పెంపకం

ఎడ తెగకుండా వచ్చి పడుతున్న అలల దగ్గర తడి ఇసకలో నిల్చున్న మల్లిక అంటోంది, “పోనీ, కొంచెం దూరం, ఇక్కడికి రా.”

మహార్ణవ్ కదల్లేదు, “ఛీ, నేన్రాను ఆ వుప్పునీళ్ళలోకి. నాకసయ్యం,” అన్నాడు.

ఇహ వాడు నీళ్ళలోకి రాడని నిర్థారణ అయిపోయింది ఆపిల్లకి.

“పోనీ, పిచిక గూళ్ళు కడదామా? ఇక్కడికి అలలు రావు” అంది.

“వస్తాయి. ఇసక తడిగా వుంది కద.”

“ఎప్పుడో చాలా పే..ద్ధ అల, ఇప్పుడు కాదులే, నిన్నో ఎప్పుడో వచ్చింది.” అంది ఆరిందాలా చేతులూ, కళ్ళూ తిప్పుతూ.

”ఊఁహూ. నేను రాను. తడి ఇసక ఛీ నాకసయ్యం.” మహార్ణవ్ మొహం చిట్లించాడు మరో అడుగు వెనక్కేసి.

“రాతిల్లు పిచికలు వచ్చి పడుకుంటాయి తెలుసా?”

“ఏం కాదు. పిచికలు చెట్ల మీద వుంటాయి. నీకేం తెలీదు” అన్నాడు మహార్ణవ్.

ఆమాట అన్నతరవాత వాడికి కొంచెం తృప్తిగా వుంది. లేకపోతే ఏమిటి అన్నీ తనకే తెలుసన్నట్టు మాటాడుతుంది. గంటసేపయి చూస్తున్నాడు దాని వాలకం. వాడికి చాలా కోపం వచ్చింది.

ప్రదీపు చూశాడు. ముందుకి వెళ్ళాల్సిన కొడుకు మరో అడుగూ మరో అడుగూ వెనక్కి వేస్తూ పోతున్నాడు. పార్వతికి కూడా అలాగే తోచివుంటుంది అనుకోడం మరీ కంటకప్రాయంగా వుంది అతడికి. పార్వతి కూతురికున్నపాటి గుండెబలం తనకొడుక్కి లేదా?

తన విసుగు కప్పిపుంచుకుంటూ, “వెళ్ళరా. నీళ్ళలో వెళ్ళి ఆడుకోడానికేఁవిటి కష్టం? దాన్ని చూసయినా నేర్చుకోరాదూ?” అన్నాడు.

“ఊరుకుందూ. అదేదో ఘనకార్యం అయినట్టు ఏఁవిటా సతాయింపు? ఇవేమేనా అంతర్జాతీయ పోటీలా ఏమిటి? వాడు బంగాళాఖాతంలో పాదం మోపితే గానీ జన్మ ధన్యం కానట్టు దెప్పుతావేమిటి?” అంది పార్వతి.

“మనం పిల్లలకి ధైర్యం నేర్పాలి కానీ భయాలు మప్పడం ఏమిటి? ఇవాళ నీళ్ళంటే భయం, మనం ఊరుకుంటే రేపు తాడుని చూసినా తుళ్ళిపడతారు,” అంటూ పాంటు పైకి లాక్కుంటూ కొడుకు దగ్గరకొచ్చి, జబ్బ పుచ్చుకుని, “రా, నేను కూడా వస్తాను. భయంలేదులే. నాచెయ్యి పుచ్చుకో.” అంటూ నీళ్ళవేపు లాక్కుపోయేడు.

మహార్ణవ్ “నేను రాను” అంటూ గింజుకుంటున్నాడు.

