రహదారి పాట - ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా
నటీనటులను వెతకటంలో రాయ్ కష్టాలు
పథేర్ పాంచాలి సినిమాలోని ముఖ్యపాత్రలైన “దుర్గ”, “అపు” లను వెతకటంలో రాయ్ కష్టాలు మరో దశకు చేరుకున్నాయి. (ఈ నవలని సినిమాగా తియ్యటానికి నిర్మాతలు దొరక్క పోటంతో రాయ్ కష్టాలు మొదలయ్యాయి.) ఈ చిన్న పిల్లల పాత్రలు వేసే వాళ్ళ కోసం కలకత్తా లోని స్కూళ్లన్నీ వెదికారు. కానీ, “అపు” పాత్రధారి మాత్రం దొరకలా! దిన, వార పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలవల్ల కూడా ఫలితం లేక పోయింది. రాయ్ తన మనస్సులో “అపు” పాత్రధారి ఎలా ఉండాలని అనుకున్నాడో అటువంటి కుర్రాడు దొరకలా.

అపు
సరిగ్గా తన మనసులో ఉన్న విషయాన్ని రాయ్ తన భార్య “బిజయ” కు చెప్పాడు. అనుకోకుండా ఒక రోజు బిజయకు పక్కింటి డాబా మీద ఆడుకుంటున్న కుర్రాళ్ళు కనపడ్డారు. అక్కడ కనపడ్డాడు “సుబిర్ బెనర్జి” అన్న కుర్రాడు. చూడగానే అతనే అపు అని అనిపించింది. వెంటనే రాయ్‌ని పిలిచి, “నాకు అపు దొరికాడు” అని చెప్పింది. రాయ్ కలకత్తా అంతా “అపు” కోసం గాలిస్తుంటే, “అపు” పక్కింట్లో దొరకటం యాదృఛ్చికం. అప్పటికే “దుర్గ” పాత్రకు “ఉమా దాస్ గుప్తా” ని తీసుకోటం జరిగింది.
ఈ పిల్లల తల్లిగా ” కరుణా బెనర్జీ” ని అనుకున్నారు. కరుణకు కొంత నాటకానుభవం ఉంది. కానీ, నాటకాల్లో అంత రాణింపు లేదు కరుణకి. కరుణ నాటకాల్లో కన్నా, సినిమాల్లో బాగా రాణిస్తుందని గమనించినవాడు ముందుగా రాయ్. అప్పటికే, రాయ్‌కి రంగస్థలానికి సరిపోయే నటన, సినిమాలకి కావలసిన నటనలో ఉన్న తేడాలను స్పష్టంగా గమనించినవాడు. సినిమా అన్న మాధ్యమాన్ని ఇంత తొందరగా గుర్తించడంలో రాయ్ జీనియస్ స్పష్టంగా కనపడుతుంది. ఈ సినిమాలో చెప్పుకోతగ్గ మరో పాత్ర హరిహరన్ పాత్రకు దూరపు చుట్టమైన విధవ ముసలి అక్క “ఇందిర్”. రాయ్ ఊహల ప్రకారం ఈ పాత్రకి చిల్లర దొంగతనాలు చేసే స్వభావం ఉండాలి. మళ్ళీ, మేనత్త వరసైన ఈమె, “దుర్గ”, “అపు” లకి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా అయిఉండాలి. రాయ్ స్క్రీన్ ప్లే ప్రకారం పిల్లల తల్లి “సర్బోజయ” కి “ఇందిర్” కి ఎప్పుడూ పడదు. రాయ్ ముందు “ఇందిర్” పాత్రకు ఒక పల్లెటూరు ముసలి ఆమెను ఎన్నుకుందామనుకున్నాడు. చాలా మందే ఆ పాత్రకు సరిపోతారని తోచినా, వాళ్లంతా కెమేరా ముందు నటించగలరా అన్న అనుమానం రాయ్‌కి వచ్చింది. పథేర్ పాంచాలి సినిమాకి అందరూ నటన వృత్తిగా లేనివారిని తీసుకోవాలని అనుకున్నా, “ఇందిర్” పాత్రకు నటనానుభవం ఉన్న వ్యక్తి ఎలా ఉంటుంది?

ఇందిర్, దుర్గ
రాయ్‌కి వచ్చిన ఈ ఆలోచనల ఫలితంగా ఎనభై ఏళ్ళ వయస్సున్న “చునిబాలా దేవి”ని తీసుకోటం జరిగింది. పాత్రకు తగ్గట్టు, జుట్టుని బాగా కత్తిరించుకొని, దాదాపు బోడిగుండు వేషంలో “ఇందిర్” పాత్రలో “చునిబాలా దేవి” జీవించింది.
