అసమర్థులు
“వాడితో ఆరోజులు కష్టమైనా బాగుండేవి. ఇప్పుడు పెద్దవాడౌతున్నాడు, వాడి కోసం నేనేమీ చేయలేని పరిస్థితి లోకి వచ్చాను.”
“పేచీ పెట్టకుండా స్కూలుకి వెళతాడా?”
“ఊ, అన్నింట్లో వాడే ఫస్టు!” ఆమె ముఖంలో మళ్ళీ అదే వెలుగు.
“మీరూ చిన్నప్పుడు మీ అబ్బాయి లాగే ఉండేవారా?”
“ఊ.. స్కూలంతటికీ నేనే ఫస్టు ఉండేదాన్ని చదువులో…” మాట్లాడుతూ ఆగింది, ఆమె కళ్ళలో గతం తాలూకు నీడలు.
“ఓ! వెరీ గుడ్! ఏ సబ్జెక్ట్ ఇష్టంగా చదివేవారు?”
“ఇష్టమేమిటీ? అన్నీ చదవాల్సిందే! దేంట్లోనూ అరమార్కు తగ్గినా ఇంట్లో నాన్న బెత్తంతో బాదేవాడు.” పెద్దగా బాధ ద్వనించని అభావమైన గొంతుతో చెప్పుకుపోతోంది.
“ఒక్క నిమిషం ఊరికే కూర్చుంటే వీపుపై వాతలు తేలేవి! చదవటం అలవాటైపోయి చదవనప్పుడు చేతులు వణికేవి!” గతం లోకి వెళ్ళిపోయినట్లుగా మౌనంగా కూర్చుండిపోయింది .
“ఓహ్.. ఐతే మీరు చాలా నేర్చుకునుండాలి, చాలా జ్ఞానం సంపాదించారన్నమాట !” వాతావరణాన్ని తేలిక పరచటానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నాను.
“ఎలా, ఎందుకు జీవించాలో నేర్చుకోలేదు! క్లాసు పుస్తకాల జ్ఞానమే తప్పించి లోకజ్ఞానం లేని దాన్నయ్యాను…” ఏదో ఆలోచిస్తున్నట్లు మళ్ళీ మౌనం దాల్చింది.
నేనిచ్చే ట్రీట్మెంట్ కోసమో లేదా నేను అడిగాననో కాక తను చెప్పాలనుకుంది కాబట్టే చెప్పడం మొదలెట్టినట్టుగా ఉంది! ఇంటర్‌కాం తీసి అత్యవసరమైనవి తప్పించి మిగతా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పి నేనూ మౌనంగా కూర్చున్నా ఆమెనే చూస్తూ.
“బాగా చదివే వారుగా మరి ఏదైనా ఉధ్యోగం లాంటిదేదైనా చేసారా?” మళ్ళీ ఆమెని మాటల్లోకి దింపుతూ ప్రశ్నించాను.
“ఉహూ.. లేదు చదివించారు, చదివాను! పెళ్ళి చేసారు!”
“పేరెంట్స్?”
“ఊ”
“మీకు ఏది ఇష్టమో మీకు తెలియదా?”
“నాకా? మనకేది ఇష్టమో అది చేయగలమా?”
“కొందరు చేయగలరు.”
“కానీ ఆ కొందరిలో నేను లేను, నేను చేసేదేదీ నాది కాదు. మా నాన్న తరచూ అంటుండేవాడు ‘సొంత తెలివి చూపకు చెప్పింది చెయ్యి!’ అని. వాళ్ళు చెప్పిన పని చెయ్యడం తప్ప సొంతగా మరింకేమీ చేయకుండా ఆలోచించకుండా ట్రైనింగ్ పొందాను. చుట్టూ ఉన్న వారు నాలో ఏం చూడాలనుకున్నారో అలానే రూపొందాను.”
నాకు తెలుసు ఆమె ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, అంతా నాకు తెలుసు, మౌనంగా అనుకున్నాను. నాకు అర్ధమైనట్టుగా ఆమె గ్రహించిందని కూడా నాకు తెలుసు.
“మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా!”
“ఊ.. చేశారు.”
“తరువాత?”
“ఇంకేం ఉంటుంది? ఏమీ లేదు. అంతే!”
“ఇప్పుడు మీకు ఇష్టమైనట్లు జీవించలేరా?”
“ఏమో నాకేది ఇష్టమో మర్చిపోయాను!”
“పోనీ చిన్నప్పటి ఇష్టాలు ఉంటాయిగా?”
