కవిత్వంపై చివరి ఉపన్యాసం వేలూరి వేంకటేశ్వరరావు గారిది. కవిత్వంపై చర్చలో అలసిపోయిన సభికులందరిలో తమ హాస్యోక్తులతో కొత్త ఉత్సాహం నింపారు. ఆద్యంతమూ ఛలోక్తులతో ఆసక్తికరంగా సాగిన ప్రసంగం, సభికుల్ని ఆకట్టుకుంది. కవిత్వం చదివే సాధారణ పాఠకుడు ఎదుర్కొనే సమస్యలను వీరు వింగడించారు. ఒక కవిత మంచిదా కాదా ఎలా తెలుసుకోవడం? ఒక కవితను చదవాలా అక్కరలేదా? అనే విషయం పాఠకుడిని వేధిస్తుంది. ఈ సాధారణ పాఠకుడి కోసం ప్రామాణికతను, కొలబద్దను ఎలా సృష్టించాలి? ఒక సుగంధానికీ, ఒక ద్రాక్షా సారాయపు రుచికీ ప్రామాణికంగా ఒక విలువ నిర్ణయించగలిగినట్టే, కవిత్వానికి కూడా నిర్ణయించగలిగే వెసులుబాటు ఉన్నదా? సంస్కృతాంధ్రాలలో ఇప్పటికే మన పూర్వీకులు ఎన్నో ప్రమాణాలను నిర్వచించారు. ఇప్పుడు కొత్త ప్రామాణికాలు మనకు అవసరమా? అని తన వ్యాసోద్దేశాన్ని పరిచయం చేశారు. రాజశేఖరుడు తెలిపిన నవపాకాలకు కొత్త రుచులు తగిలించి, కవిత్వం ఎలా జ్ఞాపికల సముదాయమో, ఎలా అవి మరలా నెమరువేసికొన్న స్మృతులో, ‘recovered memories’ కవిత్వాన్ని బేరీజు వేయడంలో ఎంత ముఖ్యపాత్ర వహిస్తాయో వివరించారు. వీరి ఉపన్యాసం ఆ రోజు సభకు ఒక చక్కటి ముగింపు అని చెప్పవచ్చు.
సాయంకాలం చక్కటి భోజనం, సాంస్కృతిక కార్యక్రమాలూ. డిట్రాయిట్ తెలుగు సమితి సభ్యులు, వారి చిన్న పిల్లలూ పాటలూ, నాట్యాలతో పండుగ చేశారు. డీటీఎల్‌సీ వారు ఈ సందర్భంగా వెల్చేరు నారాయణరావు, చంద్రలత, వడ్లమూడి బాబు రాజేంద్రప్రసాద్, కన్నెగంటి రామారావు లకు విశిష్ఠసేవా పురస్కారాలను బహూకరించారు. డీటీఎల్‌సీ వారు ప్రచురించిన పుస్తకాలను విడుదల చేశారు. డీటీఎల్‌సీ సభ్యుడు గుళ్ళపల్లి రవి నిర్మించిన “మా భూమి” అనే చలన చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. గౌతం ఘోస్ దర్శకత్వంలో 1979లో వెలువడిన ఈ సినిమా ఎంతో పేరుగన్నది. బాగా పొద్దు పోయింది అందరూ తమ తమ విడిది చేరుకునేటప్పటికి.
ఆదివారం సమావేశం ఉదయం ఉపాహారంతో ప్రారంభమయింది. కన్నెగంటి రామారావు ఆధ్వర్యాన తెలుగు ప్రచురణలను గురించి ఒక సభ జరిగింది. సురేశ్ కొలిచాల, పారినంది లక్ష్మీనరసింహం (పాలన), వెల్చేరు నారాయణరావు పాల్గొన్నారు. మొదటగా సురేశ్ కొలిచాల ఈ ఇంటర్నెట్ యుగంలో, ప్రపంచమే ఒక గ్రామంగా మారుతున్న నేపథ్యంలో, తెలుగు భవిష్యత్తు ఏమిటి? దాని పోషణకు, అభివృద్ధికి మనమేమి చేయగలం? సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎలా వినియోగించుకోగలం? అనే విషయంపై పవర్‌పాయింట్ సహాయంతో ప్రసంగించారు.