హరిహరన్‌గా “కాను బెనర్జీ” అన్న రంగస్థల నటుడ్ని ఎన్నుకున్నాడు రాయ్. మొదటి రోజు షూటింగ్‌కి చక్కని క్రాఫుతో వచ్చిన “కాను”ని చూసి రాయ్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజుకి షూటింగ్ రద్దు చేసి, కాను జుట్టు తను ముందు చూసినప్పుడు ఎంత పొడవుందో అంత పెంచుకున్న తరవాతే షూటింగ్ మొదలని రాయ్ తీర్మానించాడు (ఈ సినిమాలోని పాత్రలన్నీ ఎటువంటి మేకప్ లేకుండా నటించారన్న విషయం, ఈ సినిమా పరిచయం ఉన్న వారికి తెలిసిందే కదా!). ముందు కొంచెం బాధ పడ్డా, కాను ఆ విషయాన్ని కలకత్తాలో తనకి తెలిసిన వారందరికి, “ఇన్నాళ్ళకి ఒక గొప్ప దర్శకుడ్ని చూసాను” అని చెప్పుకున్నాట్ట!
మరపురాని దృశ్యాలు
ఈ సినిమాలో మరపురాని దృశ్యాలున్నాయి. కొన్ని మచ్చుకి:
అది 1952 సంవత్సరం. గత రెండేళ్ళగా నిర్మాతల కోసం వెతికిన రాయ్ చివరకు కొంత సినిమా షూట్ చేసి ఇతరులకు చూపిస్తే తప్ప నిర్మాతలు దొరకరని, తన ఇన్స్యూరెన్సు కంపెనీ నుంచి కొంత డబ్బు అప్పుగా తెచ్చి మరి కొంత స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి తెచ్చి సినిమా తియ్యటం మొదలు పెట్టాడు. మొదటి సీన్‌లో పిల్లలు దుర్గ, అపు తాము మొదటి సారిగా రైలు చూసే సంబరం చిత్రీకరించాలి. దుర్గ, అపు ఒకరినొకరు ఏదో విషయంలో దెబ్బలాడుకొని ఊరి చివరనున్న పొలాల కేసి పరిగెడుతూ తలవని తలంపుగా, దూరంగా రైలు వస్తున్న శబ్దం వింటారు. తరవాత, నల్లని పొగలు చిమ్ముతూ తమ వైపే వస్తున్న రైలుని చూస్తారు. ఈ రైలు ఘట్టాన్ని రాయ్ చాలా కళాత్మకంగా తీసాడు. అయితే, మొదటి రోజు షూటింగ్‌లో ఎనిమిది సీన్లు పూర్తి చేసుకొని ఆ రోజుకి షూటింగ్ పూర్తి చేసారు. పొలాల్లో షూటింగ్ పెట్టాటానికి కారణం, అక్కడున్న పొలాల్లో ప్రత్యేకంగా కనిపించే రెల్లుపూల గడ్డి (Kaash Flowers). వీచే గాలికి అవి కదులుతుంటే తీసిన దృశ్యం చాలా అందంగా ఉంటుంది (దాదాపు నాలుగు నిమషాలు ఉండే ఈ దృశ్యాన్ని వీడియోలో ఇక్కడ చూడచ్చు). రాయ్‌కి మాత్రం సంతృప్తి కలగలా. తరువాతి ఆదివారం మరికొన్ని సీన్లు తియ్యటానికి అదే లొకేషన్‌కి వెళ్ళారు. అన్నీ బాగున్నాయి కాని, రెల్లుపూలు మాత్రం మాయం. రెల్లుపూవు వర్షాకాలం తరవాత వచ్చే రుతువుకి సంబంధించిన పువ్వని తెలుసు కానీ మరీ రెండు, మూడు రోజుల్లో మాయమయ్యే పువ్వా అని ఆశ్చర్యపోయారు.

రైలు రాక
అసలు జరిగింది ఏమిటో అక్కడి రైతులు చెప్పే వరకు రాయ్‌కి అతని బృందానికి తెలియలా. మొదటి రోజు షూటింగ్ అయిన తరవాత, పొలాల్లో మేస్తున్న పశువులు వచ్చి ఆ రెల్లు పువ్వుల్ని, పొదల్ని తిని పారేసాయి. అక్షరాలా రాయ్ ఊహించుకున్న సీనరీని పశువులు నమిలి పారేసాయి. ఇంకో చోట ఇదే సీన్ మళ్ళీ తీద్దామంటే, మంచి రెల్లు పువ్వులున్న పొలాలు దగ్గర్లో లేవు. రెండేళ్ళ తరవాత, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతగా మళ్ళీ అదే లొకేషన్‌లో, అదే నటీనటులు, సాంకేతిక వర్గంతో షూటింగ్ పూర్తి చేసారు.
