బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు
[2008 ఆగస్టులో రావి కొండలరావు గారు తన బృందంతో ఆయన రాసిన ‘వైకుంఠపాళీ’ అనే నాటికను ప్రదర్శించడానికి ముంబైకి వచ్చినప్పుడు నేను ఆయనను చాలా ఏళ్ల తరవాత కలుసుకోగలిగాను. ఈ వ్యాసం అప్పుడు ఆయనతో జరిపిన సంభాషణలు, హైదరాబాదులో బాబ్జీలు గారు ఆయనతో జరిపిన సంభాషణల సారాంశం. బాబ్జీలు గారికి నా ధన్యవాదాలు. - రచయిత]
రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత. నాటకం, సినీమా, టీవీ, పత్రికలు, ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం ఉన్నవాడు. మిమిక్రీ కళాకారుడు. ప్రతి రంగంలోనూ నైపుణ్యం, పేరు ప్రఖ్యాతులూ గడించిన వాడు. ఎటువంటి భేషజాలూ లేకుండా 75 ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో క్రియాశీలంగా ఉంటూ జీవిస్తున్న వ్యక్తి. నిరాడంబరంగా, కలుపుగోలుగా ప్రవర్తించే సజ్జనుడు. ఆయన రచనలూ, నటనా అన్నీ చదువుకోవడానికీ, తిలకించ డానికీ హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మనసును కలవరపెట్టే రచనా, ఒళ్ళు గగుర్పొడిపించే నటనా ఆయన ధోరణికి సరిపడవు. ఆయన రాసిన నాటికలూ, నాలుగైదు వందల సినిమాలకు రాసిన సంభాషణలు (స్క్రీన్‌ప్లే) ఆయన సుదీర్ఘ కృషిని సూచిస్తాయి. 1958లో ‘శోభ’ చిత్రంతో మొదలైన ఆయన సినీ నటనకు ఈమధ్యనే 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ముంబయి, విజయవాడ తదితర నగరాల్లో ఆయనకు ఘనసన్మానాలు జరిగాయి.
కొండలరావుగారు పుట్టినది సామర్లకోటలో. వారి తండ్రిది పోస్టుమాస్టరు ఉద్యోగం కనక తరుచుగా బదిలీలు అవుతూ ఉండేవి. ఆ కారణంగా ఆయన పాఠశాల చదువు కాకినాడలో మొదలై, అనేక ఊళ్ళలో కొనసాగింది. ఆయనకు అన్నయ్యలైన ఆర్.కె.రావు, రావి చలం (ఈయన జంషెడ్‌పూర్ నాటకరంగంలో ప్రసిద్ధుడు) ల ప్రభావం ఆయన మీద ఉండేది. కొండలరావు పదేళ్ళ లోపు వయసులో స్కూలు నాటకాల్లో వేసినపుడు ఆయన తండ్రి ఏమీ అనలేదుగాని బైటి సమాజాల్లో ఆడినప్పుడు మాత్రం సహించేవారు కారట. ఆయన చిన్నప్పుడు ఒకసారి తండ్రికి తెలియకుండా ఒక అన్నయ్య ఒక నాటికలో కొండలరావు చేత ఆడపాత్ర వేయించారట. ఆ ప్రదర్శనకు తండ్రి హాజరవుతాడని వాళ్ళకి తెలియదు. కొడుకును గుర్తుపట్టని తండ్రి స్టేజికేసి చూస్తూ పక్కనున్న వ్యక్తితో “వీడెవడో బాగానే చేస్తున్నాడే?” అన్నాడట. అప్పుడా పక్కనున్నాయన “అదేమిటండీ వాడు మీవాడేగా?” అన్నాట్ట. అంతే! పెద్దాయన ఉగ్రుడైపోయి స్టేజి మీదికి వెళ్ళి కొడుకు విగ్గు పట్టుకుని పీకేసి, కొట్టి, వీధులవెంట తరిమాడట. ప్రేక్షకులు ఇదేదో ‘కొత్త పాత్ర ప్రవేశం’ అని కూడా అనుకున్నారట. అప్పటికి ఆయన వయసు పదేళ్ళే.
తండ్రిగారి చివరి పోస్టింగు శ్రీకాకుళం కావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. అన్నయ్య ఏకపాత్రాభినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు వెయ్యడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించడం, చిన్నచిన్న కథలు రాయడం వగైరాలన్నీ కొండలరావు పిన్నవయసు ముచ్చట్లు. తండ్రిగారు చనిపోయాక నాటకాల్లో వెయ్యడానికి అడ్డు తొలగినట్టయింది.
స్కూల్లో ఉన్నప్పుడే కొండలరావుకు ఆరెస్సెస్ (R.S.S.) అభిమానం ఉండేది. గాంధీజీ హత్యానంతరం హిందూమహాసభ తదితర సంఘాల మీద విధించిన ఆంక్షలకు నిరసన తెలుపుతున్న ఇతర కుర్రాళ్ళతో బాటుగా అతన్నికూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూణ్ణెల్లు రాజమండ్రి జైలులో ఉంచారు. అదొక అద్భుతమైన పరిణామానికి అనుకోకుండా దారితీసిందని కొండలరావు అంటారు. చదువుకోవలసి రావడం వగైరాలేవీ లేకపోవడంతో టీనేజిలో ఉన్న కొండలరావుకు జైలు లైబ్రరీలో తెలుగు సాహిత్యం చదివేందుకు మంచి అవకాశం దొరికింది. ఆధునిక కథకుల్లో ప్రసిద్ధులందరి రచనలూ అతనక్కడ చదివి, అర్థం చేసుకుని ఆనందించాడు. ఆ విధంగా అతనికి స్వయంగా రచనలు చేసేందుకు తగిన స్ఫూర్తి లభించింది. కొడవటిగంటి కుటుంబరావు తదితరుల కథలు ఆదర్శంగా భావించి చేసిన ప్రయత్నాల ఫలితంగా చక్రపాణి నడిపిన యువ పత్రికలో 1949లో అతని కథ ఒకటి అచ్చయింది. దానితో ఉత్సాహం పెరిగింది.
ఆ ఊపుతో అతని చిన్న కథలూ, నాటికలూ అచ్చులో రాసాగాయి. కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో వారి అవసరార్థం అతను రాసిన ‘స్వయంవరం’ అనే స్త్రీ పాత్ర లేని నాటికను అందరూ మెచ్చుకున్నారు. వారిలో దాడి గోవిందరాజులు నాయుడు వంటి పెద్దలుకూడా ఉన్నారు. ఆయన జిల్లా జడ్జి, నటుడు కూడా. ఆ తరవాత కొండలరావు ‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక రాశారు.
