాలేదు. కవితలో కవి హృదయం గానీ ఉద్దేశం గానీ జటిలమైన ప్రహేళిక అనిపిస్తోంది. నాకైతే అర్థం కాలేదు మరి.

  8. యుగంధర్ అభిప్రాయం:

    March 17, 2009 6:25 am

    అంతగా పంచెలెగ్గట్టి చెమడాలెక్కదియ్యడానికి ఇక్కడ ఏమైందో అర్ధం కాదు. “మనసంతా అశ్లీలం” అనే వాడుక తప్ప వేరే అశ్లీలం ఏముందో కూడా అర్ధం కాదు. బైదవే, పుంజీడు వాగుడు కాయలు విమర్శకుల్ని చెయ్యవు.

  9. surya అభిప్రాయం:

    March 18, 2009 6:33 am

    అంటే వ్యాఖ్య రాసిన వాళ్ళందరూ వాగుడు కాయలన్న మాట. అయినా ఈ మధ్య ఈ మాటలో ఇలాంటి moral policing వాగుడు అధికమవ్వటం బాధాకరం.

  10. baabjeelu అభిప్రాయం:

    March 19, 2009 10:20 am

    యుగంధర్ గారూ, సూర్య గారూ,
    వాగుడు కాయల్నీ, moral police ల గురించీ అభిప్రాయాలు రాసే బదులు పై పెట్టె లో నున్న కవితాత్మను ఆవిష్కరింపచేయొచ్చు కదా? గరికపాటి వారు బాధపడ్డది ఇలాటి అభిప్రాయాలపై అభిప్రాయాలకే అనుకుంటాను. ఇయన్నీ వొగ్గేసి పైనున్న బోడి పద్యం మీద ఏటైనా సెప్పండి. అప్పుడు వాగుడుకాయలూ, “మోరల్” రక్షకభటులూ సిగ్గుపడిపోయి, తప్పైపోనాదని లెంపలేసుకుని బుద్దిగుంటారు.

  11. యుగంధర్ అభిప్రాయం:

    March 20, 2009 6:32 am

    బాబ్జీలు మొషోయ్,
    I quote your words: “పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.” ఇవి బాబాగారి అభిప్రాయమ్మీద తమరుగారు వెలువరించిన అభిప్రాయం కాదా? ఇట్టాంటి పుంజీడు వ్యాఖ్యల్ని చూస్తే గరికపాటి వారికి బాధ కలగదా?

    అయినా కవితాత్మని ఎవరో ఎందుకు ఆవిష్కరించాలి? కవి చెప్పాల్సింది చెప్పాడు. ఆవిష్కరించాల్సిందేదో ఆయనే ఆవిష్కరించాడు (దాచి ఉంచాల్సిందాన్ని చూపించేశాడనే గదా, అస్లీలం అని మొత్తుకునేది జనాలు). ఆ ఆవిష్కరించింది ఆత్మకాదు, అది దెయ్యం బూతం పిశాచం అని కొందరు సహృదయులు సెర్టిఫై చేసేశారు గదా. తమరుగారికి తృప్తికాలేదా? హబ్భే, మీరనవసరంగా దాన్నొక కొరివిదయ్యమని భయపడుతున్నారు, అది ఒక దీపమే అని చూపించడానికి ప్రయత్నించిన బొల్లోజుబాబా మీద పుంజీడు పేణ్ణీళ్ళు చల్లింది తమరుగారు కాదా? ఇంకా యేల ఈ ఆత్మల వేట?

    [ఈ కామెంట్ ఎడిట్ చేయబడినది - సం.]

  12. జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    March 21, 2009 5:18 am

    “జాగ్ నీకీ రాత్” అనే కవిత్వం గుర్తుకువచ్చింది
    కళ్ళలో సూదుల్లా గుచ్చుతున్న నిద్రలాంటి కాలాన్ని ఓపుకుంటూ గడుపుతున్న సందర్భం
    నిద్రపోని అనేక సంఘటనలు ఎదురౌతూనేవున్నాయి

    ఇంకొంచెం విస్తృతంగా రాయాలేమో!

  13. baabjeelu అభిప్రాయం:

    March 21, 2009 8:39 am

    యుగంధర్ మహాశయా!
    కందపద్యములూ, సీస పద్యములూ వ్రాయగలిగిన మీరు ఈ వచన కవిత గురించి ఎందుకు వ్రాయరు? మిగిలిన శీర్షికలలో చక్కని అభిప్రాయములు వ్రాసిన మీరు ఇచ్చట ఎందుకిటుల వ్రాయుట? మొదటి అభిప్రాయము నాది. అందు నాకవగతమవని వాటిని గురించి అడిగితిని. కవి గారెటూ జవాబివ్వజాలరు. కవితని ఆనందించి, అనుభూతించి అనుభవించిన వారుకూడా కవితని విపులీకరించకపోవడం మా దౌర్భాగ్యం. బొల్లోజుబాబా గారి అభిప్రాయమునకు జవాబుగా నాఅభిప్రాయమందు “ధార” గురించి ప్రశ్నించితిని. ఆయనా తదుపరి మీరునూ కవిత గురించి తప్ప మిగిలిన విషయముల గురించి విశ్లేషించినారు. మీరన్నట్టు కవిగారు రాసేసి జనం మీదకొదిలేస్తే సరిపోదు. ప్రతీ కాళిదాసుకీ ఓ మల్లినాథ సూరి వుంటేనే కాని కుదరదు. “అఫ్సరుడు” (మళ్ళీ వరదలో కొట్టుకొచ్చిన ప్రయోగం”) గారికి మీరో, సూర్య గారో మల్లినాథ సూరనుకుని అడగడం నా తప్పు. క్షమించండి. ఇదే “అఫ్సరుడి” గారి కవిత ఈ మధ్య సోమవారం సాహిత్య పేజీల్లో పడింది. అది లక్ష రెట్లు నయం ఈ బోడి పద్యం కన్నా. బహుశా ఈ బోడి పద్యం ఈమాట కోసం ప్రత్యేకించి రాసేరేమో? One more thing whoever punches some trash in this area are not critics. అభిప్రాయాలు రాసే వారు విమర్శకులు కారు. అంచేత పుంజీడు అభిప్రాయాలు పుంజీడు విమర్శలు కాదు. “మీ అభిప్రాయం తెలియ చేయండి” లో అభిప్రాయం తెలియచేయడం ఎందుకు? ఎవర్నుధ్ధరించడానికి? తెలుగు భాషనుధ్ధరించడానికా?