అతి ఉత్సాహంతో ఈ సినిమాను చూసిన విమర్శకులు కూడా ఈ సినిమాలో కెమేరా పనితనం పూర్తిగా గమనించలేదు. అర్లీన్ క్రోస్ ఫిలం కల్చర్‌లో రాస్తూ - “రాయ్ కెమేరా ద్వారా చూపించిన భావ ప్రకటన అద్భుతమైనది. ఉదాహరణకు చనిపొబోతున్న దుర్గను సాకుతున్న తల్లి ఆ తుఫాను రాత్రి చీకట్లో చూపించిన దృశ్యాలు అతి తక్కువ లైటులో నెమ్మదిగా కదిలే కెమేరాతో ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించాడు. అలాంటి దృశ్యాలు తీయటం సామాన్యమైన విషయం కాదు!”
మరొక దృశ్యం, వర్షం చిత్రీకరణ గురించి. భారత దేశంలో వర్షాకాలం గొప్ప అనుభూతుల్ని ఇవ్వగలదు. అప్పటిదాకా మాడ్చిన ఎండల తరవాత వచ్చే వర్షాలు అందరికీ ఉపశమనాన్ని ఇస్తాయి. రాయ్ ఈ సినిమాలో వర్షాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తాడు. నెమ్మదిగా గాలిలా మొదలై, ఆ గాలికి చెరువులోని అలలు నెమ్మదిగా కదలటం, చెరువులోని తామరాకులు గాలికి పైకి లేచి ఊగటం, ఆ తరవాత నెమ్మదిగా ఒక్కొక్క చినుకులా ప్రారంభమైన వర్షం, చెరువు గట్టున కూర్చున్న ఒక వ్యక్తి బట్టతలపై వర్షపు చినుకు పడటం, బోడిగుండును తడుముకొని వర్షం పడబోతోందని ఆ వ్యక్తి నిర్ధారించుకోటం, దట్టమైన నల్లని కారు మబ్బులు కమ్ముకోటం - ఇలా వర్షం వచ్చేముందు సూచనలన్నీ అద్భుతమైన దృశ్యంగా, ఎటువంటి వ్యక్తులు, సంభాషణల ప్రమేయం లేకుండా చిత్రీకరించాడు రాయ్. వర్షం పెద్దదిగా మారిన తరవాత నేల మీద పడ్డ చినుకులు అన్నీ కలిసి అది ఒక చిన్న ప్రవాహమై, రానురాను ఒక పెద్ద ప్రవాహంగా మారటం, అంత వర్షంలో పెద్ద పెద్ద చెట్లు గాలికి అటూ, ఇటూ ఊగటం - మనమే వర్షంలో ఉన్నామా అన్న భ్రాంతి కలుగుతుంది. ఇంత వర్షంలో దుర్గ పొందే పరవశత్వం చూసి తీరవలసిందే!
సంగీతం
తనకున్న బిజీ స్కెడ్యూలు వల్ల సంగీత దర్శకుడిగా పండిట్ రవిశంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని మొత్తం పదకొడు గంటల్లో పూర్తి చేసాడు. ఒక రోజు సాయంత్రం మెదలు పెట్టి, మరునాడు ఉదయం తెల్లవారు ఝామున నాలుగు గంటలకు పూర్తి చేసాడు. అప్పటికి పూర్తి అయిన కాస్త సినిమాని చూసి రవిశంకర్ చాలా మెచ్చుకున్నాడుట. ఈ సినిమాలో రవిశంకర్ సితార్ పై రెండు ట్యూన్‌లు కట్టాడు. ఒకటి దేష్ రాగంలో. ఇది వర్షాన్ని చూపించే సందర్భంలో ఉపయోగించారు. రెండవది తోడి రాగంలో. తుఫాను రోజు రాత్రి దుర్గ చనిపోయిన విషాదంలో తోడిని ఉపయోగించారు.
పథేర్ పాంచాలి సినిమా మొదలవుతూ వేణువు మీద ఒక చిన్న సిగ్నేచర్ ట్యూన్‌లా సంగీతం వినపడుతుంది. సినిమా అంతా అప్పుడప్పుడు ఇలా ఈ ట్యూన్ వినపడుతూ ఉంటుంది. పైన ఉదహరించిన అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు బాక్ గ్రౌండులో వినపడే సంగీతం కూడా చూస్తున్న దృశ్యంతో కలిసిపోతుంది.
