ఈమాట » నాకు నచ్చిన పద్యం - నన్నెచోడుని వర్ష విన్యాసం

Expand to right
Expand to left

నాకు నచ్చిన పద్యం - నన్నెచోడుని వర్ష విన్యాసం

చం.  అడరు నవాంబు ధారలు జటాటవిలోబడి విభ్రమించె వె
         ల్వడి చనుదెంచి రాలుగొని పక్ష్మములన్ వెడనిల్చి మోవిపై
         బడి కుచఘట్టనం జెదరి పాఱి రయంబున ముత్తరంగలన్
         మడుఁగులు వారి నాభి కెడమానక చొచ్చె ననుక్రమంబుగన్

ఈ పద్యం నన్నెచోడ మహారాజు రచించిన కుమార సంభవము అనే కావ్యం లోది. కాళిదాసు కుమారసంభవం ద్వారా కథ బాగా ప్రసిద్ధమైనదే. కానీ కావ్యం మాత్రం కాళిదాసు కావ్యానికి అనువాదం కాదు. వ్యాసభారతానికి కవిత్రయం చేసిన అనువాదం లాంటిది కాదు. అసలు అనువాదమే కాదు. స్వతంత్రంగా రాసిన చక్కని ప్రబంధం ఈ నన్నెచోడుని కుమార సంభవం. ఈ పద్యాన్ని గురించి మాట్లాడుకొనే ముందు కవిని గూర్చి కొంచెం ప్రస్తావన అవసరం.

ఎందుకంటే, నన్నెచోడునికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానమున్నది. అసలు 1909 వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. 1909లో మానవల్లి రామకృష్ణ కవి తాను సంపాదించిన కుమార సంభవాన్ని ప్రకటించేసరికి ఆంధ్ర సాహిత్యలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, సంతోషించింది గూడా. ఉలికిపాటు ఎందుకంటే నన్నెచోడుని కాలం క్రీ.శ. 940 అని మానవల్లి కవి చెప్పడం వల్ల. అంటే, మనం ఆదికవి అనుకుంటున్న నన్నయ భట్టు కన్నా రెండు వందలేండ్లు ముందువాడు అవుతాడన్నమాట. ఈ వాదం వల్ల నన్నయగారి ఆదికవి పీఠం కొంచెం కదిలింది. దీని మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి.

అయితే, నన్నెచోడుడు కూడా తనకు పూర్వపు తెలుగు కవుల నెవర్నీ పేర్కొనలేదు. చాలా వాదాల తర్వాత, శాసనాలు కొన్నింటి ఆధారంగా నన్నెచోడుడు నన్నయకు వంద సంవత్సరాల తర్వాతి వాడని నిశ్చయం చేశారు. ఇది ఎక్కువ మంది పండితుల ఆమోదం పొందింది గానీ వివాదం మటుకు పూర్తిగా సమసిపోలేదు. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే పరిశోధకులు గానీ, విమర్శకులు గానీ, వారి వారి ప్రొత్సాహకులూ అనుమోదకులూ వ్యతిరేకులతో సహా, కులాభిమాన దురభిమానాలకు అతీతులేమీ కాకపోవడం. ఇందువల్ల సాహిత్యేతర కారణాలు చర్చల్లోనూ, నిర్ణయాల్లోనూ ముఖ్యపాత్ర వహించడం జరుగుతున్నది. పోనిండి, కవి గారి కాలచర్చ చరిత్ర పరిశోధకులకే వదిలిపెడదాం. నా ఉద్దేశం ఈ వివాదాన్ని మీకు పరిచయం చేయడమే. మనం ఇక కేవలం పద్యం సంగతి చూసుకుందాం. నన్నెచోడుడు ఆదికవి అయినా కాకపోయినా తెలుగు కవిత్వాన్ని మార్గ కవిత, దేశి కవిత అని వింగడించిందీ, కవిత్వ స్వభావంలో వస్తు కవిత అనేదాన్ని మొదట పేర్కొన్నదీ ఆయనే. నన్నెచోడుడు చాలా గొప్ప కవి.

కుమార సంభవం కథ మనకు పరిచితమే. గిరిరాజ తనయ శివుణ్ణి ప్రేమించడమూ, ఆయన కోసం తపస్సు చేయడమూ, ఆ క్రమంలో మన్మథ దహనమూ, తరువాత శివ పార్వతులకు కళ్యాణం జరగడమూ, కుమారుడు (కుమార స్వామి) సంభవించడమూ,, కుమార సంభవానంతరం తారకాసుర సంహారమూ, ఇలా సాగిపోయే కథ ఇది.

