మనకు తెలియని మన త్యాగరాజు - 2
యక్షగానాలు
త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కృతిరచనకే పరిమితం చెయ్యలేదు. త్యాగరాజుకి అత్యంత ప్రీతిపాత్రమైన నృత్యనాటికలు కూడా రాసాడు. ఈ నృత్యనాటికలకి మూలం, అప్పట్లో బహుళ ప్రచారంలో ఉన్న యక్షగానాలు. ఎన్నో యక్షగాన బృందాలు ఊరూరా తిరుగుతూ తరచు ప్రదర్శనలిచ్చేవారు. బహుశా త్యాగరాజు ఈ యక్షగానాలు చూసి ఆకర్షితుడయ్యుండచ్చు. అందుకే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని యక్షగాన ప్రక్రియలో మిళితం చేసి మూడు నృత్య నాటికలు రాసాడు. అవి నౌకా చరిత్రం, ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం. మొదటి రెండిటి ప్రతులూ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. మూడోది దొరకలేదు. కానీ సీతారామ విజయం ఖచ్చితంగా రాసాడని సంగీత శాస్త్రజ్ఞలు విశ్వసిస్తారు. కాంభోజి రాగంలో “మా జానకీ చెట్టబట్టగా” అనే ప్రసిద్ధమైన కృతి ఈ సీతారామ విజయం లోనిదే అంటారు. అలాగే కేదార గౌళ రాగంలోని “వనజ నయనుడని వలచితివో” అనే కృతి కూడ ఇందులోదే అంటారు. ఈ కీర్తనలున్నాయి కానీ, ఈ నృత్య నాటిక ప్రతి మాత్రం లేదు. లోకనారాయణ శాస్త్రుల్లు అనే వ్యక్తి 1868 లో ఈ సీతారామ విజయాన్ని మొదటి సారి ప్రచురించారు. దురదృష్టవశాత్తూ ఒక్క ప్రతి కూడా ఇప్పుడు లేదు. ఈ సీతారామ విజయమే త్యాగరాజు రాసిన మొట్ట మొదటి నృత్య నాటికని అంటారు. కాదు, నౌకాచరిత్రమే మొదటి నృత్య నాటికని మరికొందరంటారు. ఏ కాలంలో ఏది రాసిందీ తెలీదు.
నౌకాచరిత్రమే ముందు రాసిఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది త్యాగరాజు రెండో వివాహం అయిన కొత్తల్లో రాసాడు. దాదాపు కృతులన్నీ భక్తి తత్వం మీదుగానే ఉన్నా కొన్ని చోట్ల శృంగారరసం మిళితమై కొన్ని కీర్తనలున్నాయి. ఏ కవీ తన వయసునీ, కాలాన్నీ దాటి పోలేడు. ఈ నిర్ధారణలు ఊహాజనితాలే - వీటికి ఆధారాల్లేవు. ఈ నౌకాచరిత్రం తాళపత్ర గ్రంధం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉంది. ఈ ప్రతి తమిళలిపిలో ఉంటుంది. ఈ నౌకా చరిత్రాన్ని 1939 లో సాంబమూర్తి ప్రచురించారు. ఆయనకి దీని ప్రతి కృష్ణస్వామి భాగవతార్ (త్యాగరాజు శిష్యుడు) కొడుకు కె.కె. రామస్వామి భాగవతార్ ద్వారా లభించింది. వీళ్ళందర్నీ వాలాజపేట శిష్యులంటారు. ప్రతీఏటా వైకుంఠ ఏకాదశి నాడూ ఈ వాలాజపేట శిష్యులు నౌకా చరిత్రం పాడేవారని సాంబమూర్తి రాసారు.
