ప్రక్షిప్తాలు
ప్రతీ సంగీతకారుడికీ, సాహిత్యకారుడికీ పాడే విధానంలోనయినా, రాసే సరళిలోనైనా వారికి ప్రత్యేకతను తెచ్చే ఒక ఒరవడుంటుంది. అలా పేరొందిన వారి సరళిని అనుసరించి వారి ముద్రతోనే ఉన్న రచనలని ప్రక్షిప్తాలంటారు. రాసింది చదివినా, పాడింది విన్నా మనం తేడా కనిపెట్టలేనంతగా ఉంటాయవి. ఏది మూలమో, ఏది ప్రక్షిప్తమో చెప్పలేనంత దగ్గరగా ఒకే పోలికతో ఉంటాయి. మహాభాగవతం రాసిన పోతనకీ, పద సంకీర్తనలు చేసిన అన్నమయ్యకీ, ఇలా ఎంతో మంది కవులకీ, వాగ్గేయకారులకీ ఈ ప్రక్షిప్తాలు ఉన్నాయి. అన్నమయ్య అయితే ఇలా తన పదాలననుసరించి రాసే వాళ్ళని ‘ఛాయాపహారులంటూ’ ఓ కీర్తన రాసాడు. అలాగే, ఇప్పుడు వాడుకలో త్యాగరాజు పేరు మీదున్న కొన్ని కృతులు ఆయన స్వర పరిచినవీ, రాసినవీ కావు. కానీ త్యాగరాజు పేరుతోనే పదిమంది నోళ్ళలోనూ నానుతున్నాయి. కనకాంగి రాగంలో ‘శ్రీ గణనాథం భజామ్యహం’ అనే కృతొకటుంది. అది త్యాగరాజు ముద్రతోనే ఉంది.
పల్లవి. – శ్రీగణ నాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదంఅనుపల్లవి. – శ్రీగురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)చరణం. – రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సు-భాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
ఇందులో చరణంలో చివరి పాదంలో త్యాగరాజ ముద్రుంది. కానీ అనుపల్లవి జాగ్రత్తగా గమనిస్తే అందులో ‘గురుగుహ’ అన్న పదం కనిపిస్తుంది. ఈ గురుగుహ అన్నది ముత్తు స్వామి దీక్షితార్ ముద్ర. మిగతా త్యాగరాజు కృతులన్నీ పరికిస్తే ఈ పదం ఒక్క కృతిలోనూ కనబడదు. త్యాగరాజు పేరుతో ఈ కృతి 1940 కాలంలో వాడుకలోకి వచ్చింది. “గురుగుహాగ్రజం, ఆంజనేయావతారం” వంటి విశేషాలను త్యాగరాజు చెప్పినట్లుగా కనబడే ఈ కృతి వాలాజపేట వారు పొందుపరిచిన కృతుల్లో కానీ, వీణ కుప్పయ్యర్ రాసుకున్న ప్రతుల్లోకానీ, మిగతా శిష్యుల దాచుకున్న వాటిలో కానీ ఈ కృతి లేదు. త్యాగరాజు కృతుల్లో ద్వితీయాక్షర ప్రాస గానీ, అంత్య ప్రాస గానీ ఒకే సారి వాడినట్లుగా కనబడదు. ఈ కృతిలో రెండూ ఉన్నాయి. అలాగే మిగతా సంస్కృత రచనల్లో కనిపించనంత గాఢమైన పదజాలం ఈ కృతిలో ఉంది. త్యాగరాజు రాసిన సంస్కృత కృతులు సరళంగానే ఉంటాయి. తోషణం, శింజిత వంటి పదాల వాడుక త్యాగరాజు మిగతా రచనల్లో ఎక్కడా లేదు. కాబట్టి ఇది ప్రక్షిప్తమయి వుంటుంది.
ఈ కృతిలో వాడిన పదాలు ముత్తుస్వామి దీక్షితార్ కృతుల శైలికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా భజామ్యహం అన్న పద ప్రయోగం ఈయన రచనల్లోనే కనిపిస్తుంది. త్యాగరాజు కృతుల్లో ఎక్కడా ఇటువంటి పద ప్రయోగం కనిపించలేదు. “ఈ కృతి కర్తృత్వము సందేహాస్పదముగా నున్నది. త్యాగరాజ స్వామి వారు మేళకర్త రాగములన్నిటి యందును కీర్తనలు చెప్పినట్లు నిర్ధారణ జేయుట కొరకు వారి శిష్య పరంపరలో గల కొందరు కొన్ని కీర్తనలకు రాగములు మార్చి పాడుటయూ, కొన్ని రచనలు తాము స్వయముగా చేసి త్యాగరాజ ముద్రాంకితముగా వాడుకలోనికి తెచ్చుటయు జరిగినదని కర్ణా కర్ణిగా తెలియుజున్నది. అట్టి కీర్తనలో ఇది ఒకటి కావచ్చును” అంటూ మంచాల జగన్నాధ రావు ‘త్యాగరాజ కృతులు’ అనే పుస్తకంలో అభిప్రాయ పడ్డారు. వేరే కృతులు ప్రక్షిప్తాలనే అనుమానంగా ప్రొ.సాంబమూర్తి చెప్పినా ఈ కృతి ప్రస్తావన లేదు.
