నాకు గుండెపోటొచ్చినంత పనైంది. మనసులోనే అనుకున్నా, “హమ్మ చలపతీ, నువ్వు ఎంతకైనా తగినవాడివే. చల్లగా మాట్లాడి ఎంత ఠోకరా ఇచ్చావు నాకు” అని. కాని ఇప్పుడేం చెయ్యను! చెయ్యకూడని పనులన్నీ ఎప్పుడో చేసేశా గద. చెక్కు చలపతికి ఇచ్చేశా. ఈసరికి అతడు దాన్ని సొమ్ము చేసుకునే ఉంటాడు. అంతేకాదు, పొద్దున్న వస్తూ సత్రం వాళ్ళచేత లెక్కలన్నీ సరిచూపించి, ఇవ్వాల్సినది ఇచ్చేసి, ఈరోజే ఖాళీ చేసేస్తున్నట్లు చెప్పి వచ్చేశా. ఆఫీసుకి రాగానే ఆ ఇంటి తాళంచెవులు ఆఫీసు ప్యూనుకి ఇచ్చి, వీలు చూసుకుని నా సామాను తీసుకెళ్ళి ఆ ఇంటిలో పెట్టెయ్యమని చెప్పేశా కూడా. అతడు ఈ లంచవర్‌లో వెళ్ళి ఆ పని చేసేసే ఉంటాడు. చచ్చాన్రా బాబూ! ఇప్పుడు నేనేంచెయ్యాలి…
అంతలో సంతోష్ అడిగాడు బలరామమూర్తి గారిని, “సార్! మీరెప్పుడైనా చూశారా లంబాడీ దయ్యాన్ని?”
సీటులోనే ఎగిరిపడ్డారు బలరామమూర్తిగారు. “చూడ్డం కూడానా! లంబాడీ దయ్యాన్ని ఎదురుగా చూసి బ్రతికిన వాళ్ళు ఎవరూ లేరు. అలా చూసిన వాళ్ళు వెంటనే నెత్తురు కక్కుకు చస్తారు, ఏమిటనుకుంటున్నావో” అంటూ కోప్పడ్డారు సంతోష్‌ని. ఆతరవాత నా వైపు తిరిగి అద్దె ఎంత చెప్పాడేమిటి అని అడిగారు. నేను చెప్పింది వినగానే సంతోష్ ఫక్కున నవ్వి “అందుకే పడ్డారు మాస్టారు! పాపం, ఆయన పంచతంత్రం చదివి ఉండరు. చదివితే తెలిసివుండేది. నూపప్పు తీసుకుని నువ్వులిమ్మని అడిగితే ఆలోచించాల్సి వుంటుందని” అన్నాడు వెక్కిరింతలా.
నాకు చాలా బాధనిపించింది. నేనిప్పుడు తెలివిగా ప్రవర్తించకపోతే వీళ్ళు నన్నొక కక్కుర్తి మనిషిగా, ఫ్రీగా వస్తే ఫినైలయినా తాగేసే వెధవ రకంగా కట్టేసే ప్రమాదం ఉంది. బుర్రకి పదును పెట్టి ఆలోచించా. అసలే ఊరికి కొత్తవాడిని కూడా!
“ఏమిటి మాస్టారూ, మేమే మాట్లాడుతున్నాం గాని మీరేమీ మాట్లాడరేం” అన్నాడు చక్రవర్తి పక్క కుర్చీలోంచి. నాకు మనసులో చాలా బెరుకుగా ఉంది. కాని ఆ మాట ఒప్పుకోవాలంటే అహం అడ్డొస్తోంది. శ్రద్ధగా భోంచేస్తున్న వాడిలా వంచిన తల ఎత్తకుండానే, “నాకలాంటి నమ్మకాలూ, భయాలేమీ లేవండీ” అనేశా. అప్పటికే భోజనం ముగించి కూర్చున్న సంతోష్ నా భుజం తట్టి, “కీపిట్ అప్ మాస్టారూ! ధైర్యే సాహసే లక్ష్మీ, మన ధైర్యమే మనకు రక్ష! ఇలాంటి కాకమ్మ కధలు నమ్మితే మనం వట్టి పిరికి సన్నాసులమని అర్థం. మీరేం ఇదవ్వకండి. ధైర్యంగా ఉండండి” అన్నాడు. మూర్తిగారు లేచి వెళ్ళిపోయారు.
