జావళీ కమలం: అప్పట్లో మువ్వనల్లూరు సభాపతి అయ్యర్ అనే ఆయనకి తంజావూరు పరిసర ప్రాంతాల్లో మంచి పేరుంది ఈ సభాపతి అయ్యర్ ‘రాజగోపాల’ అనే ముద్రతో పదాలు రాసాడు. ఈయన త్యాగరాజు రాసిన నౌకా చరిత్రం ప్రదర్శించాలని ప్రయత్నం చేసినా అది కుదరలేదు. ఈయన దగ్గర కమలం అనే నర్తకి నాట్యం నేర్చుకోడానికి చేరింది. ఈమె తంజావూరు రాజనర్తకిగా కావడానికెన్నో ప్రయత్నాలు చేసింది. ఎవరో త్యాగరాజు ఆశీస్సులు పొందమని సలహా ఇచ్చారు. ఈమె తిరువయ్యారు ప్రయాణం కట్టింది. త్యాగరాజుకి ఎదుట పడే ధైర్యం చాలక రామ అయ్యంగార్ అనే త్యాగరాజు శిష్యుణ్ణి సంప్రదించింది. ఓ రోజు త్యాగరాజు పాదాలపై బడి తాను సభాపతి శిష్యురాలనీ, త్యాగరాజు ఆశీస్సులకోసం వచ్చాననీ చెప్పింది. తరవాత త్యాగరాజు స్వర పరిచిన కృతి ‘ఎందు దాగినాడో’ కృతికి రాముని విగ్రహాలు వెతికేటప్పుడు పడ్డ బాధని ఎంతో హృద్యంగా అభినయించి త్యాగరాజు మెప్పు పొందింది. ఆ తరువాత ఇదే కృతిని తంజావూరు దర్బారు హాలులో త్యాగరాజు అభిమాని మోతీరావు ఎదుట ప్రదర్శించింది. ఆయన కృతికి కమలం అభినయం చూసి ఆమెను ఆస్థాన నర్తకి గా నియమించాడు. చిత్రం ఏంటంటే ఈ కమలం మరల త్యాగరాజుని సందర్శించలేదు. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కి శిష్యురాలిగా మారింది. ఆయన వద్ద తిరువారూర్లో చాలా కాలం సంగీతం నేర్చుకుంది.
ఈ కమలం ప్రస్తావన ముత్తు స్వామి దీక్షితార్ జీవిత చరిత్రలోనూ వస్తుంది. ఈ కమలం కథ సాంబమూర్తొక్కరే వివరంగా రాసారు. కాకపోతే ఆయన కమలం రాజనర్తకి కావడానికి ముందు త్యాగరాజుని సందర్శించిన విషయం రాయలేదు కానీ ఆ తరువాత ఆమెకి ఎంతో పేరొచ్చిందని మాత్రం రాసారు. అలాగే మోతీరావు ముందు నాట్య ప్రదర్శన సంగతీ రాయలేదు. ఈ వివరాలు హిందూ దిన పత్రికలో సంగీతంపై వచ్చిన వ్యాసాల్లో దొరికింది. అలాగే ముత్తుస్వామి దీక్షితార్ జీవిత చరిత్ర రాసిన ప్రతివారూ ఈ కమలం గురించి రాసారు. చిత్రంగా వాళ్ళెవ్వరూ త్యాగరాజుని దర్శించిందన్న విషయం రాయలేదు.
