ఈమాట » సువర్ణభూమిలో …

Expand to right
Expand to left

సువర్ణభూమిలో …

ముఖాముఖి
సుఖాసీనులై
బుద్ధులు

వాడని కలువలు
అలముకునే ధూపం

ఎదురెండలో
ఎర్రచారల పిల్లి
చెలగాటమాడుతుంది
తలను పాదాలమీదుంచి

ఎన్నో మెట్లెక్కి
గర్భ గృహంలో
గబ్బిలాలను
అదిలిస్తున్నాడు
విహారభిక్షువు


నీటితొట్టెలోని
కలువమీద
తేనెటీగ

బంగారు బుద్ధుని ముందు
ముంగాళ్ళమీద కూచుని
కలువలు సమర్పించాము.


పరాయి భాషలో
పరిశీలకులకు
వివరిస్తున్నాడు
ఎవరి దాడిలో
ఏది నశించిందో

ఊడల్లో చిక్కిన
బుద్ధుని శిరసు
ఎడతెగని
ధ్యానంలో
మొండెం

చూడవచ్చిన కుక్కపిల్లను
ఒడిలోకి తీసుకుంది ఆవిడ


సముద్రం అడుగున

తల ఎత్తక,దించక
నిలిచి గమనించు-
నీ చుట్టూ పెరిగిన
నాచు మొక్కలను
గాజు అద్దాలను
మోజుగా తాకే
వరుసచేపలను

బరువుగా ఊపిరి
నీరు తేల్చివేస్తుంది.

పైకి కిందికి చూశావా
ప్రాణవాయువు అందక
గజ ఈతగాళ్ళకు తక్షణం
నిజంగా,పని పెడతావు.


థాయ్ భాషను
ఆరుగంటల్లో నేర్చి-
పేర్లు చదవసాగాను.

ప్రియురాలు మనసును
ఛాయామాత్రంగానైనా
ఆనవాలు పట్టలేను.

(ధర్మపత్ని అరుంధతికి)

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...

 

(37 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Subrahmanyam Mula అభిప్రాయం:

    November 1, 2008 11:19 pm

    ఆఖరి ఖండిక బావుంది.

  2. Sowmya అభిప్రాయం:

    November 3, 2008 12:11 am

    I liked the last one the most :)
    Others… నాకు సరిగా అర్థం అయ్యాయా లేదా అని సందేహం :)

  3. ప్రజాపతి అభిప్రాయం:

    November 3, 2008 11:09 am

    ఇందులో ఒక్కముక్క అర్థమైతే చెప్పుచ్చుకు కొట్టండి

  4. వామనమూర్తి అభిప్రాయం:

    November 3, 2008 7:07 pm

    ఈ కవిత యదుకుల భూషణ్ గారికి అంకితమిస్తూ..
    అంకాలమ్మ
    గుడిలో ఒక అడుగు
    ఆటోలో శవం ఊరేగుతోంది
    జెండాపై బల్లి
    ఒకటే గురకపెడుతోంది
    తామరాకు నిద్రలేచి
    ఆవులించింది
    పసి పాప
    ప్రత్యేక రాష్ట్రం కోసం
    గర్జిస్తోంది
    ఎంత సుకుమారం
    ఛాంగు భళ ఎంకి మామా

  5. surya అభిప్రాయం:

    November 5, 2008 2:24 am

    అయ్యి బాబోయ్ వామనమూర్తి గారూ మీ కవితలో చాలా ఇన్ఫర్మేషనుందండీ బాబూ

  6. vineel అభిప్రాయం:

    November 5, 2008 1:39 pm

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. — సం]

    తెలుగులో ఉండి, అన్నీ తెలిసిన పదాలే ఉన్నంత మాత్రాన ప్రతి కవిత మనకి అర్థం కావలనుకోవడం, కాస్తో కూస్తో గణితం నేర్చుకొన్న ప్రతి విద్యార్థికి, ఫెర్మాట్స్ థియరం ప్రూఫు అర్థమవ్వాలనుకోవడం లాంటిది.

    ఈ సంచికలోనే వేలూరి గారి “నేనొక సాధారణ పాఠకుణ్ణి” వ్యాసంలో ఈవాక్యాలు బాగా పనికొస్తాయి ఈ కవిత గురించి రెండు మాటలు చెప్పడానికి. “… ఇలా అనుభవ పరిథి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది…”

    భూషణ్ కవిత్వం ఇలాగే ఉంటుందనిపిస్తుంది నాకు. ఈ కవి కవితల్లో క్లుప్తత తారాస్థాయికి చేరి ఒక గణిత సమీకరణమంత క్లుప్తంగా తయారవుతాయి, కవితలు. గణితంలో ఏమో కానీ, కవిత్వంలో ఇలాంటి క్లుప్తత వల్ల కవితలు డేవిడ్ లించ్ సినిమాల్లాగా open to reader’s interepretation అవుతాయి. ఉదాహరణకు సువర్ణభూమి కవితకు నాకు తోచిన ఒక ఇంటర్ ప్రెటేషన్.

    “ముఖా ముఖి సుఖాసీనులై బుద్ధులు ( చక్కని కవిత్వం వ్రాసే కవి, అస్వాదిస్తున్నపాఠకుడు)
    వాడని కలువలు ( మంచి కవితలు)
    అలముకున్న ధూపం (పాఠకుని మదిలో ఆవరించిన కవిత్వ సౌందర్యం)

    ఎదురెండలో ఎర్రచారల పిల్లి,
    చెలగాట మాడుతుంది
    తలపాదాలమీదుంచి.
    (కొన్ని కవితలు కదళీ పాకాలైతే, కొన్ని నారికేళ పాకాలు. తమకు అర్థం కాని కవితకు అర్థమే లేదని కుప్పిగంతులు వేసే పాఠకులే ఈ ఎర్రచారల పిల్లులు)

    ఎన్నో మెట్లెక్కి/గర్భ గృహంలో/గబ్బిలాలను/అదిలిస్తున్నాడు/విహార భిక్షువు ( ఉచ్ఛస్థాయిలో ఉండే కవిత్వమనే ఆలయపు పవిత్రతను, గబ్బిలాలను పారద్రోలి కాపాడే విమర్శకుడు).

