ఈమాట » మనకు తెలియని మన త్యాగరాజు -1

Expand to right
Expand to left

మనకు తెలియని మన త్యాగరాజు -1

త్యాగరాజు బాల్యం

చిన్నప్పట్నుండీ త్యాగరాజుకి సంగీతం అంటే ఇష్టం. వీణ కాళ హస్తయ్య దగ్గర వీణా, తల్లి దగ్గరా గాత్రమూ అభ్యసించాడు. అతి పిన్న వయసులోనే సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. తల్లి పాలు తాగేటప్పుడే సంగీతం వినిపిస్తే చాలు, తాగడం ఆపేసి, ఎంతో శ్రద్ధగా చెవులిక్కించి వినేవాడన్న ఈ విషయాన్ని, త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ (దాదాపు) మరింత అతిశయోక్తిగా చెప్పారు. సంగీత శబ్ద జ్ఞానానికి నెలలు పిల్లాడిగా ఉన్నప్పుడే అతివేగంగా స్పందించేవాడని చెప్పారు. ఇలాంటి విషయాలు తల్లి తండ్రులూ, బంధువుల ద్వారానే ఇతరులకి తెలిసే అవకాశం ఎక్కువ. త్యాగరాజు అసమాన్య ప్రతిభ చూసి అందరూ పొగుడుతుంటే తల్లితండ్రులే చెప్పుండచ్చు. ఇలాంటి విషయాలికెవరూ ఆధారం చూపలేరు. కాబట్టి అవుననుకొని ఒప్పుకోడానికి ఎవరికీ అభ్యంతరముండదు. ఈ విషయాన్ని కృష్ణ స్వామి భాగవతార్ రాసారు కానీ, ఆయన తండ్రి వెంకటరమణ భాగవతార్ ఎక్కడా ప్రస్తావించలేదు. తండ్రీకొడుకులిద్దరూ త్యాగరాజుతో గడిపారు కనుక ఇద్దరు రాసిందీ వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇలాంటిదే ఇంకో విశేషం కూడా ఉంది. త్యాగరాజు చిన్నతనంలో ఒకసారి విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాడట. ఓ సాధు పుంగవుడొచ్చి ఆశీర్వదించాక ఆరోగ్యం కుదట పడిందని రాసారు. ఆ తరువాత తన ముగ్గురు పిల్లల్నీ తీసుకొని రామబ్రహ్మం కాశీయాత్రకి బయల్దేరినప్పుడు, తిరువారూరు త్యాగరాజ స్వామి కలలో కనిపించి, కావేరీ నదీతీరానున్న పంచనదీ స్థలవిశేషమైన తిరువైయ్యార్లో శేష జీవితం గడపమని చెప్పాడట. ఈ సంఘటన తరువాతే రామబ్రహం తుల్జాజీ మహారాజుకి తన కలగురించి వివరిస్తే, ఆయన దయతో ఆరెకరాల పొలమూ, ఓ ఇల్లూ ఇచ్చాడని ఉంది. ఈ సంఘటన తిరువారూర్లో ఉండగా జరిగింది. కాబట్టి త్యాగరాజు తిరువైయ్యార్ వచ్చాక అంతా సవ్యంగానే సాగిందని చెప్పుకోవాలి. ఇది వెంకట రమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధంలో ఉంది. కృష్ణ స్వామి భాగవతార్ కూడా ఇలాగే రాసారు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చాక త్యాగరాజు అక్కడున్న సంస్కృత పాఠశాలో విద్యాభ్యాసం చేసాడు. మామూలుగా తోటి పిల్లలతో ఆట పాటల్లో అంతగా గడిపేవాడు కాదు. పేరుకు తగ్గట్లుగా తన దగ్గరున్నవన్నీ స్నేహితులకిచ్చేసేవాడు. త్యాగరాజు చిన్నతనంలోనే అంటే ఎనిమిదో ఏటే ఉపనయనం చేసాడు రామబ్రహ్మం. అప్పుడే రామ తారక మంత్రాన్ని జపించమని త్యాగరాజుకి మంత్రోపదేశం చేశాడని వెంకటరమణ భాగవతార్ రాసాడు. ఆ సమయంలోనే రామబ్రహ్మానికి రామనవమి ఆరాధనోత్సవాల్లో సహకరించడానికొచ్చిన శ్రీ రామకృష్ణానంద స్వామి “నమో నమో రాఘవాయ” అనే మంత్రాన్ని త్యాగరాజుకి ఉపదేశించారనీ రాసారు. దాదాపు ఇలాగే రాసినా, కృష్ణ స్వామి భాగవతారు రాసినదాంట్లో, శ్రీ రామకృష్ణానంద స్వామి ప్రస్తావనెక్కడా లేదు. సరిగ్గా అప్పుడే రామబ్రహ్మం తమ కుటుంబారాధ్య దైవమైన శ్రీరాముణ్ణి నిత్యమూ పూజించే బాధ్యత త్యాగరాజుకి అప్పగించాడు.

తిరువైయ్యారులో కానీ, తిరువారూరులో కానీ, ఆ చుట్టు పక్కల ఎక్కడా ఒక్క రామాలయం లేదు. ఉన్నవన్నీ శివాలయాలే. పేరుకి తగ్గట్టు రామబ్రహ్మం రామ భక్తుడు. అదే రామభక్తిని త్యాగరాజుకీ వారసత్వంగా అందించాడు. ప్రతీయేటా తప్పని సరిగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేవాడు రామబ్రహ్మం. ఈ రామనవమి ఉత్సవాలు అన్నది భద్రాచల రామనవమి ఉత్స్తవాల స్ఫూర్తి తోనే అప్పట్లో తెలుగునాట జరిపేవారు. ముఖ్యంగా తంజావూరు చుట్టుపక్కల ఈ రామనవమి ఉత్సవాలు అప్పట్లో జరిగేవి కావు. త్యాగరాజూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేవాడు. ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రాయడానికి ఇవే కారణం కావచ్చు.