మానవతా దృక్పథం
ఈ సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ కటిక పేదరికం అనుభవిస్తూ ఉంటాయి. అంత పేదరికంలో కూడా జీవితంలోని చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఆనందం పడటం మనం చూస్తాం. నిజ జీవితంలో అటువంటి కుటుంబాలని ప్రత్యక్షంగా చూసినవారికి, జీవితంలో డబ్బు లేకపోయినా తీర్చుకో కలిగే సుఖాలున్నాయని తెలుస్తుంది. చిన్నతనంలో జామకాయలు దొంగతనం చెయ్యటం, కొంచెం పెద్దయ్యాక నెక్‌లెస్ దొంగిలించటం లాంటి పనులు దుర్గ చేసినా, అవి చిన్నప్పడు చేసిన చిలిపి పనుల కిందా లేకపోతే పేదరికం వల్ల ఏర్పడిన చర్యలగా భావించవచ్చు! ఈ విషయాలన్నిటివల్ల, పొరుగువాళ్ళతో సర్బజయ దెబ్బలాటలకి దిగిన సందర్భాలున్నాయి. కానీ, దుర్గ చనిపోయినపుడు (హరిహరన్ డబ్బుసంపాదనకై కొన్ని మాసాలు అప్పటికే ఇల్లు విడిచి ఉంటాడు), ఎవ్వరూ తోడులేని సర్బజయ, అపులకు ఆ పక్కవారే తోడవుతారు. కష్టాల్లో పేదవారికి, పేదవారే తోడు. నిస్సందేహంగా, పథేర్ పాంచాలి ఇలాంటి వివరాల వల్లే మానవతా దృక్పధం ఉన్న సినిమా అయ్యింది.
ప్రశంసలు
రాష్ట్రపతి బంగారు, వెండి పతకాలు, 1955. ఉత్తమ మానవతా డాక్యుమెంటరి, కాన్ 1956. ఉత్తమ డిప్లొమా, ఎడిన్‌బర్గ్ 1956. వాటికన్ ఎవార్డ్, రోమ్ 1956. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, శాన్‌ఫ్రాన్సిస్కో 1957. సెల్జ్‌నిక్ గోల్డెన్ లారెల్, బెర్లిన్ 1957. ఉత్తమ చిత్రం, వాంకోవర్ 1958. విమర్శకుల బహుమతి, శ్ట్రాట్‌ఫోర్డ్, కెనడా 1958. ఉత్తమ విదేశీ చిత్రం, న్యూయార్క్ 1959. ఉత్తమ విదేశీ చిత్రం, టోక్యో, 1966.
ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, డివిడి.
- పథేర్ పాంచాలి సినిమా డీవీడీ. సత్యజిత్ రే బాక్స్ సెట్ నుంచి.
- “The Inner Eye“, Andrew Robinson, University of California Press, 1989.
- “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971.
- “Our films their films“, Satyajit Ray, Orient Longman Limited India, 1976.
- “పథేర్ పంచాలి”, బిభూతి భూషన్ బందోపాధ్యాయ్, తెలుగు అనువాదం - మదిపట్ల సూరి, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, జూలై 2008.
- ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు కొన్ని సత్యజిత్‌రే.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి.

రచయిత విష్ణుభొట్ల లక్ష్మన్న గురించి:
పుట్టటం, పెరగటం ఆంధ్రాలో. హైదరాబాద్, విశాఖపట్టణంలో కాలేజీ చదువు, ముంబై ఐ. ఐ. టి ఇంజనీరింగ్ చదువు తరవాత టాటా ఇన్స్టిట్యూట్లో భౌతిక శాస్త్రంలో పి.హెచ్. డి. 1980 దశాబ్దంలో అమెరికా రాక. వృత్తి రీత్యా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పని చేసారు.
ఈమాట వెబ్ పత్రిక ప్రారంభకుల్లో ఒకరు. ముందుముందు తెలుగు సాహిత్యంలో ఇంటర్నెట్ కి ప్రధాన పాత్ర ఉందని గాఢంగా నమ్మే వాళ్ళలో ఒకరు. ... పూర్తిగా »
Rohiniprasad అభిప్రాయం:
November 2, 2008 9:59 am
చారిత్రాత్మకమైన సినిమా గురించిన చక్కని వ్యాసం.
సత్యజిత్ రాయ్ 1949లో ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీదర్శకుడు రెన్వార్ మన దేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట తిరిగి చాలా నేర్చుకున్నాడట. ఆ విషయాల్లో మన సినిమాలకి పనికొచ్చే నేర్పులేమిటో, పనికిరానివేమిటో కూడా ఉండి ఉంటాయి. మొత్తం మీద 1955 నాటికి రాయ్ బెంగాల్ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పథేర్ పాంచాలీ తియ్యగలిగాడు. దానితో ప్రపంచంలోని అత్యుత్తమ సినీదర్శకులలో ఒకడుగా ఆయన ప్రస్థానం మొదలైంది.