  14. rama bharadwaj అభిప్రాయం:

    March 21, 2009 10:16 pm

    బాబ్జీలు గారూ!! మీ చురుకుంది చూసారూ..భలే సర్దా లెండి. యుగంధరులే కాదు..తిమ్మరుసులూ ఉన్నారని చెప్పిన ట్టుంటుంది. “వరద” అంటే అబ్బూరి వరద అని చెప్పండి. అప్సరుడు[absurd], అన్న pun ఆ తిక్క..ఆయనవే!! ;))

    రమ.

  15. vineet అభిప్రాయం:

    March 22, 2009 7:49 pm

    మంచి ఉచ్చ స్థాయిలో ఉంది పద్యం. “మొండి గోడల” కేసులో రాముణ్ణి నిలబెట్టి కడిగేయడం బాగుంది. అదే జిహాదీ కేసులనుకోండి, అక్కడ “ఉగ్రవాదులకి మతం లేదు”. ఇంకో వింత ఏమిటంటే విమర్శకులు ఇసుమంటి బోడి పద్యాల్లో “కవిత్వ ధార” నే ఆనందిస్తారు. విషయం జోలికి పోకుండా. బాగుంది ట్రెండు.

  16. sarma rallapalli అభిప్రాయం:

    March 24, 2009 6:27 am

    రమ గారు:

    ఈ కవిత ఒక ముస్లిం రాయబట్టి అతని పేరు మీద పన్ చేస్తున్నారా? అఫ్సర్ని అఫ్సరుడు అనీ, absurd అనీ అనడం, ఆ తిక్క కి మీరు చంకలు కొట్టుకోవడం ఎలాంటి సంస్కారం?
    శర్మ రాళ్ళపల్లి

  17. Mandava Ravibabu అభిప్రాయం:

    March 24, 2009 11:44 am

    అయ్యా వినీతుల వారూ:

    విషయం జోలికి పోవాలనే ఈ పద్యం చెబుతున్నదేమో! కొంచెం ఆలోచించండి.

    విషయంలోకి వెళ్ళడానికి భయపడె పైన రాసిన బాబ్జీలూ, రమాప్రభలూ గట్రా బాబోయ్ అశ్లీలం అని అసింటా జరిగారు. కవిత్వం పేరుతో అకవిత్వాన్ని, సౌందర్యం , రసం పేరుతో కృత్రిమ పదాల లాలిత్యాన్ని పఠాభి లాంటి కవులు ఈసడించుకున్నారా? లేదా? దిగంబర కవులు ఇంకా ‘అశ్లీలాన్ని’ గుప్పించ లేదా? స్లమ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ మలాన్ని పరదేశీ ఎవడొ మన ఒంటి మీద పూసేసినప్పుడు చూసి, ఆస్కార్లు ఇచ్చామా లేదా?

    మన లోపల ఎన్ని అశ్లీలాలు వున్నాయో అవన్నీ ఇంకా కవిత్వంలోకి రావాల్సిందే….గుజరాత్ లాంటి చోట్ల ముస్లిం ఆడవాళ్ల మీద హిందూత్వ వాదులు వేసిన కరపత్రాలు ఒక సారి చదూకోండి. అశ్లీలం అంటే ఏమిటొ తెలుస్తుంది.

    రవి బాబు

  18. ప్రవీణ్ అభిప్రాయం:

    March 24, 2009 2:24 pm

    రాళ్ళపల్లి గారూ, ఈ బోడి పద్యం రాసింది ముస్లిం అని అందరికీ గుర్తు చేస్తున్నారా? ముస్లిం అయితే ఆయన పేరు మీద పన్ చెయ్యకూడదా? ముస్లిం కాబట్టి ఈ కవితకి కొంచం వెయిట్ ఎక్కువ ఇవ్వాలా?

    మండవ రవిబాబు గారూ, గుజరాత్ లో హిందుత్వ వాదులు వేసిన కరపత్రాలూ ఈ కవిత్వం ఒకటే అంటారా? అది హిందుత్వ వాదులు గుజరాతులో ఇచ్చే కరపత్రమైతే ఇది హైదరాబాదు పాతబస్తీలో ఇచ్చే కరపత్రమా? కరపత్రమైతే కవిత్వం అని ఎందుకూ అనడం?
    ఈ కవిత ఏ ‘విషయం’ చెప్తోందని మీరు అనుకుంటున్నారో కొంచం వివరిస్తారా? తెలుసుకోవాలని ఉంది. మీరు వివరిస్తే, అసలు విషయం జోలికి పోయి చర్చించడానికి నేనూ, ఇంకా చాలామందీ సిద్ధంగానే ఉన్నాం.

    మన లోపలి అశ్లీలాలన్నీ కవిత్వ రూపంలో బయట పెట్టుకోడానికి ‘ఈమాట’ అనుమతిస్తే నేను కూడా పుంఖానుపుంఖాలుగా కరపత్రాలూ, కవితలూ రాయడానికి సిద్ధంగానే ఉన్నాను. సంపాదకులవారూ, ఓకేనా?