“>
రామారావు, సురేశ్, వంగూరి, వెల్చేరు
ముందుగా, అసలు చరిత్రలో గ్రంథాలు ఎలా ముద్రించబడ్డాయో విశదీకరిస్తూ రాతిపైన చిత్రకళనుండి ప్రారంభించి ఇంటర్నెట్ యుగం వరకు ముద్రణలో జరుగుతున్న మార్పులను, కూర్పులను, చేర్పులను తెలిపారు. ఆ తరువాత, క్రీ.శ. 2100 నాటికి 90 శాతం భాషలు అంతరించి పోతాయన్న అభిప్రాయాన్ని వివరిస్తూ, ఆధునిక మానవ జీవితంలో ముఖ్య భాగమైన సమాచార సాంకేతికజ్ఞానాన్ని (Information Technology) తగు విధంగా ఉపయోగించుకోలేని భాషలన్నీ ఈ శతాబ్దాంతానికి లుప్తమైపోయే ప్రమాదముందని అన్నారు. తెలుగువంటి ఆంగ్లేతర భాషల మనుగడకు ఇంటర్నెట్, e-పుస్తకాలే దోహదం చెయ్యగలవని ఆయన అభిప్రాయపడ్డారు. “ఆంగ్ల భాష శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఇప్పుడు అనుసంధాన భాషగా ఉపయోగించబడుతూ ఉంది. ఇప్పుడు కూడ ఇంటర్నెట్‌లో ఇంగ్లీషుది పై చేయి. యూనికోడ్ మాహాత్మ్యం వల్ల తెలుగును సులభముగా వ్రాయగలుగుతున్నాం, తెలుగులో ముద్రించగలుగుతున్నాం. ఇందులో ఇంకా ఎంతో కృషి చేయాలి. కొత్త ఫాంట్లు, OCR, e-గ్రంథాలయాల వంటివి చాల అవశ్యం” అని తెలిపారు.
వంగూరి చిట్టెన్‌రాజు గారు సుమారు రెండు వందల పైగా తెలుగు రచయితలు ఉండే అమెరికాలో తెలుగు పుస్తకాలను ఎలా అందరికీ అందుబాటు చేయడం అన్న విషయాన్ని సభ ముందు ఉంచారు. అన్ని సంఘాలు, సమూహాలు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేస్తే బాగుంటుందన్నారు. పుస్తక ముద్రణ, పంపిణీ, అందుబాట్లలో ఉండే సాదక బాధకాలు వినిపించారు. తరువాత పాలన గారు డిజిటల్ పుస్తకాలను తయారు చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను గురించి విపులీకరించారు. ముఖ్యంగా OCR (optical character recognition) తెలుగుకు ఎలా వర్తించ వీలవుతుంది అనే ప్రశ్నకు జవాబును అన్వేషించారు. వారు ముఖ్యంగా – preservation, production and propagation అనే మూడు అంశాలను చర్చించారు.
ఈ అంశం పైన చివరి ప్రసంగం వెల్చేరు నారాయణరావు గారిది. వారు ప్రచురణ అంటే ఏమిటి? అచ్చు వేయడానికి ప్రచురించడానికి తేడా ఏమిటి అనే ప్రశ్నకు జవాబు ఇచ్చారు. అక్షరము అంటే నాశనము లేనిది. గ్రంథాలు కూడా అవినాశనమై ఉండాలి. సాంకేతిక రంగం లోని మార్పులు ప్రగతికి చిహ్నం కాదు, అవి వట్టి మార్పు మాత్రమే అన్నారు. వావిళ్ళ సంస్థలాటి ప్రచురణ సంస్థలు నేడు లేక పోవడం శోచనీయ మన్నారు. ఇప్పుడు కూడ ఆ నాటి వావిళ్ళ ప్రతులను అలాగే ప్రచురిస్తున్నారు, మంచి పరిష్కర్తలు మనకు లేరు అని అవేదన వ్యక్తం చేశారు. మంచి ప్రచురణ సంస్థ నాగరితకు గుర్తు అన్నారు. ఇంతకు ముందులా ఇప్పుడు ప్రచురించే పుస్తకాలలో మంచివేవో కానివేవో అన్నది సంస్థను బట్టి నిర్ణయించలేము. ప్రచురణ సంస్థలకి ఈ రకమైన ఆత్మగౌరవం లేనప్పుడు మంచి పుస్తకాలు రావడం కష్టం అని ప్రసంగాన్ని ముగిస్తూ నారాయణరావు గారు, మంచి పరిష్కర్తలు, సంపాదకులు ఎంతో అవసరం, అప్పుడే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందన్నారు.
