మనకు తెలియని మన త్యాగరాజు – 2

ఉంఛవృత్తి

పంచనదయ్య తిరువయ్యార్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసేవాడు. త్యాగరాజు ఎక్కడా ఉద్యోగం చేసినట్లుగా లేదు. అతనికీ త్యాగరాజుకీ వయసు బేధం ఎక్కువే. మధ్యలో చిన్నతనంలోనే పోయిన ఒక అన్న పంచాపకేశ బ్రహ్మం ఉన్నాడు. పంచాపకేశ బ్రహ్మానికీ త్యాగరాజుకీ వయసు అంతరం తక్కువ కావడంతో త్యాగరాజుకి ఈ అన్నతో చాలా చనువెక్కువ. త్యాగరాజు తన మనవడికి అదే పేరు పెట్టాడు. తండ్రిపోయిన మూడేళ్ళకి త్యాగరాజు మొదటి భార్య పార్వతి అనారోగ్యంతో హఠాత్తుగా మరణించింది. ఇంతకుమించి ఈమె గురించి వివరాలు ఎవరూ చెప్పలేదు. మొదటి భార్యతో త్యాగరాజుకి పిల్లలు లేరు. ఆ తరువాత కమలాంబతో త్యాగరాజుకి రెండో వివాహం జరిగింది.

త్యాగరాజుతో పెళ్ళైన ఏడాదికి అంటే త్యాగరాజు 27వ ఏట (1894 లో) కమలాంబకి ఒక కూతురు జన్మించింది. ఆ అమ్మాయికి సీతాలక్ష్మి అని పేరు పెట్టారు. వేరుపడ్డాక త్యాగరాజు రోజు వారీ జీవితం గడపడానికి కష్టమయ్యింది. ఆ సమయంలో అతని స్నేహితుడు తంజావూరు రామారావే అతన్ని ఆదుకున్నాడు. ధన సహాయమంటూ ప్రత్యేకించి చేయకపోయినా త్యాగరాజు కుటుంబం గడవడానికొక ఆధారం చూపించాడు. తెలుసున్న వాళ్ళింట్లో త్యాగరాజు కచేరీ ఏర్పాటు చేసేవాడు. అదైన తరువాత వారికి తోచిన ఆహార సంబంధిత వస్తువులు తీసుకునే వారు. అదీ వారానికి సరిపడా మాత్రమే ఇమ్మనమని చెప్పేవారు. ధనరూపేణా కానీ, వస్తురూపేణా కానీ త్యాగరాజు ఎప్పుడూ ఎవరి వద్దా తీసుకోలేదు. పూర్వం హరిదాసుల ఇళ్ళల్లో “ఉంఛవృత్తి” అనే ఒక సంప్రదాయం ఉండేది. అది ఏమిటంటే – ప్రతీ రోజూ అపరాహ్నవేళ హరిదాసులు హరినామ సంకీర్తనతో వీధుల గుండా వస్తారు. ఎవర్నీ బిచ్చం అడగరు. ఎవరకు తోచిన ఆహార వస్తువులు వారు హరిదాసుల వద్దకు పోయి ఇవ్వాలి. ఆ రోజుకి సరిపడా మాత్రమే హరిదాసులు స్వీకరించాలి. మొదట్లో త్యాగరాజు ఎవరి వద్దా ధన సహాయం, ముఖ్యంగా తన సంగీతం ద్వారా సంపాదించడం ఇష్టం లేకపోతే, ఈ ఉంఛవృత్తి సారాన్ని చెప్పి త్యాగరాజుని రామారావే సమాధానపరిచాడు. ఈ వృత్తిని స్వీకరించడానికి త్యాగరాజుకి కొంతకాలం పట్టింది. “ఎన్నాళ్ళు తిరిగేది యెన్నాళ్ళు” కీర్తన ఈ ఉంఛవృత్తి పై రాసిందే!

తంజావూరు రామారావు

తిరువయ్యారు చేరిన కొత్తల్లో దాదాపు మూడేళ్ళు పైగా త్యాగరాజు అక్కడి సంస్కృత పాఠశాలలో విద్య నభ్యసించాడు. ఆ సంస్కృత విద్యాలయంలో త్యాగరాజుకొక మిత్రుడు దొరికాడు. వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అతనే తంజావూరు రామారావు. అసలు పేరు తంగిరాల ఎస్. రామారావు. తెలుగువాడు. అందరూ తంజావూరు ఎస్. రామారావు అని పిలిచేవారు. ఇతను త్యాగరాజు కంటే వయసులో రెండేళ్ళు చిన్న. ఈ రామారావు మృదంగం నేర్చుకున్నాడు. ఇద్దరికీ సంగీతమే స్నేహాన్ని కలిపింది. అలా కలిసిన ఈ ఇద్దరి స్నేహమూ, త్యాగరాజు సమాధి చెందే వరకూ ఉంది. సొంత కుటుంబీకుల తరువాత త్యాగరాజుకి అత్యంత సన్నిహితుడు ఈ రామారావే!