  19. teresa అభిప్రాయం:

    March 24, 2009 3:18 pm

    ఈ పద్యాన్ని మొదట చదివి ” బాగుంది, విభిన్నమైన థీమ్ కి పద్య రూపమిచ్చారు . టైటిల్ లో కవి sense of humor తొంగిచూసింది’ అనుకున్నాను. ఒక్కొక్క కొత్త కామెంట్ వస్తున్నప్పుడల్లా మళ్ళీచదివాను. అశ్లీలము,,ఈమాటలో ప్రచురణకి అనర్హమూ అని ఎందుకనిపించిందో నాకు అర్థం కాలేదు. కవి పేరు మీద వ్యంగ్య విమర్శలు, విసుర్లూ చూశాక పద్యంలో లేని అశ్లీలత, కుసంస్కారం కామెంట్ల లోనే కన్పించి నవ్వుకున్నాను. అస్తమానూ వాగుల్నో, వంకల్నో, చంద్రుడినో, సూర్యుడినో వర్ణించే కవితలే గాక వైవిధ్యంగా ఈ ‘బోడి పద్యం’ ని అందించిన ఈమాట కి అభినందనలు.

  20. lyla yerneni అభిప్రాయం:

    March 24, 2009 3:22 pm

    అఫ్సర్ రచించిన ‘బోడి పద్యం’ నుండి:

    …ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తురే
    నా ఇప్పటి పద్యం కదరా!..”

    “..వొళ్లంతా నెత్తుటిబుగ్గ.. ”

    Ouch! Is there a doctor in the house!

    It is some time since I had the bliss of attending a ceremony of ‘Bris Milah.’ How do/should individuals feel at this ceremony? Depends. If బోడి పద్యం = circumcised penis, how should one feel viewing it, in a mixed gathering? Depends.:-)

    The poet/poem draws you into a little fight, right from the time you lay your eyes on the title. ( Great heading. ) On first reading, the poet/poem repels you. You turn away. Then a nasty suspicion springs up. Perhaps the poet is making fun of you. Thus provoked, one can’t help but come back and ask - what the hell do you mean, Sir? What are you saying? Who are you laughing at?

    So one re-reads, and having read;
    the reader would then want to comfort himself thinking - No, the poet would not dare laugh at any one of us, our poetry, our lives. No. It is a self portrait. The poor bugger - he is upset with himself. Upset with his own act of writing an artificial, a contrived poem. That kind of an atrocious act does not seem to sit well with him. It bothers the poet -like AIG ’s grotesque existence bothers US Fed Chairman Bernanke. It makes him lose his sleep.

    But such simple consoling thought may not suffice. To get the poem out of his system, the reader reads the poem again.

    The reader then muses - The poet is a teacher of literature. He reads lot of poetry of his own students. He reads lot of other poets all over the world, which puts him in the difficult position of being a judge. It perhaps thrusts a responsibilty on him of setting standards for others on how a poem ought to be. Tough job. Nerve racking. Enough to make him smash the silly poems against the walls.

    And, one such horrid artificial poem breaks into thousands of pieces. Look! Each piece creates a broken image. Look! multiple discordant images are lying all over the place. Each broken stanza, oh! even more painful - each broken sentence, phrase, - sings a different song. For Heavens sake! , the pieces do not even sing in one language. There is no one cohesive religious tune. Not one unified theme . Not a single consolidated thought. Nothing makes any sense.

    Surely, such smattered, loudly laughing, poetry pieces makes one restless. Agitated. Their ugliness makes one feel unholy, vulgar and unsanitary. Just like the clashing images of a corporate jet landing in Washington to borrow people’s money. And President Obama’s Airforce One taking off to get to Jay Leno’s late night show to crack jokes to make people laugh. The bank CEO waves thru the window, ( muttering under his breath ” What a joker”) The CEO of USA wags his sturdy index finger and says “Shameful!”

    The onlookers of such images feel unholy, అశ్లీలం all over again , knowing surely they are into new kind of trouble. Yes, Sir! All such imagery, in Afsar’s poem makes the reader, (Me,) unwillingly, disgustedly see - the broken pieces of clashing cultures, trans-racial marriages, transplanted lives, superimposed philosophies, mixed beliefs, mutilated languages, mangled words, cacophonic music, smashed architecture, mashed bodies. In essence , the tormented human spirit. Ouch! ouch!! Jesus! It hurts.

    The sudden outburst of pent up anger released by the poet in the last but one verse -the helpless fury is seen and heard. As vividly as in ‘ The Scream’ of Edvard Munch.

    And after the spent fury of mass human spirit, to see the consolidated final image of one small helpless child -molested, humiliated in public. -left to himself, feeling unholy. Left in a bloody mess, in the very last verse of poem. Allah mia! How it hurts!

    Yes, I like the opening image of a great giant sleeping adult to whose eye lids iron chains are attached and pulled. And the statue breaking. Quite interesting.
    Yes, I like the end image of a submissive infant/ male child sitting on a overturned clay pot - holding a small frail penis in one hand, and a piece of skin in another hand - bleeding from both. Quite interesting.

    If you are an artist, let it bleed. Let it bleed. By all means. Cry all you want.
    But, if you are a doctor, for God’s sake , why such agony over a few words? Really, it is teensy bleeding which can be easily stopped and after all, excised prepuce is a tiny piece of useless skin.

    Not that I mind seeing the naked glans penis -బోడి పద్యం, at all. Do I like it?:-) Not any less than the unruly, wild Siva’s gigantic erectile penis, peeing /ejaculating on every sage who is in his way, in దేవదారు వనము. :-)
    I like reading and writing such a రేచిక్క / testy poem sometimes. It all depends on my mood.