శివుణ్ణి భర్తగా పొందగోరి పార్వతి హిమాచల శృంగాల మీద తపస్సు చేస్తున్నది. గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. ఆమె అవయవాల అందాలన్నీ వేరే వేరే చోట్ల ఇల్లడ పెట్టి వచ్చిందట. ‘అలకల పొల్పు తేటిగములందు, మదాలస యాన లీల హంసల కడ, వక్త్రభాతి జలజంబులపై…’ - ఇలా అన్నమాట. తపోచర్య వల్ల రోజుక్కొంచెం రోజుక్కొంచెం శుష్కిస్తున్న ఆమె శరీరం ఎలా ఉన్నదంటే ‘అర్ధనారిగా తన దేహము అభవుమేన నల్పమల్పము నంటించునట్ల వోలె వుందట. ఎంత చక్కటి ఊహ. ఇలా తపస్సు చేస్తూ వుండగా వర్షాకాలం వచ్చి తొలకరి వానలు కురవడం మొదలైన సందర్భం లోనిది పై పద్యం.

చక్కనమ్మ చిక్కినా అందమే గదా. ఆమె నిటారుగా కూర్చుని తపశ్చర్యలో వున్నది. వాన చినుకులు ముందు ఆమె తలపై పడ్డాయి. అక్కణ్ణుంచి జారి ఆమె కనురెప్పల పైకి వచ్చాయి. కనురెప్పల వెండ్రుకల మీద కొంచెం ఆగి, ఆమె మెత్తటి ఎర్రటి మోవి మీద పడి అక్కడ కాసేపు మజిలీ చేశాయి. అక్కణ్ణించి ఆమె ఉరోజాల మీద పడి ధారలై ప్రవాహ వేగం సంతరించుకున్నాయి. మూడు కాల్వలుగా పాయలు కట్టి ఆమె నాభీ దేశం వద్ద మడుగులు కట్టినై. ఇదీ, ఆ వానజడి అంచెలంచెలుగా చేసిన ప్రయాణపు అనుక్రమం.

అవి నవాంబు ధారలు, అంటే తొలకరి వానలు. మొదట ఆమె తల మీది కచపంక్తిపై పడ్డాయి. జటాటవిలో, అంటే తల వెండ్రుకల నుంచి ‘విభ్రమించి వెల్వడి చనుదెంచి పక్ష్మములన్ వెడనిల్చి’నాయి. పక్ష్మములు అంటే కనురెప్పల మీది వెంట్రుకలు. ఆ వాన చినుకులు కనురెప్పల మీద కొంతసేపు నిలిచి, ఆపైన ఆమె పెదాల మీదకి జారి పడ్డాయి. ఆమె అధరాల మీద నుంచి ‘కుచఘట్టనన్ చెదరి పాఱి’నవి. కనురెప్పలూ,మోవీ సున్నితాలు. వక్షాలు అలా కాదు కాబట్టి ‘ఘట్టనం జెదరి’ అంటే తాకిడికి ఆ చినుకులు చెదరి, చెదరిన రయంబున పారినవి. అక్కడ ఆ ప్రవాహం ‘ముత్తరంగలై’, మూడు ధారలైనవి. ఒక్కో కుచం మీద నుంచి ఒక్కో ధార కారితే రెండు ప్రవాహాలు కావాలి. లేదూ, రయఘట్టనం వలన అటూ ఇటూ చెదరితే నాలుగు ధారలు కావాలి. కానీ, మధ్యలోని రెండు ధారలు కలిసి ఒకే ధారగా మారి ముత్తరంగలైనాయి. ఈ మూడు ప్రవాహాలూ మడుగులు వారి, ఎడము ఆనక, అనుక్రమంబుగా నాభికి చొచ్చినవట. అందుకు నాభి వద్ద పెద్ద మడుగు అయింది. మన కవుల కవిసమయాల్లో నాభి లోతుగా ఉండటం అనేది స్త్రీ సౌందర్య సూచన. పెద్దన గారి వరూధిని ‘నతనాభి’.

