మనకు తెలియని మన త్యాగరాజు - 2
నిధి చాలా సుఖమా?
బ్రిటీషు వారి పుణ్యమాని శరభోజి మహారాజుకి పాలనా బాధ్యతలు లేకపోవడంతో ఎప్పుడూ సంగీత సాహిత్యాలతోనే కాలం గడిపేవాడు. ఇతని కాలంలో ఎన్నో నాటకాలూ, యక్షగానాలూ వచ్చాయి. ఆ రోజుల్లో తమని కీర్తిస్తూ రాసే సాహిత్యానికి పెద్ద పీట వేసే వ్యసనమొకటి రాజులకుండేది. శరభోజి మహారాజు ఇందుకేమీ భిన్నం కాదు. శరభోజి గౌరవార్థం “శరభేంద్ర భూపాల కురవంజి” అనే నృత్య రూపకాన్ని శివకొలందు దేశికార్ అనే ఆయన రాసాడు. పల్లవి గోపాలయ్యర్ అనే సంగీత విద్వాంసుడు శరభోజి మహారాజు పై తోడి రాగంలో “కనకాంగి” అనే ఒక వర్ణం రాసి అర్పించాడు.
త్యాగరాజు ప్రతిభ విని, అతని చేత కూడా తనపై కొన్ని కీర్తనలూ, కృతులూ కట్టించుకొనే ఉద్దేశ్యంతో రాజాస్థానానికి ఆహ్వానిస్తూ కబురు పంపాడు. ఇది 1802 సంవత్సరంలో జరిగింది. ఈ సంఘటన జరిగే కాలానికి త్యాగరాజుకి సుమారుగా ముప్పై అయిదేళ్ళు. అప్పటికే త్యాగరాజు అనేక మంది ఆహ్వానం మీద ధనాన్నికానీ, కానుకలు కానీ ఆశించకుండా కచేరీలు ఇచ్చాడు. కానీ, తనపై ఒక కృతి రాసి పాడమని రాజు ఆదేశించడం త్యాగరాజుకి నచ్చలేదు. ఆ సందర్భంలోనే “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ పల్కు మనసా” అనే కృతి రాసుండచ్చనీ సాంబమూర్తి రాసారు. మొదట త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ ఈ కృతి ప్రస్తావనే చేయలేదు. కాకపోతే కృష్ణ భాగవతార్ శరభోజి మహారాజు పేరు ఎత్తకుండా రాజుగా సంబోధిస్తూ ఇదే సంఘటన్ని రాసాడు.
“దమ శమమను గంగా స్నానము సుఖమా?
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా?
మమత బంధన యుత నర స్తుతి సుఖమా?
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా?”
మూడో వాక్యంలో నర స్తుతి సుఖమా అని రాయడంతో బహుశా ఈ కృతే చెప్పి ఉండచ్చనీ అనుకోవచ్చు. కాకపోతే ప్రతీ కృతికీ కాలాన్నీ, సందర్భాన్నీ సూచించే లిఖిత పూర్వకమైన చరిత్రయితే ఎక్కడా లేదు.
ఇది జరగడానికి ముందు వేరొక సంఘటన శరభోజికి త్యాగరాజు గొప్పతనం తెలియడానికి దోహదపడింది. ఈ సంఘటన కూడా సాంబమూర్తి గారి రచన ద్వారానే తెలిసింది. ఇది త్యాగరాజు ఇతర శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చుండచ్చనీ అనుకోవాలి. ఒకసారి శొంఠి వెంకటరమణయ్య ఆహ్వానం మేరకు ఓ సాయంత్రం తంజావూరు దర్బారు హాలులో పాడడానికి వెళ్ళాడు త్యాగరాజు. అదే రోజు రాత్రి శరభోజి రాజు సమక్షంలో కవుల, విద్వాంసుల గోష్ఠుంది. కేవలం తంజావూరు సంస్థాన విద్వాంసులే దానికాహ్వానితులు. ఇక్కడ త్యాగరాజు సంగీత కచేరీ మొదలయ్యాక ఎవరికీ కాలమే తెలీలేదు. కాంభోజి రాగంతో కచేరీ ప్రారంభమయ్యింది. ఇందులో “మరి మరి నిన్నే” అనే కీర్తనలో త్యాగరాజు చేసిన స్వరకల్పన చూసి, అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది.
