మనకు తెలియని మన త్యాగరాజు – 2

రాజాహ్వానం

త్యాగరాజుకి రెండుసార్లు రాజాస్థానం నుండి పిలుపొచ్చింది. శొంఠి వేంకటరమణయ్య ఆహ్వానంపై మొదట సారి తంజావూరు దర్బారు హాల్లో కచేరీ చేసిన జరిగిన వెంటనే రాజుగారు పిలిచారు. అప్పుడు త్యాగరాజుకి పాతికేళ్ళు. రెండో సారి 30 ఏళ్ళు దాటాక వచ్చింది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన చాలామంది ఈ రెండు ఆహ్వానాలు ఒకటేనని భావించారు. అప్పటి కాలాన్ని బట్టీ, ఆ సమయంలో తంజావూరు రాజెవరన్న దాన్ననుసరించీ, ఇవి వేర్వేరు సంఘటనలన్న విషయం నిర్థారణ చేయచ్చు. మొదటి సారి పిలిచినపుడు రాజు పేరు తుల్జాజీ. రెండోసారి పిలుపొచ్చినప్పుడు రాజు పేరు శరభోజి. ఆ రెండు సంఘటనలూ ఏమిటో చూద్దాం.

శొంఠి వెంకట రమణయ్య ద్వారా త్యాగరాజు సంగీత ప్రతిభ తెలుసుకున్న తుల్జాజీ రాజు, తన వద్దకొచ్చి రాజదర్బారులో కచేరీ ఇవ్వవలసిందిగా కోరుతూ ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాననీ కబురు పంపాడు. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుల్లో ఒకడిగా ఉండడం త్యాగరాజు ఇష్టపడలేదు. రాజాస్థానం అతనికి కొత్తకాదు. తండ్రితో వెళ్ళేవాడు. అక్కడ ఎదురయ్యే పరిస్థితులూ, ఇబ్బందులూ, మొహమాటాలూ తెలుసు. అక్కడికెళితే తన సంగీతాన్ని పంజరంలో బంధించినట్లేనని భావించాడు. సంగీతాన్నీ, సాహిత్యాన్ని వెల కట్టకూడదన్న ఒక అభిప్రాయం దృఢంగా వచ్చేసింది. రాజుగారు పంపిన రెండు మూడాహ్వానాలనీ, ఏదో ఒక కుంటిసాకు చూపించి తిరస్కరించాడు. తుల్జాజీ ఈ విషయంపై స్పందించే లోపల తంజావూరు పై ముస్లిం నవాబులు యుద్ధానికొచ్చారు. ఆ గొడవలో ఇది కాస్తా వెనక్కి వెళ్ళింది. ఇది జరిగేనాటికి త్యాగరాజుకి పాతికేళ్ళు.

కృష్ణస్వామి భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో ఈ సంఘటన గురించి ఇలా ఉంది. “త్యాగరాజు సంగీత ప్రతిభ విని, ఆయన్ని సత్కరించాలని తంజావూరు రాజు చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ త్యాగరాజు రాజాస్థానానికి వెళ్ళడానికి అంగీకరించ లేదు. ఆ తరువాత రామ బ్రహ్మం అనారోగ్యం వల్ల మరణించాడు…” (పేజీ 64. Tyagaraja and the Renewal of Tradition, William J Jackson) అని రాసారు. అంటే ఈ సంఘటన రామబ్రహ్మం బ్రతికుండగానే జరిగుండాలి. కానీ రామబ్రహ్మం త్యాగరాజు ఇరవయ్యో ఏట పోయాడు. ఇది అందరూ ఒకే విధంగా రాసారు. కాబట్టి రాజు గారు ఆహ్వానం పంపించిన కాలం సుమారుగా త్యాగరాజు ఇరవయ్యో ఏట కానీ, ముందు కానీ అయ్యుండాలి.

త్యాగరాజు 25వ ఏటనే గురువు వద్ద కచేరీ చేసాడని విశ్వసిస్తే, కృష్ణ భాగవతారు పేర్కొన్నట్లుగా రాజాహ్వాన సంఘటన దాని తరువాత జరిగిందేనా అయ్యుండాలి. లేదా త్యాగరాజు ఇరవయ్యో ఏటికి ముందే రాజుగారి ఆహ్వనం అందుండాలి. ఎందుకంటే ఆ సంఘటనలో రాజు పేరు శరభోజీ అని అందరూ రాసారు. అందువల్ల ఆ రాజు శరభోజీ రాజేని విశ్వసిస్తే, కృష్ణ భాగవతార్ పైన రాసిన సంఘటనలో రాజు మాత్రం ఖచ్చితంగా శరభోజి కాదు. ఆప్పటి రాజు తుల్జాజీ. ఎందుకంటే శరభోజి తంజావూరు గద్దెనెక్కింది 1798 లో. అప్పటికి త్యాగరాజుకి సుమారుగా 31 యేళ్ళు. తుల్జాజీ హయాంలో చాలామంది సంగీత విద్వాంసులూ, కవులూ, కళాకారులూ బాగా పోషింపబడ్డారు. అదీకాక “రాజు” అనే సంబోధనే ఉండడం వల్ల శరభోజీనే అయ్యుండచ్చని గ్రహించుంటారు. దీన్నిబట్టి చూస్తే త్యాగరాజుకి రెండు సార్లు రాజుల వద్దనుండి పిలుపొచ్చింది. మొదటి సారి తుల్జాజీ నుండి. రెండోసారి శరభోజి నుండి. ఏది సరైంది? ఏది కాదు? తెలియాలంటే అప్పటి తంజావూరు రాజకీయ పరిస్థితి ఎలావుందో తెలియాలి.

