పందిరిదోసకాయ పచ్చిది తిన్నప్పటిలా ప్రారంభంలో ఆకర్షణీయంగా ఉండి, ఆఖరికి ఒక మోస్తరుగా ఆహ్లాదం కలిగించే కవిత.
మా పెద్దబ్బాయి ఇంటి[1]వి. ఆర్. విద్యార్థి ఖండాంతర కవిత్వం అనే సంకలనం నుంచి – సమాంతరం అన్న కవిత
బ్యాక్ యార్డు లో
నివాసముంటుందొక
సింధూర వృక్షం.
నేనీ ఊరొచ్చిన ప్రతిసారీ అది
చిరునవ్వుతో స్వాగతిస్తుంది
ఇష్ట పూర్తిగా ముచ్చటిస్తుంది
అచ్చం కోహినూరు వజ్రాకారంలో
వెనుకటి మా ఉస్మాన్ నవాబు
శిరోభూషణంలా
రూపించే ఈ చెట్టు (ఈ పాదాలు కత్తిరించెయ్యవచ్చు)
ఏడాదిలో సగం రోజులు
పనీపాటా లేని ఇల్లాలిలా
నిండుగా నిగనిగ లాడుతుంటుంది.
సగంరోజులు యోగాభ్యాసం చేసే తరుణిలా
చిక్కిపోయినా మెరుస్తుంటుంది. …
…….
అక్టోబర్లో ఇది
కుంకుమ కొండ
నవంబరొస్తే
పసుపు రాసి
డిశంబర్ నుండి మార్చి దాకా
నగిషీల వెండిరేకులతో మలచిన
ఒక మహా కలశం…
……
బతుకు ప్రవాహంలో
కొట్టుకొపోతూ
తనకు తానే అపరిచితమైపోతున్న
ఈ ఊళ్ళో
నన్నెరిగిన ఒకే ఒక్క మనిషి
ఈ చెట్టు
నా ఎన్నో నిద్రారహిత రాత్రులకు
ప్రత్యక్షసాక్షి.
ఈ కవికి ఒక ఎజ్రా పౌండ్ అవసరం చాలా ఉన్నది! కొన్నిభాగాలు కత్తిరిస్తే, మంచి జ్ఞాపకాల చెట్టు కవిత. అలా కత్తిరించకపోతే, శాలడ్‌లో పచ్చిదోసకాయ ముక్కలు ఎక్కువైతే వచ్చే త్రేణుపు జ్ఞాపకానికొస్తుంది! ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘త్రాపుష’.
ఈ తరహా కవితకి ప్రారంభంలో ఎక్కువ ఆకర్షణ ఉండదు. త్వరగానే తుదిలో చాలా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఈ కవిత చూడండి.
కొన్ని ఏండ్ల కింద[2]నారాయణ స్వామి సందుక సంకలనం నుంచి – చిన్నారిమొక్క అనే కవిత
కొత్తగా విమానమెక్కి
సముద్రాన్ని దాటేటప్పుడు
తోడుగా ఉండేందుకు
చిన్న చెయ్యి సంచిలో
ఒక చిన్నారి పూల మొక్కనూ
ఒక సీతాకోకచిలుకనూ
వెంబడి తెచ్చుకున్నా.
మట్టి వేళ్ళతో ఆపేక్షల తడినీ
పచ్చని ఆకుల్లో పిల్లగాలుల హొయలునీ
మెత్తని సీతాకోకచిలుక రెక్కల్లో
యవ్వనపు గరుకుదనాన్నీ
పూలరెమ్మల ఎరపుదనంలో
మావూరి విశ్వాసాన్నీ
వెంట తెచ్చుకున్నా.
నాతోటి దేశాలు దాటివచ్చిన
మావూరి మొక్కను ఎక్కడ నాటాలో తెలియక
నాలోనే తలకిందులుగా
నాటుకున్నా.
తలలోంచి బయటకు పెరిగిన
వేళ్ళు
భూమినీ ఆకాశాన్నీ
ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. …
ఇంక ఇప్పుడు
సన్నగిల్లుతున్న నమ్మకాలకు
ధీముగా
ప్రపంచమంతా
మా వూళ్ళను నాటచ్చు.
