సాయంత్రం అయ్యింది. ఇంట్లో దీపాలు వెలిగాయి. కొంచెం కొంచెంగా కృష్ణ గాలులు తిరిగాయి. వరండాలో పెళ్ళికూతురి ఆడ , మగ కజిన్లు, మల్లెపూలు గుట్టలుగా పోసుకుని దండలు గుచ్చుతున్నారు. నవ్వుకుంటూ అందరూ స్కూలు, కాలేజీ పంతుళ్ళ మీద కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆశ్చర్యం! పెళ్ళి కొడుకు తన హెరాల్డు కారు వేసుకు దిగాడు.
“చీకట్లో ఇప్పుడా. ఆ రోజు సినిమా ప్రోగ్రాము ఏమీ లేదే. మెట్లెక్కి వరండాలోకి వచ్చాడు, కారు తాళాలు తిప్పుకుంటూ. అదేంటి? సోగ్గాడు, తెల్ల సిల్కు చొక్కా, తెల్ల పైజమా వేసుకు వచ్చాడు. ఎందుకో గాని, మెల్లి మెల్లిగా మిగతా వాళ్ళంతా లోపలికి పారిపోయారు. ఎవరికి తప్పినా ఆమెకు తప్పదు కదా! ఏముంటుంది ఇతనితో మాట్లాడటానికి? ఇంకా నయం తిరుచూర్ణం పెట్టుకుని రాలేదు. అంతమటుకి రక్షించాడు” అనుకుంది ఆమె. ఆమెకు పెళ్ళయ్యాక జరిగిన ఒక సంఘటన చటుక్కున గుర్తు వచ్చింది.
ఒకరోజున ఆమె స్నేహితురాళ్ళు ఆమెను బలవంతం చేసి, “మీ పెళ్ళప్పుడు, మేమాయనతో సరిగా మాట్లాడలేదు. ఇవ్వాళ వాళ్ళింటికి వెళ్ళి వద్దాం. మన స్వర్ణ కారు తెచ్చింది. ఆమె ఆయన చుట్టమేగా. వెళ్దాం. వెళ్దాం” అన్నారు. అంటే ఆమెకు ఠారు పుట్టి, “ఆయన ఊళ్ళో లేడు, మెడ్రాసు వెళ్ళాడు” అని చెప్పింది. స్వర్ణ, “లేదు, లేదు. అన్నయ్య వచ్చాడు. నాకు తెలుసు.” అంది. “పద, పద” అని తనను తొందరించి తనను వాళ్ళింటికి లాక్కెడితే , అందరూ హాల్లొ కూర్చుని ఉండగా, వాళ్ళ అత్తగారు వచ్చి విషయం తెలుసుకుని, నవ్వుకుని, ఆమె లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకు ఫలహారాలు పంపించింది. కొంత సేపటికి, లోపల్నుంచి ఒక బోడిగుండతను వచ్చాడు. ఆమె ” ఏయ్! వెళ్ళి మీ అయ్యగార్ని పిలుచుకు రా” అంది.
అతను ఇంకా దగ్గరగా వస్తూ – “ఏ అయ్యగార్ని?” అన్నాడు.
ఆమె స్నేహితురాళ్ళంతా , అటూ ఇటూ తిరిగి, నవ్వు దాచుకోలేక పడి, పడి నవ్వారు. ఆమెకు చాలా చిన్నతనమనిపించింది. ఆ క్షణంలో, ఆమెకు ఆ అందవికారపు మనిషిని తన మొగుడుగా తన స్నేహితురాళ్ళు చూసే సరికి, ఆమెకి భూమి చీలి సీతాదేవిలా తనను మింగేస్తే బాగుండనుకుంది. అతనంటే చెప్పలేని అసహ్యం జనించింది.