    As some wise soul once said, A poem starts in writers mind and ends in readers mind. To conclude, for some one who is used to Van Gogh’s impressionistic paintings, Picasso’s Guernica might be pointless. That does nt reduce the essence of Guernica by an ounce.
    వినీల్.

  7. bollojubaba అభిప్రాయం:

    November 6, 2008 9:06 am

    వినీల్ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  8. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 6, 2008 9:21 am

    I say, not just poem, but any writing starts only in writers mind and ends in reader’s. Probably with the exception of one’s shopping list.

    గణితం నేర్చుకున్న ప్రతి విద్యార్థికి Fermat Theorem’s proof అర్థం కాకపోవచ్చు. కాణి, గణితం కూడా రానివారు సైతం అది Fermat Theorem’s proof గురించి అని మాత్రం తెలుసుకోవచ్చు, సుళువుగా.

    మరి రచన అర్థం కాకపోయినా, అసలు అది దేని గురించి అన్నది కూడా స్పష్టంగా తెలియకపోతే ఆ రచన పాఠకులను చేరుతుందే కాని, తాకదు. రచన అనే అన్నాను, కవిత అని అనలేదు. ముందు రచన అర్థం అయితే, అది కవితో కాదో కూడా తెలుసుకోవచ్చు.

    చివరలో చెప్పింది “దూరమైన థాయ్ భాష నేర్చుకున్నా కూడా, దగ్గరున్న ప్రియురాలు మనసు తెలుసుకోలేకపోయాను” అన్న contrasting తో చేసిన
    వ్యక్తీకరణ బాగుంది.

    అది తప్ప మిగితాది ఏది కూడా దేన్ని గురించి చెపుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో, ఏమీ అర్థం కాని (దు)స్థితి, interpretation ఇచ్చినప్పటికినీ. Interpretation తెలిసినదానికి లోతును, వైవిధ్యాన్ని ఇవ్వగలదేమో కాని, తెలియని దానిని పరిచయం చేయలేదు అనిపిస్తుంది.

    May be better to study about Fermat Theorem’s proof, even if not totally understood _ it only widens one’s understanding.
    ====
    Regards
    Srinivas

  9. ప్రజాపతి అభిప్రాయం:

    November 6, 2008 9:57 am

    చాలా బావుంది. అసలు ఇవన్నీ తెలుగు అక్షరాలే కదా.ఎందుకు అర్థం కావడం లేదు అని బాగా ఆలోచిస్తున్నా. వినీల్ గారి ఇంటర్‌ప్రెటేషన్ చదివాక నాకైతే ఈ కవిత అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి వ్రాసినట్లు అనిపించింది. ఎలాగంటే
    ముఖ ముఖి
    సుఖాసీనులై
    బుద్దులు
    (ఒబామా, మెకైన్ లు ఇద్దరూ చెరొక బుద్దుడిలా సుఖంగా కూర్చునీ, నిలుచొనీ మనకి సందేశాలిస్తున్నారు)

    వాడని కలువలు
    అలుముకునే ధూపం
    (ఆ మాటలు వినే మన మనసులు కలువలు లాంటివి. వాటి చుట్టూ పొగ అలుముకుంటోంది)

    ఎదురెండలో
    ఎర్ర చారల పిల్లి
    (వాళ్ళ మాటలు సరిగా అర్థం చేసుకోలేని, ఎర్రచారల పిల్లి లాంటి, కొంతమంది అయోమయం అనే ఎండలో)
    చెలగాటమాడుతుంది
    తలను పాదాలమీద ఉంచి
    (తమలో తాము ఘర్షణ పడుతూ, చెలగాటంలాగా, పాపం తలని మోకాళ్ళలో దాచుకుంటూన్నారు)

    ఈ విధంగా చూస్తే కవితా చాలా సులభంగానే అర్థమౌతోంది.
    ఏమైనా యదుకుల భూషణ్ గారి కవితలు చాలా ఇనిస్పిరేషన్ గా ఉంటున్నాయి. నెలకొక కవితైనా వారినుంచీ రావాలని కోరుకుంటున్నాను.

  10. Suneel అభిప్రాయం:

    November 6, 2008 10:39 am

    వినీల్ గారి జ్ఞాన బోధ తర్వాత నాకు వామన మూర్తి గారి కవిత partial differential euqation of second kind కింద తోస్తోంది.

    నాకు తోచిన interpretetion

    అంకాలమ్మ గుడి మన సంస్కృతికి ప్రతీక. ఒక అడుగు అనడంలో అది అంతరించిపోతోందే అన్న బాధ ధ్వనిస్తోంది.

    ఆ ఆటో నేటి పత్రికలకీ, శవం నేటి కవిత్వానికీ ప్రతీకలు.

    ఆ జెండా మరేమీ కాదు నేటి కాలపు కవిత్వంలో కనిపించే వాదాలకి ప్రతీక. ఆ బల్లి నాలాంటి సామాన్య పాఠకుడు.(బాధితుడు)

    తామరాకు నిద్రలేచి ఆవులించడమనేది వినీల్ గారి జ్ఞాన బోధకి నిద్రలేచిన నా మనసుకి ప్రతీక. వామన మూర్తి గారు కాల జ్ఞానానికి అబ్బురపడడం తప్ప మరేమీ చేయలేను.

    “పసిపాప ప్రత్యేక రాష్ట్రం కోసం గర్జిస్తోంది ఎంత సుకుమారం” ఆ పసిపాప విమర్శకుడు, ప్రత్యేక రాష్ట్రం భూషణ్ గారి కవిత్వం లాంటి కవిత్వమనీ నాకు అర్ధమైంది. ఎంత సుకుమారం అనడంలో విమర్శలు ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. కవి ప్రతిభ అద్భుతంగా వ్యక్తమైంది.

