త్యాగరాజు చరిత్ర రాసిన ప్రతీవొక్కరూ ఈ యాత్రల గురించీ, అక్కడ స్వర పరచిన పంచరత్నాల గురించీ చెప్పారు. ఈ యాత్రలో జరిగిన కొన్ని సంఘటనలకి ఎన్నో విశేషాలూ, విశేషణాలూ చేర్చి మరీ చెప్పారు. పైన చెప్పిన రీతిలో కాకుండా యాత్రస్థలాల్ని అటు ఇటూగా మార్చి చెప్పారు. ‘త్యాగరాజ – ఎ గ్రేట్ మ్యుజీషియన్ సైంట్’ పుస్తకంలో, రామ స్వామి అయ్యర్ మద్రాసు సుందరేశ మొదిలియార్ తో త్యాగరాజు సంభాషణ ఎంతో నాటకీయంగా చెప్పారు. ఆ యాత్రా విశేషాలు మొత్తమూ త్యాగరాజుని దైవాంశ సంభూతిడిగా చిత్రీకరించడానికే వినియోగించారు.
పైన చెప్పిన సంఘటనా విశేషాలు కాక మరో సంఘటనుంది. ఇది మాత్రం 1900 తరువాత త్యాగరాజు పై వచ్చిన విశేష ప్రచార సమయంలో బయల్పడిన కథ. వెంకట రమణ బాగవతార్ కానీ, ఆయన కొడుకూ, మనవడూ ఎవరూ ఉటంకించని సంఘటనది. త్యాగరాజు రామ భక్తుడు కాబట్టి ఆయనకి రామ దర్శనమయ్యిందీ, ఆయన్ని ఎల్లవేళలా ఆ రాముడే కాపాడాడని చెప్పడానికీ క్రింది కథని చెప్పినట్లుగా తోస్తుంది. ఈ కథా సమయంలో స్వరపరిచినట్లుగా చెప్పబడిన కృతుల సాహిత్యాన్ని బట్టి వెనక్కి సంఘటనల్లిన జాడలు కనిపిస్తాయి.
మద్రాసు నుండి తిరువయ్యరు తిరుగు ప్రయాణంలో కోవూరు సుందరేశ మొదిలియార్ ఓ వెయ్యి బంగారు వరహాలు శిష్యులకిచ్చాడు. ఆ వరహాలు త్యాగరాజు ప్రతీ ఏటా జరిపే శ్రీరామనవమి ఉత్సవానికుపయోగించమనీ శిష్యులకి చెప్పాడు. ఈ విషయం త్యాగరాజుకి తెలీకుండా ఆయన పల్లకీలో పెట్టాడు. దారిలో ఓ అడవి వచ్చింది. ఎత్తైన చెట్లూ అవీ చూసి కొంత సేపక్కడ విశ్రమిద్దామని నిశ్చయించుకున్నారు. ఆ అడవి ప్రాతం నాగలాపురం దొంగలకి ప్రసిద్ధి. దారినపోయే వారిపై రాళ్ళతో దండెత్తి, వారి వద్దనున్న సొమ్ము దోచుకునేవారు. ఆ వేళ కొంతమంది దొంగలు దూరాన్నుండి త్యాగరాజు బస చేసిన ప్రదేశంపై వెనుకనుండి రాళ్ళు రువ్వడం పారంభించారు. త్యాగరాజు వద్దకి శిష్యులొచ్చి విషయం చెప్పారు. తమ వద్ద దోచుకోడానికేముందనీ, ఈ దొంగలకి భయపడనవసరం లేదనీ చెప్పాడు. అప్పుడు ఒక శిష్యుడు (వీణ కుప్పయ్యర్) వచ్చి వెయ్యి బంగారు వరహాల విషయం చెప్పాడు. అయితే అవి దొంగలకి వదిలేసి వెళిపోదామన్నాడు త్యాగరాజు. ఈ లోగా ఇంకో శిష్యుడొచ్చి (తంజావూరు రామారావు) ఆ వెయ్యి వరహాలూ త్యాగరాజుకోసం కాదనీ, శ్రీ రామనవమి ఉత్సవానికనీ చెబుతూ, అది రాముడి సొమ్మనీ చెప్పాడు. అది రాముడి సొమ్ము కాబట్టి రాముడే చూసుకుంటాడనీ త్యాగరాజన్నాడు. అలా చెబుతూ రాముడి ప్రార్థనలో మునిగిపోయాడు. ఆ భక్తిలో దర్బారు రాగంలో ఈ క్రింది కృతి కట్టాడనీ చెప్పారు.