“ఎవ్వడైనా మతి ఉన్నమగాడు గుండు కొట్టించుకుంటాడా!” అనుకుంది. “అబ్బ! ఆ దేవదేవి, ఉండి ఉండీ ఆ బోడిగుండు విప్రనారాయణని ఎందుకు ప్రేమించిందో, ఆ వరూధుని, ఆ పిలక ప్రవరుడిని ఎలా ప్రేమించిందో? ఆ ఆడవాళ్ళ దివ్య సౌందర్యాలెక్కడ, ఆ దిక్కుమాలిన మగవాళ్ళ వికారపు ఆకారాలెక్కడ?” అనుకుంది.
తనేమో పుస్తకాల్లో నారాయణరావునీ, గోన గన్నారెడ్డినీ, డార్సీనీ, సినిమాల్లో ఓమర్ షరీఫు, పీటర్ ఓటూల్నీ ప్రేమించినదాయె! ఇటు నిజ జీవితంలో తన తండ్రి గ్రెగరీ పెక్, రాక్ హడ్సన్ కీ అన్నో తమ్ముడో లాగా ఉంటాడు. మరి ఈ జియ్యరు స్వామి భక్తుడు తనకి భర్తగా ఎందుకు దొరికినట్లు! అతనేమో ఈ భావాలకు అతీతుడనుకుంటా. ఆ బోడి గుండుతోనే నాన్నగారింటికి కూడా వచ్చేవాడు. అతనికి మళ్ళీ నెత్తి మీద జుట్టు వచ్చేదాకా యమగండమై పోయింది. ఏమైతేనేం? ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ ఒత్తుగా జుట్టు వచ్చింది. ఇంట్లో వాళ్ళూ ఆ చాటుకీ ఈ చాటుకీ వెళ్ళీ నవ్వుకోటం ఆపేశారు.
అలాటి ఆ ప్రవరుడు, ఇప్పుడు సిల్కు బట్టలు సింగారించి రాత్రిపూట దిగబడడం పెళ్ళికూతురికి ఏం నచ్చలేదు. కాసేపు ఏదో అర్థం పర్థం లేని మాటలు నాలుగు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సందులో ఒక నవ్వారు మంచమ్మీద పడి నిద్రపోయింది.
అర్థరాత్రి, కుక్కలూ నక్కలూ కూసేవేళ, బెజవాడలో ఇళ్ళల్లో దొంగలు పడేవేళ, ఆమెను ఆమె తల్లి వచ్చి లేపింది.
ఆమె ఉలిక్కి పడి, అలవాటు ప్రకారం కళ్ళింతగా లేచింది, అయోమయంగా, “నాన్నగారు రామాయణం చెబుదామనుకుంటున్నారా? రాముడూ, సీతా అడవికి వెళ్ళారా” అంటూ… ఆమె తండ్రి ఎంత రాత్రివేళ వచ్చినా నిద్రలోంచి లేచి, ఎన్ని గంటలు సోది చెప్పినా ఊకొడుతూ వినేది.
ఆ రాత్రి తీరా చూస్తే లేపింది తల్లి.
“ఏమిటి లేపావ్!” అంది విసుగ్గా.
“అమ్మా! ఈ సందులో పడుకున్నావే! లేచి వెళ్ళీ, లోపల పడుకో!”
“ఎందుకు? ఇక్కడ బాగానే ఉంది”
“అమ్మా! అబ్బాయి నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు.. ”
పెళ్ళి కూతురికి ఒక్కసారి మత్తు వదిలింది.
“ఏ అబ్బాయి!?”
“ఏ అబ్బాయేంటి? అదేంటే అట్లా అడుగుతావు. సాయంత్రం వచ్చాడుగా అల్లుడుగారు.”
పెళ్ళి కూతురు మత్తు పూర్తిగా వదిలింది.
