మనకు తెలియని మన త్యాగరాజు – 4

కథలూ – కల్పితాలూ

త్యాగరాజు పై 1930 తరువాతొచ్చిన కొన్ని పుస్తకాల్లో కొత్త కథలు చోటు చేసుకున్నాయి. మొదటి తరం శిష్యులు రాసినవాటిలో లేనివి మరికొన్ని పుట్టుకొచ్చాయి. కొంతమందయితే శ్యామశాస్త్రికి సంబంధించిన కథల్ని త్యాగరాజు కథలుగా మలిచి చెప్పేసారు. అలాంటు కథొకటి తెలుసుకుందాం.

బొబ్బిలి కేశవయ్య: బొబ్బిలి కేశవయ్యని ఆంధ్ర ప్రాంతంలో ఓ జమీందారుండేవాడు. ఒకసారాయన తిరువయ్యారొచ్చాడు. త్యాగరాజు గురించి తెలుసుకున్నాడు. ముందు నాద స్వర విద్వాంసులతో పల్లకీ యెక్కి ఓ రోజున త్యాగరాజింటికొచ్చాడు. కేశవయ్య గురించెవరికీ తెలీక రాజ వంశీయులెవరో అనుకున్నారు. సంగీతంలో తనెంత ప్రతిభావంతుడో, ఎంతమంది రాజుల మెప్పు పొందాడో త్యాగరాజుతో చెప్పాడు. రాముని మెప్పు తప్ప రాజుల మెప్పుతో తనకి పనిలేదని చెబితే ఆగ్రహించి త్యాగరాజు సంగీతాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ఆయన్ని పాడమన్నాడు. అప్పుడు ‘విదులకు మ్రొక్కెద’ కృతిని పాడితే విని కేశవయ్య కాళ్ళమీద పడ్డాడనీ చెప్పే కథది. చివరకి త్యాగరాజు శిష్యుడిగా మారాడనీ ఈ కథ ముగించారు. ఈ కథ సాంబమూర్తి, ఎం. వెంకట్రామయ్య,ఎస్. వై. కృష్ణస్వామి రాసిన పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఎస్. వై. కృష్ణస్వామి తనకి 1910 నుండీ 1930 వరకూ త్యాగరాజు శిష్యుల ద్వారా లభించినట్లుగా చెప్పారు. సాంబమూర్తి ఈ కథని రాసారే తప్ప ఆధారాలు చూపలేదు. బహుశా త్యాగరాజు రెండో తరం శిష్యుల ద్వారా వినుండచ్చు. ఈ కథ 1950 తరువాతొచ్చిన పుస్తకాల్లోనే కనిపించింది.

కానీ, ఈ కథ విని కాస్త చారిత్రాత్మక ఆధారాల్లోకి వెళితే ఇందులో నిజానిజాలు తెలుస్తాయి. ఈ బొబ్బిలి కేశవయ్య తిరువయ్యారు రాలేదు. త్యాగరాజూ, ఈ కేశవయ్యా అస్సలు కలవలేదు. ఈ కేశవయ్య శ్యామశాస్త్రితో సంగీత వాదన చేసాడు. ఇది శ్యామశాస్త్రి గురించొచ్చిన కథల్లోనే కనిపిస్తుంది. శ్యామశాస్త్రి తిరువారూర్లోనే ఉండేవాడు. పైగా ఈ కేశవయ్య పుదుకుట్టయి రాజుని దర్శించాక రామేశ్వరం వెళుతూ అక్కడే శ్యామశాస్త్రిని కలిసాడు. త్యాగరాజూ, శ్యామశాస్త్రీ ఒకే కాలం వారయ్యుండడంవల్లా, మరీ దగ్గరున్న వూళ్ళల్లోనే నివసించడంవల్ల ఇలాంటి తప్పులు జరిగే అవకాశాలున్నాయి. కానీ ఈ కథలు పుస్తక రూపంలో ప్రచురణకి నోచుకోడం వల్ల అందరూ ఇవే వాస్తవమని నమ్ముతారు.

