ఈమాట » బాలమురళీకృష్ణ

Expand to right
Expand to left

బాలమురళీకృష్ణ

మంగళంపల్లి బాలమురళీకృష్ణ (వికీపీడియా సౌజన్యంతో)
మంగళంపల్లి బాలమురళీకృష్ణ

1930లో జన్మించిన బాలమురళీకృష్ణ ఇతర సంగీతకారుల కన్నా ఎంతో సీనియర్. ఎందుకంటే 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ఉన్నాడు. మా నాన్న కుటుంబరావుగారు 1944లోనే బొంబాయిలో ఆయన కచేరీ విన్నారట. అయితే నాకు తెలిసి మా కుటుంబంలో మొదటగా బాలమురళీకృష్ణ పేరును ప్రస్తావించినది మా అమ్మమ్మ పద్మావతిగారు. ఆవిడ తరుచుగా మద్రాసు రేడియోస్టేషనుకు వెళ్ళేది. ‘ఆ కుర్రాడెవరో “నగుమోము గనలేని” కీర్తన చాలా బాగా పాడుతున్నాడ్రా’ అని ఆవిడ 1958-59 ప్రాంతాల్లో అన్నట్టు గుర్తు. రేడియో, పాత గ్రామఫోనూ తప్ప తక్కిన సంగీతసాధనాలేవీ అప్పట్లో ఉండేవి కావు కనక రేడియోలో ఆయన పాడిన ‘నగుమోము గనలేని’ (అభేరి రాగం) ని అప్పుడప్పుడూ వినేవాళ్ళం. ఆభేరిని ‘జిడ్డు’ పద్ధతిలో రుబ్బకుండా ‘జగమేలే పరమాత్మ’ చరణాన్ని రకరకాలుగా ఆయన పాడడం అప్పట్లో అందరికీ చాలా నచ్చేది. అయితే ఆ (పదేళ్ళ) వయసులోనే నాకు కాస్త హిందూస్తానీ అభిమానం, ‘పోజు’ ఉండడంతో నేనంతగా పట్టించుకోలేదు. 1963లో మద్రాసు చిల్డ్రన్స్ థియేటర్లో మేము మొదటగా బాలమురళీకృష్ణ కచేరీ విన్నాం. స్టేషన్ డైరెక్టర్ ఎస్.ఎన్. మూర్తిగారు కచేరీ తరవాత బాలమురళీకృష్ణను మా నాన్నకు పరిచయం చేశారుకూడా. మరో రెండేళ్ళు గడిచేదాకా కాని నేను కర్ణాటక సంగీతానికి ‘చలించడం’ మొదలుపెట్టలేదు.

1960లలో బాలమురళీ స్టేజిమీది ప్రవర్తన వేరుగా ఉండేది. కూర్చున్నచోటనే ఆయన నడుము పైభాగాన్ని కదిలిస్తూ, పక్క వాయిద్యాలు వాయించేవాళ్ళ వేపుకు పలకరింపుగా వంగుతూ, ఆగకుండా రుబ్బుడుపొత్రంలాగా తిరుగుతూనే ఉండేవాడు. ఆ అలవాటు క్రమంగా తగ్గడం చూశాం. అలాగే గమకాలూ, బిరకాలూ ప్రదర్శించే ఆరాటం కూడా తగ్గింది. అయితే రాగం, స్వరం, తాళం, లయ అన్నిటిమీదా ఆయనకు ఎంతో అధికారమూ, నియంత్రణా మొదటినుంచీ ఉండేవి. ఆయనను మైలు దూరానికి కూడా సమీపించగల కర్నాటక గాయకులు లేరని ఏనాడో ఋజువైపోయింది. ఆయనకు సమకాలికులం అయినందుకు మనమంతా గర్వపడవచ్చు.