తండ్రప్పగించిన రామ పూజని త్యాగరాజు నిత్యమూ ఎంతో శ్రద్ధతో చేసేవాడు. తను కాలం చేసే వరకూ త్యాగరాజు ఈ రామ విగ్రహానికి నిత్యారాధన జరిపేడు. (ఈ విగ్రహం మధ్యలో ఒకసారి పోయి దొరికింది. ఆ విషయం ముందు ముందు వస్తుంది.)

సీతారామ విగ్రహం
సీతారాముల విగ్రహం

ఈ విగ్రహం కూడా తంజావూరు మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దీనికీ భధ్రాచల రామ విగ్రహానికీ చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి.

భధ్రాచల రామ విగ్రహానికొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే - సీతమ్మ వారు రాముడి తొడపైన కూర్చొనుంటుంది. ఇదొక్క భద్రాచల విగ్రహంలోనే కనిపిస్తుంది. మిగతా దేవాలయాల్లో రాముడి పక్కనే సీతమ్మ వారు ఉంటుంది. రామబ్రహ్మం పూర్వీకుల ఆరాధ్య దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా విశ్వాసం. రామ బ్రహ్మం పూర్వీకులు కర్నూలుండి తంజావూరు వలస వెళ్ళారని తెలుసు. భద్రాచల రామదాసు జీవిత కాలం 1620 - 1680 మధ్యన. ఆ తరువాతే విజయ నగర సామ్రాజ్య పతనమూ, కొంతకాలానికి తంజావూరు గద్దెపై మరాఠీ రాజుల పాలనా మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే తెలుగుసీమ నుండి తంజావూరికి వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా త్యాగరాజు తల్లి దగ్గర రామ దాసు కీర్తనలన్నీ చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే త్యాగరాజు కుటుంబ దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా నమ్మకం.

సంగీతంలో త్యాగరాజు అపార ప్రావీణ్యం చూసి రామబ్రహ్మం సంగీతంలో సులువులూ, మెలకువులూ తెలుసుకోమని శొంఠి వెంకట రమణయ్య అనే గురువు దగ్గరకి శిష్యుడిగా పంపించాడు. ఈ శొంఠి వెంకటరమణయ్య తుల్జాజీ మహారాజు కొలువులో ప్రధాన ఆస్థాన సంగీత విద్వాంసుడు. రామ బ్రహ్మమూ తుల్జాజీ కొలువులోనే ఉండడం వల్ల వెంకటరమణయ్య త్యాగరాజుని శిష్యుడిగా స్వీకరించడం సులువయ్యింది. కొంతకాలం ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు త్యాగరాజు. వి.రాఘవన్ అనే సంగీత శాస్త్ర కారుడి వద్ద 1800 కాలంలో సంగీతం సంబంధించి సంస్కృతంలో రాసిన కొన్ని ప్రతులుండేవి. అందులో ఈ శొంఠి సుబ్బయ్య కొడుకు వెంకటరమణయ్య అనే ఆయన వివిధ రకాల తాళ ప్రక్రియల్లో ప్రసిద్ధుడని ఉందనీ రాసారు. త్యాగరాజు గురువైన ఈ శొంఠి వెంకటరమణయ్య 1803 నుండి 1817 వరకూ మద్రాసు (చెన్నై) లో ఉండి ఉండవచ్చనీ రాఘవన్ అభిప్రాయపడ్డారు. త్యాగరాజు ఈయన వద్ద ఎంతో కాలం సంగీతం నేర్చుకోలేదు. “ప్రావీణ్యం సంపాదించడానికందరికీ కొన్ని సంవత్సరాలు పట్టే సంగీతాన్ని, త్యాగరాజు ఒక్క ఏడాదిలోపునే గ్రహించేసాడని ఆయన చరిత్ర రాసిన అనేకమంది చెప్పారు.

కొన్ని నెలల తరువాత త్యాగరాజు తల్లి వైపు తాత, వీణ కాళహస్తయ్య, చని పోయారు. అప్పుడు ఆయన దగ్గర “నారదీయం” అనే పేరుతో అనేక తాళ పత్ర గ్రంధాలు త్యాగరాజుకి లభించాయి. అవన్నీ క్షుణ్ణంగా చదివాడు. కానీ చాలా విషయాలు అవగతం కాలేదు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా రామకృష్ణానంద స్వామిని కలవడం జరిగింది. త్యాగరాజు “నారదీయం” గ్రంధం గురించి చెప్పాడు. చాలా విషయాలు బోధ పడలేదనీ చెప్పాడు. అప్పుడా రామకృష్ణానంద స్వామి నారదోపాసన మంత్రం ఉపదేశించి, త్యాగరాజుని నారద మంత్ర జపం చేయమన్నాడు. త్యాగరాజు కొన్ని 96 కోట్ల సార్లు జపం చేసాడని వెంకట రమణ భాగవతారు రాసారు.

సరిగ్గా ఇక్కడే హరికథా భాగవతార్ల భక్తితో కూడిన ఊహజనిత మైన అల్లిక కనిపిస్తుంది. కొన్ని కోట్ల జపానంతరం నారదుడు త్యాగరాజుకి ప్రత్యక్ష మయ్యాడనీ, నారదుడు ప్రసన్నుడై “స్వరార్ణవం” అనే మరో సంగీత శాస్త్ర గ్రంధం కానుకగా ఇచ్చాడనీ రాసారు.

నారద సాక్షాత్కారం అయ్యాక, నారదుడి పై గురు భావంతో త్యాగరాజు “వరనారద” మరియు “శ్రీ నారద” అనే రెండు కృతులు స్వర పరిచాడనీ రాసారు.