ఇంతలో, మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ ఉద్యోగానికి అభ్యర్థులను విశాఖపట్నంలో ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసి కొండలరావు కూడా వెళ్ళారు. శ్రీశ్రీ,, ఆరుద్ర మొదలైనవారు లోగడ పనిచేసిన పత్రిక అది. సబ్ఎడిటర్ ఉద్యోగానికి కొండలరావు ఎంపికయ్యారు. 1956లో మద్రాసులో ఆరు నెలలపాటు ఆనందవాణి ఆఫీసులో కూర్చుని వచ్చిన కథలని చదివి, వాటిలో మంచివాటిని ఏరిపెట్టడమే ఆయన పని. ఆఫీసులోనే ఉద్యోగం, నివాసం కూడా. కానీ, పత్రిక ఎక్కువకాలం నడవలేదు. అంతకుముందు 1948లో మద్రాసు వెళ్ళినప్పుడు ‘బాల’ పత్రికలో బొమ్మలు వేస్తున్న బాపూతోనూ, ముళ్ళపూడి వెంకటరమణతోనూ పరిచయం ఏర్పడింది. అప్పటికి అందరూ నిక్కర్లు వేసుకునే వయసువాళ్ళే.
ఆనందవాణి ఆఫీసుకి ఆంధ్రపత్రిక ఆఫీసు దగ్గరలోనే ఉండేది. కొండలరావుకి అందులో పనిచేస్తున్న కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి మొదలైనవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే పిలకా గణపతిశాస్త్రి, తిరుమల రామచంద్ర తదితరులను కలుసుకున్నారు. ఆంధ్రపత్రికలో కొండలరావు కథలు కొన్ని అచ్చువేశారు. ఇవికాక తెన్నేటి సూరి నిర్వహిస్తున్న భారతి పత్రికలో ‘స్వయంవరం’, ‘కుక్కపిల్ల దొరికింది’ నాటికలు రెండూ అచ్చవడంతో కొండలరావుకు కొత్తవారిని కలుసుకున్నప్పుడల్లా స్వపరిచయం సులువయింది. ఒక సందర్భంలో ఆరుద్రకు ఎవరో పరిచయం చేసినప్పుడు తాను ఫలానా అని చెప్పగానే ఆరుద్ర వెంటనే “‘కుక్కపిల్ల దొరికింది’ రాసినది మీరేకదా” అంటూ పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళారట.
‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక అచ్చవగానే చాలా ప్రజాదరణ పొందింది. నేను మద్రాసులో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే (1957 ప్రాంతాలలో) ఆ నాటిక మా స్కూల్లో ప్రదర్శించారు. సులువుగా చెప్పగలిగిన డైలాగులతో, సున్నితమైన హాస్యంతో అది అందరికీ నచ్చిన హాస్యనాటిక. 1961లో మద్రాసు చిల్డ్రన్స్ థియేటర్లో ఈ నాటికను కొండలరావుగారే స్వయంగా వేశారు. అందులో నౌకరు కుర్రాడుగా నటించిన చాకులాంటి అబ్బాయి అందర్నీ ఆకర్షించాడు. అతనే రాజబాబు. త్వరలోనే అతను సినిమాల్లో బిజీ కమెడియన్‌గా స్థిరపడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
ఆంధ్రపత్రికలో కొండలరావుకు ఉద్యోగం మటుకు రాలేదు. ఎందుకంటే ఒక్క ముళ్ళపూడి వెంకటరమణగారిని తప్ప డిగ్రీ లేనివారినెవరినీ వారు తీసుకునేవారు కాదు. అందుకని కొండలరావుకు అక్కడ అవకాశం లభించలేదు. ఆయన కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. అంతకు ముందు ఒకసారి 1954లో హైదరాబాదులో కొండలరావు ప్రఖ్య శ్రీరామమూర్తి రాసిన ‘కాళరాత్రి’ నాటకంలో నటించినప్పుడు సినీరచయిత డి.వి.నరసరాజుగారు జడ్జిగా వచ్చారు. ఆంధ్రనాటకపరిషత్తు నిర్వహించిన ఆ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రమణమూర్తి తదితరులు కూడా నటించారు. కొండలరావు ఆ పరిచయాన్ని పురస్కరించుకుని నరసరాజుగారిని మళ్ళీ 1956లో మద్రాసులో కలుసుకున్నారు. ఆయన సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది.
అంతకుముందే కొండలరావు కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాసివచ్చారు. అయితే తెలుగు సినిమాల్లో పనిచెయ్యడం అదే మొదటిసారి. స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని తక్కువగా ఉండడంతో దర్శకత్వం వహిస్తున్న కమలాకర కామేశ్వరరావు కొండలరావును తనకు అసిస్టెంటుగా కూడా పని చెయ్యమని పిలిచారు. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఒక సన్నివేశంలో ఒక డాక్టరు పాత్ర అయోమయంగా నటించాలి. మామూలుగా డాక్టరు పాత్రలు వేసే ఒకతను అలా చెయ్యలేక తడబాటుపడి, కొండలరావునే వేసెయ్యమని ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా కామేశ్వరరావు సలహాతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.
ముద్దుకృష్ణ సహకారంతో కొన్ని సినిమాల్లో సహకార దర్శకుడిగా అవకాశాలొచ్చాయి. ఆ తరవాత ‘పూజాఫలం’ వంటి సినిమాల్లో బి.ఎన్.రెడ్డిగారితో పనిచేసే అవకాశాలొచ్చినప్పటికీ ఆయన పెట్టే ఆంక్షలు కొండలరావుకు ఇబ్బందికరంగా ఉండేవి. అప్పటికి ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. జరుగుబాటు కోసం ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. పని ఉన్నా లేకపోయినా డబ్బింగ్ వగైరాలకు తమ ఆఫీసు నుంచి ఎక్కడికీ వెళ్ళరాదని రెడ్డిగారు కోప్పడేవారు. అందుచేత ఆయనతో కష్టమనిపించేది. కొండలరావు బి.ఎన్. గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పైన హాలులో తన బృందంతో నాలుగిళ్ళ చావిడి నాటకం రిహార్సల్సు వేసుకునేవారట; బి.ఎన్. దానికి అనుమతించడమేకాక కొత్తగా హీరో వేషానికని వచ్చిన చంద్రమోహన్‌ను నాటకం రిహార్సల్సు చూసి నటనలో మెళుకువలు నేర్చుకోమనికూడా చెప్పేవారట.
‘నర్తనశాల’ తీస్తున్నప్పుడు కమలాకర కామేశ్వరరావు మళ్ళీ కొండలరావును పిలిచారు. రంగారావు, రామారావు, సావిత్రి తదితరులకు సెట్టు మీద సన్నివేశాన్ని వివరించడం, డైలాగులు చెప్పించడం కొండలరావు పని. మహాభారతం పద్యాలకు వాళ్ళు అర్థాలు అడుగుతారని ఆయన ముందురోజునే రచయిత సముద్రాల సీనియర్‌తో కూర్చుని పద్యాల అర్థాల వివరాలు తెలుసుకునేవారు. నాలుగు పేజీల డైలాగ్‌ని రంగారావు అవలీలగా అర్థం చేసుకుని, గుర్తుంచుకుని చెప్పేవారని కొండలరావు అన్నారు. అటువంటి మహానటులతో పనిచెయ్యడం మరుపురానిదని ఆయన ఇప్పటికీ అంటారు.
సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆ విధంగా ఆదుర్తి తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక డాక్టరు వేషం లభించింది. దాని తరవాత రామారావు వంటి పెద్దనటులతో తనకున్న పరిచయాల ద్వారా క్రమంగా చాలా సినిమాల్లో వేషాలు వెయ్యసాగారు. ఒక సందర్భంలో పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించి చూడు’లో అవకాశం వచ్చింది. దీన్ని గురించి కొంత కథ జరిగింది. తక్కిన వ్యాపకాలు ఎన్ని ఉన్నా కొండలరావు హాస్య ప్రియత్వం ఏ మాత్రం తగ్గలేదు. శ్రీకాకుళంలో తన చిన్నప్పటి తెలుగు మేస్టరు మిమిక్రీని ఆయన అందరికీ వినిపిస్తూ ఉండేవారు. మద్రాసులో మా ఇంట్లోనూ, బాపూ, రమణలున్న ఇతర ఇష్టాగోష్ఠుల్లోనూ ఇది తప్పక జరిగే వ్యవహారం. నాటక, సాహితీ రంగాల్లోని స్నేహితులేకాక చాలామంది సినీప్రముఖులు అది విని ఆనందించేవారు. ఇదెంతవరకూ వెళ్ళిందంటే ఆ రోజుల్లోనే ఆసక్తి పట్టలేక ఆరుద్ర శ్రీకాకుళం దాకా వెళ్ళి సదరు మాస్టార్ని కలుసుకుని మరీ వచ్చారు. ఎవరి మాటా వినిపించుకోకుండా, దబాయింపు ధోరణిలో “సాయ్‌లెన్స్” అని కేక పెట్టే తెలుగు మేస్టరుది ఒక వింత స్వభావం.
ఈ వైఖరి కలిగిన పాత్రగా ముళ్ళపూడి వెంకటరమణ ప్రేమించిచూడులో నాగేశ్వరరావు తండ్రి పాత్రకు డైలాగులు రాశారు. పి.పుల్లయ్యకు ఈ నేపథ్యమేమీ తెలియదు. రమణ మాట విని ఆయన కొండలరావును తన ఆఫీసుకు పిలిపించి, మొదటిసారిగా చూస్తూనే “గెటవుట్” అని కేకలేశారట. “ఇంత చిన్నవాడివి నాగేశ్వరరావుకు తండ్రిగా నువ్వేం పనికొస్తావు” అని పంపేశారట. రమణ సిఫార్సు చేసినట్టు తెలిసి కుటుంబరావుగారు కూడా కొండలరావును తనతో మళ్ళీ తన పాత మిత్రుడైన పుల్లయ్య దగ్గరికి తీసుకెళ్ళి, “ఇతని మిమిక్రీ నువ్వు చూడలేదు, నా మాట విని అతనికా వేషం ఇయ్యి” అని గట్టిగా చెప్పాకగాని పుల్లయ్య సరేననలేదట. చిత్రం రిలీజయాక ఆ కామెడీ పాత్ర అందరికీ నచ్చింది.
తక్కిన సినీనటుల్లాగా కాకుండా కొండలరావు తన నాటక, సాహితీరంగాల కృషిని విడిచి పెట్టలేదు. కుటుంబరావుగారి ద్వారా కొండలరావుకు చందమామవారి విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా ఉద్యోగం వచ్చింది. విజయచిత్రలో పాఠకుల ప్రశ్నలకు ఆయన జవాబులు రాసేవారు. ఒక పాఠకుడి ప్రశ్న: నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది? కొండలరావుగారి జవాబు: మీ ముఖంలా ఉంటుంది! అంతకుముందు ఆయన జ్యోతి మాసపత్రిక సంపాదకవర్గంలో ఉండేవారు. వివిధ పత్రికల్లో కథలూ, వ్యాసాలూ, సెటైర్లూ, నాటికలూ రాశారు. వాటి వివరాలు కింద చూడవచ్చు.
ఆయన హాస్యధోరణి ఎలాంటిదంటే కథ కంచికి అనే నాటికలో పాత్రల పేర్లు ఇవి: (అన్నమో) రామచంద్ర, (అరచేతిలో) వైకుంఠం, (ఆబాల) గోపాలం, (వల్లకాట్లో) రామనాథయ్య, (లోగుట్టు) పెరుమాళ్ళు, (నీతి) చంద్రిక వగైరా. ఆయన రాసి, దర్శకత్వం వహించిన నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం మొదలైన నాటకాలు బాగా ప్రజాదరణ పొందాయి. పొట్టి ప్రసాద్, కాకరాల, నాగరాజారావు తదితరులు ఆయనకు మంచి సహనటులు. రాధాకుమారికి ముఖ్య పాత్రలుండేవి. ఒకవంక సినిమాపత్రిక పనులు చూస్తూ, రచనలు చేస్తూ, సినిమాలూ, నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఆయన నిత్యమూ బిజీగా ఉండేవారు. మద్రాసులో ఆయన నాటకాలు చూసిన దర్శకులు సినిమా వేషాలకు పిలిచేవారు. పట్టాలుతప్పిన బండిలో కాకరాలను చూశాకనే ఆయనకు బి.ఎన్.గారి ద్వారా రంగులరాట్నంలో అవకాశం వచ్చింది.
1974లో రామనవమి సందర్భంగా మేము బొంబాయిలో నడిపిన తెలుగు సాహిత్యసమితి అనే సంస్థ తరఫున కొండలరావుగారిని ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటకం వెయ్యడానికి ఆహ్వానించాం. యవ్వన గుళికలవంటి వాటిని కనిపెట్టేందుకు ఒక నడివయసు పరిశోధకుడు చేసే విఫలప్రయత్నాలను గురించిన ఆ హాస్యనాటకం బ్రహ్మాండమైన జనాదరణ పొందంది. మద్రాసు నుంచి వచ్చిన కొండలరావు గారి బృందం మంచి నాటకాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడమే కాక మాకున్న పరిమిత ఆర్థిక స్థోమతను సహృదయతతో అర్థం చేసుకుని మాతో సహకరించడం మేమెన్నటికీ మరిచిపోలేదు. అందులోని డైలాగులనూ, హాస్యసన్నివేశాలనూ మా మిత్రబృందం ఎంతో కాలంపాటు గుర్తు చేసుకుంటూనే ఉండేవాళ్ళం.
ఎవరినీ ప్రాధేయపడకుండా కేవలం నాటకానుభవంవల్ల కొండలరావు, రాధాకుమారి గార్లకు సినిమాల్లో వేషాలు దొరుకుతూ ఉండేవి. తరవాతి కాలంలో ఆయన చందమామ-విజయావారి భైరవద్వీపం సినిమాకు కథారచన, నిర్మాణనిర్వహణ చేశారు. సినిమా రంగం చరిత్ర గురించి ఇప్పటికీ ఎన్నో మంచి వ్యాసాలు రాస్తున్నారు. టీవీలో గొల్లపూడి మారుతీరావు గిరీశంగా కన్యాశుల్కం నాటకానికి దర్శకత్వం వహించారు. ఈ రోజుల్లో సినిమా పద్ధతులు తనకు సరిపడవనీ, కథ, స్క్రిప్టు, పాత్రపోషణ వగైరాలమీద ఎవరికీ శ్రద్ధలేదనీ అన్నారు. నాటకాల్లో ఆసక్తి ఉన్న మిత్రులతో కలిసి ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్న కొండలరావు, రాధాకుమారిగార్ల ఉత్సాహం ఆదర్శప్రాయం అనిపిస్తుంది.
