జీనియస్ జీవిత కర్తవ్యం

Ludwig Wittgenstein
(1889-1951)
లుడ్విగ్ విట్‌గన్‌ష్టైన్ (Ludwig Wittgenstein) 1889 లో ఆస్ట్రియా దేశపు వియన్నా నగరంలో గొప్ప శ్రీమంతుల ఇంట్లో, ప్రతిభావంతులైన కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో ఆఖరువాడిగా పుట్టాడు. తండ్రి ఇనుము, ఉక్కు కర్మాగారాల్లో భాగస్తుడు. తల్లికీ తండ్రికీ సంగీతమంటే గొప్ప అభిరుచి. ఇంట్లో సాయంత్రం క్లాసికల్ సంగీత కచేరీలు జరిగేవి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కళాకారులు వచ్చేవాళ్ళు. వ్యక్తిగతంగా ఉన్నత నైపుణ్య స్థాయిని చిన్నప్పుడే తెలుసుకున్నవాడు కనుక కేవలం సాధారణ స్థాయి అంటే విట్‌గన్‌ష్టైన్ భరించేవాడు కాదు.
కుటుంబసభ్యులంతా చెప్పుకోదగ్గవాళ్ళే. అతని అన్నయ్య ఒకరు యుద్ధంలో ఒక చెయ్యి పోగొట్టుకున్నా పియానో కచేరీ లిచ్చి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు. అయితే కుటుంబంలో ముగ్గురు అన్నలు వేర్వేరు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. విట్‌గన్‌ష్టైన్ కూడా జీవితంలో చాలాసార్లు బ్రతకడం వృధా అనుకున్నవాడే. సంగీతం అంటే ఇష్టమున్నా ఉన్నత స్థాయికి చేరుకోలేనని, తండ్రికి సాయంగా ఉండవచ్చునని టెక్నికల్ రంగంపై కొంత ఆసక్తి చూపాడు. కాని చిన్నప్పటి నుండి ఫిలాసఫీ గురించి తలపోసేవాడు; మళ్ళీ దాంట్లో పైస్థాయికి వెళ్ళగలనో లేదో అని భయం.

Russell’s Principles of Mathematics
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకని ఇంగ్లాండు లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి వెళ్ళిన విట్‌గన్‌ష్టైన్ ప్రొపెల్లర్ డిజైన్ చేస్తూ ఉన్న సమయంలో కొన్ని లెక్కల క్లాసులు తీసుకున్నాడు. తోటి స్టూడెంట్ ఒకరు రస్సెల్ పుస్తకం, “The Principles of Mathematics,” చదవమని ఇచ్చారు. ఆ పుస్తకం చివరలో రస్సెల్, మౌలికమైన వివేచన కి సంబంధించిన సమస్యలకి తను కనుగొన్న పరిష్కారాలలో తప్పులున్నాయని చెప్తూ, గణిత విద్యార్థులని లోతుల్లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు. విట్‌గన్‌ష్టైన్ కి దీనితో తన జీవితాన్ని అర్పించే గొప్ప సమస్య దొరికినట్లనిపించింది. ఇంజనీరింగ్ కన్నా లెక్కలూ, ఫిలాసఫీ ముఖ్యమనీ మౌలికమైనవనీ భావించాడు. అయితే తనకి వాటిల్లో రాణించే శక్తి ఉందా? అని రెండేళ్ళు తీవ్రంగా మధనపడ్డాడు.
రస్సెల్ పుస్తకంలో ఫ్రేగె గురించి చదివాడు. తను రెండేళ్ళలో ఫిలాసఫి మీద రాసినవాటిని తీసుకొని జర్మనీ వెళ్ళి ఫ్రేగె ని కలిశాడు. గణితం పునాదుల మీద పనిచెయ్యాలంటే కేంబ్రిడ్జ్ వెళ్ళి రస్సెల్ ని కలవమని విట్‌గన్‌ష్టైన్ కి ఫ్రేగె సలహా ఇచ్చాడు.
