తాను సూక్ష్మంగా చెప్పదలచుకున్న విషయాన్ని సోమన కథాకథనమూ, రసపోషణ ద్వారా కూడా సాధిస్తాడు. దానికి ఒక ఉదాహరణ నరకాసుర యుద్ధం. దీన్ని మొదట చదువుతున్నప్పుడు నాకొక సందేహం వచ్చింది. యుద్ధానికి శ్రీకృష్ణుడు సత్యభామని ఎందుకు వెంటబెట్టుకు వెళ్ళినట్టు? కనీసం దాని గురించి వాళ్ళ మధ్యనెలాంటి సంభాషణా జరగకపోవడమేమిటి? కథ మొత్తం చదివాక ఆ సందేహం తీరిపోయింది. ఇంతకుముందే వివరించినట్టు, యీ ఘట్టమంతా చదివితే అది సత్యభామ శ్రీకృష్ణుల శృంగార కేళిలానే అనిపిస్తుంది. ఇక అప్పుడు సత్యభామ కృష్ణునితో ఎందుకు వెళ్ళినట్టు, దాని గురించి వాళ్ళ మధ్య ఎలాటి చర్చ జరగలేదేమిటి అనే ప్రశ్నలకి తావే ఉండదు కదా! కథనము, రసపోషనల ద్వారా శ్రీకృష్ణునికి నరకాసుర వధ ఒక శృంగార కేళితో సమానమని సోమన ధ్వనిస్తాడు.
ఇలాగే మరొక కథ కాశీరాజు పంపించిన కృత్యని చంపడం. ఇంతకు ముందు చెప్పినట్టుగా దీని కథనం చాలా విచిత్రమైనది – చాలా భాగం పాచికలాటే! శ్రీకృష్ణుడు సత్యభామతో పాచికలాడుతూ ఆటలో వెనకబడతాడు. ఇంతలో కృత్య ద్వారక పైకి మంటలు చిమ్ముతూ వస్తుంది. ముసలివారు కొందరు వచ్చి శ్రీకృష్ణునికి మొరపెట్టుకుంటారు. దానికి కృష్ణుడిచ్చిన సమాధానం అటు పాచికలాట పరంగా సత్యభామతో అన్నట్టూ అన్వయించుకోవచ్చు, ఇటు కృత్య పరంగానూ అన్వయించుకోవచ్చు! ఈ కథనం ద్వారా కృత్యా సంహారం శ్రీకృష్ణునికి పాచికలాటతో సమానం అన్న ధ్వనిని సోమన సృష్టిస్తాడు.
ఉత్తరహరివంశంలో నాకు కనిపించిన ముఖ్య కవిత్వ లక్షణాలని ఇప్పటిదాకా ఒకటి రెండు ఉదాహరణలతో వివరించాను కదా. అయితే, యీ కావ్యంలో వీటి ప్రాముఖ్యం ఏమిటి, అసలు సోమన యీ కావ్యంలో చెప్పదలచుకున్న పరమార్థం ఏమిటన్నదానిపై నా ఆలోచనలు ఇప్పుడు వివరిస్తాను.
కావ్య ధ్వని
ఆధునిక కవిత్వం లాగానే ప్రాచీన కావ్యాలు కూడా చాలా రకాలు. కొన్ని చదవగానే గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఆ కావ్యాలకి అనుభూతే ప్రథానం. దాని వెనక మరేదీ దాగి ఉండదు. పోతన భాగవతం, శ్రీనాథుని కావ్యాలూ దీనికి ఉదాహరణలు. మరి కొన్ని కావ్యాలు చదివినప్పుడు మనకొక అనుభూతి కలుగుతుంది. కానీ అక్కడితో ఆగిపోక, వాటిని మరికొంత లోతుగా చూస్తే అందులో కవి చెప్పాలనుకున్న మరొక అంశమేదో స్ఫురిస్తుంది. అందరికీ ఒకే అర్థం స్ఫురించాలని లేదనుకోండి! మనుచరిత్ర దీనికొక ఉదాహరణ. ఇంకొన్ని కావ్యాలు అర్థమవ్వని అత్యాధునిక కవిత్వం వంటివి. సూటిగా పాఠకుల మనస్సుని తాకే అనుభూతి వీటికి ప్రథానం కాదు. సంక్లిష్టత ప్రథానం. ఇందులో కవి చెప్పదలచుకున్న అంశం ఏమిటన్నది మరింత అస్పష్టంగా ఉంటుంది. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్లు కొన్ని కొన్ని వాక్యాలు ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమని అనిపిస్తాయి. దాని బట్టి ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకొక్కరు ఒకో రకంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉత్తరహరివంశం ఇలాంటి కావ్యం!
ఒకటి రెండు వాక్యాలని పట్టుకొని ఒక చిన్న కవితని అర్థం చేసుకోవచ్చునేమో కాని ఒక పెద్ద కావ్యమంతటినీ అర్థం చేసుకోవడం సాథ్యమయ్యే పని కాదు. ఆ కావ్య రచన – కథ, కథనం, పాత్ర చిత్రణ, వర్ణనలు – కవి చెప్పదలుచుకున్న అంశాన్ని ధ్వనింపజేయాలి. దానినే కావ్యధ్వని అంటారు. ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి విశ్వనాథ సత్యనారాయణ ‘ఒకడు నాచన సోమన్న’ అన్న పుస్తకాన్ని రాశారు. సోమన స్థాపించాలనుకున్న విషయం విష్ణువు యొక్క పరమస్థితి అని విశ్వనాథ ఆలోచన. పరమస్థితి అంటే అతని పరమాత్మ తత్వమన్నమాట. ఉత్తరహరివంశం లోని కథల సంవిధానము, వాటి కథనము విష్ణు పారమ్యాన్ని ఎలా ధ్వనింపజేస్తున్నాయో ఆ పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా నరకాసురుని కథ గురించి, జ్యోతిష పరంగా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నరకుడు నిజానికి భూమినుంచి విడిపోయిన ఒక గోళమని, అది భూమికి దగ్గరగా వచ్చి దాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, కాల స్వరూపుడైన విష్ణువు దాన్ని ఛిన్నాభిన్నం చేయడమే నరకాసుర వధ అని కొన్ని ఆధారాలతో వివరించారు.
