సూక్ష్మత
చెప్పే విషయాన్ని చాలా క్లుప్తంగానో, గుప్తంగానో చెప్పడం సూక్ష్మత. నాచన సోమన కవిత్వ లక్షణాలలో సూక్ష్మత ఒకటంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. సోమన కవిత్వంలో శబ్దాడంబరం తప్ప మరేమీ లేదన్న విమర్శకులున్నారు. అతను ఏ విషయాన్నైనా సమగ్రంగా వర్ణించకుండా ఉండలేడు అన్న వారున్నారు. కాని, వాటి వెనక సూక్ష్మంగా, సోమన తాను చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలా ఆవిష్కరించాడో గమనిస్తే అతని కవిత్వంలోని గొప్పదనం తెలుస్తుంది. వర్ణనలలో అయితేనేమి, పాత్ర చిత్రణలోనైతేనేమి సోమన చూపిన సూక్ష్మత అనన్యమైనది. ఉదాహరణకి యీ వర్ణన చూడండి:
నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి
రణకేళి వలకేలి రమణ జూపె
గంసదానవ శిరః కమల కృత్తన మేలు
తన మేలుచేయి పెద్దలకు నొసగె
జాణూర ముష్టిక క్షతజ కీలాలంబు
నాలంబులో నెల్ల నలవు వఱపె
ముర హయగ్రీవాంత్రమూల ఫేనావలి
నావలి దలగ జీకాకు పఱచె
వీరరససార కాసార విహరణంబు
విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప
దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి
పాఱ వెంపళ్ళు తమకెంత బంటి యనుట
ఇందులో పైకి ఎక్కువగా కనిపించేది శబ్దాలంకార ఆడంబరం. విస్తారమైన వర్ణన. కాని వాటిని దాటుకొని అందులోని భావాన్ని తరచి చూస్తే ఏం కనిపిస్తుంది? నరకాసురుని ప్రాణాలనే తామర తూళ్ళని పెరికి పారెయ్యడమూ, కంసుని శిరస్సనే పద్మాన్ని తుంచి పారెయ్యడమూ, చాణూర ముష్టికుల రక్త జలాన్ని నలుదిక్కులా చిమ్మేయడమూ, ముర హయగ్రీవుల ప్రేగులనే నురగల సమూహాన్ని చిందరవందర చెయ్యడమూను. ఇది చదివాక, సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం మనకి కనిపించక మానదు! వర్ణన ద్వారా పాఠకుల మనసులలో ఒక చిత్రాన్ని రూపుకట్టించడం కవి ప్రతిభ. ఇక్కడ సోమన ప్రత్యేకతంతా విష్ణువుని మదగజంతో నేరుగా పోల్చకపోవడంలో ఉంది. అది పాఠకుల ఊహకి వదిలివెయ్యడమే ఇందులోని సూక్ష్మత. పైకి కనిపించే శబ్దాలంకారాలకి లొంగి అక్కడే ఆగిపోక, ‘లోనారసి’ చూస్తే ఇందులో దాగిన ఆ చక్కని చిత్రం దర్శనమిస్తుంది. అలాగే మరో వర్ణన చూడండి. నరకుని వలన మునులుపడ్డ బాధలని విని కృష్ణుడు కోపించినప్పుడు అతని క్రోధాన్ని వర్ణించే పద్యమిది :
అరుణాంభోరుహ పత్రనేత్రుడు సముద్యద్భ్రూకుటీ భంగ భా
సుర ఫాలస్థలుడుం జలాచల మనశ్శూలాయమానవ్యధా
పరివేషానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్
నరకాలంభ విజృంభణంబు నెఱపెన్ నారాయణుండాకృతిన్
