సార్ గారండీ… సార్ గారండీ…
శరీరం మీంచి బాల్యం అదృశ్యమౌతుంది.
దేహంపై యవ్వనం నూనూగుగా మొలకెత్తుతుంది.
దాని గొంతుక వింతైన జీరతో
“సార్ గారండీ, సార్ గారండీ” అంటుంది.
ఆ మాధుర్యానికి ఒక జీవితాన్ని అర్పించుకోవచ్చు.
ఆ అభిమానానికి ఒక హృదయాన్ని అంకితమీయచ్చు.
వాడు నిర్మించుకొనే వ్యక్తిత్వ హర్మ్యానికి
మేలిమి ఇటుకలను ఎంచి వాడికందిస్తాను.
వాని ఆలోచనల చురకత్తులు
పదును పెట్టుకోవటానికై
నా మెదడును సానరాయి ని చేస్తాను.
పరస్పర వైరుధ్యాల అరణ్యంలో
వాడు దారి తప్పి కునారిల్లినపుడు
నా అనుభవాల్ని దిక్సూచిగా చేసి బహూకరిస్తాను.
రసాయనోద్రేకాల ప్రళయ కాలంలో
అయితే కుంభవృష్టి లేకపోతే చండ్రగాడ్పులు
తప్ప మధ్యస్థమెరుగని వాడి మనసుకు
ఉదయ లేకిరణాల్ని వేసవి సాయంకాలాల్ని,
మంచుసోనల్ని, వెన్నెలరాత్రుల్నీ
పరిచయం చేస్తాను.
ఒక తరం తన నడతను ప్రసవించుకొనే వేళ
నేను మంత్రసాని నౌతాను.
ఈ దేహం కలిసిపోయే లోపు
ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి,
“బాగున్నారా మాష్టారూ” అంటాడు.
అంతకుమించింకేం కావాలీ జీవితానికి.
Subrahmanyam Mula అభిప్రాయం:
November 1, 2008 11:09 pm
చాలా బావుందండీ!
రాధిక అభిప్రాయం:
November 3, 2008 1:55 am
కవిత బాగుంది.
“హృదయాన్ని అంకితమీయచ్చు” కి బదులు “హృదయానికి అంకితమీయచ్చు” అని ప్రచురింపబడినట్లుంది!?
bollojubaba అభిప్రాయం:
November 3, 2008 7:32 am
రాధిక గారికి
ధన్యవాదములండి. మీ కరక్షన్ కరక్టేనండి. ఆ టైపాటు నాదే
బొల్లోజు బాబా
[తప్పు సరిదిద్దాము. క్షమాపణలతో - సం.]
ప్రజాపతి అభిప్రాయం:
November 3, 2008 3:49 pm
అద్భుతంగా ఉంది.చక్కటి చిక్కటి కవిత్వం. పదచిత్రాలు, అన్వయం, మనసుని కదిలించే ముగింపు.చాలా రోజుల తర్వాత మళ్ళీమళ్ళీ చదివించిన కవిత.
ఈ దేహం కలిసిపోయే లోపు
ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి,
“బాగున్నారా మాష్టారూ” అంటాడు.
అంతకుమించింకేం కావాలీ జీవితానికి.
హేట్సాఫ్.
ఏకాంతపు దిలీప్ అభిప్రాయం:
November 3, 2008 10:09 pm
బాబా గారు,
చాలా బాగుంది… నేనూ ఇంతకుముందు ఒకసారి అన్నాను, మీరు మార్పుని అర్ధం చేసుకుంటారని, ఆహ్వానిస్తారని… తరాల మధ్య అంతరాలని అర్ధంచేసుకోగలరని… మనం కలుస్తాము ఎప్పుడైనా…
Phani అభిప్రాయం:
November 5, 2008 7:32 am
చాలా బాగుంది.
ప్రతాప్ అభిప్రాయం:
November 5, 2008 9:43 pm
అవును అంతకంటే జీవితానికి ఏం కావాలి?
రాఘవ అభిప్రాయం:
November 14, 2008 1:25 am
ఆహా అనిపించింది! అభినందనలూ అభివందనములూ!
bharath అభిప్రాయం:
November 28, 2008 2:15 am
బాబాగారూ, మీకవిత చాలా బాగుందండీ. ముఖ్యంగా పైన పేర్కొన్న వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది.