విశ్వగుణాదర్శ కావ్యపరిచయం

గ్రామగ్రామే నివసతి చిరా
త్స్వామిభావేన శూద్రో
భృత్యోభూత్వాపఠతి గణనాం
బ్రహ్మణ స్తస్య పార్శ్వే
వేదాధ్యాయీ సర ఇవ మరౌ
క్వాపి కశ్చిత్ యది స్యాత్
అత్రామత్రప్రకరకరణే
వర్తతేఽ సౌ నియుక్తః (219)

ఎక్కడపడితే అక్కడ శూద్రులు రాజరికం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బ్రాహ్మణులు కరణీకం చేస్తూ, సేవకులుగా బతుకుతున్నారు. ఎక్కడేనా వేదం చదువుకున్న బ్రాహ్మడు ఒకడు ఎడారిలో మంచినీటి చెరువు లాగా వుంటే, వాడు అంటు గిన్నెలు తోముకుని బతుకుతున్నాడు, అని కృశానువు పడే బాధ ఆనాటి సమాజంలో అంతవరకూ శూద్రులుగా పరిగణించబడిన వాళ్ళు రాజులవడం, వేదాధ్యయనం చేసి రాజులకి క్షత్రియత్వం ఇచ్చే బ్రాహ్మణవర్గం క్షీణించడం, బ్రాహ్మణులు లౌకిక వృత్తులలో ప్రవేశించి రాజ సేవకులుగా తయారవడం – ఈ మార్పుని సూచిస్తుంది.

సంస్కృతంలో రాసిన ఈ గ్రంథంలో సంస్కృత భాషని ఈసడించడానికి కూడా ఈ గంధర్వులు జంకరు.

ఉపాదేయం ప్రాజ్ఞైరుచిత విషయం ద్రావిడవచో
వ్యయుక్తార్థం హేయం భవతి వచనం సంస్కృత మపి (364)

మంచి విషయమయితే ద్రావిడభాషలో ఉన్నా పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించవలసిందేనని నిష్కర్షగా చెప్తాడు విశ్వావసువు.

శౌచత్యాగిషు హూణకాదిషు ధనం
శిష్టేషు చ క్లిష్టతాం
దుర్మేధస్సు ధరాధిపత్య మతులం
దక్షేషు భిక్షాటనం
లావణ్యం లలనాసు దుష్కులభవా
స్వగ్రాసు నీరూపతాం
కష్టం సృష్టవతా త్వయా హతవిథే
కిన్నామ లబ్ధం ఫలం (412)

లోకం అంతా చెడిపోతోంది, శుచీశుభ్రం లేని ఈ పాశ్చాత్యులకి బోలెడు డబ్బుంది. శిష్టులు దరిద్రులవుతున్నారు. అజ్ఞాని రాజవుతున్నాడు. చదువుకున్నవాడు అడుక్కు తింటున్నాడు. తక్కువ కులాల ఆడవాళ్ళు అందంగా పుడుతున్నారు. అగ్రకులాల వాళ్ళు అందవికారంగా వుంటున్నారు. ఓ బ్రహ్మా, నీ సృష్టి చూడు ఎంత ఘోరంగా వుందో అనే ఈ శ్లోకం ఆనాటి సమాజం పొందుతున్న విప్లవాత్మకమైన మార్పుల్నీ, అందువల్ల అగ్రకులాల్లో కలుగుతున్న అలజడినీ, స్పష్టంగా తెలియజేస్తుంది.

సంస్కృత సాహిత్యం కాలంతో పాటు మారుతోందనీ, ఆధునికం అనదగ్గ కొత్తదనాన్ని పరిగ్రహించి, తన కాలపు సమాజంలో విశేషాల్ని సవిమర్శకంగా ప్రపంచిస్తోందనీ చెప్పడానికి ఈ పుస్తకం మంచి ఉదాహరణ.

సాహిత్యంగా ఇది పరమ రమణీయమైన రచన. సాంప్రదాయిక సాహిత్య మర్యాదల్ని ఆధునికీకరిస్తూ, కొత్త మార్గాల్ని సంస్కృత సాహిత్యం అనుసరించగలదని వేంకటాధ్వరి తన వినూత్న ప్రక్రియ ద్వారా ప్రదర్శించాడీ గ్రంథం ద్వారా. ఒక భాష బతికి వుందా, చచ్చిపోయిందా అన్న విషయం భాషాగతమైనది కాదనీ, ఆ భాష వాడేవాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన విషయమనీ బోధపడుతుంది ఈ పుస్తకం చదివితే.

ఇలాంటి పుస్తకం ఒకటి వుందని కూడా చాలామందికి తెలియని పరిస్థితిలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు దీనికి సమర్థమైన వ్యాఖ్య రాసి తెలుగువాళ్ళకి అందుబాటులోకి తెచ్చారు. ఆయనకి తెలుగువాళ్ళు చాలా కృతజ్ఞంగా వుంటారు.

ఈ పుస్తకానికి పంచాంగం దేవరాజ పెరుమాళ్ళయ్య గారు ప్రతిపదార్థం, తాత్పర్యం రాసి ప్రతీ శ్లోకానికీ తెలుగుపద్యంలో అనువాదం చేశారు. దీన్ని 1914లో ఆర్. వేంకటేశ్వర అండ్ కో., మద్రాసు, వారు ప్రచురించారు. ఇప్పుడీ పుస్తకం అచ్చులో దొరకదు. శ్రీకాంతశర్మ గారి వ్యాఖ్యానం దేవరాజ పెరుమాళ్ళయ్య గారి వ్యాఖ్యానం కన్నా ఎక్కువ వివరాలతో, పాండిత్య విశేషాలలో ఆసక్తి గలవారు చదువుకోడానికి వీలుగా వుంది.

పండితులకే పరిమితమైపోయిన పుస్తకాలకి తెలుగులో ప్రామాణికమైన ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ రావాలి. పండితులు తక్కువైపోయి, ఈ తరహా పుస్తకాలు మూలపడిపోయి, ఎవరికీ కొరుకుపడక, వాటిని వివరంగా చదువుకోడానికి ఆసక్తి వున్నవాళ్ళకి కూడా అవకాశం లేకపోయే దురవస్థ తెలుగులో ఏర్పడి చాలా కాలమైంది. పాత పుస్తకాలకు, రెండు తరాలకు పూర్వం రాయబడిన ప్రామాణిక వ్యాఖ్యలు ఇప్పుడు అచ్చులో దొరకవు. ఒకవేళ దొరికినా అవి ఈనాటి పాఠకులకి బోధపడవు. ఈ పరిస్థితిని సవరించి, పాత పుస్తకానికి ఇప్పటి తెలుగులో సంపూర్ణమైన వ్యాఖ్యలు రాయగలవారు ఎక్కువమంది లేరు.

ఇది ఇలా వుండగా, ఇప్పటి పాఠకులకి పాండిత్య విషయాలు అక్కరలేదనీ, అవన్నీ చాదస్తంగా చెప్పకుండా, మాటలు అర్ధమయేలాగా సరళమైన భాషలో రాస్తే సరిపోతుందని, ఒక ‘అపండిత వాదం’ చాలామంది చేయడం నేను విన్నాను. మనుచరిత్రకి ఇలాంటి వ్యాఖ్యానమే, జూలూరి అప్పయ్యగారి చేత, రాయించిన సీ. పీ. బ్రౌన్ ఈ వాదానికి ఆద్యుడు. పాత పుస్తకాలని సమర్ధులైన పండితుల దగ్గర కూలంకషంగా చదువుకున్న వాళ్ళు వున్న రోజుల్లో ఇలాంటి వాదం వల్ల లాభమే కానీ నష్టం వుండేది కాదు. పండితుల కొరత లేకుండా, తరం తర్వాత తరం పండితులు తయారవుతున్న దేశంలో పండిత వ్యాఖ్యలు నోటిమాటల్లో వుంటే ఎవరికీ ఇబ్బంది కూడా వుండేది కాదు. కానీ ఇవాళ తెలుగుదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి వుంది. పండితులు అనే జాతి దాదాపుగా నశించిపోయింది. ‘ఆముక్తమాల్యద’కి, ‘శృంగార నైషధాని’కి వ్యాఖ్యానం రాసిన వేదం వేంకటరాయ శాస్త్రి, ‘మనుచరిత్ర’కి, ‘ప్రభావతీ ప్రద్యుమ్నాని’కి వ్యాఖ్యానం రాసిన వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఒకవేళ ఎక్కడైనా వున్నా వాళ్ళ చేత వ్యాఖ్యానాలు రాయించి ప్రచురించే వాళ్ళు కూడా లేరు.