1960లలో ఆయనకు వయొలిన్ వాయించిన లాల్గుడి, ఎం.ఎస్.గోపాలకృష్ణన్ ఆయనకు సహకరించిన అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులని నా అభిప్రాయం. ఒక సందర్భంలో లాల్గుడి తనను ఎలా చిరాకు పెట్టినదీ బాలమురళిగారే మాతో చెప్పారు. మామూలు కీర్తన ఒకటి పాడి బాలమురళి స్వరకల్పన చేస్తున్నప్పుడు జవాబుగా ప్రతిసారీ లాల్గుడి ఒక ముక్తాయింపు వాయించసాగాడట. అతని పని పట్టాలని ఆ వెంటనే బాలమురళి కేదారంలో ‘రామా నీపై’ కీర్తనను మామూలు పద్ధతిలో కాకుండా సమంమీదనే మొదలుపెట్టారట. చివరకు స్వరకల్పనలోకూడా అదేరకంగా పాడుతున్నప్పుడు లాల్గుడి మాత్రం అలవాటు చొప్పున సమం వదిలి పల్లవి అందుకున్నాడట. దాన్ని సరిదిద్దుకోమని బాలమురళి మైకులోనే చెప్పారట. ఎం.ఎస్.గోపాలకృష్ణన్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదుగాని పరోక్షంగా బాలమురళి గురించి ఆయన చేసిన వ్యక్తిగతమైన కామెంట్లు బాలమురళిగారికి కోపం తెప్పించినట్టుగా తెలిసింది. క్రమంగా లాల్గుడి సోలోయిస్టుగానే రాణించసాగాడు. మొత్తంమీద వీరిద్దరూ బాలమురళి గారికి దూరమైపోయారు.

మా కుటుంబం 1960లలో మద్రాసులో బాలమురళి, ఈమని, చిట్టిబాబుగార్ల కచేరీలు ఎక్కడ జరిగినా తప్పక వేళ్ళేవాళ్ళం. ఆ విధంగా కొన్ని డజన్ల కచేరీలు వినడంతో బాలమురళి పద్ధతులన్నీ మాకు బాగా తెలుస్తూ ఉండేవి. మా అక్క ఢిల్లీ వెళ్ళినా, నేను విశాఖ, బొంబాయి ఎక్కడికి వెళ్ళినా తన కచేరీల వివరాలన్నీ ఉత్తరాల్లో కుటుంబంలో అందరికీ రాసి పంపుతామని బాలమురళిగారికి కూడా తెలిసింది. 1968 తరవాత మద్రాసులో అప్పుడప్పుడూ వారింటికి వెళుతూ ఉండేవాళ్ళం.

బాలమురళి ఛలోక్తులు కూడా బావుండేవి. ప్రముఖ మృదంగ విద్వాంసుడు టి.వి.గోపాలకృష్ణన్ కొన్నాళ్ళు గాత్రకచేరీలు కూడా చేసాడు. బాలమురళిగారి వ్యాఖ్య - ‘అతను మృదంగం వాయిస్తున్నప్పుడు మెయిన్ గాయకుడిలాగానూ, గాత్రం పాడుతున్నప్పుడు పక్కవాయిద్యగాడిలాగానూ ప్రవర్తిస్తాడు’. అలాగే ‘శంకరాభరణం సినిమా చూశారా?’ అని అడిగితే ‘చూశాను. అయితే అందులో శంకరాభరణం ఏదీ?’ అని ఎదురుప్రశ్న వేశారు. బాలమురళిని దశాబ్దాల క్రితమే గుర్తించి, గౌరవించినది లతా మంగేశ్కర్. ‘ఆవిడతో మీరెలా మాట్లాడారు?’ అని అడిగితే ఆయన ‘నేనేమో ఇంగ్లీషులో మాట్లాడతాను, అది ఆవిడ కర్థం అవుతుంది. ఆవిడ హిందీలో జవాబు చెపుతుంది, అది నా కర్థం అవుతుంది’ అన్నారు. ‘ఆవిడ తన మనసులోని భావాన్ని చెప్పదు; మన భావాల్ని మాత్రం ఇట్టే తెలుసుకుంటుంది’ అన్నారు.