రాధాకుమారిగారు ఆయనకు అన్నివిధాలా తగిన సహచరి. నటిగా ఎంతో ప్రతిభ కలిగిన నటీమణి. నేటికీ సినిమా, టీవీ, నాటకరంగాల్లో బిజీ ఆర్టిస్టు. ఆమె జన్మించినది విజయనగరంలో. స్త్రీలు ఎక్కువగా నాటకాల్లో వేషాలు వెయ్యని ఆ రోజుల్లోనే తన చిన్నతనంలో నటిగా కృషి మొదలుపెట్టారు. క్రమంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా అనేక సాంఘిక, పౌరాణికాల్లో నటించసాగారు. ఇక చదువు వెనకబడక తప్పలేదు. ఆమెకు సహనటులు జె.వి.సోమయాజులు, రమణమూర్తి, కొండలరావు మొదలైనవారు. అప్పటికే ఆమె ఉత్తమనటిగా బహుమతులు తెచ్చుకుంది. ఆమెకు సినిమా ఉత్సాహం కూడా కలిగింది. అప్పటికే కొండలరావు సినిమాల్లో వున్నారు గనక ముందు డబ్బింగ్ చెప్పడం నేర్చుకోవటానికి ఆమెను మద్రాసు పిలిపించారు. అప్పట్లో ఆయన సహకార దర్శకుడుగా ఉన్న ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఒక ముఖ్యపాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పింది. త్వరలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రాసాగాయి. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.
రాధాకుమారి నటించిన నాటకాలు చూసిన సినీప్రముఖులు ఆమెకు చిత్రాలలో అవకాశాలు ఇవ్వసాగారు ఆమె తొలి చిత్రాలు: తేనెమనసులు, దాగుడుమూతలు. తర్వాత గయ్యాళి పాత్రలు, సాధు పాత్రలు చాలా చిత్రాల్లో వేశారు. అయితే కొందరు ఇతర సినీకళాకారుల్లాగా వీరిద్దరూ తమ సంస్కారాన్ని మరిచిపోలేదు. అందుకనే నాటకాలు వెయ్యడం మానలేదు. ఆమె దాదాపుగా 400 సినిమాల్లో వేశారు. ప్రస్తుతం 5, 6 సినిమాల్లో పాత్రధారణ చేస్తున్నారు. ఇటీవల ‘ఒకరికి ఒకరు’ ‘చందమామ’ చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఓ పక్క టీవీ సీరియల్స్, ఇంకోపక్క సినిమాలూ, నాటకాలూ - నిత్యం బిజీగానే వున్నారు.
ప్రస్తుత కాలంలో తెలుగు నాటకరంగం పరిస్థితి గురించి బాబ్జీలు అడిగినప్పుడు కొండలరావుగారు చెప్పినది ఇది.
“టిక్కెట్ కొనుక్కుని చూసే ప్రేక్షకులు లేకపోవడం వల్ల తెలుగు నాటకం ఈ పరిస్థితుల్లో వుంది. ‘కమిట్మెంట్’ లేని ప్రేక్షకులూ ‘కమిట్మెంట్’ లేని నాటకరంగం. ఇదీ పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల నాటకరంగాలతో అసలు పోలికే లేదు. నంది నాటకోత్సవాలకి విరగబడి జనం వస్తారు. రవీంద్రభారతి నిండిపోయి బయట కూడా స్క్రీన్స్ పెట్టవలసి వస్తుంది. ఒక రూపాయి అయినా టికెట్ పెట్టండి అని ఎంత చెప్పినా వినరు. టికెట్ పెడితే రారండీ అంటారు. వచ్చినవాళ్ళే చాలు అన్నా వినరు. ఇటీవల ‘పడమట గాలి’ అనే నాటకం వేసినప్పుడు యాభైమంది ఆర్టిస్టులు, హాల్లో పదిమంది ప్రేక్షకులు, ఇదీ పరిస్థితి. నాటకం మీద అధారపడి బతకడం కుదరదు. ప్రొఫెషనల్ నాటకం కుదరదు. ఎమెచ్యూర్స్ మంచి నాటకాలే వేస్తున్నారు. ఎస్ వీ శేఖర్ రేపూ ఎల్లుండీ రెండు రోజులు ఇక్కడ తమిళ్ నాటకాలు ఆడుతున్నాడు. రెండు నాటకాలు. వెళ్ళి చూడండి. హౌస్ ఫుల్ అవుతాయి రెండురోజులూ. మెడ్రాస్ లో ఇరవై దాకా సభలున్నాయి. అందులో మెంబర్లుంటారు. ప్రతీ నెలా ఫీజు కడతారు. వాళ్ళకోసం ప్రతీ నెలా ఏదో వొక ప్రోగ్రాం వుంటుంది. ఆటో, పాటో, నాటకవోఁ. మెంబర్లు కాని వాళ్ళు టికెట్ కొనుక్కుని వెళ్తారు. ఇక్కడ మెంబర్లుగా చేరినా ఫీజు కట్టరు. రారు.”
తెలుగు నాటకరంగం పరిస్థితిని గురించి చాలామంది పెద్దలు చాలానే రాశారు. అది ప్రస్తుతపు తెలుగువారి సంస్కారాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పట్టువదలని విక్రమార్కుళ్ళా కొండలరావుగారి వంటి కళాకారులు మాత్రం తమ వంతు కృషిని చేస్తూనే ఉన్నారు.
రావికొండలరావు రచనలు (ఇవన్నీ విశాలాంధ్ర బుక్‌హౌస్ తదితర దుకాణాల్లో దొరుకుతాయి):
- రావి కొండలరావు నాటకాలు
- రావి కొండలరావు కథలు
- రావి కొండలరావు నాటికలు
- బ్లాక్ అండ్ వైట్ (సినిమా వ్యాసాలు - నంది అవార్డ్ పురస్కృత)
- మల్లీశ్వరి నవలా రూపం
- మాయాబజార్ నవలారూపం
- షావుకారు నవలారూపం
- హ్యూమరథం - 1
- హ్యూమరథం - 2 (సినిమావారిలోని చమత్కారాలు)
- (సి) నీతి చంద్రిక (సినిమా సెటైర్)
- అన్నీ అడ్డంకులే (సినిమా సెటైర్)
- చిత్తూరు వి.నాగయ్య (జీవిత చరిత్ర)*
- నేనూ - నా దర్శకులు (అక్కినేని)*
(* వాళ్ళు చెప్పగా రావి కొండలరావు రాసినవి)

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ... పూర్తిగా »


Vamsi M Maganti అభిప్రాయం:
January 1, 2009 9:28 am
కొండలరావు గారిలాటి పట్టువదలని విక్రమార్కులు ఇంకా చాలా మంది కావాలి అని కోరుకుంటూ…ఒక మంచి ఇంటర్వ్యూ అందించినందుకు మీకు, బాబ్జీలు గారికి ధన్యవాదాలు…
Rohiniprasad అభిప్రాయం:
January 1, 2009 12:43 pm
కొండలరావు మా నాన్న కుటుంబరావుగారికి అనేక విధాలుగా సన్నిహితులు. విజయచిత్ర ఆఫీసు చందమామ ఆఫీసుకు పక్కనే ఉండేది. జ్యోతి మాసపత్రికలో ‘సంభాషణలు” అనే శీర్షికతో వారిద్దరూ ఒక సరదా వ్యాసం రాశారు. మా నాన్న రాసిన బ్రతుకు భయం అనే రచనను నాటకం రూపంలో మద్రాసు రేడియోలో కొండలరావు స్వయంగా సీతప్ప పాత్ర ధరించి ప్రసారం చేయించారు.