ఇదే విషయం కృష్ణ బాగవతార్ వేరే రకంగా రాసారు. ఆయన నారదుడూ, ప్రత్యక్ష మవ్వడం ఇవేం రాయలేదు. కానీ త్యాగరాజు తల్లి తాతగారు గిరిరాజకవి చనిపోయినప్పుడు ఇంట్లో ఆయన వస్తువులన్నీ సర్దుతుండగా “సంగీత రత్నాకరం” అనే గ్రంధమూ, ఇంకా సంగీతానికి సంబంధించినవనేకం దొరికాయనీ రాసారు. ఈ సంగీత రత్నాకరం” మాతృభూతేశ్వర అనే ఆయన తల్లి తాతగారు గిరిరాజ కవికిచ్చినట్లుగా రాసారు. బహుశా ఈ మాతృభూతేశ్వరుడు 18వ శతాబ్దంలో తిరుచిరాపల్లి లో ఉన్న ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడు కావచ్చని పి.సాంబమూర్తి గారు రాసారు. అదలా ఉంచితే, ఈ గిరిరాజ కవి త్యాగరాజు తల్లి తాతగారు. అంటే త్యాగరాజుకి ముత్తాత. ఈ కొత్త బంధుత్వం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదు. తండ్రివైపు తాత గిరిరాజ కవి అని తెలుసు. మరి ఈ ముత్తాత గారి పేరు కూడా గిరిరాజ కవేనా అన్నది రూఢిగా చెప్పడానికెక్కడా ఆధారాలు లేవు. ఈ రెండు విషయాలూ చదువర్లని అయోమయంలో పడేస్తాయనడానికి మాత్రం సందేహించనవసరం లేదు.

ఈ సంగీత రత్నాకరంలో 72 మేళ కర్త రాగాల గురించీ, వివిధరకాలైన తాళాల గురించీ, 22 శ్రుతులూ, వాటిననుసరించే అను శృతుల ప్రాధాన్యత గురించీ, 10 రకాలైన గమకాల వివరాలూ, ఔడవ రాగాల ప్రశస్తీ, ఇలా ఎన్నో విషయాలున్న గ్రంధమది. వి.రాఘవన్ అనే ఆయన “స్వరార్ణవం” అనే గ్రంధాన్ని మిగతా సంగీత గ్రంధాలతో (The Music Academy Journal) కలిపి పొందుపరచనట్లుగా ఉంది.

నారద మంత్రమే కాకుండా రామ తారక మంత్రాన్నీ కూడా కొన్ని కోట్ల సార్లు జపించాడాని రాసారు. ఎన్ని సార్లు జపించినా రాముడు ప్రత్యక్షం కాలేదు. ఎన్నో సార్లు కనిపించీ కనిపించనట్లుగా త్యాగరాజుకి భ్రమ కలిగేది. అప్పుడే “ఏల నీ దయా రాదూ” అనే కృతిని రచించాడనీ చెబుతారు.

త్యాగరాజు రచించిన కృతులని ఏ సందర్భంలో పాడాడూ, ఎప్పుడు రాసాడూ అన్న దానికి సరైన ఆధారాలు లేవు. ఏ ప్రతిలోనూ తేదీ కానీ, సంవత్సరం కానీ లేవు. అందువల్ల ప్రజలకు లభ్యమైన కృతుల సాహిత్యం బట్టీ, త్యాగరాజు జీవితంలో జరిగినట్లనిపించిన సంఘటనలకి ముడివేయడం ప్రారంభించారు. ఏ కృతి చూసినా ఫలానా సందర్భంలో చెప్పి ఉండచ్చు అనే ఊహాగానంతోనే చెప్పారనుకోవాలి తప్ప, సరైన ఆధారాలు లేవు. కొన్ని కృతులకి మాత్రం ఎక్కడ పాడారో చెప్పారు. తేదీలు లేకపోయినా ప్రదేశాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ, ఏ దైవాన్నుద్దేశించి రాసిన దాన్నిబట్టీ చెప్పడం జరిగింది. కోవూరు కీర్తనలూ, తిరుపతి వెంకటేశ్వర స్వామి పై రాసినవీ ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పంచనదయ్య త్యాగరాజు పెద్దన్నయ్య. అతను పెళ్ళి చేసుకొని మామూలు సంసారిక జీవితాన్ని గడిపేవాడు. ఈయన్నే “జప్యేశ” అని కొంత మంది సంబోధించారు. త్యాగరాజు చిన్నన్నయ్య పేరు పంచాపకేశ బ్రహ్మం. అతను త్యాగరాజుకి వివాహం కాకమునుపే అనారోగ్యంతో పోయాడు. అతను అనారోగ్యంతో మంచానున్నప్పుడు “అన్యాయము సేయకురా” అనే కృతిని త్యాగరాజు పాడినట్లుగా వెంకటరమణ, కృష్ణస్వామి భాగవతార్లిద్దరూ రాసారు.

త్యాగరాజు రాసిన మొదటి కృతి ఏదీ? ఎన్నో ఏట రాసాడూ? అన్న వివరాలు ఇదమిత్థంగా తెలీవు. కొంతమంది “గిరిరాజ సుత తనయ” అనే కృతే మొట్టమొదటి రచన అని నమ్ముతారు. అది కాదు “నమో నమో రాఘవాయ” (దేశి తోడి రాగం) మొట్ట మొదటి కృతి అని వాదిస్తారు. మొదటిది తెలుగులో రాసింది. నమో నమో రాఘవాయ మాత్రం సంస్కృత రచన.

