నాచన సోమన చతుర వచో విలాసం

ఉండుట తప్పు, వారికడ నుండమి తప్పిట రాక తప్పు, రా
కుండుట తప్పు, తప్పులకు నొప్పులకుం గతి నీవ దేవ! యే
నొండొకరుండనే, పలుక కూరక నేరక యుండ జేయు వీ
ఱిండి తనంబు చేత నిసిఱింతలు వాఱెడి జిత్త మిప్పుడున్

అని నీళ్ళు నములుతాడు. ఏమి చెయ్యాలో తెలియని వెఱ్ఱితనంతో నా మనసంతా కంపిస్తోందని చెప్పుకుంటాడు. అలా అంటే సరిపోదుకదా. దూతగా వచ్చినప్పుడు రాజు చెప్పిన విషయాన్ని ఒప్పైనా తప్పైనా చెప్పక తప్పదు. అదే అంటాడు కృష్ణుడు. “చల్లకువచ్చి ముంత దాచినగతి” ఇలా మాట్లాడ్డం ఎందుకంటాడు. పైగా, పాముకాటుని చీరతో తుడిచేస్తే పోతుందా, ఇప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదని కూడా అంటాడు. ఇక్కడ కృష్ణుడి పరిస్థితి కత్తిమీద సాములాంటిది. ఒకవైపు తన శత్రువులైన హంసడిభకులు, మరో వైపు తన భక్తుడైన జనార్దనుడు. అతన్ని భక్తునిగా చూసి ప్రసన్నంగా మాట్లాడితే రాజుగా తను చులకనవుతాడు. అదే కఠినంగా మాట్లాడితే తన భక్తుడు నొచ్చుకుంటాడు. అందుకే అలా మధ్యే మార్గంలో మాట్లాడతాడు. అప్పుడు చేసేది లేక జనార్దనుడు విషయం బయట పెడతాడు. అక్కడకూడా ఎంత చాకచక్యంగా చెప్తున్నాడో చూడండి:

అనుడు నతండు హంసడిభకానుమతంబున రాజసూయమున్
జనపతి సేయబూని భుజసారమునన్ సడిసన్న రాజులన్
ధనములు చాల దెండని పదంపడి దేవర యున్నచోటికిన్
నను బనిపంపె నిన్ను యజనంబున మున్నిడి చేయువాడుగాన్

రాజసూయం గురించి చెప్పాడు, భుజబలంతో రాజులందరినీ చాలా సొమ్ములని తెమ్మనడం చెప్పాడు కాని కృష్ణుడిని అడిగిన కప్పం గురించి చెప్పలేదు. తననిక్కడికి పంపించారని మాత్రం చెప్పాడు. పైగా, అగ్రతాంబూలం ఇవ్వడానికేమో అని కూడా అన్నాడు. ఇది జనార్దనుడు చేర్చిన మాట!

అప్పుడా హంసడిభకు లిట్లనిరి మనకు
లవణ మెంతేని నడుగు యాదవుల చేత
వేగ రమ్మను శౌరి నియ్యాగమునకు
నావుడుం బని పూనితి దేవదేవ

“అలా బయలుదేరినప్పుడు హంసడిభకులు, వస్తూ వస్తూ మిమ్మల్ని కాస్త ఉప్పు పట్టుకురమ్మని చెప్పమన్నారు. యాగానికి వేగంగా రమ్మన్నారు” అని ఊరుకున్నాడు. ఇక్కడా కప్పం ప్రసక్తి వాచ్యం చెయ్యలేదు! జనార్దనుడి మాటల నేర్పుకి ఇది పరాకాష్ఠ. ఎంత నేర్పుగా మాట్లాడినా అందులోని ఆంతర్యం గ్రహించలేనివాడా కృష్ణుడు? గ్రహిస్తాడు. “రోసంబునకు మూలంబైన హాసంబు జేసి” తీవ్రంగా స్పందిస్తాడు.

