ఉత్తరహరివంశం కథలలో, రెండిటిలో తప్పించి అన్నిటిలోనూ శివుని పాత్ర కనిపిస్తుంది. శివుడు కనిపించని రెండు కథలూ నరకాసుర వధ, పౌండ్రక వధ. అయితే ఇంతకుముందే వివరించినట్టుగా, నరకాసుర వధలో శ్రీకృష్ణుని వర్ణనలోనూ, పౌండ్రకుని కథలో నారదుని వర్ణనలోనూ శివుడు మనకి సూక్ష్మంగా దర్శనమిస్తాడు. ఉత్తరహరివంశంలోని కావ్య ధ్వని అద్వైతమే అన్నదాన్ని బలపరిచే మరొక దృష్టాంతం హంస డిభకుల కథలో కనిపిస్తుంది. హంస డిభకులు దూర్వాసుని అవమానపరిచడానికి కారణం, అతను గృహస్థాశ్రమాన్ని కాదని సన్యాసాన్ని ప్రచారం చేస్తున్నాడని. ఎఱ్ఱన హరివంశంలో లేని యీ కథని ప్రత్యేకించి సోమన తెలిగించాడు. సన్యాస స్వీకారాన్ని ప్రోత్సహించేది అద్వైత మతమే! అంటే హంస డిభకులు అద్వైత మతాన్ని విరోధించినందుకే కృష్ణుడు వాళ్ళని సంహరించాడని సోమన ఉద్దేశ్యమన్న మాట!
హంస డిభకుల కథలోనూ, బాణాసుర వృత్తాంతంలోనూ శివుని కన్నా శ్రీకృష్ణుడే అధికునిలా కనిపిస్తాడు. కాని తరచి చూస్తే వారిలో బయటకి కనిపించే తారతమ్యాలతో బాటు, మూల తత్వం ఒకటే అన్న విషయం కూడా ధ్వనిస్తుంది. ఈ అంశాన్ని ముందుగా, స్పష్టంగా స్థాపించే కథ శ్రీకృష్ణుడు శివుని గురించి తపస్సు చేసిన కథ. హరిహరుల అభేదాన్ని యీ పద్యం ఎంత అద్భుతంగా రూపుకట్టిస్తోందో చూడండి. ఇది శివకేశవులు ఒకరినొకరు కలుసుకున్నప్పటి దృశ్యం:
ఇత్తెఱగున నయ్యిరువురు
చిత్తముగతి నొడలు గలసి సిద్ధాంత పరా
యత్తులగు మునుల యెఱుకకు
విత్తై చెలువారె జమిలి వేల్పని తెలుపన్
‘జమిలి వేలుపు’ ఎంత చక్కటి తెలుగు పదం! శివకేశవుల పెనవేత, వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే అన్న భావాన్ని ‘జమిలి వేలుపు’ (వేలుపులు కాదు, ఒకటే వేలుపు) అనే పదం అద్భుతంగా ధ్వనింపజేస్తోంది. చివరిదైన బాణాసుర వృత్తాంతముతో యీ జమిలి వేలుపు తత్వం పరమావధి సాధించింది. ఎఱ్ఱన హరివంశం విష్ణు పారమ్యాన్ని చాటేదే కాని అద్వైతాన్ని స్థాపించేది కాదు. అయితే, భక్తి ప్రథానంగానో లేక పూర్తి కావ్య శైలిలోనో ఎందుకు రచించలేదు అన్న ప్రశ్న ఇంకా మిగిలుంది. ఇంతటి వైవిధ్యమూ, వక్రత, సూక్ష్మత ఎందుకు తన కావ్యంలో ప్రవేశపెట్టాడు? రస నిర్వహణలో సాధారణ మార్గాన్ని అనుసరించకుండా కలగాపులగంగా ఎందుకు సృష్టించాడు?