    ఇక ఛాంగు భళ ఎంకి మావ అని కవితని ముగించడం. ఈ ఒక్కటీ మాత్రం అర్ధం కాలేదు. అందుకే partial differential equation అన్నది.

  11. mOhana అభిప్రాయం:

    November 6, 2008 11:30 am

    నా ఉద్దేశంలో ఇది రచయిత తాయిలాండు దేశం వెళ్లినప్పుడు అక్కడ బుద్ధుని విగ్రహాలను చూచి వ్రాసిందనుకొంటాను. అక్కడ సుఖాసీనులైన బుద్ధుల చిత్రాన్ని ఇక్కడ చూడగలరు. బంగారు బుద్ధ విగ్రహాలు కూడా ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి . సముద్రం అడుగులో బహుశా రచయిత అండర్ వాటర్ డైవింగ్ చేశారేమో? ఆ అనుభూతిని వ్రాసి ఉంటారు. తాయిలాండు సముద్రతీరాలు దీనికి ప్రసిద్ధమైనవి. మన సినిమావాళ్లు కూడా ఇలాటి షూటింగులను ఎన్నో చేశారు గదా! చివరగా భాషలను త్వరగా నేర్వగలము, కాని మనుషులు, వారి మనసులు అర్థం చేసికోవడం కష్టం అని తెలిపారు. రచయితకు చాలా భాషలు వచ్చు, తాయిలాండుకు విహారయాత్రకు వెళ్లినప్పుడు వ్రాసినది అని నా భావన. కవుల మనసులో ఏముందో మనకేం తెలుసు?
    విధేయుడు - మోహన

  12. Kameswara Rao అభిప్రాయం:

    November 6, 2008 12:09 pm

    కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో ప్రతి కవితనీ శల్యపరీక్షకి గురిచేస్తే ఇలాటి అవస్థే ఏర్పడుతుంది కాబోలు!
    నాకు చదవగానే కవిత చాలా తేలికగానే అర్థమైందనిపించించి! కవి థాయిలాండు యాత్ర చేసాడు. ఆ యాత్రలో అతని మనఃఫలకంపై బలంగా ముద్రపడిన కొన్ని దృశ్యాలను, మిగిల్చిన అనుభూతిని యథాతథంగా పదాలలో చిత్రించే ప్రయత్నం ఈ కవిత అని నా కనిపించింది.
    ఆ తర్వాత వెతికితే ఈ లంకె కనిపించింది:
    http://www.pbase.com/ratluk/allofthailand

    ఈ కవితలో ఉన్న కొన్ని పద చిత్రాలకి చాయా చిత్రాలని ఆ లంకెలో చూడవచ్చు.

  13. bollojubaba అభిప్రాయం:

    November 7, 2008 12:01 am

    పైన నేను చేసిన కామెంటుకి కొంత వివరణ

    కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో సాధారణంగా పాఠకుడు ఉండటంలో తప్పుకాదుగా. ఎందుకంటే యదుకుల భూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తరువాత, కొంత ఎక్స్పెక్టేషన్ తో కవిత ను చదవటం, కొంత అర్ధం కాకపోయినా ఎదో ఉండి ఉంటుందిలే, అని సరిపెట్టుకోవటం, తోచిన రీతిలో అన్వయించుకోవటం సహజమే.

    ఏది ఏమైనా ఈ పద్యాలు ఈ క్రింది ఇవ్వబడిన లింకులోని వారి కవితా సంపుటిలోని పద్యాల వలేకాక, కొంత అస్ఫష్టంగానూ, ప్రతీ ఒక వాక్యానికీ ఏదో ఒక భాష్యం చెప్పుకొంటే తప్ప అర్ధంకానట్లు గానూ ఉన్నాయన మాట వాస్తవం.

    http://www.eemaata.com/em/category/library/nnn/

    ఇక పోతే కవి పాఠకుని స్థాయికి తగినట్లుగా వ్రాయాలా, లేక పాఠకుడే కవి స్థాయికి వెళ్ళి చదవాలా అనేదీ ఎప్పటికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే.

    బొల్లోజు బాబా

  14. Kameswara Rao అభిప్రాయం:

    November 7, 2008 6:22 am

    బాబా గారు,
    మీరు యదుకులభూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తర్వాత కవిత అర్థం కాకపోయినా ఏదో ఉండి ఉంటుందిలే అని అనుకున్నానన్నారు. నేను కూడా భూషణ్ గారి కవిత్వం, అతనికి కవిత్వంపై ఉన్న దృక్పథం రుచి చూడడం మూలానే, ఆ కవితలో చెప్పిన విషయం కాకుండా అంతర్గతంగా మరేదీ దాగి ఉండదని నిర్ణయించుకున్నాను!వినీల్ గారు గణితంతో చెప్పిన పోలికా, కవితలోంచి తీయడానికి ప్రయత్నించిన అర్థమూ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా అవగాహన మేరకు భూషణ్ గారు సరిగ్గా అలాటి దానికి వ్యతిరేకి! క్లుప్తత విషయంలో అతనన్నది నిజమే కాని, కవితలకి అస్పష్టతని తెచ్చి పెట్టే సాంకేతికత (symbolism) అంటే, నాకు తెలిసి భూషణ్ గారికి అసలు నచ్చదు.

    చివరిగా మీరడిగిన మిలియన్ డాలర్ల ప్రశ్నకి నా రెండు సెంట్లు: మనవాళ్ళు “సహృదయత” అన్నది పాఠకుల విషయంలోనే చెప్పారు కాబట్టి, కవి హృదయాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పాఠకులదే అని నా ఉద్దేశం. అది ఎక్కువమంది పాఠకులు చెయ్యగలిస్తే ఆ కవికి ప్రాచుర్యం లభిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ఆ కవి ఒంటరిగా మిగిలిపోతాడు!