ఇక్కడ ఒక చిన్న విషయం. స్త్రీ అంగాంగాలూ కొలతలూ వర్ణించడమనే చాపల్యం నుంచి ఏ కవీ తప్పించుకోలేక పోయినాడు. దౌర్భాగ్యం. అయితే అలాంటి వర్ణన స్త్రీ కైనా పురుషుడికైనా ప్రతీసారి తప్పే అనలేం కూడానూ. శృంగారాత్మక సన్నివేశంలో అటువంటి వర్ణన సమంజసమే కావచ్చును, కాని చోట అశ్లీలాత్మకంగా స్ఫురించవచ్చు. ఒక కావ్యాన్ని చదివేటప్పుడు వర్ణనౌచిత్యాన్ని గమనించుకోవాలి కవి, పాఠకులు కూడా. సరే, ఈ వర్ణనల ఉచితానుచితాల చర్చను కాసేపు అలా పక్కన ఉంచితే -

తొలకరి చినుకుల ప్రయాణాన్ని ఎంత సౌందర్యాత్మకంగా రూపు కట్టించాడో చూడండి, కవి ఈ పద్యంలో. తల మీద నుంచి కనురెప్పల పైకి, మోవి పైకి జారి ఆపై ఉరోజముల మీదకు దూకి ధారలై నాభి దాకా పారి - ఇలా జలధారలతో విన్యాసం చేయించాడు. ఒక సామాన్య దృశ్యానికి కళాకృతి కల్పించాడు. వాన చినుకుల్లానే పద్యం లోని పదాలు కూడా విభ్రమించి వెల్వడి వెడనిల్చి పడి చెదరి పారుతున్నట్టు పద్యధార కూడా ఆ చినుకుల ధార లాగా ఆగుతూ విరుగుతూ నడిచింది. మిక్కిలి ప్రౌఢకావ్యం నన్నెచోడుని కుమార సంభవం. కేవలం పద్యాలు రాయడం కాకుండా, పదాలు ఏవి ఎప్పుడు ఎందుకో వాడాలో తెలిసిన కవి రచించిన కావ్యం. ఈ కావ్యంలో ఇలాగే మరిచిపోలేని పద్యాలు చాలా ఉన్నాయి.

 

(12 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Sowmya అభిప్రాయం:

    November 3, 2008 12:25 am

    బాగుందండీ.
    కాకుంటే ఓ చిన్న సూచన - ఇలా మీరు చాలా పద్యాల గురించి రాస్తున్నారు కదా… అన్నింటికీ ఒక టాగ్ అలా ఏదన్నా పెడితే వరుసగా చదువుకోడానికి వీలుగా ఉంటుంది.
    విశ్వనాథ వారి “సాహిత్య సురభి” గుర్తు వస్తోంది..

  2. Lyla yerneni అభిప్రాయం:

    November 3, 2008 12:43 pm

    ఈ శీర్షిక ఉత్సాహంతో చదువుతున్నాను. గొప్ప ఆనందం కలుగుతున్నది.

    1. ఈ పద్యంలో శ్లేష ఆసాంతం ఉంది అనిపిస్తున్నది. వాన పడుతున్నప్పుడు గౌరిని, ప్రకృతిని రెంటినీ వర్ణించారనిపిస్తున్నది. ఈ పద్యంలో అడవిచెట్లు, ఆకులు, ?భూమి, కొండలు, మడుగులు - ఈ క్రమంలో లేవా? చెప్పగలరు.
    2. మానవ దేహ వర్ణన చేయటం ‘దౌర్భాగ్యం’ ఎందుకవుతుంది? మానవ దేహ సౌందర్యం తక్కువది కాదే. ఎందుకీ అసందర్భపు విరక్తి?

    లైలా.

  3. mOhana అభిప్రాయం:

    November 3, 2008 1:13 pm

    నాకు నచ్చిన కవులలో నన్నెచోడుడు ఒకడు. ఇతనికి ఇవ్వని ప్రబంధపరమేశ్వరుడనే బిరుదును ఎఱ్ఱాప్రెగడకు ఎందుకిచ్చారో. తెలుగులో మొట్టమొదటి ప్రబంధము
    కుమారసంభవమే. లైలాగారు చెప్పినట్లు ఇందులో ప్రకృతివర్ణన కూడా ఉందనుకోవచ్చు. అందువల్ల అలంకార రీత్యా ఇది స్వభావోక్తి (శ్లేష కాదు). ఈ పద్యం నాకు ఆకాశంబునుండి (భర్తృహరి సుభాషితం) అనే పద్యాన్ని గుర్తుకు తెస్తుంది. మరెప్పుడైనా వీలున్నప్పుడు నన్నెచోడునిపైన వ్రాయాలి. విధేయుడు - మోహన