పైన చెప్పిన కథలే కాకుండా త్యాగరాజు మదురై, శివగంగా, రామేశ్వరం వెళ్ళాడనీ శుద్ధానంద భారతీ అనే ఆయన ‘త్యాగరాజ – ది డివైన్ సెయింట్’ అనే పుస్తకంలో రాసారు. ఇవన్నీ ఉత్తరాది యాత్ర లో భాగంగానే రాసారు. ఈ సమాచారానికి ఆధారాలు మాత్రం చెప్పలేదు. అలాగే ఎవరూ చెప్పని త్యాగరాజు జీవిత విశేషాలు కొత్తవి కొన్ని చెప్పారు. త్యాగరాజు అన్నగారు పంచనదయ్య తమ్ముడిపై అక్కసుతో శిష్యులు పొందుపరిచిన తాళపత్ర కృతుల్నీ అగ్నిలో పడేసాడనీ చెప్పారు. కానీ త్యాగరాజు మనవడి భార్య గురవమ్మ ఆ ప్రతుల్ని మంటల్లోంచి బయటకు తీసి కొన్ని కాపాడిందనీ రాసారు. ఇది మాత్రం ఖచ్చితంగా సరికాదని చెప్పగలను. త్యాగరాజు అన్నయ్య పంచనదయ్య సుమారు 1812 ప్రాంతంలో చనిపోయాడు. త్యాగరాజు కూతురి పెళ్ళి 1810 ప్రాంతంలో జరిగింది. మనవడికి పదిహేనేళ్ళ వయసులో వివాహం జరిగిందనుకొన్నా, పైన చెప్పిన సంఘటన సుమారు 1825 తరువాతే జరిగుండాలి. కానీ అప్పటికే త్యాగరాజు అన్నయ్య పంచనదయ్య మరణిస్తే, మరలా ఈ త్యాగరాజు మనవడి భార్య రక్షించిన ప్రతులు, పంచనదయ్య మంటల్లో పడేసినవయ్యే అవకాశం ఎంత మాత్రం లేనేలేదు.

ఇలా తప్పుడు సమాచారంతో ఎవరికి తోచిన కథలు వారు రాసేసారు. వీటిల్లో ఎక్కువ భాగం కల్పితాలేనని కాస్త తేదీలూ, చుట్టరికాలూ చూస్తే అర్థమవుతాయి. కాకపోతే 1930 సంవత్సరంలో, డెబ్భై ఏళ్ళ క్రితం రాసిన ప్రతులు చాలా శ్రమిస్తే కానీ ఇప్పుడు దొరకడం కష్టం. పునః ముద్రణలకి అన్ని రచనలూ నోచుకోవు. ఈ పాత కథలాధారంగా కొత్త పుస్తకాలొస్తే అవే ఇప్పటి తరాలకి ప్రామాణికం అవుతాయి. అందువల్ల ఇవే కథలని పాఠకులు విశ్వసించే అవకాశముంది. త్యాగరాజు విషయంలో జరిగిందిదేనని ఖచ్చితంగా చెప్పగలను.

తిరువయ్యూరు

ఉత్తరాది యాత్రలు ముగించుకొచ్చాక త్యాగరాజు తిరువయ్యారు విడిచి ఎక్కడకీ వెళ్ళలేదు. ఎక్కువకాలం రామ భజనల్లోనూ, సంగీత సాధనా, బోధనల్లోనే కాలం గడిచిపోయేది. ఉన్న శిష్యులు తలొక్కరూ తలో ప్రాంతానికీ చెందిన వారు కావడం వల్ల త్యాగరాజు పేరు నలుమూలలా ప్రాకింది. కాంచీపురం, మద్రాసుల్లో అనేకమంది త్యాగరాజు సంగీత ప్రతిభని కళ్ళారా చూసారు. కొంతమంది తిరువయ్యారు వెళ్ళి సందర్శించారు. తిరువయ్యారులో త్యాగరాజు ఇల్లు ప్రతీరోజూ కొత్త కొత్త సందర్శకులతో నిండుండేది. తంజావూరు విచ్చేసిన ఏ సంగీతకారుడూ, తిరువయ్యారు దర్శించకుండా వెనక్కి వెళ్ళలేదు. ఉత్తరాదిన కాశీ నుండి, దక్షిణాన తిరువనంతపురం వరకూ ఎంతో మంది విద్వాంసులు తిరువయ్యారు వచ్చి వెళ్ళారు.