మధ్యాహ్న భోజనానంతరం, చివరి సదస్సు తెలుగు సినిమాలపై, తెలుగు బ్లాగులపై జరిగింది. పరుచూరి శ్రీనివాస్ గారు తెలుగు సినిమా ప్రారంభ దశలో ఎలాగుండిందో అనే విషయంపై మాట్లాడారు. “ఇప్పుడు ఆంధ్రదేశంలో కేవలం భక్తి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సినిమా పుస్తకాలు మాత్రమే అమ్ముడు పోగలవు. అదే విధంగా విశ్వవిద్యాలయాలలో తెలుగులో పరిశోధనల్లో కూడా సినిమా చోటు చేసుకుంది. కానీ సినిమాలపైన జరిగే సంశోధన ఆ రంగంలోని లోతులను ఆరా తీయడం లేదు” అని విమర్శించారు. ఆరంభ దశలో గ్రామఫోన్ రికార్డులు ఎప్పుడు వచ్చాయి, ఏయే కంపెనీలలొ (ఓడియన్, ఎచ్ఎంవీ లాటి వాటిలో) ఏయే కళాకారులు పాడేవారు, సినిమాలను ఎలా తీసేవారు, ఎవరు పెట్టుబడి పెట్టేవారు, టాకీలు రాకముందు తెరకు ముందు కస్తూరి శివరావులాటి కథకులు ఎలా ప్రజలకు చిత్రకథను తెలిపేవారు – ఇలాటి విషయాలను చక్కగా విశదీకరించారు. ఆ కాలంలో సినిమా ఒక విధంగా కులమత భేదాలను, సంఘంలోని దురాచారాలను నిర్మూలించడానికి తోడ్పడిందో అనే విషయాలపై పరిశోధన ఎంతైనా అవసరము అన్నారు. గత శతాబ్దంలో తెలుగు దేశంలో ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పరమైన మార్పులను అర్ధం చేసుకోటానికి సినిమా చరిత్ర పరిశోధన ఎంత చక్కగా ఉపయోగ పడగలదో వివరించారు. ఇంకా ఎన్నో ఆసక్తి కరమైన సంగతులు వారి ఉపన్యాసంలో ఉన్నాయి. సంగీతరంగంలో కూడా సినిమా ఎన్నో కొత్త దారులు తీసింది. అసలు సంగీత దర్శకుడు అన్న పేరు భారతదేశములోనే పుట్టిందట మొదటిసారిగా! పల్లవికి అనుపల్లవికి మధ్య వాద్యాల అంతరము కూడా చిత్రరంగపు సృష్టియే. ప్రేమ మున్నగు పదాలు కూడా మొట్టమొదట చిత్రసీమలోనే వాడబడ్డాయట. శ్రీనివాస్ గారి ప్రసంగం వస్తురీత్యా చాలా చిక్కని ప్రసంగం.
తరువాత తెలుగు బ్లాగులపైన ఒక సదస్సు శంకగిరి నారాయణస్వామి ఆధ్వర్యాన జరిగింది. తెలుగులోని కొన్ని బ్లాగులను తెలియజేశారు. అందులో కొన్ని – ఊహలన్ని ఊసులై, జ్యోతి, నాగమురళి, రామనాథరెడ్డి, పర్ణశాల, మనలోమనమాట, సిరివెన్నెల, చదువరి, కలగూరగంప, కలం కలలు, తెలుగు తూలిక, గుండె చప్పుడు, రెండు రెళ్ళు ఆరు, విహారి, కొత్తపాళీ. బ్లాగులను ఎలా ప్రారంభించాలో, దానికి కావలసిన ఉపకరణాలను గురించి తెలిపారు. బసాబత్తిన శ్రీనివాసులు తమ అనుభవాలను ముచ్చటించారు. తెలుగు వికీపీడియా ఎలా కొనసాగుతుందో అనే విషయంపై వైజాసత్య రవి గారు మాట్లాడారు. ఈ విజ్ఞానసర్వస్వానికి అందరు కృషి చేయవచ్చును. ఇప్పటి దాక సుమారు 40 వేలపైన అంశాలు తెలుగు వికీపీడియాలో చూడ వీలవుతుంది, అని తెలిపారు. ఇంకా సి. బి. రావు, శ్రీ, శరత్ గార్లు కూడా బ్లాగులతో వారి అనుభవాలను సభికులతో పంచుకొన్నారు. మిగతా కార్యక్రమాలంత పకడ్బందీగా ఈ కార్యక్రమం లేదనే చెప్పుకోవాలి. బహుశా, బ్లాగుల గురించి జన సామాన్యానికి ఎంత తెలుసో అంచనా వేయడంలో పొరపాటు అయి ఉండవచ్చు. కానీ, ఇదేమంత పెద్ద విషయం కాదు.