  4. Kameswara Rao అభిప్రాయం:

    November 4, 2008 11:50 am

    నన్నెచోడుని, అతని చక్కని పద్యాన్ని పరిచయం చేసారు. మోహనగారన్నట్టు ప్రబంధపరమేశ్వరుడు బిరుదుకి నన్నెచోడుడు తగినవాడే!
    మీ వివరణకి చిన్న సవరణ. “ముత్తరంగలు” అంటే నాభిపై భాగమ్మీద ఏర్పడే సన్నని మూడు మడతలు అని అర్థం, మూడు పాయలని కాదు. ఈ “ముత్తరంగల”నే “త్రివళులు” అని కూడా అంటారు.
    “మడుగులు వారి” అంటే మడతలు పడి అని అర్థం. వాననీరు కుచఘట్టనతో వేగంగా కిందకి పారి, త్రివళులని చేరి, ఆ మడతలకి మడతపడి వేగంగా నాభిని చొచ్చాయి అని అర్థం. ఈ అర్థంలో నీరు మూడు పాయలుగానే ఎందుకు చీలింది అన్న సందేహానికి తావుండదు.

  5. Madhav అభిప్రాయం:

    November 7, 2008 6:01 am

    కామేశ్వర రావు గారూ - మీరు చెప్పిన అర్ధం సరి అయినదే. దానితో నాకేమీ చిక్కు లేదు. కానీ ఆ అర్ధాన్ని పద్యభావంతో అన్వయించుకోలేక పోతున్నాను.

    నేను పద్యంలో చెప్పబడి ఉన్న పార్వతిని ఊహిస్తున్నాను. ఆమె చక్కనిది, తపోనిష్టచే చిక్కినది. యువతి. ఆమె తపోముద్రలో ఉన్నది. అంటే వీపు నిటారుగా పద్మాసనం దాల్చి, మణికట్లు మోకాళ్ళపై నిలిపి అరచేతులు పైకి, చూపుడువేలు, బొటనవేలు తాకించి ఉన్నది. ఈ ముద్రలో, ఉదరంపై త్రివళులు ఏర్పడే అవకాశం చాలా తక్కువ, పైగా ఈ భంగిమలో ఉదరం చదునుగా ఉండటమే కద్దు (అందరికీ కాదు కానీ చాలా మందికి:) అందులో చక్కగా చిక్కినమ్మకు. కథాంశం ప్రకారం గిరిరాజ తనయ అవివాహిత, కుమారి.

    పార్వతిని ఇంత అందంగా వర్ణించగల్గిన కవికి ఇది తెలియదంటారా? ముందే చెప్పినట్టు అర్ధంతో కాదు అర్ధార్ధంతో నాకు ఈ చిన్న చిక్కు పడింది. అంతే కాదు,లైలా చెప్పినట్లు కొండలనుండి జారి సాగర సంగమానికి ముందు పరీవాహక ప్రాంతంలో పాయలు కట్టే నదికి ఒక పోలిక కూడా ఉన్నది. అయితే ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టమే.

  6. Kameswara Rao అభిప్రాయం:

    November 7, 2008 7:19 am

    మాధవ్ గారు,
    మీరు మంచి లా పాయింటే లాగేరు కాని, మీరా ప్రశ్నవేసింది నన్నూ నన్నెచోడుణ్ణి కాదు, కాళిదాసుని :) ఎందుకంటే ఈ పద్యానికి మూలం సంస్కృత కుమారసంభవంలో ఉన్న ఈ శ్లోకం:

    స్థితాః క్షణమ్ పక్ష్మసు తాడితాధరాః
    పయోధరోత్సేధ నిపాత చూర్ణితామ్
    వలీషు తస్యాః స్ఖలితాః ప్రపేదిరే
    చిరేణ నాభి ప్రథమోదబిందవః

    కాకపోతే కాళిదాసు “చిరేణ” అంటూ నీటిబిందువులని నాభి దగ్గరకి కాస్త నెమ్మదిగా తెస్తే, నన్నెచోడుడు “రయంబున” పరిగెట్టించాడు.
    అందమైన ఆడవారి సుందరాంగాలలో ఈ వళులు ఒక భాగం, కాబట్టి ఆ స్థితిలో కూడా పార్వతి తన సహజమైన అందాన్ని కోల్ఫోలేదని అనుకోవాలి!