  15. రోమేశ్ అభిప్రాయం:

    November 7, 2008 6:38 am

    ఈ కవిత కన్నా, ఇందులోని వ్యాఖ్యలు ఎంత కామెడీని పంచాయంటే, చదివి, చదివి నవ్వుకున్నాను. ఇలాంటి కవితలవల్లే కవులన్నా, కవితలన్నా జన సామాన్యంలో చాలా చులకన భావం కలగడం, సినిమాల్లో కామెడీ చెయ్యడం జరుగుతోంది.

    ఎవడిక్కావాలి ఈ కవితలో అర్థం ఉందో, లేదో!!

    కవితలు రాయడం అంటే పొడుపుకథలు రాయడం కాబోలు. మా చిన్నప్పుడు ఆరో తరగతి ఇంగ్లీషు పుస్తకాల్లో హింట్లు ఇచ్చి, వాటిని బట్టి కథలు రాయమనేవారు. కవితలు రాసే ఫార్మ్యులా కూడా అంతే కాబోలు.

    ఈ కవితనీ, కవినీ ఎందుకు అభినందించాలంటే - ఆ కవితకి పేరడీలూ, వ్యంగ్య వ్యాఖ్యానాలు రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. అవి చాలు పాఠకుడికి కడుపు నిండడానికి. వామన మూర్తిగారూ, ప్రజాపతి గారూ, సునీల్ గారూ, అందుకోండి మా అభినందనలు.

  16. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 7, 2008 8:56 am

    Thanks to Mohana gAru and Kameswara Rao gAru for giving us background of Thailand. Knowing nothing about Thailand, it does not make much sense. This also is a very interesting exercise in reading and writing for understanding and getting understood.

    Those who enjoyed and praised the writing all did for their own different
    interpretations, none related to the real background. And rest of us who did not enjoy all gave the single reason of non_understanding as their difficulty. Both kinds did not understand. But former chose to read profound interpretations while latter couldn’t.

    Do we do the same if author’s name is wrongly mentioned or not at all ? As simple words are used, would we say same things if your child or niece
    claimed she wrote it? If we find something salty, even though cooked by best chef, we say so.

    దీనిని చదివి, స్పందించి, వ్రాసిన ప్రతి ఒక్కరూ సహృదయలే, నిస్సందేహంగా. శల్య పరీక్ష కన్నా తెలుసుకోవాలన్న కోరికే తోచిన విధంగా వెలిబుచ్చారనిపిస్తుంది.

    అందరికీ చివర ఖండిక అర్థమయ్యింది, ఆసక్తికరంగా. ఎందుకంటే అది స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి పాఠకునికి వేరే కొత్త ప్రాంతాలు, విషయాలు తెలియనవసరంలేదు. థాయిలాండ్్ గురించి తెలియకపోవడం పాఠకుని పొరపాటు కానే కాదు. పాఠకునికి అది తెలియకపోయినా కూడా, అర్థం అయ్యేటట్టు చెప్పకపోవడమే పొరపాటు. కవి హృదయం పాఠకుడు తెలిసుకోవడం ఎంత అవసరమో, పాఠకునికి కవి సాయపడేలా వ్యక్తీకరించడం అంతే అవసరం. లేకపోతే పాఠకుడు అనుభవించేది రసానందం కాదు, జీవహింస.
    ==========
    విధేయుడు
    -Srinivas

  17. rama అభిప్రాయం:

    November 7, 2008 9:37 am

    ayya editor loo..namaskaralandee !!

    telugulo type chese opika leni nenu mee patrikaki abhiprayalu rase prayatnaanni eppudO viraminchukunnanu. kanee yadukulabhushan raatala meeda vachhina pratispandanalani chadivi chachhela navvi navvi..marinka aagaleka nA spandanani rastunnanu. vamanamoorti gariki..prajapati gariki..suneel gariki na danDaalu.em navvincherandayya meeru..mee vyakyaanaalatO! inka nakaLLalO neeLlu [aanandaBhaspAlu]alagevunnayi. inta vinOdannichhina bhooshangariki kooda na aBhinandanalu.

    inka migilina aYYaloo[ante kameswarrao..mOhana garalaki, emanDee manam enta ardham leni ratanainaa samardhinchaDam avasaramanTaaraa?? kavitvam anTe chulakana kalige ilanTi ratalani kooDa samardhinchi..andulO..edo vunDevunTundanna vathhaasu endukO ..okasari alOchinchandi.

    parody lu rendu rakalu. okaTi chala bagunna kavitakee parody cheyyochhu. vudaaharaNaki sreesree mahaprastanam loni geyalaki machiraju deviprasad .. inka zaruksastrila parody la lanTivi.alaage parama neerasamaina ardham leni..ardhanni prayatninchinaa sadhinchaleni vaTiki vamanamoortigaru chesina parody la lanTivi.

    yadukulabhushan garu ilanTi parody lu rase avakasam ichhinanduku..andarikanna mundu aayanni congrats chestoo, ilanTi manchi rasaheenamaina padyalani.. manchi vinodam kaliginche padhatilO marikonni rayamani ..aBhyardidtoo..parady kartalaki marOsaari na santoshanni teliyajestunnanu.
    adisare..vamanamoorti garu..changubhala..Enkimaama..anna oohalO vunna mahaardhamemO! mee vakyanni nenu maravanandOy.

    eemaaTa sampadakuloo kaDupaara navvukOnichharu. thank u.

    RAMA

    [రమ గారు: మీ అభిప్రాయాన్ని ఈ సారికి రోమన్ లిపిలోనే ప్రచురిస్తున్నాము. తెలుగులో టైపుచెయ్యడం కన్నా ఇలా రోమన్ లిపిలో రాసినవి చదవడం ఇంకా కష్టమని గుర్తించగలరు. మీకు ఈమాటలో అభిప్రాయాలు రాసే డబ్బాలో తెలుగులో టైపు చెయ్యడం అలవాటు కాకపోతే తెలుగులో టైపు చెయ్యడానికి Quillpad, Baraha లాంటి సాధనాలు పరిశీలించగలరు. - సం]

  18. baabjeelu అభిప్రాయం:

    November 7, 2008 9:51 am

    కవుల మనసులో ఏముందో వారు రాసిన కవిత్వం చెప్పాలితప్ప మరొకరు చెప్పజాలరు. చదవగానే ఎలాటి భావం కలగకపోతే లేదా దేనిగురించి ఈ కవిగారు రాసేరూ? అని మామూలు పాఠకుడికి అనిపిస్తే ఇలాగే వుంటుంది. యద్భావం తద్భవతి లాగ, రాసిన ప్రక్రియ వుంటే తప్పు కాదా? క్లుప్తతకి కూడా “లిమిట్” వుండాలేమో? “శుక్లాంబరధరం..” శ్లోకం గాడిద పరంగానూ వ్యాఖ్య చెయ్యొచ్చునని వేదంవారో, తాతావారో నిరూపించినట్టుంటే ఎలా?

    కవిగారివల్ల పాఠకుల స్థాయి పెరగాలి. కానీ కవిగారివల్ల పాఠకులు తగ్గిపోతే అది కవిగారి తప్పే. “అర్ధవఁవకపోతే, భాషనేర్చుకుని చదవండి” అని కాబోలు విశ్వనాధ వారి సమాధానం, “జరుక్ శాస్త్రి గారికీ” “శ్రీశ్రీ” కీ. కానీ “బ్రౌణ్యం” పక్కన పెట్టుకున్నా కొరుకుడు పడని కవిత్వం సంగతి?

  19. Kameswara Rao అభిప్రాయం:

    November 7, 2008 12:26 pm

    ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మనుషుల్లో ఇంతటి అసహనం ఉంటుందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది, బాధేస్తోంది. ఎందుకంటే,
    1. మనకి ఒక కవిత నచ్చకపోతే (అర్థంకాకపోతే) అది నచ్చలేదని (అర్థం కాలేదని) మర్యాదగా చెప్పవచ్చు, అవహేళన చెయ్యాల్సిన అవసరం లేదు.
    2. సరే కొంతమందికి అర్థం కాలేదని, మాకు అర్థమయిందేదో నేను, అలానే మోహనగారు చెప్పాం. మేమేమీ కొమ్ములు మొలిచిన పాఠకులం కాదు, మామూలు పాఠకులమే. మేమర్థం చేసుకున్నట్టుగా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. అయితే దీన్నేదో కవితకి సమర్థింపుగా అనుకోవడంలో అర్థమేముంది? నాకు భూషణ్ గారు చుట్టమేమీ కాదు, అసలు నాకతనితో పరిచయమే లేదు, అతను నా అభిమానకవి అంతకన్నా కాదు. మరి దేనికి ఉట్టినే సమర్థిస్తాను? అసలు అతని కవిత బాగుంది అని కూడా నేననలేదే! మరి సమర్థింపు ఏమిటి?
    3. ప్రతికవితా మనకి అర్థం అవుతుందన్న నమ్మకమూ లేదు, అవ్వాల్సిన అవసరమూ లేదు. మనకి అర్థం కాని కవితకి వేరెవరైనా తమకి తోచిన అర్థాన్ని చెపితే, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉచితమైన పని. “నేనలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించను, నాకు ప్రతీదీ అప్రయత్నంగానే అర్థమవ్వాలి, అలా అవ్వకపోతే అది కవిత కాదు” అని అనుకోవడం మొండితనమే అవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు?

    బాబాగారు, శ్రీనివాస్ గారు, బాబ్జీలు గారు,
    కవితని ఒక పాఠకునిగా మనం అర్థం చేసుకొని ఎంతవరకూ ఆస్వాదించేం అన్నది ముఖ్యం కాని, అది ఎంతమందికి అర్థం అవ్వాలి? ఎక్కువమందికి అర్థమయ్యేట్టు కవి రాసాడా? అలా రాయకపోవడం కవి దోషమా ఇత్యాది వాదోపవాదనలు అవసరం అంటారా?

  20. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 7, 2008 1:15 pm

    కామేశ్వరరావు గారు
    ముందుగా, నచ్చనిది మర్యాదగా, అవహేళన చేయకుండా చెప్పడాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. నేను రాసింది, రాస్తున్నది అది కాదనే ఆశిస్తాను.

    ఇక ఈ చర్చ, కవిత ఎంతమందికి అర్థం అవ్వాలి అని opinion poll లో తూచి వెలకట్టడం కాదనుకుంటాను. సొంతంగా ఎంతవరకు కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడానికి వీలవుతున్నది అన్నదే ప్రశ్న అనిపిస్తుంది. కనీసం దేనిగురించో అన్నదైనా తెలియవీలవుతుందా అని కూడా.

    కవిత యొక్క శీర్షిక “సువర్ణ భూమిలో…” అన్నారు. థాయలాండ్్ ని “సువర్ణభూమి” అని అంటారని చదవలేదు, వినలేదు. తెలిసిన వారు చెప్ప మనవి. థాయ్లాండ్్ పూర్వనామం సియాం. సియాం కు సంస్కృతంలో ఉన్న “శ్యామ” కు సంబంధం ఉంది. “శ్యామ” అంటే నలుపు, నీలం కాని సువర్ణమని తోచడంలేదు. ఇదంతా ఎందుకంటే, థాయలాండ్్ గురించి ఎక్కువగా తెలియని వారికి, ఈ కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడం కష్టం. మోహనగారు, మీరూ, చెప్పింతర్వాత కొంత background తెలిసి ఇది అసలు దేనిగురించో అన్న చిక్కుముడి వీడింది. అది చాలు పాఠకునికి ఊరటనివ్వడానికి.

