భ్రంశధార
అలలు తలలూపుతున్నాయి
ఎలదోట వంపుల్ని వెలిగిస్తోంది వెన్నెల
నీటిగాలికి పులకించిపోతోంది నియమగిరి
రెప రెపల రేయింక అలసి నిల్చుంది.
పెరటి గుమ్మం దిగి రా రజియా
గులక రాళ్ళని తట్టి ఏనాటి ఊసులో తలబోసి
దిగులుపడి వెనుదిరిగిపోతోంది నది
దాని గుస గుసలు ఒదిగి వింటున్నాయి చేలు,
రాళ్ళు.
శాక్యముని ఏ వెయ్యేళ్ళనాడో
ఈ కాళింగ శిలలనే తలగొన్న
మనిషి కడగండ్ల మోఁత ఎద పెనగులాట
వెలవెల గొంతు ఎడ లేక
వినిపిస్తోంది చూడు
ఎండు సైకత సీమ గుండె తడి
మౌని చేవ్రాలు
మున్నీటి పాలు.
అడుగుకొక గుడి నిలబెట్టుకున్న ఈ పాషాణాలలో నేడు
నమ్మకాలేం లేవు
అమ్మకానికి కొన్ని స్మృతులు తప్పించి.
ఈ ముసలి ఏరెంత ఒంటరిది రజనీ, దీని వెత
నియమగిరి వేణువుల పగులు గుండెల కీచు
శ్రుతిలేని పాట,
మతిలేని మాట.
తీర్చిదిద్దిన రేఖల్లాంటి నీ పెదవుల తడిని
కాంతి మెరిసే చోటు ముద్దాడుకోనీ,
ఒద్దు
హాయిగొలిపే ఈ పాల వెన్నెల్లోన
నీటి వన్నెల్లోన గాలి సైగల్లోన
లేదు, ఏ అందమూ లేదు
ఈ తలపు చెఱశాల ఏ ప్రేమమూ లేదు
ఈ కాటి దిబ్బల వెనుక ఏ దీపమూ లేదు
సన్నని తీగెలా ఎగబాకి చుట్టుకొను నొప్పికి
ఇక్కడే సాయమూ లేదు పాపా
నీ బేల ఆశలకు ఎదుట
ఏ న్యాయమూ లేదు
ఈ కటిక బలి బయలు
మనుగడొక కలవరం రజితా ఇది
నిశిరాత్రి గతిమాలి
తోవ తప్పిన సైన్యాల వెఱ్ఱి వెంపర పోరు
వట్టి
నరఘోష.
(Inspiration: Matthew Arnold, Dover Beach)
Subrahmanyam Mula అభిప్రాయం:
March 1, 2009 9:00 am
మౌని చేవ్రాలు
మున్నీటి పాలు.
కవితంతా నిండిన తడి పాఠకుడి కళ్ళలోనూ చేరుతుంది కవిత పూర్తవగానే.. “ఈ ముసలి ఏరెంత ఒంటరిది” అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పలేను. నిజంగా వంశధార ఒడ్డుకి వెళ్ళొచ్చినట్టుంది. తప్పక రాస్తూ ఉండండి.
విభు అభిప్రాయం:
March 22, 2009 10:56 am
కనకప్రసాద్ గారు,
మానససరోవరంలో గురి చూసి విసిరిన గులకరాయి మీ కవిత.
వలయాలతో కలవరం సృష్టిస్తోంది.
లోతు తెలియదు - అలలు ఆగవు.
rich, striking imagery ; unique expression.
Always loved reading your stuff. Thank you.
raman అభిప్రాయం:
April 3, 2009 4:40 pm
ఎంత చ క్కగా వ్రాసారు సారు
దీనికి ముందు కవిత దాని మీది అభిప్రాయాలు చదివి చాలా పిచ్చెక్కింది
ఇప్పుదు మనసు చాలా తెలికయ్యింది
మరీ మరీ చదవాలనిపించింది.
థన్యవాదాలు.
rajasankar kasinadhuni అభిప్రాయం:
May 1, 2009 6:49 pm
కనక ప్రసాదు గారి స్థాయిని సూచించే మరొక మంచి కవిత. ఒక చిన్న అనుమానం. నాకు తెలిసి Dover Beach లోని ఏజియాన్ సముద్ర ఘోష ప్రసక్తి సోఫోక్లీస్ విరచిత “ఈడిపస్ రెక్స్” లో ఈడిపస్ రాజు మనోవేదనని తెలియ చేసేది. తను తెలియక వివాహమాడినది తన తల్లినని తెలుసుకుని ఈడిపస్ ఏజియాన్ సముద్రం ఒడ్డున నిలబడి పరితపిస్తాడు. మరి భ్రంశధార కవితలో శాక్యముని ఎవరు? ఈయన కూడా సొఫోక్లీస్ వలనె tragedies వ్రాయడంలో ప్రసిద్ధుడా? Or am I looking for too much correspondence between Dover Beach and BhraMSadhAra?
విధేయుడు,
రాజాశంకర్ కాశీనాథుని