ఇదే మొదటి కృతి అని చెప్పడానికి రెండు ఆధారాలు కూడా చూపించారు. త్యాగరాజు సంస్కృత విద్యా నిమిత్తమై తిరువైయ్యరు వచ్చాడు. ఎవరికైనా విద్యా ప్రభావం చిన్న తనంలో ఉంటుంది. గురువులైన సంస్కృతం పండితుల ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువ. బహుశా అదే ప్రభావంతో త్యాగరాజు సంస్కృతంలో రాసుండచ్చని వాదించారు. ఈ రచన త్యాగరాజు 13 నుంది 15 ఏళ్ళ వయసులో జరిగుండవచ్చనీ చెప్పారు. ఈ కృతి పూర్తిగా సంస్కృతంలోనే ఉంటుంది. త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతుల్లో ఇదే మొదటి కృతిగా చెప్పుకోవాలి. ఆ తరువాత రాసినవాటిలో ఎక్కువ భాగం అచ్చ తెలుగులోనే ఉన్నాయి. ఇదే విషయం విలియం జాక్సన్ (త్యాగరాజ: లైఫ్ అండ్ లిరిక్స్) లో ప్రస్తావించాడు. అతనే దీనికంటే మరో బలమైన కారణం చూపింఛాడు.

త్యాగరాజు చిన్నతనంలో అంటే, 1780 నుండి 1783 మధ్యన తంజావూరికి విపరీతమైన కరువొచ్చింది. మైసూరు రాజైన హైదరాలీ సైన్యం తంజావూరు చుట్టు పక్కల గ్రామాలనన్నీ మట్టుపెట్టాయి. పల్లెల్లో వున్న పంటకాల్వల్నీ, వ్యవసాయ భూముల్నీ చింద్రం చేసేసారు. భయంతో ప్రజలు దగ్గరున్న పట్టణాలికి పరిగెత్తారు. ప్రతీ గ్రామంలోనూ నీటికీ, తిండికీ ఎద్దడొచ్చింది. గోరుచుట్టుపై రోకలి పోటులా ఓ రెండేళ్ళ పాటు రుతుపవనాలు రాలేదు. వర్షాల్లేవు. పొలాలన్నీ బీడు భూముల్లా తయారయ్యాయి. ఇది జరిగినప్పుడు త్యాగరాజుకి సుమారు 13 నుండి 15 ఏళ్ళ వయసుండుంటుంది. ఇది చూసి చలించి, ఓ జానపద గీతంలా రాముణ్ణి వేడుకుంటూ త్యాగరాజు రాసాడనీ అన్నారు. ఆ కృతిలో - రాముడే రక్షిస్తాడనీ, సకల లోక రక్షకుడనీ, దుష్ట శిక్షకుడనీ కీర్తిస్తూ, పేదవారి కష్టాలని దాటించే దయాశీలనీ చెప్తాడు. తనని నమ్ముకున్న భక్తులకి రాముడెన్నడూ అన్యాయం చేయడనీ అంటాడు. తన చుట్టూ ఉన్న దయార్ద్ర స్థితిని చూసి దైవ భక్తి ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి త్యాగరాజు ప్రయత్నించాడని జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఇదే త్యాగరాజు మొదటి రచన అయ్యుండచ్చనీ చెప్పాడు. ఇందులో ఎక్కడా హైదరాలీ సైన్యం అకృత్యాలు కానీ, నిస్సహాయ రాజుల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించ లేదు.

త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన ఇద్దరూ (వెంకట రమణ భాగవతార్, ఆయన కొడుకు కృష్ణస్వామి బాగవతార్ కానీ) 1781 సంవత్సరంలో తంజావూరు రాజ్యంలో వచ్చిన కరువు గురించి కానీ, హైదరాలీ అకృత్యాల గురించి కానీ రాయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పటికి పుట్ట లేదు. ఒకవేళ పుట్టినా ఈ విషయాలు రాసుండేవారు కారనీ విలియం జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు త్యాగరాజుని దేవుని అవతారంగా భావించి రాసారు. పురాణ పురుషుడిగా భావించారు. త్యాగరాజు కూడా తన రచనల్లో ఎక్కడా ఈ కరువు ప్రస్తావన తీసుకు రాలేదు. అదీకాక హిందువులకి పురాణా కథలమీదున్న భక్తీ, ఆసక్తీ, చరిత్ర మీద లేదని పండితుల అభిప్రాయంగా విలియం జాక్సన్ రాసాడు.

“గిరిరాజ సుత తనయే” మొదటి కృతని సుబ్బరామ దీక్షితార్ (1839 - 1906) అనే ఆయన రాసారు. ఈ సుబ్బరామ దీక్షితార్ చిన్నతనంలో త్యాగరాజుని కలిసారు. ఈయన ముత్తుస్వామి దీక్షితార్ వంశీకుడు. ఈయన సంగీతానికి సంబంధించిన చాలా గ్రంధాలు సేకరించాడు. సంగీత సంప్రదాయ ప్రదర్శిని (Exposition of the Tradition of Music) అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో దక్షిణ భారత దేశంలోని వాగ్గేయ కారుల జీవిత చరిత్రలు రాశాడు. త్యాగరాజు గురించీ కొద్దిగా రాసాడు. తిరువారూర్ త్యాగరాజ స్వామి అవతారమే ఈ త్యాగరాజనీ కీర్తించాడు. త్యాగరాజు జీవితం గురించి వివరాలెక్కువ దొరకలేదనీ విచారించాడు.

ఇలా ఎవరికి ఏ విషయం తెలిస్తే దాన్ని వాళ్ళు రాసారు. ఇందులో స్తవమెంత, వాస్తవమెంత అన్నది తెలీదు. శాస్త్రీయంగా ఆధారాలు చూపించినప్పుడే ఇదీ సరైన చరిత్ర అని చెప్పగలం.