దీనిలో కథ పూర్తిగా త్యాగరాజు కల్పన. శ్రీకృస్ణుడు గోపికల మధ్యన నౌకావిహారం అనే కొత్త సన్నివేశాన్ని కల్పించాడు. గోపికలతో కలసి యమునా నదిలో నౌకా విహారయాత్ర కెళితే గాలివానలో చిక్కుకున్న గోపికల్ని రక్షించే దైవంగా కృష్ణుణ్ణి చిత్రీకరిస్తూ - శృంగారాన్నీ, భక్తినీ, తత్వాన్నీ చూపించాడు. గోపికలు యమునా నదిలో నౌకా విహారానికి వెళదామని సిద్ధమవుతారు. వారితో బాలకృష్ణుని వెంట తీసుకెళ్ళాలా, వద్దా అని సంశయిస్తారు. బాలుణ్ణని శంకించ వద్దని చెబుతూ, కాళింది మడుగులో కాళీయుని మదమడచి గోపబాలుర్ని రక్షించలేదా అంటూ, కృష్ణుడు వాళ్ళని సమాధానపరిచి వారితో బయలదేరుతాడు. ఆనందంగా సాగే నౌకాక్రీడ మధ్యలో గాలివాన వస్తుంది. ఇంతలోనే ఓడకు చిన్న కంత ఏర్పడి నీరు వచ్చే ప్రమాదముందని కృష్ణుడు హెచ్చరిస్తాడు. గోపికలు వినరు. ఆ కంత కాస్తా పెద్దదయ్యి నౌక మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చివరకి అందరూ చిన్నవాడైనా కృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు. వారి భక్తికి మెచ్చి కృష్ణుడు నౌకను ఒడ్డుకు చేరుస్తాడు. నౌకా విహారం శుభప్రదంగా ముగుస్తుంది. స్థూలంగా ఇదీ కథ.
ఈ నృత్య నాటిక త్యాగరాజు అపారమైన ప్రతిభని చూపిస్తుంది. ఇందులో సుమారు 27 రాగాలు వాడారు. మొత్తం అయిదు అంకాలుగా ఈ నృత్య నాటిక నడుస్తుంది. ప్రసిద్ధి చెందిన “ఓడను జరిపే ముచ్చట కనరే”, “ఎవరు మనకు సమానమిలలో”, “ఏ నోము నోచితిమో”, “గంధము పూయరుగా” వంటి కీర్తనలు ఈ నౌకా చరిత్రం లోవే! ఇందులో వాడిన రాగాలూ, కీర్తనలూ అతి రమ్యంగా ఉంటాయి. ఈ నౌకా చరిత్రా రచనలో ఓ విశేషం ఉంది. ఇందులో కీర్తనలు నృత్య నాటికలో భాగంగా మాత్రమే కాదు విడిగా పాడినా కూడా ఏ కృతికాకృతి అర్థాన్నిస్తాయి. ఒక్కొక్కటీ వాటి సాహిత్యమ్మీదా, రాగమ్మీదా నిలబడతాయి. ఉదాహరణకి “గంధము పూయరుగా” కీర్తన విడిగా పాడుకోడానిక్కూడా చక్కగా ఉంటుంది. ఈ నాటికలో ఇంకో విశేషం కూడా ఉంది. మొదటి కీర్తన సురటి రాగంలో ఉంటుంది, చివర మంగళం కూడా ఇదే రాగంలో ఉంటుంది.
ప్రహ్లాద భక్తి విజయం నృత్య నాటిక కూడా గొప్ప సృజనతో రాసిందే! అందులో త్యాగరాజు కొన్ని ప్రయోగాలు చేసాడు. అందులో ఒకటి, అప్పట్లో నాటకాల్లోనైనా, నృత్య నాటికల్లోనైనా మంగళం ఖచ్చితంగా ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లోనే ఉండేది. ఇందులో మంగళం సౌరాష్ట్ర రాగంలో ఉంటుంది. ఇందులో వాడిన భాష శిష్టవ్యవహారికం. ఇందులో వాడే ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో దరువులూ, కందపద్యాలూ, సీసపద్యాలూ, ఇతర ఛందో పద్యాలూ, త్యాగరాజు తెలుగు సాహిత్య జ్ఞానానికి అద్దం పడతాయి. ఉదాహరణకి ప్రహ్లాద భక్తి విజయంలో ఈ కంద పద్యమూ, సీస పద్యమూ చూస్తే, త్యాగరాజుకి తెలుగు చందస్సుపై పట్టు తెలుస్తుంది.
కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా
సీస పద్యం:
స్థితి లయోధృవముల శ్రీహరి వేడ్కగా
గావించి చూచితా గాసి దీర
నీ యందు బవళించి నిర్మలాత్ముడు యోగ
నిద్ర సల్పెను కదా నిత్యముగను
నృత్యనాటికలు ప్రదర్శించారో లేదో ఎక్కడా వివరాలు దొరకలేదు. ప్రదర్శించి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆనందభైరవి రాగం గురించి ప్రచారంలో ఉన్న ఒక కథలో ఆయన నృత్యనాటికలు ప్రదర్శించిన ప్రస్తావన ఉంది. ఎందుకంటే ఆనందభైరవి రాగంలో త్యాగరాజు కేవలం మూడంటే మూడు కీర్తనలు రాసాడు. నృత్యనాటికలకీ, యక్షగానాలకీ ఆనందభైరవి రాగం ప్రాణం. అలాంటిది కేవలం మూడు కీర్తనలతో సరిపెట్టుకున్నాడా త్యాగరాజనిపిస్తుంది. ఉన్న కృతుల సంఖ్య 800 పైగా ఉంది. ప్రతీ రాగంలో కనీసం అయిదారు కృతులైనా ఉన్నాయి. ఒక్క ఆనందభైరవి రాగం తప్ప. దీనికి సంబంధించిన ఓ చిన్న కథ కూడా ఉంది.
త్యాగానంద భైరవి
దక్షిణాదిన కుంభకోణం దగ్గర్లో తిరిభువనం అనే వూళ్ళో స్వామినాధ అయ్యర్ అనే అర్చకుడొకాయనుండే వాడు. ఆయన సంగీత విద్వాసుండు. మంచి నటుడు కూడా. ఆనంద భైరవి రాగంలో మంచి పట్టుందాయనకి. ఓసారి తిరిభువనం స్వామినాధ అయ్యర్ బృందం ఓ యక్షగాన ప్రదర్శన నిమిత్తమై తిరువయ్యార్ వచ్చారు. ప్రతీ రాత్రీ వీళ్ళు యక్షగానం చేసేవారు. జనాలు తండోపతండాలుగా విచ్చేసారు. ఆనోటా ఈనోటా ఈ యక్షగానం సంగతి త్యాగరాజు శిష్యులకి తెలిసింది. ఓ రాత్రి ప్రదర్శన కెళ్ళారు. అందులో ఆనందభైరవి రాగంలో స్వరపరిచిన ఓ పాట (“మధురానగరిలో చల్లలమ్మబోదు” పాట అని అంటారు. ఎంతరకూ ఇది నిజమో ధృవీకరించడం కష్టం) వారినత్తుకుంది. శిష్యుల ద్వారా తిరిభువనం స్వామినాధ అయ్యర్ గురించి త్యాగరాజుకి తెలిసింది. స్వతహాగా నృత్యనాటికలంటే ప్రియం కనుక ఆ యక్షగానం చూడాలనీ, ఆ అనందభైరవి రాగంలో పాట వినాలనీ కుతూహలం కలిగింది త్యాగరాజుకి. ఆ రోజు రాత్రి ప్రదర్శనకి శిష్యులతో బయల్దేరాడు. యక్షగానం జరుగుతోంది. నిజంగా ఆనంద భైరవి రాగంలో పాట విని మంత్రముగ్ధుడయ్యాడు. నాటకం ముగిసాక సంతోషం పట్ట లేక వేదిక వైపుగా వెళ్ళాడు. తోటి సంగీత విద్వాంసుణ్ణి మెచ్చుకొని ఆనందభైరవి రాగం ఇంత గొప్పగా పాడిన స్వామినాధ అయ్యర్ ని సభాముఖంగా అభినందించాడు. త్యాగరాజు మెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయంకాదు. ఆ స్వామినాధ అయ్యర్ ఆనందం పట్టలేకపోయాడు.