గోపీనాధ భట్టాచార్య: కాశీ లో గోపీనాధ భట్టాచార్య అనే ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడుండేవాడు. ఎలాంటి రాగాన్నయినా గుక్క తిప్పుకోకుండా గంటలకొద్దీ పాడగల దిట్టనీ ఈయనకి చాలా పేరుండేది. త్యాగరాజు శిష్యులు కొంతమంది కాశీ యాత్రకెళ్ళినప్పుడు భట్టాచార్యకి త్యాగరాజు గురించి తెలిసింది. ఆయన దక్షిణాది యాత్రలో భాగంగా తిరువయ్యారు వెళ్ళాడు. తను కాశీనుండి వచ్చాననీ, త్యాగరాజు సంగీతం వినాలన్న కోరికతో తిరువయ్యారు వచ్చాననీ చెప్పాడు. ఇది విని సంతోషించిన త్యాగరాజు తోడి రాగంలో ఓ కృతి పాడాడు.

పల్లవి. – దాశరథీ నీ ఋణము దీర్ప నా
                    తరమా పరమ పావన నామ

అనుపల్లవి. – ఆశ తీర దూర దేశములను
                          ప్రకాశింప జేసిన రసిక శిరోమణి (దాశరథీ)

చరణం. – భక్తి లేని కవి జాల వరేణ్యులు
                      భావమెరుగ లేరని కలిలోన జని
                      భుక్తి ముక్తి కల్గునని కీర్తనముల
                      బోధించిన త్యాగరాజ కరార్చిత (దాశరథీ)

తన రామ భక్తినీ, సంగీతాన్నీ పలుదిశలా వ్యాపింపచేసినట్లుగా రామునిపై కృతి కట్టాడు. దక్షిణాది యాత్రా నిమిత్తమై కాశీ నుండొచ్చిన ఒక సంగీత విద్వాంసుడితో త్యాగరాజు హిందీలో సంభాషించాడనీ టి.లక్ష్మణ పిళ్ళై రాసారు. కానీ ఆ విద్వాంసుడి పేరు రాయలేదు. బహుశా ఆ విద్వాంసుడు ఈ గోపీనాథ భట్టాచార్య అయ్యే అవకాశముంది.

గోపాలకృష్ణ భారతి: నాగపట్టణం దగ్గర మాయవరం అనే వూళ్ళో గోపాలకృష్ణ భారతీ అనే ఒక తమిళ వాగ్గేయకారుడుండేవాడు. ఈయన తమిళంలో మంచి కవి. సంగీతకుటుంబం నుండి వచ్చినవాడవడం వల్ల అందులో కూడా ప్రావీణ్యముంది. ఓ సారి తంజావూరు వెళ్ళి తిరుగు ప్రయాణంలో త్యాగరాజుని కలుద్దామనీ వెళ్ళాడు. భారతి కోరిక మీద త్యాగరాజు తను స్వరపరిచిన కృతులు పాడాడు. ఆయన శిష్యులు ఆభోగి రాగంలో కృతులు పాడారు. అదయ్యాక గోపాలకృష్ణ భారతి ఆభోగి రాగంలో ‘సభాపతిక్కు వెరు దైవం’ అనే తమిళ కృతిని కట్టాడనీ చెబుతారు. త్యాగరాజుని కలిసిననంతరం ఆయన్ని చూసి స్పూర్తి పొంది గోపాలకృష్ణ భారతి అనేక రాగాల్లో కృతులు స్వరపరిచాడనీ అంటారు. ఈ గోపాల కృష్ణ భారతి త్యాగరాజుని 1841 సంవత్సరంలో కలిసాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ చోట రాసుకున్నాడు. ఈ గోపాలకృష్ణ భారతి త్యాగరాజుని కలిసే సరికి సుమారుగా ముఫ్ఫై ఏళ్ళు. ఈయన 1896 లో చనిపోయాడు.

మహరత్త: తిరువయ్యారులో మహరత్త సైనికుడొకాయన వుండేవాడు. ఆయన ప్రతీ త్యాగరాజు భజనకీ, కచేరీకీ విధి తప్పకుండా వెళ్ళేవాడు. ఓ సారి అతని శ్రద్ధా, భక్తీ చూసి త్యాగరాజు సంగీతం నేర్పనాని అడిగాడు. తనకి పాడడం రాదనీ, సంగీతానికి బదులు త్యాగరాజు గుర్తుగా ఆయన వదిలేసిన పాత పాదరక్షలిమ్మనీ అడిగాడు. త్యాగరాజు దానికి బదులుగా తను ధరించే పాదరక్షలిచాడనీ చెబుతారు. ఈ పాదరక్షల్ని మహరత్త కుటుంబం వారూ చాలాకాలం పూజించేవారు. ఆ తరువాతివి మదురై సౌరాష్ట్ర సభకి తరలించారు.