అతను మన దేశపు పేదరికాన్ని సినిమాల ద్వారా అమ్ముకుని డబ్బూ, పేరూ గడించాడన్న మన సినీప్రబుద్ధులు కూడా ఉన్నారు. అతని ప్రతి సినిమా ఒక కావ్యం అన్నవారూ ఉన్నారు.
సంగీతం గురించిన ఒక ముచ్చట. మొదట రాయ్ పథేర్ పాంచాలీ సినిమాకి ప్రసిద్ధ సితార్ విద్వాంసుడైన విలాయత్ ఖాన్ ను సంగీత దర్శకత్వం చెయ్యమని అడిగాడట. తన బంధువు ఒకావిడ అప్పుడే చనిపోవడంతో ‘మైల’లో ఉండడం వల్ల తాను ఆ పని చేపట్టలేదని విలాయత్ ఒక ఇంటర్వ్యూలో తరవాత చెప్పాడు. (జల్సాఘర్ అనే సినిమాకు తరవాత ఆయన సంగీతం అందించాడు). ఏది ఏమైనా విలాయత్ కోల్పోయిన అవకాశం రవిశంకర్ కు దక్కింది.
రవిశంకర్ సిగ్నేచర్ ట్యూన్ బెంగాలీ జానపదశైలికి సరిపోయే భటియాలీ ధున్ అని చెప్పాలి. అది మాండ్ రాగాన్ని పోలి ఉంటుంది. (సుజాతా, బందినీ తదితర సినిమాల్లో ఎస్ డి బర్మన్ పాడిన పాటలు అటువంటివే.)
ఆ తరవాత రాయ్ రవిశంకర్ చేత అపరాజిత, అపూర్ సన్సార్ , పారస్ పత్థర్ అనే సినిమాలకూ, అలీఅక్బర్ చేత దేవీ అనే సినిమాకూ సంగీతరచన చేయించాడు. అయితే తనకు కావల్సినట్టుగా ఇటువంటి పెద్దవారిచేత సంగీతం తయారుచేయించడం కష్టమనిపించి తక్కిన సినిమా లన్నింటికీ తానే ఆ పని కూడా సమర్థవంతంగా చేశాడు. రాయ్ ప్రదర్శించిన బహుముఖప్రజ్ఞల్లో సంగీతం ఒకటి మాత్రమే.
B.Ajay Prasad అభిప్రాయం:
November 2, 2008 10:36 pm
మీ వ్యాసం బావుంది. పథేర్ పాంచాలి నిజంగా ఒక కళాఖండం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో సన్నివేశం, ముగింపులో హరిహర్ భార్యని చనిపోయిన దుర్గ గురించి అడుగుతున్నప్పుడు ఆమె కూర్చున్నచోటునే దుఃఖంతో కూలబడిపోతుంది. ఇక్కడ పండిట్ రవిశంకర్ తన అసమాన ప్రతిభని చూపించాడు. దృశ్యం, శబ్దం ఏకమై ప్రేక్షకుడు వాళ్ళ దుఃఖంతో మమేకమౌతాడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అలాగే భిభూతిభూషణ్ మరొక మంచి నవల “వనవాసి”.
narusu అభిప్రాయం:
November 4, 2008 12:14 am
రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
PPRao అభిప్రాయం:
November 4, 2008 9:08 am
వ్యాసం బాగుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకుంటే పదేళ్ళుగా ఈమాట పాఠకుడిగా నాకో సందేహం. ఇదే వ్యాసాన్ని, ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా నవతరంగం డాట్ కాం అన్న వెబ్ సైట్ లో 3రోజుల క్రితం చదివాను.ఇంతకీ మొదటిగా ఎక్కడ ప్రచురితమైనట్లు? ఎందుకడుగుతున్నానంటే గతంలో republished materials పైన కాస్త వేడి చర్చ జరిగిందిక్కడ. ఒకవేళ ఇక్కడే మొదటిగా పబ్లిష్ అయినా, అదే రోజున మరో పత్రికకు పంపడం కూడా కాస్త ఆశ్చర్యం కలిగించింది. రెండవ ప్రచురణలో కొత్త విషయాలు చేర్చ/చెప్పబడివుంటే ఈ సందేహం/ప్రశ్న నాకైతే వచ్చుండేది కాదు. ఎన్నిసార్లైనా, ఎక్కడైనా పబ్లిష్ చేసుకునే హక్కు రచయితలకుండవచ్చు గాక, కానీ ఏకకాలంలో ఆ పని చేయడం ఎంతవరకు ఆమోదకరం? లేక సమంజసం? రచయితలు అన్యదా భావించరని తలుస్తాను. ఇది legal చర్చ కాదు, its a question of ethics.