త్యాగరాజు వంటి విద్వాంసుడు తనలాంటి వీధి నాటకాలు వేసుకొనే కళాకారుణ్ణి ప్రశంసించడం తన అదృష్టమని చెబుతూ త్యాగరాజుని ఒక వరమడిగాడు. “అయ్యా, మీరు సంగీతంలో మహా విద్వాంసులు. మీ నృత్యనాటిక చూసేకే ఈ అనందభైరవి రాగాన్ని ఈ యక్షగానంలో ఉపయోగించాను. మీవంటి వారు నన్ను ప్రశంసించడం నా అదృష్టం. మీరు నా ప్రదర్శన చూసారనీ, మీరు ఆనందభైరవి రాగం పాటని మెచ్చుకున్నారనీ తరతరాలుగా తెలియాలి. అలా జరగాలంటే మీరు ఆనందభైరవి రాగాన్ని నాకు దానమిచ్చేయండి. కేవలం ఈ ఆనందభైరవి రాగంలో మీరు ఒక్క కీర్తనా కట్టకపోతే సంగీత ప్రియులు అడుగుతారు. అప్పుడు నా యక్షగానం సంగతి తెలుస్తుంది. ఆ రకంగా నేనూ చరిత్రలో మిగిలిపోతాను. దయచేసి ఈ ఒక్క ఆనందభైరవి రాగాన్నీ నాకొదిలేయండని” అడిగాడు. త్యాగరాజు సరే అన్నాడు. అప్పటికే మూడు కృతులు ఆనందభైరవి రాగంలో కట్టాడు. ఆ తరువాత త్యాగరాజు అనందభైరవి జోలికి పోలేదు. “రామ రామ నీ వారము” అనే దివ్యనామ కీర్తనా, “క్షీర సాగర విహార” అనే ఉత్సవ సంప్రదాయ కీర్తనా, “నీకే తెలియక” అనే కృతీ తప్ప ఆనందభైరవిలో త్యాగరాజు రాసిన వేరే కృతుల్లేవు. ఇవి కూడా శిష్యుల ద్వారానే అందరికీ అందుబాటులోకొచ్చాయి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ కథ సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ ( page 164 -166 ) లో ఉంది.
బహు భాషా కోవిదుడు
త్యాగరాజు బహుభాషావేత్త. కేవలం తెలుగు లోనే కాదు. సంస్కృతం, తమిళ, కన్నడ, హిందీ మరియు మరాఠీ భాషల్లో ప్రావీణ్యముందని చెప్పే చాలా సంఘటనలున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆయన శిష్యులు చాలామంది తమిళులే! గోపాలకృష్ణ భారతి, మహారాజ స్వాతి తిరునాళ్ దూత, వడివేలు వచ్చినప్పుడూ తమిళం మాట్లాడినట్లుగా వారి వారి జీవిత చరిత్రల్లో రాసారు. కాశీ నుండి గోపీనాధ భట్టాచార్య అనే ఆయన త్యాగరాజుని అంత్య దశలో సందర్శించినప్పుడు, ఆయనతో హిందీలో మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయి. అలాగే శరభోజి రాజు అల్లుడు మోతీరావుతో మరాఠీ సాహిత్య చర్చల్లో పాల్గొన్నట్లుగా రాసారు. ఇవన్నీ చూస్తే, త్యాగరాజుకి మిగతా భాషల్లోవున్న ప్రావీణ్యం తెలుస్తుంది. ఎన్ని భాషలొచ్చినా మాతృ భాష తెలుగుని మాత్రం ఆయన వదల్లేదు. అందులోనే సంగీతాన్ని నింపాడు. అందులోనే జీవించాడు. అందుకే త్యాగరాజు తెలుగువాడుగా పుట్టినందుకు తెలుగువారందరూ గర్వపడాలి.
( సశేషం )
ఉపయోగపడిన పుస్తకాలు
- Tyagaraja - A Great Musician Saint - M.S.Ramaswami Ayer
- The Hindu ( News Paper ) - Articles on Music
- A History of British Diplomacy in Tanjore: K Rajayyan
- Tyagaraja – Manuscripts of Venkata Ramana Bhagavatar and T.S.Rama Rao – Translated versions. Madras University
- Tyagaraja – Life Story – KrishNa Bhagavatar (English Translation Madras University)
- The Great Composers Vol I & II – P.Samba Murthy
- Tyāgarāja and the South Indian Bhajana Sampradāya - Robert L. Simon (Oxford Music Journal)
- Tyagaraja – Life and Lyrics – William Jackson
- Tyagaraja: A Great South Indian Composer – Ethel Rosenthal (Oxford Music Journal)
- Know your Tyagaraja – S.V. Krishna Murthy
- The Spiritual Heritage of Tyagaraja – Dr. V. Raghavan
- సమగ్రాంధ్ర చరిత్ర – ఆరుద్ర
- నాదయోగి త్యాగయ్య – తిరుమూరు సుధాకర రెడ్డి
- వాగ్గేయకారుల చరిత్ర – టి. పార్థసారధి
- గాన కళాబోధిని – ఎన్.సి.పార్థసారధి
- Tyagaraja and the Renewal of Tradition – Translations and Reflections- William J Jackson
- త్యాగరాజ కీర్తనలు – మంచాళ జగన్నాధ రావు
- త్యాగరాజ ఆత్మ విచారము – భమిడిపాటి కామేశ్వర రావు (తెలుగు యూనివర్సిటీ లో దొరికిన కొంత భాగం మాత్రమే)
- ఆంధ్ర వాగ్గేయ కారుల చరిత్ర – బాలాంత్రపు రజనీకాంత రావు
- The Science of Indian Music – నూకల చిన సత్యనారాయణ

ప్రజాపతి అభిప్రాయం:
November 11, 2008 9:47 am
మంచి రచన. చాలా పరిశోధన చేసి వ్రాసారు. త్యాగరాజు గురించిన ఇన్ని విశేషాలు ఒకే చోట చదవడం ఇదే ప్రథమం. రీసెర్చి పేపర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న వ్యాసం.