త్యాగరాజుకి 18వ ఏట (1785 లో) పార్వతనే అమ్మాయినిచ్చి వివాహం చేసారు. త్యాగరాజు 20 వ ఏట తండ్రి రామబ్రహ్మం కాలం చేసాడు. (త్యాగరాజుకి 15 ఏళ్ళ వయసులోనే మాతా పిత్రు వియోగం కలిగిందనీ సుబ్బరామ దీక్షితార్ రాసారు. దీనికి ఆధారాలెక్కడివో తెలీవు. )

సరిగ్గా తండ్రి పోయిన మూడేళ్ళకి త్యాగరాజు భార్య పార్వతి మరణించింది. ఆ తరువాత రెండేళ్ళకి పార్వతి చెల్లెలు కమలాంబని త్యాగరాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు.

ఇక్కడి వరకే వెంకటరమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధం ఉంది. మిగతా జీవిత విశేషాలు ఎందుకు పొందుపరచలేదో తెలీదు. అలా అర్థాంతరంగా ముగించడానిగ్గల వివరాలెవ్వరికీ తెలీదు. అందువల్ల తరువాతాయన కొడుకు కృష్ణస్వామి రాసిన త్యాగరాజు జీవిత చరిత్రే అందరికీ ఆధారమయ్యింది. అందులోంచే మిగతా విశేషాలు తెలిసాయి.

( ఇంకా వుంది )

  1. Tyagaraja – Manuscripts of VemkaTa Ramana Bhagavatar and T.S.Rama Rao – Translated versions. Madras University
  2. Tyagaraja – Life Story – KrishNa Bhagavatar (English Translation Madras University)
  3. The Great Composers Vol I & II – P.Samba Murthy
  4. Tyāgarāja and the South Indian Bhajana Sampradāya - Robert L. Simon (Oxford Music Journal)
  5. Tyagaraja – Life and Lyrics – William Jackson
  6. Tyagaraja: A Great South Indian Composer – Ethel Rosenthal (Oxford Music Journal)
  7. Know your Tyagaraja – S.V. Krishna Murthy
  8. The Spiritual Heritage of Tyagaraja – Dr. V. Raghavan
  9. సమగ్రాంధ్ర చరిత్ర – ఆరుద్ర
  10. నాదయోగి త్యాగయ్య – తిరుమూరు సుధాకర రెడ్డి
  11. వాగ్గేయకారుల చరిత్ర – టి. పార్థసారధి
  12. గాన కళాబోధిని – ఎన్.సి.పార్థసారధి
  13. Tyagaraja and the Renewal of Tradition – Translations and Reflections- William J Jackson
  14. త్యాగరాజ కీర్తనలు – మంచాళ జగన్నాధ రావు
  15. త్యాగరాజ ఆత్మ విచారము – భమిడిపాటి కామేశ్వర రావు (తెలుగు యూనివర్సిటీ లో దొరికిన కొంత భాగం మాత్రమే)
  16. ఆంధ్ర వాగ్గేయ కారుల చరిత్ర – బాలాంత్రపు రజనీకాంత రావు
  17. The Science of Indian Music – నూకల చిన సత్యనారాయణ
ముందరి పేజీ(లు) 1 2 3 4
 

(17 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. chandrasekhar అభిప్రాయం:

    September 2, 2008 4:27 am

    వ్యాసంబాగుంది. పంచపాకేశ, మాతృభూతేశ్వర వంటి పేర్లు తప్పుగా రాశారు. మీరు కొత్తగా కనుక్కున్నదేమిటి?

  2. mOhana అభిప్రాయం:

    September 8, 2008 6:39 am

    ఈ వ్యాసం మిగత భాగాలకు ఎదురుచూస్తున్నాను. సాయి
    బ్రహ్మానందం గారి శ్రద్ధ, ఆసక్తి, కుతూహలం ఈ వ్యాసంలో
    ప్రతిబింబిస్తున్నాయి. ఒక వాగ్గేయకారునికి ముఖ్యంగా
    కావలసినవి - సంగీతంలో విద్వత్తు, సాహిత్యంలోని
    సుళువులు. ఈ రెంటికి ఎలా పొత్తు కుదిరిస్తే పండిత
    పామర రంజకంగా ఉంటుందనే విషయాన్ని తెలిసిన
    వారిలో త్యాగరాజు అద్వితీయుడు. ఏ మహానుభావుడైనా
    అంత గొప్పవాడు ఎలా అయ్యాడని తెలిసికోవాలంటే అతని
    జీవిత చరిత్ర దీనికి కొంతైనా సహాయకారి అవుతుంది.
    దీనికి ఈ వ్యాసం ఎంతైనా తోడ్పడుతుంది. త్యాగరాజుని
    తలచుకొంటుంటే ఒక్కొక్కప్పుడు విదేశాలలో ఉండే మన
    స్థితి గుర్తుకు వస్తుంది. తెలుగులో ఆసక్తి ఉన్న
    దేశాంతరవాసులంతా ద్వీపాలే. తమిళదేశంలో ఉండే
    త్యాగరాజు కూడ ఒక తెలుగు ద్వీపమే. అతడు ద్వీపం
    మాత్రమే కాదు, ఒక దీపం కూడా. మనలో ఒక కొందరికి
    తెలుగు భాషను అభివృద్ధి చేయాలనే ఆశ ఉన్నది.
    దీనికి కూడా ఇట్టి వ్యాసాలలో మార్గాలు దొరుకుతాయేమో?
    బ్రహ్మానందంగారి శ్రమ ప్రశంసనీయం. ఇందులో
    ఉదహరించబడిన ఒక పుస్తకం కింది లింకులో
    లభ్యము -
    tyAgarAja - Life and Lyrics - Jackson
    (Digital Library of India, IISc)

    విధేయుడు - మోహన

  3. suryanarayanna అభిప్రాయం:

    September 10, 2008 12:53 am

    సామజవరగమనా , నాదతనుమనిశం, శ్రీ నారసింహ మాం పాహి ……..యిలా ఇంకా చాలా సంస్కృత కీర్తనలు త్యాగరాజ కీర్తనలు గానే, ఆయన ముద్రతో ప్రాచుర్యం లో ఉన్నాయి.
    “త్యాగరాజ స్వామి సంస్కృత కీర్తనలు ” అని ఒక 10 లేక 12 కీర్తనల సంకలనం శ్రీ బాలమురళీ కృష్ణ గారు పాడిన ” సంగీతా ” కంపెనీ వారి కేసెట్టు కూడా ఒకటి ఉంది.
    బ్రహ్మానందం గారూ , “నమోనమోరాఘవాయ” అనే కృతి ఒక్కటే త్యాగరాజ స్వామి వారి ఏకైక సంస్కృత రచన అంటారా ? రూఢి గా ? ( మీరు వ్యాసం లో ఒకచోట చెప్పినట్లు )

  4. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 10, 2008 5:05 am

    సూర్యనారాయణ గారూ,

    ఎన్నో సంస్కృత పదాలు మనం తెలుగు పదాలుగా వాడుతాం. కొన్ని పదాలైతే ఇవీ సంస్కృత పదాలూ, తెలుగువి కావన్న తేడా కూడా తెలీకుండా వాడుకలో ఉన్నాయి. గ్రాంధిక భాషలో వచ్చిన అనేక కావ్యాలలో సంస్కృత పదాలు తెలుగు పదాలుగానే వ్యవహరింపబడ్డాయి. ముఖ్యంగా దైవ స్తుతి వచ్చేసరికి చాలామందిపై సంస్కృత స్తోత్రాల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఆ ధోరణిలోనే రచనలు కనిపిస్తాయి. మీరుదహరించిన త్యాగరాజు కృతుల్లో అన్నీ సంస్కృత పదాలే! కానీ అవన్నీ ఎంతో కొంత తెలుగు చదువుకున్న వారికి తెలీని పదాలు కావు. పూర్తి అర్థాలు తెలీక పోయినా చాలా పదాలు వాడుకలో కనిపించేవే!

    త్యాగరాజు మొదట్లో చేసిన రచనల్లో సంస్కృత భాష ప్రభావం అమితంగా ఉంది. రాను రానూ పూర్తిగా తెలుగులోనే కృతులు కనిపిస్తాయి. వాగ్గేయకారుడిగా రచనల్లో పరిణామ క్రమం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొన్ని త్యాగరాజు కీర్తనలు ఆయన ముద్రతోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ప్రక్షిప్తాలా లేక త్యాగరాజు స్వీయరచనలా అన్నది స్పష్టంగా తెలీదు. చాలా భాగం త్యాగరాజు కీర్తనలు ఆయన శిష్యుల ద్వారా లభించినవే!

    స్వలిఖితంగా ఉన్న ఒక్క త్యాగరాజ కృతీ దొరకలేదు.

    కొన్ని కృతులు త్యాగరాజు రాయలేదన్న సంగీత శాస్త్రజ్ఞుల వాదన కూడా! సామజవరగమన ఆయన కృతే అని శైలిని బట్టి చెప్పచ్చు. ఇందులో వాడిన కొన్ని పదాలు వేరేచోట్ల మరికొన్ని కృతుల్లో కనిపిస్తాయి. కానీ “శ్రీ గణనాధం భజామ్యహం” కృతి మాత్రం ప్రక్షిప్తమనీ చెప్పడానికి కొన్నైనా ఆధారాలు చూపగలం.

    ఇవన్నీ ముందు ముందు నాకు తెలుసున్నంత వరకూ చర్చిస్తాను.

    నేను రాసిన ” త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతి ఇదొక్కటే! ” అన్న వాక్యం ఉపసంహరించుకుంటున్నాను. అది తొలగించమని ఈమాట వారిని అడుగుతాను. మీరు “సవరణ” చెప్పినందుకు కృతజ్ఞతలు.

  5. sasAmka అభిప్రాయం:

    September 11, 2008 12:27 pm

    కర్ణాటక సంగీతం కాదు బాబోయ్..కర్నాటక సంగీతం

  6. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 12, 2008 2:39 pm

    శశాంక గారూ,

    కర్ణాటకం సరైందా? లేక కర్నాటక అనే రాయాలా? అన్నవిషయం పై భాషాశాస్త్ర పరంగానూ, చరిత్ర పరంగానూ వివరిస్తూ ఓ పది పేజీల వ్యాసం రాయచ్చు. నాకు తెలిసీ రెండు విధాలుగానూ అనచ్చు. కాదని పండితులెవరైనా అధారాలతో వివరిస్తే మంచిదే! వినడానికి కర్ణాటకం, పలకడానికి కర్నాటకం ఎంచుకోడంలో ఇబ్బందుండదనుకుంటాను.

  7. mOhana అభిప్రాయం:

    September 13, 2008 8:10 am

    కర్ణాటకమా లేక కర్నాటకమా అనే దానిని గురించి ఒక కన్నడ కవి (బహుశా కువెంపు కాబోలు) అది “నొణ (నకార ణకారాలు) కాట” (ఈగ పోరు) అని అన్నారు. ణ-కారాన్ని న-కారంగా పలకడం సర్వసామాన్యం. హిందీ వంటి భాషలో ఇది వ్యాకరణరీత్యా సరియైనదే. అందుకే తెలుగులో ఈ రెండు అక్షరాలకు ప్రాస (యతి) సరిపోతుంది. కాని నాకు నచ్చనిది కర్నాటిక్ అనడం! - మోహన

  8. Rohiniprasad అభిప్రాయం:

    September 13, 2008 9:26 am

    My two cents:
    ఇంగ్లీషువాళ్ళని గురించి వాళ్ళెప్పుడూ చెప్పుకుని ఉండరు కనక మనవాళ్ళకి వాళ్ళ గురించి ఫ్రెంచివాళ్ళ ద్వారా తెలిసి ఉండాలి. అందుకని వాళ్ళకి ఫ్రెంచి ఉచ్చారణని బట్టి ఆంగ్లేయులు అని పేరు పెట్టారు. అలాగే దక్షిణాది సంగీతం గురించి మహారాష్ట్రులకి ముందుగా తెలిసి ఉంటుంది. అది పాడేవాళ్ళంతా కర్ణాటక ప్రాంతంవాళ్ళయి ఉంటారు కనక దానికి కర్ణాటక సంగీతం అని పేరు పెట్టి ఉంటారు. రాగాలు తెలియని కొన్ని నాట్య సంగీత్ పాటలకి కర్నాటకీ అని రికార్డులమీద రాసి ఉంటుంది. As if it is self-explanatory!