పల్లవి. – ముందు వెనుకయిరు పక్కల తోడై
ముర ఖర హర రారాఅనుపల్లవి. – ఎందు కాన నీయందము వలె రఘు
నందన వేగమే రారా (ము)చరణం. – చండ భాస్కర కులాబ్ధి చంద్ర
కోదండ పాణియై రారా
అండ కొలుచు సౌమిత్రి సహితుడై
అమిత పరాక్రమ రారా (ము)చరణం. – ఓ గజ రక్షక ఓ రాజ కుమార
ఓంకార సదన రారా
భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య
త్యాగరాజ నుత రారా (ము)
ఈ కృతి చివర్లో ఉండగా యవ్వనంలో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ దొంగలపై బాణాలు కురిపించారు. దాంతో ఆ దొంగలు వెనక్కి పారిపోయారు. ఆ కుర్రాళ్ళిద్దరూ త్యాగరాజు వద్దకొచ్చి దొంగల భయం పోయిందని చెప్పి, త్యాగరాజు పల్లకీకిరువైపులా ఉండి ఆ అడవిని దాటించారు. పక్కనే ఉన్న ఊర్లో ఒక సత్రంలో దిగారు. ఆ దొంగలు దూరాన్నుంఛే త్యాగరాజుని అనుసరించారు. సత్రంలో దిగాక దొంగలొచ్చి త్యాగరాజు కాళ్ళపై పడి క్షమాపణలు కోరారు. పల్లకీ కిరువైపులా కాపలా వున్న కుర్రాళ్ళిద్దరూ కురిపించిన బాణ వర్షానికి తట్టుకోలేకపోయామనీ, ఆ కుర్రాళ్ళెవరనీ అడిగారు. అప్పటికే ఆ కుర్రాళ్ళు వెళిపోయారు. అప్పుడర్థమయ్యింది త్యాగరాజుకి. ఆ వచ్చిన వారెవరో కాదు, సాక్షాత్తూ రామ, లక్ష్మణులేనని. దాంతో ఆనందం పట్టలేక సారంగ రాగంలో ఈ క్రింది కృతి పాడాడనీ చెబుతారు.
పల్లవి. – ఎంత భాగ్యము మాపాల కల్గితివి
ఎవరీడు ముజ్జగములలో తన (కెంత)అనుపల్లవి. – చెంత జేరి సౌజన్యుడై పలికి
చింత బాగ తొలగించి బ్రోచితివి (ఎంత)చరణం. – మున్ను నీ సమీపమున వెలయు
సన్మునుల నెల్లనణిమాది లీలలచే
తిన్నగాను పాలనము జేసినట్టు
నన్ను కాచితివి త్యాగరాజ నుత (ఎంత)
ఇదీ ఈ కృతుల కథ. త్యాగరాజు పై వచ్చిన తొలినాటి రచనల్లో ఈ కథ కనబడదు. తరువాతొచ్చిన రచనల్లో ఎంతో వివరంగా, అద్భుతంగా చిత్రీకరిస్తూ వుంది. సాంబమూర్తి గారి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో ఈ కథ శిష్యుల పేర్లతో సహా వుంది. సాంబమూర్తి గారి ఊహలో తంజావూరి రామారావు ఈ యాత్రని మొదట్నుండీ పర్యవేక్షించాడు కాబట్టి ఆయనకీ బంగారు వరహాల గురించీ తెలుసుండాలి. అలాగే తంజావూరు రామారావు కి త్యాగరాజుతో చనువెక్కువ కాబట్టి ఆయన చెప్పిన సమాధానం వింటాడనీ అనిపించుండాలి. ఈ విధంగా మొదటి శిష్యుడి పేరు వీణ కుప్పయ్యర్ గానూ, రెండో ఆయన పేరు రామారావు గానూ చూపిస్తూ వివరంగా రాసారు. ఈ కథకి ఆథారాలు మాత్రం రాసినవారెవ్వరూ చూపించలేదు. ప్రయత్నంకూడా జరగలేదు. కేవలం కృతుల సాహిత్యాన్ని ఉటంకిస్తూ ఈ సంఘటనకి ఆపాదిస్తూ చెప్పారు. 1904వ సంవత్సరంలో సుబ్బరామ దీక్షితార్ అనే ఆయన తమిళంలో రాసిన త్యాగరాజు జీవిత చరిత్రలో ఈ కథలేదు. కానీ 1908లో వచ్చిన టి.నరసింహ భాగవతార్ (తిల్లైస్థానం శిష్యులు) రాసిన జీవిత చరిత్రలో ఈ కథుంది. ఆ తరువాతొచ్చిన ప్రతీ పుస్తకంలోనూ ఈ కథ సవివరంగా వుంది.
