మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
బొరుగుల మిఠాయి నములుతూ
అరిగిపోయిన జోళ్ళు ఈడ్చుకుంటూ
మేకలు తోలుకుపోతోంది ఓ పిల్ల
గుడ్డ మూట తల కింద పెట్టుకొని
పాడుబడ్డ మండపంలో బరివి గడ్డం సన్యాసి
తత్వమొకటి ఎత్తుకుంటున్నాడు
చింత చెట్టు పరిచిన నీడ కింద
తేగల బుట్ట పక్కన పెట్టుకొని
నోరు తెరిచి నిద్రపోతోంది ఓ అవ్వ
సాలీడు లేసులల్లిన సమాధి మీద
నిలబడిన దిసమొల వాడొకడు
హ్హహ్హహ్హ అని కేకలు వేస్తున్నాడు
ఊళ్ళోకి దారెటంటూ వీళ్ళల్లో
ఎవరిని అడగాలా అని
తికమక పడిపోతూ
నిలబడి పోయేను.
Subrahmanyam Mula అభిప్రాయం:
November 1, 2008 11:16 pm
మంచి వాతావరణ కల్పన ఉంది. పడికట్టు పదాలు లేకపోవడం మీ కవిత్వ బలం. keep writing!
Indrani Palaparthy అభిప్రాయం:
November 3, 2008 3:46 am
సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు.
మీకు సమయం దొరికినప్పుడు మరికొన్ని కవితలు
ఇక్కడ చదువవచ్చును.
http://teneetikappu.blogspot.com/
ఇంద్రాణి పాలపర్తి.
bollojubaba అభిప్రాయం:
November 3, 2008 7:16 am
మాంచి లాండ్ స్కేప్ పేంటింగ్ మధ్యలో నన్నూ నుంచోబెట్టేసారు.
బాగుంది
lyla yerneni అభిప్రాయం:
November 4, 2008 12:06 pm
భలే సరదాగా ఉంది కవిత. ఇంకా ఆ ఊళ్ళోకి వెళ్ళాలనే! ఎందుకు! :-)
ఇంతకు ముందు సంచికలో -తారామతి బిరాదరి- కూడా బహుత్ ఖూబ్. Haunting. Spell casting.
‘మబ్బు కొప్పు’ లోంచి బదులు, మబ్బు జుల్ఫ్ నుండి నీటిపూలు రాలి కొమ్మల్లో చిక్కుపడరాదా?
మీ పొయెట్రీ లింకు ఇచ్చారు. చదువుకుంటాను. థేంక్యూ ఇంద్రాణీ!
లైలా
పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:
November 4, 2008 12:24 pm
ఎందుకు, ఎలా, అని అడక్కండి. నా దగ్గర నిజంగానే సమాధానం లేదు. కానీ యెందుకో పై కవిత చదవగానే సత్తసాయ్ (గాథాసప్తశతి) లోని “గాథలు” కొన్ని, అలాగే సుభాషిత రత్నకోశం, సుభాషిత రత్నభాండాగారాల్లోని కొన్ని ప్రకృతి వర్ణనలతో కూడిన సంస్కృత పద్యాలు గుర్తుకొచ్చాయి. లైలాగారన్నట్లు నిజంగా సరదాగా వుంది మీ కవిత. అభినందనలు.
భవదీయుడు,
శ్రీనివాస్
Seetha Kumari అభిప్రాయం:
November 6, 2008 11:31 pm
ఎన్నె సార్లు చదివినా చదవాలనిపిస్తున్నది కవిత…. ఇంత చక్కగా ఎలా వ్రాస్తారబ్బా….
Audisesha reddy Kypu అభిప్రాయం:
November 9, 2008 5:16 am
ఇంద్రాణి గారూ! మీకు అలాంటి ఊరిలోకి పోవాలనే కోరిక ఎందుకు కలిగిందో! సాయంత్రం దాకా చూడండి. మరి ఎవరయినా చెప్పగలిగే వారు వస్తారేమో! సరదాగా అన్నాను. కోప్పడకండి. మీ కవిత బాగుంది.
నా రచనలు… audiseshareddy.blogspot.com లో వున్నాయి.
—- ఆదిశేషా రెడ్డి కైపు. నెల్లూరు.
krishna a అభిప్రాయం:
November 12, 2008 10:22 pm
మేకలు తోలే పిల్లని అడగ వచ్చుకదా. మరి సమస్య ఏమిటి?
Indrani Palaparthy అభిప్రాయం:
November 13, 2008 10:11 pm
కృష్ణ గారు, ఎవరిని అడగాలా అని తికమక పడడం ఎవరి ఆనందాన్ని భంగం చేయడం ఇష్టం లేకే.ఆ మాటకొస్తే సన్యాసిని కూడా అడగ వచ్చును కదా!.
