జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం

ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరచిన మరొక విషయాన్ని చెప్పాలి. విశ్వనాథ తన ‘సాహిత్య సురభి’లో యీ పద్యాన్ని గురించి రాస్తూ, ఇది శ్రీకృష్ణుని గురించిన పద్యమని వివరించారు. కానీ ఆ వివరణ సరిగా లేదు. చివరి పాదం మాత్రం తనకి అర్థం కాలేదని కూడా చెప్పారు. కావ్యంలో ఇది కృష్ణుడు శివుని గురించి చెప్పినదని స్పష్టంగా ఉంటే మరి ఎందుకలా అర్థం చేసుకున్నారో అంతుబట్టడం లేదు. విశ్వనాథ అంతటివారే, ఈ పద్యాన్ని గురించి తికమక పడ్డారా అని ఆశ్చర్యం! అలాగే మరో పద్యం చూడండి:

దనుజేంద్రుడా తలోదరి
గనుగొని చొళ్ళెంబు నిమురు గ్రమ్మున బైకొం
గనువు పఱుచు గేదగి రే
కు నఖంబుల జీఱు గులుకు గోర్కుల దేలన్

సభకి రప్పించిన ఊర్వశిని చూడగానే నరకుడు చేసిన చేష్టలివి. కొప్పు నిమరడం, పైకొంగుని సర్దడం, గేదగి రేకులని గోళ్ళతో చీరడం. నరకుడు ఎవరి కొప్పు నిమిరాడు? ఎవరి పైకొంగుని సర్దాడు? ఊర్వశివని విశ్వనాథతో సహా చాలామంది అర్థం చెప్పారు. మరి చివరనున్న గేదగి రేకులని చీరడమేమిటి? లేత చెక్కిళ్ళని గేదగి (మొగలి) రేకులతో పోల్చడం ఆనవాయితీ. నరకుడు ఊర్వశి బుగ్గ గిల్లాడన్నమాట, అని వివరించారు. బుగ్గలని చెప్పకుండా, వాటిని పోల్చే గేదగి రేకులని మాత్రమే చెప్పి ఊరుకోవడము వర్ణనలోని వక్రత. అయితే యీ పద్యాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు.

నరకుడు తన కొప్పుని నిమురుకున్నాడు. తన పైకొంగుని సర్దుకున్నాడు. తన చేతిలోని గేదగి పూరేకులని గోళ్ళతో చీరాడు. ఇవి కూడా అందమైన స్త్రీని చూస్తే రసికుడు చేసే శృంగార చేష్టలే. నిజానికి యీ అర్థమే నాకు ఎక్కువ సమంజసమనిపిస్తోంది. ఎక్కడో సింహాసనం పైనున్న నరకుడు కిందగి దిగి ఊర్వశి వద్దకి వచ్చి, ఇంకా మాటలైనా మొదలుపెట్టకుండానే ఊర్వశితో అంత చనువు తీసుకున్నాడా అని నా అనుమానం. మొత్తానికి పద్యాన్ని రెండు విధాలుగానూ అర్థం చేసుకోవచ్చు. ఇది పద్య నిర్మాణంలో ఉన్న విలక్షణత, వక్రత. ఇలా పద్యాలని ప్రహేళికల్లా నిర్మించడం చాలా చోట్ల కనిపిస్తుంది.

ఇదే వక్రత సంభాషణలలోనైతే, కాకువుని ధ్వనించి నాటకీయతకి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, తన కొడుకుని యముని బారినుంచి కాపాడలేకపోయిన అర్జునుడితో బ్రాహ్మణుడు పలికే మాటలు:

నీ వేమి సేయు దీ గాం
డీవము నీకిచ్చి యిమ్ము డెప్పరమైనన్
లావు గలదంచు బలికిన
పావకుజే గాదె కోలుపడితి కుమారున్

ఉరుమురిమి మంగలమ్మీద పడ్డట్టు, తన దుస్థితికి అగ్నిని దోషిగా నిలబెడుతున్నాడా బ్రాహ్మణుడు! ఇది సంభాషణలోని వక్రత. అర్జునుడిని నిందించే సందర్భంలో అతనికి గాండీవాన్ని ఇచ్చిన అగ్ని దేవుడిని కూడా తన నిందలోకి లాగడం, ఆ బ్రాహ్మణుడి అమాయకపు ఆవేదనని చక్కగా స్ఫురింపజేస్తోంది. ఇలాగే, హంసడిభకుల కథలో హంసుడు జనార్దనునితో చెప్పే మాటలు, జనార్దనుడు దూతగా యాదవ సభలో మాట్లాడిన మాటలు వక్రతతో నిండి వారి వారి రాజకీయ చతురతని బాగా పట్టిస్తాయి.

