నేనొక సాధారణ పాఠకుణ్ణి

తిరిగి వచ్చిన జ్ఞాపకాలే కవిత్వాస్వాదనకి పరికరాలు/ సాధనాలు అన్నాను కదూ! ఈ క్రింది కవిత[1]విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం నుంచిచూడండి.

విస్తరిమీద వంగబడ వేయక మానెదరేమొ సూదకుల్
విస్తరిపైని వంగుటకు వెన్నును వంగదు పొట్టవంగదున్‌
హస్తము నడ్డముంచినను నాగక వడ్డన చేతురన్నియున్‌
గస్తిగ నట్లె తిందు రవుగాదనలేక క్రతుప్రసాదముల్.

ఇపుడె గుండిగ దింపి ఇగురుబెట్టితి
బొడిపొళ్ళాడు నీ యన్నము దినుండు
పూర్ణమ్ములేకుండ బునుకులుగా వేసితిమి
కరకరలాడు తినుడు వీని
గాలుచునున్నది గాబోలు క్షీరాన్నమిదె
దొన్నెలను దెచ్చి యిత్తు నుండు
డిది గడ్డపెరుగు మీరింక కొంచెము వేసికొనవలె
చలువ చేయును గదండి

యనుచు బతిమాలి బతిమాలి యవనినాథ
సూదకులు కొల్లలుగతెచ్చి చూఱయీయ
నన్నమును నాదరంబున దిన్నకడుపు లెన్న
నెడదలు నుబ్బిపోయెదరు జనులు.

అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు
సన్నఖర్జూరపు చాపలపై సూపరాసులు గంధమ్ము తీసినట్లు
ఎఱ్ఱవాగుగను వేయించినప్పడములు పునుగు కుంకుమ కుప్పవోసినట్లు
వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబాళింపు లత్తరుల నొల్కించినట్లు.

తెలుగు దేశంలో, పాత రోజుల్లో, అంటే కేటరింగ్ లేని రోజుల్లో పెద్ద పందిళ్ళల్లో ఐదురోజుల పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు. గాడిపొయ్యిలు తవ్వించి పెద్ద పెద్ద గుండిగలలో వంటలు చేయించేవాళ్ళు. కొన్ని వందలమందికి అప్పుడే కోసి తెప్పించిన అరిటాకుల్లో వడ్డనలు చేసే వాళ్ళు. వద్దు వద్దంటూ, చేతులడ్డంపెట్టినా, బతిమాలి బతిమాలి వడ్డించేవాళ్ళు. ఈ జ్ఞాపకాలు లేని వారికి ఈ కవితని ఆస్వాదించడం ఎంత కష్టమో ఊహించండి! కొందరికి ఇవి ఎంతో చక్కని జ్ఞాపకాలు!

మరో కవిత[2]శ్రీశ్రీ భిక్షువర్షీయసి కవిత. ఆఖరి మూడు చరణాలు – ఇది జ్ఞాపకాల పుట్టే!

“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి” దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళిపోయింది!

ఎముక ముక్క కొరుక్కుంటూ
ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ.

క్రమ్మె చిమ్మ చీకట్లూ,
దుమ్మురేగె నంతలోన.
“ఇది నా పాపం కా” దనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు.

ఎంత అందమైన ఛందస్సు! మాటల ఒద్దికలో, మాటల పేర్పుతో వచ్చిన గతి, గమకం చూడండి/వినండి. ఈ జ్ఞాపకం జాలి. ఇది సమకాలీన అనుభవం. కవి, పాఠకుడూ ఒకే అనుభూతి పొందడం. ‘కవితని చదవడం వలన నీ హృదయంలో బాహ్యవిషయ జ్ఞానం మరుగున పడి, నీ హృదయం అద్దంలా మెరుస్తుంది. అప్పుడు ఆ కవితలో వర్ణించబడ్డ విభావాదులు (determinants, stimulants) సూటిగా ఆ అద్దంలో ప్రతిఫలిస్తాయి. అప్పుడే సహృదయుడికి కావ్యగత నాయకాదులతో తన్మయత్వం కలుగుతుంది. అటువంటి వాళ్ళే సహృదయులు!’ తనని తాను మరిచిపోయి ప్రపంచాన్ని మరిచి, కవి అనుభవించిన అనుభూతి పాఠకుడు కూడా అనుభవించడం – దీనినే సాధారణీకరణం అని అంటారు.


మాటలు పేర్చడం, మాటల ఒద్దిక (పదగుంభనం) గురించి పైన చెప్పాం కదూ! శబ్దాల పేర్పుతో వచ్చే రుచి శయ్య అంటారు. దీనినే శబ్దపాకం అంటారు. ‘పూల మాల కట్టే వాడు ఏ పువ్వుతో ఏ పువ్వు జోడిస్తే బాగుంటుందో బాగా ఆలోచించి మాల కడతాడు. అలాగే కవి కూడా ఏ పదానికి ఏ పదం జోడిస్తే అర్థవంతంగా అందంగా ఉంటుందో తెలిసికొని కవిత్వం వ్రాయాలి’ అని. ఈ మాటే పింగళి సూరన్నగారు కూడా చెప్పాడు “పొసగు ముత్తెపుసరుల్‌ పోహళించిన రీతి, తమలోన దొరయు శబ్దములు గూర్చి” అని! ఈ విషయం, రసాయన శాస్త్రజ్ఞులకి తెలియనిది కాదు. ఒక్క మాలెక్యూల్ మంచివాసన (రుచి) ఉన్న పుదీనాలా వుంటే, దాని ప్రతిబింబం వాసన లేని బెండులా అవుతుంది. ఇది శాస్త్రజ్ఞులకి కూడా అంతు పట్టని విశేషం!