“ఇంకా వెళ్ళలా వాళ్ళింటికి? ”
తల్లికి సిగ్గుగా ఉంది. ఈ కూతురికి ఆమె ఎప్పుడూ ఏమీ చెప్పి ఎరగదు. అన్నిటికీ ‘మీ నాన్న నడుగు’ మంత్రమే వచ్చు ఆమెకు. “వెళ్ళమ్మా .వెళ్ళు. లోపలికి వెళ్ళి పడుకో. బాగుండదు. ఇప్పటికే ఆలస్యం ఐపోయింది. బాగా నిద్ర పోతున్నావని లేపలా” అంది. పెళ్ళికూతురికి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. అప్పుడు అర్ధమయ్యింది. ఆమెకు తెలియకుండా, ఆమెకు సంబంధించిన విషయంలో ఎవరి మధ్యనో, ఏదో ఏర్పాటు జరిగిపోయింది. ఇందులో, ఈ కుతంత్రంలో, అమ్మా, నాన్నలూ, పక్కింటి వెకిలి పిన్నీ, తన మేనత్త, ఇంట్లో ఇంకా దిగబడిన చుట్టాలూ ఎందరో ఉన్నారు. తను మాత్రం లేదు.
ఏమిటి ఈ దాష్టీకం? తన మీదే? ఇన్ని చదువులు చదివిన తనమీదే? వీళ్ళల్లో ఒక్కళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కరు చదవగలరా ? ఒక్కళ్ళకు తెలుసా తనకు తెలిసిన విషయాలు? ఏమిటి వీళ్ళు తనకు చెప్పేది? ఎవరిచ్చారీ అధికారం ఈ మూర్ఖులకు?
ఆమె కళ్ళమ్మట బొటబొటా నీళ్ళూ కారిపోయాయి . తనకు పెళ్ళి ఐపోయింది. ఇంక వీళ్ళ పెత్తనం ఏమిటీ, అతనూ, తనూ చూసుకోలేరూ తమ విషయాలు?
‘ఏమిటిది చిన్నపిల్లలా? అతనంటే నీకిష్టమేగా. ఏమనుకుంటారు, నువ్వు గదిలోకి వెళ్ళక పోతే. ఇంట్లో ఇంకా చుట్టాలున్నారు. వాళ్ళు వింటారు. వాళ్ళింట్లో వాళ్ళకి అబ్బాయి వెళ్ళి చెబితే? ఎవరికి తెలిసినా ఎంత అప్రతిష్ట. నలుగురూ నవ్వరూ. రేపొద్దున ఊళ్ళో మొహం ఎత్తలేం” అంది ఆమె తల్లి.
అసలు వాళ్ళమ్మ ఏనాడూ ఏం మాట్లాడుతుందో పెళ్ళి కూతురికి అర్థం కాదు. అసలు తల్లి భాషే అర్థం కాదు. తను తన మొగుడి గదిలోకి వెళ్ళడానికీ, వెళ్ళక పోవటానికీ, ఇంట్లో చుట్టాలకీ, బైటి ప్రపంచంలో తమని ఎరగనే ఎరగని వాళ్ళకీ ఏం సంబంధమో ఆమెకేమీ అర్థం కాలేదు. వాళ్ళమ్మ వెర్రిదా? మనిషా? కాదా?
ఆమె తల్లి “చీర మార్చుకో” అని చేతిలో ఒక సాదా చీర పెట్టబోయింది. పెళ్ళి కూతురు ఆమె చెయ్యి తోసి పారేసి, మళ్ళీ కళ్ళనీళ్ళు కార్చసాగింది. తల్లి చీర చేతిలొ పెట్టబొతుందీ, ఆమె తోసేస్తుందీ…ఏడుస్తుందీ.. “ఛీ! అశుభం, ఏడవకు”, అని తల్లి చీర చేతిలో పెట్టబోతుందీ..
ఇంతలోకి ఆమె మేనత్త వచ్చింది రంగం లోకి. ఆమె కళ్ళు పత్తికాయలంత చేసి, ఆమెను జడిపించటానికి హుంకరించింది. “లేచి ముఖం కడుక్కుని, ఈ చీర కట్టుకో. ఈ చీరే కట్టుకోవాలి. రేపు ఈ చీర చాకలిదానికివ్వాలి. దానికి నచ్చిందే పట్టుకొచ్చాం. రేపివ్వకపోతే, అది మర్నాడు రాదు.”
పెళ్ళికూతురు ఆ దారుణపు మోటు మాటలకు నిర్ఘాంత పోయింది. ఆమె మాటలు మానేసింది. కళ్ళమ్మట ధారలుగా నీళ్ళు కారిపోతున్నాయి.