వడివేలు, స్వాతి తిరునాళ్: త్యాగరాజు ముఖ్య శిష్యుడైన కన్నయ్య భాగవతార్ ఊరూరా సంగీత కచేరీలు చేస్తూ త్యాగరాజు కృతులు పదిమందికీ తెలిసేలా చేసేవాడు. ట్రావెన్కోర్లో అతని కచేరీని ట్రావెన్కోర్ మహారాజు స్వాతి తిరునాళ్ ఆస్థానంలో వడివేలు అనే విద్వాంసుడు విన్నాడు. ఈ వడివేలుకి గాత్రంలోనే కాక వయొలిన్లో కూడా ప్రవేశం ఉంది. కన్నయ్య భాగవతార్, అలా తన సమక్షంలో చేసిన కచేరీలో స్వాతి తిరునాళ్ త్యాగరాజు కృతుల్లో సంగతుల ప్రయోగం చూసి మురిసిపోయాడు. ఎలాగైనా త్యాగరాజు ని తన ఆస్థాన విద్వాంసుడిగా చేసుకుందామనుకున్నాడు. తన దూతగా వడివేలుని తిరువయ్యారు పంపాడు. అప్పటికే అతని ఆస్థానంలో గోవింద మారార్, శివానంద, పొన్నయ్య, చిన్నయ్య, ఇరవి వర్మన్ తంబి, క్షీరాబ్ది శాస్త్రి, పరమేశ్వర భాగవతార్, మేరుస్వామి వంటి ప్రముఖ సంగీత విద్వాంసులున్నారు. కన్నయ్య భాగవతార్ అప్పటికే శరభోజి రాజు ఆహ్వాన తిరస్కారం వడివేలు కి చెప్పాడు. ఇది తెలిసి వడివేలు తన ప్రయత్నం విరమించుకుందా మనుకున్నాడు. కానీ మహారాజుకి తన నిర్ణయాన్ని చెప్పే ధైర్యం లేక తిరువయ్యారు బయల్దేరాడు.
వెళ్ళేముందు కన్నయ్య భాగవతార్ వీణ కుప్పయ్యర్ ని కలవమనీ, అతను త్యాగరాజుని కలిసేలా చేస్తాడనీ చెప్పాడు. వడివేలు వీణకుప్పయ్యర్ని కలిసినా త్యాగరాజుని కలవలేదు. త్యాగరాజుండే తిరుమంజన వీధి చివర ఓ ఇంట్లో బస చేసాడు. రోజూ ఉదయమూ, సాయంత్రమూ త్యాగరాజు ఆ ఇంటి మీదుగా కావేరీ నదీ స్నానానికి వెళ్ళే సమయం చూసుకొని వడివేలు సంగీత సాధన చేసేవాడు. అతనికి మంచి గొంతుంది. అపారమైన సంగీత జ్ఞానముంది. వడివేలు గాత్ర మాధుర్యాన్ని మెచ్చుకుంటూ తన ఇంటికొచ్చి పాడమని త్యాగరాజు అడిగాడు. ఆ మర్నాడు త్యాగరాజు సమక్షంలో తన సంగీత విద్వత్తునంతా ప్రదర్శించాడు. ఆ సమయంలోనే తను వచ్చిన వైనం చెప్పాడు వడివేలు. తను తప్పకుండా స్వాతి తిరునాళ్ ని తమ ఇద్దరి ఆరాధ్య దైవం సమక్షంలోనే కలుస్తానని త్యాగరాజు జవాబిచ్చాడు. స్వాతి తిరునాళ్ స్వయంగా వెళ్ళి త్యాగరాజుని కలుద్దామనుకున్నాడు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా మానుకోవాల్సి వచ్చింది. అప్పటికే టిప్పు సుల్తాన్, బ్రిటీషు వారి మధ్య యుద్ధాలతో ఆ ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. స్వాతి తిరునాళ్ ట్రావెన్కోర్ విడిచి వెళ్ళే సాహసం చేయలేకపోయాడు. ఆ విధంగా త్యాగరాజుని కలవలేకపోయాడు. చిత్రం ఏంటంటే అతి పిన్న వయసులో త్యాగరాజుకంటే ముందే అనారోగ్యంతో స్వాతి తిరునాళ్ మరణించాడు.
ఈ వడివేలు తిరువయ్యారు వెళ్ళిన కాలం 1829 ప్రాంతాల్లోనని సాంబమూర్తీ, రామస్వామి అయ్యంగార్, వారి రచనల్లో రాసారు. మరి కొంత మంది తేదీలు, సంవత్సరాల జోలికి పోకుండా కథ మాత్రం రాసారు. నిజానికి 1829 సంవత్సరం సరికాదు. ఎందుకంటే స్వాతి తిరునాళ్ మహారాజయ్యింది 1834 సంవత్సరంలో. కాబట్టి వడివేలు త్యాగరాజుని సందర్శించిన కాలం 1834 తరువాతే అయ్యుండాలి. Tyagaraja – A Great Musician Saint పుస్తకంలో రామస్వామి అయ్యర్, త్యాగరాజుని వడివేలు కలిసిన కథని ఎంతో నాటకీయంగా సంభాషణలతో సవివరంగా చెప్పారు.
