‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా

హృదయాలను హత్తుకొనే దృశ్యాలు

అంతకు ముందు రాయ్ తీసిన పథేర్ పాంచాలి సినిమాలాగే, ‘అపరాజితో’లో కూడా చూపిస్తున్న విషయంలో కానీ, దాన్ని చూపే విధానంలో కాని ఎక్కడా ‘అతి’ అన్నది ఉండదు. ఈ సినిమాలో చూపిన రెండు మరణాలను (హరిహరన్, సర్బజయ) చాలా సహజంగా, హుందాగా చూపిస్తాడు రాయ్.


హరిహరన్ మరణం అపు

ఒక ఉదయాన్నే జబ్బుతో ఉన్న హరిహరన్ పక్కనే సర్బజయ కూర్చొని ఉంటుంది. హరిహరన్ “గంగ నీళ్ళు” అని గొణుగుతాడు. అపు గంగ నీళ్ళు తీసుకొని రాగా, సర్బజయ హరిహరన్ తల ఎత్తి పట్టుకొని అతని నోట్లో నీళ్ళు పోస్తుండగా, హరిహరన్ తల వేళ్ళాడి పోయి తలదిండు మీద పడుతుంది. వెంటనే, ఇందాకా రాయ్ డైరీలో రాసుకున్నట్టు, రివ్వున ఒక పావురాల గుంపు ఆకాశంలోకి ఎగిరి చక్కెర్లు కొడుతుంది. వెనకగా జోగ్ రాగంలో వేణువు మీద వినిపించే సంగీతం దృశ్యంతో కలిసి, కరిగి పోతుంది. హరిహరన్ శారీరక దురవస్థ నుంచి విముక్తుడవుతాడు.

సర్బజయ మరణం – ఒక సాయంత్రం ఇంటి బయటున్న చెట్టుకి ఆనుకొని, కాలేజీలో చదువుతున్న అపు రాకకై ఎదురుచూస్తూ ఉంటుంది సర్బజయ. దగ్గర్లో ఒక రైలు వెడుతుంది. ఆమెలో స్పందన లేదు. ఆమెకు తెలుసు, ఆ రైల్లో అపు లేడని. తరవాత దృశ్యంలో ఇంట్లోని వరండాలో ఆమె చలనం లేకుండా కూర్చొని ఉంటుంది. ఉన్నట్టుండి అపు పిలుస్తున్నట్టనిపిస్తుంది. అంతా భ్రమ. అపు వచ్చాడన్న ఆశతో, ఇంటి బయటకి తన శరీరాన్ని బరువుగా మోసుకుంటూ బయటకు వస్తుంది. దగ్గర్లో ఉన్న మడుగు వద్ద కదిలే మిణుగురు పురుగుల్ని చూస్తుంది. అదే మనం ఆమెను చూసే ఆఖరి చూపు.

తల్లి – కొడుకు

తల్లీ కొడుకుల మధ్య జరిగే సంభాషణలు ఎంతో సహజంగా రాయ్ చిత్రీకరించాడు. ఒక ఉదాహరణ:

మొదటిసారి కాలేజీ శలవల్లో అపు ఇంటికొస్తాడు. పక్క మీద పడుకొని పుస్తకం చదువుతూ ఉంటాడు.

సర్బజయ: మళ్ళీ ఈసారి ఇంటికి వచ్చినప్పుడు కొన్ని బొత్తాలు పట్టుకురా.

(అపు చదవటంలో ములిగిపోయి సమాధానం చెప్పడు)

సర్బజయ: అపూ… పుస్తకం పక్కన పెట్టు.

(అయిష్టంగా అపు పుస్తకాన్ని పక్కన పెడతాడు)

సర్బజయ: నాతో మాట్లాడు.

అపు: దేని గురించి?

సర్బజయ: అదే… నువ్వు పట్నంలో ఏం చూసావు?

అపు: అదే… అన్ని రకాలైనవి. విక్టోరియా మెమోరియల్, వైట్‌వే లైడ్‌లా, అతి పెద్ద కిరాణా షాపు, హాగ్ మార్కెట్టు, జూ…

సర్బజయ: మరి. కాలీఘట్ దేవాలయం?

అపు: ఆ. అవును. మొన్నెప్పుడో అక్కడికి వెళ్ళాం! అప్పుడే కియొరొటొలా కూడా చూసాం.