పారుపల్లి రామకృష్ణయ్యగారి గురించి ‘ఆయనొక ఆదర్శగురువు, ఏదీ దాచుకోకుండా శిష్యులకు అన్నీ నేర్పబూనే గొప్ప వ్యక్తి’ అని బాలమురళి చెప్పారు. తన గురువులందర్నీ కీర్తిస్తూ కాఫీ రాగంలో ‘భావమే మహాభాగ్యముగా’ అనే మంచి పాట రాశారు. తన చిన్నప్పుడు గురువుగారి వెంట తమిళనాడు అంతా తిరిగానని అన్నారు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడట. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేదట. చిన్నవయసులో గురువుగారి వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవట. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది. ఏడు దశాబ్దాల సంగీతయాత్రలో బాలమురళి ఎందరో పెద్దవారిని కలుసుకో గలిగారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, మైసూర్ వాసుదేవాచార్య మొదలైనవారు ఆయనను మెచ్చుకున్నారు. మద్రాసులోని ఒక బాలమురళి సన్మానసభకు 90 ఏళ్ళ వయసున్న పాపనాశం శివన్, బులుసు సాంబమూర్తి రావడం నేను చూశాను. మా నాన్న తన చిన్నతనంలో తెనాలిలో విన్న ఎందరో సంగీతవిద్వాంసుల పేర్లను ప్రస్తావించినప్పుడు వారందరితోనూ తాను పాడి, వాయించానని బాలమురళి అన్నారు. ఆయన సీనియారిటీ అటువంటిది.

బాలమురళిగారికి మొదట్లో కొంత సినిమా గ్లామర్ ఉండేదని మాకనిపించేది. అది క్రమంగా తగ్గిపోయింది. తాను పాడిన సినిమాపాటలను గురించి ప్రస్తావిస్తూ ఆయన ‘మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో చెపుతారు. నాకు తోచినది నేను పాడతాను. అది వాళ్ళకు నచ్చుతుంది’ అన్నారు. అదంత తేలిక విషయం కాకపోయినా సమర్థుడైన సినిమా సంగీతదర్శకుడు ప్రతిభావంతుడైన గాయకుణ్ణి బాగా ఉపయోగించుకోగలడనేది తెలిసినదే. ‘భక్త ప్రహ్లాద’లో ఆయనను పాడమని మెయ్యప్పన్ చెట్టియార్ కోరగా, నారద పాత్ర కూడా తానే వేస్తానని బాలమురళి స్వయంగా అడిగాడని అంటారు. అందులో ఆయన పాడిన మొదటి రాగమాలిక అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు; ఎస్.వి.రంగారావు (ఎస్.వి.ఆర్.) తో అన్ని సీన్లలో ధైర్యంగా పాల్గొని నటించగలగడం గొప్ప విశేషం. అప్పట్లో ఎస్.వి.ఆర్. తమని మింగేస్తాడని శివాజీ గణేశన్ అంతటి నటులు కూడా జాగ్రత్తపడేవారు. ఆ రోజుల్లో బాలమురళి ‘త్యాగయ్య’ అనే తమిళ స్టేజి నాటకంలోకూడా నటించి, పాడారు. అందులో ఆయన పాత్రోచితంగా ‘తక్కువ’ పాడడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సంగీతంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా ఆయనకున్న సంయమనం, ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం, తొణకకుండా ఉండడం వగైరాలన్నీ చాలా మెచ్చుకోదగ్గ విషయాలు. బాపు తీసిన ‘త్యాగయ్య’ కోసమని ముందు అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారట. బాలమురళిగారు తాను పాడడమే కాక త్యాగయ్యగా నటిస్తానన్నారని వినికిడి. చివరికి జే.వీ.సోమయాజులు (’శంకరాభరణం’) నటించి, బాలసుబ్రహ్మణ్యం పాడడం, సినిమా ఫెయిలవడం జరిగాయి. నటన మాట ఎలా ఉన్నా బాలమురళి పాడి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది.

బాలమురళిని వీణ విద్వాంసుడు చిట్టిబాబు ఎంతో అభిమానించేవారు. తన పెద్దకుమారుడి ఉపనయనానికి బాలమురళి కచేరీ ఏర్పాటు చేసి, డబ్బివ్వబోతే ఆయన తీసుకోలేదట. అప్పుడు చిట్టిబాబు బలవంతాన ఒక టీవీ సెట్ కొని బహూకరించాడట. తన వీణ కచేరీ ఒకదానికి బాలమురళి హాజరైనప్పుడు చిట్టిబాబు వీణమీద బాలమురళి రాసిన బృందావని రాగంలో తిల్లానా వాయించారు. ఆ తిల్లానా చిట్టిబాబుకు చాలా ఇష్టం. ఒకసారి మ్యూజిక్ అకాడమీ కచేరీ చెయ్యబోతూ బాలమురళి తన పక్కనే కూర్చుని కాయితంమీద ఏదో రాస్తున్నారట. ఏమిటని అడిగితే ‘ఏం లేదు, ఇవాళ్టి కచేరీకని ఒక తిల్లానా రాస్తున్నాను’ అన్నారట. చిట్టిబాబు నిర్ఘాంతపోయి ‘ఇంకొన్ని నిమిషాల్లో మొదలవబోతున్న మీ కచేరీ కోసం ఇప్పుడు తిల్లానా రాస్తున్నారా?’ అని అడిగాడట. ఈ విషయం మాతో చెపుతూ చిట్టిబాబు ‘ఆయనెక్కడండీ బాబూ, మేమెవ్వరం అలాంటి సాహసం చెయ్యం’ అన్నారు. అలాగే బాలమురళి నఠభైరవి రాగంలో పాడిన ‘యామిహే’ అన్న అష్టపది చిట్టిబాబుకు చాలా ఇష్టం. అది తెలుసుకుని మేమా రికార్డు కొన్నాం. ఒక కన్నడ సినిమాలో బాలమురళి పురందరదాసు కీర్తన ‘జగదోద్ధారన’ పాడారు. అదే సినిమాలోనే కాబోలు చిట్టిబాబు విష్ణువు వీణ వాయించే వేషం వేశారట.

1973లో బాలమురళి పుట్టినరోజు సందర్భంగా మద్రాసులో నాలుగు రోజుల కచేరీ జరిగింది. అందులో ఆయన పక్కవాయిద్యాలు లేకుండా పాడారు. హిందూ దినపత్రికలో సంగీతసమీక్షలు రాసే ‘ఎన్.ఎం.ఎన్.’ ఆయనకు పెద్ద అభిమాని. శ్రుతిశుద్ధంగా, అపస్వరాలు లేకుండా, అలిసిపోకుండా ఇలా ఒంటరిగా పాడగలగడం ఆయనకే సాధ్యం అని అతను సమీక్ష రాశాడు. నాలుగో రోజు బాలమురళి కృతులను ఆయన శిష్యులంతా పాడారు. ఎన్నడూ నేర్చుకోకపోయినా, వారితో ప్రముఖ సినీగాయని పి.లీలకూడా వచ్చి కొన్ని కీర్తనలు పాడడం విశేషం. ఈ కచేరీలన్నిటినీ బాపుగారు ఆడియో స్పూల్‌ మీద రికార్డు చేశారు.