సాయంకాలం అవుతున్న కొద్దీ నాలో గుబులు పెరగసాగింది. ఆ సాయంకాలం తాళంచెవులు తిరిగి ఇస్తూ ప్యూన్ వీరాస్వామి, “మీకా ఇల్లొద్దు సారూ. పిల్లలు గలవోరు, తొందరపడి ఆ ఇంటిలో మకాం ఎట్టమోకండి. ఓపాలి ఎవరో సాములోరు సెపితే యినకుండా ఆ ఇంటి అరుగు మీద పడుకుని నిదరోయాడంట. మరుసటేల చూస్తే నెత్తురు కక్కుకుని సచ్చి పడుణ్ణాట్ట, ఆ ఇంటికి ఎనకపక్క గుడిసెలో ఉండే సాయిబు చెప్పాడు. సారూ, నామాట ఇనుకోని ఈ రాత్రికి ఏ వోటల్లోనో వుండి, వేరే ఇల్లెతుక్కోండి” అంటూ ఎంతో ఇదై పోయాడు.
నాకేమో పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డు పడ్డట్లు ఉంది. కాస్త తోడుగా ఉండేందుకు కూడా ఎవరూ లేరు. దిక్కు లేని పక్షి లాగ దిగులేసింది. అలా అనుకోగానే గుర్తొచ్చింది, ‘దిక్కులేని వాళ్ళకు దేముడే దిక్కు’ అన్న మాట! ఇన్నాళ్ళూ నేను విడిది చేసిన సత్రం వీధి లోనే ఒక గుడి ఉంది. చాలా మంది భక్తులు వస్తూ, పోతుంటారు, రద్దీగానే వుంటుంది. అది చూశా కాని, ఎప్పుడూ లోపలకు వెళ్ళింది లేదు. అసలు ఇంతవరకు నేను ఆ గుడిలోఉన్నది దేవో, దేవరో, తొండమో, తోకో, అసలు మనకున్న ముక్కోటి దేవతల్లో ఎవరో, ఏమీ తెలుసుకోలేదు. కాని ఈవేళ అవసరం నెట్టింది. “అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ” అంటూ ఆఫీసు విడిచిపెట్టాక పళ్ళూ పువ్వులూ వగైరాలన్నీ కొనుక్కుని, దిగజారి పారిపోయిన ధైర్యాన్ని వెతుక్కుంటూ, గుడికి బయలుదేరా.
అది పెద్ద గుడి. ప్రధాన దైవం లక్ష్మీనారాయణులే ఐనా, శివుడూ మొదలైన ఎందరో దేవుళ్ళు అక్కడ తిష్ఠ వేసి ఉన్నారు. అక్కడి ప్రధాన దైవతానికి, భూతనాధుడైన శివునికి పూజలు చేయించా. తక్కిన దేవుళ్ళకు దక్షణలు సమర్పించా. ఆంజనేయ స్వామిని చూడగానే నాకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. విగ్రహం ఎదుట మోకరిల్లి “శాఖినీ ఢాకినీ… ఇత్యాది దయ్యంబులన్ పట్టి, నీదు వాలంబునన్ జుట్టి, నేలన్ బడగొట్టి…” అంటూ, నా చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న ఆంజనేయ దండకం, జ్ఞాపకం ఉన్నంత వరకూ చదువుతూ, ఆయన అనుగ్రహం కోసం ప్రార్ధించా. సిందూరం బొట్టు పెట్టుకున్నా, ఇంకొంచెం తమలపాకులో చుట్టుకున్నా ఎందుకన్నా మంచిదని. ఏ రిస్కూ ఎందుకు తీస్కోడం అంచెప్పి, ఆ గుడి చుట్టూ ఉన్న చిల్లర దేవుళ్ళను ఒక్కళ్ళనీ విడవకుండా అందరికీ ప్రదక్షణాలు చేసి దక్షణలు చెల్లించా. చుట్టూ ఉన్నవాళ్ళు వింతగా చూస్తున్నారని అప్పుడప్పుడూ అనిపించిందనుకోండి. కానీ నా బాధ వాళ్ళకేం తెలుసు! నేనివాళ రాత్రి పరువు నిలుపుకోడానికని మృత్యువుతో తలపడబోతున్నానని వాళ్ళకి తెలీదు కదా. తెలిస్తే హీరోలా చూసేవారో, నాకూ పూజలు చేయించేవారో కాదూ! వాళ్ళెవర్నీ పట్టించుకోలేదు నేను. అన్ని ప్రార్ధనలు ముగించి తిరుగు ముఖం పట్టే వేళకి నాకు పోయిన ధైర్యం పుంజుకున్నట్లయ్యింది.
