ముగింపు

అపు, కాజల్
అపర్ణ చనిపోటం, విషయం తెలిసిన అపు జీవితం పై విరక్తి చెందడం, అపర్ణ చావుకు తన కొడుకు ‘కాజల్’ కారణంగా భావించి, అపు కొడుకుని చూడకపోవటం – ఈ విషయాలన్నీ సినిమాలో వివరంగా చూపబడ్డాయి. దాదాపు నాలుగైదు ఏళ్ళ వయస్సు వచ్చిన కాజల్‌కి తన తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈ సినిమాలో కొన్ని సంఘటనల తరవాత తండ్రి – కొడుకుల కలయికతో సినిమా పూర్తి అవుతుంది. రాయ్ సినిమాల్లో ఇటువంటి ఉద్వేగపూరితమైన ముగింపు మరెక్కడా లేదేమో!
అపు చిత్రత్రయం – రాయ్ సినిమాల్లో రైలు దృశ్యాలు
అపు చిత్రత్రయం లోని మూడు సినిమాల్లోనూ రైలు దృశ్యాలకు ఒక ప్రత్యేకత ఉన్నట్టనిపిస్తుంది. ‘పథేర్ పాంచాలి’లో పిల్లలైన దుర్గ, అపు మొదటిసారిగా రైలు చూడటం ఒక మరచిపోలేని దృశ్యం. అలాగే, ‘అపరాజితొ’లో కూడా బాల్యంలో అపు నివసిస్తున్న పల్లెటూరుకి దూరంగా వెడుతున్న రైలు బండిని రాయ్ కొన్ని సార్లు చూపిస్తాడు. అదే సినిమాలో, అపు కాలేజీ చదువు కోసం తన పల్లెటూరు నుంచి కలకత్తాకి రాకపోకలలో విపులంగా రైలు ప్రయాణాన్ని చూపిస్తాడు. చివరిగా, ‘అపు సంసార్’లో కూడా, కొన్ని ఘట్టాల్లో రైలు బండిని చూపిస్తాడు. వీటన్నిటి వెనక ఏమైనా ప్రత్యేక అర్థం ఉందా? లేక, ఇలా చూపించటం వల్ల ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువ అవుతుందన్న ఆలోచనా?
రాయ్ పై చేసిన ఇంటర్వ్యూ చూడండి. రాయ్ ముందు పథేర్ పాంచాలి సినిమాలో రైలుని దూరంగా చూపిస్తాడు. అపరాజితొ సినిమాలో రైలుని దగ్గరగా చూపిస్తూ, అపు రైలు ప్రయాణాలని కూడా చిత్రీకరిస్తాడు. ఆఖరి సినిమా అపు సంసార్‌లో, అపు కలకత్తాలో ఉండే ఇల్లు రైలు స్టేషన్‌కి పక్కనే ఉంటుంది. అందుకనే సినిమాలో, కలకత్తాలో అపు ఇంటిలో జరుగుతున్న దృశ్యాలను చూపిస్తున్నప్పుడు, బ్యాక్‌గ్రౌండులో రైలు కూతలు, రైళ్ళు వచ్చే పోయే శబ్దాలు, బాగా వినిపిస్తూ ఉంటాయి. ఒక సన్నివేశంలో, ఈ రైళ్ళ కూతలను తట్టుకోలేక అపర్ణ చెవులు మూసుకుంటుంది. చాలా చోట్ల రైలుబండిని చూపించడం అన్న ఊహనం పథేర్ పాంచాలితో మొదలై, అపు సంసార్ సినిమాకి వచ్చేసరికి కాదనలేని ఒక యథార్ధ వాస్తవికత అవుతుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుకి తెస్తాను. రాయ్ సినిమాలు తియ్యటం మొదలుపెట్టక పూర్వమే, ప్రపంచ సినిమా తో రాయ్‌కి చెప్పలేని అనుబంధం, పరిచయం ఉన్నాయి. అందుకనే, రాయ్ సినిమాలకి ప్రేక్షకులు ‘ప్రపంచ ప్రేక్షకులు’. నా ఊహల ప్రకారం, రాయ్ తన సినిమాల్లో భారత దేశాన్ని ఎలా చిత్రీకరించాలి, దాన్ని విదేశీయులకు ఎలా చూపించాలన్న తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టనిపించింది. తన మొదటి సినిమా, అదీ బెంగాలీలో తీసిన ‘పథేర్ పాంచాలి’ ఒక్క బెంగాలీ ప్రేక్షకుల కోసం మాత్రమే చిత్రీకరించలేదు. తన సినిమాలన్నీ, భారతీయులకు మాత్రమే కాకుండా, విదేశీయులు కూడా చూడాలి, వాళ్ళకి నచ్చాలి అన్న ధోరణిలో తీసాడు. అందులో ఒక భాగంగా, భారతీయ గ్రామీణ జీవితాన్ని, సంస్కృతిని, విలువలని చిత్రీకరించాడు. అలాగే, కథాకాలం అయిన 1920-30 దశాబ్దాల్లో, భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేని రోజుల్లో భారతీయుల జీవితాల్లో రైలు ప్రయాణాలు అతి ముఖ్యమైనవి. రాయ్ భారతీయ జీవనాన్ని ప్రతిబింబించటానికి రైలు ప్రయాణాన్ని ఒక చక్కని మార్గంగా ఎంచుకున్నాడని నా అభిప్రాయం.