ఉత్తరాది యాత్ర
జీవితమంతా త్యాగరాజు కావేరీ నదీ తీరాన తిరువయ్యారులోనే గడిపాడు. మహా అయితే తంజావూరు, తిరువారూరు తప్ప చుట్టుపక్కల ఉన్న వూళ్ళకి అంతగా వెళ్ళినట్లుగా తెలీదు. కానీ జీవితం చరమ భాగంలో అంటే డెబ్భై ఏళ్ళు వచ్చాక తీర్థ యాత్రల పేరున కాంచీపురం, తిరుపతి, మద్రాసు, శ్రీరంగం వంటి పుణ్య క్షేత్రాలు దర్శించాడు. ఈ తీర్థయాత్రలకి కారణం మద్రాసులో ఉండే కోవూరి సుందర మొదిలియారనే ఓ సంపన్నుడు. వెంకట రమణ భాగవతార్ది మద్రాసు సమీపంలో ఉన్న వాలాజపేట కావడం, శరభోజి రాజు ఆహ్వాన తిరస్కారంతో త్యాగరాజు పేరు మద్రాసు వరకూ ప్రాకింది. ఆ విధంగా త్యాగరాజు గురించి సుందర మొదిలియార్ కి తెలిసింది. ఎలాగైనా త్యాగరాజుని మద్రాసు రప్పించాలని ప్రయత్నించాడు. త్యాగరాజు అనుంగు శిష్యులైన వెంకట రమణ భాగవతార్, వీణ కుప్పయ్యర్ల చేత చెప్పించాడు. స్వయంగా తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని ఆహ్వానించాడు. చివరికి ఆయన ప్రయత్నం వేరొకరి ద్వారా ఫలించింది. ఆయనే కాంచీపుర మఠాధీశుడు ఉపనిషద్ బ్రహ్మం. ఆ సంఘటనకి దారితీసిన వివరాలు తెలుసుకునే ముందు ఈ ఉపనిషద్ బ్రహ్మం గురించి తెలుసుకోవాలి.
ఈయన అసలు పేరు రామచంద్రేంద్ర సరస్వతి. ఇతను వాసుదేవేంద్ర సరస్వతి శిష్యుడు. సంస్కృతం, వేదోపనిషత్తులూ బాగా నేర్చుకున్నాడు. తంజావూరు రాజుల వద్ద ఉపనిషత్తులపై ప్రసంగాలు చేసేవాడు. అక్కడే ఈ ఉపనిషద్ బ్రహ్మానికీ, త్యాగరాజు తండ్రి రామబ్రహ్మానికీ స్నేహం ఏర్పడింది. తండ్రితో పాటు త్యాగరాజూ ఈ రామాయణ ప్రసంగాలికి వెళ్ళినప్పుడు ఈయన్ని కలిసేవాడు. ఈయన రామబ్రహ్మం కన్నా పాతికేళ్ళు పైగా చిన్నవాడు. త్యాగరాజు కన్నా సుమారు ఇరవై ఏళ్ళు పెద్ద. ఈయనకీ రామభక్తి మెండుగా ఉండేది. తరచు వేదాంత విషయాలపై రామబ్రహ్మానికీ, ఇతనికీ మధ్య చర్చలు జరిగేవి. తంజావూరు రాజకీయ చిత్రపఠం 1780 నాటికి మారింది. ఆ సమయంలో రాజకీయ సుస్థిరత లేని కారణంగా అనేకమంది తంజావూరు దర్బారు విడిచి వెళిపోయారు. ఈ ఉపనిషద్ బ్రహ్మం కూడా తంజావూరు వదిలేశాడు. ఉత్తరాది తీర్థయాత్రలు చేసే నిమిత్తమై వెళ్ళి, చివరికి కాంచీపురం లో ఓ మఠం స్థాపించి స్థిర పడ్డాడు. ఈయన శంకరాచార్యుల వారి అద్వైత మతానికి ప్రచారకుడిగా ఉన్నాడు. అద్వైత మతానికి సంబంధించిన ముక్తోపనిషత్ లోని 108 ఉపనిషత్తులపై ప్రసిద్ధమైన వ్యాఖ్యానాలు రాసాడు. ఈయన కూడా సంగీత విద్వాంసుడు. ఈయన కూర్చిన భజనల ప్రభావం త్యాగరాజుపై కూడా ఉందని సంగీతజ్ఞుల అభిప్రాయం. దివ్యనామ సంకీర్తనలకీ, ఉపనిషద్ బ్రహ్మం కూర్చిన భజన కీర్తనలకీ చాలా పోలికలున్నాయని టి.పార్థసారధి రాసారు. ఉపనిషద్ బ్రహ్మం వాడిన పదజాలం కొన్ని త్యాగరాజు కీర్తనల్లో మెండుగా కనిపిస్తుందని చెప్పారు.
