నాచన సోమన అపురూప పద సంచయం
దూర్వాసుడు కండ్లు తెరిచి హంస డిభకులను చూసి, వారి ఆగడాలకు కోపం వచ్చినా నిగ్రహించుకొని, వీరెలాగూ కృష్ణుని చేతిలో చచ్చేవారే, ఇంక శాపమివ్వడం ఎందుకు అనుకుని ఇలా అంటాడు, “చక్రధరుడు బారి సమరనున్నాడు మిమ్మింక కోపమేల నాకు, తెరగు మాలి తవుడు దిని చచ్చువానికి, విషము పెట్టువాడు వెర్రి గాడె”. తవుడు తిని చచ్చేవాడికి వేరే విషం పెట్టాలనుకోవడం ఎందుకు? హంసుడు ముని మీద కోపంతో ఇక్కడే వుండటం “నక్క బగ్గానం బట్టిన యట్లు బిర్ర బిగియంగా..” అనుకుంటాడు. నక్కను పగ్గాన పట్టుకోడం అనేది తమాషా ఐన ఊహ. జానపదుల వాడుక మాటలు తెలిసినవాడే ఇలా వాడగలడు.
హంస డిభకుల ఆగడాలకు బాధ పడిన మునులు కృష్ణుని వద్దకు వచ్చి, వారి ఆగడాలను వివరిస్తూ “పులి పేదవడిన పసులవాండ్రె ఎక్కాడిరను కత వచ్చెనాకు - మునుల లోపల నాలుక ముల్లు విరిగె” అంటాడొక ముని. చక్కని సామెతా, అందమైన జాతీయమూ. పసులవాండ్లు, అంటే గొడ్లు కాచేవాళ్ళు పశువులను పులి నుండి రక్షించాలి. కానీ పులి బలహీనమైతే, కాపరులే పులికన్నా పశువులను ఎక్కువగా బాధ పెట్టినట్లైంది నా పని, ఇది పిల్లి పిచ్చిదైతే ఎలుక వెక్కిరించిదనే సామెత లాంటిది. నాలుక ముల్లు విరగడం అంటే మాట్లాడలేక పోవడం. ఈ హంస డిభ్కుల చేతిలో బాధలు అనుభవించి, దీనుడనై మిగిలిన ముని సంఘంలో తలెత్తుకోలేక, నోరెత్తలేని వాడనైనాను, అని చెప్పడం.
హంస డిభకులు తమ తండ్రిని రాజసూయం చేయమని ప్రోత్సహిస్తారు. అప్పుడు జనార్దనుడు వారితో, రాజసూయం చేయాలంటే దిగ్విజయం చేసి రాజుల్ని గెలవాలి. కృష్ణుని వోడించడం మీచేతనవుతుందా. నరకునీ, కంసునీ, మురాసురునీ, చాణూరాదులనూ చంపిన కృష్ణునికి మీరొక లెక్కా, అంటూ “మద్దులు మునింగి పార, వెంపళ్ళు తన కెంత బంటీ అంటాడు. మద్ది చెట్ల లాంటి మహా వృక్షాలే మునిగి పోతే, రెండడుగుల ఎత్తు కూడా లేని వెంపలి చెట్లు మునగడానికి ఎంత లోతు కావాలె. అని అంటాడు.
ఈ జనార్దనుడు కృష్ణ భక్తుడు. హంస డిభకుల పంపున కృష్ణుని వద్దకు దూతగా పోతాడు. వారి ప్రల్లదాలను కృష్ణునికి వివరించలేక మొహమాట పడుతుంటే, కృష్ణుడు భయం లేకుండా చెప్పడం దూత ధర్మం అని ప్రోత్సహిస్తూ, “పాముకాటు చీర దుడిచినంబోవునే” అంటాడు. వారి ఆటోపం “దువ్వు జూచి నక్క యొడలు గాల్చుకున్న వడవు” లా ఉన్నదంటూ “పిడుగు వ్రేసిన తల టొప్పి యాగునే” అని ప్రశ్నిస్తాడు కృష్ణుడు. దూతకృత్యం నిర్వర్తించి వచ్చిన జనార్దనుడు, హంస డిభకుల ముందు కృష్ణుని పొగుడుతుంటే సహించలేక “చెరువు విడిచి కాలువ బొగడం జనునే” అంటాడు హంసుడు.
బాణాసురుని కుమార్తె ఉష, అనిరుద్ధుని కలలో చూచి మోహించి విరహం అనుభవిస్తూ చెలికత్తెతో అన్న మాట, “జాదుల ఇల్లు సొచ్చి సెక జల్లెడి వెన్నెల వెట్టికొందునే”. జాజిపూల కుటీరంలోకి పోయి, సెగ చిమ్మే వెన్నెలను పెట్టుకున్నానే అని వగపు. ఆమె కల లోకి వచ్చినవాడు అనిరుద్ధుడని తెలుసుకొని, ఉషతో చెలికత్తె అంటుంది “అలిగి తన్నిన పరుప బయింబడినట్ల” యిందిలే అని. ఉష తను ప్రేమించినవాడు శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడని తెలుసుకొని,
దనుజకులవైరి శౌరి నందనులు నట్ల
రక్కసులు మనవారు వారలకు మనకు
పొసగునె నడుమ బెట్టిన పూరిగాలు
నేల చిత్రరేఖా తుది నింత సణుగు
అంటుంది తన చెలికత్తె చిత్రరేఖతో. మనమేమో రాక్షసులము. కృష్ణుడూ అతని కొడుకులూ, మనవడూ, రాక్షసులకి శత్రువులు. వారికీ మనకూ పొసగుతుందా? “నడుమ బెట్టిన పూరి గాలు” - పూరి అంటే పచ్చగడ్డి. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంత శత్రుత్వం అన్నమాట.