“మీ నాన్న గారాం మరీ ఎక్కువయ్యింది. ఐనా ఏమిటికి ఈ నాటకం. పెళ్ళి అని చెప్పగానే ఎగిరి గంతేసి చేసుకున్నావుగా. ఇప్పుడు నంగనాచిలా ఈ ఏడుపు ఎందుకు? నీ ఈడుకు మేము ఇద్దరు పిల్ల తల్లులం, నువ్వేమన్నా దిగివచ్చాననుకుంటున్నావా?”
పెళ్ళి కూతురు తన మేనత్త గుడ్లు పీకి పక్కన పెడదామనుకుంది. పక్కనే గొడ్ల పాక చూరునుంచి ఒక కర్ర పీకి అమ్మనీ, అత్తనీ – ఇద్దరినీ వాయిద్దామనుకుంది. ఒక ఉతుకు ఉతుకుదామనుకుంది.
మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చి, “మా నాన్నగారేరీ, మా నాన్న గారిని పిలవండి.” అంది.
“నీ వేషాలు తెలిసే మీ నాన్న, మెడ్రాసెళ్ళి పోయాడు, లేడు, మీ నాన్న. రాడు.” అంది మేనత్త వెటకారంగానూ, చేతులు తిప్పుకుంటూనూ.
పక్కన గొడ్ల పాకలో గొడ్లు కూడా ఆశాంతిగా కదలటం మొదలెట్టాయి. వాటి గొంతులోనే అదిమి పెట్టిన అరుపులు ఆ రాత్రిపూట వికృతంగా వినవచ్చాయి. వాటి కదలికకు రొచ్చు వాసనలు లేచి పెళ్ళి కూతురి ముక్కుకు తగిలి, ఆమెకు ఇంకా జుగుప్స కలిగింది.
ఈ గుసగుసలు, గొడ్ల కదలికలకు లేచిన, ఆమె కంటే పెద్దైన ఆమె పెదనాన్న కొడుకు దగ్గరగా వచ్చి నుంచున్నాడు. అతనికి అంతా నిమిషాల మీద అర్థం అయ్యింది. పాపం, ఆ పిల్ల పెద్దమనిషి అయ్యినప్పుడు కూడా, ఇదే తంతు. అతను వెళ్ళి ఆకులు తీసుకు రావాలీ, ఆమె ఆ ఆకుల మీద పరిచిన ఆ దుప్పటి మీద, వచ్చే పోయే వారందరికీ తెలిసేట్లు, ఆ ఆకుల మీద కూర్చోవాలీ. అప్పుడు కూడా ఇదే తంతు. ఇదే దుఃఖం. అతనికి తెలుసు. ఆమె భౌతికంగా ఈ ఇంట్లో ఉంటుంది. ప్రతి నిమిషం ఒకరి నంటుకుని ఒకరు తిరుగుతూ, ఒకరిని ఒకరు కారాడుకుని, ఒకళ్ళకొకళ్ళు ఆచారాలు, కట్టడులు సంకెళ్ళు వేసుకునే ఆ ఇంటిలోని వారికి, అన్ని పుస్తకాలు చదివిన ఆమె స్వేచ్ఛాత్మ అర్థంకాదు. ఆమె ఎందుకు ఏడుస్తున్నదీ వారికి తెలియదు. ఆమె ఏడుపు అతను చూడలేకపోయాడు.
అతను ఆమె తల్లినీ, మేనత్తనీ పక్కకు వెళ్ళమని , ఆమె దగ్గర వచ్చి కూర్చుని, “ఏమిటి చెల్లీ? ఏం పర్వాలేదు. వెళ్ళు.” అన్నాడు. ఆమె అతని భుజాలమీద పడి గుండెలు అవిసిపోయేలా, అవమానంతో, తన జీవితం మీద వేరే వాళ్ళు చేసే అదుపు వల్ల కలిగిన అసహ్యంతో, ఒళ్ళంతా కదిలి పోయేలా ఏడ్చింది.