“అదుగో, అటు చూడు. చి…న్న.. అల వస్తోంది. మన బాత్రూంలో పారే తూమునీళ్ళ పాటి లేదు. అయినా అలల్లో దిగితేనే కదా తెలిసేది ఆ అనుభవం ఎలా వుంటుందో, అది నీకు బాగుందో లేదో. దాన్ని చూడరాదూ. దానికున్నపాటి కలేజా లేదూ నీకు?” అన్నాడు.

ఆ కుర్రకుంక బుల్లిగుండెల్లో పౌరుషం రెచ్చగొట్టడానికి అతను పడే తాపత్రయం చూస్తూంటే పార్వతికి ఎబ్బెట్టుగా అనిపించింది. హోరుమంటూ ఆకాశంవేపు నిలువెత్తు లేచి విరుచుకుపడి ఒడ్డున చాపచుట్టలా పరుచుకుంటున్న తరంగాలని చూస్తుంటే మహార్ణవు గుండెల్లో చిన్న వణుకు వస్తోంది. ప్రతి అల తనని మింగేయడానికే తనమీదకే వచ్చేస్తున్నట్టుగా వుంది. మల్లిక ‘ఇంక చాలు పోదాం’ అంటే బాగుండును అని వుంది వాడికి.

అసలు అలా అలల్లో నిలబడి, కాళ్ళకింద మన్ను తొలిచేస్తుంటే కలిగే ఆనందం ఏమిటో ఎంత తన్నుకున్నా అర్థం కావడంలేదు వాడికి. దారిపక్కన దాలిగుంటలో ముడుచుకు పడుకున్న ఊరకుక్కని తంతే ఇంకా ఎక్కువ అనందం కదా. అదే అన్నాడు రెండురోజుల కిందట మహార్ణవ్ మల్లికతో.


ఆరోజు ప్రదీపూ, మహార్ణవ్ పార్వతిఇంటికి వచ్చారు చుట్టపుచూపుగా. పెద్దవాళ్ళు నడవలో కూర్చుని మాటాడుకుంటుంటే, పిల్లలిద్దరూ వీధిలో ఆడుకుంటున్నారు. రోడ్డువార ముడుచుకు పడుకున్న వూరకుక్కని చూసి “దాన్ని తన్ననా?” అన్నాడు మహార్ణవ్ దానివేపే చూస్తూ.

“ఎందుకూ దాన్ని తన్నడం?” అంది మల్లిక.

“ఊరికే”

“అది కరిస్తే?”

“అదేం కరవదు” అన్నాడు మహార్ణవ్ అమితోత్సాహంతో. తాను కుక్కని తన్నగల శూరుడని మల్లికకి ఋజువు చేయాలి.

“కుక్క కరిస్తే నలభై ఇంజీషనులు తీసుకోవాలిట బొడ్డుచుట్టూ” అంది మల్లిక.

వాళ్ళ స్కూల్లో ఓ అబ్బాయి కుక్కని తంతే అంతే అయింది. మహార్ణవ్ కుక్కని తన్నకుండా చేయరా దేవుడా అని మనసులో కోరుకుంది అర్జంటుగా.

దేవుడు మల్లిక మాట విన్నాడో, మహార్ణవుడు ఇంజక్షను మాట విన్నాడో కానీ ఆపూట వాడు కుక్కని తన్నడం జరగలేదు.

నిన్న వాడు కుక్కని తన్నలేదు. ఈరోజు వాడు ఈ సముద్రపు ఒడ్డున నీటిలో కాలు పెట్టడం జరగదు.


ప్రదీపు తటాలున లేచి, “పిల్లలకి అలాటి భయాలు వుండకూడదు. చిన్నప్పుడే పోవాలి.” అంటూ రెండంగల్లో ప్రదీపు మహార్ణవుని నీళ్ళలోకి ఈడ్చుకు వెళ్ళి అలల్లో నిలబెట్టేడు. మల్లిక బెదిరిపోయి వెనక్కి జరిగి తల్లి పక్కన ఒదిగి నిలబడిపోయింది.