ఈ పద్యములో ‘ప్రత్యక్ష రౌద్రంబనన్’ అంటే ఏమిటి? ‘రౌద్ర రసమే సాక్షాత్కరించిందా అన్నట్టుగా’ అన్నది సామాన్యంగా చెప్పే అర్థం. రుద్రుడే, అంటే శివుడే ప్రత్యక్షమయ్యాడా అన్నది సూక్ష్మంగా కవి స్ఫురింప జేస్తున్న అర్థం. భాసురమైన ఫాలస్థలి ప్రస్తావన దీనికి మరింత దోహదం చేస్తోంది. ఇది శ్లేష కాదు. ఒక చిత్రాన్ని లీలగా ఛాయగా ప్రదర్శించడం, ఇక్కడ మరో విశేషం. ఇలాగే వర్ణన ద్వారా శివుని రూపాన్ని లీలగా స్ఫురింపజెసిన సందర్భం, ఉత్తరహరివంశంలో మరొకటి ఉంది. పౌండ్రకుని వద్దకు నారదుడు వచ్చినప్పుడు, ఆ నారదుడెలా ఉన్నాడో వర్ణించే పద్యమిది :
ప్రాలేయాంశు మరీచి నిర్మల తనూ భాగంబు కృష్ణాజిన
వ్యాలోలామల యజ్ఞసూత్రములు సంసాసక్త వీణాలతా
లాలిత్యంబు, లలాటికా రుచులు గ్రాలన్నారదుండిచ్చలం
గైలాసంబుననుండి వచ్చె గలహోత్కస్వాంతుడచ్చోటికిన్
ఈ పద్యంలో ప్రస్తావించిన చంద్రకాంతిలా(తో) తెల్లగా వెలుగుతున్న శరీరము, లలాటము చిందే కాంతులు, కైలాసము నుండి విచ్చేయడము – ఇవన్నీ కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చాడా అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇంతకుముందు పద్యంలో లాగానే ఇందులో కూడా శ్లేష లేదు. ఇక్కడ ఉన్నది ధ్వని! ఇలా వర్ణనలలో సూక్ష్మంగా అంతరార్థాన్ని ధ్వనింప జేసే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. నేను తెలుసుకోలేక పోయినవి ఇంకా చాలానే ఉండి ఉంటాయి! దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు. మల్లంపల్లి శరభయ్యగారు చేసేరని విన్నాను కాని, అది నాకు దొరకలేదు.
పాత్ర నిర్వహణలో కూడా సోమన పాత్ర స్వభావాలని వాచ్యం చెయ్యకుండా సూక్ష్మంగా ధ్వనింపజెయ్యడం గమనించవచ్చు. పాత్ర నిర్వహణలో సోమన చూపించిన సూక్ష్మతకి మంచి ఉదాహరణ పౌండ్రకుని కథ. ఇందులో పౌండ్రకుని పాత్ర ప్రవేశంలో ఉన్న యీ పద్యం చూడండి:
ఇక్కడ బౌండ్రభూపతి వివేకవిహీనత జేవ యెక్కగా
“నెక్కడి వాసుదేవు డిల నేనొకరుండన వాసుదేవుడన్
దక్కినవాడు నందక సుదర్శన శార్ఙ గదాది హేతులన్
స్రుక్కక పట్టినన్, దెసల జుట్టిన నిర్మల కీర్తి పట్టునే!”
పౌండ్రకుని మాటల ద్వారా అతని మూర్ఖత్వం ఎంత వ్యంగ్యంగా బయటపడుతోందో చూడండి! నందకము, సుదర్శనము, శార్ఙము, గద – యీ ఆయుధాలు కృష్ణునికి ఉన్నాయని చెప్పి తనకీ చేయించుకున్నవాడు పౌండ్రకుడు. వాటివల్ల తనే అసలైన వాసుదేవుడనని భావిస్తున్నాడు. కాని వాసుదేవుడని లోకమంతా నిర్మల కీర్తి ఉన్నది శ్రీకృష్ణునికే. అందువల్ల ఇక్కడ పౌండ్రకుడన్న ప్రతి మాట నిజానికి తనకే వర్తిస్తుంది, కృష్ణునికి కాదు. ఆ సంగతి ఆ సభలో ఉన్నవారికందరికీ తెలుసు. పాఠకులుగా మనకి కూడా తెలుసు. తెలియనిదల్లా పౌండ్రకునికి. దీనివల్ల అతనెంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో అక్కడున్నవాళ్ళకీ, మనకీ కూడా బాగా అర్థమవుతుంది. పౌండ్రకుని స్వభావం మొత్తం ఆ రెండు వాక్యాల్లో ధ్వనింపజేశాడు సోమన! దీనిని dramatic-irony అనవచ్చునేమో!