మద్రాసులో జరిగిన మరొక కచేరీలో త్యాగరాజు దుర్లభమైన రచనలు కొన్ని దొరికాయనీ, వాటిని ప్రసిద్ధ విద్వాంసులు పాడతారనీ ప్రకటిస్తే బాలమురళి పేరు చూసి మేము వెళ్ళాం. ఎం.ఎల్. వసంతకుమారి, తదితర గాయనీగాయకులు పాల్గొన్న ఆ కచేరీలో బాలమురళి చేత ఆఖరుకు పాడించారు. లిస్టు ప్రకారం ఆయనవంతు ముందే రావాలికదా అని నేను విసుగ్గా ఆర్గనైజర్లని అడిగాను. ‘ఇంకా నయం; ఆయన పాడేసి వెళితే చివరికి వినేవాళ్ళెవరూ మిగలరు ‘ అని వాళ్ళన్నారు. మద్రాసులో ఇదొక ఓపెన్ సీక్రెట్. ఒక దశలో సభల నిర్వాహకులందరూ బాలమురళిని బాయ్‌కాట్ చేసి బ్లాకవుట్ చేసేందుకు ప్రయత్నించారు. అరుదుగా జరిగే ఆయన కచేరీలకు జనం విరగబడి రావడం, టికెట్లు బాగా అమ్ముడుపోవడం చూశాక ఒక్కొక్కరే ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఆయన కచేరీల ద్వారా సొమ్ముచేసుకోవడం మొదలెట్టారు. త్వరలోనే ఆయనకు తిరుగులేకుండాపోయింది.

బాలమురళి వయోలా, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరనేది తెలిసినదే. ఆయన గాత్రం, వయోలా, మృదంగం మూడు ట్రాక్స్‌లో వినిపించి రిలీజ్ చేసిన ఒక ఇ.పి. రికార్డుంది. మద్రాసులో జరిగిన ఒక కచేరీలో మొదటి సగం ఆయన వయోలా, రెండో సగంలో గాత్రం వినిపించారు. రెండూ ఒకేసారి చెయ్యవచ్చుకదా అని నేనడిగితే, ‘అబ్బే కుదరదు’ అన్నారు. ఎందుకంటే, కొన్ని గమకాలు వాయించేటప్పుడు నోరు బిగించాలట; కొన్ని గమకాలు పాడేటప్పుడు చెయ్యి బిగించాలట! ఆయన వయోలా వాయిస్తున్నప్పుడు తరుచుగా కమాను కింద పెట్టేసి కుడిచేతిని తుడుచుకోవడం చూస్తే ఆయన ప్రధానంగా గాయకుడేనని తెలిసిపోతుంది. ‘మీరు వయోలా వాయించడం మొదలుపెట్ట బోతున్నప్పుడల్లా గొంతు సవరించుకుంటారు తెలుసా?’ అని మానాన్న ఒకసారి ఆయనతో అన్నారు. ‘నిజంగానా?’ అని బాలమురళి ఆశ్చర్యపోయాడు.

చిన్నతనం నుంచీ గురువుగారికీ, ఇతర పెద్ద గాయకులకూ వయొలిన్, వయోలా సహకారం అందించడంతో ఆయనకు అందరి సంగతులూ తెలిసిపోయాయి. గాయకుడుగా ప్రసిద్ధుడైన తరవాత కూడా ఆయన చెంబై, సెమ్మంగుడి తదితరులకు పక్కవాద్యం వాయించారు. చెంబై తన కచేరీలో వాయిస్తున్న బాలమురళిని పొగుడుతూనే ఉన్నాడట. ఈ సందర్భంలో చిట్టిబాబు ఒక విషయం చెప్పారు. ఆయన బాలమురళిని ‘జి.ఎన్.బి. ప్లస్ మెలొడీ ఈజీక్వల్ టు బాలమురళి అంటారు; మీరేమంటారు?’ అని అడిగారట. దానికి బాలమురళి ‘అతనే నావల్ల ప్రభావితుడయాడు’ అన్నారట. ఇదెలా జరిగిందంటే, కొన్ని రోజులపాటు జరిగే సంగీత ఉత్సవాల్లో తన గాత్రకచేరీకి జి.ఎన్.బి. చాటుగా వచ్చి, నెత్తిన గుడ్డ కప్పుకుని, వెనకాల నిలబడి శ్రద్ధగా వినడం బాలమురళి చాలాసార్లు చూశారట. ఆ మర్నాడు జి.ఎన్.బి. గాత్రం, బాలమురళి వయోలా పక్కవాద్యం కచేరీలో జి.ఎన్.బి. తన శైలిని అనుకరించడం ఆయన గమనించేవారట. వయసులోనూ, ఖ్యాతిలోనూ సీనియర్ అవడంతో జీ.ఎన్.బీయే బాలమురళిని అనుకరిస్తున్నారని ఎవరూ ఊహించలేదట. సాటి విద్వాంసుల ఆయువుపట్లన్నీ బాలమురళికి తెలిసిపోయేవి కనక ఇది నిజమే అయిఉండవచ్చు అని చిట్టిబాబు మాతో అన్నారు.