    లైలా

  21. Ravikiran Timmireddy అభిప్రాయం:

    March 25, 2009 7:42 am

    అశ్లీలం గురించీగొడవేవిటి. కవిత నచ్చిందో, నచ్చలేదో అంటే సరేగానీ, కవిత అశ్లీలవటవేవిటి? అలా అనేవాళ్ళు ఎందుకో కూడా చెబుతే బాగుండేది. రహశ్యాంగాన్నో (ఏవిటో అందులో అంత రహశ్యం), దానికి జరిగే వొక ప్రక్రియనో అశ్లీలవని అనగలవా? పోనీ అంత అభ్యంతరవనుకుంటే ఆ కొన్ని పదాల్ని పరాయి భాషలో అనుకోని చదివేసుకుంటే సరిపోతుంది కదా. ఆ పదాల్ని మాత్రం చక్కగా, ఏ ఆంగ్లంలోనో, సంస్కృతంలోనో అనువదించేసుకుని చదివేస్తే అసలు బాధే లేదు. ఆ భాషల్లో ఈ అశ్లీలవైన(?) పదాలు, ప్రక్రియలు చదవడం మనకి అలవాటే కదా.

    ఇప్పటికి నేనో అరడజను సార్లు చదివేనీ కవితని, నాకేం బోధపడలా కవితాత్మో, కవితార్థవో దాన్ని మీరేవన్నా సరే. కవిత్వంలో abstraction అవసరవే. కానీ దాన్ని వొక పెయింటింగ్ స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం వుందా? మనిషి మెదడుకి రంగుల చిత్రాలు, పద చిత్రాలు అర్థవయ్యే తీరు వేరు, వేరని నా అభిప్రాయం.

    పెయింటింగ్ ని కళ్ళతో చూడంగానే మనసులోకి దూకే ఆ పచ్చి ఎమోషనల్ abstraction, కవితని చదివి దాన్ని అర్థం చేసుకుని అనుభూతించగలిగే ప్రక్రియ వేరు వేరని నా అభిప్రాయం. నక్కని చూసి వాతలు పెట్టుకున్నట్టు, అవకాశం ఉందికదా అని, భాషకున్న (పెయింటింగ్ కి లేని, అందుకనే పెయింటింగ్లో ఆ abstraction అవసరవేవో) ఒక విసృతవైన వ్యక్తీకరణని ఉపయోగించుకోకుండా మామూలు మనుషులకి అర్థంకాని కవిత వల్ల ఉపయోగవేవిటి. పోనీ ఆ కవిత వ్రాసిన వారో, లేకపోతే ప్రచురించిన సంపాదకులో ఆ కవితతోబాటు ఆ కవితార్థాన్ని కూడా ప్రచురించుంటే బాగుండేది.

    సాధారణ ప్రచురణలకి లేని ఒక గొప్పతనం వెబ్ ప్రచురణలకుంది. ఇక్కడ కవిత, కథ, వ్యాస కర్త తన అభిప్రాయాల్ని పాఠకులతో ఏక్టివ్ గా పంచుకునే అవకాశం వుంది. I do not know the reason why, here in “eemaata” writers, most of the times do not participate in the debate. Though they are the instigators of the debate by mare act of writing that poetry, story, or an essay, they shy away from the debate. Many times even our editors do the same. I hope they utilize the opportunity of this facility, and participate in this live discussion and help readers like us to a better understanding.
    మరో విషయం అభిప్రాయలు రాసే వాళ్ళ పేర్లతో ఆ ఆటలేవిటండి. పేర్లను వక్రీకరించినంత మాత్రాన ఒరిగేదేవిటి.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  22. bollojubaba అభిప్రాయం:

    March 25, 2009 8:18 am

    ఎర్నేని గారి అభిప్రాయాన్ని ఇప్పటికి నాలుగు సార్లు చదివాను.

    ఒక కవితపై సైకో/సోషియో అనాలిసిస్ ఇంత అద్బుతంగా చేయవచ్చునని అర్ధంచేసుకొన్నాను. గొప్ప విశ్లేషణ.

    (అక్కడక్కడా అమెరికా ఉటంకింపులు కొంచెం ఇబ్బంది పెట్టాయి, వాటి బాక్ గ్రవుండ్ తెలియక :-) ).

    ఈ కవితపట్ల ఆమె వెలిబుచ్చిన అభిప్రాయలతో నూరు శాతం ఏకీభవిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  23. Ravikiran Timmireddy అభిప్రాయం:

    March 26, 2009 7:18 am

    బొల్లొజు బాబా గారు,

    ఈ కవిత, అఫ్సర్ గారు కాకుండా, ఏ రవికిరణో, బల్లోజు బాబా గారో, లేకపోతే మరొకరో వ్రాశారనుకోండి, అప్పుడు కూడా మీరు, ఏర్నేని గారు ఈ కవితని ఈ రకంగానే అర్థం చేసుకునుండే వారా?

    “The reader then muses - The poet is a teacher of literature. He reads lot of poetry of his own students. He reads lot of other poets all over the world,” రచయిత గురించి ఈ విషయం తెలియకపోతే బహుశా కవితకి ఈ కవితార్థం మనసుకి వచ్చుండదేవో!

    నిజంగా ఈ కవిత “Look! Each piece creates a broken image. Look! multiple discordant images are lying all over the place. Each broken stanza, oh! even more painful - each broken sentence, phrase, - sings a different song. For Heavens sake! , the pieces do not even sing in one language. There is no one cohesive religious tune. Not one unified theme . Not a single consolidated thought. Nothing makes any sense,” అఫ్సర్ గారు కాకుండా మరొకరు వ్రాసుంటే పైన ఉదాహరణతోనే ఆఖరయ్యుండేదేవో, ఆలొచింఛారా.

    లైలా గారి అబిప్రాయం తప్పని చెప్పటం నా ఉద్దేశం కాదు. అఫ్సర్ గారి పేరు, ఆయన యు.టి ఆస్టిన్ పేరు ఈ కవితలోకి విస్తరించాయెమోనని నా అనుమానం, అంతే.

    నాకైతే, ఈ కవిత చాలా బోడిగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది.