అలాగే హిందోళ రాగం లో ‘సామజ వరగమన’ కృతికూడా ప్రక్షిప్తమేనని కొందరు సంగీతకారుల అభిప్రాయం. కానీ ఆ కృతి ప్రక్షిప్తం కాదని అనడానికే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఈ కృతిలో వాడిన కొన్ని పదాల వాడుక (ఉదా: ‘వేదశిరో’, ‘సామజ’) మిగతా త్యాగరాజ కృతుల్లోనూ కనిపిస్తాయి. సంగీతానికి మూలమైన సామవేదంలో సప్తస్వరాలూ వున్నాయి. ఈ అర్థంవచ్చే ‘వేదశిరో’, ‘నిగమశిరో’ వంటి పద ప్రయోగం త్యాగరాజ కృతుల్లోనే కనిపిస్తుంది. ఇది త్యాగరాజు కృతి కాదని అన్నారు కానీ, ఎందుకు కాదో, వేరే ఇంకెవరి రచనో ఎవరూ చెప్పలేదు. ఒక మంచి వరసతో వేరెవరయినా ఒక కృతి స్వర పరిచి నిజానికి మేమే వీటి స్వరకర్తలమంటూ ముందుకొచ్చిన అనేకమంది సంగీత కారులున్నారు. కె.వి. శ్రీనివాస అయ్యంగార్ స్వరపరిచిన హరికాంభోజి రాగంలో ‘వినుత సుత వాహనుడై’, సింహేద్ర మధ్యమంలో ‘నీదు చరణములే’ మరియు ‘నతజన పరిపాల’ వంటివి త్యాగరాజు కృతులేనన్న భావన చాలామందిలో వుంది. నీదు చరణములే కృతిలో త్యాగరాజు తన కృతుల్లో వాడిన ప్రాస కనిపించదు.
పైన చెప్పినవే కాకుండా, సురటి రాగంలో ‘పరాముఖమేలరా’, వివర్ధినిలో ‘అభిమానమెన్నడు’ కృతులు ఎం. రాజగోపాల అయ్యర్ కృతులనీ సాంబమూర్తి గారు 1950 లో ‘ది హిందూ’ దినపత్రిక సంగీత వ్యాసాల్లో వివరించారు. అలాగే తోడి రాగంలో ఉన్న ‘వెడలెను కోదండపాణి’ త్యాగరాజ కృతిగా చాలా ప్రాచుర్యం పొందింది. నిజానికది తంజావూరు కృష్ణభాగవతార్ రచన. ఆయన రాసిన రామాయణంలో వాడిన కృతది. ఈ కృతి రాగమూ, వరుసా ఒకాయనకి నచ్చీ, సాహిత్యాన్ని అటూ ఇటుగా మార్చి, త్యాగరాజ ముద్ర తగిలించి పాడడం మొదలెట్టాడు. ఈ విషయం తెలిసిన కృష్ణ భాగవతార్ ఆ సంగీతకారుడిపై మండిపడి తప్పుని సరిదిద్దాడని సాంబమూర్తి గారు చెప్పారు. ఈ కృతి వరుస ‘బృందావన లోల గోవిందారవింద’ కి అతి దగ్గరగా ఉంటుంది.
‘త్యాగరాజ సంగీతము – వివాదములు’ అన్న వ్యాసంలో వింజమూరి వెంకట నరశింహాచార్యులు సావేరి రాగంలోని ‘రామ బాణ త్రాణ శౌర్య-(మే)మని దెలుపుదురా ఓ మనసా’ కృతి వివాదం గురించి ప్రస్తావించారు. సావేరి రాగం ప్రధానంగా కరుణ, శోకరసాలు పలికించడానికి వాడే రాగం. అలాంటిది సావేరి రాగంలో ‘రామ బాణ త్రాణ’ అంటూ వీరరసం చొప్పించడం ఎంతవరకూ సమంజసం అన్నదా వివాదం. ఒకటే స్వరంతో దాని గమకమూ, ఛాయ మారిస్తే వేర్వేరు బేధభావములు పుట్టించ వచ్చనీ వింజమూరి వారి వాదన.
