నేనొక సాధారణ పాఠకుణ్ణి

వక్కపొడి లాగా మొట్ట మొదట్లో చాలా ఆకర్షకంగా ఉండి, చివరలో చప్పగా ఉండే కవిత ఇంకో రకం. ఉగ్ర వామ పక్షీయుల్లో చాలామంది గత 25 ఏళ్ళుగా వ్రాసిన చాలా కవితలు ఈ కోవకే చెందుతాయి.

ఒక రకమైన కవిత చప్పగా మొదలై, చప్పగా ముగుస్తుంది. దీనికి ఉదాహరణలు కోకొల్లలు. బాగా చల్లారిపోయిన చికెన్‌ సూప్‌ లో పదేళ్ళ క్రితం కొన్న మిరియాల పొడి వేసిన రుచి జ్ఞాపకం వస్తుంది, ఈ కవితలు వింటే.

ఆథునిక బృహత్కవితలు చదవడమంటే కొంచెం భయం వేస్తుంది. పొడుగ్గా సాగే వచన పద్యం వంద పేజీలుంటే, ఒకటి: ఏకబిగిన చదవడం కష్టం, రెండు: చదివింది అర్థం చేసుకోవడం అంతకన్నా కష్టం. ఓపికచేసి, మొత్తం చదివిన తరువాత, “ఇంతకీ ఈ కవి ఏమంటున్నాడు?” అన్న ధర్మసందేహం రాక మానదు.

ఉదాహరణకి, ఒక బృహత్కావ్యం[1]సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి విశ్వంభర, బృహత్కావ్యం నుంచి నుంచి మచ్చుకి కొన్ని చరణాలు వినిపిస్తా.

…. ఇంతకూ నేనెవణ్ణి ?
ఏ మింటి ఇంటి వాణ్ణి ?
ఏ కాలపు చంటి వాణ్ణి ?
వెర్రెత్తిన ఏ శక్తి
విసిరేసిన కందుకాన్ని?
ఎందుకిలా దొర్లుతున్నాను?
ఈ పొరలను ఒంటికి చుట్టుకొని
ఎందుకిలా నిలువెత్తుగా పొర్లుతున్నాను?

ఇలా కొన్ని పేజీలు సాగి పోతుంది. మొదటి నాలుగు భాగాలు ఇదే తంతు. డిటెక్టివ్ నవల ఆఖరి పేజీలు చదివేస్తే, హంతకుడెవరో తెలిసిపోతాడన్నట్టుగా ఐదవ భాగానికెళ్ళి ఆఖరి పేజీలు చదివాను.

నిన్నటి మట్టిబెడ్డలేనా
నేడు మండుతున్న స్ఫులింగాలు.
నిన్నటి గడ్డిపరకలేనా
నేడులేస్తున్న ధ్వజస్తంభాలు.
నిన్నటిమేషకంఠాలేనా
నేడుగర్జిస్తున్న కంఠీరవాలు.
నిన్నటి దూదిపింజలేనా
నేడు ప్రతిఘటిస్తున్న పర్వతాగ్రాలు
… … …

సంస్కృతికీ దుష్కృతికీ
స్వఛ్చందతకూ నిర్బంధతకూ
సమార్ద్రతకూ రౌద్రతకూ
తొలిబీజం మనస్సు
తులారూపం మనస్సు.

మనస్సుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి.
ఇదే విశ్వంభరా తత్త్వం
ఇదే అనంతజీవిత సత్యం!

అమ్మయ్య, అయిపోయిందా? అనిపించింది. అంతే కాదు; పూర్తి అవకముందే నాకొచ్చిన మరో జ్ఞాపకం ఇది: చిన్న గదిలో పదహారు లౌడ్ స్పీకర్లు పెడితే వచ్చే అర్థంకాని ప్రతిధ్వనుల కీచు, రణగొణ ధ్వని. ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘పిచుమంద’.

ఈ కింది రకం కవిత మొదట్లో కాస్త స్వాదువై ఉన్నా, చివరకి ఏ ఆకర్షణా లేకుండా పోతుంది.

