దేశమును ప్రేమించుమన్నా
ఫమీదా పరిచయంతో ఒక్క ఉదుటున బ్రహ్మానందం అదృష్టం మారిందనే చెప్పాలి. ఫమీదా పదిహేనేళ్ళక్రితం పాకిస్థాన్ లో హైదరాబాదు నుంచి అమెరికా వచ్చింది. బ్రహ్మానందం పాతికేళ్ళక్రితం మన హైదరాబాదునుంచి అమెరికా వచ్చాడుగదా! ఇది కేవలం కాకతాళీయమే! ఏదయితేనేం. ఇప్పుడు ఎ.బి.బ్రోకర్స్ ఫమీదా ధర్మవా అని, పాకిస్తాను నల్లరూపాయల మారకం గూడా మొదలు పెట్టారు. ఆ విషయాలు పూర్తిగా ఫమీదాయే చూసుకుంటుంది.
ఇప్పుడు, రెండు హైదరాబాదుల నల్ల రూపాయలనీ తెల్ల డాలర్లుగా మార్చడం సరి కొత్త పంథాలు తొక్కింది. దీనికి సూరత్‌లో దోషీగారి బ్రాంచ్ మంచి మద్దతే ఇచ్చింది. నల్ల రూపాయలతో ముందస్తుగా సూరత్‌లో వజ్రాలు, వజ్రాల హారాలూ కొనడం, అవి అమెరికా తెచ్చి అమ్మడం. నగదు బేరమైతే కాస్త తక్కువ ఖరీదుకి అమ్మి, ఆ డాలర్లు నగదుగా దాయడం! ఇది సరి కొత్త పంథా! ఇది చాలా సూటిగా ఇబ్బంది లేకండా జరిగే పని. పాకిస్తాను రూపాయలతో మేలిమి బంగారు నగలు కొని, అవి దుబాయ్ అమ్మాయిల ద్వారా అమెరికాకి ఇంగ్లాండుకీ రవాణా చెయ్యడం. ఇది కొంచెం అడ్డదారి. అయితేనేం, ఈ రోజుల్లో అమెరికాలో బంగారు నగలు కుడీ ఎడమా తేడా లేకండా కొనేసే భారతీయ జనాభా పదిరెట్లు పెరగడంతో, నగల వ్యాపారస్తుల సంఖ్య కూడా అల్లాగే పెరిగింది. ఈ నగల వ్యాపారం కూడా భారీ ఎత్తునే జరుగుతున్నది. వాళ్ళకి పాకిస్తానీ నగలు కాస్త చవగ్గా అమ్మి డాలర్లు, పౌండ్లూ, యూరోలు సంపాదించడం కొంచెం తిరకాసు వ్యవహారం అయినా కష్టమైన పని మాత్రం కాదు. ఈ వ్యాపారంలో కూడా ఫమీదా పాలే ఎక్కువ. ఒక్కొక్కసారి, బంగారు నగలు కరిగించి నవరసులుగా, నాణేలుగా మార్చి అమ్మడం! ఇది కాస్త కష్టమైన పనే! అందుకని, ఈ పని పూర్తిగా దోషీగారి అజమాయిషీలోనే జరగాలి. అసలు తమాషా ఏమిటంటే, ఈ నాణేలు, నవరసులూ మళ్ళీ హైదరాబాదులకే తిరిగి వెళ్ళి, నగలుగా మారి అమెరికా తిరిగి వచ్చేస్తాయి.
వచ్చిన మార్పల్లా ఎక్కడుందంటే, దోషీగారి కంపెనీ, బ్రహ్మానందం కంపెనీలలో పనిచేసే అందరూ, చప్రాసీలతో సహా కట్టల కట్టల డాలరు నోట్లు దాయాలి; జాగ్రత్తగాఎక్కౌంటులు రాసి ఉంచాలి. ఇప్పుడు బ్యాంకులతో పని తక్కువే, ఎప్పుడో నూటికీ కోటికీ తప్ప! అయితే సేఫ్ డిపాజిట్ బాక్సుల అవసరం బాగా పెరిగిపోయింది, అంతే. అక్కడి నల్లరూపాయల దాపకం లాగానే ఇక్కడ నల్లడాలర్లు దాయడం బాగా పెరిగింది.
