ఈ మాసపు పాట

మంచు మరింతగా కురుస్తోంది. ట్రక్ ఒకటి ఎదురుగా వచ్చింది. దాని లైట్లు కళ్ళపైన పడి ఒక క్షణం చీకటి కమ్మింది. పరధ్యానంతో కారు నడపకూడదని ప్రయత్నిస్తూనే ఉన్నా. అయినా, తరుముకొస్తున్న ఆలోచనలు, ఈ రోజు మరీ ఎక్కువగా. అలసట వల్లనేమో. పడమట సంధ్యారాగానికి మురిసిపోయి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చీకట్లు అలముకొంటున్నాయి. “పడిలేచే కడలి తరంగం, జీవితమే ఒక నాటకరంగం” పాడుతున్నాడు ఘంటసాల. సంస్కృతంలో కావ్యాలకన్న నాటకాలంటే నాకు చాలా ఇష్టం. వచ్చిన కొత్తలో, వీణ పుట్టకముందు, కొలంబియాలో కొన్ని కోర్సులు చేశాను. అప్పుడు మృచ్ఛకటికంపైన ఒక పేపర్ కూడా రాశా. ఇప్పుడు ఏడేళ్ళ తరువాత మా జీవితం కూడా మృచ్ఛకటికంలాగే వట్టి మట్టి బండి అయింది. వీణకేమో ఖరీదైన ఆటవస్తువులు కొనలేక మట్టిబండ్లతోనే సరిపెట్టుకోమంటున్నాము, దానికి నచ్చట్లేదని తెలిసి కూడా.

మృచ్ఛకటికలో దరిద్ర చారుదత్తుడు వర్ణించే బీదతనంతో ఇప్పుడు మాకూ అనుభవమే.

సంగంనైవ హి కశ్చిదస్య కురుతే సంభాషతే నాదరా
త్సంప్రాప్తో గృహముత్సవేషు ధనినాం సావజ్ఞమాలోకయేత్
దూరాదేవ మహాజనస్య విహరత్యల్పచ్ఛదో లజ్జయా
మన్యే నిర్ధనతా ప్రకామమపరం షష్ఠం మహాపాతకం

దరిద్రుని ఎవ్వరూ గౌరవించి ఆదరించి మాట్లాడరు. పండగ దినాలలో ధనికుల ఇంటికి వెడితే తిరస్కార భావంతో చూస్తారు. ఖరీదైన దుస్తులు వేసికోని అతడు సిగ్గుతో అందరికీ దూరంగా ఉంటాడు. మా పరిస్థితి కూడా చారుదత్తుడిలాగే ఉంది. తమ ఇంటికీ ఎవ్వరూ పిలవడం లేదు, మేమూ ఎవరింటికి వెళ్ళడమూ లేదు. ఎవరినైనా చూస్తే వాళ్ళడిగే మొదటి ప్రశ్న “మీ ఆయనకు కొత్త పని దొరికిందా” అంటూ. లేదంటే “అయ్యో పాపం, ఏం చేస్తున్నారు, ఎలా కాలం గడుపుతున్నారు” అంటూ జాలి చూపిస్తారు. పంచమహా పాతకాలతో కలిపి దారిద్ర్యం అనేది ఆరవ మహా పాతకం అంటాడు శూద్రకుడు. దారిద్ర్యం, ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవడం, మానసిక క్షోభ ఇవన్నీ దాంపత్య సుఖానికి కూడా శత్రువే. ఎంత కాలమైంది రమేశూ నేనూ దగ్గరై. ఏదీ ఆ కోరిక, ఆ తపన, ఆ ప్రేమావేశం. ముకుళించిన హృదయ కమలం, అబ్బ! శీతాకాలం చాలా క్రూరమయింది! శూద్రకుడు అంతటితో ఆపకుండా…