త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు. ఆ మర్నాడు శరభోజి ఆగ్రహానికి గురి కావల్సొస్తుందని అందరూ భయపడుతూ వెళ్ళారు. అనుకున్నట్టే రాజు క్రితం రాత్రి గోష్ఠి కెవరూ ఎందుకు రాలేదని నిలదీసాడు. అప్పుడే శొంఠి వెంకటరమణయ్య కల్పించుకొని తనే స్వయంగా తన శిష్యుడు త్యాగరాజు కచేరీ ఏర్పాటు చేసాననీ చెప్పాడు. త్యాగరాజు సంగీత కచేరీ విని తీరాల్సిందేనని శరభోజి ముందు వేనోళ్ళా పొగిడాడు. ఈ విధంగా శరభోజి మహారాజుకి త్యాగరాజు గురించి తెలిసింది. ఈ సంఘటన గురించి కేవలం సాంబమూర్తి మాత్రమే రాసారు. దీని తరువాత వచ్చిన త్యాగరాజు జీవిత చరిత్రలన్నీ ఈ సంఘటనని యథేఛ్ఛగా ఉటంకించారు. సాంబమూర్తి ప్రస్తావించిన ఈ సంఘటన జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే శరభోజి మహారాజు త్యాగరాజుకి ఆహ్వానం పంపడం మాత్రం అందరూ రాసారు. సంఘటన వరకూ నమ్మశక్యంగా ఉంది కానీ, సాంబమూర్తి రాసినట్లుగా “మరి మరి నిన్నే” కీర్తనే అక్కడ పాడారన్న ఆధారాలు లేవు.
చీలికలు తెచ్చిన తిరస్కారం
తండ్రి పోయిన తరువాత త్యాగరాజు కుటుంబమూ, తల్లీ, అన్నగారు పంచనదయ్య కుటుంబమూ అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు. పైన చెప్పిన సంఘటన జరిగిన తరువాతే శరభోజి కానుకలిచ్చి సేవకుల్ని త్యాగరాజింటికి పంపాడు. అవి వద్దని అన్నగారి ఎదుటనే తిరస్కరించడంతో అన్నదమ్ములిద్దరి మధ్యా విబేధాలు తారాస్థాయి నందుకున్నాయి. ఇంటికొచ్చిన లక్ష్మిని చేతులారా వెనక్కినెట్టడం సహించలేకపోయాడు పంచనదయ్య. అన్నగారి కోపతాపాలకి చలించలేదు. తల్లికూడా త్యాగరాజునే సమర్థించడంతో, పంచనదయ్య భరించలేకపోయాడు. తను ఈ ఉమ్మడి కుటుంబభారం మోయలేననీ, ఆస్తిని భాగాలు చేయాలనీ మొండికేసాడు. పంచనదయ్య రాత్రికి రాత్రి త్యాగరాజునీ, భార్యనీ, కూతుర్నీ ఇంటినుండి వెళ్ళగొట్టాడు. రాత్రంతా వీధి అరుగు మీద జాగారం చేసాడు త్యాగరాజు. ఆ రాత్రి రాముడూ, సీతా, ఆంజనేయుడు త్యాగరాజు దగ్గరికి వచ్చి, ఆహారం ఇచ్చారనే ఒక కథుంది. అప్పుడే “భవనుత” కృతిని చెప్పినట్లుగా రాసారు. ఇది పురాణికులు అల్లిన కథ. అసలు జరిగింది వేరే ఉంది.
త్యాగరాజు రాత్రంతా వీధరుగు మీద గడిపాడని అతని స్నేహితుడు తంజావూరు రామారావుకి తెలిసింది. తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. తండ్రి ఇచ్చిన రామ పంచాయతనానికి రోజూ పూజ చేస్తానని మాటిచ్చాననీ, అది ఉల్లంఘించడం తనవల్ల కాదనీ త్యాగరాజు రామారావుతో అన్నాడు. రామారావు ఊరి పెద్దల్ని సంప్రదించాడు. పంచనదయ్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. తండ్రి ఆస్తిలో త్యాగరాజుకి హక్కు ఉందని వాదిస్తూ, బయటకు నెట్టే హక్కు పంచనదయ్యకు లేదని పెద్దలచేత పంచాయితీ పెట్టించాడు. అప్పటి వరకూ ఉమ్మడిగా ఉంటున్న ఇల్లుని వాటాలు వేయాలని తీర్మానించాడు. త్యాగరాజు ఈ విషయంలో మౌనంగానే ఉన్నాడు. ఇదంతా రామారావే చూసుకున్నాడు. ఆ రకంగా రామబ్రహ్మానికి తుల్జాజీ కానుకగా ఇచ్చినిల్లు రెండు వాటాలుగా చీలిపోయింది. ఈ తంజావూరు రామారావే కల్పించుకోకపోతే త్యాగరాజు ఉండడానికా ఇల్లు కూడా దక్కేది కాదు. ఈ వాటాలు వేయడం తంజావూరు మేజిస్ట్రేట్ సమక్షంలో జరిగింది. (తిరువయ్యారు తహశీల్దారు రాసిన పత్రాలు తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలో ఉన్నాయని విన్నాను. ప్రత్యక్షంగా చూడలేదు).