ఈ మధ్య మధ్యనే ఈ వ్యాపారం కాస్త కష్టం అవడం మొదలయ్యింది. అమెరికాలో మనవాళ్ళ జనాభా బాగా పెరగడంతో, హైదరాబాదులో ఉన్న ప్రతినాయకుడికీ, ఆఫీసరుకీ చుట్టాలో పక్కాలో పెరగడంతో బ్రహ్మానందం, దోషీల వ్యాపారం కాస్త సన్నగిల్లింది. అంతే కాదు; ఈ మధ్యకాలంలో డాలర్ విలువ బాగా పడిపోవడంతో మస్తుగా నల్ల రూపాయలు సంపాదించి దాచుకున్న మొఖాసాదారులు వాళ్ళ నల్ల డబ్బు తెల్ల డాలర్లుగా మార్చడానికి కాస్త తటపటాయించడం మొదలెట్టారు. బ్రహ్మానందం కంపెనీకి కమీషనులు తగ్గాయి. పైగా ప్రతిసారీ దోషీగారితో కమీషను పంచుకోవడంతో తన పాలు లాభం అయిదు శాతానికి పడిపోయింది.
ఈ వారం రూపాయి పరంగా డాలరు విలువ కొంచెం వేగంగా ఎక్కువగా పడిపోవటం మొదలయ్యింది. శుక్రవారం మధ్యాన్నం వచ్చేసరికి డాలరుకి ముప్ఫై ఏడు రూపాయలే ఇస్తున్నారు! ఒకప్పుడు, డాలరుకి యాభై రూపాయలిచ్చేవాళ్ళు గదా! అప్పట్లో డాలర్లు కొనుక్కున్న వాళ్ళకి కొంచెం కంగారు పుట్టింది. రోజంతా బ్రహ్మానందం కంపెనీకి హైదరాబాదులనుంచి టెలిఫోను మీద టెలిఫోను పిలుపులే! ఎక్కడా ఊపిరి సలపనియ్యకండా పిలవడం మొదలెట్టారు జనం అంతా! వాళ్ళని సముదాయించలేక ఫమీదా, బ్రహ్మానందం, ఇద్దరూ నానా యాతనా పడ్డారు. అక్కడ దోషీగారి ఆఫీసులోనూ అంతే! మార్కెట్ ముగిసేటప్పటికీ డాలరు ముప్ఫై ఐదు రూపాయలకి పడింది. దగ్గిర దగ్గిర ముప్ఫై శాతం నష్టం వచ్చేసింది, ఒక్కవారంలో! “ఈ రకంగా డాలరు పడిపోతే మన కంపెనీలు పొలో మని దివాలా తీసేస్తాయి” అని అన్నది ఫమీదా సాయంత్రం ఆఫీసులో దీపాలార్పుతూ ! కాస్త భయం వేసినా, బ్రహ్మానందం పైకి ధీమాగా “ఎబ్బే! అల్లాంటిది ఏమీ జరగదు. ఇదంతా టెంపరరీ! ఏ గవర్నమెంటూ ఏ కరెన్సీ అలా పడనీయదు” అని ధైర్యం చెప్పాడు.
ఇద్దరూ, ఆనవాయితీగా బారులో చేరారు. బ్రహ్మానందం ప్రభుత్వాలు కరెన్సీలని ఎలా కాపాడతాయో చెప్పడం మొదలెట్టాడు, యధావిధిగా మూడు షాట్ల టకీలాలు పట్టించి. ఫమీదా ఊ కొడుతూన్నదే కాని, ఇవాళ తన ధ్యాస అంతా టెలిఫోను పిలుపుల కిచ్చిన సమాధానాల మీదే! రకరకాల వాళ్ళకి రకరకాల సమాధానాలు ఇచ్చింది. బ్రహ్మానందమూ ఏవేవో సమాధానాలు ఇచ్చాడు!
ఇవాళ పొద్దున్న మార్కెట్ ప్రారంభమయ్యేటప్పడికీ, నానా గందరగోళంగా ఉంది. డాలరు విలువ అమాంతం ఇరవై రెండు రూపాయలకి పడిపోయింది. నిన్న ఇండియాలోనూ పాకిస్తాన్ లోనూ మార్కెట్ బంద్, అని టెలివిజన్ లో బాకా ఊదినట్టు ఎనలిస్టులు ఒకటే వాగుతున్నారు. కరాచీలోలోనూ, ముంబయిలోనూ బ్రోకర్లు ఆత్మహత్యలు చేసుకున్నట్టు సి.యన్.బి. సీ లో క్రింద రన్నింగ్ బేనర్!
బ్రహ్మానందం, దోషీ గార్ల ఆఫీసు టెలిఫోన్లకి తెరపి లేదు. ఎవడూ టెలిఫోను ఎత్తడం లేదు. ఏమని చెప్పగలరు గనక? ట్రాన్స్ అమెరికా ఆఫీసు చుట్తూ కూడా మనవాళ్ళు తంబలు తంబలుగా పోగవడం మొదలయ్యింది. మఫ్తీ లో ఉన్న పోలీసులు గేటు దగ్గిర కాపలా కాస్తున్నట్టు కనిపించింది. కొంపదీసి, ఎఫ్. బి. ఐ. వాళ్ళూ కాదు కదా! ఈ నగదు వ్యాపారం, నగల వ్యాపారం ఎప్పుడో మన కొంప తీస్తుందేమో అని ఫమీదా ఎప్పుడూ భయం భయంగా అంటూ ఉండేది. ఐ. ఆర్. యస్. వాళ్ళు కాదు కదా!