దారిద్ర్య శోచామి భవంతమేవమ-
స్సమచ్ఛరీరే సుహృదిత్యుషిత్వా
విపన్నదేహే మయి మందభాగ్యే
మమేతి చింతా క్వ గమిష్యసి త్వం

అని అన్నాడు. ఓ పేదరికమా, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది. నువ్వేమో నన్ను స్నేహితునిలా అంటి పెట్టుకొని నాతోనే ఉన్నావు. నేనొక వేళ చచ్చిపోతే నీ గతేమవుతుందనేదే నా చింత సుమా! ఉన్నట్లుండి కొరడాతో కొట్టినట్లయింది. ఈ బాధలతో రమేశ్ చావు ప్రయత్నాలు చేయడు కదా! కాలంకాని కాలంలో, దేశంకాని దేశంలో అతణ్ణి నమ్మి అంటుకొని ఉండే నన్ను, వీణను అనాథగా చేయడు కదా?

స్నో ఎక్కువయింది. కారు కొద్దిగా జారుతూ ఉంది. ఇంకెంత, ఒక పది నిమిషాల్లో ఇల్లు. వెళ్ళి పడుకొంటే చాలు. అలసటా, ఆలోచనల్తోనే సతమతమవుతున్న నాకు, రమేశ్ ఏదైనా చేస్తాడేమో అన్న ఆలోచన ఇప్పుడు నన్ను చిత్రహింస చేస్తోంది. తలంతా దిమ్ముగా ఉంది. హైవేనుండి ఎక్సిట్ ఎలా తీసుకున్నానో, ఇంటి కెళ్ళే దారిలోకి ఎలా తిరిగానో గుర్తు లేదు. అపార్టుమెంటు కాంప్లెక్సు ముందు పోలీసు కార్లు, ఎర్రగా నీలంగా లైట్లు కళ్ళు బైర్లు కమ్ముతూ, పసుపు పచ్చని ‘డూ నాట్ క్రాస్’ టేపులు. కారుకడ్డంగా ఒక ఆఫీసర్ ఆపమని చేయి చూపిస్తూ. అక్కడే కారును పార్కు చేసి అపార్ట్మెంట్ బిల్డింగ్ వైపు నడిచాను. అంత రాత్రైనా దీన్ని చూడ్డానికి అక్కడ నాలుగైదుగురు చేరారు. అక్కడే నిలుచున్న ఒక పెద్దామెను ఏమయిందని అడిగాను.

“సంబడీ మర్డర్డ్ హిస్ చైల్డ్ అండ్ టుక్ హిస్ ఓన్ లైఫ్, వాట్ ఎ పిటీ!.”

నా గుండె ఆగినట్లయింది. ఇదేమో, అన్ని ఆలోచనలు ఒకే దారి తీస్తున్నాయి భగవంతుడా! “ఎందరు తండ్రులు లేరు, ఎందరు పిల్లలు లేరు, అన్నిటికీ ఇలా భయపడకే దేవీ” అన్నది మనసు. నా అపార్ట్మెంట్‌కు వెళ్ళవలసిన వాకిలి వద్ద మరి కొందరు పోలీసు ఆఫీసర్లు నిల్చున్నారు.

“యూ కెనాట్ గో ఇన్, మాడం!”
“బట్, బట్ ఐ లివ్ హియర్ ”
“విచ్ అపార్ట్మెంట్?”
“టూ-ఓ-టూ.”
“ఆర్ యూ మిస్సెస్ రజాంపడూ?”
“ఎస్, ఐ యాం మిస్సెస్ రాజంపాడు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్లీస్ టెల్ మి?”
“సారీ మేం, హేయ్ జాక్, ది మిస్సెస్ ఈస్ హియర్.”

కారులో ఒక క్షణం కలిగిన ఆలోచన నిజమయిందా? “వీణా, రమేశ్” అంటూ అరుస్తూ పడిపోయాను.