అలాగే త్యాగరాజు కొన్ని మేళ కర్త రాగాలు పేర్లు మార్చినట్లుగా కూడా కాస్త వివాదముంది. వేంకటమఖి అనే ఆయన మేళ కర్త రాగాలు 72గా విభజించాడు. ఈ పద్ధతినే ప్రస్తుతం అందరూ వాడుతున్నారు. కానీ త్యాగరాజు వాడిన సంగీతంలో రాగ పద్ధతికీ, వేంకటమఖి రాగాల పద్ధతికీ కొన్ని రాగాల్లో తేడా వుంది. మేళకర్త రాగాలయిన ‘కనకాంగి’, ‘రత్నాంగీ’ రాగాలు వేంకట మఖి పద్ధతి ప్రకారం ‘కనకాంబరి’, ‘రత్నాంబరీ’. కానీ త్యాగరాజు వీటిని ‘కనకాంగీ’, రత్నాంగీ’ అనే వాడాడు. ఇది సరికాదని కొందరి సంగీతజ్ఞుల అభిప్రాయం.
మరో వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ ‘కనకాంబరి’ రాగంలో ‘కనకాంబరి కారుణ్యామృత లహరి -కామాక్షి మామవ కామేశ్వరి’ అన్న కృతినీ స్వరపరిచాడు. ఈయన మాత్రం వేంకటమఖి పద్ధతినే అనుసరించాడనీ, త్యాగరాజు దీనికి భిన్నమైన పద్ధతవలంబించాడనీ కొంతమంది అభిప్రాయపడ్డారు. తన వ్యాసంలో వింజమూరి వెంకట నరశింహాచార్యులు పైన చెప్పిన దానికి కొంత వివరణ ఇచ్చారు. సంగ్రహ చూడామణీ అనే గ్రంధంలో ఈ కనకాంగి, రత్నాంగి రాగాలూ, వాటి జన్యాలూ ఉన్నాయని, అలాగే ‘భరత సంగ్రహము’ లో కూడా ఈ పేర్లే వున్నాయనీ అన్నారు. వేంకటమఖి పద్ధతి వీటి తరువాత వచ్చిందని అన్నారు. వాలాజపేట వెంకట రమణ భాగవతార్ పొందుపరిచిన వాటిల్లో మాత్రం కనకాంగీ, రత్నాంగీ పేర్లతోనే కృతులున్నాయి. ప్రస్తుతం ఇలాగే వాడుతున్నాము. పేర్లు వేరుగా కనిపించినా కనకాంబరీ, కనకాంగీ రెండూ ఒకటే. అలాగే రత్నాంబరీ, రత్నాంగీ కూడా.
తోడి రాగంలో ‘ఎందు దాగినాడో’ అన్న కృతుంది. అందులో రాముడి విగ్రహాలు పోయాయన్న విచారమూ, బాధా కనిపిస్తాయి. అలాగే ‘వెడలెను కోదండపాణి’ లో సంతోష భావం కనిపిస్తుంది. ఒకే రాగంలో రెండు విభిన్నమైన భావాలు పలికించడం శాస్త్రీయమేనా అన్న వివాదమొచ్చింది. శాస్త్రీయమే అని సంగీతజ్ఞులు నిర్ధారించినా, నిజానికి ‘వెడలెను కోదండపాణీ’ కృతి త్యాగరాజుది కాదు.