బాలమురళికి నాలుగు షడ్జమాలు సులువుగా పలుకుతాయి. గాయనుల్లో ఒక్క పర్వీన్ సుల్తానాకు మాత్రమే ఇది సాధ్యం. గాయకుల్లో బడేగులాం, అమీర్‌ఖాన్, జస్‌రాజ్ తదితరులు కూడా ఇలా పాడగలరు. బాలమురళి కచేరీల్లో మైక్ వాడుకునే పద్ధతిని చూసి ప్రస్తుతం జస్‌రాజ్ కూడా అలాగే చేస్తున్నారు. కర్నాటక విద్వాంసుల్లో ఒక్క బాలమురళినే హిందూస్తానీ గాయకులు చాలా సీరియస్‌గా పరిగణిస్తారు. ఇది తక్కిన గాయకులు ఆలోచించాల్సిన విషయం. అజయ్ చక్రవర్తి తన సంగీత పాఠశాల సిలబస్‌లో బాలమురళి రచనలను కూడా నేర్పుతారు. ముంబయిలో సురేశ్ వాడ్కర్ బాలమురళిని ఉత్తమ వాగ్గేయకారుడుగా సన్మానించాడు. ముంబయి హిందూస్తానీ సంగీత ఉత్సవాల్లో కర్నాటక విద్వాంసులు పాల్గొనడం అరుదు. కొన్ని సందర్భాల్లో బాలమురళి పాడడం, స్థానికులు విని మెచ్చుకోవడం చూశాను. ఒక కచేరీకి ప్రసిద్ధ విద్వాంసులు గంగూబాయి హానగల్, ఫిరోజ్ దస్తూర్ కూడా వచ్చారు. శివాజీ గణేశన్ తరవాత బాలమురళికి ఫ్రెంచివారు ‘షెవాలియేర్’ పురస్కారం ఇచ్చారనేది తెలిసినదే. స్విట్జర్లండ్‌లో బాలమురళి ఒక ప్రేక్షకుడు కోరినప్పుడు అప్పటికప్పుడే ఒక ఫ్రెంచి పాటకు వరస కట్టి పాడారని ఇండియా టుడేలో రాశారు. ఆయన విశేష సమయస్ఫూర్తిని అనేక సందర్భాల్లో గమనించినవారికి ఇది ఆశ్చర్యం కలిగించదు.