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
January 1, 2009 3:02 pm
మంచి వ్యాసం.
ఈ వ్యాసంలోని కొన్ని విషయాలు నాకు స్వానుభవాలు.
రావి కొండలరావు గార్ని అజోవిభో ఫౌండేషన్ నాటకాల పోటీల ద్వారా ప్రత్యక్ష పరిచయం కలిగింది. తెలుగునాట నాటకాల మీద ఇప్పటికీ కృషి చేస్తున్న వ్యక్తి. సాధారణంగా నాటకాల నుంచి సినీ రంగంలోకి వెళ్ళిన చాలా మంది వ్యక్తులు తిరిగి నాటకం మొఖం చూడరు. రావి కొండలరావు గారు అందుకు భిన్నంగా ఇప్పటికీ నాటకాలపై గౌరవంతో తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు.
వ్యాసకర్తలకి ధన్యవాదాలు.
అయ్యా బాబ్జీలు గారూ: మీ నుంచి (ప్రత్యేకంగా) ఈమాటలో రచనల కోసం ఎదురు చూస్తూ,
లక్ష్మన్న
baabjeelu అభిప్రాయం:
January 5, 2009 10:37 am
“కథకుడుగా కొండలరావు” అనే శీర్షికన నండూరి రామ్మోహన రావుగారు ర్రవి కొండలరావు గారి ద్విశత చిత్రోత్సవ అభినందన సంచికలో (1983) ఒక వ్యాసం రాసేరు. అందులో రావి కొండలరావు గారి “ముమూర్ష”, “దిదృక్ష”, “చంద్రశేఖరుని కథ” మరియూ “స్నేహం” కథల గురించి క్లుప్తంగా సమీక్షించేరు రామ్మోహన రావు గారు.
రావి కొండల రావు గారి “టెక్నిక్” గురించి చెబ్తూ “కొండల రావు తన కథలను ముగిస్తూ ముగింపు తరవాత జరిగేదాన్ని వాచ్యంగా చెప్పడు. పాఠకుల ఊహకు వదిలెయ్యడం అతని “టెక్నిక్” అంటారు.
“ఇలాగే కొండలరావు రాసిన నిరుద్యోగపర్వం, మాయమైనపర్సు,తప్పిపోయినాడు లాంటి కథలు లబ్జుగానూ, రంజుగానూ వుండి పాఠకుల్ని గిలిగింతలు పెడతాయి” అంటారు నం.రా.రావు గారు.
వ్యాసం చివర్లో “…కథలు రాయని భాస్కరుడు (జూ) గా కొండలరావు పై ఆయన స్నేహితుడు ముళ్ళపూడి పరోక్ష ప్రభావం ఎంతైనా వుంది (సీనియరు ముళ్ళపూడా? ఎక్కడ చదివేనో గుర్తు రావటం లేదు కృ.శాస్త్రి గారితో ఎలాగొలాగ కష్టపడి రాయించొచ్చుగానీ, ము.వెం.రవఁణ గారి చేత మరీ కష్టవఁని). ఆ ప్రభావంలో నుంచి బయటపడి కథకుడిగా కొండలరావు మళ్ళీ విజృంభిస్తే బావుంటుందనే దిదృక్ష కలవారిలో నేనొకడిని” అని ముగిస్తారు నండూరి రామ్మోహన రావు గారు.
చూద్దాం. ఈమాట కోసం రా.కొండలరావు గారి చేత కథో, నాటికో ఏదో ఒకటి రాయించగలనేమో? అది మన “పీర్స్” కి “పర్లేదు” అనిపిస్తుందేమో?
సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
January 17, 2009 9:23 pm
క్రితం ఏడాది అక్టోబర్ లో నాటక రంగ ప్రముఖ వ్యక్తి దుగ్గిరాల సోమేశ్వరరావు 77వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో రావికొండల రావు స్వీయరచన దర్శకత్వంలో “బాంబు పేలింది” అని ఓ నాటకం వేస్తే నేను చూసాను. వయసు శరీరానికి కానీ మనసుకి కాదు అని నిరూపిస్తూ ఇరవై ఏళ్ళ వ్యక్తిలా ఎంతో ఉత్సాహంతో రావి కొండల రావూ, ఆయన సతీమణి రాధా కుమారీ నటించారు. ఇద్దరికీ నటనలో, ముఖ్యంగా హాస్యం పండించడంలో బ్రహ్మాండమైన టైమింగ్ వుంది. ఈ నాటకానికి పట్టుమని పది పుంజీల జనం కూడా లేరు. వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా దుగ్గిరాల వారి అభిమానంతో వచ్చిన వారే! ఇది చూసి పక్కనే ఉన్న నాటకరంగంలో మరో ప్రముఖ వ్యక్తి చాట్ల శ్రీరాములు గార్ని మొత్తం హైద్రబాదులో తెలుగు నాటకరంగానికి చెందిన కళాకారులెంత మందని అడిగితే, దాదాపు రెండు వేల పైగా ఉన్నారని చెప్పారు. అంతమంది ఉంటే అదేమిటి పట్టుమని పదిమంది కూడా లేరేమిటని అడిగితే, ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నిరాశా, నిర్వేదం కనిపించాయి. ఆ ప్రాంగణంలో ఖాళీ కుర్చీల సంఖ్యే నాటక రంగంలో ఉన్న ఐకమత్యాన్ని చెప్పకనే చెప్పింది. హైద్రాబాదు నగరంలో ఉన్న రెండు వేలమంది కళాకారులూ రావాలని ఆశించక పోయినా, కనీసం అందులో పదో వంతుకూడా రాకపోవడం విచారించదగ్గ విషయం. నాటకం పూర్తయ్యాక నటీనటుల పరిచయ కార్యక్రమంలో పరిచయమక్కరలేని రావికొండల రావు గారికి ఓ నలుగురు అతి బలవంతమ్మీద తప్పట్లు కొట్టారు. ఈ తప్పట్ల శబ్దం పాత్రల సంఖ్య పెరిగే కొద్దీ క్షీణిస్తూ వచ్చింది. ఆఖరి నటుని పరిచయమొచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి వినిపించింది. అదీ ఆ సభకు విచ్చేసిన వారి గోలలో కలిసిపోయింది. ఇదీ నేటి నాటకరంగ పరిస్థితి. ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, అసలు కమిట్మెంట్ లేనిది నాటక రంగంవారికని ఇలాంటి సంఘటనలు మరింత బలపరుస్తాయి. ఈ విషయంపై నేను స్పందించి రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చింది. చాట్ల వారు ఓ పది కాపీలు తెలుగు యూనివర్శిటీ ధియేటర్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపానని చెప్పారు. ఇలాంటిదే జి.ఎల్.ఎన్. మూర్తిగారు ఇవాళ ఆంధ్రజ్యోతి లో రాసిన “మంచి నాటకం ఎక్కడ?” వ్యాసంలో రాసారు.