కాని, విశ్వనాథ ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి ఇచ్చిన వివరణ నాకు పూర్తి సంతృప్తినివ్వలేదు. ఇంకా ప్రశ్నలు మిగిలిపోయాయి. అప్పటికే ఎఱ్ఱన హరివంశం ఉంది కదా. అది విష్ణువుని పరమాత్మునిగా స్థాపించడం లేదా? మళ్ళీ పనిగట్టుకొని సోమన ఎందుకు చెయ్యాలనుకున్నాడు? పోని అనుకున్నా, పోతన భాగవతంలా భక్తి ప్రథానంగా ఎందుకు రచించలేదు? లేదా కావ్యంగా రచించాలనుకుంటే తను గురువుగా భావించే తిక్కనని అనుసరించి కావ్యమంతా నాటకీయ శైలిలో ఎందుకు రచించలేదు? తిక్కనలో లేని సంక్లిష్టత, వక్రత ఎందుకిందులో ప్రవేశపెట్టినట్టు? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. అదిగో సరిగ్గా అప్పుడే యీ వ్యాసం మొదట పేర్కొన్న వాక్యాలు మనసులో నాటుకున్నాయి:
“తమతమ లోనిచూడ్కి దము దార కనుంగొను మాడ్కి నింత గా
లము నిను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్”
ఇవి శివుడు శ్రీకృష్ణునితో అనే మాటలు. భగవంతుడు భక్తునితో చెప్పే మాటలు. తపస్సంటే ఏమిటో చెప్పే మాటలు. తమ లోపలికి తొంగి చూసుకొని, తమని తాము తెలుసుకోవడమే తపస్సంటే. అలా తపస్సు చేస్తే చివరికి ఏమవుతుంది? భగవంతుడే తాను, తానే భగవంతుడన్న పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. శంకరుల అద్వైత మతం చెప్పేదిదే. అయితే ఇంత లోతుగా ఆలోచించనప్పుడు, శివుడు మాటలు మరోలా అర్థమవుతాయి. శివుడు కృష్ణునితో “నీవును నేన కావునన్” అని అన్నాడు. అంటే శివుడూ కృష్ణుడూ ఒకటే. ఇది శివ కేశవుల అద్వైతం. ఈ మాటల్లో రెండు రకాల అద్వైతాలు మనకి కనిపిస్తున్నాయన్న మాట. పైకి కనిపించేది శివకేశవుల అద్వైతమైతే, మరొక రకంగా చూస్తే కనిపించేది జీవ పరమాత్మల అద్వైతం. నిజానికి యీ రెండూ కూడా ఒకటే. అద్వైత సిద్ధాంతంలోనే శివకేశవులకి అభేదం చెప్పబడింది.
ఉత్తరహరివంశం లోని పరమార్థం ఇదేనని నాకనిపించింది. హరిహరుల అభేదం ద్వారా, అద్వైత మతాన్ని స్థాపించడం నాచన సోమన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కావ్యమంతా శ్రీకృష్ణుని కథలే అయినా, ఇందులో చాలా చోట్ల కనిపించే శివుని ప్రసక్తి నా ఆలోచనని బలపరుస్తోంది. కావ్యం మొదట్లోనే బలరాముని గురించిన వర్ణన ఒకటుంది.
పాతాళాధిపుడైన శేషుడు ప్రలంబఘ్నుండు నారాయణ
ప్రీతిం బుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో నంధకో
ద్భూత స్నేహము గామపాలతయు దప్పుం దప్పుగాకేమి ప్ర
ఖ్యాతిం బొందడె పాండురాంగ మహిమన్ హాలాహలస్వీకృతిన్
బలరామునికి శివుడితో పోలిక చెప్పాడు. అదీ ఎంత వక్రతతో చెప్పాడో చూడండి! నారాయణుడు తాను కృష్ణావతారమెత్తుతూ తనకెంతో ప్రీతిపాత్రుడయిన శంకరుని బలరామునిగా జన్మించమన్నాడని ప్రజలు అనుకుంటారట. కాని అలా అనుకుంటే అంధక స్నేహము (అంధకుడు శివుడు చంపిన ఒక రాక్షసుడు, ఇది శివుని పరంగా. అంధకులన్న తెగ యాదవులకు మిత్రులు, ఇది బలరాముని పరంగా), మన్మథునిపై (ప్రద్యుమ్నుడు) చూపిస్తున్న ప్రేమ ఎలా కుదురుతాయి? అది కుదరకపోతే మాత్రమేం. తెల్లని శరీరం కలిగి ఉండడం, హాలాహలాన్ని (బలరాముని విషయంలో నాగలి, శివుని పరంగా విషము) ధరించడం అన్న విషయాలతో ప్రఖ్యాతిని పొందాడు కదా. ఇదీ అర్థం! ఈ సందర్భంలో బలరామ వర్ణన సంస్కృత హరివంశం లోనూ, ఎఱ్ఱన హరివంశంలో కూడా ఉంది. కాని అక్కడ శంకరునితో పోలిక లేదు. ఇది సోమన కోరుండి ప్రత్యేకంగా చేర్చినది.