ఓసారి ఈ సుందరేశ మొదిలియార్ కాంచీపురంలోని ఈ ఉపనిషద్ బ్రహ్మం మఠాన్ని సందర్శించాడు. ఈ ఉపనిషద్ బ్రహ్మంతో మాటల సందర్భంలో త్యాగరాజు తండ్రీ, ఈయనకీ స్నేహం ఉందన్న విషయం తెలిసింది. మొదిలియార్ ఇహ ఆలస్యం చేయకుండా త్యాగరాజు సంగీత ప్రతిభ గురించి ఆయనకి ఎంతో ఎక్కువగా చెప్పాడు. ఇంతకుముందూ ఉపనిషద్ బ్రహ్మం త్యాగరాజు గురించి విన్నాడు. తనకి త్యాగరాజుతో ఉన్న పాత అనుబంధంతో కాంచీపురం రమ్మనమని లేఖ రాసి పంపాడు. ఈ లేఖని ముందుగా తంజావూరు రామారావు చేతికి అందేలా చూసాడు. భార్య కమలాంబ మరణానంతరం ఈయన త్యాగరాజుకి కార్యదర్శిలా ఉండేవాడు. మొత్తానికా శ్రీముఖం త్యాగరాజుకి చేరింది. త్యాగరాజుకి తిరువయ్యారొదిలి వెళ్ళడం ఇష్టంలేదు. తను లేకపోతే రోజూ రామపంచాయతనానికెవరు పూజ చేస్తారన్నవుద్దేశ్యంతో ఒప్పుకోలేదు. ఈ సందర్భంలో తోడి రాగంలో ‘కోటి నదులు ధనుష్కోటిలోనుండగ ఏటికి తిరిగెదవే ఓ మనసా’ అనే కృతిని రచించాడనీ చెబుతారు. ఈ కృతి అనుపల్లవిలో ‘సూటిగ శ్యామ సుందర మూర్తిని మాటి మాటికి జూచే మహారాజులకు’ అంటూ తన అయిష్టానికి కారణం చెబుతాడు.
ఉపనిషద్ బ్రహ్మం త్యాగరాజుకి గురు సమానులు. గురువుగారి విన్నపాన్నీ, కోరికనీ తోసిపుచ్చే ధైర్యం లేదు. ముందుగా శ్రీరంగంలో శ్రీ రంగనాధుణ్ణి దర్శించుకొని, అక్కడ నుండి తిరుపతి వెళ్ళి శ్రీ వేంకటేశ్వరుణ్ణి కూడా చూడాలన్ని కోరిక త్యాగరాజు వ్యక్తం చేయడంతో తంజావూరు రామారావు ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. త్యాగరాజుతో సహా దాదాపు ఇరవైమంది శిష్యుల వరకూ ఈ ప్రయాణం సాగించారు. ఆ విధంగా త్యాగరాజు ఉత్తరదేశ యాత్ర మొదలయ్యింది. ఆ యాత్రే మరికొన్ని పంచరత్న కీర్తనలు స్వరపరచడానికి నాంది పలికింది.