వెంకట రమణ భాగవతార్ కూర్చిన త్యాగరాజు కృతులుతో పాటు గురువుగారిపై ఆయన తెలుగులో రాసిన ప్రతి అందుబాటులో వుంది. అందులో త్యాగరాజుని స్వామి గా చిత్రీకరిస్తూ ఆయన్ని రామ అంశగా భావిస్తూ స్తుతించారు. అంతలా త్యాగరాజుని దేవుని అంశగా భావించిన వెంకట రమణ భాగవతార్ పైన చెప్పిన కథని విస్మరిస్తాడనుకునే ఆస్కారం కనిపించదు. పోనీ ఆయన అసంపూర్తిగానే త్యాగరాజు జీవిత చరిత్ర రాసాడని అనుకున్నా, చివరి దశలో త్యాగరాజుతో గడిపిన ఆయన కొడుకు కృష్ణ స్వామి భాగవతార్ కీ కథ తెలియకుండా ఉంటుందన్న అనుమానం రాదు. ఒకరు కాకపోయినా ఇంకో శిష్యుడైనా ఇలాంటి మహత్తరమైన సంఘటనలు చెప్పి తీరుతారు. కానీ ఎవరితో ప్రారంభమయ్యిందో తెలీదు, ఈ కథ మాత్రం 1900 తరువాతే బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానిజాలు పక్కన బెడితే ఈ సంఘటనకి సాధికారిత దొరకలేదు. ఇదొక్కటే కాదు, ఇలాంటివే మరికొన్ని కథలు మరికొన్నున్నాయి.
కేవలం రామభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నంలో త్యాగరాజు సంగీతాన్ని కొంచెం వెనక్కి నెట్టినట్లనిపిస్తుంది. త్యాగరాజు అసమాన్య ప్రతిభ కలిగుండడానికి కారణం రామభక్తుడవడంవల్లనే అన్న రీతిలో ఈ కథలు మలిచారు. త్యాగరాజు రామ భక్తుడే. ఎవరూ కాదనరు. కానీ ఈ మహత్యాల కథల్లో నిజా నిజాలెవరూ ధృవీకరించే ప్రయత్నం చేయరు. అందువల్ల త్యాగరాజుని ఓ సంగీత కారుడిగానే భావిస్తూ ఆయన జీవిత చరిత్రని చూసే అవకాశం లేకుండా పోయింది. పైగా వచ్చిన పుస్తకాలలో చాలా భాగం తేదీలు తప్పులతో నిండున్నాయి. పైన చెప్పిన ఉత్తరాది యాత్రనే తీసుకుంటే, కొంతమంది త్యాగరాజు సతీ సమేతంగా వెళ్ళాడని రాసారు. మరికొంతమంది భార్య పోయిన కొంత కాలాని కెళ్ళాడనీ రాసారు. ఇంకొంతమంది రామ విగ్రహాలు పోయినప్పుడు మనసు కుదుట పరుచుకోడం కోసం యాత్రలకెళ్ళాడనీ రాసారు. కొంతమంది ఈ యాత్రా సమయం 1839 అని రాసి, భార్యా సమేతంగా వెళ్ళాడని రాసారు. ఇంకొకరు భార్య సంగతి ఎత్తకుండా 1839లో ఈ యాత్ర జరిగిందని రాసారు. ఇలా తలోక్కరూ తలో విధంగా చెబితే ఏది ప్రామాణికంగా తీసుకోవాలో తెలీదు. ఏది చరిత్రకి దగ్గరగా ఉందో తెలీదు. మనకి చరిత్రని పొందుపరచుకునే అలవాటు లేదు. ఇలాంటివి ఆధారాలు చూపించాలంటే శిలా శాసనాలు కావాలి. లేదా చరిత్రకారులు రాసినవయ్యుండాలి.