    ఒక మతాచారం బ్లిస్ అని అనుకున్న తర్వాత దానిమీద మరోరకవైన అభిప్రాయం ఎలా వీలవుతుంది లైలా గారు?

    “By all means. Cry all you want. But, if you are a doctor, for God’s sake , why such agony over a few words? Really, it is teensy bleeding which can be easily stopped and after all, excised prepuce is a tiny piece of useless skin.” కదా కవి అయినంత మాత్రాన “If you are an artist, let it bleed. Let it bleed” అనేది హిపాక్రసి నేవో.

    రవి

  24. sarma rallapalli అభిప్రాయం:

    March 26, 2009 8:39 am

    అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.

    ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
    దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం

    అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
    మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.

    మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
    సగం దళితం సగం ఖండితం

    పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.

    ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
    ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
    రాళ్లపల్లి

  25. sreelata raavuri అభిప్రాయం:

    March 26, 2009 11:56 am

    http://www.pranahita.org/2009/03/nallanallani_navvu/

    ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
    ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
    ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
    ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
    ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?

    శ్రీలత

  26. Shankar అభిప్రాయం:

    March 28, 2009 6:33 am

    బాగుంది. నేను బాగుందన్నది ‘బోడిపద్యం’ కవిత గురించి కాదు. ఆ కవిత మీద జరుగుతున్న చర్చ గురించి. వారపత్రికల్లో, దినపత్రికల సాహిత్యానుబంధాలలో కనిపించే కవితలను ఒకటి, రెండు లైన్లు చదివి నచ్చితే చివరంటా చదవడం, లేకుంటే వదిలేయడం ఆ తర్వాత మరచిపోవడం ఇదీ ప్రస్తుత (నా) పరిస్థితి. కాని కవితల గురించి ఇంత విస్తృతంగా, సాధికారంగా, సమర్థంగా, సమగ్రంగా చర్చ కొనసాగడం చాలా బాగుంది. తెలుగు భాష, తెలుగు కవిత్వం, సాహిత్య విమర్ష కలకాలం సజీవంగా ఉంటాయన్న నమ్మకం కలిగింది. అందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  27. ravinder posani అభిప్రాయం:

    March 28, 2009 8:56 am

    http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=22306&subcatid=3&categoryid=1

    బాబ్జీలు గారు:

    సోమవారం పేజీలో అఫ్సర్ గారి ఈ కవితనే మీరు ఉదాహరణ గా ఇచ్చారు. చాలా ధన్య వాదాలు. మీరు లింకు ఇచ్చి వుంటె బాగుండె. వెతికి పట్టె సరికి ఆలస్యం అయ్యింది. అయినా, మంచి కవిత కోసం ఆ మాత్రం శ్రమ పడాల్లెండి.

    ఇందులో కూడా కవి ‘నా యబ్బ ‘ అనే సంబోధన ప్రయోగించారు. అది అశ్ల్లీలమా కాదా అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ‘నా యబ్బ’ అనకుండా ‘ నా తల్లి’ నీ అమ్మ’ అని వుంటే ఈ కవిత అశ్లీలం్ అయ్యేదా?

    అమెరికా ఆర్ధిక మాంద్యం మీద ఇంకా ఏమయినా కవితలు వస్తే, దయచేసి, ఎవరయినా చెప్పండి. తెలుగు కవులు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. నిజానికి ‘బోడి’ (అంటే నిరలంకార -నిరాడంబర - అతి సాధారణ అని నాకు అర్ధమయింది) పద్యాలు ఆ విషయం మీద ఒక ఇంకా రావాలి, మీలో కసి, ఉద్వేగం అనేవి వుంటే. తెల్లారి లేచి, మీరు అదే పనిగా కాగితాలు, ఈ మాట స్పేసూ ఖరాబు చేసే బదులు ఒక శీలవంతమయిన పద్యం రాస్తే బాగుంటుందేమో చూడండి.
    రవీందర్

  28. యుగంధర్ అభిప్రాయం:

    March 29, 2009 9:34 am

    ఈ పద్యమ్మీద లైలా, రాళ్ళపల్లి శర్మ, రావూరి శ్రీలత గార్లు చేసిన వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నా.
    ఏదో నాలుగు వరద తరగల్లో కొట్టుకుచ్చిన భాగ్యానికి తెలుగుకవిత్వమంతా మాకు తెలుసు, ఈమాటకొస్తే మాకే తెలుసు అని మిలట్రీకవాతు విద్వాంసుల పుంజీడు రణగొణధ్వనులు వినీవినీ వేసారిన ప్రాణానికి మీ వ్యాఖ్యలు హాయిగా ఉన్నాయంటే నమ్మండి.
    అదలాగుండగా, పైన రవికిరణ్ గారు లేవదీసిన కొన్ని ఆసక్తి కరమైన ప్రశ్నలకి రాళ్ళపల్లి గారి వ్యాఖ్య మంచి సమాధానమిస్తోంది.
    శ్రీలతగారు కూడా అడగాల్సిన ప్రశ్న అడిగారు. శ్రీలతగారూ, నాకు ఇంకో ప్రశ్న తడుతోందండీ - ఒక కవి విభిన్నమైన, ఆలోచనల్ని, పరస్పరం విరుద్ధం కాకపోయినా కొంత విభేదించే ఆలోచనల్ని రాయడం మరీ అంత విడ్డూరమంటారా?