ఆ పండితులకున్న విజ్ఞానం పాత కాలపు విలువల్ని పునరుద్ధరించేదనీ, అది ఈ కాలానికి అఖ్ఖర్లేదనీ, పైగా అది అభివృద్ధికి ఆటంకమనీ ఒక అభిప్రాయం, అవివేచితంగా ఆధునికుల మనసుల్లో చోటు చేసుకుంది. ఒకరకమైన విజ్ఞానాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రవృత్తినీ, ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే వివేకాన్నీ, ముద్దగా కలిపేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఉదాహరణకి, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించే తార్కిక విజ్ఞానమూ, అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల కలిగే జీవన ప్రవృత్తీ – ఈ రెండూ ఒకటి కావు. ఇందులో మొదటిది అద్వైత సిద్ధాంతాన్ని స్పష్టంగా బోధపరచుకోడానికి అవసరం. ఆ సిద్ధాంతాన్ని అన్వయించుకోగల సామర్ధ్యం ప్రతీ తరంలోనూ కొంతమందికైనా కావాలి. ఇక ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించే వాళ్ళు ఉండాలా అన్నది మనం నిర్ణయించువలసిన విషయం కాదు. ఆధునిక వ్యాఖ్యలలో ప్రతిపాదించవలసిన విషయమూ కాదు. పాత సిద్ధాంతాల మీద అనిష్టత వెర్రితలలు వేసి, అసలు ఆ పుస్తకాలను చదవగల సమర్ధతను ఈసడించుకొనే పరిస్థితి విజ్ఞానానికి ఉపయోగించదు. సాహిత్య గ్రంధాల విషయంలో కూడా ఇంతే.

ఈ పరిస్థితిని నివారించి అన్ని పుస్తకాలూ వైజ్ఞానికులకు అందుబాటులోకి తేవడానికి పూర్వగ్రంధాలకు ఇప్పటి భాషలో వ్యాఖ్యలు కావాలి. పైగా, ఆ వ్యాఖ్యలు ఆ పుస్తకాల్లోని క్లిష్టతను ఒదిలేసి సరళం చేసే అపండిత వ్యాఖ్యలుగా వుండకూడదు.

శ్రీకాంతశర్మ గారి వ్యాఖ్యానం ఈ అవసరాన్ని గుర్తించి రాసిన వ్యాఖ్యానం. ఇలాంటి పుస్తకం ప్రచురించే సంకల్పం తానా ప్రచురణ విభాగం వారికి కలగడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. మామూలుగా ప్రచురణకర్తలు ప్రచురించే తరహా పుస్తకాలు కాకుండా, మంచి పుస్తకాలు, బాగా ప్రచురించాలని తానా అభిలాష. బాగా ప్రచురించాలనే ఊహ వెనకాతల వున్న పట్టుదల, ఈ పుస్తకం ప్రచురించడానికి అనుసరించిన పద్ధతిలో కనిపిస్తుంది. అచ్చులో ఈ పుస్తకం చూసిన వెంటనే పాఠకులు ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఈ పుస్తకాన్ని ప్రచురించాలని ఎంచుకోవడం లోనూ, ప్రచురించిన పని లోనూ చూపించిన ప్రత్యేకత తెలుగు ప్రచురణ రంగంలో ఒక కొత్త మార్పుకి కారణం కావాలని ఆశిద్దాం.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...