పదేళ్ళ “ఈమాట” మాట
[శ్రీ కే. వీ. ఎస్. రామారావు గారు ఈమాట వ్యవస్థాపకులలో ఒకరు. 2004 వరకూ ముఖ్య సంపాదకులుగా ఈమాటని నడిపించారు. ఈమాటకి పదేళ్ళు నిండిన సందర్భంలో వారు పంపిన మాటలివి.]
1998 వేసవిలో ఆస్టిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ప్రాంగణాన్నానుకుని వున్న ఓ పాత చర్చి పార్కింగ్ ఏరియాలో తళుక్కుమన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచనకి ఇప్పుడు పదేళ్ళు నిండాయి. ఆ ఆలోచనకి అందమైన రూపాన్నివ్వటంలో నాటి నా సహశిల్పులు (అకారాది క్రమంలో) కొంపెల్ల భాస్కర్, కొలిచాల సురేశ్, విష్ణుభొట్ల లక్ష్మన్న; కొంతకాలం ఇండియా సంపాదకుడిగా వ్యవహరించిన ద్వా.నా. శాస్త్రి గారు - అందరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు. సాంకేతికంగా ఎంతో సహాయం అందించిన చోడవరపు ప్రసాద్, తొలినాళ్లలో ఈ పత్రికని “హోస్ట్” చేసిన జువ్వాడి రమణ, కొన్నాళ్లపాటు “పాఠకుల అభిప్రాయాలు” శీర్షికను “హోస్ట్” చేసిన నందుల మురళి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
1998 లో “ఈమాట” జననం వెనక వున్నవి భవిష్యత్తు గురించి మాకు కలిగిన ఈ ఊహలు, నమ్మకాలు:
- కాగితపు పత్రికలకు కాలం అనుకూలం కాదు. వాటికి భవిష్యత్తు లేదు.
- తెలుగు పాఠకుల సంఖ్య కిందికే కాని పైకి వెళ్లబోవటం లేదు. ఉన్న కొద్దిమందీ భౌగోళికంగా విస్తరించి వుంటారు. ఒకచోటనే వుండరు. వీరిలో ఎక్కువభాగం ఇంటర్నెట్ మీద, ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు చదువుకుంటారు.
- ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు పాఠకులందరికీ ఎప్పుడూ అందుబాటులో వుండే విధానం మాత్రమే నాలుక్కాలాల పాటు నిలవగలుగుతుంది.
- రచయితలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నారు. వారి అనుభవాలు, అనుభూతులు ఆవిష్కరించే రచనల్ని ఆంధ్రదేశంలోని పత్రికలు ప్రచురించవు, ప్రచురించలేవు.
- ఇప్పుడు రాస్తున్న విదేశాంధ్రులు వాళ్ల నిజమైన భావాల్ని వ్యక్తపరచలేకపోతున్నారు. మాతృదేశంలోని పాఠకుల అభిప్రాయాలకు అనుకూలంగా వుండేవో, కాకుంటే సార్వత్రికత లేని కృత్రిమమైన విషయాల గురించో మాత్రమే రాయగలుగుతున్నారు. అనవసరమైన హద్దులు లేని కొత్త వేదిక దొరికితే వారు మనసులు విప్పి చెప్పగలుగుతారు.
- పత్రికలు కేవలం చదువుకునేవిగానే వుండవు. దృశ్య, శ్రవ్య విభాగాలను కూడ కలిగివుంటాయి.
ఈ పదేళ్ల కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు. మరికొన్ని నిజం కాలేదు. ఐతే మొత్తం మీద అప్పటి ఆ ప్రయోగం ఆశించిన కన్నా విజయవంతమైందనే చెప్పుకోవాలి.
అన్నింటిలోను ఐదో విషయం మాత్రం ఎంతో నిరాశను కలిగిస్తోంది. రచయితలు, వారి రచనలపైన అప్పుడు మేము పెంచుకున్న నమ్మకం చాలాకొంచెమే నిజమయ్యింది. అవధులు, ఆంక్షలు లేని వేదికను అందిస్తే వారి ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, ఆశానిరాశలను కొత్తగా, లోతుగా, సహజంగా, నిర్భయంగా చెప్తారన్న ఆశ ఆశగానే మిగిలివుంది. ముఖ్యంగా కథలు. ఆలోచనల్లో లోతు, శిల్పంలో పనితనం, వస్తువులో విస్తృతి అంతగా కనిపించటం లేదు. ఇంతెందుకు, కథల్లో ముందుగా వుండాల్సిన చదివించే గుణం కూడ అరుదైంది. రచయితల సంఖ్య సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్టుంది. కవితల్లోనూ విషయవిస్తృతి కనిపించదు. భాషాపాటవం, శిల్పసౌందర్యం, భావసాంద్రతల మాట సరేసరి. ఇక దృశ్య, శ్రవ్య విభాగాలు. వీటిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించటం లేదు. భవిష్యత్తు బాగుంటుందని ఆశ.