బాలమురళికి 1960లలో మేమిచ్చిన ఫీడ్‌బాక్ కొంత పనిచేసిందని నా ఉద్దేశం. ‘మీరు “వాతాపి గణపతిం భజే” పాడరేం?’ అని మేమడిగాక తన మూడో ఎల్.పి.లో ఆయన దాన్ని పాడారు. మా నాన్న ఒకసారి ‘లాంగ్‌ప్లే రికార్డుల్లో కూడా మీ కర్నాటకంవాళ్ళు మూడేసి నిమిషాల పాటలు పాడతారేం?’ అని అడిగాక బాలమురళి ఒక ఎల్.పి.లో నఠభైరవి రాగం, తానం, పల్లవి పాడారు. 1976లో జరిగిన నా వివాహానికి ఆయన సాక్షి సంతకం చెయ్యడం, రిసెప్షన్‌లో గానకచేరీ చెయ్యడం నాకు చాలా సంతోషం కలిగించాయి. నేను కోరగా ఆయన తన పాత ఖమాస్ వర్ణం (”వేసారితినే”) పాడారు. ‘అసలు అది నువ్వెప్పుడు విన్నావూ?’ అని ఆశ్చర్యపోయారు కూడా. ఆయన చాలా ఏళ్ళకిందట పాడిన 78 ఆర్.పి.ఎం. రికార్డుల్లో ‘నీదు చరణములే’ (సింహేంద్రమధ్యమ), ‘తత్వమెరుగ’ (గరుడధ్వని) చాలా బావుంటాయి. మద్రాసు కళాక్షేత్రలో జరిగిన ఒక కచేరీలో ఆయన కాంభోజిలో తన స్వంత రచన (’తెలుగువెలుగు కిరణాలు’) పాడుతూ, ఘనరాగాలు అనే కాన్సెప్ట్ తనకు నచ్చదని అన్నారు. ఏ రాగాన్నైనా సరే ‘ఘనంగానో’, ‘తేలికగానో’ పాడవచ్చని ఆయన ఉద్దేశం.

ఒక రోజు మేము వారింటికి వెళ్ళినప్పుడు బాలమురళి తాను వయోలా మీద హిందుస్తానీ పద్ధతిలో వాయించిన హిందుస్తానీ రాగాల ఆలాపనను (రికార్డు చేసిన టేప్ మోగించి) మాకు వినిపించారు. అదెంతో అద్భుతంగా అనిపించింది. కచేరీల్లో అటువంటిది నలుగురూ వినే అవకాశం లేనందుకు నాకిప్పటికీ బాధగా ఉంటుంది. ఎం.ఎస్.గోపాలకృష్ణన్‌లాగా పూర్తి హిందుస్తానీ కచేరీ చెయ్యగల సామర్థ్యం బాలమురళి గారికి లేదని నేననుకోను. భారతీయ శాస్త్రీయ సంగీతంలో అతిముఖ్యమైన హిందుస్తానీ పద్ధతికి అంత పెద్ద విద్వాంసుడు స్పందించి, అందులో చెయ్యిపెట్టడానికి ప్రయత్నించడంలో ఏమీ ఆశ్చర్యం లేదని నాకనిపిస్తుంది.

తనకు సంగీతాన్ని ‘అమ్మడం’ నచ్చటంలేదని బాలమురళి మానాన్నతో అంటూ ఉండేవారు. మానాన్న తన ధోరణిలో వర్గసమాజంలో కళల పాత్ర గురించి ఆయనకు చెప్పేవారు. చివరికి బాలమురళి కమర్షియల్ కచేరీలు మానుకున్నారు. అయితే ఇది మహాత్మా గాంధీ మూడోక్లాసు రైలు ప్రయాణంలాగా మరింత ఖరీదైనదిగా తయారైంది. కచేరీలు పెద్దఎత్తున ఏర్పాటు చేస్తే తప్ప లాభం లేదు. బాలమురళి భీంసేన్ జోషీతో జుగల్‌బందీ పాడితే బావుంటుందని బొంబాయిలో తెలుగు సాహిత్య సమితి తరఫున మొదటగా ప్రపోజ్ చేసినది మేమే. మా కార్యకర్తలు పూనా వెళ్ళీ జోషీగారిని కలుసుకుని, ఆయన ఆమోదం తీసుకుని మరీ వచ్చారు. అయితే ఇందుకు బాలమురళిగారే అభ్యంతరాలు లేవనెత్తడం మాకు నిరాశ కలిగించింది. చివరికి ఇది కోన ప్రభాకరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా జోక్యం కలిగించుకున్నాకనే సాధ్యపడింది. అందులో మా సమితికి స్థానమే లేదు. ఇలాంటి విషయాలకు తగని మేము ‘చాలా చిన్నవాళ్ళం’ అని రుజువయింది!