సర్బజయ: కియొరొటొలాలో ఏం ఉంది?

అపు: అదే. తగలబడే ఘాట్‌లు.

(సీన్ కట్)

సర్బజయ: ఏమిటి?

అపు: నీకు తెలుసు కదా! శ్మశానం.

సర్బజయ: ఊ… రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్త. నే ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. తొందరగా ఆ చదువు పూర్తి చేసుకొని ఒక ఉద్యోగం సంపాదించు.

(సీన్ కట్)

(అపు అప్పటికే నిద్రతో జోగుతూ ఉంటాడు. సర్బజయ అది గమనించకుండా మాట్లాడుతూ ఉంటుంది)

సర్బజయ: నీకు ఉద్యోగం వచ్చిన తరవాత నే నీ దగ్గరకి వచ్చి ఉంటాను…. నన్ను ఉండనిస్తావు కదూ?

అపు: (నిద్రలో తూలుతూ) ఓ! అలాగే!

సర్బజయ: నిజంగా? నాకు అతి విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకవేళ నేను జబ్బు పడితే? కోలుకో లేని జబ్బు? అలా జరగొచ్చు, నీకూ తెలుసు కదా! సాయంత్రాల్లో నాకేం బాగుండటం లేదు. ఆకలుండదు. నీకు ఈ విషయం చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నా! చెప్పటానికి మనసొప్పలా! ఒకవేళ నేను నిజంగా జబ్బు పడితే, చదువు ఒదిలేసి నన్ను చూసుకోటానికి రావు కదూ? (అపు నుంచి సమాధానం ఉండదు) జవాబు చెప్పవేం? అపూ….

(అపు అప్పటికే గాఢ నిద్రలో ఉంటాడు)

(ఫేడ్ అవుట్)

తల్లి-కొడుకుల మధ్య మరచిపోలేని ఈ సంభాషణలు విశ్వవ్యాప్తంగా ఏ సమాజానికైనా వర్తిస్తాయి!


సర్బజయ, అపు

ఈ సినిమాలో తల్లీ కొడుకుల బంధం ఒక ప్రధానమైన అంశం. ముందు తన అక్క, బెనారస్ వచ్చిన తరవాత తన తండ్రి చనిపోటంతో, సహజంగానే తల్లికి చేరువ అవుతాడు అపు. బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న అపుకు, తల్లికి పరిచయంలేని ప్రపంచం పరిచయం అవటం మొదలవుతుంది. ఇందులో ఒక భాగమే అపు చదువు పట్ల చూపించే అచంచలమైన ఆసక్తి, తద్వారా సంపాదించే జ్ఞానం! దాన్ని తల్లితో పంచుకోటానికి ఎంతో ఇష్టం చూపించే అపు త్వరలోనే కాలేజీకి వెళ్ళటంతో, అతనికి తల్లి జ్ఞాపకాలు తగ్గిపోతాయి. అపు ఆలోచనలన్నీ తన జీవితంపై తాను నిర్ణయించుకునే భవిష్యత్తు మీద కేందీకృతమవుతాయి. సర్బజయకి, అపు భవిష్యత్తు మీద ఉన్న ఆలోచనలు అందుకు పూర్తిగా భిన్నం. తొందరలో అపు కాలేజీ చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే, తన శేష జీవితమంతా కొడుకుతో గడపాలని తల్లి ఆశ. ఉన్న పరిస్థితుల్లో సర్బజయకి అపు మీద ఆశలు పెంచుకోటం ఎంత సమంజసమో, అప్పుడే విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్న అపుకు తన భవిష్యత్తును తాను నిర్ణయించుకోటం అంతే సమంజసం. ఒక రకంగా చూస్తే, అపు స్వార్ధపరుడు, తల్లి విషయం పట్టించుకోడు అనిపిస్తుంది. మరొక రకంగా చూస్తే, తన సుఖం కోసం అపు భవిష్యత్తుని త్యాగం చెయ్యాలని కోరుకునే తల్లిది స్వార్ధం. నిజానికి ఇందులో ఎవరి స్వార్ధం లేదు. జీవితమంటే ఇదే!

చిత్రమైన విషయం ఏమిటంటే, భారతీయ జీవితాల్లో (లేదా విశ్వవ్యాప్తంగా ఉన్న మానవ సంబంధాల్లో) ఇటువంటి సంఘర్షణలు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం.