  7. lyla yerneni అభిప్రాయం:

    November 7, 2008 8:32 am

    ఎందుకంటే ఈ పద్యానికి మూలం సంస్కృత కుమారసంభవంలో ఉన్న ఈ శ్లోకం -Kameswara Rao అభిప్రాయం:

    ఐతే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. రచయిత నన్నెచోడునిది స్వతంత్ర కావ్యమన్నారు. మీరేమో ఈ పద్యానికి కాళిదాసు పద్యం మూలమంటున్నారు. ఏమిటీ ముడి?

    లైలా.

  8. Madhav అభిప్రాయం:

    November 7, 2008 8:40 am

    అలాగే అనుకుంటాను, నాకూ కాళిదాసుకీ ఇర్రికన్సైలబుల్ ఈస్థటిక్ డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా అనుకుంటాను. ఇప్పుడెలానూ ఆయన్ని నిలదీయలేను కదా :)

  9. phani అభిప్రాయం:

    November 28, 2008 9:05 am

    పద్య అర్థాన్ని అన్వయించు కొవడానికి కాకపొయినా తల మీద పడ్డ వాన చినుకులు కను రెప్పల మీద పెదవుల మీద నుంచి మూడు ధారలుగా నాభిని చేర వచ్చు కదా?

  10. prabhakar అభిప్రాయం:

    December 16, 2008 10:18 am

    థ్యాంక్ యూ. ఈ వ్యాసం చదవడానికి బాగుంది.

  11. బృందావన రావు అభిప్రాయం:

    December 16, 2008 4:11 pm

    (ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి).

    లైలా గారూ:
    1. పద్యం లోంచి శ్లేషను మనం లాగవచ్చు. కానీ కవి ఉద్దేశించి వున్నట్లు అనిపించదు. (మాధవ్ అన్నట్లు ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టం).
    2. కుమార సంభవం సర్వస్వతంత్ర కావ్యం. అనువాదం కాదు. ఎంత స్వతంత్ర కావ్యమైనా, కవి అదే విషయం మీద అంతకుముందే వెలువడిన ఒక ప్రసిద్ధ మహాకవి కావ్యాన్ని చూడకుండా ఎలా ప్రారంభిస్తాడు? అందులో కన్పించిన అందమైన ఊహలను ఎలా వదిలి వేయగలడు? పై పద్యం మాత్రం కాళిదాసు శ్లోకానికి ఖచ్చితమైన అనువాదమే. ఒక మంచి భావాన్ని వదిలివేయలేని రసికతగా దీన్ని భావించవచ్చు.

    కామేశ్వర రావు గారూ:
    పద్యాన్ని విశ్లేషించేటప్పుడు తెలుగు పద్యాన్నే పరామర్శించాను కానీ దానికి మూలమైన సంస్కృత శ్లోకం నా దృష్టిలో లేదు. ఐనా, తరంగ అంటే వళి అనే అర్ధం నాకు కన్పించలేదు. అందుకని ముత్తరంగలు అంటే మూడు ధారలనే ఉద్దేశించాను. అలాగే, ‘మడుగులు వారి’ అనే పదానికి గూడా ముడుతలు పడి అనేదానికన్నా హ్రదాలై ప్రవహించి అనే అర్ధమే న్యాయంగా వుంటుందనుకుంటాను. కానీ, సంస్కృత శ్లోకం చూసింతర్వాత - నన్నెచోడుడు కూడా త్రివళులనే ఉపలక్షించి వుంటాడని అనిపిస్తున్నది. మీకు కృతజ్ఞతలు.