ఈ ఉమ్మడి కుటుంబం చీలిపోయిన సందర్భంలోనే “నాదుపై పలికేరు నరులు” అనే కీర్తన రాసినట్లుగా చెబుతారు. త్యాగరాజు కాలంలో తంజావూరు రాజ్య పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలూ, మరో వైపు యుద్ధాలూ, ఆక్రమణలూ, ఆకలి చావులూ, దాడులూ, దోపిడీలతో భయంకరంగా ఉండేది. రామభక్తి తత్వంలో ఇవేమీ తనకు పట్టనట్లుగానే త్యాగరాజు కృతులు కూర్చాడు. కానీ ఈ కీర్తనలో మాత్రం తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తన జీవితానికి సంబంధించిన విషయాలని కొన్నిటిని స్పష్టంగా చెప్పాడు. ఆ కీర్తన చరణాలు చూస్తే తెలుస్తందది.
నాదుపై పలికేరు నరులు
వేద సన్నుత, భవము వేరు జేసితిననుచు (నా)
పంచ శర జనక, ప్రపంచమున గల సుఖము
మంచు వలె ననుచు మదినెంచితి గాని
పంచుకొని ధనము లార్జించు కొని సరియెవ్వ
రంచు మరి గతియు లేదంచు పల్కితినా (నా)
దినము నిత్యోత్సవమున కాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి గాని
అనుదినము నొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయవలె ననుచు పల్కితినా (నా)
ప్రాణమే పాటియని మానమే మేలంటి
గాని శ్రీరామ పరమానంద జలధి
శ్రీనాథ కులములో లేని దారిని పట్టి
జానెడుదరము నింప నొరుల పొగడితినా ( నా)
ఆజానుబాహు యుగ, శ్రీజానకీ పతి,
పయోజాక్ష, శ్రీత్యాగరాజ నుత చరణ,
ఈ జగతిలో నిన్ను పూజించు వారి
నవ్యాజమున బ్రోచు సురాజ, నీవాడైన (నా)
ఇదొక్క కీర్తనే త్యాగరాజు తన లౌకిక జీవితానికి సంబంధించిన సంఘటనపై రాసిందని రూఢిగా చెప్పచ్చు. మిగతా కొన్ని కీర్తనల్లో సూచన ప్రాయంగా ఉంటుంది. ఇందులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఇల్లు వాటాల విషయం త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ ప్రస్తావించారు. ఇది జరిగిన కాలం విషయంలోనే తేడాలు కనిపించాయి. శరభోజి కానుకలు తిరస్కరించిన ఘట్టం 1802 ప్రాంతంలో జరిగిందని సాంబమూర్తి చెప్పారు. చరిత్ర తేదీలని బట్టి చూస్తే ఇది సరి అయినదే అని చెప్పచ్చు. ఈ ఇల్లు వాటా వేసిన సమయం మాత్రం సరిగ్గా చెప్పలేదు. తల్లి సీతమ్మ మరణానంతరమే జరిగిందని రాసారు. కానీ సీతమ్మ 1804 లో పోయింది. అంటే రెండేళ్ళ వరకూ త్యాగరాజూ, పంచనదయ్య కలిసే ఉన్నారా? అయితే తంజావూరు మేజిస్ట్రేట్ ముందు జరిగిన పంచాయితీ 1802 లోనే జరిగిందని రాసారు కదా? కాబట్టి 1802లోనే ఇల్లు వాటాలు జరిగుండాలి.
కాకపోతే మరి కొంతమంది ఈ సంఘటన రామబ్రహ్మం పోయిన వెంటనే జరిగిందని రాసారు. అందరికంటే విరుద్ధంగా విలియం జాక్సన్ రాసిన పుస్తకంలో కనిపించింది. “త్యాగరాజు ఇరవయ్యో ఏట తండ్రి రామబ్రహ్మం మరణించినప్పుడు వారుండే ఇల్లుని రెండుగా వాటాలు వేసారు. తనకి కేటాయించిన వాటాలోనే రామ భక్తి పారవశ్యంతో త్యాగరాజు జీవితాన్ని గడిపాడు” అంటూ రాసారు (Tyagaraja: Life & Lyrics, page 4). పైన చూపించిన సంవత్సరాల వివరాలు చూస్తే ఇది ఖచ్చితంగా సరైనది కాదని చెప్పగలం. జాక్సన్ ఇలా రాయడానికి ఆధారాలేమిటో తెలీదు. ఇప్పటికీ తిరువయ్యార్ లో తిరుమంజన వీధిలో త్యాగరాజు నివసించిన ఇల్లుంది. ప్రస్తుతం దాన్ని ఒక చారిత్రాత్మక నివాసంగా మార్చడానికి కొంతమంది సంగీత ప్రియులు ప్రయత్నిస్తున్నారు.