  29. narsimha అభిప్రాయం:

    March 30, 2009 10:40 am

    ఈమాట్లో కయిత్వం చదువుడు నాకూ, మా దోస్తుల్కూ ఆదతు పళ్లేదు. పూల్ గురించి, పూబోడుల గురించీ, పిరుదుల గురించీ, అమ్మాయి కోసమో, అబ్బాయ్ కోసం రాసిందో తెలియని నయా భావ కవిత్వం జర ఎక్కువ. ఈ మాట కయితల్లో. అమెరికా వెళ్లి సనాది వారాలు ఆంధ్రా యాదొచ్చి, అ ఆలు నేర్చుకుని రాసే వోళ్లు ఈడ మస్తుగా కనిపిస్తరు.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    పని మాల సదివిన. నాకయితే ఇంక కడక్ చాయ్ లాగా రాసుండాలన్పించింది. చాయ్ పత్తా జర తక్కువయింది కదన్నా! ఇంకా జోరుగా మాటలు పడాలన్నా! ఇంకా ఇలాంటి కయితలు రావాల. తెల్ల పొగరు అణగిపోవాల. ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    నర్సింహ

  30. Srinivas Nagulapalli అభిప్రాయం:

    March 31, 2009 6:31 am

    నర్సింహన్న మాటలు చాన్నాళ్ళకింద ఆల్ఫా హోటల్్ కాడ చాయ్్ తాగినట్లనిపించింది. సుట్టుపక్కల ఎవరి మాటలు వారివి. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కప్పు సాసర్ల చప్పుడు, ఆటోరిక్షాల అరుపులు, సిగరెట్ల కంపులు, అయినా దిల్ ఏక్దం ఖుషీ! ఆ చాయ్ లెక్క ఏ చాయ్ లేదు.

    “తెల్ల పొగరు” అంటే సరిగ్గా ఎరుకగాలె. రంగు తక్కువయితే మాత్రం పొగరు తక్కువయితదా అనిపించింది.

    “సగం కూలిన మసీదు గోడలు” అన్న లైను కూడా కొంచెం అర్థం కాలేదు.
    నమాజు చేసేచోటే మసీదు. నమాజు లేకుంటే మసీదెట్లయితదో తెలవదు.
    అట్లనే ప్రార్థనచేస్తే మందిర్్ కాని, పంచాయితీ చేస్తే అయితదా అనిపించింది.
    చిన్నప్పుడు కవిత్వం చదవాలంటే భయమయితుండె, అర్థం కావేమో అని. ఇప్పుడు కూడా భయ మయితది, ఎక్కడ అర్థమయిపోతదేమో అని.
    ========
    విధేయుడు
    -Srinivas

  31. ravikiran timmireddy అభిప్రాయం:

    March 31, 2009 8:12 am

    రాళ్ళపల్లి గారు,

    నెల్లూరులో పుట్టి పెరిగిన వాడిని, మస్తాన్ రెడ్లు, రసూలమ్మలు బంధు వర్గంలో వుండటం నాకనుభవవే. అయితే ఒక కవితని చదివినప్పుడు, ఫలాని మతవో, కులం గురించి ప్రస్తావన అవసరవా?

    మీకు కవిత ఎందుకు నచ్చిందో మీరు చెప్పేరు, ఆ వివరణతో నేనీకభవించకపోయినా, కనీసం మీరు చెప్పేరు, నేల మీద నిలబడి, అందుకు నా ధన్యవాదాలు.

    ఇంకా “ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది.” అన్నారు. నిజవే, అందరి బతుకుని సృశించడం వీలుకాదు, కానీ పదుగురి బతుకుని సృశించి, పదుగురు స్పందించేవిధంగా వ్రాస్తే మరింత బాగుంటుందికదా, కాదంటారా.

    రవి

  32. baabjeelu అభిప్రాయం:

    March 31, 2009 9:26 am

    నర్సింహ గారూ,
    పని మాల సదివిన కవిత్వం గురించి ఒక్కముక్కకూడా రాయలేదు మీరు.
    తెల్ల పొగరు అణిగిపోయేట్టు ఈ “బోడి పద్యం” దేని గురించో రాయరూ, దయచేసి.
    అక్షరలక్షలు చేసీ ముక్కొహటి అన్నారు, ఈ మాట ఎడిటర్ల గురించి “అనాడీ” లు కారని. సంతోషం. మిగతావన్నీ పక్కనబెట్టి పైనున్న కవిత్వం లో ని విశేషాలగురించి రాయండీ. దెబ్బకు ఠా దొంగలముఠా అయిపోతుంది.

  33. యాద్గిరి అభిప్రాయం:

    March 31, 2009 12:02 pm

    అన్నా నర్సిమ్మన్నా, మస్తుగ రాసినవే.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    గీ లొల్లి పడుడేందే? మా ఊళ్ళ లొల్లి జేస్తరు. ఇంకొన్ని ఊర్లళ్ళ గొడవ జేస్తరు/పడ్తరు. నీ బాస జరింత అటీటు గాకుండుంది. నువ్వు అ,ఆలు ఏడ నేర్సినవే?

    తెల్ల పొగరు అణగిపోవాల.

    గీడ తెల్లోల్లెవరె? ఎప్పుడో మనదేశం ఇడిసిపెట్టిండ్రు గదనే. కొంపదీసి గీ కైత అమ్రికోళ్ళ మీదన యేంది?

    ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    ఈమాటల కైతలు ఏడిటర్లు రాయరె నర్సిమ్మన్నా. శనాది వారలల్ల అ,ఆ,ఇ,ఈ లు నేర్సినోల్లే రాస్తరే. ఎడిటర్లు ఎస్కోవల్నా లేదా అని డిసైడ్ జేస్తరు. నీకేం సమజయిందో నాకైతే సమజ్ గాలె.

    సల్లగుండు మరి.
    యాద్గిరి

  34. ravikiran timmireddy అభిప్రాయం:

    March 31, 2009 2:29 pm

    నర్సింహ గారు,

    పూలు, పూబోడులు, పిరుదులు మీకొంటబట్టవని చెప్పేరు గానె, ఎవరిష్టం వాళ్ళది దానికెవరేం జేస్తాం దేనికైనా అదురుష్టవుండాల. మీరోరంలో ఏడ్రోజులు దిద్దుతారా అ, ఆలు. మీ మందల మీరు జెప్పేరు, మీ దోస్తుల మందల కూడా మీరే జెప్పాలా, ఏంది వాళ్ళకి అ,ఆ లు దిద్దడం ఇంకా వొగదెగలా?