  12. lyla yerneni అభిప్రాయం:

    December 17, 2008 10:35 am

    బృందావన రావుగారి పద్య పరిచయం జనవరి సంచికలో ఉంటుందని, కొత్త సంవత్సరం కోసం సంబరంగా ఎదురుచూస్తున్నాను.
    ఈ పద్య వివరణా వ్యాసం, వారిచ్చిన సమాధానాలు, మరోసారి చదువుకుని రాస్తున్నాను.
    నా దగ్గర నన్నెచోడుని తెలుగు పుస్తకం లేదు. కాని కోలాచల మల్లినాథ సూరి తెలుగు టీకా తాత్పర్యంతో -కాళిదాసు కుమార సంభవం ఉంది.
    ప్రధమ సర్గలో పార్వతిని పాదాల దగ్గరనుండి తలవరకు వర్ణించారు కాళిదాస కవి. దేవతలను కిందినుండి పైకి, మానవులను పైనుండి కిందకు వర్ణించడం ఆచారమట. ఆ వర్ణన ” మధ్యేన సావేదివిలగ్నమధ్యా వళి త్రయంచారు బభార బాలా..” నుండి -త్రివళులంటే నడుము మీద ఉండే మూడు మడతలని తెలిసింది. అవి నాభికి పైభాగంలో ఉంటాయనీ నాకు తెలిసింది. ( ఎందుకంటే అంతకు ముందు పద్యంలో అప్పటికి నాభి వరకూ వర్ణన ఐపోయింది కాబట్టి. అప్పుడే పార్వతి నతనాభి అని కూడా తెలిసింది. “తస్యా ప్రవిష్టా నతనాభి రంధ్రంరరాజ తన్వీ…” )
    తర్వాత పంచమ స్సర్గములో పార్వతి తపస్సు ఘట్టములో కాళిదాసు శ్లోకానికీ, మీరిచ్చిన నన్నెచోడుని పద్యమునకూ గల పొలికలు చూచాను. తేడా అల్లా కాళిదాసువి గ్రీష్మం తర్వాతి తొలి నీటి చుక్కలు. నన్నెచోడునవి నవాంబు ధారలు. కాబట్టి ఇంకా వేగంతో ప్రవహించాయి. (ఐనా కాళిదాసు ముందరి పద్యము లోనే పార్వతి అప్పటిదాకా చెట్లలాగానే వర్షపు నీరుతో మాత్రమే బ్రతికిందంటారు. మళ్ళీ అంతలోనే మరిచి, గ్రీష్మం వెళ్ళిపోయి మొదటి వానకు తడిసి పార్వతి శరీరంలోచి, భూమి లోంచి సెగలుపైకి లేచాయని రాశారు. :-) ఆ తర్వాత పద్యమే ఆ వాన పార్వతి మీదుగా ఎలా జారిందొ చెప్పే పద్యం. ) పద్యములు అతి చక్కనివి. కవులు బాగా రాశారు.
    కానీ వాన ( ప్రకృతి )సామాన్య విషయమూ, కవులది సుందర కళాసృష్టి అనుకోటానికి నా మనసొప్పదు. కవులు తలకిందులుగా తపస్సు చేసినా భగవంతుని సృష్టిని మేచ్ చెయ్యలేరు. ఒక సౌందర్యవతిని, ఆమె చిత్రాన్నీ చూసి ” జో బాత్ తుఝ్ మే హై, ఒ తేరీ తస్ వీర్ మే నహీ ” అన్న కవిరాజుకి నా నమస్కారము. పకృతి అందాన్ని, ప్రకృతిలో మానవ సౌందర్యాన్ని, చూసి ముందస్తుగా పరవశించని హృదయం, కవి రాసే మాటలకు ఉబ్బిపోటం ఉత్తిమాట. అసలు సౌందర్య స్పృహ, సౌందర్య కాంక్ష లేనివాడు కవే కాడు.

    ఒక కవి నుంచి ఇంకొక కవి సంగ్రహించటం, ఒకరిని ఇంకొకరు అనువదించటం , అనుకరించటం -విద్యాభిలాషతో, కళపై కాంక్షతో, చేసే పనులు. కళాకారుడు అనుకరించడం మానడు. మానలేడు. అలా చెయ్యటం అవసరము. ముందు అనుసరించినా, కొన్నాళ్ళ తర్వాత కొత్త కళా స్రష్ట అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఒకరి చక్కని భావాన్ని ఇంకో భాషలో, ఇంకో సమయంలో, -తన ఆనందం కోసం, పలువురి ఆనందం కోసం- కవి వాడటం, మీరన్నట్లు కవి పాండిత్యాన్నీ, రసికతను, చెపుతుంది. పాఠకులు కూడా ఎంత ఎక్కువగా చదివి ఉన్నవారైతే, ఏ రచనలోనైనా, అన్ని ఎక్కువ మూలాలు గుర్తించగలుగుతారు.

    లైలా

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a