రాజసూయ కర్త బ్రహ్మదత్తుం డట్టె
రభస మెసగ హంసడిభకు లట్టె
చేయ బంచువారు చెల్లెబో లవణంబు
మోచువాడ కాక మురవిరోధి

ఇందులో మళ్ళీ వెటకారం ధ్వనించే ‘ట’కార ప్రయోగం ఉంది! “రాజసూయం చేసేవాళ్ళు వాళ్ళూను, వాళ్ళకి ఉప్పుని మోసుకెళ్ళేవాడు కృష్ణుడును, బలే!” అని అనడంలో తెలుగు వ్యవహారంలోని వ్యంగ్యమంతా వినిపించడం లేదూ! రణరంగంలో శత్రువులతో ఉప్పనబట్టెలు ఆడడానికీ, ఉప్పుపాతర వెయ్యడానికీ మాత్రమే యాదవులు ఉప్పు తెస్తారని వెళ్ళి వాళ్ళకి చెప్పని సమాధానమిస్తాడు.

వెదుకంబోయిన తీవ కాలదవిలెం, వేయేల, దుర్వాసుచే
మొదలన్ సంచకరంబు హంసడిభకోన్మూల క్రియా కేళికిం
గుదురై యున్నది, సాటిగాక యిట మత్కోదండ కాండోదర
ప్రదర ప్రావరణాంబుద ప్రకట శంపాకంప శాత్కారముల్

వ్యవహార గ్రాంధిక భాషల శక్తి పూర్తిగా కనిపించే పద్యమిది! చివరి సమాసం కృష్ణుని శౌర్యోద్ధతిని చక్కగా పట్టి ఇస్తుంది.

హరి గదావిహార మల్లంత దోచిన
వరము మిమ్ము గావ వలతి యగునె
వెఱ్ఱివార పిడుగు వ్రేసిన దలటొప్పి
యాగునే వివేకమైన వలదె

“వెఱ్ఱివాళ్ళల్లారా! మీరేదో శివుడి వరాలున్నాయని విర్రవీగుతున్నారేమో. ఈ హరి గదా విహారమ్ముందు అలాటివేమీ పనిచెయ్యవు. నెత్తిన పిడుగు పడితే తలపై టొపీ రక్షిస్తుందా!” అని హంసడిభకులతో చెప్పమంటాడు. ఇలాటి సందర్భోచితమైన సామెతలనీ సామ్యాలనీ ప్రయోగించడంలో సోమన సిద్ధహస్తుడు!

సంభాషణలకి ప్రాణం భాష

పాత్రలకి ప్రాణం పోసేవి సంభాషణలైతే, సంభాషణలకి ప్రాణం పోసేది వ్యావహారికత గుబాళించే భాష. ప్రతి భాషకీ వ్యవహారంలో విలక్షణమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి, జీవన విధానం ఆధారంగా ఏర్పడే లక్షణాలు. సంభాషణలకి ప్రాణం పోసే లక్షణాలివే. మన తెలుగు భాషకి కూడా అలాటి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మన రోజువారీ సంభాషణల్లో అడుగడుగునా కనిపించే సామెతలు జాతీయాలు, ‘సాత్యకి-గీత్యకి’, ‘వరము-గిరము’ వంటి నిందార్థక పదాలు, వెక్కిరింపు ధ్వనులు (‘ట’కార ప్రయోగము వంటివి), కాకు ధ్వని, మొదలనైవన్నీ ఇలాటి లక్షణాలే. సోమన సంభాషణలలో యీ వ్యావహారిక భాషా విలాసం అడుగడుగునా కనిపిస్తుంది. పైన ఉదహరించిన చాలా పద్యాలలో ఇప్పటికే వీటిని మీరు గమనించి ఉంటారు. అయినా మరొక్క ఉదాహరణ మాత్రం ఇచ్చి ముగిస్తాను. నరకాసురుడు తనకే యజ్ఞ భాగాన్నిమ్మని బదరికాశ్రమంలో మునులని గద్దించినప్పుడు వారి సమాధానం ఇలా ఉంటుంది:

మనుజాశనులట బలులట
మునులట యాగంబులట నమో విశ్వసృజే
వినమింతకు మున్నెన్నడు
గని కని కొఱ్ఱెవ్వడింటి కంబము సేసెన్