పాలపర్తి ఇంద్రాణి.
వెన్నెలకంటి వసంతసేన అభిప్రాయం:
November 15, 2008 12:27 pm
ఇంద్రాణి గారు — మనోహరంగా, కులాసాగా, భావానికీ భాషకూ ఎలాంటిసమన్వయలోపమూ లేకుండా చాలా హృద్యంగా వ్రాశారు! జోహారు! - వె.వ.
Krishna అభిప్రాయం:
November 18, 2008 12:42 am
పిల్ల, అవ్వ చివరి లైన్లలో పెట్టారు.
సన్యాసిని, దిసమొల వాడిని మధ్య లైన్లో పెట్టారు. ఎందుకూ!?
వాటిని కూడా చివర వాక్యాల్లోనే పెట్టొచ్చుగా!?
గుడ్డ మూట తల కింద పెట్టుకొని
తత్వమొకటి ఎత్తుకుంటున్నాడు
పాడుబడ్డ మండపంలో బవిరి గడ్డం సన్యాసి
(ఇక్కడ మూట కింద పెట్టి, తత్వమెత్తుకోవటం కాంట్రాస్టు పదాల్లాగ చక్కగా కనబడతాయి గదా!)
హ్హహ్హహ్హ అని కేకలు వేస్తున్నాడు
సాలీడు లేసులల్లిన సమాధి మీద
నిలబడ్డ దిసమొల వాడొకడు
(సమాధికి లేసులున్నాయి.దాని మీద దిసమొల వాడు!)
ఏమంటారు!?
Sastry అభిప్రాయం:
November 18, 2008 11:49 pm
కృష్ణ గారు,
మీ మొదటి అభిప్రాయం బాగుంది. మీకు సమాధానము కూడా లభించింది. ఈ కవిత నాకు ఎంత గానొ నచ్చింది. కవయిత్రి గారు తన భావాలను మంచి కవిత గా మనకు బహూకరించారు. వెన్నలకంటి వసంతసేన గారు చెప్పినట్టు ఎంతో మనోహరంగా, కులాసాగా, భావానికీ భాషకూ ఎలాంటిసమన్వయలోపమూ లేకుండా చాలా హృద్యంగా ఉంది ఈ కవిత.
ఇక మీ రెండవ అభిప్రాయం - మీ భావాలను కవయిత్రి గారి మీద రుద్దటము ఎంత మటుకు సమంజసము? ఎవరి శైలి వారికుంటుంది కదా!!ఏమంటారు!?
Krishna అభిప్రాయం:
November 24, 2008 11:57 pm
అనుకున్నా ఈ పొరబాటు జరుగుతుందని. నేను వేరు. మొదటి అభిప్రాయం వెలిబుచ్చినది కృష్ణ ఎ. గారు. నేను వేరే కృష్ణ (Krishna) ని.
ఇప్పుడు చెప్పండి నా అభిప్రాయం కూడా బానే ఉందేమో. కవిత నాకూ నచ్చింది. కానీ, ఇంకేదో చెయ్యాలనిపించింది. అంతే.
tavva obul reddy అభిప్రాయం:
November 25, 2008 9:13 am
మా కడప జిల్లా లో ఇలాంటి పల్లె ఒకటి గుర్తొచ్చింది, ఈ కవిత చదివాక!
చాలా బాగుంది. అభినందనలు!
_ తవ్వా ఓబుల్ రెడ్డి
శ్రీనివాస్ అభిప్రాయం:
December 12, 2008 4:08 am
ఊరి బయటే వూరంతా (కళాకారులంతా) కనబడిపోతే వూళ్లోకి వెళ్లాల్సిన అవసరం కలగలేదనుకుంటాను. జోళ్లు అరుగుతాయి, మేజోళ్లు (సాక్సులు లేదా స్టాకింగులు) చిరుగుతాయి అనుకుంటున్నాను. మేకలు తోలుకునే పల్లెటూరమ్మాయి, మేజోళ్లేసుకోవడం నప్పలేదేమో!
తప్పులెన్నువారు తండోపతండమ్ములు. భవిష్యత్తులో మరిన్ని మంచి కవితలు రాస్తారనీ ఆశిస్తాను.
Indrani Palaparthy అభిప్రాయం:
December 17, 2008 11:04 pm
[జరిగిన పొరపాటుకు చింతిస్తూ, రచయిత కోరికపై కవితని సవరించాము. -సం]
శ్రీనివాస్ గారు,
మంచి పరిశీలన. చిత్తు ప్రతిలో “జోళ్ళు” అనే వ్రాసుకున్నాను.టైపుకు వచ్చేటప్పటికి యధాలాపంగా జరిగిన పొరబాటు ఇది.మీరు చెప్పకపోతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు
మరిన్ని చేసి ఉండేదాన్నేమో.
కొన్ని లక్షల ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.