ముగింపుగా అరుణా పాణిని అమెరికాలో ముఖ్యంగా పిల్లలకు తెలుగు వినడం, మాట్లాడడం, చదవడం, చదివించడం ఎలా అనే విషయంపై తన కుటుంబాన్నే ఒక ఉదాహరణగా తీసుకుని మాట్లాడారు. తన భర్త పాణిని తల్లి తమిళం మాట్లాడేవారు, తండ్రి తెలుగు అచార్యుడు, తమిళం రానివారు. పెళ్ళి అయిన తరువాత ఇద్దరూ కన్నడంలో మాట్లాడుకొనేవారు, అయినా సరే, వారి పిల్లలందరికీ తెలుగు క్షుణ్ణంగా వచ్చు. అలాగే అమెరికాలో పుట్టిపెరిగిన తన కొడుకు తనకు పరిచయమైన మెక్సికన్ అమ్మాయి వద్ద స్పానిష్ భాష నేర్చుకొనడానికి తెలుగు భాష పరిచయం ఎలా ఉపకరించిందో అనే విషయాన్ని వివరించారు. అట్లాంటాలో తెలుగు ఒక పఠనీయ భాషగా వెలుగులోకి వస్తున్నదని, దానికి నారాయణరావు గారు గౌరవ ప్రాధ్యాపకులని తెలిపారు. అంతటితో సమావేశం ముగిసింది. తిరుగు ప్రయాణాల హడావిడిలో దూర తీరాలనుంచి వచ్చిన వారు వెళ్ళిపోయారు. మిగిలిన ఆహూతులంతా ఒకరికొకరు వీడ్కోళ్ళు చెప్పుకుంటూ అక్కడే ఇంకొంచెం సేపు తారట్లాడారు.
ఇటువంటి సమావేశాల నిర్వహణలో ఎన్నో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అయితే, ఏ లోటూ రాకుండా, కాలాయాపన లేకుండా చాలా పకడ్బందీగా ఈ సమావేశం నిర్వహించినందుకు డీటీఎల్‌సీ వారిని అభినందించక తప్పదు. ప్రత్యేకించి, వక్తల ఉపన్యాసాలకూ, తదనంతరం చర్చలకూ సరిపోయినంత సమయాన్నివ్వడం చాలా నచ్చిన విషయం. ఇందువల్ల ఒక విషయాన్ని కొంచెం విశదంగా చర్చించే వీలుంటుంది. నిర్వాహకులు తాము చదివిన పుస్తకాలపైన మాట్లాడి ఉంటే బాగుండి ఉంటుందని నా ఊహ. మనుచరిత్ర, ఆముక్తమాల్యద వంటి కావ్యాలను చదివిన సాహితీ సభ్యులు ఎందుకు సంప్రదాయ సాహిత్యంపైన మాటలాడమని ఎవరినీ పిలువలేదో? ఇరవైఒకటవ శతాబ్దంలో కూడా ఛందోబద్ధమైన కావ్యాలు సాహిత్యానికి అవసరమనే నా భావన. సాంప్రదాయిక సాహిత్య విమర్శ పై ఏ కార్యక్రమం లేకపోవడం ఒక లోటు అనే చెప్పవచ్చు.
ఇది ఒక చక్కని సమావేశం. దీనిని జయప్రదంగా నిర్వహించిన డిట్రాయిట్ తెలుగు సాహితీ ప్రియులను తప్పక మెచ్చుకొని జోహారు లర్పిస్తున్నాను. చక్కటి భోజనం, ఉపాహారాలు అందరికీ సమకూర్చారు, వేరే ప్రాంతాలనుంచి వచ్చిన అతిథులకి తమ ఇళ్ళలో వసతి కల్పించారు. రెండు రోజులూ ఒక పండగ లాంటి వాతావరణం లో సమావేశం జరిపారు. డీటీఎల్‌సీ వారు నిజంగా అభినందనీయులు. కవులు, పండితులు, సాహితీ పిపాసకులతో రెండు రోజులు ఎంతో వేగంగా గడిచిపోయాయి. ఇలాటి సమావేశాలు అమెరికాలో తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో అవసరం.