“చిన్నప్పటివా..?” గుర్తు తెచ్చుకుంటునట్లు ఒక్క నిముషం ఆగింది. “ ఏమో ! మరీ చిన్నతనంలో హాయిగా పరిగెత్తాలనీ, డాన్స్ చేయాలనీ, గొంతెత్తి పాడాలనీ ఇలా ఎన్నో ఉండేవి.” ఆమె నవ్వటానికి ప్రయత్నించి విఫలమైంది. “మనసు సంతోషంగా ఉండేది, ఊరికే నవ్వు వస్తుండేది. అలా నవ్వితే ఇంట్లోవాళ్ళకి ఇష్టం ఉండదని అర్ధం చేసుకునే వయసు వచ్చే సరికే నవ్వు మర్చిపోయాను, భోగం వాళ్ళు మాత్రమే నవ్వుతారనేది అప్పుడు మా ఇంట్లో వాళ్ళ నిశ్చితాభిప్రాయం. కఠినమైన క్రమశిక్షణ లో పెరిగాను. సంతోషంగా ఉండడం చెడ్డవాళ్ళ లక్షణమన్నారు, పసితనం లోనే మంచిదానై పోయాను.”
“సరె అదంతా వదిలేద్దాం! ఇప్పుడు మీ జీవితం మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదా?”
“ఏమో ! మా వాళ్ళూ బంధువులూ అంతా నేను సుఖంగా ఉన్నానని, అదృష్ట వంతురాలిననే అంటారు మరి.”
“మీరేం అనుకుంటుంన్నారు?”
“నేను అనుకోవటానికేం ఉంటుంది? మా నాన్న అంటాడు. మా అమ్మాయిని చదివించాను, క్రమశిక్షణ, మర్యాదా, వినయం, అణకువ, పనీ అన్నీ నేర్పించాను డబ్బున్న వ్యక్తితో సాంప్రదాయబద్దంగా పెళ్ళిచేశాను. మా శిక్షణలో పెరిగినందునే అది ఈ రోజు ఇంత సుఖంగా ఉంది! అని. నాకేదీ ప్రత్యేకంగా అనిపించదు! నా మెదడు ఏనాడో సహజత్వాన్ని కోల్పోయింది! వాళ్ళ కొలతల, సూత్రాలతో అదిమి వేయబడ్డ జీవితం స్పందన కోల్పోయింది. లోపల నేనంటూ లేనప్పుడు శరీరానికి ఎన్ని సుఖాలు ఉంటే ఏంటి ప్రయోజనం? నేను ఎవరి లాగానో ట్రైన్ చేయబడ్డాను. ఆ శిక్షణ ‘జీవించకు మేం చెప్పినట్లు నటించు చాలు’ అన్నట్లుండేది. నటించీ… నటించీ, ఇప్పుడు ఎవరో ఒకరు స్క్రిప్టు రాస్తేనే గాని ముందుకు సాగకుండా ఐపోయాను.”
ఒక్కనిమిషం ఆగి కొంగుతో ముఖాన్ని తుడుచుకుంది. ఇంత మాత్రం కూడా ఎవరితో మాట్లాడి ఎరగదేమో కాస్త ఆయసం తో ముఖాన చెమట పట్టింది. ఓ మూలనున్న టేబిల్ దగ్గరకి నడిచి జగ్ లోని మంచినీళ్ళు గ్లాసులోకి వంచి అందించాను. అందుకుని తాగి ఖాళీ గ్లాసు టేబిల్ పై పెట్టి మాట్లాడటం మొదలు పెట్టింది.
“వాళ్ళ మూసల్లా పిల్లల్ని తయారు చేయాలనుకుంటారు పెద్దవాళ్ళు.. . కొందరు అదృష్టవంతులు ఆత్మలు చచ్చి మూసల్లా తయారవుతారు, సుఖపడతారు కూడా. మరి కొందరు అదృష్టవంతులు ఎదురు తిరిగి సొంత వ్యక్తిగా ఎదిగి తృప్తిగా జీవిస్తారు. నాలాంటి దురదృష్టవంతులు ఇటు సొంత ఆత్మ చావకా, అటు వారి ట్రెయినింగ్ తో కుదించుకుపోయీ అసమర్ధుల్లా మిగిలి పోతారు.” ఇంకేం లేనట్టు మాట్లాడడం ఆపేసింది.
“అవును అసమర్ధుల్లా మిగిలిపోతారు”, నాలో నేనే నిశ్శబ్దంగా అనుకున్నా. ఆమె చెప్పింది కొంతే. చెప్పకపోయినా ఇంకా ఎంతో తెలుసు నాకు.