గుడి బయట పటాలమ్మే షాపులో హనుమాన్ సంజీవనీ పర్వతాన్ని ఎత్తి తెస్తున్నట్లున్న రాగిరేకు పటం కనిపిస్తే వెంటనే కొన్నా. ఆపక్క కొట్లోనే ‘భగవంతునికీ భక్తునికీ అనుసంధాన’మైన అంబికావారి ఊదొత్తులు ఓ రెండు కట్టలు, ఎందుకైనా ఉంటుందని ఒక టార్చి లైటు, అద్దె ఇల్లైనా కొత్తింట్లోకి చేరడమేగా అని ఒక అరకిలొ మిఠాయి కూడా కొన్నా. సంచీ మోసుకుంటూ అంజనేయ దండకం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మెల్లిగా ఇంటి దారి పట్టాను. గుడి దగ్గర కొన్న హనుమాన్ చాలీసా బుక్కు జేబులోనే ఉంది. ఇంటి దగ్గరకు రాగానే దానిమీద చెయ్యి ఉంచుకుని నెమ్మదిగా గేటుని సమీపించా. గేటు తెరిచి ఉంది. వీరాంజనేయ నామం జపిస్తూ జాగ్రత్తగా గేటు దాటి లోపలికి నడిచాను.
నా రేడియం డయల్ రిస్టు వాచీ టైం పది అయిందని చెప్పింది. రోడ్డు చాలావరకు నిర్మానుష్యంగా ఉంది. నా గుండెచప్పుడు నాకే వినిపిస్తోంది. ఎలాగో ధైర్యం చిక్కబట్టుకుని గేటు మూసి గడియ వేసి వెళ్ళి ఇంటి తాళం తీశాను. ఇప్పుడు కూడా కుడికాలే ముందుగా లోపలపెట్టి, “శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం…” అంటూ ఆంజనేయ దండకం చదువుకుంటూ గృహప్రవేశం చేశా. బ్యాటరీ లైటు సాయంతో స్విచ్చి బోర్డులు వెతికి, ఒకటొకటిగా అన్నిగదుల్లోనూ లైట్లు వేశాను. ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. సింహద్వారం బార్లా తెరిచి, ఒక కట్ట అగరువత్తులు వెలిగించి గది గదికీ తిప్పి ధూపం వేశా ఇల్లంతా ఘుమ ఘుమలాడేలా. నేను కొన్న మిఠాయిలను పెట్టె తెరిచి నట్టింట పెట్టి ప్రార్ధించా, “అమ్మా! గృహదేవతా! ఈ రోజు మొదలు మేము నీ బిడ్డలం. మమ్మల్ని కాపాడే భారం నీదేనమ్మా” అని గోడలకీ పైకప్పుకీ నైవేద్యం సమర్పించా.
భక్తి, భయం జంట కవుల్లా ఒకదాని వెంట ఒకటి ఉంటాయి కాబోలు! నా మనసు భయంతో ఒణుకడం మొదలు పెట్టగానే భక్తి దానంతట అదే పుట్టుకొచ్చింది. ఇంతవరకు దేవుని ఉనికిని అంతగా పట్టించుకోని నాకు సర్వం ఆ భగవత్‌స్వరూపంగా కనిపించ సాగింది! వెంటనే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమయిన వెంకన్న బాబుకి “స్వామీ! ఈ రాత్రి సవ్యంగా గడిచి నేను బ్రతికి బయటపడితే, ఏడు శనివారాలు వరుసగా ఏక భుక్తం ఉంటా. మరే గడ్డైనా తింటా గాని అన్నం మెతుకు మాత్రం ససేమిరా ముట్టను గాక ముట్టను” అంటూ మొక్కుకున్నా.
ఆ రాత్రికి ఎట్టి పరిస్థితిలోనూ నిద్ర పోకూడదని ముందునుండీ అనుకుంటున్నదే కనుక కడుపు నిండా తింటే నిద్ర వస్తుందన్న బయంతో, నేను ఆ రాత్రి భోజనం కోసమని హోటల్‌కి వెళ్ళలేదు. గుడిలో ఇచ్చిన ప్రసాదం, ఆపై రెండు మిఠాయి ఉండలు తిని తెచ్చుకున్న మినరల్ వాటర్ కడుపు నిండా తాగి సరిపెట్టేసుకున్నా. గుడి నుండి తెచ్చిన నిర్మాల్యం, శివుని వీభూతి, అమ్మవారి కుంకుమ, అన్నీ ఇంటి లోపలి గదులన్నింటిలోనూ చల్లి, గడపలకి సిందూరం, కుంకుమ బొట్లు పెట్టా. మాస్టర్ బెడ్రూంలో ఈశాన్య మూల చూసి, అక్కడ ఒక కాగితం పరిచి దానిమీద నేను కొన్న ఆంజనేయులవారి పటాన్ని పెట్టి ఊదొత్తులు వెలిగించా. కొంచం సేపు ప్రార్ధన చేసి గది మధ్యలో నా బెడ్డింగు పరుచుకుని దాని మీద కూర్చుని ఒక సస్పెన్సు నవల తీశా, నిద్దర రాకుండా.