rama bharadwaj అభిప్రాయం:
February 4, 2009 10:18 am
సంపాదకులకు,
నాటకం గురించి వచ్చిన మంచి పుస్తకం జయప్రభ గారి “నాలుగో గోడ”. తెలుగు నాటకం మీద వచ్చిన మంచి పరిశోధన ఇది.. తెలుగు నాటకరంగం మీద అదివరకు ఎవరూ చేయని కొత్త చర్చలన్నీ… మొదటగా 91 ప్రాంతాల్లోనే ఈ పుస్తకం లో చోటుచేసుకున్నాయి. మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.?? తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా? మీ webzine అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!.నాకు తెలిసినంతలో ఒక అంశం మీద మాట్లాడేవారు..ఆ అంశం మీద వచ్చిన ముఖ్యమైన పుస్తకం నించి..విషయాన్ని కోట్ చేయటం అన్న ది ..ఆ విషయానికి ప్రామాణికతని ఆపాదిస్తుంది. కన్యాశుల్కం గురించి చర్చించేటప్పుడు అప్పారావుగారి ప్రసక్తి తెచ్చిన ట్టుగా అన్నమాట.ఆ పుస్తకానికి ఆంధ్రదేశంలో అభిమానులు మెండు. అమెరికా తెలుగువారికి తెలియదేమో ఇంకా అని …చెప్పాలనుకున్నాను.
రమ.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
February 4, 2009 11:04 am
రమ గారూ,
ఈ పుస్తకం గురించి అందరికీ తెలుసని అనుకోను. పుస్తకాల దుకాణాల్లో ఇలాంటివి అందుబాటులో ఉంటున్నాయా? క్రితం ఏడాది మొదిలి నాగభూషణ శర్మ గారి “నాటక శిల్పం” పుస్తకం వచ్చింది. అదీ చాట్లవారు నాకు బహుకరిస్తే లభించింది. మీరన్నది నిజమే! అమెరికాలో ఉండే వాళ్ళకి వీటి గురించి తెలీదు.
తెలుగు నాటకం పేరున ఒక బ్లాగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. అందులో నాటక ప్రతులూ, వీడియోలూ అన్నీ ఉండేలా చేయాలన్న ఆలోచన ఉంది. అది రూపుదిద్దుకుంటే ఈ పుస్తకం అక్కడ పెడదాం. నాటకాలకి సంబంధించి నా దగ్గర పాతవి కొన్ని పుస్తకాలున్నాయి. అవన్నీ మెల్లమెల్లగా పి.డి.ఎఫ్ ఫార్మాట్ కి మారిస్తే ఇది కుదురుతుంది.
-సాయి బ్రహ్మానందం.
Sreenivas Paruchuri అభిప్రాయం:
February 4, 2009 1:30 pm
> ఈ పుస్తకం గురించి అందరికీ తెలుసని అనుకోను. పుస్తకాల దుకాణాల్లో ఇలాంటివి అందుబాటులో ఉంటున్నాయా?
I am, once again, astonished by the level of confidence with which certain comments are made here. “నాలుగోగోడ” పుస్తకం గురించి “అమెరికాలో ఉండే వాళ్ళకి వీటి గురించి తెలీదు.” అని అంత నిశ్చయంగా యెలా చెప్పగలుగుతున్నారో! The book was (perhaps still is!) pretty much available in bookshops back home until very recently (2006/07). If you want, I own a copy, and many of my friends and acquaintances in USA too :-). Anyway, I wish all the success in acquiring permission from the author to make the book publicly accessible.
> మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.??
> తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా? మీ webzine
> అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!.
I also wonder on what basis the above statements were made, and I fail to understand how is it a “first book”. More puzzling, rather amusing, is to read the dig at ఈమాట magazine. Where is the relevance in the above essay or the comments to mention this book? Pray, how’s ఈమాట responsible for not talking about నాలుగో గోడ. Why don’t you yourself write an article for ఈమాట explaining why you believe that its a good book, and what new arguments were made in it. I am sure that ఈమాట readers’d appreciate such an attempt.
In fact, even better would be a comprehensive essay discussing various writings on “drama criticism” in Telugu, paying due tributes to people like శ్రీనివాస చక్రవర్తి, భమిడిపాటి et al, and also consider various essays by కోలాచలం, గోవిందరాజుల, స్థానం, రాఘవ et al which critically discuss the early days of drama so that we also get an historical perspective.
Regards,
Sreenivas
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
February 4, 2009 3:25 pm
శ్రీనివాస్ గారూ,
నేను గత ఏడాది అక్టోబర్ / నవంబర్ లో ఇండియా వెళ్ళినప్పుడు నాటకాలకి సంబంధించిన్ పుస్తకాలు కొందామని చాలా షాపులు తిరిగాను. ఈ “నాలుగో గోడ” ఏ దుకాణంలోనూ నాకు కనిపించలేదు.
నాకు మీఅందరికీ వున్నంత అవగాహన లేదు. ఈ మధ్య అనేక మంది నాటకరంగ ప్రముఖులతో చర్చించే అవకాశం వచ్చింది. వాళ్ళెలెవ్వరూ ఈ పుస్తకం ప్రస్తావనే తీసుకు రాలేదు. నాకు తెలీక పోయినా వారు ఆంధ్ర దేశంలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసుండాలనుకుంటున్నాను. నాటకరంగానికీ, సాహిత్య రంగానికీ ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది. ( ఇది నా అభిప్రాయం సుమా - మళ్ళీ ఇక్కడ అపార్ధాలకి తావులేదు. ) నాటకాలు వేసేవాళ్ళకీ, నాటకాలు రాసేవాళ్ళదీ ఇద్దరిదీ చెరోదారి. ఒకరి సృజన ఇంకొకరికి పట్టదు. ఇదీ ప్రస్తుత పరిస్థితి.
“అమెరికాలో ఉండే వాళ్ళకి వీటి గురించి తెలీదు.” బదులుగా “అమెరికాలో ఉండే వాళ్ళకి వీటి గురించి తెలియక పోయే అవకాశం ఎక్కువ” అని రాసుండాల్సింది నేను. నా అభిప్రాయాన్ని అందరిదీగా చెప్పడం తప్పే!
rama bharadwaj అభిప్రాయం:
February 4, 2009 10:01 pm
సంపాదకులకి,
పరుచూరి శ్రీనివాస్ గారికి నా అన్ని అభిప్రాయాల పట్ల ఎందుకనో మరీ వ్యతిరేకత ఏర్పడింది. ఆయన నాకిచ్చిన సూచననే నేను ఆయనకిస్తున్నాను. చూడబోతే ఆయన భావకవిత్వం నించీ ఆధునిక తెలుగు నాటకం దాకా విషయ సంపన్నత బాగా కలిగిన వారుగా కన్పిస్తున్నారు. మంచి సాహితీవేత్త, సాహితీ విమర్శకులూ కూడా కావొచ్చు. నా దురదృష్టం ఏమో నేను ఆయన రచనలేవీ పుస్తకాలుగా ఇంత వరకూ చదవలేదు. ఆయన నా మీద ఒంటి కాలి మీద లేవటం తగ్గించి, తనకి క్షుణ్ణంగా తెలిసిన విషయాల మీద విపులంగా ఇంగ్లీషు వాక్యాల్లో కాక తెలుగు వాక్యాల్లో ప్రకటిస్తే, తెలుగు భాషా సాహిత్యాల కోసం ఈమాట చదవదలుచుకునే పాఠకులకి మరింత మేలు జరుగుతుంది కాదా??