తను పెళ్ళి తన కోసం చేసుకుందా! తండ్రి వచ్చి, “అమ్మా, నువ్వు వాళ్ళబ్బాయిని చేసుకుంటావు, అని నేను వాళ్ళకు మాటిచ్చాను,” అని చెబితే “అలా ఎందుకు చేశారు?” అని ఆయన్ను కోప్పడి, తండ్రి మాట నిలపటం కోసం తను ఈ పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ఇంత విశ్వాసం లేకుండా, తను పెళ్ళి కోసం ఎగబడి చేసుకుందనీ, పిచ్చి మాటలు, తనమీద ఈ అర్థరాత్రి ఈ దాడీ, ఈ బలవంతం. ఛీ! వీళ్ళ ముఖం చూడకూడదు, అనుకుని , ఆమె తన అన్న చేతిలోంచి చీర ఊడలాక్కుని, అతని వంక, ఎవరి వంక చూడకుండా చరచర లోపలికి వెళ్ళిపోయింది.
కుములుతూ, చీర మార్చుకుంటున్న ఆమెకు, తను చేసుకున్న వాడి మంచితనం గుర్తొచ్చింది. ఈ గొడ్లు. వీరి కన్నా అతడే నయం. అనుకుని గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ రెండు మంచాలు. తండ్రి మంచం మీద అతడు పవ్వళించి ఉన్నాడు. మళ్ళీ ఆమెకు కోపం పొంగి వచ్చింది.
“అబ్బో! ధనవంతుడన్నారు. తన ఇంటికి కూడా తీసుకు పోలేడు పెళ్ళాన్ని? ఇలా మా నాన్న ఇల్లు పట్టుకు ఎందుకు వేళ్ళాట్టం. సోంబేరి. వాళ్ళమ్మ చెబితే పూజ, గీజ చేసుకుని వచ్చి పడుకున్నట్టున్నాడు” అనుకుని ఆ చిన్న మంచం మీద గోడ వైపు తిరిగి పడుకుని ఆలోచించుకోసాగింది.
పక్క మంచం మీది కదలికలు మొదలయ్యాయి. అతనికి నిద్ర పట్టటం లేదు లాగుంది. చేపలా కొట్టుకుంటున్నాడు. అటు తిరుగుతాడు. ఇటు తిరుగుతాడు? మధ్యలో నిట్టూర్పులా అవి? ఆమె గమనిస్తూంది అన్ని శబ్దాలూ. అవతలి పక్కకు తిరిగి పడుకునే “అసలెందుకు వచ్చాడు. ఎవరో ముహూర్తం పెట్టి పంపితే వచ్చాడు, పెళ్ళి కొడుకు! సిగ్గూ శరం లేవు? మగతనం లేని ఇతడా తనకు మొగుడు? ” అనుకుంది.
నిమిషాలు దొర్లిపోయి, గంటలై పోతున్నాయి. అతడు తట తటా కొట్టుకుంటున్నాడు. కొంచెంసేపటికి ఆమెకు జాలి వేసింది. పాపం అతనికి లేదా? పోదా? సొంత ఇల్లు ఉంది. ధనవంతుడు. ఇప్పుడు ఎందుకు వచ్చి వేరే వారి ఇంట్లో ఈ మంచాల మీద పడుకుని పొర్లటం. ఊళ్ళోనే ఉన్నా తను అత్తవారింటికి ఒక్కసారి వెళ్ళదు. ఎవరితో మాట్లాడదు. అతను తన కోసం రోజూ వస్తాడు. తను ఒక్క రోజు అతన్ని సౌమ్యంగా పలుకరించదు. ఇంట్లో అందరి దగ్గరా అతడిచ్చిన బహుమతులే. తనకు మాత్రం? ఎన్ని విలువైన బహుమతులిచ్చాడు! తనతో ఒక్క సారి కూడా పొల్లు మాట మాట్లాడలేదు.
ఆమె గుండె కరిగింది. తన చేతిని పక్క మంచం మీదికి సాచి అతని చేతి మీద ఉంచింది. అతడు దిగ్గున లేచి , ఆమె మంచం మీద వచ్చి కూర్చున్నాడు. ఆమె కూడా లేచి కూర్చుంది. దీపం కాంతిలో అతడు ఆమె ముఖం చూశాడు. వడిలిపోయి ఉంది. కమిలిపోయి ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి.