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
November 12, 2008 10:44 am
సాయి బ్రహ్మానందం గొర్తి గారూ:
మీ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో పుస్తకాలను తిరగేసి, చాలా మందిని సంప్రదిస్తే తప్ప ఇటువంటి మంచి వ్యాసం రాదు.
త్యాగరాజుపై ప్రజాభిప్రాయం మీరు రాసిన దానికన్నా ఎందుకు భిన్నంగా వస్తూ ఉందో తెలియదు. త్యాగబ్రహ్మ కటిక పేదరికం అనుభవించాడని అందరిలాగే నేనూ అనుకొనేవాడిని. కాని, దానికి భిన్నంగా తగినంత ఆస్తిపరుడేనని మొన్న మొన్న తెలిసింది.
త్యాగరాజు మీద నాకు చాలా ఎక్కువ గౌరవం. అయితే, నన్ను ఎప్పుడూ ఒక్క విషయం కలవరపెడుతుంది. సంగీతంలో అనుమానం లేకుండా అసామాన్య ప్రతిభ కలవాడైనా, సాహిత్యకారుడుగా ఈయన గొప్పతనం ఎంతవరకు పెద్దలు ఆమోదించారు? భక్తి రసం పోషణ ఈయన సాహిత్యం అంతా అతి చక్కగా తెలుస్తూనే ఉంటుంది. కానీ, సాహిత్యంలో భక్తి రసం పోతన తీసుకెళ్ళిన ఎత్తులు, మరెవరూ చేరలేరేమో!
సాహిత్యంతో బాగా పరిచయమున్న విజ్ఞులు దీనికి సమాధానం చెప్పగలరేమో!
అభినందనలతో,
లక్ష్మన్న
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
November 12, 2008 12:55 pm
లక్ష్మన్న గారూ,
మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.
ఆన్నమయ్య కీర్తనల్లో సాహిత్యాన్ని ఎంతగానో పొగిడిన సాహితీవేత్తలు త్యాగరాజుకి అంత పెద్ద పీట వేయలేదు. కారణం సంగీత చట్రంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో త్యాగరాజు చందస్సుని భంగపరిచాడన్న వాదముంది. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు 1968లో అన్నమయ్య పై రాసిన వ్యాస పరంపర్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అలాగే కొన్ని పదాల వాడుక కూడా వారికి అంతగా రుచించలేదు. అలా అని త్యాగరాజు కీర్తనల్లో అసలు సాహిత్యమే లేదని ఆయన అనలేదు. సంగీతమున్నంత తారాస్థాయిలో సాహిత్యం లేదని వారి అభిప్రాయం. అదీకాక సంగీతానికిచ్చిన ప్రాముఖ్యత త్యాగరాజు సాహిత్యానికివ్వలేదని వారి వాదన. ఇవన్నీ రాబోయే భాగాల్లో వస్తాయి.
త్యాగరాజు కటిక దరిద్రమనుభవించకపోయినా, ఆయన ఉద్యోగం చేయకపోవడం వల్ల ఇల్లుగడవడం కాస్త కష్టమే అయ్యిందని రాసారు. రోజూ ఆయనింట్లో పాతిక పైగా విస్తళ్ళు లేచేవి. ఒకరా ఇద్దరా శిష్యులు, అడగడం్ మహాపాపమన్నట్లుగా సంగీతం నేర్పాడు. అదీ ఉచితంగా.