“సరె, నేను చెప్పేందుకు ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు! ఎందుకీ స్థితి అన్నది మీరు తెలుసుకోగలిగారు. త్వరలోనే తరువాత ఏమిటి? అనేది మీకే తడుతుంది.” చెపుతూ ప్రిస్కిప్షన్ రాయడం మొదలుపెట్టాను.
“ఇదిగో ఈ టాబ్లెట్ మనసుని కాస్త తేలిక పరచడానికి ఉపయోగపడుతుంది, అవసర మనిపించినప్పుడు వాడవచ్చు. ఇంకోటి నైట్ పడుకునే ముందు వేసుకొండి” చెపుతూ ప్రిస్కిప్షన్ ఆమె వైపు జరిపాను. నేననుకున్నట్లే ఆమె దాన్ని అందుకోలేదు.
నేనూ ఏదో చెప్పాలనుకుంటున్నట్లు గ్రహించేసింది, నాకు తెలుసు! కానీ.. నేను…? చెప్పండి అన్నట్లు చూసింది. ఆమె గుర్తు పట్టేసింది, నాకది తెలుస్తూనే ఉంది. రెండు నిమిషాలు ఇద్దరి హృదయాలు మౌనంగా ఓదార్చుకున్నాయి.
“వెళ్తాను.. థాంక్యూ!” ప్రిస్కిప్షన్ చేతిలోకి తీసుకుంటూ లేవబోతోంది.
“గతంలో డాక్టర్లు మీకేమైనా చెప్పే ఉంటారు.. మళ్ళీ అవన్నీ నేను చెప్పను, నా స్వానుభవంతో ఒక్కటి చెప్పగలను. మీకు మీ అబ్బాయి ద్వారా కొంత ఉపశమనం దొరకవచ్చు. మీ అబ్బాయిని తన సొంత ఆలోచనలతో స్వేచ్చగా పెరగనివ్వండి! వాడిలో మీకు మీరు కనిపించినప్పుడల్లా మీకు బావుంటుంది. మరొకటి సంతోషాన్ని , తృప్తి ని మించిన నిద్రమాత్ర ఇంకోటి లేదు వాటికై శాయశక్తులా ప్రయత్నించండి.”
ఆమె మౌనంగా డోర్ వైపు నడచింది. నేను టేబుల్ డ్రాలోంచి ఓ టాబ్లెట్ తీసి వేసుకుని నీళ్ళు తాగాను, ఆమెకి ప్రిస్కిప్షన్ లో రాసిన టాబ్లెట్ అదే.
నా ఎదురుగా గోడపై ఫోటోలో నాన్న కళ్ళలో గర్వం. నా కొడుకుని నాలాగే డాక్టర్ని చేసాను. నా హాస్పిటల్ కి అధిపతిని చేసాను అన్న గర్వం !
శివ బండారు అభిప్రాయం:
November 4, 2008 7:35 am
బాగుంది . :) మీరు చెప్పదలుచుకున్నవి కథల రూపంలో భలే చెబుతారు ..:))
Naresh V అభిప్రాయం:
November 4, 2008 8:46 am
బాగా చెప్పారు… దీన్ని మరింత పెద్దదిగ చెసి, విశదంగ రాస్తీ చాలా బాగుంటుంది.
anuradha అభిప్రాయం:
November 4, 2008 9:28 pm
చాలా బాగుంది.
“కొందరు అదృష్టవంతులు ఆత్మలు చచ్చి మూసల్లా తయారవుతారు, సుఖపడతారు కూడా. మరి కొందరు అదృష్టవంతులు ఎదురు తిరిగి సొంత వ్యక్తిగా ఎదిగి తృప్తిగా జీవిస్తారు. నాలాంటి దురదృష్టవంతులు ఇటు సొంత ఆత్మ చావకా, అటు వారి ట్రెయినింగ్ తో కుదించుకుపోయీ అసమర్థుల్లా మిగిలి పోతారు.” ఈ వాక్యాలు ఇంకా బాగా నచ్చాయి.ఎందుకంటె నేను అలాంటి అసమర్థురాలినే. ధన్యవాదాలు ఇంత మంచి కథ అందించినందుకు.
Srihari అభిప్రాయం:
November 7, 2008 2:10 am
ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి కధ ఇది.
venkat chitta అభిప్రాయం:
November 7, 2008 5:29 am
an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically.