“దేవీ, దేవీ” అంటూ ఎవరో కదిపారు. “రమేశ్, వీణా” అంటూ అరుస్తూనే ఉన్నా.
“దేవీ, నేనే రమేశ్‌ను, పీడకల వచ్చిందా? లే లే, లేచి కూర్చో, నీళ్ళు తాగుతావా?” అంటూ రమేశ్ గొంతు ఎక్కణ్ణుంచో వినిపిస్తోంది.
“రమేశ్‌? రమేశ్‌! మరి పోలీసులు, వీణ … వీణ ఎక్కడ? వీణను నువ్వు చంపేశావా?”
“నీకు నిజంగా పీడకలే వచ్చింది. వీణ నువ్వు ఇంకా రాలేదంటూ ఎప్పుడో నిద్రపోయింది. నువ్వు వచ్చావు. స్నోలో డ్రైవు చేసి చాలా అలసటగా ఉందంటూ డ్రస్సు కూడా మార్చుకోక పడుకొన్నావు. లే, లే, డ్రస్సు మార్చుకొని ఏమైనా తిను, లేకపోతే పాలైనా తాగి పడుకో.”

చిన్నగా లేచాను. ఇంకా వణుకు తగ్గలేదు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. లేచి గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న వీణను క్యాస్టు కట్టిన చేయి సరిచేసి, ముద్దుపెట్టుకున్నా. నైటీ వేసికొని వచ్చి రమేశ్ పక్కనే కూర్చున్నాను. నా భుజం మీద చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. మెల్లగా కుదుటపడసాగాను.

“రమేశ్, రమేశ్, అది నిజంగా కలేనా? కానీ నా కళ్ళముందు జరిగినట్లుంది. ప్రతి ఒక విషయం గుర్తుంది.”

“దేవీ నీకు పనెక్కువ అయింది. చాలా టెన్షన్‌లో ఉన్నావు. కొద్దిగా రిలాక్స్ కావాలి నువ్వు. మనకూ మంచి రోజులు వస్తాయి, తప్పక వస్తాయి, నేను ఆశావాదిని. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. జీవితంలో ఇది ఒక పీడకల అనుకొందాము. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. యూనివర్సిటీ పనికి. జీతం మునపటిలా ఆరంకెలు కాకపోయినా, మన అవసరాలకు సరిపోతుంది. దొరికే ఛాన్సు ఉంది. రేపు పాడించాలనుకొన్నా నీతో. నీకోసం ఈ మాసపు పాట రాశాను. చూడు.”

నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రణయ దేవీ

వనకుసుమము నీవెగా నిజముగ
జీవనకుసుమము నీవెగా

గిరిసుత నీలమణి వర తనువుతో
సరముల ముత్యపు సిరి యురముతో
సరసిజదళముల మృదు కరముతో
వరముల నొసగగ నగు ముగముతో

నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రణయ దేవీ

“నల్లగా ఉన్నానని సూటిగా చెప్పరాదూ, దానికొక పాట రాయాలా?” అని అన్నా రమేశ్‌ను ఉడికించడానికి.
“సరే విరిసిన వెన్నెలవలె తనువుతో అని పాడుకో.”
“ఊ, తరువాత?”
“నీ సిరి ఉరాన్ని చూపిస్తావా?” హృదయకమలం వికసించింది. ఆగకుండా కన్నీళ్ళు వాన ముత్యాల్లా రాలి రమేశ్ చేతిపైన.
“దేవీ, నువ్వింకా ఆ పీడకలను తలచుకొంటున్నావా, తొందరగా మరచిపో.”
“దాన్ని ఎప్పుడో మరచిపోయా, సరే నీ ఈ మాసపు పాట పాడుతా వింటావా?” రమేశ్ గుండెపై తల ఆనించాను.
“ఇప్పుడు వద్దు, రేపు పాడుదువు గానిలే, ప్రస్తుతానికి ఈ క్షణాల్ని ఇలా నన్ను మూటకట్టుకోనీ”