“ఒరేయ్ బ్రహ్మానందం! ఏమిటిరా ఇదంతా! మన ఇంటి చుట్టూ నాన్న గారి పాత స్నేహితులంతా నిఘా వేయించారు. దున్నపోతుల్లా బలిసిన వాళ్ళు లాఠీలు పట్టుకొని అటు ఇటూ తిరుగుతున్నారు. మావయ్య ఇల్లు కిక్కిరిసి పోయింది. ఎడ తెరపి లేకండా వచ్చీ పోయే జనం. వెంటనే ఇంటికి పిలువు నాయనా! మీ ఇంటికి పిలిస్తే ఎవ్వరూ టెలిఫోను ఎత్తటం లేదు. నాకు ఏదో భయంగా ఉంది,” అని అమ్మ కంగారు పడిపోయి గగ్గోలు పెట్టేస్తోంది, ఐదేసి నిమిషాలకోసారి, ఆఫీసుకి ఫోన్ చేస్తూ. ఒకట్రెండు సార్లు ధైర్యం చెప్పి తర్వాత ఫోనెత్తటం మానేశాడు. ఫమీదా కిటికీలోంచి బయటికి చూసి, “క్యా కరూఁ” అన్న ట్టు మొహంపెట్టి చూరు కేసి చూడటం మొదలెట్టింది, గోళ్ళుగిల్లుకుంటూ! బ్రహ్మానందం కొంచెం నలతగా అనిపిస్తుంటే టై ఊడదీసి కళ్ళు మూసుకొని కుర్చీలోనే జారగిలబడ్డాడు.
“…ఫమీదా! ఫమీదా! నీ దగ్గిరున్న వజ్రాలు గొలుసులూ పట్టుకోరా. మనిద్దరం ఏదో ఓ దారి చూసుకొని దుబాయ్ వెళ్ళిపోదాం. అక్కడ మా నాన్ననీ మావయ్యనీ, గూండాలు గుటుక్కుమంటారు! పాపం అనసూయ గతేం అవుతుందో… అమ్మా, అత్తయ్యలు అడుక్కు తినాల్సి వస్తూందేమో. ఎలా దేవుడా…”
“….అనసూయా, అమ్మా, అత్తయ్యా, ఫమీదా, ఫమీదా…” అంటూ గట్టిగా అరుపులు వినిపిస్తే ఫమీదా పరిగెత్తుకొచ్చింది, “బ్రమ్మీ, బ్రమ్మీ” అంటూ.
ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి, గజగజ వణికిపోతూ కుర్చీలో నిటారుగా కూర్చొని ఉన్నాడు, బ్రహ్మానందం, కళ్ళు నులుముకుంటూ. మంగళవారం మిట్టమధ్యాన్నం!
నోట్ : నిరుడు అక్టోబర్‌లో, రూపాయి విలువ పన్నెండు శాతం పెరగంగానే “అక్కడ ఇండియాలో మా నాన్న అమ్మా అడుక్కొతినే స్థితి వస్తుంది, ఇలా రూపాయ విలువ పెరగడం మొదలెడితే! డాలర్ కి యాభై రూపాయలు పైచిలుకు దొరకడం న్యాయం, ధర్మం” అనే అర్థం వచ్చేట్టు రాసిన ఒక భారతీయ బ్లాగరు బ్లాగు చదివింతరువాత!
kalyani అభిప్రాయం:
September 2, 2008 5:36 am
మీ సొంత అనుభవాన్ని జోడించి మరీ రాసి నట్టు ఉన్నారే. కాని కథలో ఆ captivation లేదు. ఎదో ఒక discussion లా, అలా చప్పగా నడిచింది
srinivas అభిప్రాయం:
September 4, 2008 3:34 am
దీన్ని కథ అంటారా? వ్యాసం లాగ ఉంది. వ్యాసం లో పెట్టాల్సిన దాన్ని కథ ల లో పెట్టారా? రచయిత నాలెడ్జ్ చూపెట్ట డానికి రాసిన వ్యాసం ఇది.
baabjeelu అభిప్రాయం:
September 6, 2008 11:19 am
సంగీత దర్శకులు పాడిన పాటలా వుంది.
ఉదాహరణలు: సి.రామచంద్ర, ఎస్.డి.బర్మన్, సి.ఆర్.సుబ్బురామన్, రమేష్ నాయుడు, ఎస్పీ కోదండపాణి ఇత్యాదులు. ఆ మాటకొస్తే అ.ఆర్. రెహ్మాన్ కూడా.
రసాలూరు వారు వేరు.
ఘంటసాల, శంకర్ మహదేవన్ లు కారు.