పోతననీ త్యాగరాజునీ పోల్చలేం. ఇద్దరిదీ భక్తి వాహకమే అయినా ఎంచుకున్న దారులు వేరు. అనుసరించిన తీరు వేరు. పోతన భాగవతం ప్రభావం త్యాగరాజు మీద ఉంది. ఆయన రాసుకున్న భాగవత ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. నేను వెళ్ళినప్పుడు నౌకా చరిత్రానికి ఫొటో తీసే అనుమతిచ్చారు కానీ, ఆ భాగవత ప్రతికి ఎంత బ్రతిమాలినా ఇవ్వలేదు. వ్యాస సూచికలో ప్రస్తావించిన పుస్తకాల సంఖ్య కంటే ఎక్కువే దొరికినా కొన్ని ప్రతులు సంపాదించలేకపోయాను. అమెరికాలో ఉండడం ఓ పెద్ద అడ్డంకయ్యింది. ఈ వ్యాసం రాయడానికి కష్టపడ్డం వాస్తవమే! ఆ కష్టంలో ఆనందం దొరికింది.
seshagiri nookala అభిప్రాయం:
November 12, 2008 2:57 pm
చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తము చదివితే నాకు కళ్ళ వెంట నీరు వచ్చింది.
-శేషు
karverababu అభిప్రాయం:
November 13, 2008 10:59 am
సాయి గారు,
ఆనంద భైరవి గురించి సాంబమూర్తి గారి ఆధారంతో మీరు రాసిన కథ కూచిపూడి భాగవతులకు త్యాగయ్య చేసిన ఉపకారముగా మా నాన్నగారు అంటుండేవారు. కూచిపూడి భాగవతుల సంచారము ఆ నాటికే తంజావూరు-తిరువాన్కూరు కు చేరింది.
mOhana అభిప్రాయం:
November 15, 2008 3:42 pm
బ్రహ్మానందం గారూ, మీ వ్యాసం బాగుంది. త్యాగబ్రహ్మం గారు వ్రాసిన యక్షగానాలపైన ఎందుకో ఎక్కువ మక్కువ చూపలేదు జనాలు? ఈ యక్షగానాలు ఆంధ్రభారతి వెబ్ సైటులో చదువ వీలగును.
నౌకాచరిత్రము
ప్రహ్లాద భక్త విజయము
నౌకాచరిత్రంలోని సంగీతపు విషయాలను సాంబమూర్తిగారు చక్కగా వివరించియున్నారు. మరొక విశేషం ఏమంటే నౌకాచరిత్రాన్ని వేంకటసూరి అనే కవిగారు సంస్కృతంలో అనువదించారు. ఈ రెండు యక్షగానాలను చదివితే త్యాగరాజుగారికి ఛందోబద్ధమైన పద్యాలను చక్కగా అల్లడం వచ్చనే విషయం తెలుస్తుంది. త్యాగరాజుగారిపై మరొక అంశం - ముత్తయ్య భాగవతర్ అనే వారు సంస్కృతంలో త్యాగరాజవిజయమని ఆ కళాకారుని జీవితచరిత్రను వ్రాసినారు. విధేయుడు - మోహన
నరేంద్ర భాస్కర్ S.P. అభిప్రాయం:
November 23, 2008 2:53 am
ఒక మహా కళా కారుని గూర్చి సమగ్రమైన వ్యాసం రాశారు.
నాకెప్పుడూ ఒక ఆలోచన: ఒక పాట దాదాపు 250 ఏళ్ళు కాలపు పరీక్షకు నిలిచి ఉన్నదంటే, ఆ పాట లో ఎంత ఆత్మ నిండి ఉన్నదో కదా !
అంత లోతైన ఆత్మ దైవికమైనదంటే ఆశ్చర్యమేముంది? మరో సారి మీ ద్వారా ఆ సంగీత సాగర విహార పరమ హంసకు శరీరమంతా చెవులవ్వగా ప్రణామాలు.