ఐతే వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది. ఒకప్పటి “భారతి” పత్రిక ఇలా పునర్జన్మ ఎత్తిందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసేటంత. వస్తువైశాల్యంతో పాటు ఆలోచనాత్మకత, తర్కనిబద్ధత ఈ విభాగంలో తరచుగా కనిపిస్తున్నాయి. ఇది అభిలషణీయం, ఆనందకరం. మిగిలిన భాగాలు కూడ ఇదే స్థాయికి త్వరలో చేరుతాయని నా ఆకాంక్ష.
సాంకేతికంగా “ఈమాట” మిగిలిన తెలుగు వెబ్ పత్రికలన్నిటికి ఆదర్శంగా నిలిచిందని నా విశ్వాసం. “ఎంబెడెడ్ ఫాంట్స్” ని ప్రవేశపెట్టినా, యూనికోడ్ వాడకాన్ని అనుసరించినా, “వెబ్ 2.0″ పద్ధతుల్ని అన్ని రచనలకు అనువర్తింపజేసినా తొలిబాట వేసిన ఘనత “ఈమాట”దే కావటం విశేషం. వీటికి కారకులైన కొలిచాల సురేశ్, ఇంద్రగంటి పద్మ, చోడవరపు ప్రసాద్ అభినందనీయులు. గత నాలుగేళ్లుగా వేలూరి వేంకటేశ్వరరావు గారి నేతృత్వంలో, కొలిచాల సురేశ్, ఇంద్రగంటి పద్మ, నాసీ, పాణిని, మాచవరం మాధవ్ పత్రికను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. వీరందరి కృషికి, దీక్షకు నా అభినందనలు.
రాయమని వెంటబడి ఎంత విసుగెత్తించినా భరిస్తూ సాదరంగా తమ రచనల్ని అందించిన రచయిత్రులు, రచయితలకు కృతజ్ఞతలు. వారందరూ ”ఈమాట” కి చిరజీవితం సమకూర్చారు.
పాఠకుల ప్రోత్సాహం లేకుంటే ఈ పదేళ్ల ప్రయాణం సాధ్యమయేదే కాదు. వారందరికీ పదేపదే కృతజ్ఞతాంజలులు. వారి అఖండ ఆదరణే “ఈమాట” భవితకు పూలబాట.
Subrahmanyam Mula అభిప్రాయం:
November 1, 2008 11:31 pm
వెబ్ పత్రికల్లో ఈమాట అగ్రగణ్య. సందేహం లేదు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి రచనలతో పాఠకుల దాహాన్ని తీరుస్తుందని ఆశిస్తూ…
Rohiniprasad అభిప్రాయం:
November 2, 2008 9:07 am
ఈమాట సంచికలన్నీ దాని ముఖ్యపాత్రకు సజీవసాక్ష్యాలే. అయితే ఇంటర్నెట్ పత్రికలకు వేటికవిగా పాఠకుల, రచయితల లాయల్టీ కొంత కనిపిస్తుంది. సంపాదకుల వేపునుంచి వీటిమధ్య కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలేమో.
తక్కిన వెబ్ పత్రికల అస్తిత్వం గురించిన గుర్తింపు పరస్పరం ఆరోగ్యకరంగా పరిణమిస్తుందని నా ఉద్దేశం.
ఈమాట వికాసానికి అనుబంధంగా ఇంటర్నెట్ లో తెలుగు వాడకం గురించిన చర్చకి కూడా ప్రమేయం ఉందనుకుంటాను. దీని చరిత్రను వెంటనే నమోదు చెయ్యడం చాలా అవసరమని భావించడం వల్ల ఈ విషయం గురించి దీనికి ‘పితామహులవంటి’ విష్ణుభొట్ల సోదరులనూ, మా కజిన్ పిల్లలమర్రి రామకృష్ణనూ, పరుచూరి శ్రీనివాస్ గారినీ కొంత కదిలించాను. తెలుగు ఫాంట్ విషయంలో దేశికాచారిగారివంటి వారు గొప్ప కృషి చేశారనేది తెలిసినదే. ముందొచ్చిన చెవులవంటి వీరందరూ విడివిడిగానో, కలిసికట్టుగానో రాస్తే తప్ప ఇంటర్నెట్ లో తెలుగు చరిత్ర ‘వర్తమాన తరంగిణి’ వంటి ప్రాచీన తెలుగు పత్రికల్లాగే మరుగున పడిపోతుందని నా భయం.
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
November 6, 2008 12:13 pm
రామారావు గారు చెప్పిన పై మాటలు ఆలోచింపతగ్గవి. ఈ విషయమై నా ఆలోచనలు:
ఎందుకు కథల్లో పరిణతి కనపడట్లేదు? అంతో, ఇంతో కథలు రాయగలిగిన శక్తి ఉన్నవారి తగినంత కృషి, శక్తి లోపమే దీనికి కారణం అనుకుంటాను. ఒక విషయాన్ని వ్యాసం ద్వారా సూటిగా చెప్పటం, మంచి శిల్పం ఉన్న కథ రాయటం కన్నా, సులభం కదా! కథకుల అధ్యయనలోపం కూడా ఇందుకు తోడ్పడింది. తను రాసే వన్నీ కథలుగా చెలామణీ చేసుకుంటున్న ఒక రచయిత, మంచి కథ రాయటానికీ, శిల్ప జ్ఞానానికీ సంబంధం లేదనటం నాకు అనుభవమే! బహుశా కవితల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు.
కానీ, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. తెలుగు నాట ఉద్దండ కథకుల్ని దృష్టిలో పెట్టుకొని, అటువంటి కథకులు రావాలని ప్రవాసాంధ్రులను కోరితే అది సాధ్యమా! బహుశా సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఒక్క విషయం మాత్రం నిజం - కథల్లో చదివించే గుణం కూడా అరుదైంది అన్న ఆవేదన సరైందే.
దీనికి సరైన సమాధానం కథలు, కవితలు రాసే వారి నుంచే రావాలి!
లక్ష్మన్న
ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:
November 8, 2008 9:32 am
[ప్రవీణ్ గారు, మీ సూచనలకు కృతజ్ఞతలు. వీటిని పరిశీలిస్తాము. — సంపాదకులు]
ఈమాట స్థాపనలో అనుకున్న కొన్ని సంగతులయినా నిజం అయినందుకు సంతోషం.
సాధించింది బాగున్నా ఇంకా సాధించాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి.
చిన్న చిన్న మార్పులు, జోడింపులతో ఈమాటని ఇంకొంచం బాగా తీర్చిదిద్దవచ్చేమో.
రీచ్: చక్కగా ఎన్నో ఫార్మాట్ లలో లభ్యమవుతున్న ఈమాటని అందరికీ రీచ్ అయ్యేలా కొద్ది కాలం పాటు ఒక న్యూస్ లెటర్ లాగా అందించవచ్చు. ఎలాగూ పీడీఎఫ్ ఫార్మాటు ఉంది కాబట్టి ఒక మెయిలింగు లిస్టు సృష్టించి దానిని జతచేసి ప్రతీ నెలా పంపించవచ్చు.
సంభాషణలకు వీలు: వ్యాసాలు, కథలకు ఈమాట ఇంటర్ఫేసు బాగున్నా సంభాషణలకు అంత వీలుగా లేదని నాకు అప్పుడూ అనిపిస్తుంటుంది.
చిన్న చిన్న మార్పులు చేసి ఇంటర్ఫేసుని ఇంకా చక్కగా తీర్చి దిద్దవచ్చు. ఉదా: వ్యాఖ్యలలో threading ప్రవేశపెట్టవచ్చు. ఒక చక్కని సంభాషణ కొనసాగించేలా చూడవచ్చు.
యూనీకోడు వాడకం పరంగా “ఈమాట” చాలా సంతృప్తి కలిగిస్తుంది.
ఈ మాటకి అభినందనలు.
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
November 8, 2008 11:49 am
వ్యాసాల్లో వైవిధ్యం
ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.
వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. :-) మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు - వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.
కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి - వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?
కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … - మళ్ళా అన్నీ విషయభారమైనవే!
సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.
ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.
అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.
అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,
కొడవళ్ళ హనుమంతరావు