అతడు అమెను కౌగిలించుకున్నాడు బాధతో, కరుణతో. అతని కళ్ళలో నీళ్ళు. “క్షమించాలి, మిమ్మల్ని చూడకుండా ఉండలేక రోజూ వస్తున్నా. మీ నాన్నగారు ఉండరనీ, రెండురోజులు ఇక్కడ వచ్చి తోడుగా ఉండమనీ నాకు కబురు వచ్చింది. అందుకని వచ్చాను. తీరా ఈ గదిలోకి వచ్చాక ఈ రెండో మంచం. నాకు అప్పుడు అర్థమయ్యింది. కానీ, మీరెంతకీ రాలేదు. మీకు కూడా ఏం చెప్పి ఉండరని అప్పుడు నాకు సందేహం కలిగింది. మీ అభిమానం, రోషం, సంగతి నేను విని ఉన్నాను. నాకు ఈ తతంగం విషయం ఇంతదాకా తెలియదు. మిమ్మల్ని లోపల ఏం బాధ పెడుతున్నారో అని నేనే వద్దామనుకున్నా. వచ్చే వాడినే ఇంకొంచెం ఉంటే. అయ్యో! ఏడ్చారా! నా మూలంగానా!” అన్నాడు.
అతని నిజాయితీకి ఆమె కదిలిపోయింది. ఆతని స్నేహపూరితమైన మాటలకు ఆమె కరిగిపోయింది. ఆమె పెదాలపై నవ్వు విరిసింది.
అతడు, “మనింటికి వెళ్ళిపోదామా? నా కారు ఎలాగూ బయటే ఉంది. మీరు వస్తారని ఇంటికి రంగులు వేయించాను. కొత్త మొక్కలు పెట్టించాను. ఇంకా ఎక్కువ నౌకర్లను పెట్టాను. వంటవాడు ఎలాగూ ఉన్నాడు. మీకేం కష్టం ఉండదు.” అన్నాడు.
ఆమె ఆశ్చర్యపోయి, “ఇప్పుడా ఈ చీకట్లోనా, మద్రాసా !” అంది.
“ఇంకా చీకటి ఎక్కడ? రాత్రి గడిచే పోయింది. తెల్లవార బోతున్నది. కొంచెం దూరం ప్రయాణం చేసి, హాయిగా టిఫినూ కాఫీ తీసుకుని, మళ్ళీ మిగతా ప్రయాణం చెయ్యొచ్చు. మధ్యలో మనిష్టమైన చోట ఆగిపోవచ్చు. డ్రైవింగు నాకు అలవాటేగా. ఎప్పుడు వెళుతూ వస్తూనే ఉన్నాగా.”
ఇద్దరూ లేచి గది బైటికి వచ్చారు.
గది బైట గుబులుతో నిద్ర పట్టని బావమరిది తచ్చాడుతున్నాడు. చెల్లెలు లోపల ఏ స్థితిలో ఉందో అని ఆదుర్దాతో. పెళ్ళికొడుకు అతన్ని చూసి నవ్వు ముఖంతో, “మీ చెల్లెలి కేం భయం లేదు లేవయ్యా. మేమిద్దరం మా ఇంటికి వెళ్ళి పోతున్నాం. ఇంట్లో వాళ్ళు లేచాక చెప్పు” అన్నాడు.
“బావగారు! బావగారు! ఇప్పుడా.” అని అతడు అంటూనే ఉన్నాడు. చుట్టాలు పక్కాలు ఎవరు లేచారో, ఎవరు విస్తుపోయారో, ఎవరు వారి దారిలో ఉన్నారో, ఏం అన్నారో, ఏం పట్టించుకోకుండా, ఆ తెలి తెలి వెలుగుల్లో అతడు ఆమెను తన తెల్ల హెరాల్డు కారెక్కించి తీసుకెళ్ళి పోయాడు.