Anveshi అభిప్రాయం:
November 4, 2008 9:33 am
ఇది ఎథిక్స్ గురించిన ప్రశ్న అన్నారు రావు గారు.
అయితే ఇలా రెండు చోట్లా ప్రచురించడం వల్ల జరిగే నష్టం కొంచెం వివరిస్తే బావుండేది.
నవతరంగం లో పూర్తిగా సినిమాకి సంబంధించిన సమాచారం ఉంటుంది. అ సైట్లో ఈ వ్యాసం ఉంచితే ఆ సైటు కొచ్చి ఈ సైటు కు రాని పాఠకులు చదివి ఒక మంచి సినిమా గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇందులో ఏ నష్టమూ లేదు. చివరకి ఒక మంచి సినిమా గురించి ఎక్కువ మందికి తెలియచేయడమనే రచయిత లక్ష్యమైతే అది ఇలా చేయడం వల్ల లాభదాయకమే అనుకుంటూన్నాను. ఇక్కడ ఎథిక్స్ విలువల ప్రస్తావన నాకర్థం కాలేదు.
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
November 4, 2008 9:57 am
రావు గారూ:
మీకొచ్చిన సందేహం కొంతవరకు సబబే!
అందుకు నా సమాధానం ఇది.
ఈమాట ఒక నిర్ణీత కాలానికి వెలువడే పత్రిక. ప్రతి రెండు నెలలకి మెదటి తేదీన. నవతరంగం ఎప్పుడైనా ప్రచురించే పత్రిక. దీనికి ఒక నిర్దిష్ట కాలం లేదు. ఒకప్పటి ఈమాట సంపాదకుడిగా నా ఒక ప్రత్యేక లక్ష్యం ఈమాటే!
నేను కొన్ని నెలల క్రితం ఈమాటలో రాసిన రషోమాన్ (జాపనీస్ సినిమా)లో కొంత భాగం (నా అనుమతి లేకుండా) నవతరంగంలో పెట్టి, నా వ్యాసానికి ఈమాట లింకులిచ్చారు. అది చూసి నేను బాధపడలేదు. మరి కొంతమందికి తెలుస్తుంది కదా అనుకొన్నా! ఆ తరవాత నేను నవతరంగంలో సభ్యుడనై, ఈమాటలో ప్రచురించని వ్యాసాలు రాసా.
ఈ మధ్య నా కొచ్చిన ఆలోచనల్తో, రాయ్ సినిమాలొ “ఈమాట” పాఠకులకి పరిచయం చేద్దామనుకొని, వ్యాసాలు రాస్తూ, అవి ఈమాటలో ప్రచురించిన తరవాత నవతరంగంలో పెట్టటానికి నవతరంగం మోడరేటరుకి ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగి, లేదని తెలిసిన తరువాత ఈమాటలో ప్రచురితమైన తరవాత నవతరంగంలో ప్రచురించమని కోరుతూ (తేదీ ఎప్పుడో ఎవరికీ తెలియదు), ఈమాట కి రెఫెరెంస్ కోరాను. అది కపడక పోతే, నేనే ఆ విషయం చెప్పాను. ఉదాహరణకి ఈ క్రింది ఈరోజు నా అభిప్రాయం నవతరంగంలో చూడండి. అలాగే చారులత పై నా వ్యాసం, ఈమాటలో ప్రచురించిన తరవాతలోనవతరంగంలో ప్రచురించి, ఈమాట గురించి రెఫెరెన్స్ లేకపోతే, అది నేనే ఇచ్చా!
*****************************************************
నవతరంగం మిత్రులకి:
నేను సినిమాల పై రాసే వ్యాసాలు ముందుగా,”ఈమాట” వెబ్‌మాగజీన్ (www.eemaaTa.com) లో ప్రచురిస్తున్నాను. అనేక విషయాలపై ఈమాట వెబ్ పత్రిక నడుపుతున్న విషయం చాలా మంది నవతరంగం మిత్రులకి తెలిసే ఉంటుంది.
అయితే, ఇక్కడ ప్రత్యేకంగా సినిమాల పైనే దృష్టి కాబట్టి, ఇక్కడ కూడా ప్రచురించటం జరిగింది. ఇది పునఃప్రచురణ అయినా, ఎక్కువ మంది పాఠకుల దృష్టికి ఈ వ్యాసాలు తీసుకెళ్ళటం తప్ప మరే ఉద్దేశ్యమూ లేదు.
లక్ష్మన్న
*******************************************************
ఇక్కడ కొన్ని చిక్కు ప్రశ్నలున్నాయని నా అభిప్రాయం.