పైన చెప్పిన కథలో త్యాగరాజు 1839లోనే మద్రాసు వెళ్ళాడు. అప్పటికి త్యాగరాజు వయాసు 72 ఏళ్ళు. ఈ యాత్రకి సంబంధించి కొన్ని వివరాలు మద్రాసు మ్యూజిక్ అకాడమీలో ఉన్నాయి. అలాగే కొన్ని మదురై సౌరాష్ట్ర సభలో ఉన్నాయి. అలాగే త్యాగరాజు భార్య 1804 లో పోయింది. కాబట్టి ఈ యాత్రలో భార్య ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఇలా ప్రతీ చిన్న విషయాన్నీ అతుక్కుంటూ పోతేనే మనకి చరిత్రకి దగ్గరగా వెళ్ళే అవకాశం వుటుంది.
జ్యోతి స్వరూపిణి
అమృత వర్షిణీ రాగం పాడితే వర్షం కురుస్తుందనీ సంగీతాభిమానుల నమ్మకం. ముత్తుస్వామి దీక్షితార్ ఈ రాగం పాడితే కరువు కాలంలో వర్షం కురిసిందనీ చెబుతారు. అలాగే సంగీతంలో కొన్ని రాగాలకి నిర్ధారిత ఉద్దేశ్యమే కాదు, నిర్దిష్టమైన అర్థం కూడా వుంది. త్యాగరాజు ‘జ్యోతి స్వరూపిణీ’ రాగం ఆలాపిస్తే కొడిగట్టిన దీపం వెలిగిందనీ ఒక కథుంది. పుదుకుట్టయి గెజిట్ లో పొందుపర్చిన వివరమే ఈ కథకి ఆధారం. పుదుకుట్టయి రాష్ట్ర నివేదిక రెండవ సంపుటి మొదటి భాగంలో “త్యాగరాజు పుదుకుట్టయి సందర్శించిన సందర్భంలో పుదుకుట్టయి రాజు సంగీత విద్వాంసులకి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. ఆరిపోయిన దీపాన్ని అగ్ని లేకుండా వారి గాత్ర శక్తితో వెలిగించాలని. ఆ సభలో అప్పుడున్న గురువు గారి ప్రోద్బలంతో త్యాగరాజు జ్యోతిస్వరూపిణి రాగంలో ఆశువుగా స్వరపరిచి పాడితే, ఆ గాత్ర మహిమకి ఆ దీపం వెలిగింది. వెలగడమే కాదు, రాగ ఎత్తుగడలననుసరించి ఆ కాంతి పెరిగి తగ్గుతూ వచ్చింది.’ అని రాసుంది. ఎవరు దీన్ని పుదుకుట్టయి గెజిట్ లో పొందుపరిచారో తెలీదు. ఈ గెజిట్ ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్ లో వుంది. అలాగే ఈ కథలో శొంఠి వెంకట రమణయ్య పేరు చెప్పకుండా గురువని మాత్రమే రాసి వూరుకున్నారు. వెంకట రమణయ్య తంజావూరు ఆస్థాన సంగీత విద్వాంసుడు. ఆయనా, ఆయన తండ్రీ జీవితమంతా అక్కడే గడిపారు. మరి ఈ పుదుకుట్టయి ఆస్థానంలో ఏ సందర్భంలో ఉన్నారో తెలీదు. పైన చెప్పిన గెజిట్ ఆధారం తప్ప ఈ కథని త్యాగరాజు శిష్యులెవరూ రాయలేదు. ఇంతకుముందు చెప్పినట్లుగా శ్రీరంగంలో రథం కదలడమూ, ఇలా జ్యోతి ప్రజ్వలన కావడమూ వంటి సంఘటనలు తెలిసి తెలిసీ శిష్యులెవరూ రాయకుండా వదిలేయరు. ఈ ఒక్క కథా తప్ప, త్యాగరాజు పుదుకుట్టయి వెళ్ళినట్లు ఆధారాలు కూడా అస్సల్లేవు. ఇలాంటి కథలు త్యాగరాజు యొక్క భక్తి తత్వానికి మహిమలు ఆపాదించడానికుపయోగ పడతాయి చారిత్రాత్మక ప్రమాణం ఇవ్వలేవు.