వికటకవి అభిప్రాయం:
November 7, 2008 9:40 am
చాలా బాగుంది, నేరుగా మనసుకి తాకేట్లుగా, నేను వీటిని “కథలు” అని పిలవటానికి ఇష్టపడనన్నది వేరే సంగతి.
చిలమకూరు విజయమోహన్ అభిప్రాయం:
November 7, 2008 7:23 pm
ఒక చట్రంలో బిగించిన స్త్రీ మనసులోని భావాలను ఎంత బాగా ఆవిష్కరించారండి.
Audisesha reddy Kypu అభిప్రాయం:
November 8, 2008 6:03 am
రమ్య గీతిక గారూ..! కథ ఆసాంతం చదివాను. హృదయానికి హత్తుకునేలా యెంత బాగా రాశారు. కీపిటప్ …!
– కైపు ఆదిశేషా రెడ్డి.(నెల్లూరు )
ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:
November 8, 2008 9:35 am
కథ బాగుంది.
విషయం ప్రెడిక్టబుల్‌గా ఉన్నా చెప్పిన విధానం ఆకట్టుకుంది.
srinivas అభిప్రాయం:
November 9, 2008 10:29 pm
అద్బుతంగా రాసారు . డాక్టర్ కూడా ఆమె లాగానే అని భలే ట్విస్ట్ ఇచ్చారు. నాకు ఇది ప్రెడిక్టబుల్ కాదు అనిపిస్తుంది. ఆల్రెడి అనురాధ గారు చెప్పారు. మనలో చాలా మంది ఇలా ఉన్నారు. నైస్ స్టోరీ.
lyla yerneni అభిప్రాయం:
November 10, 2008 3:18 pm
-venkat chitta అభిప్రాయం
మీరు కథ సాంతం చదివారా?
ఈ కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? కథలో మగవాళ్ళున్నారా? ఒకవేళ ఉంటే ఎందరున్నారు? వారి మానసిక స్థితిగతుల మీద, వారి స్వాతంత్ర్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?
లైలా.
sahithi అభిప్రాయం:
November 14, 2008 6:04 am
చాలా బాగావున్నది.
harish అభిప్రాయం:
November 17, 2008 7:44 pm
lovely story madam
hoping to read more from your pen
Harish
Raman అభిప్రాయం:
November 19, 2008 3:06 am
Excellent
bhavani అభిప్రాయం:
November 21, 2008 7:08 pm
చాలా బాగుంది మీ కధ.
satyavani.v అభిప్రాయం:
November 27, 2008 4:54 am
రమ్య గీతిక గారి కథ చాల రమ్యం గా వుంది.క్రిందటి తరం లోనిఎందరో స్త్రీల మనో చిత్రణ ఈ కథ.
subash అభిప్రాయం:
November 28, 2008 9:44 am
కథ చాలా బాగుంది. కాస్త పెద్దగా రాస్తే బాగుండేది. ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుకుంటున్నాం.
vaMSI అభిప్రాయం:
December 20, 2008 2:24 pm
చాలా బాగుంది ఈ కథ. ఈ కథ చదివాక కొంచెం ఆత్మావలోకనం చేసుకోకుండా ఎవరూ ఉండలేరేమో. చాలా విషయాల్లో అసమర్థులం అని గ్రహించిన తరువాత కొంచెం బాధ పడకుండా ఉండలేం. జీవితంతో compromise అయ్యి అసమర్థులుగా ఉండేది ఎందరో.
J.ANJANEYULU అభిప్రాయం:
December 23, 2008 4:42 am
మీ కథ చదువుతుంటే క్రమ శిక్షణ పేరు తో ఎంత మంది పిల్లలు ఇలాగ బాల్యంలో నలిగి పోతున్నారో కదా! అని చాలా బాధ వేసింది. చాలామంది అనుభవించిన ఈ సంఘర్షణని గుర్తుకు తెచ్చారు. మా పెద్దల కి ఎదురు చెప్పలేక నా భావాలను అణచుకొని సర్దుకు పోతున్న నా జీవితంతో పోల్చుకున్నాను.
జమిలి ఆంజనేయులు,
ఊర్మిళా నగరు, విజయవాడ-12
Sree అభిప్రాయం:
April 20, 2009 11:25 pm
నేను కూడా నా కొడుకు గురించి చాలా ఆలోచనలు, ఆశలు పెట్టుకుని ఉన్నాను.. నాకింకా పెళ్లి కాకుండానే.. అత్యాశే అయినా ఇది నిజం. కానీ, మీ కథ చదివాకా నా ఆలోచనతీరు మారుతుందేమో..