నాలో నేనే తలకిందుగా నాటుకున్నా అని వినంగానే, ఊర్థ్వమూల మథ శ్శాఖః అని ప్రారంభమయ్యే భగవద్గీతలో శ్లోకం నాకు గుర్తుకొస్తున్నది!
ఊర్థ్వమూలమథశ్శాఖః అశ్వత్థం ప్రాహరవ్యయం
చందాంసి యస్య పర్ణాని వేదం విత్త స వేదవిత్.
నాకు వచ్చిన జ్ఞాపకాలే అందరికీ రావాలని అనటంలేదు. పై పద్యంలో మొదటి మూడు చరణాలూ చాలా మందికి అనేకమైన స్మృతులను వెలికి తెస్తాయి. ఈ పద్యం రాజశేఖరుడు చెప్పిన ‘మృద్వీకా’ కి ఒక మచ్చుక.
మొట్ట మొదట్లో ఒకింత స్వాదువుగా ఉండి, ఆఖరికి చాలా ఆహ్లాద కరంగా ఉండే కవిత, మామిడి పండు తినడం లాంటి అనుభవాన్ని ఇస్తుంది. దీనికి ఉదాహరణగా:
దారి తప్పిన ఒక జ్ఞాపకాన్ని[3]విన్నకోట రవిశంకర్ వేసవి వాన అన్న సంకలనం నుంచి, పోలికలు అన్న కవిత
ఈ పసి పిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది.
గతకాలపు చీకటి గదిలో
పారేసుకున్న ఒక విలువైన అనుభవాన్ని
అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది.
ఎన్నాళ్ళ క్రితమో బూడిదగా మారి
నీళ్ళలో కలిసి పోయిన వాళ్ళు
దీని పాల బుగ్గల్లోంచి మళ్ళీ పలకరించారు.
పటాలుగా మారి, కాలంలో
ఒకచోట నిలిచి పోయిన వాళ్ళు,
దీని పసి కళ్ళల్లో సజీవంగా కదిలారు.
ఎంతమంది గతించిన వాళ్ళ ఆనవాళ్ళని
అంత చిన్ని శరీరంలో దొంతర్లు దొంతర్లుగా దాచిందో!
ఇది వాళ్ళందరూ ప్రేమతో సంతకాలు చేసి పంపిన
బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగా ఉంది.
వివరణకందని దీని పెదవులమీది చిరునవ్వు
తమకు లభించిన ఈ కొనసాగింపుకి
వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు. (ఈ పాదాలు తీసేస్తే ఈ కవిత గొప్పకవిత అవుతుందని నా అభిప్రాయం!)
మూసిన దీని గుప్పిట్లో దాచి ఉంచింది
విప్పిచెప్పలేని వాళ్ళ సందేశం కావచ్చు.
ఈ పద్యం చదివిన తరువాత నా స్వానుభవంలో రకరకాల జ్ఞాపకాలు వచ్చాయి. అవి కాక, తిరిగి గుర్తుకొచ్చిన ముఖ్యమైన జ్ఞాపకం చదివిన పుస్తకం నుంచి మిగిలిన జ్ఞాపకం. ఆ వచ్చిన కొన్ని స్మృతుల్లో (తిరిగి గుర్తుకొచ్చిన జ్ఞాపకం!) ముఖ్యమైనది, శ్రీ కృష్ణ కర్ణామృతం లోని ఈ క్రింది శ్లోకం:
రామో నామ బభూవ హుం, తదబలా సీతేతి, హుం, తంపితు
ర్వాచా పంచవటీతటే విహరత స్త స్యాహర ద్రావణః
నిద్రార్థం జననీ కథా మితి హరే ర్హుంకారతః శ్రుణ్వతః
సౌమిత్రే! క్వ ధను ర్ధను ర్ధను రితి వ్యగ్రాగిరః పాంతునః
“అనగా అనగా రాముడనే వాడొకడున్నాడు. ఆయన భార్య సీత. తండ్రి మాటచేత పంచవటి అను గోదావరి ఒడ్డున విహరించుచుండగా ఆ రాముని భార్య సీతను రావణుడు ఎత్తుకొని పోయాడు”. ఈ రీతిగా తనని నిద్ర పుచ్చడం కోసం తల్లి యశోద చెప్పుతూ ఉన్న కథకు ‘ఊ’ కొడుతూ వింటున్న శ్రీహరి (చిన్ని కృష్ణుడు) యొక్క “సౌమిత్రీ! ఎక్కడ ధనస్సు, ధనస్సు, ధనస్సు ” అనెడి తొట్రుపడుతూ అన్న మాటలు మమ్ము కాపాడు గాక! అని అర్ధం.