అంతకు ముందు ప్రచురించిన రచనలని ఈమాట ప్రచురించదని నాకు, ఒకప్పటి సంపాదకుడిగా, తెలుసు. ఒక సారి ప్రచురించాకా, ఈమాట తన హక్కును కొల్పోతుందా? అది పునఃప్రచురింపబడితే, అందులో రచయిత బాధ్యత, ప్రచురణ కర్తల బాధ్యత ఏమిటి? ఇందులో స్వలాభం ఎవరికైనా, ఎంతైనా ఉందా?ఇవి ఆలోచించ వలసిన విషయాలు.
ఇందుకై పాఠకుల అభిప్రాయం తెలుసుకోటం మంచిది.
అందరికీ నమస్సులతో,
లక్ష్మన్న
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
November 4, 2008 11:08 am
PP Rao గారూ,
మంచి ప్రశ్న వేసారు. నాకో సందేహం.
విలువలు / Ethics కేవలం రచయితలకే సంబంధించిన విషయమా? సంపాదకులకది వర్తించదా? ఎందుకిలా అడుగుతున్నానంటే, గతంలో ఒక వెబ్ పత్రికలో వచ్చిన కొన్ని కథలూ, వ్యాసాలూ ఇంకో పుస్తకంలో రచయితల ఆమోదమం లేకుండా వేసేసారు. ఆ పుస్తకాలు అమ్మకానికీ పెట్టారు.
గతంలో నేనొక పత్రికకి కాలమ్ రాసేవాణ్ణి. నాకు ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే ఓ రెండు రోజులుంచి, ఆ మర్నాడు తీసేసారు. గట్టిగా అడిగితే మళ్ళీ పెట్టారు. అందుకే చాలా పత్రికలు హామీ పత్రం తీసుకుంటాయి. అది పాటిస్తే సంపాదకులకీ, రచయితలకీ ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం, ఏ పత్రికయినా రచయితలకి పారితోషికం చెల్లిస్తున్నారా? అదుంటే పత్రిక వాళ్ళు అడగడంలో అర్థం ఉంది. ఎదో ఒక వెబ్ పత్రిక పెట్టుకొని అందులో వచ్చే వ్యాసాలూ, కథలూ వేరే చోట ప్రచురణ కాకూడదని ఆ పత్రిక వారికనిపిస్తే అది చెప్పాలి. గతంలో ఈ మాటలో వచ్చిన కథలు కొన్ని ఆంధ్రజ్యోతిలోనూ, విపుల లోనూ వచ్చాయి. అలాగే అమెరికాలో అనేక సావనీర్లలో కథలు తిరిగి ప్రచురించబడుతున్నాయి. ప్రస్తుత సాహితీ రంగంలో Ethics నిర్వచనాలు ఎవరికి తగ్గట్లు వాళ్ళు చెప్తున్నారు. అంతే!
ఇందులో రచయితల్ని Ethics అంటూ నిలదీయడం ఎంత వరకు సబబు? Ethics అందరికీ వర్తిస్తాయి కదా?
mOhana అభిప్రాయం:
November 4, 2008 11:45 am
నాకు తోచిన రెండు నయాపైసలు!
విజ్ఞానశాస్త్ర పత్రికలలో రచనలను ప్రచురించడానికి ముందు పత్రికకు రచయిత కాపీరైటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈమాట వంటి పత్రికలకు రచయితలు అలా కాపీరైటు అందివ్వడం
లేదు. ఐనా కూడా రచయిత మళ్ళీ తన రచనను మరో చోట ప్రచురిస్తే అక్కడ మొట్ట మొదట ఆ రచన ఈమాటలో ప్రచురించబడినది అని తప్పక చెప్పాలి. ఆ రచనను తన
ఒక పుస్తకంలో భాగంగా ఉంచినా ఈ విషయాన్ని విదితం చేయాలి. ఈ రెండు సమయాలలో ఈమాట పత్రికకు అలా చేస్తున్నానని తెలియబరచాలి. ఇలా చేస్తే ఈమాట హక్కుదారులు, సంపాదకులు తప్పక అంగీకరిస్తారనే అనుకొంటాను. అలా చేయకపోతే అంత బాగుండదని నా అభిప్రాయం. విధేయుడు - మోహన
సగటు జీవి అభిప్రాయం:
November 4, 2008 9:02 pm
నాకేం అనిపిస్తుందంటే, ఇదంతా తరాల మధ్య అంతరాలనిపిస్తుంది. ఈమాటలో ఈతరం వాళ్ళు తక్కువ. పత్రికలోని వ్యాసాలు కాచి వడబోసిన టీలాగా ఉండాలని అనుకుంటూన్నారు. తప్పేం లేదు. కానీ ఈ రోజుల్లో తెలుగు పత్రిక చదివేవాడ తక్కువైపోతుంటే ఇప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుందనిపిస్తుంది.