పోతే, అర్థంతో వచ్చే రుచిని అర్థపాకం అంటారు. మన ప్రాచీన లాక్షణికులు చాలా మంది అర్థపాకాలు మూడు రకాలని చెప్పారు. ద్రాక్షా పాకం, కదళీ పాకం, నారికేళ పాకం. రాజశేఖరుడనే లాక్షణికుడు కావ్య మీమాంసలో, నవవిధ పాకాలని ప్రస్తుతించాడు. ఇది ఫలానా రుచి అని చెప్పగలగటానికి ఆధారం తిరిగివచ్చిన జ్ఞాపకమేకదా! రాజశేఖరుడు చెప్పిన రుచులు వరుసగా ఇవి: పిచుమంద -వేము/వేప, బదర – గంగ రేగి, మృద్వీకా – ద్రాక్ష, వార్తాక – వంకాయ, తింత్రిణీ – చింతకాయ (చింతపండు), సహకార – మామిడిపండు, క్రముక – పోకచెక్క, త్రాపుష – దోసకాయ, నారికేళ – కొబ్బరి.

ఇలా సాగిపోయే కవిత్వాన్ని బబుల్‌గమ్‌ కవిత్వం అనచ్చు. పిప్పి నమిలిన కొద్దీ రుచి పెరగదు కదా! ఈ కొత్త ప్రామాణిక రుచి మీ జ్ఞాపకాల పరిధిలోకి వెళ్ళితే, ఇక నుంచి ఇటువంటి కవితలకి మీ అంతట మీరే వెల కట్టుకోవచ్చు

కవిత్వంలో వేము, వంకాయ, పోకచెక్క పాకాలని సర్వదా విసర్జించమని, రేగి, చింత, దోస పాకాలు కాస్త సంస్కరించి మెరుగు పరిస్తే ఆస్వాద యోగ్యాలవుతాయని, ద్రాక్ష, మామిడి, కొబ్బరి పాకాలని ఎల్లవేళలా ఆస్వాద యోగ్యాలేనని రాజశేఖరుడు చెప్తాడు.

అయితే పదాల ఒద్దిక తెలిసినంత మాత్రాన, కవి కాడు; అతగాడు వ్రాసింది కవిత్వం కాదు. అందుకని, అనుప్రాస భూయిష్టంగా ఉండటమో, alliterativeగా మాటలు పొందు పరిస్తేనో, అబ్బో! ఇందులో శయ్య బహు గొప్పగా ఉన్నది అనీ, అది కవిత్వం అనీ మోసపోకూడదు. పదాల ఒద్దిక బాగుంటే చాలు, ఇది కవిత్వం అని భ్రమ పడకూడదు. ఏది శయ్య కాదో చెప్పడం బోలెడు సులువు. ఉదాహరణగా ఈ కవిత[3]సింగిరెడ్డి నారాయణరెడ్డి కాలం అంచుమీద అన్న సంకలనం నుంచి – చినుకు అన్న కవిత చూడండి:

ఆకాశం ఆశీస్సు చినుకు
మబ్బు మమకారం చినుకు
చీలిన నేల పెదవి పైన
చిరునవ్వు ముత్యం చినుకు.

మగతను తాగే కళ్ళల్లో
రగిలే మెరుపు చినుకు
మంటల్ని ఉతుక్కునే గుండెల్లో
మౌన హాసం చినుకు.

మోడు ముఖాన్ని చీల్చే
మొదటి చిగురు చినుకు.
గోరీ నెత్తిలో మొలిచే
పూరిగరిక చినుకు.

ఇదే వరస! ఇలా సాగిపోయే కవిత్వాన్ని బబుల్‌గమ్‌ కవిత్వం అనచ్చు. పిప్పి నమిలిన కొద్దీ రుచి పెరగదు కదా! ఈ కొత్త ప్రామాణిక రుచి మీ జ్ఞాపకాల పరిధిలోకి వెళ్ళితే, ఇక నుంచి ఇటువంటి కవితలకి మీ అంతట మీరే వెల కట్టుకోవచ్చు! ఇదే పద్ధతిలో మచ్చుకి మరి కొన్ని కవితలు వినిపిస్తా. సాధారణ పాఠకుడిగా నా జ్ఞాపకాలు కూడా చెపుతా!


అధస్సూచికలు

అధస్సూచికలు
1 విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం నుంచి
2 శ్రీశ్రీ భిక్షువర్షీయసి కవిత. ఆఖరి మూడు చరణాలు
3 సింగిరెడ్డి నారాయణరెడ్డి కాలం అంచుమీద అన్న సంకలనం నుంచి – చినుకు అన్న కవిత