    శానరోజులకి ఈమాటలొ టీ గురించి, టీ పొడి గురించి ఇన్నాను. టీ తాక్కుండా, టీ పొడి తింటే వచ్చే కెఫిన్ హైలో ఈమాట సంపాదకత్వానికి మీరిచ్చిన చరిటిపికెట్టు వాళ్ళు ప్రేంగట్టిచ్చుకుని పెట్టుకోవాల. మరీ అంత డయిరెట్టుగా ఎవరోజెప్తే గాని ఈమాట సదవనంటే వోళ్ళు పీలవుతారేవో. అద్సరేగానె, తెల్ల పవరేంది? అదేడనుంచి పట్తకొచ్చావు. కెఫిన్ లెవెల్స్ కొంచం తగ్గిన తర్వాత, అప్సరు గోరి కవిత మీద ఒక అదరగొట్టే ఇమర్స రాయగూడదా మీరు.

    రవి

  35. గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    March 31, 2009 4:39 pm

    ఈ కవితని, కవిని అర్థం చేసుకోవడానికి ఈ లంకెలోని వ్యాసం ఉపయోగపడుతుంది “అఫ్సర్‌ “వలస”, కల్పనా రెంటాల “కనిపించే పదం”” - మే 2002 ఈ మాట సంచిక http://www.eemaata.com/em/issues/200205/552.html

    గరికపాటి పవన్ కుమార్

  36. ravinder posani అభిప్రాయం:

    April 1, 2009 1:13 pm

    ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు…
    కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.

    ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.

    రవి

  37. Srinivas Nagulapalli అభిప్రాయం:

    April 2, 2009 9:50 am

    రచన స్పృశించిన కొన్ని అంశాలు అర్థం చేసుకోవాలంటే సమాజంలో బతికితే సరిపోదనుకుంటాను. ప్రస్తుతానికి వెనకున్న విస్తారమైన విషాదమైన ఎన్నో చారిత్రిక సంఘటలు గుచ్చినట్టుగా ప్రశ్నిస్తాయి, లోతుగా.

    నిరుడు నిలిచిన బౌద్ధ ఆరామాలేవి, నాడు నడిచిన నలందా ఏది, మొన్నటిదాకా పాత బస్తీలో ప్రాణాలుపోయిన వారికుటుంబాలకిచ్చే జవాబేది. మతం పేరుతో పారిన, పారుతున్న రక్తంతోనైనా శాంతి వృక్షం పెరిగే రోజేది?
    ____
    విధేయుడు
    -Srinivas

  38. ravikiran timmireddy అభిప్రాయం:

    April 4, 2009 9:03 am

    సమాజంలో బతకడం నేర్చుకోవాలట ఈ కవితనర్థం చేసుకోవడానికి. సమాజంలో బతకడవే సరిపోదట, వెనుకనున్న చారిత్రక సంఘటనల సారస్వం తెలిసుండాలట. కాకపోతే మరేదో వ్యాసం చదివి ఈ కవితని అర్థం చేసుకోవాలట. లేకపోతే, అర్థం లేకుండా గొప్పగా ధ్వనించే ఈ పదాల పజిల్ ని, ఒకదానికొకటి సంబంధంలేకుండా వున్న ఈ పదచిత్రాల ముక్కల్లో, నేలని విడిచి సాముచేసి, తెగిపడివున్న చర్మపు ముక్కనుంచి భూత, భవిష్యత్, వర్తమానాల్ని అన్వయించుకునే (పచ్చ, పచ్చటి డాలరు రంగులో, పడిపోతున్న అమెరికా హంగులో) ప్రత్యేకవైన రంగుల కళ్ళద్దాలన్నా కావాలట.

    ఎవరికోసం ఈ కవిత? ఎందు కోసం ఈ కవిత? కొద్దో, గొప్పో చదవనేర్చిన వాళ్లకి కూడా అర్థం కాని ఈ కవిత. పాఠకుల ప్రయత్నంలో మాత్రవే విచ్చీ విచ్చకుండా విచ్చుకునే ఈ కవిత. కవితని చదివి అర్థం చేసుకోడానికి ఒక ప్రత్యేకవైన స్థాయి కావాలని కవిగారనుకునుంటే ఇక పేచీనే లేదు. మా పత్రిక ఆ స్థాయిగల పాఠకుల కోసవే అని సంపాదకులనుకుంటే కూడా పేచీ లేదు. కానీ ఇది సర్వ తెలుగు జనుల కోసం అనే అభిప్రాయం వుంటే మాత్రం కవి(తన కవితకి తానే వివరణ ఇచ్చుకోవడం కష్టవే), వివరణ ఇవ్వడం అవసరవేవో.

    రవి

  39. Meher అభిప్రాయం:

    April 5, 2009 11:57 pm

    ఇక్కడ కవితలో కన్నా వ్యాఖ్యానాలలో ఎక్కువ వల్గారిటీ కనిపిస్తోంది. కళాకారునికి వస్తువు ఎన్నుకోవడంలో అది అశ్లీలమా, సచ్ఛీలమా అన్నవి ప్రమాణాలు కావు. ఏది కదిలించినా దానిపై రాసే అధికారం అతనికి ఉంది.

    నిజానికి కవిత నాకూ అర్థం కాలేదు. కానీ నాకు ఈ సున్తీ సెరిమొనీ గురించి ఏమీ తెలియకపోవడం దానికి కారణమని సరిపెట్టుకున్నాను. లైలా గారి వ్యాఖ్యానం మరి కాస్త స్పష్టం చేసింది.

  40. Srinivas Nagulapalli అభిప్రాయం:

    April 7, 2009 1:35 am

    అశ్లీలమా, సచ్చీలమా అని కాక కదిలించిన దేదైనా దానిపై రాసే అధికారం కవి/రచయితకే కాదు, అభిప్రాయాలు రాసేవారికీ ఉంది, ఎప్పుడూనూ. వల్గారిటీ ఉందా లేదా, ఇది పద్యమా కాదా, అని కాక కదిలించిందేమిటి అని మాత్రమే చూస్తే, బాబ్రీ మసీదు ప్రస్తావన మాత్రం తాకింది, నాకైతే. ఆవేశం, ఆక్రోశం అక్షరాలా ఉంది. ఆలోచన, అవగాహన తక్కువైనట్టు తోచింది. అయినా నిజాయితీగానే రాసినట్లనిపించింది.
    =========
    విధేయుడు
    -Srinivas

  41. Srinivas Nagulapalli అభిప్రాయం:

    April 7, 2009 2:11 am

    అభిప్రాయం స్పష్టంగా లేదేమో అని ఇంకొక్క మాట. మసీదైనా, మందిరమైనా, Golden Temple గురుద్వారా అయినా, ప్రార్థించే ప్రదేశమేదైనా పవిత్రమే, ఎల్లప్పుడూ అందరికీ. మతమేదైనా పవిత్రత ఒక్కటే. కాని ఆ పవిత్రతకు కారణమైన ప్రార్థన, నమాజు అన్నవే లేనప్పుడు వాటిని పూర్వ గౌరవంతో ఆదరించడం ఎంత వరకు సబబు అన్నది కవులు, విజ్ఞులే కాదు మేధావులూ, పౌరులందరూ ఆలోచించి అభిప్రాయాలు పంచుకోవడం ఎంతో ఘర్షణను, రక్తపాతాన్ని నివారించడానికి సహాయం, కాదు- నేటి అవసరం అని కూడా అనుకుంటాను. హింసకు దారితీసిన, తీస్తున్న విషయాలు చర్చలకు దారితీసి వెలుగును వెత్తుక్కోవడం అన్నివిధాల మేలు చేస్తుందని కూడానమ్ముతాను.
    ________
    విధేయుడు
    -Srinivas

  42. విప్లవ్ అభిప్రాయం:

    April 7, 2009 8:50 am

    బోడి కామెంట్

    “దిక్” తో వచ్చిన వాళ్ళ గురించి ఇస్మాయిల్ రాసింది: “The Digambara poets aim was to shock their readers into an awareness of their social apathy and personal degradation.”

    “shock their readers” అనేది కూడా ఒక టెక్స్ట్ కు ఉండాల్సిన లక్షణమే!? అయితే, ఈ కవిత/Text చిందించిన మిగతా Texts ఈ కవితకు అవసరమైన టీకా టిప్పణికి పనికొస్తయి. Writer is dead after he wrote this Text.

    A Disturbance must be understood by the graph it creates, like that quake that happened in Italy for example, can be read acorss the world if there is an instrument: it is least understood at the far end but will not be mistaken for something else that it is not. Every text written and followed up with by each subsequent commentor is another tick mark on the graph. I hope the data points here cross a century OR even a శత కోటి.

    అన్నట్టు, రాసిన వాళ్ళు ఏం చెప్పక పోయినా, చదివిన వాళ్ళు దాన్ని గురించి చించుకున్నా తప్పులేదు. సంపాదకులు మాత్రం “దీంట్లో ఏం చూసి ప్రచురించారో చెప్పాలి” అన్న డిమాండ్ పాఠకుల నుంచి వస్తే వాళ్ళ అభిప్రాయం లేక వాళ్ళ రివ్యూయర్ల (పేర్లు లేకుండా) అభిప్రాయాలు కొంతయినా చెప్పటం అవసరమేమో!? అప్పుడు మరింత “మేత” దొరుకుతుంది అని నా అభిప్రాయం.

    విప్లవ్
    సంపాదకుల వారికి: మీరు ఈ మాట అభిప్రాయాల పేజీని సంస్కరించాలని తలిస్తే మాత్రం, పేరు మాత్రం మార్చి వదిలేయండి. ఇది “ఈ మాట: పాఠకుల బ్లాగ్” అంటే సరిపోతుంది. ఎక్కువ కండీషన్లు పెడితే సగం ఖండితం, సర్వం పీడితం టైపు అయిపోతుందని నా భయం.

  43. Alok అభిప్రాయం:

    April 19, 2009 11:19 pm

    ఇప్పటికాలంలో గూడా “వచన” కవిత్వాన్ని “పద్య” మనడం జరుగుతోంది. అంచాత ఇది కవిత్వమా, పద్యమా అన్న మీమాంస అక్కర్లేదు.

    చూడగా, ఇందులో నాలుగు భాగాలున్నాయి.

    1. కవిత్వం పుట్టక-కవి బాధలు (1, 3, 6వ స్టాంజాలు)
    2. భిన్న మతాలు - సౌహార్ద్రత (2, 4వ స్టాంజాలు)
    3. కులం - వైయక్తిక వేదన (4, 5 వ స్టాంజాలు)
    4. రాజకీయాలు - అభిప్రాయ ప్రకటన (కూలిన మసీదు గోడ, బ్రోచేవారెవరురా వగైరా వాక్యాలు)

    యిన్నేసి భావాలు, అభిప్రాయాలు, ప్రకటనలు, నిట్టూర్పులూ వొకేచోట గుమిగూడ్డంతో కవిలోని సంకీర్ణత, అస్పష్టత పాఠకుల్లోకీ వరదలా పారాయి.

    రాజకీయలపై కన్నేసి వుంచేవాళ్ళకి అవే కనపడ్డాయి. కులం, మతం కవితల్లో ఆసక్తివున్నోళ్ళకి అదే కనపడింది. అంచాత చర్చ కూడా నానాజాతి సమితి శిఖరాగ్ర సమావేశంలా సాగుతూనే వుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a