ఇక్కడ జ్ఞాపకం పూర్వ జన్మ లో జ్ఞాపకం! కృష్ణుడు పూర్వజన్మలో రాముడే కదా! ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘సహకార’.
ఆఖరుగా, కొబ్బరి తింటే వచ్చే అనుభూతి లాగా ప్రారంభం నుండీ, అంతమయ్యే వరకూ ఆహ్లాదం కలిగించే కవిత్వం. ఈ మధ్య కాలంలో నా అనుభవంలో ఇలాంటి కవితలు బహుకొద్దిగానే వచ్చాయని చెప్పగలను. ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్నవాటి నుంచి మచ్చుకి ఈ రెండు కవితలు.
రెక్కలు విప్పుకున్న దూదికొండల్లో [4]కన్నెగంటి చంద్ర వాన వెలిసిన సాయంత్రం అన్న సంకలనం నుంచి – మబ్బుల్లో బొమ్మలు అనే కవిత
చెట్లూ, ఏనుగులూ, కొండచిలవలూ ఇంక ఏవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటికిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకండా
రెక్కలాడిస్తూపోతున్న పిట్టలూ –
ఆకాశానికి రంగురంగుల నిప్పంటుకుంది
మబ్బులు కాస్త రంగు పుంజుకొని
సాయంత్రపు షికారుకు బయల్దేరతాయి
ఎంత కొత్తగా రంగులద్దుకున్నా
బొమ్మ బాగా కుదర్లేదని
ఇంకో పడమటి పొద్దుని
చెరిపేస్తుంది రాత్రి
చీకటితెరలు దించేస్తూ.
ఆరుబయట వెలకింతలా పడుకొని
మిలమిలమెరిసే చుక్కలని
చూపుడివేలి గీతలతో కలిపితే
బొమ్మలే బొమ్మలు కలల్లోకి జారుతూ –
నడిరాత్రి ఆకాశంలో పెళ్ళవుతుంది
మెరుపులదండలూ, వురుములమేళాలూ –
మంచాలు హడావుడిగా వరండాల్లో ఇరుక్కుంటాయి
ఇప్పుడు నీడకోసమో, వాన కోసమో వెతికేకళ్ళకు
మబ్బుల్లో బొమ్మలు కనపడవు
వెలుతురు కోసమే వేచే వాళ్ళకు
చుక్కల మిణుగురులు అక్కర లేదు.
ఇది అందరికీ వచ్చే పాత జ్ఞాపకం! ఈ కవిత పాత జ్ఞాపకాల పుట్ట. కదా!
అధస్సూచికలు
| ↩1 | వి. ఆర్. విద్యార్థి ఖండాంతర కవిత్వం అనే సంకలనం నుంచి – సమాంతరం అన్న కవిత |
|---|---|
| ↩2 | నారాయణ స్వామి సందుక సంకలనం నుంచి – చిన్నారిమొక్క అనే కవిత |
| ↩3 | విన్నకోట రవిశంకర్ వేసవి వాన అన్న సంకలనం నుంచి, పోలికలు అన్న కవిత |
| ↩4 | కన్నెగంటి చంద్ర వాన వెలిసిన సాయంత్రం అన్న సంకలనం నుంచి – మబ్బుల్లో బొమ్మలు అనే కవిత |