1911లో ఓ అక్టోబరు రోజున హఠాత్తుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రస్సెల్ ఆఫీసులో విట్‌గన్‌ష్టైన్ ప్రత్యక్షమయ్యాడు. రస్సెల్ క్లాసులకి హాజరవడం మొదలెట్టాడు. రస్సెల్ ని ప్రశ్నలతో క్లాసులోనూ ఆఫీసులోనూ వేధించేవాడు. కాని ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన తను ఫిలాసఫీలో రాణిస్తాడా? రాణించకపోతే జీవితం వృథా అని తలపోస్తూ ఓ రోజు రస్సెల్ ని నిలదీసి అడిగాడు: “నాకు ఫిలాసఫీ చేసే అర్హత ఉందా? లేక వట్టి వెధవ నవుతానా? పనికి రాకపోతే చెప్పు, పోయి ఇంజనీరింగ్ చేస్తాను.” రస్సెల్ “ఏమో తెలియదు, ఫిలాసఫీ మీద ఏమన్నా రాయి, చూసి చెప్తాను,” అన్నాడు. రెండు నెలల లోపలే 1912 జనవరిలో విట్‌గన్‌ష్టైన్ సెలవుల్లో రాసిన ప్రతిని రస్సెల్ కి చూపించాడు. అది చదివిన రస్సెల్, విట్‌గన్‌ష్టైన్ లో గొప్ప ఫిలాసఫర్ అయ్యే లక్షణాలని కనిపెట్టి, వెంటనే, “ఇంజనీరింగు తప్పక మానెయ్యమని,” సలహా ఇచ్చాడు. ఆ ప్రోత్సాహమే లేకపోతే తొమ్మిదేళ్ళ పాటు తన జీవిత కర్తవ్యమేమిటా అని మధనపడిపోతున్న తనకి ఆత్మహత్యే శరణ్యమయ్యేదని విట్‌గన్‌ష్టైన్ తన స్నేహితుడితో తర్వాత చెప్పాడు.
విట్‌గన్‌ష్టైన్ ని ఇంజనీరింగ్ నుండి తత్వశాస్త్రానికి మరల్చి ప్రపంచానికి ఓ గొప్ప తాత్వికుణ్ణి ప్రసాదించిన ఘనత రస్సెల్ దేనని చెప్పొచ్చు. అతి తక్కువ కాలంలో పట్టుదలతో ఉత్సాహంతో తార్కిక గణితం నేర్చుకున్నాడు. రస్సెల్ విట్‌గన్‌ష్టైన్ ని బాగా ఆదరించాడు. తను చెప్పగలిగిందల్లా చెప్పానన్నాడు. తను తర్కం లో ఎదుర్కొన్న సమస్యలని తీర్చే మేధ విట్‌గన్‌ష్టైన్ కి ఉన్నదనీ తనకి వారసుడనీ సంతోషించాడు.
కేంబ్రిడ్జ్ లో పండితులైన ప్రొఫెసర్ల మధ్యన తనకి ఫిలాసఫీ చెయ్యడం ఇష్టం లేక, విట్‌గన్‌ష్టైన్ నార్వే వెళ్ళి చిన్న గుడిసె లో కొన్నాళ్ళు ఒంటరిగా కాపురమున్నాడు. తన ఆలోచనలని నోట్ బుక్ లో రాసేవాడు. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయింది. 1914 లో ఆస్ట్రియన్ ఆర్మీలో చేరాడు – మరణాన్ని ఎదుర్కొంటే కాని జీవితం సఫలం కాదని! సైన్యంలో శౌర్యానికి ధైర్యానికి బహుమతులు పొందాడు. యుద్ధంలో ఉండగా భావాల్లో మార్పు వచ్చింది. మతం అంటే అంత ఆకర్షణ లేనివాడు మతం గురించి ఆలోచనలు మొదలెట్టాడు. ఎక్కడకెళ్ళినా టాల్‍స్టాయ్ గోస్పెల్స్ పుస్తకం వెంటబెట్టుకుని ఉండేవాడు. ఫిలాసఫీ గురించిన ఆలోచనలని నోట్ బుక్ లో రాసుకునేవాడు. 1918 లో యుద్ధం చివరన ఇటలీ వాళ్ళు పట్టుకొని ఖైదీగా బంధించారు. ఓ సంవత్సరం తర్వాత విడుదల చేశారు.