ఈ ప్రశ్నలన్నిటికీ నాకు తోచిన జవాబు ఒకటే. సోమన తన కావ్యంలో చెప్పదలచుకున్న పరమార్థానికి అనుగుణంగానే ఇలాటి రచన చేశాడని. అద్వైత మతం శుద్ధ వేదాంతం. జ్ఞాన ప్రథానమైనది. దీనిని అర్థం చేసుకోవాలంటే, అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, భక్తి మార్గం సరిపోదు. రసానుభూతికి స్థానం లేదు. ఏ రసమూ, ఏ అనుభూతీ లేని ఒక స్థిర చిత్తం అవసరం. ఈ కావ్యం పాఠకుని మనసుని అలాటి స్థితివైపు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానికి సహాయపడేవే ఇందులోని వైవిధ్యం, వక్రత, సూక్ష్మత లక్షణాలు. ఎక్కడికక్కడ ద్వంద్వాలని చూపిస్తూ, దానికి శ్రీకృష్ణుడు ఎలా అతీతుడో వర్ణిస్తూ, అద్వైత మతాన్ని స్థాపించాడు సోమన. అందుకే యీ కావ్యంలో ఏ రసమూ నిజానికి రస స్థాయిని చేరుకోదు. చేరుకునే లోపలే పాఠకుని మనస్సుని వేరే వైపుకి మళ్ళిస్తాడు సోమన. ఎలా అయితే ఆధునిక జీవిత సంక్లిష్టతని ప్రతిబింబించడానికి కొందరు కవులు కవిత్వంలో అనుభూతికన్నా సంక్లిష్టతకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారో, అదే రకంగా క్లిష్టమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడం కోసం రసం కన్నా వక్రతకీ వైచిత్రికీ, తద్వారా సంక్లిష్టతకీ స్థానమిచ్చాడు సోమన. ఎలా అయితే కొందరు ఆధునిక కవులు దీనికోసం వ్యాకరణాన్ని తోసిరాజన్నారో, అలాగే నాచన సోమన అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న రస సిద్ధాంతం వంటి అలంకార శాస్త్రాలని తోసిరాజన్నాడు! కాకపోతే యీ సంక్లిష్టతకి శబ్ద సౌందర్యమనే చక్కెర పూత పూసి మనకీ కావ్యాన్ని అందించాడు.
అయితే అద్వైతమతాధారంగా, పూర్తి కావ్య శైలిలో కూడా కావ్యాన్ని నిర్మించవచ్చు. కొంతవరకూ తిక్కన చేసినది ఇదే. మరి సోమన ఎందుకలా చెయ్యలేదు అన్న అనుమానం ఇంకా పూర్తిగా పోదు. తనలా చెయ్యలేకనా? అలా అనుకోడానికి వీలు లేకుండా, హంస డిభకుల కథని అద్భుతమైన నాటకీయ శైలిలో నిర్మించాడు. కాబట్టి దీనికి వేరే కారణమేదైనా ఉండాలి. నాకు తట్టిన కారణం యిది. అతనీ కావ్యాన్ని ఉద్దేశించిన పాఠకవర్గం వేరు, తిక్కన పాఠక వర్గం వేరు. తిక్కన, కాస్తంత సాహిత్య పరిచయం ఉన్న సాధారణ పాఠకుల గురించి భారత రచన చేస్తే, నాచన సోమన కవులనీ, పండితులనీ, తత్త్వజ్ఞులనీ ఉద్దేశించి యీ ఉత్తరహరివంశం రచించాడనిపిస్తుంది. అలాటి పాఠకులే ఇలాంటి కావ్యాన్ని అర్థం చేసుకోగలరు. మరి కవి తాను ఉద్దేశించిన పాఠకులని యీ కావ్యం ఎంతవరకూ ప్రభావితం చేసిందో మనకి తెలియదు. అయితే నాచన రచనా శైలి చాలామందిని చాలా రకాలుగా ప్రభావితం చేసిందన్నది స్పష్టం. శ్రీనాథుడు, పోతన, తెనాలి రామకృష్ణుడు దీనికి సాక్ష్యం.
ఇక్కడ నేను వివరించిన విషయాలన్నీ, కేవలం ఉత్తరహరివంశం ఆధారంగా నేను చేసిన ఊహలే. వీటికి చారిత్రక ఆధారాలని వెతకడం అవసరం. ఉత్తరహరివంశానికి అవతారిక ఉండి అది మనకి దొరికితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవచ్చు. తెలుగు పరిశోధకులెవరైనా యీ విషయమ్మీద దృష్టిపెడితే బాగుంటుంది.
ఉపయుక్త గ్రంథములు:
- ఉత్తర హరివంశము – నాచన సోమనాథుడు
- ఒకడు నాచన సోమన – విశ్వనాథ సత్యనారాయణ
- నాచన సోమనాథుడు కావ్యానుశీలనము – నడకుదిటి వీరరాజు పంతులు
- ఆంధ్రవాఙ్మయమున నాచన సోమనాథుని కీయదగిన స్థానము – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
- నాచన సోముని నవీన గుణములు – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
- ఎఱ్ఱన నాచన సోమనల కవితా తారతమ్య పరిశీలన – ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర రావు
- హరివంశము – ఎఱ్ఱన