అపు ప్రపంచం

తన ప్రపంచంలో అపు
అపు చిత్రత్రయంలోని మూడు సినిమాలు, సంగ్రహంగా చూస్తే ఒక సగటు భారతీయుని జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. ఈనాటి తెలుగు, హిందీ సినిమాలకి అలవాటైన ప్రేక్షకులకి ఈ మూడు సినిమాలు అంత ఆకర్షణీయంగా కనపడక పోవచ్చు. ఎందుకంటే, ఈ మూడు సినిమాల్లో అందరి నాలుకలపై నిలిచిపోయే పాటలు, డాన్సులు, భయంకరమైన పోరాటాలు, హాస్యాన్ని పండించే సంభాషణలు కానీ లేవు. కంటికి ఇంపుగా కనిపించే దుస్తులు వేసుకున్న నాయికా నాయకులు కనిపించరు. నటనలో నాటకీయత లేదు. విలాసమైన జీవితాన్ని చూపించకపోగా పేదరికం, అందుకు సంబంధించిన జీవితం కనపడుతుంది. పైగా, ఈ సినిమాలని అర్థం చేసుకోటానికి ప్రేక్షకులు సమయాన్ని, ఆలోచనలని వెచ్చించాలి. కానీ, ఒక్కటి మాత్రం నిజం. ఈ కష్టాలని దాటుకొని వెడితే ఈ సినిమాలు చాలా ఆనందాన్ని ఇవ్వగలవు. సినిమా అన్న మాధ్యమాన్ని బాగా తెలుసుకోటానికి ఈ సినిమాలు ఉపయోగపడతాయి. అన్నిటి కంటే, ఒక సినిమా దర్శకుడిగా రాయ్ ఒక సినిమా నుంచి తరవాత సినిమాకి ఈ మూడు సినిమాల్లో, ఎలా పరిణతి చెందాడో గమనిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.
1960 మార్చిలో, ఢిల్లీలో జరిగిన అపు చిత్రత్రయం ఉత్సవాల గురించి సండే స్టేట్స్‌మాన్ పత్రికకు సమీక్ష రాస్తూ అమిత మల్లిక్ ఇలా అన్నాడు: “ఒక్కో సినిమాతో దర్శకత్వపు విలువలు – మొదటి సినిమా అమాయకత్వంతో కూడిన శైశవ దశ; రెండవ సినిమా యుక్తవయస్సు వచ్చి జ్ఞానం సమకూర్చుకున్న దశ; మూడవ సినిమా ప్రయత్నపూర్వకమైన నిర్మాణం ద్వారా సినిమా పరిశ్రమలో ఉండే కష్ట సుఖాలని అధిగమించగలిగే దశ – పెంచుకుంటూ, మృదువుగా, మానవత్వపు విలువలు ఏమాత్రం విస్మరించకుండా చిత్రీకరించటంలో రాయ్ ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగాడు.”
అన్నిటికంటే గుర్తుపెట్టుకోవలసింది జేమ్స్ పవర్స్ హాలీవుడ్ రిపోర్టర్‌కి రాసిన సమీక్ష: “హాలీవుడ్‌కి ఇలాంటి సినిమాల గురించి తెలుసుకోటం, వీటి విజయాలను అమోదించటం చాలా మంచి విషయాలు. ఒక కెమేరా కన్నా పెద్దగా మించని పరికరాలు, ఈ సినిమాలు చిత్రీకరించటంలో ఉన్న స్వంత ఆలోచనలు, ఈ సినిమాల్లో ఉన్న గొప్ప సాంకేతిక విజయాలకు మూల స్తంభాలు అనటం కన్నా, అసమాన ప్రతిభ కలిగి వీటి చిత్రీకరణకు మూల కారణం అయిన దర్శకుడి జీనియస్‌ని హాలీవుడ్ గుర్తించాలి.”
ప్రశంసలు
రాష్ట్రపతి బంగారు పతకం, న్యూ ఢిల్లీ 1959; సుదర్లాండ్ బహుమతి – ఉత్తమ ఊహాత్మక చిత్రం, లండన్ 1960; డిప్లమో ఆఫ్ మెరిట్, 14వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, ఎడింబర్గ్, 1960; ఉత్తమ విదేశీ చిత్రం, మేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఆఫ్ మోషన్ పిక్చర్స్, యూ.ఎస్.ఏ., 1960.
ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, డివిడి
- అపు సంసార్ సినిమా డీవీడీ. సత్యజిత్ రాయ్ బాక్స్ సెట్ నుంచి.
- “The Inner Eye“, Andrew Robinson, University of California Press, 1989.
- “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971.
- “Our films their films“, Satyajit Ray, Orient Longman Limited India, 1976.
- “పథేర్ పాంచాలి”, బిభూతి భూషన్ బందోపాధ్యాయ్, తెలుగు అనువాదం – మద్దిపట్ల సూరి, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, జులై 2008.
- ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు కొన్ని సత్యజిత్‌రాయ్.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి.