ఇక నవతరంగం లో అంతా ఈ తరం వాళ్ళే.అక్కడ కాచి వడపోత లేదు. అంతా ఇన్స్టెంట్ టీ బ్యాగ్ టైపు. ఫట్ మని రాస్తారు. ఫట్ మని పబ్లిష్ చేస్తారు.ఒక విధంగా ఇది లాభం మరో విధంగా నష్టం. లాభమేంటంటే మరీ గొప్పగా రాయలేని వాళ్ళు సైతం రాసే అవకాశం పొందుతారు. అలాగే కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నష్టమేంటంటే క్వాలిటీ. న.త లో వచ్చే అన్ని వ్యాసాలూ ఒకే నాణ్యత కలిగివుండవు.
శాయి అభిప్రాయం:
November 4, 2008 11:02 pm
“అన్వేషి”గారు “అ సైట్లో ఈ వ్యాసం ఉంచితే … ఇందులో ఏ నష్టమూ లేదు. … అది ఇలా చేయడం వల్ల లాభదాయకమే అనుకుంటూన్నాను.” అన్నారు.
ఆ లాభం రెండో చోట లింక్ ఇస్తే రాదా? పూర్తి వ్యాసం మళ్ళీ ప్రచురిస్తేనే వస్తుందా?
Anveshi అభిప్రాయం:
November 5, 2008 3:56 am
శాయి.గారూ”…పూర్తి వ్యాసం మళ్ళీ ప్రచురిస్తేనే వస్తుందా?” అంటే అవుననే నా అభిప్రాయం. లింక్ ఇస్తే కూడా లాభమే. కాకపోతే మళ్ళీ ప్రచురిస్తే ఎక్కువ లాభం అని నా అభిప్రాయం.
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
November 5, 2008 6:45 am
రాసిన వ్యాసం లోని వివరాలపై మరింత చర్చ జరిగి ఉంటే వ్యాసకర్తగా ఇంకా సంతోషించేవాడిని.
రోహిణీప్రసాద్ గారూ: పథేర్ పాంచాలిలో వాడిన సిగ్నేచర్ ట్యూన్ “భటియాలీ ధున్” అని తెలిపినందుకు సంతోషం. నాకు మాండ్ రాగం పరిచయం కానీ, ఈ ధున్ మీ నుంచి తెలుసుకోవాలి.
అజయ్ ప్రసాద్ గారూ: మీరు ఉదహరించిన దృశ్యం గురించి కూడా రాద్దామనుకున్నా! “గ్రంధ విస్తరభీతి” వల్ల రాయలేదు. మీరు రాసింది నిజం.
నరసు గారూ: వ్యాసం నచ్చినందుకు సంతోషం. నిజమే. ఈ సినిమా ఒక్కసారి చూసినంతనే అన్నీ అర్ధం అవ్వవు. ఈ వ్యాసం రాయటానికి చాలా పుస్తకాలు చదవాల్సి వచ్చింది. చాలా మందితో కూడా మాట్లాడవలసి వచ్చింది. ముఖ్యంగా, 115 నిమషాలు నిడివున్న ఈ సినిమాను చాలాసార్లు చూడవలసి వచ్చింది.
నా రాతలను అందంగా ఎడిట్ చేసి, సరైన చోట్ల ఇచ్చిన చిత్రాలు వాడినందుకు, సంపాదక వర్గానికి కృతజ్ఞలతో,
లక్ష్మన్న
Rohiniprasad అభిప్రాయం:
November 5, 2008 1:48 pm
ఇది రవిశంకర్ స్వయంగా సితార్ మీద వాయించిన సిగ్నేచర్ ట్యూన్ తో మొదలవుతుంది.
“సున్ మేరే బంధూరే” అనే బర్మన్ పాట.
“మేరే సాజన్” అనే బర్మన్ పాట.
అన్నీ భటియాలీ ధున్ ను పోలినవే.
రమణ అభిప్రాయం:
November 13, 2008 2:08 pm
రిత్విక్ ఘటక్ ఒక ఇంటర్వూలో (ఈ పేజిలో పన్నెండవ ప్రశ్శకి సమాధానంలో) పథేర్ పాంచాలీ నేపథ్య సంగీతాన్ని మెచ్చుకుంటూ థీమ్ మ్యూజిక్ కి స్పూర్తి నల్ల అమెరికన్ల జానపద పాట అంటాడు -
“I enjoyed Pather Panchali’s music a lot, but the theme music Ravi Shankar copied from a black American folk song named Swan’s River.”
http://dipanjanc.blogspot.com/2007/06/interview-with-ritwik-kumar-ghatak-1975.html
- రమణ