    కవితను ఆస్వాదించడం పక్కకు పెట్టి, అసలు దేనిగురించి చెబుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిని నివారించడం రచయిత బాధ్యతే కాదు, politeness to readers అనిపిస్తుంది. ఏం చెప్పారో అని కాదు, దేని గురించి చెప్పారో అన్నదే తేలకపోతే గందరగోళం. సమయం వెచ్చించి, కష్టపడి చదివితే, దేనిగురించి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఉంటే ఆ రచనను rude to readers అని ఎందుకు అనుకోకూడదో తెలియదు. That is no reason to be rude to writer in turn.
    =============
    Regards
    -Srinivas

  21. mOhana అభిప్రాయం:

    November 7, 2008 3:29 pm

    మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
    My name is Ozymandius, King of Kings,
    Look on my works, ye Mighty, and despair!
    అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
    కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు - మోహన

  22. lyla yerneni అభిప్రాయం:

    November 7, 2008 4:57 pm

    “కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….

    “సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”

    -mOhana అభిప్రాయం

    కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే - చర్చలలో - ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ - ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.

    ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు - అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.

    మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.

    ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.

    కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.

    లైలా

  23. Garikapati అభిప్రాయం:

    November 7, 2008 9:16 pm

    ఇందులో అయుదు ఇంపైన కవితలు:

    ముందు మూడు కవితల్లో బుద్ధ జీవితం గొప్పతనం కళ్ళకు కట్టినా, ప్రతి కవితలో ఎదో ఒక ప్రాణి (ఎర్ర చారల పిల్లి, తేనెటీగ, కుక్కపిల్ల) బుద్దుడి గొప్పతనం ఎమీ తెలియదు, తెలుసుకోలేవు(కొంతమంది మన పాఠక మిత్రుల్లా) కనుక వాటి పనిలో అవి ఉన్నాయి (పాదాలను నాకుతూ).

    నాలుగవ కవిత: మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చు. తల ఎత్తక, దించక నిలిచి గమనించమని చెపుతున్నా, పైకి కిందికి చూసి ప్రాణ వాయువు అందని కొందరు పాఠకులు, గజ ఈతగాళ్ళైన మోహన, కామెశ్వర రావుగార్లకు నిజంగా పని పెట్టారు.

    చివరి కవిత: ముఖ్యంగా ఈ కవితల నేపధ్యం థాయ్ ల్యాండ్ అని ప్రియురాలి మనసునే కాదు మొత్తం కవితలనే ఛాయామాత్రంగనైనా ఆనవాలు పట్టడానికి కవి వదిలిన సూచన. ఈ సందర్భంగా “ఇస్మాయిల్ గారితో నా పరిచయం” అన్న విన్నకోట రవి శంకర్ గారి వ్యాసంలో వారు సూచించిన ‘కవిత్వంలో అస్పష్టత’ అనే అంశంపై చర్చ గుర్తుకు వచ్చింది.

    రవిశంకర్ గారు: “హంపీ పద్యమేమిటి అలా ఉందీ”
    ఇస్మాయిల్ గారు: “నువ్వు హంపీ వెళ్ళావా?”
    రవిశంకర్ గారు: “లేదు”
    ఇస్మాయిల్ గారు: “మరి హంపీ చూడకుండా హంపీ మీద పద్యం ఎలా అర్ధం అవుతుంతుంది?”

    “కవిత అర్ధం చేసుకోవడానికి కవి అనుభవించిన ప్రదేశం వెళ్ళాలని” జర్మన్ మహా కవి గోథె ఎక్కడో అన్నట్టు గుర్తు.

    కాబట్టి కనీసం మన్సుతో నైనా కవి ప్రదెశాన్ని చూడకుండా విమర్శించడం భావ్యం కాదు.

    –గరికపాటి

  24. Sangeeta అభిప్రాయం:

    November 7, 2008 10:08 pm

    శ్రీనివాస్ గారు:

    థాయ్ లాండ్, సువర్ణ భూమిలో ఒక ముఖ్యమైన భాగం,

    1. బ్యాంగ్ కాక్ ఐర్ పోర్ట్ పేరు : సువర్ణ భూమి

    లింకు: http://www.bangkokairportonline.com/node/15
    ___________________________
    Official name
    Suvarnabhumi Airport. The name Suvarnabhumi was chosen by HM King Bhumibol Adulyadej which means “The Golden Land”, specifically referring to the continental Indochina. “Golden Peninsula”or “Golden Land” is a traditional name for the Thailand-Cambodia-Laos-Burma region
    ___________________________

    కవితలు చాలా భావావేశం నిండి, ఒక వారం రోజులు నేను అనందించిన నా థాయ్ లాండ్ యాత్ర స్మృతులను తిరిగి వెలిగించాయి. ఇటువంటి కవితలు ఇంకా చదవాలని కోరిక.

    –సంగీత

  25. వినీల్ అభిప్రాయం:

    November 8, 2008 11:21 am

    లైలా గారు, “జటిలుడు, కుటిలుడు లేనిదే కృష్ణలీల తెలియద”ని పరమహంస ఉవాచ. ఎంతటి గుగ్గురువులనైనా ప్రశ్నించడంలో తప్పులేదు. మీతో ఏకీభవిస్తాను.
    కామేశ్వరరావు గారు, symbolism ( imagism ) కు కవి వ్యతిరేకి అని నేనెక్కడా చదివినట్టు లేదు. abstract expressions ని వ్యతిరేకించినట్టు గుర్తు. let me go back and read his book again.
    మోహన గారు, you have eloquently put what I wanted to say. thank you.
    వినీల్

  26. Kameswara Rao అభిప్రాయం:

    November 9, 2008 5:14 am

    వినీల్ గారు,
    గణిత సమీకరణాల్లో ఉండేవి abstract symbols కదా. Symbolismకి imagismకి తేడా ఉంది.
    ఎలానూ మళ్ళీ భూషణ్ గారి పుస్తకం తిరగేస్తానన్నారు కాబట్టి, అతనికి మీరు ప్రస్తావించిన గుయిర్నికా పైంటింగు గురించి ఉన్న అభిప్రాయం ఒకసారి చదవండి :)

  27. baabjeelu అభిప్రాయం:

    November 21, 2008 8:03 am

    ఈ కవిత “ముక్తసరి” పదగ్రస్తవాఁ?

  28. tavva obul reddy అభిప్రాయం:

    November 25, 2008 9:00 am

    కవితలు చక్కగా ఉన్నాయి.

  29. ఆరి సీతారామయ్య అభిప్రాయం:

    December 2, 2008 3:11 pm

    సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు.

    ఈ కవితలో మూడు దృశ్యాలున్నాయి. మొదటిది ఒక కొండమీది (ఒక భక్తుడు ఎన్నో మెట్లెక్కి వచ్చాడు కదా) బౌద్ధ దేవాలయం. బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్ధులు ఎదురెదురుగా కుర్చోనున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళేముందు భక్తులు కాళ్ళుకడుక్కోవటానికి ఒక పెద్ద నీళ్ళతొట్టె ఉంది. అందులో కలువలున్నాయి. ఒక కలువ మీద తేనెటీగ వాలి ఉంది. అగరొత్తుల పొగ దేవాలయం అంతా వ్యాపించి ఉంది. ఎర్ర చారల పిల్లి ఒకటి ఉంది ఆ దృశ్యంలో. కవి చూస్తుండగానే కొండ పైదాకా వచ్చిన భక్తుడొకడు పైకప్పుకు అంటుకొనిఉన్న గబ్బిలాలను అదలించాడు. మన కవి, అతని భార్య (మేము అన్నాడు కదా? అరుంధతి గారికి కవితను అంకితం ఇచ్చాడు) బంగారు బుద్ధుడికి కలువలు సమర్పించారు.

    రెండో దృశ్యం పర్యాటకులు చూసే ఒక శిధిలమైన దేవాలయం. ఒక పర్యాటక బృందానికి మన కవికి తెలియని ఏదోభాషలో గుడి గురించి చెప్తున్నాడు గైడ్. దేశం మీద జరిగిన దాడుల్లో దేవాలయంలోకూడా విధ్వంసం జరిగింది. విగ్రహాల తలలు తెగిపోయాయి. దేవాలయపు గోడలమీద ఇప్పుడు పెద్దపెద్ద చెట్లున్నాయి. వాటి వేళ్ళలో ఒక బుద్ధ విగ్రహానికి చెందిన తల ఇరుక్కుపోయి ఉంది. మొండెం మాత్రం ఇంకా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మామూలు కవికీ మంచి కవికి తేడా – ఆ పర్యాటకుల బృందంలో ఒకావిడ అక్కడకొచ్చిన కుక్క పిల్లని ఒడిలోకి తీసుకున్నది అని చెప్పటం. చరిత్రలోనుంచి మనల్ను బయటకు తీసుకొచ్చాడు కవి.

    మూడో దృశ్యం సముద్రపు నీళ్ళలోతుల్లో జంతుజాలాన్ని చూడటానికి వెళ్ళే పర్యాటకులు. కొంచెం అటూ ఇటూ అయితే ప్రమాదం. బాగా ఈత వచ్చిన వాళ్ళు పర్యాటకులను రక్షించాల్సి వస్తుంది.

    ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్‌ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.

  30. Srinivas Nagulapalli అభిప్రాయం:

    December 4, 2008 11:39 pm

    ఆరి గారు
    కళ్ళకు కట్టినట్లు చెప్పారు. చూసింది రాయడం వేరు. కనపడేలా చూపించే రాయడం వేరు.

    I do not know why, but this brings to my mind words of Vivekananda when some one was very enthusiastic to show him wonderful sights and sceneries in West. His response,
    “Do not show me sights. I have seen the Himalayas! I would not go ten steps to see sights; but I would go a thousand miles to see a
    (true) human being.”
    ———-
    Regards
    -Srinivas

  31. baabjeelu అభిప్రాయం:

    December 6, 2008 7:46 am

    ఇప్పటిదాకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసేరు ఈ కవిత మీద.
    ఆరి సీతారామయ్యగారి వ్యాఖ్య చదివేక మరీ విడ్డూరంగా వుంది.
    మొదట్లో మూలా వారు “ఆరో ఖండిక” అద్భుతం అన్నారు. ఆతరవాత నానాజాతి సమితీ చేతికొచ్చినట్టూ రాసేరు. మధ్యలో “గురుతుల్యులు” అలాక్కాదిలాగ, ఇలాక్కాదలాగ అని అందర్నీ దార్లో పెట్టడానికి నానా ప్రయాసా పడ్డారు. ఇప్పుడు ఆరి వారు “ఆరో ఖండిక” ఈ కవితని గొప్ప కవిత కాకుండా అడ్డీసిందని బాధ పడ్డారు.
    మహన్నభావుల్లారా!మీకందరికీ జవాబు తెలుసు. తెలిసీ చెప్పకపోతే మా(సాధారణ పాఠకుల) తలలు వేయి వ్రక్కలైపోతాయి.

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,
    మీ అంత చక్కగా, నిష్కర్షగా, నిస్సంకోచంగా, నిర్భయంగా,నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా అభిప్రాయాలు రాసేవాళ్ళని ఇంతవరకూ నేను చూళ్ళేదు. ధన్యోస్మి.

  32. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    December 6, 2008 11:12 am

    దృశ్యానుభూతి కవిత్వ లక్షణాల గురించి ఒక వ్యాసంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఇలా అంటారు:

    “దృశ్యంలోకి అనుభవం, అనుభవంలోకి దృశ్యమూ పరావర్తనమయ్యే విశిష్ట గుణం అనుభూతి కవిత్వానికి మూలం. నువ్వు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకడమే ఇక్కడ ప్రాధమిక సూత్రం. కవి అనుభవానికే కాదు, పాఠకుల అనుభూతిక్కూడా ప్రాధాన్యత ఉన్నప్పుడే అది నిలబడుతుంది. అస్పష్టం గా ఉన్న అనుభవం ఇంకొకరి అనుభూతిలోకి ప్రసరించదు.