రమ.
rama bharadwaj అభిప్రాయం:
February 4, 2009 10:33 pm
బ్రహ్మానందం గారూ
మరి మీరు..మొదలి వారినీ, అలాగే చాట్ల వారినీ “నాలుగో గోడ” గురించి అడగలేదా?? నాటకం గురించి వచ్చిన నాసిరకం పుస్తకాలు వాళ్ళకి తెలిసి “నాలుగో గోడ” వంటి విమర్శ తెలియక పోవటం సాధ్యం కాదు కదా??
తెలుగు నాటక రంగం మీద్ కృషి చేసిన వారే లేరే?? చెప్పుకోగల్గినంతగా అని నా భావం. [మళ్ళీ పరుచూరి శ్రీనివాస్‌కి కోపం వస్తుంది కాబోలు నేనీ మాట అన్నందుకు. కానీ ఏం చెయ్యగలం? పేర్లు వల్లించినంత మాత్రాన ఆ పుస్తకం బుద్ధికి పదును పెట్టేది కూడా కావాల్సి ఉంటుందని శ్రీనివాస్ గారికి నేనెందుకూ చెప్పడం? ఆయనకి తెలియదు గనకా? అన్నీ తెలిసిన వారాయె!].
బ్రహ్మానందం గారూ ! తెలుగు నాటకం మీద మీకున్న శ్రద్ధ సంతోషించదగ్గది. తెలుగు నాటకం ఈ నాటికీ నిలవ నీరు మాదిరిగా మిగిలిపోయిందని ఆ రంగం గురించి బాగా తెలిసిన వారు చాటుగా అంటూంటారు. ఇది నిజమేమో మరి శ్రీనివాస్ గారి లాంటి సర్వజ్ఞులు చెప్పాలి.
రమ.
అక్షర అభిప్రాయం:
February 5, 2009 2:14 am
@rama bharadwaj (February 4, 2009 10:18 am )
>>నాటకం గురించి వచ్చిన మంచి పుస్తకం జయప్రభ గారి “నాలుగో గోడ”. తెలుగు నాటకం మీద వచ్చిన మంచి పరిశోధన ఇది.. తెలుగు నాటకరంగం మీద అదివరకు ఎవరూ చేయని కొత్త చర్చలన్నీ… మొదటగా 91 ప్రాంతాల్లోనే ఈ పుస్తకం లో చోటుచేసుకున్నాయి.
ఇది మీ సొంత అభిప్రాయమనుకుంటున్నాను. మీకు నచ్చింది కాబట్టి మీకు మంచి పుస్తకమై ఉండొచ్చు. అలాగే మంచి పరిశోధనగా మీకు అనిపించి ఉండొచ్చు. పరుచూరి శ్రీనివాస్ గారన్నట్లు, ఈ మంచి పుస్తకం గురించి మీరే ఒక పరిచయ వ్యాసం వ్రాస్తే , ఆ పుస్తకం గురించి కనీసం మాలాంటి ఈమాట పాఠకులకైనా తెలుస్తుంది కదా!
>మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.??
అందుకు కారణాలు ఏమై ఉంటాయని మీరనుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది.
>తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా?
అంటే ఇది తెలుగు నాటకరంగం గురించి వచ్చిన మొదటి పుస్తకమా?! అదీ 91 ప్రాంతాలలోనా? అనగా 91 కి ముందు, తెలుగు నాటకరంగం మీద అస్సలు పుస్తకాలే లేవా? ఒకవేళ ఈ నాలుగో గోడే తొలిపుస్తకమే అయితే, అందులో చర్చించిన క్రొత్త విషయాల మీద విస్తృతమైన (లేక సాధారణ) చర్చ ఏమైనా జరిగిందా? ఆ చర్చలకు సంబంధించిన వివరాలు చూడాలని ఆసక్తిగా ఉంది. అందుకు సంబంధించిన సమాచారం మీవద్ద ఏమైనా ఉంటే ఇవ్వగలరా? పోనీ సమాచారం ఎక్కడ లభ్యమౌతుందో వివరాలు ఇవ్వగలరా? ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకోవాలనే తపనతో మిమ్ములను ఇవన్నీ అడుగుతున్నానని మనవి.
ఒకానొక పుస్తకం గురించి పేర్కొనకపోవడం గురించి, వ్యాసకర్తలను నిలదీయడం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇకనుంచైనా వ్యాసాలు వ్రాసేవాళ్ళు, వ్యాస విషయమ్మీద మొదట వచ్చిన పుస్తకాన్ని మర్యాద పూర్వకంగానైనా పేర్కొంటారని ఆశిద్దాం! మొదట వచ్చిన పుస్తకాల వివరాలు వ్యాసకర్తలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఎవరైనా చేస్తే చాలా బేషుగ్గా ఉంటుంది.
మీ ఉద్దేశ్యంలో మొదట వచ్చిన, పరిశోధనాత్మక మంచి పుస్తకం గురించి వ్యాసాల్లో (నాటకాలకు సంబంధించిన) పేర్కొనక పోవడం వెనుక, పుస్తకం గురించి వ్యాస రచయితకు తెలియక పోవడం, వ్రాసే వ్యాసానికి – పుస్తకంలో సమాచారానికి లింకు లేక పోవడం, లేక పుస్తకం నచ్చకపోవడం కాక మరేమైనా కారణాలను మీరు ఊహిస్తున్నట్లైతే, వాటి గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది.
>మీ webzine అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!
చాలా బాగుంది. వెబ్జీన్ అభిప్రాయాల్లో పాఠకులు ఎలాంటి అభిప్రాయాలకు ప్రాముఖ్యత నివ్వాలో – ఎలాంటి అభిప్రాయాలు వ్రాయాలో, వేటి గురించి వ్రాయాలో, వేటి గురించి వ్రాయకూడదో , ఏ పుస్తకాలను కోట్ చెయ్యాలో – ఒక నియమ నిబంధనావళి తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది.
>నాకు తెలిసినంతలో ఒక అంశం మీద మాట్లాడేవారు..ఆ అంశం మీద వచ్చిన ముఖ్యమైన పుస్తకం నించి..విషయాన్ని కోట్ చేయటం అన్న ది ..ఆ విషయానికి ప్రామాణికతని ఆపాదిస్తుంది. కన్యాశుల్కం గురించి చర్చించేటప్పుడు అప్పారావుగారి ప్రసక్తి తెచ్చిన ట్టుగా అన్నమాట.