  9. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    October 4, 2008 10:20 am

    సాయి గారికి సంగీతంపై కేవలం ఆసక్తే కాక అపారమైన పరిజ్ఞానం ఉందని తెలుస్తుంది. ఈ వ్యాసంలో చారిత్రక నేపథ్యం, తంజావూరు చరిత్రా బావున్నాయి. నాకు నచ్చని విషయాలు:

    1. త్యాగరాజు తాత ముత్తాతల వంశ వృక్షాల గోత్రాల గోరీ వివరాలకి అంత ప్రాధాన్యత అవసరమా?.

    2. ప్రచారం లో ఉన్న కట్టు కథలని స్థూలంగా చెప్పి అసలు చరిత్ర మీద కేంద్రీకరిస్తే బావుండేది.

    అప్పుడప్పుడూ పాత తెలుగు సినిమా పాటలను వినడం మినహా నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కాబట్టి నేనడగబోయే ప్రశ్న మరీ అమాయకంగా (naive గా) ఉండొచ్చు.

    అప్పటిదాకా లాగుడు పీకుడు రాగాలతో ఉన్న శాస్త్రీయ సంగీతాన్ని త్యాగరాజు శ్రావ్యం చేశాడన్నారు. దీనిక చారిత్రక శాస్త్రీయ ఆధారాలేమిటి? అంతకు ముందర ఈ సంగీతం నిజంగాఅంత కర్ణ కఠోరంగా ఉండేదా?

    కొడవళ్ళ హనుమంతరావు

  10. Raghava అభిప్రాయం:

    October 5, 2008 7:32 am

    హనుమంతరావు గారూ,

    మీకు నచ్చని వివరాలు నాకు నచ్చాయి. అవి ఉండడం వల్ల ఈ వ్యాసానికొచ్చిన నష్టం ఏమీ లేదని అనుకుంటున్నాను. లోకప్రసిద్ధమైన విషయాలు పాఠకులకు ఉపయోగకరమనే నా అభిప్రాయం.

  11. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    October 5, 2008 2:29 pm

    హనుమంత రావు గారికి,

    మీకు నచ్చిన విషయాలు చెప్పినందుకు కృతజ్ఞుణ్ణి.

    ఈ వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చిందో ముందుమాట గా మొదట్లో రాసాను. ఈమాటకి పంపే ముందు ఒకరిద్దరి సంగీత విద్వాంసుల ( ఇండియాలో ) చేత సమీక్ష చేయించాను. ముందుమాట అవసరం లేదని కొందరంటే తీసేసాను. అందులో మీరడిగిన కొన్నింటింకి జవాబులున్నాయి. వీలయితే ఈ వ్యాసం చివర్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది వ్యాసంగా రాయాలని మొదలు పెట్టలేదు. సమగ్రంగా పుస్తకం తేవాలని నా ఆలోచన. నేనుదహరించిన పుస్తక సూచికే కాక, చాలా పుస్తకాలు సేకరించాను. నాకు భాష అంతగా తెలీకపోయినా తమిళ, కన్నడ పుస్తకాలూ తెప్పించుకొని, భాష తెలుసున్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాను. అన్ని వివరాలూ ఒకే పుస్తకంలో ఎక్కడా కనిపించలేదు.

    మీరు అడిగన వాటికి:

    1. ఆరుద్రగారన్నట్లు, మనకి రాజులు చరిత్రలు రాయడమే తెలుసు. కావ్యాలూ, పురాణాలూ తెలుసు. కవుల/రచయితల జీవిత చరిత్రలు రాసిన దాఖలాలు అతి తక్కువగా ఉన్నాయి. అందువల్ల వారి వారి రచనల బట్టీ, తోటికవుల ప్రస్తావనల బట్టీ కొన్ని జీవిత వివరాలు తెలిసాయి. రాజుల చరిత్రల్లో కవులకి సంబంధించిన విషయాలు ప్రస్తావన వచ్చినప్పుడే కవుల గురించీ తెలిసేది.

    ఏ ఏ సందర్భంలో, ఏఏ కాలాల్లో, ఏఏ స్ఫూర్తితో రాసారో తెలీదు. త్యాగరాజు విషయంలూనూ జరిగిందిదే. రాసిన కృతుల బట్టి, అందులో భావాన్ని బట్టే పలానా దాని గురించి రాసారన్న ఊహ మొదలయ్యింది. గిరిరాజ సుత తనయ కృతి సందర్భాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసారు. అధారాలు లేని ఆపాదన్లు చేసేసారు. అందులో కొంతమంది రాసింది సరికాదు అని చెప్పడానికి ఈ వంశ వృక్షం ఉపయోగించవచ్చని అనుకుంటున్నాను. అది తెలియడం వల్ల వచ్చిన లాభం లేకపోయినా నష్టమేమీ లేదని అనుకున్నాను. ఒకరకంగా ఇది చారిత్రిక ఆధారమే కదా అనిపించింది. ఇహ గోత్రాల విషయం. గోత్రాలు ఏ వ్యక్తి ఏ వంశం వాడని చెప్పడానికుపయోగపడతాయి కదా? వాటిపై నమ్మకాలూ, అపనమ్మకాలన్నవి వేరే విషయం. కేవలం త్యాగరాజు జీవితంలో అతి ముఖ్య వ్యక్తుల గురించి రాయడం అవసరం అనిపించింది. అందుకే వారి వారి రచనల్లో ఈ విషయాలని ఎలా రాసారో చెప్పాను.