    ఈ కవితలో ప్రధాన లోపం స్పష్టత. అనుభవమే కనిపిస్తోంది - అనుభూతి మాత్రం శూన్యం.

    -సాయి బ్రహ్మానందం

  33. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    December 6, 2008 9:30 pm

    భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:

    “కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]

    అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.

    మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:

    “పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]

    పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.

  34. Srinivas Nagulapalli అభిప్రాయం:

    December 7, 2008 3:00 pm

    బాబ్జీలు గారు
    Thanks for your many generous and kind words. I am not sure I deserve them.

    నిజం చెప్పాలంటే- చాలాసార్లు, నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో అనీ, రాసిందేదైనా అపార్థం చేసుకోవచ్చేమోననీ, అసలీ పని వల్ల నేర్చుకుందేమిటి, ఒరిగే ఉపయోగం ఏమైనా ఉందా (నాకైనా సరే!) అనీ, ఇది ప్రోత్సాహం చేయకపోతే పోనీ, అనవసరంగా నిరుత్సాహపరుస్తుందేమోననీ - అనుమానాలు, ఒకోసారి భయం కలుగుతూనే ఉంటాయి నాకు.
    విధేయుడు
    ————–
    -Srinivas

  35. baabjeelu అభిప్రాయం:

    December 8, 2008 9:38 am

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,

    నాదృష్టిలో అభిప్రాయాలు రాస్తూ ఇక్కడ చేస్తున్నది “ఖానా గట్ల” మీద కూచుని కబుర్లాడుకోవడమే. అది కూడా ఖాళీగా వున్నప్పుడు. దాని వల్ల ఉపయోగం ఏవిటన్నది ప్రశ్నే. అన్నిటికన్నా ముందుగా “దురభిప్రాయాలకి” రచయితలు నిరుత్సాహపడతారని ప్రతీ రచనని బాగానే వుందని అభిప్రాయాన్ని ప్రకటించడం ఆయా రచయితలకి ఎంత ఉపయోగకరం? ఫలానా విషయం తక్కువో ఎక్కువో అయిందని రాయడం అందరికీ రాదు. దానికి బదులుగా నాలాటి వాళ్ళు వాళ్ళ అనుభూతిని ప్రకటిస్తారు. అందులోనూ వారి భాషా, స్థాయీ లలో. వాటిలో కొన్ని చికాగ్గా వుండొచ్చు. రచయిత మనసుకి కష్టం కలిగించొచ్చు. నచ్చని వాటి గురించి అభిప్రాయం రాయడం ఎందుకూ అని అడగొచ్చు. నిజవేఁ, నావరకూ అప్పుడు కూడా రచయితకి ఎంత ఉపయోగకరం?
    ఇక్కడ అభిప్రాయాలు రాసుకోవడం గురించి: ఒకటే పోలిక కనబడుతోంది నాకు. “ఖానా గట్టు” మీద కూచుని ఏ సినిమా ఎక్కడ ఎంత కలెక్ట్ చేసింది? ఎన్ని రోజులాడింది? ఆడించేరా? దాని బలం మీదే ఆడిందా? హీరో హీరోయిన్లు పాటల్లో ఎన్ని “డ్రెస్సులు” మార్చేరు? లాటి విషయాల మీదనైతే నిస్సందేహంగా వేరే వ్యాపకం చూసుకోడం సరైన పని. కానీ వాటి బదులు ఆయా సినిమాల లోని సంగీతం గురించో, సాహిత్యం గురించో, నటన గురించో మిగిలిన వాటి గురించో అయితే మంచి పనే అని నా నమ్మకం.

  36. Srinivas Nagulapalli అభిప్రాయం:

    December 8, 2008 1:36 pm

    బాబ్జీలు గారు
    నిజమే. రచయితలు నిరుత్సాహపడతారని ఊరికే బాగుంది అని రాయడం నా అభిప్రాయం కాదు. అట్లా కాదు అందరూ బాగుందనే రాయాలి అంటే, అభిప్రాయాలు రాసేవాళ్ళు నిరుత్సాహపడిపోతారు! అభిప్రాయాలు రాయడం కబుర్లాడుకోవడం అన్నదానికి, కొన్నిసార్లు (చాలాసార్లు?) రచనలు సైతం కబుర్లాడుకోవడం లాంటివే అని చేర్చవచ్చేమో. ఏమిటి ఉపయోగం అన్నది నాకు నేను వేసుకునే ప్రశ్న, వచ్చే అనుమానం మాత్రమే. ఇంకొకరి కోసం దాన్ని బేరీజు వేసే తాహతు నాకు లేదు.

    “ఆయా సినిమాల లోని సంగీతం గురించో, సాహిత్యం గురించో, నటన గురించో మిగిలిన వాటి గురించో అయితే మంచి పనే అని నా నమ్మకం.” అన్నారు.
    అయ్యా మంచి పని గురించి తర్వాత. (ఇటీవలి) సినిమాలలో సంగీతం, సాహిత్యం, నటన అనేవి కూడా ఉంటున్నాయి అని అనుకోమంటారా?
    సాగదీస్తే సంగీతం. తిట్టుకుంటే సాహిత్యం. చుట్టుకుంటే నాట్యం. కొట్టుకుంటే నటనం.
    ========
    విధేయుడు
    -Srinivas

  37. baabjeelu అభిప్రాయం:

    December 8, 2008 10:54 pm

    సువర్ణ భూమిలో , సాగదియ్యడం, తిట్టుకోవడం, చుట్టుకోవడం మరియు కొట్టుకోవడం గురించి చర్చించడం తగదు. (మన్లో మాట మూడు అ”ట్టు”లు అద్భుతంగా వేసేరు. నిజవేఁ.టకానీ నేనన్నది మంచి సినిమాల గురించి.)

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a