తంజావూరు రాజకీయ పరిస్థితి


British Victory Memorial

తూర్పు భారత దేశంలో వ్యాపార నిమిత్తమై ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అడుగుపెట్టిన బ్రిటీషు వాళ్ళు దక్షిణాన మద్రాసు వరకూ వచ్చేసారు. అప్పటికే ఫ్రెంచి వాళ్ళూ, డచ్చి వాళ్ళూ దక్షిణాదిన మకాం వేసారు. తుల్జాజీ బ్రిటీషు వాళ్ళతో 1767 నుండీ దాదాపు రెండేళ్ళ పైగా యుద్ధం చేసాడు. అప్పుడే కరువొచ్చి పడింది. ఈ కరువు బ్రిటీషు వారి పాలిట వరమయ్యింది. చిన్న చిన్న రాజుల్ని తమ వైపుకి తిప్పుకొని వారికి సాయం చేస్తున్నట్లుగా భ్రమ కల్పిస్తూ, మెల్ల మెల్లగా ఆ రాజ్యాలు ఆక్రమించుకున్నారు ముస్లిం నవాబులతో చేతులు కలిపి 1773 నుండి 1776 వరకూ తంజావూరుని ఉమ్మడిగా పాలించారు. తంజావూరు పై నవాబులది పై చేయి కాకుండా ఉమ్మడి రాజ్యంగా మార్చి, బ్రిటీషు వాళ్ళు తిరిగి తుల్జాజీని గద్దెక్కించారు. హిందూ రాజయితే తమ కాలి క్రింద చెప్పులా ఉంటాడనీ, అంతే కాకుండా ప్రజలనుండి ఎటువంటి నిరసనా ఉండదన్నది బ్రిటీషు వాళ్ళ ఎత్తుగడ. ఆ రకంగా తంజావూరు రాజుని తమ చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకున్నారు. బ్రిటీషు వాళ్ళు తప్ప వేరెవరైనా తంజావూరు గద్దెనెక్కడం నవాబులకీ అభ్యంతరం లేదు. పేరుకు తుల్జాజీ రాజే కానీ మొత్తం వ్యవహారమంతా అమర సింహుడనే ఓ సైన్యాధికారి చేతుల్లోనే ఉండేది.

తుల్జాజీ మరలా గద్దెనెక్కే ఉదంతమంతా ఎంతో తెలివిగా చక్రం తిప్పి చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధుల్లో ఒకడైన ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు. సౌమ్యుడూ, శాంత స్వభావుడు అవడంవల్ల అటు బ్రిటీషు వాళ్ళ మెప్పూ, ఇటు హిందువుల మన్ననలూ అతి సులభంగా పొందాడు. ముస్లిం నవాబుల చేతా మెచ్చుకోబడ్డాడు. ష్వార్ట్జ్ అప్పటి సంఘటనలన్నీ లిఖిత పూర్వకంగా పొందుపరిచి చరిత్రకెక్కించాడు. కాకపోతే అతను రాసిన చరిత్ర తంజావూరు కోట దాటి బయటకు వెళ్ళలేదు. కరువును ఆయుధంగా మార్చుకొని ష్వార్ట్జ్ అనేకమంది మత మార్పిడికి కారకుడయ్యాడు. కరువు ప్రభావం వల్ల మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన వాళ్ళని చర్చి వైపు మళ్ళించగలిగాడు.

ఇతనే తుల్జాజీ కొడుకు శరభోజికి ఇంగ్లీషు బోధకుడిగా ఉండేవాడు. తుల్జాజీ 1787 లో ఆనారోగ్యంతో మరణించాడు. వెంటనే అమరసింహుడు తంజావూరు గద్దెనెక్కాడు. ష్వార్ట్జ్ కి అమరసింహుడు రాజవ్వడం సుతరామూ ఇష్టం లేదు. ఎలాగైనా శరభోజిని రాజుని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఎంత తెలివిగా రాజకీయం నడిపినా కుదర్లేదు. అది ఫలించడానికి సుమారు పదేళ్ళు పట్టింది. శరభోజిని 1798లో రాజుగా దగ్గరుండి గద్దెనెక్కించాడు. కాకపోతే అతని అదృష్టం అంతగా కలిసి రాలేదు. రెండేళ్ళు తిరక్కుండానే ష్వార్ట్జ్ అస్వస్థతతో పోయాడు.


సరస్వతీ మహల్ గ్రంథాలయం

అంతవరకూ ప్రతీ చిన్న విషయానికీ ష్వార్ట్జ్ మీద ఆథారపడ్డ శరభోజి తంజావూరు రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా వాళ్ళకి ధారాదత్తం చేసి, తన శేష జీవితం వెళ్ళబుచ్చడానికి పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకున్నాడు. ఇతనికి సాహిత్యమన్నా, సంగీతమన్నా అభిరుచెక్కువ. ప్రప్రంచంలో ఉన్న ప్రతీ చోట నుండీ వందలకొద్దీ పుస్తకాలు సంపాదించాడు. ప్రస్తుతమున్న తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం ఇతని భిక్షే! కవుల్నీ, కళాకారుల్నీ పోషించాడు. శరభోజీ మహారాజుకే శర్ఫోజీ అనే పేరు కూడా ఉంది. ఈయన పాలరాతి విగ్రహం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం లో ఇప్పటికీ చూడచ్చు. ఈ చరిత్ర ప్రకారం చూస్తే త్యాగరాజు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కాలం తెలుస్తుంది. కాకపోతే ఆయన జీవిత చరిత్ర రాసినిద్దరూ సంవత్సరాల చరిత్ర జోలికి పోలేదు. సమయానికి సంబంధించి ప్రస్తావించిన రెండు మూడు విషయాలూ సందేహాస్పదంగానే చెప్పారు.