అంశానికి సంబంధించి మాట్లాడే వాళ్ళందరికీ ఉపయోగపడే ముఖ్యమైన ముక్క ఇది. ముఖ్యమైన పుస్తకం నుంచీ, ఏదో ఒక విషయాన్ని మీ అంశానికి సంబంధమున్నా లేక పోయినా కోట్ చేయాలి. వచన కవిత్వం గురించి వ్రాసే ప్రతి వ్యాసంలో శ్రీ.శ్రీ. మహాప్రస్థానం గురించి ప్రస్తావించడం మరచిపోకూడదు(ఇంకెవరైనా విస్మరణకు గురౌతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ఉటంకించాలి). అలాగే కథ గురించి వ్రాస్తే గురజాడ ను స్మరించాలి(ఇంకెవరైనా విస్మరణకు గురౌతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ఉటంకించాలి). మీ భావమిదేనా?! అయితే…అర్జంటుగా ఈ నిబంధనను కూడా వ్యాస రచయితలకు తెలియచేసి, పాటించని వాళ్ళ వ్యాసాలను పబ్లిష్ చెయ్యకూడదని సంపాదకులకు తాఖీదు పంపాలి.
కన్యాశుల్కం లో అప్పారావుగారు విషయమా? ఆయన కన్యాశుల్కం నాటకాన్ని వ్రాసిన రచయిత కదా! పొరపాటు నాదే – మీరంటున్నది – కన్యాశుల్కం గురించి ఏదైనా వ్రాసేటప్పుడు అప్పారావు గారి ప్రసక్తి తేవడం గురించి కదూ?!
ఇంతకీ నాటకరంగం మీద వ్రాసిన వ్యాసాల్లో “నాలుగో గోడ” ప్రసక్తి లేదనా లేక “నాలుగో గోడ” రచయిత(త్రి) ప్రస్తావన లేదనా? ఇది చాలా కన్ఫూజింగ్ గా ఉంది!
ఇంతా వ్రాసిన తర్వాత, ముందు ముందు నేను నాటకరంగం మీద వ్యాసం వ్రాస్తే “నాలుగో గోడ” గురించి ప్రస్తావిస్తే సరిపోతుందా? రచయితను కూడా స్మరించాలా? లేక రచయితను, నాలుగో గోడను రెంటి గురించీ వ్రాయాలా?
- అక్షర
rama bharadwaj అభిప్రాయం:
February 6, 2009 12:25 am
అక్షర గారూ !!
నాలుగో గోడ పుస్తకం మీద నాకున్న అభిప్రాయం మాత్రమే అది. నాతో విభేదించే హక్కు … ఎవరికైనా కూడా ఉంది. మీ కుతూహలాల విషయం లో నాకు కుతూహలం లేదు. నాటకం ప్రస్తావన లో ..చర్చని కొత్త దిశగా మ లుపు తిప్పడం కోసం కొన్ని కొత్త అంశాలు లేవనెత్తడం జరుగుతుంది. నాది అటువంటి ఒక ప్రయత్నం మాత్రమే! కొత్త అంశాల ప్రస్తావన ఎప్పుడూ కూడా పత్రిక లోని చర్చల పరిధిని పెంచుతుంది.అయితే వ్యంగ్యం మాత్రమే ముఖ్యమైపోవడం వల్ల… అసలు విషయం పోయి కొసరు మిగులుతుంది. నాకు అటువంటి వాటిల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. నాకు “అక్షరం” విలువ బాగా తెలుసు. గనక క్లుప్తంగా నే చెబుతున్నాను.నా అభిప్రాయాన్ని…… నాటకం గురించి ఎవరు ఏం మాట్లాడినా..ఎక్కడ మాట్లాడినా..పుస్తకంగా నాలుగో గోడ నీ..రచయిత్రి గా జయప్రభ గారి కృషినీ..చెప్పటం లో ఔచిత్యం ఉంటుంది. నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకు ఉంది.
నా ఉద్దేశ్యం ఇంత మాత్రమే !!
రమ
K. Rohiniprasad అభిప్రాయం:
February 6, 2009 10:12 am
అభిప్రాయాలు రాసే పద్ధతి మర్యాదపూర్వకంగా ఉంటే bickerings తగ్గుతాయి. ఈ విషయంలో మోహనరావుగార్ని ఆదర్శంగా తీసుకోవచ్చు.
rama bharadwaj అభిప్రాయం:
February 19, 2009 5:04 am
సంపాదకుల ద్వారా రోహిణీ ప్రసాద్ గారికి,
అయ్యా ! “మోహనరావు గారి పద్ధతి” అన్న మాట నాకు సరిగ్గా బోధపడలేదు గానీ, సాహిత్య విషయాల్లో స్పర్ధలు సామరస్యం గానే పరిష్కారం అయిపోతాయా అన్నిసార్లూ? సాహిత్యం లో ఎవరి emotions వారివి. ఒకరి గొంతు మారితే, రెండో వారి గొంతు కూడా అందుకు అనుగుణంగా మారుతుంది. రచ్చబండ లో “కృష్ణదేవరాయలు కన్నడిగుడా? తెలుగు వాడా?” అన్న దాని మీద మృదువుగా “ఎవరైతే మాత్రం ఏమిటీ?” అన్న రాజీ ధోరణి లో మోహనరావు గారిది ఒక అభిప్రాయం చదివాను. ఆయన మాదిరిగా అలా భావించని వారూ వున్నారు. మరి వారి భావాలు కూడా బయటికి రావాలి కదా? చరిత్రలో తేలని అనేక అంశాలు ఇంకా వున్నాయి. నా వుద్దేశ్యంలో చర్చని పనిగట్టుకుని పక్కదారి పట్టించకుండా వుంటే కొత్త గొంతులు విన్పిస్తాయి. కొత్త భావాలూ, బయటికి వస్తాయి. అందువల్ల లాభమే గానీ నష్టం వుండదు. ఇహ. మాట్లాడటం రాని వాళ్ళంటారా? అలాగే పడుతూ లేస్తూ నేర్చుకుంటారు. నలుగురికీ ఉపయోగపడే విషయం అయితే అదే గుర్తుంటుంది. లేదూ గాలికి పోతుంది. పోయింది పొల్లు. మిగిలిందే మనది… మోహన్ రావు గారి పట్ల గౌరవం గానే.
రమ.
యుగంధర్ అభిప్రాయం:
February 25, 2009 5:15 pm
గొర్తిగారిలా అన్నారు ..
“తెలుగు నాటకం పేరున ఒక బ్లాగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. అందులో నాటక ప్రతులూ, వీడియోలూ అన్నీ ఉండేలా చేయాలన్న ఆలోచన ఉంది. అది రూపుదిద్దుకుంటే ఈ పుస్తకం అక్కడ పెడదాం. ”
అయ్యా మీ ఉద్దేశం గనక జయప్రభగారు రాసిన నాలుగోగోడ పుస్తకం అయితే ఆవిణ్ణి సంప్రదించకుండా ఇలాంటి ప్రణాళికలు వెయ్యకండి. తన కాపీరైట్లని సంరక్షించుకోవడంలో ఆవిడకి చాలా పట్టింపు ఉంది.