“మనుషులని తినేవాళ్ళట, బలవంతులట! మునులట, యాగములట… దేవుడా! ఇంతకుముందెప్పుడూ వినలేదయ్యా, చూస్తూ చూస్తూ శూలాన్నెవరైనా ఇంటి స్తంభంగా చేసుకుంటారా!” పై పద్యానికీ ఈ వచనానికీ తేడా ఎంత తక్కువో గమనించండి. పదాలు ఇప్పటి వాడుక తెలుగులోకి మారడమే తప్ప వాక్య నిర్మాణంలో పెద్ద తేడాలేదు కదా. అచ్చమైన వాడుక భాష పద్యాలలో రాసే విధానానికి ఇది ఉదాహరణ. వాడుక తెలుగులోని ప్రత్యేకత ఈ పద్యంలో అణువణువునా కనిపిస్తుంది. తిరస్కారాన్ని తెలిపే ‘ట’కారం, సగం సగం మాటలు మాత్రమే చెప్పడం, ‘అయ్యో దేవుడా!’ అనే నుడికారం (దీన్ని సంస్కృతంలో ప్రయోగించడం వెటకారాన్ని మరింత ఎగదోస్తోంది), పోలికకి ఒక సామెత వాడకం ఇవన్నీ మన తెలుగు సంభాషణలకి సొంతమైన సొగసులు. వీటిని పట్టుకోవాలంటే కవికి పుస్తక పాండిత్యం సరిపోదు, సజీవమైన భాషలోని సొగసులు, జిగి బిగి తెలిసుండాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తనంత మంచి వచనం రాయడానికి ముఖ్య కారణం ఇంట్లోనీ ఇరుగుపొరుగున ఉన్న ఆడవాళ్ళ సంభాషణలు వినడంవల్లనే అని చెప్పుకున్నారు కదా! పద్య కావ్యాలైతే సంభషణల్లోని ఆ ఒడుపంతా పద్యాల్లో పెట్టగలిగే నేర్పు కూడా అవసరమవుతుంది. అలాటి నేర్పు సోమనకి పుష్కలంగా ఉందని ఉత్తరహరివంశంలోని సంభాషణలు ఋజువు చేస్తాయి.

చివరగా కొన్ని ప్రశ్నలు

సంభాషణా రచనలో నాచన సోమన కనపరచిన ప్రజ్ఞని ఈ వ్యాసంలో పరిచయం చేసుకున్నాం. సంభాషణలు పాత్రలని ఎలా ప్రాణవంతం చేస్తాయో చూసాం. వ్యావహారిక భాష సంభాషణలకి ఎలా జీవం పొయ్యగలదో తెలుసుకున్నాం. ఉత్తరహరివంశంలోని ఈ వ్యవహార భాషా విలాసం గమనించాక, నాలో కొన్ని ప్రశ్నలు చెలరేగాయి. కాలానుగుణంగా మార్పు చెందడం భాషకి సహజ లక్షణం. అయితే, భాషా శాస్త్రవేత్తల ప్రకారం ఈ మార్పు వర్ణాలు, పదాలలో ఎక్కువ జరుగుతుంది. అంటే కొన్ని వర్ణాలు పోవడం కాని, కొత్త వర్ణాలు రావడం కాని, పదాలలో (రూపము, అర్థము) మార్పు, కొత్త పదాల చేరిక మొదలైనవి. వాక్య నిర్మాణంలో మార్పు తక్కువగా వస్తుంది. ఇవన్నీ భాష బాహ్య లక్షణాలు. పైన చెప్పుకున్న వాడుక భాషలోని సొగసులు భాష కుండే అంతర్గత లక్షణాలు. భాష పైపైన ఎంతగా మార్పు చెందినా, అంతర్గతమైన ఆ లక్షణాలు అలాగే కొనసాగుతాయి. వాటిలో మార్పు భాషా సంస్కృతులలో పెనుమార్పుని సూచిస్తుంది. మరి, ఇప్పటి మన తెలుగు భాషలో ఈ లక్షణాలు ఎంతవరకూ కనిపిస్తున్నాయి? ఏ రకంగా మార్పు చెందుతున్నాయి? ఈ మార్పు యొక్క లక్షణమేమిటి? ఈ ప్రశ్నలు కేవలం భాషా శాస్త్రవేత్తలకే పరిమితం కాదు. తెలుగువాళ్ళందరమూ ఆలోచించవలసినవి కదూ!