త్యాగరాజు వద్ద ఈ రామారావు సంగీతం నేర్చుకునేవాడు. ఇతనే త్యాగరాజుకి ప్రథమ శిష్యుడని చెప్పచ్చు. ఇతను త్యాగరాజుకు అనుంగు శిష్యుడే కాడు, మిత్రుడు కూడా. ఇతనే త్యాగరాజుకి ప్రతీ చోటా కచేరీ ఏర్పాట్లు చూసేవాడు. రామనామ సంకీర్తన పేరుతో కొంతమంది ఇళ్ళల్లో సంగీత కచేరీలు పెట్టించాడు. ఆ కచేరీల్లో కూడా ఏయే కీర్తనలు పాడాలో ఇతనే ముందుగా చెప్పేవాడని అందరూ రాసారు. ఇతని ప్రోద్బలం వల్లే ఘనరాగ పంచరత్న కీర్తనలు త్యాగరాజు రచించాడని సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ పుస్తకంలో రాసారు.

శిష్య పరంపర

త్యాగరాజు తన వద్ద వచ్చిన వారికి కాదనకుండా సంగీతం నేర్పాడు. గురుకుల వ్యవస్థలా తన వద్దే ఉండి నేర్చుకోవాలని నియమం పెట్టాడు. అంటే త్యాగరాజు ఇంట్లోనే వాళ్ళు కొంత కాలం, ఒకటో, రెండో ఏళ్ళుంటేనే సంగీతం నేర్పడానికి ఒప్పుకునేవాడు. శిష్యులందరికీ ఉచిత భోజనం వసతీ ఇచ్చాడు. దీనికి సిద్ధపడి ఒప్పుకున్న వారందరికీ వారి వారి స్థాయిని బట్టి సంగీతం నేర్పాడు.

సంగీతానికీ సాహిత్యానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు విశ్వసించేవాడు. భావావేశంతో పాడితేనే ఏ కృతైనా రక్తి కడుతుంది. అది కలగాలంటే భాష క్షుణ్ణంగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలగదు. ఆత్మానందం కలగకపోతే తాదాత్మ్యం రాదు. అది లేకపోతే సంగీతం రాణించదు. కాబట్టి సాహిత్యం అర్థంకాని సంగీతానికి విలువ లేదు. ఇదీ త్యాగరాజు నమ్మిన సిద్ధాంతం కాబట్టి త్యాగరాజు స్వరపరిచిన కృతులు నేర్చుకోవాలంటే ముందుగా తెలుగు భాష రావాలి. కానీ త్యాగరాజు వద్దకొచ్చిన చాలామంది శిష్యులకి తెలుగు రాదు. తెలుగు రాని శిష్యులకి ప్రతీ రోజూ రామారావు తెలుగు నేర్పేవాడని అంటారు. ఇదే విషయాన్ని వీణ కుప్పయ్యర్ అనే శిష్యుడు రాసినట్లుగా చెబుతారు (ఈ ప్రతి ఎంత కష్టపడినా లభించలేదు).

త్యాగరాజు శిష్యుల్లో ఒక ప్రముఖుడు వీణ కుప్పయ్యర్. సంగీతం విషయంలో ఇతనికి విశేష ప్రతిభుందనీ అందరూ అనుకునేవారు. త్యాగరాజు కూడా ఇతనికి ప్రత్యేకమైన శ్రద్ధతో, సంగీతంలో ఎన్నో లోతైన విషయాలు చెప్పాడని అతను రాసుకున్నాడు. ఈ వీణ కుప్పయ్యర్ తమిళ బ్రాహ్మణుడు. సంస్కృతమూ, తమిళమూ తప్ప తెలుగు రాదు. త్యాగరాజు వద్ద శిష్యరికం మొదలు పెట్టిన తరువాత ఈయన తెలుగు కూడా నేర్చుకున్నాడు. ఈ వీణ కుప్పయ్యర్ ఎన్నో కృతులూ, వర్ణాలూ తెలుగులోనే రచించాడు. ఇతను త్యాగరాజు వద్ద సుమారు అయిదేళ్ళు పైగా సంగీతం నేర్చుకున్నాడని సాంబమూర్తి రాసారు (ది గ్రేట్ కంపోజర్స్ 193 – 197 పేజీలు)