షట్కళ గోవింద మరారు: ట్రావెన్‌కోర్ సమీపంలో రామమంగళం అనే ఊరుండేది. అక్కడ గోవింద మరారు అనే సంగీత విద్వాంసుడుండేవాడు. ఈయన 1798లో పుట్టాడు. సంగీతంలో ఈయన జతిస్వరాలు పాడడంలో దిట్ట. మహత్తరమైన లయజ్ఞానం, రవజతి స్వరాల్లో ప్రావీణ్యం ఉండడంవల్ల ఏ పాటనయినా ఆరు కాలల్లో చక్కగా పాడగలిగేవాడు. ఈయన స్వాతి తిరునాళ్ ఆస్థాన విద్వాంసుడిగా వున్నాడు. త్యాగరాజుని 1842లో కలిశాడు.

ఈ గోవింద మరార్ ఏడు తీగలున్న తంబుర వాయించేవాడు. సాధారణంగా తంబురకి నాలుగే తీగలుంటాయి. ఒక్క మంద్ర స్థాయి తీగ మినహాయించి ఈయన తంబురకి మిగతావి రెండేసి చొప్పున తీగలుంటాయి. ఒక చేత్తో తంబురనీ, రెండో చేత్తో కంజీరనీ కలిపి వాయించేవాడు. త్యాగరాజు మరార్ కోరికపై కొన్ని కృతులు పాడాడు. ఆరోజు ఏకాదశి అవ్వడం వల్ల శిష్యులు దివ్యనామ కీర్తనలు పాడారు. పాడడానికి గోవింద మరార్ వంతొచ్చింది. ముందుగా అతి మెల్లగా అతి అతి విలంబిత కాలంలో పాడ్డం మొదలెట్టేసరికి త్యాగరాజు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత మెల్లగా అతి విలంబిత (2వ కాలం), విలంబిత (3వ కాలం), మధ్యమ కాలం (4వ కాలం), ధృత (5వ కాలం), అతి ధృత (5వ కాలం) లో పాడడం మొదలెట్టాడు. చివరగా అతి అతి ధృత కాలం (7వ కాలం ) లో పాడడం వచ్చేసరికి, ఏమాత్రం లయ తప్పకుండా అంత వేగంగా పాడడం చూసి ఆశ్చర్యపోయారనీ చాలామంది రాసారు. త్యాగరాజు ఈయన్ని ఎంతో మెచ్చుకున్నాడనీ బహుమతిగా ఈయన తంబురనిచ్చాడనీ, దానికి ప్రతిగా త్యాగరాజు ‘ఎందరో మహాను భావులు’ కృతి ఈయనకి నేర్పాడనీ చెప్పారు. ఆ తరువాత ఈయన ఉత్తరాది యాత్రలకెళ్ళినపుడు 1843లో పండరీపురంలో మరణించాడు.

ఈ గోవింద మరార్ కథ కూడా త్యాగరాజు చరిత్ర రాసినందరూ చెప్పారు. కాకపోతే ఎవరి శక్తికి మించి వారు ఊహాకల్పన చేసి రాసారు. ఒక్క సాంబమూర్తి గారిదే ఏ మాత్రం అతిశయోక్తులు లేకుండా ఉంది. ఎం. వెంకట రామయ్య రాసిన ‘త్యాగరాజ’ పుస్తకంలో కాస్త ఊహాకల్పనెక్కువగా కనిపిస్తుంది. ఈ గోవిందమరార్ ని కొంతమంది గోవిందదాసుగా రాసారు. ఈయనకి కలలో రాముడు కనిపించి తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని కలవమనీ, ఆ తరువాతే ఉత్తరాది యాత్రలకి వెళ్ళమనీ చెప్పినట్లుగా రాసారు.

( సశేషం )


Additional References:

  1. Tyagaraja and the south Indian Bhajana Sampradaya – Robert L Simon
  2. Tyagaraja – The Saint and Singer – 1968 Madras: Orient Longman – S.Y.Krishna Swami Madras
  3. Tyagaraja – M.VenkaTraamayya – 1963 Madras: M.W.N press
  4. Tyagaraja – The Devine Singer – Suddhaananda Bharati – 1968 Madras:Suddhaananda Library
  5. “త్యాగరాజ సంగీతము-వివాదములు” – వింజమూరి వెంకట నరశింహాచార్యులు –త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947: ఆంధ్ర గాన కళా పరిషత్తు – రాజమండ్రి