వర్ణన సంభాషణలలోనే కాదు, సోమన రస నిర్వహణలో కూడా వక్ర మార్గాన్ని అనుసరించడం ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది విమర్శకులకి మింగుడుపడని విషయం కూడానూ! సాధారణంగా కావ్యంలో ఒక రసం ప్రథానంగా ఉండి ఇతర రసాలు దానికి సహాయంగా ఉంటాయి. ఉత్తరహరివంశంలో ఉన్నది ఒక కథ కాదు. అది కొన్ని కథల సమాహారం. అంచేత మొత్తం కావ్యమంతా ఒకటే ప్రథాన రసం ఉండడం కష్టమైన విషయం. ఇలాటి సందర్భాలలో ఒకో కథకీ ఒకో రసం ప్రథానంగా ఉండడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఇందులో అలా కూడా లేదు! ఉత్తరహరివంశంలో ప్రతి కథలోనూ అనేక రసాలు కనిపిస్తాయి. ఏ ఒక్క రసమూ ప్రథాన రసంగా కనిపించదు. ఒకే సన్నివేశంలో రెండు రసాలని సమ ప్రాథాన్యంతో నిర్వహించడం కనిపిస్తుంది. ఒకోసారి, ఒకటి ప్రథాన రసమవుతుందని సాధారణంగా అనుకునే చోట మరొక రసానికి అధిక ప్రాథాన్యం ఉంటుంది! ఇది రస నిర్వహణలో సోమన చూపించిన వక్రత. ప్రతి కథా దీనికి ఉదాహరణే. నరకాసుర వధ ఘట్టంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో శృంగార వీర రసాలని రెంటినీ నిర్వహించాడు సోమన. సాధారణంగా వీర రసం ఇక్కడ ప్రథానమవ్వాలి, కానీ శృంగార రసమే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి, సత్యభామ కొంతసేపు యుద్ధం చేశాక కృష్ణుడు సంతోషించి ఏమి చేశాడో చూడండి:

చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి
తరుణి నుదుట బైకొన్న కుంతలములొత్తి
రమణి కుచమధ్యమునకు హారముల ద్రోచి
పొలతిపయ్యెద కొంగు పైబొందుపరచి

ఇది చదువుతూ ఉంటే అది నరకాసునితో వాళ్ళు చేసే యుద్ధంలా కాక, ఒక శృంగార కేళిలానే అనిపిస్తుంది.

ఇలాగే, విప్ర కుమారులని రక్షించే కథలో కరుణ అద్భుత రసాలు రెండూ కనిపిస్తాయి. పౌండ్రకుని కథలో హాస్య వీర రసాలు కనిపిస్తాయి. బాణాసుర వృత్తాంతం శృంగార, వీర, అద్భుత, శాంత రసాలు పెనవేసుకు పోయిన కథ. ఉషా అనిరుద్ధుల ప్రేమ వ్యవహారమంతా ప్రబంధ ధోరణిలో శృంగార రస ప్రథానంగా సాగుతుంది. సాధారణ ప్రబంధమైతే అదే రసం చివరిదాకా నిర్వహించబడాలి. బాణుడు అనిరుద్ధుని బంధించిన తర్వాత, ఉష విరహాన్ని చిత్రించి తిరిగి వాళ్ళ కలయికతో ఆ కథ పూర్తికావాలి. కాని ఇందులో అలా జరగదు. బాణుడు అనిరుద్ధుని బంధించిన తర్వాత ఆ కథలో శృంగారానికి మరి స్థానమే ఇయ్యలేదు సోమన! ఆ తర్వాత అనిరుద్ధుని యుద్ధ వర్ణనలో వీర రసం కనిపిస్తుంది. కృష్ణుడు బాణునితో చేసిన యుద్ధమంతా అద్భుత రసంతో సాగుతుంది. చివరికి యుద్ధానంతరం ఎవరికి వారు తమ యథాస్థితిని పొంది, శాంత రస ప్రథానంగా ముగుస్తుంది. ఉత్తరహరివంశం మధ్యలో, కృష్ణుడు సత్యభామా రుక్మిణులతో ఆడే పాచికలాట, కృత్యా సంహారమూ ఒక విచిత్రమైన పద్ధతిలో సాగే కథ. ఇందులో నిజానికి ఏ రసమూ కనిపించదు!

ఇదీ సోమన రస నిర్వహణలో చూపించిన వక్రత. సోమన ఎందుకిలాంటి వక్ర మార్గాన్ని అనుసరించాడు? ఈ ప్రశ్నకి ముందుముందు సమాధానం వెతుకుదాం. ప్రస్తుతానికి సోమన మరో ప్రత్యేక లక్షణాన్ని పరిశీలిద్దాం.