సంగీత శిక్షణలో సాధారణంగా గీతమైనా, వర్ణమైనా, కృతైనా స్వరాలతో నేర్పుతారు. స్వర స్థానాలు చక్కగా వచ్చిన తరువాతే సాహిత్యంతో నేర్పేవారు. త్యాగరాజు ఈ పద్ధతికి భిన్నంగా ఏ కృతైనా సాహిత్యంతో నేర్పి, అది భావయుక్తంగా పాడుతున్నారనిపిస్తేనే స్వరాలతో చెప్పేవాడు. అందుకే కొన్ని త్యాగరాజ కీర్తనలకి స్వరాలు దొరకలేదని అంటారు. దాదాపు 800 పైగా కీర్తనలు ఇప్పుడు మనకి ఉన్నాయి. వేలకొద్దీ రచించాడనీ, స్వరాలు తెలియక పోవడవల్ల కొన్ని అందుబాటులోకి రాలేదని కొందరు సంగీతజ్ఞుల అభిప్రాయం. కాబట్టి త్యాగరాజు అవలంబించిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా సాహిత్యమర్థమవ్వాలి. అందుకే తెలుగు రాని వారికి తెలుగు నేర్పి మరీ సంగీతం నేర్పాడు. ఈ విషయాన్ని ది గ్రేట్ కంపోజర్స్ లో సాంబమూర్తీ, వాగ్గేయకారుల చరిత్రలో టి. పార్థసారథి ప్రస్తావించారు.

త్యాగరాజు వద్దకి ఎంతో మంది కేవలం సంగీతం నేర్చుకోవడానికే కాదు, కొంతమంది జ్యోతిశ్శాస్త్రం నేర్చుకోడానికీ, మరి కొంతమంది తెలుగు భాష నేర్చుకోడానికీ వచ్చే వారని ది గ్రేట్ కంపోజర్స్ లో రాసారు. ఈ తంజావూరు రామారావే తెలుగు చెప్పినట్లుగా వెంకటరమణ భాగవతార్ (త్యాగరాజు జీవిత చరిత్ర ఈయన, తంజావూరు రామారావు కలిసి రాసారు) గారి మనవడు రాసిన జీవిత చరిత్ర పుస్తకంలో ఈ విషయం ఉంది. ఇవన్నీ క్రోడీకరించి పై విధంగా జరిగుండచ్చనీ భావించి, ఈ నిర్థారణకు రావడం జరిగింది. ఏదైతేనే త్యాగరాజు ధర్మమాని తమిళ నాటా, నోటా తెలుగు పదం సుందరంగా నిలిచింది. త్యాగరాజు వద్ద సంగీత శిష్యరికం చేసిన వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే తెలుగు వాళ్ళు. వారిద్దరిలో ఒకరు ఈ తంజావూరు రామారావు. మరొకరు మనంబుచవాది వెంకట సుబ్బయ్యర్. మిగతా అందరూ తమిళులే!


సరస్వతీ మహల్ గ్రంథాలయం

మరొక శిష్యుడైన వెంకటరమణ భాగవతారు దాదాపు ముఫ్ఫై ఏళ్ళు త్యాగరాజుతో గడిపాడు. ఇతనూ, రామారావూ త్యాగరాజు రాసిన కృతులన్నీ పొందుపరిచారు. కలసి జీవిత చరిత్ర రాయడానికి పూనుకున్నారు. వీరిద్దరి కృషివల్లే ఈ త్యాగరాజ కృతులు ముందుతరాలకి లభ్యమయ్యాయి. చాలా కాలం త్యాగరాజుతో గడపడం వల్ల వీరిద్దరికీ చాలా కృతులు తెలిసే అవకాశం ఉంది. చివర్లో ఈ వెంకటరమణ భాగవతార్ కూడా మద్రాసు వెళ్ళిపోయాడు. ఇతను త్యాగరాజు పేరు ప్రఖ్యాతులు విని సంగీతం మీద అభిలాషతో తిరువయ్యార్ వచ్చాడు. అలాగే వీణా కుప్పయ్యర్ కూడా త్యాగరాజ కృతులెన్నో తాళపత్రాలకెక్కించాడు. ఇవన్నీ మదురై సౌరాష్ట్రసభలో ఉన్నాయి. కొన్ని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉన్నాయి.