యుద్ధం ముగిసేనాటికి ఆస్ట్రియాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. డబ్బు విలువ బాగా పడిపోయింది. కాని తండ్రి చాకచక్యంగా సంపదని అమెరికన్ బాండులలోకి మార్చడాన, విట్‌గన్‌ష్టైన్ యూరప్ లోకెల్లా గొప్ప ధనవంతుల్లో ఒకడయ్యాడు. అయితే యుద్ధం అతన్ని పూర్తిగా మార్చివేసింది. కుటుంబం నుంచి సంక్రమించిన పేరునీ సంపదనీ వాడుకోగూడదనుకున్నాడు. ఆస్తి మొత్తం అక్కలకీ ఇతర కుటుంబ సభ్యులకీ రాసి ఇచ్చేశాడు – తను మళ్ళి కావాలన్నా తిరిగి ఇచ్చేటట్లు లేకుండా!
తన పుస్తకం ప్రచురణకి ప్రయత్నం చేశాడు. ఎవరూ ముందుకు రాలేదు. సొంతంగా కొంత డబ్బు పెడితే ప్రచురిస్తామన్నారు. అయితే విట్‌గన్‌ష్టైన్ దగ్గర డబ్బు లేదు. రస్సెల్ పుస్తకానికి ముందుమాట రాశాడు – తత్వశాస్త్ర చరిత్రలోనే ఓ మైలురాయి అని. కాని రస్సెల్ తన పుస్తకాన్నసలు అర్థం చేసుకోలెదని విట్‌గన్‌ష్టైన్ విసుక్కున్నాడు. ఎలాగయితేనేం పుస్తకం 1921 లో ప్రచురణయింది. అతని జీవిత కాలంలో ప్రచురించింది ఇదొక్కటే. పేరు – Tractutus Logico-Philosophicus.
దాంట్లో తత్వశాస్త్ర సమస్యలనన్నిటినీ తీర్చానని చెప్పుకున్నాడు మరి ఇక ఫిలాసఫీ చెయ్యాల్సిన పని లేదు కదా! ఓ పల్లెటూరులో బడిపంతులుగా పనిచెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. బెర్ట్రాండ్ రస్సెల్, జాన్ మేనార్డ్ కేన్స్ (John Maynard Keynes) లాంటి ప్రపంచ ప్రఖ్యాత మేధావులతో కలసి పనిచేసిన వాడు, జీనియస్ అని వాళ్ళ చేతనే అనిపించుకున్నవాడు, ఇలా ఓ మారుమూల నిరుపేద గ్రామంలో పిల్లకి పాఠాలు చెప్పడానికి నిశ్చయించుకున్నాడు! కొన్నాళ్ళు పని చేసి పిల్లల తల్లిదండ్రులతో తగాదాపడి విరమించుకున్నాడు. సన్యాసి మఠం (monastery) లో తోటమాలి గా పనిచేశాడు. ఇలా దాదాపు పదేళ్ళు గడిచింతర్వాత, గణిత పునాదుల మీద వియన్నాలో ఒకరి ఉపన్యాసం వింటూ తన Tractutus లో కొన్ని లోపాలున్నాయని మళ్ళీ ఫిలాసఫీ చెయ్యడానికి 1929 లో కేంబ్రిడ్జ్ చేరాడు.
Tractutus ఆధారంగా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. అకడెమిక్ ఫిలాసఫీ అంటే ఎప్పుడూ చిన్న చూపే అయినా ఫిలాసఫీ ప్రొపెసర్ గా 1947 దాకా పనిచేశాడు. వివాహం చేసుకోలేదు. ఇద్దరు యువకులతో కొన్నాళ్ళు రొమాంటిక్ సంబంధాలు పెట్టుకున్నాడు. కాన్సర్ పాలయిన రెండేళ్ళకి 1951 లో చనిపోయాడు. అతని చివరి మాటలు, “Tell them [his friends] I’ve had a wonderful life.” తరువాత రెండేళ్ళకి అతని ముఖ్యమైన మరో రచన “Philosophical Investigations,” అచ్చయింది.