స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత

కాలం మారింది. మాటలు మారాయి. అనుభవాలు చెప్పే గొంతుక మారింది. ఇప్పుడు స్మైల్ రాసిన పద్యం చదవండి.

రమించేసుకున్నాం కదా
ప్రపంచం కావాలిప్పుడు –

వూరికినే గది చుట్టూ చూస్తా
నా బూతులు మా మూలుగులు
అర్థం పర్థం లేని మా మాటలు
గోడ మీద ఆ రెండు బల్లుల్లా
అంటుకుపోయి అలా అలా కదుల్తున్నట్టు –
నవ్వొస్తుంది.
సీలింగ్ ఫ్యాన్ స్టీల్ కంట్లో
నా అర్ధ నగ్న శరీరం మసగ్గా గిరగిరా –

ఆవిడ
గోడవైపుకు తిరిగి చీర కట్టుకుంటూ –
ఛాతికే తప్ప
వీపుకేం సిగ్గుండదేమో వీళ్ళకి
నవ్వొస్తుంది.

ప్రేమించేసుకున్నాం కదా
ప్రపంచం కావాలిప్పుడు

యుగయుగాలుగా గాలికి తెరిచే వుంచినట్టు
గది తలుపుల్ని కాస్త దోరగా తోసి
కిటికీల్ని బార్లా తీసి
ఆకాశాన్ని వెలుగు వాసనల్నీ గదిలోకి
ఆహ్వానించి
తల దువ్వుకుంటోందావిడ –
అద్దంలోంచి అలవోగ్గా చూస్తూ.

ముసిముసి నవ్వుల్లో తేలుతున్న
లంగరేసిన పడవే ఆవిడ

తల దువ్వుకుంటోంది
ఏం జరగనట్టు
అసలేం జరగనట్టు
సెలవుల మధ్యాహ్నపు ఆటల్లో పిల్లల
అల్లరి యేం విన్పించనట్టు
అసలేం జరగనట్టు

(రచన ప్రారంభ సంచిక – 1991)

చివరిదాకా చదివిన తరవాత ఒకసారి ఆఖరి ఆరు పంక్తులూ మరో సారి చదవండి – చిట్టచివరి పంక్తిమీద మరీ దృష్టి పెట్టి.

అసలేం జరగనట్టు

ఇది గొప్ప ముసుగు. నిజంగా జరిగిందేదో మరీ వివరంగా చూపించే ముసుగు. ఇప్పుడు ఒక్కొక్క పంక్తీ వెనకనించి చదువుకుంటూ వెళ్ళండి.

లంగరేసిన పడవే ఆవిడ

అంతకుముందు నదీవేగంతో అనుభవాల నైరంతర్యంతో ప్రవహించే ఆవిడ ఇప్పుడు లంగరేసిన పడవ. పడవ తీరాన్ని చేరాక లంగరేస్తారు. కాని ఇంకా నీటి తాకిడికి పడవ ఊగుతూనేవుంటుంది. గతనిమిషాల జ్ఞాపకాల తాకిడికి ఊగుతున్నది శరీరం. ముసిముసి నవ్వుల్తో తృప్తిగా జ్ఞాపకాలు శరీరాన్ని అంటిపెట్టుకుని ప్రవహిస్తూనే ఉన్నాయి.

తలదువ్వుకుంటోందావిడ
అద్దంలోంచి అలవోకగా చూస్తూ

చిక్కు పడిపోయుంది జుట్టు. ఆ చిక్కులకేసి చూస్తున్నప్పుడు ఆ చిక్కులజుట్టుకి కారణమయిన మొగాడు అద్దంలో కనిపిస్తున్నాడు. అతన్ని అలవోకగా చూస్తోందావిడ. అలా చూస్తున్న ఆవిడ మొహాన్ని అద్దంలోంచి అతనూ చూస్తున్నాడు. ఇంతవరకూ ఒకర్నొకరు ఎదురెదురుగా ప్రత్యక్షంగా చూసుకున్నారు. ఇప్పుడు ఒకర్నొకరు అలా చూసుకోరు. పరోక్షంగా కనిపించడం ఇప్పుడు విశేషం. మనసుల్లో జ్ఞాపకాల్లాగా అద్దంలో ప్రతిబింబాలు.

ఇంతవరకూ మూసిన తలుపుల వెనకాతల వున్న ప్రపంచం ఇప్పుడు ఎదురుగుండా రావచ్చు. తలుపులు తీసే వున్నాయి కదా. ఇందాకా కాస్సేపటి క్రితం అవి మూసివున్నాయని వీళ్ళిద్దరికే తెలుసు. ప్రపంచం అవి ఎప్పుడూ తెరిచేవున్నాయని అనుకోవాలి. ఈ రహస్యమే మొత్తం పద్యాన్ని అందరికీ చెప్పనట్టు చెప్పే గుట్టు. కళ్ళు మూసుకున్నప్పటి సంతోషాన్ని కళ్ళు తెరుచుకున్నాక ఇంకా స్పష్టంగా అనుభవానికి తెచ్చినట్టు.

వెనక్కి వెళ్ళి చదువుతున్న కొద్దీ ప్రతి పంక్తీ కథలో ప్రతి పొరనీ మరీ వివరంగా చెప్తుంది – బండగా, సున్నితంగా, నిస్సిగ్గుగా, గోప్యంగా. బండగా అని ఎందుకన్నానంటే ఆ చరణంలో మాటలు చూస్తే మీకే తెలుస్తుంది. ఆ బండమాటలు నిజానికి సున్నితమైన మాటలు. అన్నమాచార్యుల మనమడు, చినతిరుమలాచార్యులు, అన్నమయ్య సంస్కృతంలో రాసిన సంకీర్తన లక్షణం తెలుగులో చెబుతున్నానంటూ ఒకచోట ఈ కింది పద్యం రాశాడు.

పదములు శృంగారవధూ
మృదుమధుర మనోజ్ఞ వాక్యమిశ్రములైనన్
విదితార్థ గ్రామ్యోక్తులు
పదిలముగాఁ బొంకమెఱిఁగి పలుకగఁ జెల్లున్

గ్రామ్యోక్తులు అంటే స్మైల్ తన పద్యం మొదట్లో రాసిన మాటల్లాటివి.

పద్యం మొత్తం పైకి చూస్తే కవి మనస్సులో జ్ఞాపకాల దొంతర. కాని నిజానికి మనకి పబ్లిగ్గా చెప్తున్న రహస్యాల పరంపర.

కాలం మారినా, మాటలు మారినా కవిత్వం మారదు. పెద్దన్నలో, అన్నమయ్యలో, స్మైల్‌లో ఉన్న సామాన్యలక్షణం మంచి కవిత్వం.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...