Krishna అభిప్రాయం:
December 2, 2008 1:21 am
సంగీత ప్రతిభలో ఇళయరాజానో, ఏ ఆర్ రెహ్మానో లాగానే త్యాగరాజుకూడాననీ, ఎటొచ్చీ భక్తిలోనే ఆయన చాలా గొప్పవాడని నాకున్న ఓ అభిప్రాయం. అంటే ఈలాంటి వ్యక్తుల జీవితాలు, రచనలు, సంగీతం (మిగిలిన భారతీయ కళారూపాల మాదిరిగానే) ఆధ్యాత్మికమైనవి. కాబట్టి ఈ పోలిక సరియైనదిగా అనిపించకపోవచ్చు. కానీ, సంగీత పరంగా పలురకాలు సంగీతాలు అని పిలువబడ్డా, కొన్ని వ్యాపారాత్మక సంగీతాలు కూడా ఆత్మానందం కలిగిస్తాయంటే ఎవరూ కాదనలేరుగా! అందుకని ఒక్క సంగీత పరంగానే కాకుండా, ఆయన్ని నేను ఒక ఆధ్యాత్మక మార్గదర్శిగా చూసుకుంటాను. ప్రాపంచిక విషయాలలో ఉంటూనే ఆధ్యాత్మికంగా/ భక్తిపరంగా ఎదగడం ఎలా అని చూసుకుంటూ, పోతనలోనూ, త్యాగరాజులోనూ ఒక సామీప్యం కనుగొన్నాను : ఇద్దరూ రాజాస్థానాన్ని కాదనటం. పోతనగారు ఒకే దెబ్బలో వద్దనేశారు. త్యాగరాజుగారు తనదైన శైలిలో “నిధిచాల సుఖమా, రాముని సన్నిధి సుఖమా” అని ప్రతి మనిషిలో వచ్చే ఓ అంతర్మథనాన్ని ఆవిష్కరించి, మరీ కాదన్నారు.అలా (గాంధీగారిలా) మహాత్ములు కూడా మెల్లిగానే తయారవ్వొచ్చునని నాకు మరో దృష్టాంతం ఇచ్చారు. మానవ ప్రయత్నానికి, ప్రతిభకి త్యాగరాజు పెద్దపీట వేశారనీ, భాగవతుల కథల్లోలా నారదుడు ఠపీమని సంగీత జ్ఞానాన్ని ప్రసాదించేయలేదని కొందరు వాదిస్తే నిజమేననిపిస్తుంది.ఎందుకంటే చాలా కృతుల్లో ఆయన మనసుకు కబుర్లు చెబ్తారు. అందుకే అవి ప్రతి వ్యక్తి తన మనసుకి చెప్పుకోవటానికి ఉపకరిస్తాయి.( మనవి ఆలకించరాదటే, మర్మమెల్ల దెల్పెద ఓ మనసా.)
మీరు చెప్పిన చరిత్రతో నాకున్న రెండు సంశయాలు మళ్ళీ నిద్ర లేచాయి.
1. రాజాస్థానాన్ని రెండుసార్లు కాదనటం - భక్తి అంటారా! లేక వేరేవాళ్ళకు తొత్తులయిన ఇలాంటి రాజుల దగ్గర ఇమడలేని attitude probleమా!> ఎందుకంటే నా అధికారుల అడుగులకు మడుగొలొత్త లేనితనం నా ప్రాబ్లం. నా భక్తి కాదు. (సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి వద్దంటే అదేమీ త్యాగం కాదు. రాజకీయం అంతే. గాంధీగారిది ఏంటి అంటే -> ఇదిగో భాగవతుల కథ అయితే ఆయన చనిపోయేటప్పుడు “హే రామ” అన్నాడుకాబట్టి మహాత్ముడే! ; నచ్చని వాళ్ళకి అదీ రాజకీయమే!)
2. అన్నమయ్య కూడా పాట చివర వెంకటశ్వరుడినే తలుస్తాడు.అదే ఆయన ముద్ర. సంగీతంలో దాన్నేదో అంటారు.పేరు గుర్తులేదు. మరి ఇంత త్యాగరాజు మాత్రం తన పేరు నిలబడేలా ప్రతి కృతి చివర పెట్టేశాడు? ఇది self effacing character ఎలా అవుతుంది!?
ఎందుకడుగుతున్నానంటే త్యాగరాజు ఇంకా నా ఆధ్యాత్మిక మార్గదర్శి అనుకుంటున్నాను కాబట్టే!
సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
December 2, 2008 5:08 pm
పోతన భాగవత ప్రభావం త్యాగరాజుపై ఖచ్చితంగా ఉంది. స్వదస్తూరీతో రాసిన ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. రాజాస్థానం వద్దనడానికి భక్తే కారణం అని చెప్పలేం. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుడిగా మొదటి సారి పిలుపొచ్చింది. అప్పటికే అక్కడ 300 మంది పైగా విద్వాంసులున్నారు. గుంపులో గోవిందా లా ఉండడం ఇష్టం లేదు. తన స్వేఛ్ఛకి భంగం అని భావించాడు. అందుకే ఒప్పుకో లేదు. రెండో సారి పిలుపులో శరభోజి తనపై కీర్తనలు కట్టమన్నాడు. అది ఇష్టంలేక వెళ్ళ లేదు. కానుకలు పంపినా ఫలితం లేక పోయింది. ఇక్కడ భక్తొకటే కాదు, ఆత్మాభిమానం కూడా ఉంది. రాముడిపై తప్ప వ్యక్తులపై కీర్తనలు కట్టడం నచ్చక వెళ్ళలేదు. ఒకే విషయం భక్తి కోణం లోంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చూస్తే ఇంకోలా తోస్తుంది.
మీరనుకున్నట్లు కృతుల్లో చివర ముద్ర అనేది పేరుకోసం కాదు. అనాదిగా శాస్త్రీయ సంగీతంలో కృతికర్త పేరు ఉండడం రివాజుగా వస్తోంది. అన్నమయ్య తిరు వేంకట ముద్రా, క్షేత్రయ్య మువ్వ గోపాలుడి ముద్రా ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇది కేవలం ఒక పద్ధతిగానే తీసుకున్నారు తప్ప, పేరు కోసం కాదని నా అభిప్రాయం. ముద్రకీ, Modesty కీ సంబంధం లేదు. మరీ రెట్టిస్తే, తిరువారూరు త్యాగరాజ స్వామి ముద్ర అని అనుకోవచ్చు కదా?
ఇహ ఆధ్యాత్మికత అంటారా, అది వయసు పెరిగే కొద్దీ మారుతూ వస్తుంది. మనసు కి చెప్పుకోడం అనే ప్రక్రియని మాత్రం త్యాగరాజు చాలా ఎక్కువగా ఉపయోగించాడు. మనసుకి గోడు చెప్పుకున్నంత మాత్రాన దేముడు ప్రత్యక్షమయ్యాడనే ఊహ సరికాదు. ఒకవేళ అలానే జరిగితే, త్యాగరాజొక్కడే దేముణ్ణి చూసుండాలి. ఆయనకి ప్రత్యక్ష మయ్యాడని మనం అనుకొని చెప్పడం కాదు. తను దేముణ్ణి చూసానని త్యాగరాజు ఎక్కడా చెప్పలేదు. భావనకీ, నిజానికీ చాలా తేడా వుంది.
సంగీత సృజన పరంగా మీరు వాడిన పోలిక అస్సలు ఒప్పదు. మీ అభిమాన సంగీత కారులు ఇళయ రాజా, రహమాన్ ఉన్న రాగాల్ని వాడుకుంటూ సంగీతం ఇస్తున్నారు. త్యాగరాజు అలా కాదు. కొత్త కొత్త రాగాల్ని కనుక్కున్నాడు. సంగీతానికొక వొరవడి కూర్చాడు. రెంటికీ నక్కకీ, నాకలోకానికీ ఉన్నంత తేడావుంది.
Venkatachalam అభిప్రాయం:
December 12, 2008 5:28 am
మీ వ్యాసం చాలా బాగుంది. మీ పరిశోధన కు నా హృదయపూర్వక అభినందనలు.
ఘనరాగ పంచరత్న కీర్తనలు అంటే ఏమిటి? వాటికి ఆ పేరెలా వచ్చింది? ఈ విషయాలు తెలుపగలరు.
కృతజ్ణతలు.
Rohiniprasad అభిప్రాయం:
January 7, 2009 4:32 pm
సంగీతమనేది ప్రధానంగా చెవులకు సంబంధించినది కనక ఇందులో ప్రస్తావించిన త్యాగరాజు రచనలు కొన్ని వినవచ్చు.
నమో నమో
జానకీ రమణ
దొరకునా
నిధిచాల
మరిమరి
భవనుత
నాదుపై
మా జానకి
ఎన్నాళ్లు
వనజనయనుడని
kshira
రామ రామ
నీకే తెలియక