నాన్న కొట్టినపుడు [2]ఎండ్లూరి సుధాకర్ నల్ల ద్రాక్ష పందిరి నుంచి – గ్రీష్మ గోదావరి అన్న కవిత
ఒకమూల ముడుచుకొని పడుకున్న అమ్మలా వుంటుంది.
ఎండాకాలపు గోదావరి
నీటికొవ్వు కరిగిపోతూ
పలచ బడుతున్న జలచర్మంతో
ఎనీమియా పేషంటులా
ఎంతో జాలి గొలుపుతుంది. …

(ఇంతవరకూ బాగానే ఉన్నది సుమా అని అనిపిస్తుంది. తరువాత ఊక దంపుడుగా సాగుతుంది. చివరకి, నలభై ఐదు లైన్ల తరువాత…)

జీవితం రుతువులుగా మారిపోయిన వాళ్ళకి
కాలంతో కాపురం చెయ్యక తప్పదు.
ఏసీ గదులూ, ఏ సౌకర్యాలూ లేని వాళ్ళకి
గోదావరి పెంపుడు తల్లయి
ప్రేమగా సేద దీరుస్తుంది.

స్నానం చేస్తూంటే షాంపూ పొరపాటున నోట్లోకి వెళ్ళిన రుచి – నా జ్ఞాపకం! ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘వార్తాక’ (వంకాయ).

వక్కపొడి లాగా మొట్ట మొదట్లో చాలా ఆకర్షకంగా ఉండి, చివరలో చప్పగా ఉండే కవిత ఇంకో రకం. ఉగ్ర వామ పక్షీయుల్లో చాలామంది గత 25 ఏళ్ళుగా వ్రాసిన చాలా కవితలు ఈ కోవకే చెందుతాయి. అందుచేత ప్రత్యేకంగా ఏ ఒక్క కవితనీ ఉదహరించడం లేదు. వీళ్ళ కవితలన్నీ రాజశేఖరుడు చెప్పిన క్రముక (పోకచెక్క) రుచినిస్తాయి.


గంగరేగి పండు తింటే ఉన్నట్లు, ముందు చప్పగా మొదలై, చివరలో కొంచెం ఆకర్షణీయంగా ఉండగలిగే కవిత ఇది. ఉదాహరణకి:

అక్షరాలన్నీ అలిగి వెళ్ళాయి[3]శివపురం శైలజ మచ్చు తునకలు సంకలనం నుంచి
నాతో సహకరించనని.
నేను చేసిన పాపమేంటో
తెల్లకాయితం కూడా తెలియదు పొమ్మంది.

కలాన్ని అడిగాను ఏమీ తెలియదని అడ్డంగా తల ఊపింది.
ఓ ప్రేమామృత ధార గా , గుండెలనిండా నిలిచే అనుభూతిగా,
ఓ యెంకి పాటగా, ఓ కృష్ణ శాస్త్రి గీతిగా,
నార్ల మాటగా నీముందు, నిలుస్తామని
మరీమరీ చెప్పి వెళ్ళాయి అక్షరాలు.

పేలవంగా పలికే చాలా భాగాలు కత్తిరిచ్చేస్తే, పరవాలేదనిపిస్తుంది. ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘బదర’.

కొన్ని కవితలు మొదట్లోనూ చివరా కాస్త ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉంటాయి. ఇవి కాస్త సంస్కరించి మెరుగు పెట్టటానికి అవకాశం ఉన్నవి.

స్నానం[4]రెంటాల కల్పన నేను కనిపించే పదం అన్న సంకలనం నుంచి – రాలిపడ్డ జ్ఞాపకాలు అన్న కవిత
దేహం మీంచి జారిపోయే నీటి బిందువులు
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది.

నువ్‌ చేసిన గాయ స్రావం రాత్రి

నీకోసం
విచ్చుకున్న పెదవి
పొగడపూల పరిమళంతో

నా నడుంగీతమీంచి
నువ్వలా నడిచి వస్తుంటావా
ఒక్క క్షణం చూద్దును కదా
అరవిరిసిన నవ్వయి
నా ఒళ్ళో ఉంటావు.

… తరువాతి వాక్యాలు రెండు తీసేసి, ఆఖరి వాక్యం,

నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రి కౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు.

నాకు తిరిగి వచ్చిన జ్ఞాపకాలు నా రహస్యాలు ! ఈ కవితతో మీ కొచ్చే జ్ఞాపకాలు ఏమిటో? ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘తింత్రిణీ’ (చింత పండు) రుచికి మంచి ఉదాహరణ.

అధస్సూచికలు

అధస్సూచికలు
1 సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి విశ్వంభర, బృహత్కావ్యం నుంచి
2 ఎండ్లూరి సుధాకర్ నల్ల ద్రాక్ష పందిరి నుంచి – గ్రీష్మ గోదావరి అన్న కవిత
3 శివపురం శైలజ మచ్చు తునకలు సంకలనం నుంచి
4 రెంటాల కల్పన నేను కనిపించే పదం అన్న సంకలనం నుంచి – రాలిపడ్డ జ్ఞాపకాలు అన్న కవిత