ఇంకా ఇలా అంటుంది, అనిరుద్ధుని నీవు ఇక్కడకి తీసుకువచ్చినా, “అతనిచ్చట మెలగుట మా తండ్రి విన్న మేలగునే, ప్రేవుల లోన సురియ ద్రిప్పిన కలపన బిండైన చెలిమికత్తెలు నగరే”. పేగులలో చురకత్తి తిప్పినంత బాధ కలుగుతుంది. కలపనబిండి అంతే బాధ. క్షోభ. బయటకి చెప్పలేని బాధ. అంటే, అతను తను ప్రేమించిన వాడు అని తండ్రికి చెప్పలేని క్షోభ. అటువంటి స్థితిలో తను వుంటే స్నేహితురాళ్ళలో నగుబాటు గదా, అని అన్నమాట.
అనిరుద్ధుడు తన కూతురితో ఉన్నాడన్న సంగతి తెలిసి బాణాసురుడు “ఏనటే నాకూతురినటే మానవుడటే నగరు చొచ్చి మా కులమునకున్ హాని యొనరించె కన్నుల కానడు తలయెత్త రోత గాదే నాకున్” అంటాడు. అదే సందర్భంలో “మనుజాంగనలన్ బట్టుట దనుజులకున్ చెల్లుగాక, దనుజాంగనలన్ మనుజులు పట్టుటకును దొరకునిరే, బెండులు మునింగి గుండులు దేలెన్” అని అంటాడు. మానవ కాంతలను రాక్షసులు చెరపట్టటం లోక సామాన్యమే కానీ రాక్షస వనితను మానవుడు చేపట్టటం బెండులు మునిగి గుండులు తేలినట్టుగా ఉన్నది అని అర్ధం. బెండు తేలిక నీళ్ళల్లో తేలుతుంది, రాతి గుండు ముణుగుతుంది, కదా.
బాణాసురుడు అనిరుద్ధుని చెరసాలలో బంధించాడనే విషయం తెలిసి, ద్వారకలోని అమ్మలక్కలు అనుకునే మాటల్లో “పాలలో పండ్లు పిసికిరమ్మ” అనుకుంటారు.
“అఖిల లోకాధీశుడగు చక్రధరు నింట
నొక కీడు మాట నేడొదవె నమ్మ
బాల్యంబు నంద శంబరు జంపె
ప్రద్యుమ్ను డతని లావెల్లిద మయ్యెనమ్మ.
కీడు లేదన దేవకీ దేవి బలగమొ
ప్పిన పాలలో పండ్లు బిసికిరమ్మ”
అన్ని లోకాలనూ ఏలే కృష్ణుడింట్లోనే ఇన్నాళ్ళకు ఇటువంటి కీడు జరిగింది కదా. చిన్నప్పుడే శంబరాసురుని చంపిన ప్రద్యుమ్నుని పరాక్రమం నగుబాటు చెందినట్లయింది గదా - అతని కుమారుడైన అనిరుద్ధుని ఒక రాక్షసుడు బంధించడం. దేవకీ దేవి బలగానికి ఎప్పుడూ ఏ కీడు ఉండదు. అటువంటిది పాలలో పండ్లు పిసికినట్టయింది కదా అని అర్ధం. ఈ పాలలో పండ్లు పిసకడం అనేది ఒక విచిత్రమైన ఊహ. పాలు రుచి కోల్పోయినప్పుడు రుచి కోసం పాలలో పండ్లు పిసుకుతారు. అలాగే, పాలు పలచ నైనప్పుడు చిక్కదనం కోసం పండ్లు పిసికి కలుపుతారు. ఇన్నాళ్ళకి దేవకీ దేవి ఇంట పాలు రుచినీ చిక్కదనాన్నీ కోల్పోయినాయి. ఎటువంటి దశ వచ్చింది, కృష్ణుని ఇంటికి, అని వాపోవడం ఇది.
ఇంతవరకూ వివరించినవి నాచన సోమన వాడిన అపురూప పదాలలో కొన్ని మాత్రమే. ఆయన వాడిన జాతీయాలూ, స్థానిక పలుకుబడులూ కోకొల్లలు. మచ్చుకి మరికొన్ని. వీటి అర్ధాలు మీ ఊహకే వదిలి పెడుతున్నాను.
“నువ్వుల, కండ్లను, నోర బోసుకున్నారముగా దలంపుము”
“మాడిన నేమి చేసెదవు, మంత్రపు నీళుల చల్లవచ్చునే”
నాచన సోమన తన ఉత్తర హరివంశంలో వాడిన చిత్రశబ్దాలను పరామర్శించే ప్రయత్నం మాత్రమే నేనిక్కడ చేశాను. ఆయన కవిత్వ వైశిష్ట్యం గురించి, సంవిధాన నైపుణి గురించి, పద్య నిర్మాణ నిర్వహణాదుల గురించీ చెప్పాలనే ప్రయత్నానికి ఈ వ్యాసం సరిపోదు. అది ఈ వ్యాసం ఉద్దేశమూ కాదు. ‘ఒకడు నాచన సోమన ఉక్కివుండు’ నని విశ్వనాథ సోమనను ప్రత్యేకంగా ప్రశంసించాడు. సోమన చిత్రశబ్దాలను అలా వుంచితే, ఆయన తన కావ్యంలో సృష్టించిన శబ్ద చిత్రాలూ సామాన్యమైనవి కావు. ఉత్తర హరివంశం ఒక విలక్షణమైన కావ్యం. సోమన విలక్షుణుడైన కవి.
గిరి అభిప్రాయం:
December 27, 2008 5:54 pm
మీది విలక్షణమైన ప్రయత్నం. ధన్యవాదాలు