    2. చరిత్రనిర్ధారించే ముందు కట్టుకధలూ తెలియాలి. ఒకే కట్టు కథ ఎలా రూపాంతరం చెందిందో చెప్పాలి. అందులోంచి ఏది చరిత్రకి దగ్గరగా ఉంటుందో తెలుసుకోవడం సులభం అవుతుందని నాకనిపించింది. చారిత్రక ఆధారాలు వెతికే చిన్న ప్రయత్నమే ఇది. అందులో కొన్నింటికి అధారాలుండచ్చు. మరికొన్ని ప్రతిపాదనలు కావచ్చు. ఇంకొన్ని అందరికీ తెలిసే ఉండచ్చు. అసలాధారాలే దొరక్కపోవచ్చు. అన్నీ ఒకో చోట కూర్చే అతి చిన్న ప్రయత్నం ఇది. అంతే!

    త్యాగరాజు కృతుల్లో ఛందస్సు, అలంకార ప్రయోగాల వివరాలు ముందుముందు వస్తాయి. కాస్త ( 4 నెలలు ) ఓపిక పట్టండి. కేవలం కళ్యాణి రాగాలాపన్ని అయిదునుంచి ఎనిమిది గంటలవరకూ పాడే వారని రాసారు. త్యాగరాజు ఇది పాటించకుండా రాగ విస్తారణని సంగతుల్లో ప్రవేశపెట్టి, సాహిత్యాన్ననుసరించి ఆశువుగా కల్పన చేసే విధానానికి జీవం పోసి, కృతులకి మరో కొత్త రూపం ఇచ్చాడు. కేవలం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండే సంగీతాన్ని సులభతరం చేసాడు. ఇవన్నీ ముందొస్తాయి.

    చివరగా, అభిమానంగా నా గురించి మీరునుకున్నదాంట్లో ఆసక్తన్నదోక్కటే నిజం. నా సంగీత జ్ఞానం మితం. అవగాహన మరీ పరిమితం.

    అద్దంలో రోజూ నన్ను నేను చూసుకుంటాను. :)-

    - సాయి బ్రహ్మానందం

  12. karvera babu అభిప్రాయం:

    October 7, 2008 12:04 am

    హనుమంత రావు వాడిన “గోత్రాల గొరీ” అన్న పదము, గోత్రాలు కల కులాలను తెగడినట్లనిపిస్తుంది

  13. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    October 7, 2008 10:04 pm

    karvera babu గారి వాదన ప్రకారం తాత ముత్తాతలు గల వాళ్ళని గూడ నేను తెగడినట్లే!

    జీవిత చరిత్రలో పూర్వీకుల గురించి ఉంటే నష్టమేమిటి? గిబ్బన్ అంతటి వాడే సమర్థించలేదా?

    “Nor does the man exist who would not peruse with warmer curiosity the life of a hero from whom his name and blood were lineally derived. The Satirist may laugh, the Philosopher may preach; but reason herself will respect the prejudices and habits which have been consecrated by the experience of mankind.”
    – From “Family History,” in “Memoirs of My Life,” by Edward Gibbon.

    ఎటొచ్చీ గిబ్బన్ ఏం రాసినా చదవడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఈ వ్యాసంలో నాకు నచ్చనవి, నేను gory details అని విమర్శించినవి చాలా dry గా ఉన్నాయి. సాయి గారు వంశవృక్ష పటాన్ని అనుబంధంలో ఉంచి, ఇతరులు చేసిన పొరబాట్లని footnotes లో ప్రస్తావించి, అసలు కథని బిగువుగా నడిపిస్తే ఇంకా రక్తి గడుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  14. rahamthulla అభిప్రాయం:

    October 28, 2008 3:53 am

    త్యాగరాజుకు తమిళం వచ్చా? త్యాగరాజ కృతులన్నీతెలుగులోనే ఉన్నాయి. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు తమిళరాజ్యంలో ఎన్నో తెలుగు కీర్తనలు పాడిన త్యాగరాజు అక్కడి ప్రజల భాష తమిళం లో కొన్ని కీర్తనలు కూడా పాడి ఉంటాడేమో అని నా అనుమానం.

  15. mOhana అభిప్రాయం:

    October 28, 2008 7:13 am

    త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు - మోహన

  16. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    October 28, 2008 11:07 am

    నాకు తెలుసున్నంత వరకూ త్యాగరాజు తమిళం లో ఒక్క కృతీ రాయలేదు. మొదట్లో కొన్ని సంస్కృత రచనలు చేసినా, సింహ భాగం తెలుగులోనే రాసారు. త్యాగరాజుకి తమిళం ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యులు చాలామంది తమిళులే ! వారందరికీ తెలుగు వచ్చిందన్న నమ్మకం కలిగిన తరువాతే ఆయన స్వీయ రచనలు నేర్పాడు.
    అప్పట్లో తెలుగు, తమిళం రెండూ రాజభాషలుగానే చెలామణీ అయ్యాయి. ముఖ్యంగా సాహిత్యభాషగా తెలుగుకి పెద్ద పీటే వేసారు తంజావూరు రాజులు.

    -సాయి బ్రహ్మానందం

  17. Tarakaram అభిప్రాయం:

    November 14, 2008 7:34 am

    బాబోయి ఎంత రీసెర్చ్ చేశారు. మీ కాళ్ళ కి మొక్కుతున్నా.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a