ఈ సినిమా పేరు అర్ధవంతమైనదేనా?

ఈ సినిమా నాకు పరిచయం అయినప్పటి నుంచి ఈ సినిమాలో చూపించిన విషయాలకి, ‘అపరాజితో’ అన్న పేరు ఎలా సరిపోయిందో కదా అన్న అనుమానం బాధించేది. పథేర్ పాంచాలి సినిమాలో చూపించినట్టు, అపు చిన్న తనంలో తన అక్క మరణాన్ని చూస్తాడు. అపరాజితో సినిమాలో కొంచెం పెద్దయ్యాకా, తన తండ్రి మరణం, మరి కొంత పెద్దయాకా తన తల్లి మరణం చూసి ఒంటరి వాడవుతాడు. ‘అపు’ లాంటి పాత్ర జీవితంలో ఏం చూసుకొని బతకాలి? అసలే పేద కుటుంబం. పరిస్థితులు ఎంత తిరగబడినా, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని పరాజితుడు కాకుండా ముందుకు వెళ్ళటం ఈ సినిమా చూపిస్తుంది. నిజానికి ‘అపు’ భారత దేశంలో కొన్ని లక్షల మందికి ప్రతీక. భారతీయ సంస్కృతి, విలువలు చెప్పీ చెప్పకుండా చూపించటం ఈ సినిమాలో జరిగింది. అందుకే నా దృష్టిలో, ఈ సినిమా కూడా ‘పథేర్ పాంచాలి’ అంత గొప్ప సినిమానే!

అపరాజితో – 1956, ఇండియా, 113 నిమషాలు, తెలుపు – నలుపు బెంగాలీ చిత్రం, ఇంగ్లీషులో క్రింద శీర్షికలతో

ప్రశంసలు

బంగారు సింహం, సెయింట్ మార్క్, వెనీస్, 1957; సినిమా నూవో ఎవార్డ్, వెనీస్, 1957; క్రిటిక్స్ ఎవార్డ్, వెనిస్, 1957; FIPRESCI Award, లండన్, 1957; ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, శాన్ ఫ్రాన్సిస్కో, 1958; అంతర్జాతీయ క్రిటిక్స్ ఎవార్డ్, శాన్ ఫ్రాన్సిస్కో, 1958; ఉత్తమ విదేశి చిత్రం – బంగారు పతకం, 1958-59, U.S.A ; సెల్జిక్ బంగారు పతకం, బెర్లిన్, 1960; బోడిల్ ఎవార్డ్: ఉత్తమ యూరోపియనేతర చిత్రం, డెన్మార్క్, 1967.


ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, డివిడి.

  1. అపరాజితో సినిమా డీవీడీ. సత్యజిత్ రే బాక్స్ సెట్ నుంచి.
  2. The Inner Eye“, Andrew Robinson, University of California Press, 1989.
  3. Satyajit Ray – A Vision of Cinema“, Nemai Ghosh, Satyajit Ray and Andrew Robinson, I.B.Tauris & Co, London – New York, 2005.
  4. “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971.
  5. Our films their films“, Satyajit Ray, Orient Longman Limited India, 1976.
  6. “పథేర్ పంచాలి”, బిభూతి భూషన్ బందోపాధ్యాయ్, తెలుగు అనువాదం – మద్దిపట్ల సూరి, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, జులై 2008.
  7. ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు కొన్ని సత్యజిత్‌రే.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి.

విష్ణుభొట్ల లక్ష్మన్న

రచయిత విష్ణుభొట్ల లక్ష్మన్న గురించి:

పుట్టటం, పెరగటం ఆంధ్రాలో. హైదరాబాద్, విశాఖపట్టణంలో కాలేజీ చదువు, ముంబై ఐ. ఐ. టి ఇంజనీరింగ్ చదువు తరవాత టాటా ఇన్స్టిట్యూట్లో భౌతిక శాస్త్రంలో పి.హెచ్. డి. 1980 దశాబ్దంలో అమెరికా రాక. వృత్తి రీత్యా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పని చేసారు.

ఈమాట వెబ్ పత్రిక ప్రారంభకుల్లో ఒకరు. ముందుముందు తెలుగు సాహిత్యంలో ఇంటర్నెట్ కి ప్రధాన పాత్ర ఉందని గాఢంగా నమ్మే వాళ్ళలో ఒకరు.

 ...