కొన్ని కృతులయితే ప్రస్తుతం పాడే రాగాల్లో త్యాగరాజు స్వరపరచలేదు. ఉదాహరణకి ‘మీవల్ల గుణదోష’ కృతి హిందూస్తానీ కాపీ రాగంలో కొంతమంది పాడుతారు. త్యాగరాజు కర్ణాటక కాపీ రాగంలో స్వరపరిచాడు. ప్రస్తుతం వాడుకలో పూర్వి కళ్యాణి రాగంలో పాడే ‘జ్ఞ్ఞాన మొసగరాదా’ కృతిని త్యాగరాజు ‘షడ్విధ మార్గిణి’ రాగంలో స్వరపరిచాడు. కానీ అనేక పుస్తకాల్లో, మంచాళ జగన్నాధ రావు ‘త్యాగరాజ కీర్తన’ల పుస్తకంతో సహా, పూర్వి కళ్యాణి రాగంలోనే అని ఉంది. ఈ రాగంలోనే చాలామంది పాడుతారు. ఈ కృతిలో ధాతువులు సరిగ్గా తెలీనందు వల్ల చాలామంది పూర్వికళ్యాణిగా పొరబడ్డారు. ఈ కారణాల వల్ల సాహిత్యం త్యాగరాజుదే అయినా, రాగ స్వరం మాత్రం ఆయనది కాదు. కళ్యాణి రాగంలో ఉన్న ‘సుందరి నీ దివ్య రూపమును’, ‘వాసుదేవయని’ మరియు ధన్యాసి రాగంలో వున్న ‘సంగీత జ్ఞానమూ’ కృతుల్లో కొన్ని చరణాలు త్యాగరాజ స్వర రచన కాదన్న అనుమానం కొంతమంది సంగీత కారులకుంది. సాహిత్యంలో ప్రక్షిప్తాలు రచన వరకే పరిమితం. కానీ సంగీత రచనలలా కాదు. సాహిత్యమూ, సంగీతమూ రెండూ, పూర్తిగా కానీ, కొంతభాగం కానీ ప్రక్షిప్తాలు అయ్యే అవకాశముంది.
వైణిక విద్వత్తు
త్యాగరాజు అమ్మ తరపు తాత వీణ కాళ హస్తయ్య పేరొందిన వైణికుడు. వీణ వాయిద్యమే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అలాగే త్యాగరాజు తల్లి వైణికురాలు. అందువల్ల త్యాగరాజుకి సహజంగా వీణా వాదనం వచ్చింది. చిన్నపటినుండీ గాత్రమే కాకుండా, వీణా వాదన కూడా నేర్చుకున్నాడు. త్యాగరాజు అద్భుతంగా వీణ వాయించే వాడనీ కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో ఉంది. కాకపోతే త్యాగరాజు కంఠస్వరం మధురంగా ఉండడంవల్ల ఆయన గాత్రానికే పెద్ద పేరొచ్చింది. త్యాగరాజు ప్రతీ దినమూ రాముణ్ణి పూజించాక చివరగా వీణ వాయించి పూజ ముగించే వాడనీ ఆయన జీవిత చరిత్ర రాసిన కొంతమంది చెప్పారు. త్యాగరాజు వీణ కచేరీ ఇచ్చినట్లుగా సి.తిరుమలయ్య నాయుడు రాసారు కానీ, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఇచ్చారో చెప్పలేదు.
త్యాగరాజు ముఖ్య శిష్యుల్లో ఒకడైన వీణ కుప్పయ్యర్ కూడా వైణిక విద్వాంసుడే! అసలు ఈ వీణకుప్పయ్యర్ త్యాగరాజు వద్దకి వీణా వాదనం నేర్చుకుందామన్న ఉద్దేశ్యంతో తిరువయ్యారు వచ్చాడు. త్యాగరాజు గాత్ర సంగీతం తప్ప వీణ నేర్పడని తెలిసినందువల్ల తనూ వైణికుడేనన్న విషయాన్ని దాచిపెట్టి అందరిలాగే గాత్రం నేర్చుకునేవాడు. ప్రతీ రోజూ శిష్యులకి పాఠం చెప్పేటప్పుడు త్యాగరాజు రాగంలో మెలకువలు వీణ మీద వాయించి చూపించేవాడు. త్యాగరాజు వీణా వాదనకి మంత్రముగ్ధుడయిన కుప్పయ్యర్ ఎలాగైనా గురువు గారి వీణనొకసారి వాయించాలనుకున్నాడు. ఓ సారి త్యాగరాజు పని మీద వేరే వూరెళ్ళిన సందర్భంలో ఎవరూ లేకుండా చూసి త్యాగరాజు వీణ తీసుకొని వాయించడం మొదలు పెట్టాడు. వీణా వాదన విని కమలాంబ త్యాగరాజేమో ననుకొని వాకిట్లోకొచ్చి అతని వాయిద్యానికి తన్మయత్వం చెంది అక్కడే కూర్చొని విన సాగింది. ఈలోగా త్యాగరాజు వస్తూనే వీణా వాదనం విని కుప్పయ్యర్‌ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత త్యాగరాజు వద్ద వీణలో కూడా మెలకువలు నేర్చుకున్నాడనీ కుప్పయ్యరే స్వయంగా పై కథని రాసుకున్నాడనీ సాంబమూర్తొక్కరే చెప్పారు. ఈ వివరం సుందరేశ శర్మ ‘త్యాగరాజ చరిత్రం’ లో కానీ, ఎస్. రామ స్వామి అయ్యర్ ‘ద సైంట్ త్యాగరాజ’ లో కానీ ఎక్కడా లేదు.