చైత్రమాసంలో ప్రతీఏటా తిరువయ్యారు పంచనదీశ్వర ఆలయంలో సప్తస్థాన ఉత్సవం అని ఒకటి జరుగుతుంది. ఈ ఉత్సవంలో క్రమం తప్పకుండా త్యాగరాజు ప్రతీ ఏడూ పాల్గొనేవాడు. ఈ పంచనదీశ్వర ఆలయం సమీపంలోనే మరో ఆరు దేవాలయాలున్నాయి. అవి తిరుచత్రుదురై, తిరువెదికుడి, తిరుప్పొందురితి, తిల్లైస్థానం, కందియూర్ మరియు తిరుప్పళనం. ఈ సప్తస్థానం ఉత్సవంలో శివుడు ఊరేగింపుగా పంచనదీశ్వరాలయంతో మొదలు పెట్టి, పైన చెప్పిన ఆలయాలన్నీ దర్శించి చివరకి తిరువయ్యారు చేరుకుంటాడు. ఈ ఏడు గుళ్ళకీ సంబంధించిన ఉత్సవం కాబట్టి సప్తస్థాన ఉత్సవం అన్నారు. ఆ ఉత్సవం రోజున తిరువయ్యారులో సంగీత సభలూ, కచేరీలూ అప్పట్లో జరిగేవి. ఉత్సవం తరువాత త్యాగరాజు శిష్యపరివారంతో కలిసి ఉత్తరాది తీర్థయాత్రలకి ముహూర్తం పెట్టారు. ఈ తీర్థయాత్ర జరిగింది 1939 సంవత్సరంలో! అప్పటికే త్యాగరాజుకి డెబ్భై రెండేళ్ళొచ్చేసాయి. వీలయినంత దూరం బండ్లమీద, కుదరనిచోట పల్లకీలోనూ త్యాగరాజుని తీసుకెళ్ళడానికి శిష్యులు ఏర్పాట్లు చేసారు.
శ్రీరంగం
ఉత్తరాది తీర్థయాత్రలో మొదట తిరుచురాపల్లి సమీపంలోనున్న శ్రీరంగం శ్రీ రంగనాథాచార్యుణ్ణి చైత్రోత్సవం సమయానికి దర్శించారు. అక్కడ అయిదు రోజులు బస చేసారు. ఈ అయిదురోజుల్లోనూ అయిదు పంచరత్నాలు స్వర పరిచాడు త్యాగరాజు. అవి – తోడి రాగంలో ‘రాజు వెడలె’, కాంభోజి రాగంలో ‘ఓ రంగ శాయీ’, ఆరభిలో ‘చూతము రారే సుదతులార రంగపతిని’, దేవగాంధారిలో ‘వినరాదా నా మనవి’, మరియు సారంగ రాగంలో ‘కరుణ జూడవయ్య’. ఈ అయిదు కీర్తనల్నీ శ్రీరంగ పంచరత్నాలుగా అభివర్ణిస్తారు. చిత్ర వీధిలో శ్రీరంగనాధ స్వామి ఊరేగింపుత్సవాన్ని చూసాక ‘రాజు వెడలె’ కృతిని స్వరపరిచి పాడాడనంటారు. ఈ శ్రీరంగ పంచ రత్నాల్లో ‘ఓ రంగ శాయి పిలిచితే’ కృతి ధాతు, మాతుల్లో అత్యంత విశేషత కలిగిన సంపూర్ణ రచన. కాంభోజి రాగంలో స్వరపరచినన్ని కృతుల్లోకీ ఇది ఉత్తమ శ్రేణి రచనగా సంగీత కారులు పరిగణిస్తారు. పల్లవిలోనే ఏడు సంగతులున్నాయి. అవి సముద్ర తరంగాల్లా ఒక దానితో ఇంకోటి అనుసరిస్తాయి. ఈ కృతి విని అమితంగా ఆకర్షితుడయ్యి వీణ కుప్పయ్యర్ కాంభోజి రాగంలో ‘కొనియాడిన’ అనే కృతి రచించాడు.