పార్వతి ఊరుకోలేకపోయింది, “ప్రదీప్, ఏమిటా దౌర్జన్యం! ఊరుకో,” అంటూ గబగబా వచ్చి అతని గుప్పిటిలోనుండి కుర్రవాడి జబ్బ విడిపించింది, “నీకు మతి పోయింది ” అంది విసుక్కుంటూ.

మహార్ణవ్ బావురుమంటూ ఏడవడం మొదలు పెట్టేడు, పార్వతిని చుట్టేసుకుని. ప్రదీపు అచేతనంగా నిలబడిపోయేడు తనెందుకు అలా చేసేడో తనకే తెలీనట్టు.

“పదండి. చీకటి పడుతోంది. ఇంటికెళ్దాం” అంది పార్వతి.

బీచికొచ్చేం అన్న సరదా పోయింది. అందరూ మౌనంగా నడుస్తున్నారు.

ప్రదీపు కొంచెంసేపు అయింతరవాత నెమ్మదిగా, “దానికి అలా అంత ఏ భయాలు లేకుండా ఎలా తయారు చేసేవు?” అన్నాడు అనంత దూరాల్లోకి దృష్టి సారించి.

“నేనేమీ చెయ్యలేదు. దానిష్టానికి వదిలేస్తాను సాధారణంగా. అంతే” అంది. మళ్ళీ అతను చిన్నబుచ్చుకుంటాడేమో అనిపించి, “చిన్నప్పటినించీ రోజూ సముద్రం చూస్తూ పెరిగింది కదా. అంచేతేమో దానికి భయం లేదేమో” అని జోడించింది. సముద్రం హోరు పెడుతున్నా వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఒత్తుగా తిష్ట వేసుకుంది. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు మునిగి నడుస్తున్నారు బీచిరోడ్డు మీద. వాళ్ళకి కొంచెం ఎడంగా మల్లికా, మహార్ణవ్ నడుస్తున్నారు.

“భయాలు అందరికీ వుంటాయి. ఏదో ఓ రకం. ఒహటి కాపోతే మరోటి. నీకు మాత్రం లేవూ భయాలూ?” అంది భావగర్భితంగా.

ప్రదీపుకి అర్థం అయింది పార్వతి ఏ విషయం గురించి అందో ఆమాట. “అవును. అప్పుడు నాకు బహుశా మహార్ణవ్ వయసే అనుకుంటాను. నాకు చీకటి అంటే భయం. నాభయం పోగొట్టడానికి అంటూ మా నాన్నగారు నన్ను చీకటి గదిలో పెట్టి తలుపేసేరు.”

“మరి నీకు భయం పోయిందా?”

ప్రదీపు నవ్వేడు నిర్మలంగా, “పోయింది ముప్ఫై యేళ్ళు దాటేక.”

హమ్మయ్య అనుకుంది పార్వతి మనసులోనే. వాతావరణం కాస్త తేలిక పడింది. రెండు నిముషాలు ఊరుకుని అంది, “అదే మరి. వాళ్ళకాలంలో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పెంచేరు మనల్ని. మనకాలంలో మనం మనకి చేతనయినట్టు పెంచుతాం. నువ్వూ నేనూ బాగానే కాకలు తీరేం కదా.”

ప్రదీపు ఆలోచనలో పడ్డాడు. “చలంనించీ స్పాక్ వరకూ ఎన్ని పుస్తకాలు చదివేనో”

“నేనూ చదివేను. కాని అవే వేదవాక్యాలు అనుకోను.”

“పిల్లలు ఇన్స్ట్రక్షన్ మాన్యూలుతో రారంటావు.”

“నేనేమీ అనడంలేదు. నాక్కూడా తెలీదనే అంటున్నాను. నామటుకు నాకు ప్రతిరోజూ ఓ చిన్న యుద్ధం అనే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆక్షణానికి తోచినట్టు వ్యూహరచన చేసుకుంటానంతే. గెలుపూ, ఓటమీ – రెంటికీ సిద్ధమే నేను” అంది పార్వతి.