బాలమురళిగారిది సంగీతంలో చాలా విశాలదృక్పథం. చిట్టిబాబునూ, ఆ తరవాత యు.శ్రీనివాస్‌నూ ఆయన మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు. రేడియోలో రకరకాల కార్యక్రమాలే కాక, టీవీలో ‘స్వరరాగసుధ’ మొదలైనవాటిలో ఆయన సినిమా పాటల ద్వారా రాగాల పరిచయానికి కూడా తోడ్పడ్డారు. ఫ్యూజన్ బృందాల్లో పాడడానికి కూడా ఆయన వెనకాడలేదు. అయితే ఆయన ఎన్ని దేశాలు తిరిగినా, రవిశంకర్ తదితరుల్లాగా ప్రేక్షకుల పరిధిని పెంచుకునే ప్రయత్నాలు చెయ్యలేదు. ప్రపంచస్థాయిలో అగ్రగాయకుడుగా ఆయనను పరిచయం చెయ్యవలసినది ఆయన అభిమానులే. ఆ పని ఎవరూ చెయ్యకపోవడం శోచనీయం. ఆయన ఇన్నిసార్లు అమెరికా తదితర దేశాలకు కచేరీలకని వస్తూ ఉంటారు. యూనివర్సిటీల సంగీతవిభాగాలతోనూ, పాశ్చాత్య శాస్త్రీయసంగీత బృందాలతోనూ ముందుగా సంప్రదించి, ఆయన గురించి వాళ్ళకు పూర్తిగా తెలియజేస్తే ఆయన వచ్చినప్పుడు వారి దగ్గరకు తీసుకెళ్ళడం, ఆయన సంగీతం గురించి తెలుసుకోవడానికి వారికి అవకాశాలివ్వడం మొదలైన పనులన్నీ విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు సంగీతాభిమానులు చెయ్యగలిగినవి. ఆయన ఒక లివింగ్ లెజెండ్‌గా ఉన్నప్పుడే ఇదంతా జరగాలి. మన సంగీతం గురించి తెలియని విదేశీయులకు కూడా ఆయన గాత్రం రేంజ్, శైలి, శక్తుల గురించి అర్థమవుతుంది. మనోధర్మ పద్ధతిలో ఆయన చేసే అపూర్వమైన స్వర, గమక కల్పన గురించి తెలుస్తుంది. ఆయనమీద అత్యాధునిక పద్ధతుల్లో డాక్యుమెంటరీలు తయారుచెయ్యడం, డాక్యుమెంటేషన్ జరగడం అత్యవసరం అని నా ఉద్దేశం. అనేక కారణాలవల్ల తనను తాను మార్కెట్ చేసుకునే వీలు బాలమురళిగారికి లేకపోవచ్చు. ఇది ఇతరుల ద్వారానే జరగాలి. పెద్దపెద్ద తెలుగు సంఘాలు సినీగ్లామర్‌తో అతి చెత్త సంస్కారాన్ని ప్రమోట్ చేసే బదులు ఇటువంటివి చేపడితే ఎంతో బావుంటుంది. లేకపోతే తమిళులెవరో చెయ్యవలసివస్తుంది.

ఇన్ని శక్తులున్న బాలమురళిగారిలో ఇంకొన్ని సుగుణాలుంటే బావుంటుందనిపిస్తుంది. ఆయన శైలి ఇంప్రెసివ్‌గా కాకుండా ఇంకా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండవచ్చు. సంగీతంలో అత్యున్నత శిఖరాలని అందుకున్న ఈ మహాగాయకుడికి తన శక్తులను ప్రతిసారీ ‘రుజువు’ చేసుకోవలసిన అవసరం ఉండదు. ఆయన స్వరాలతో ‘ఆడుకోవడం’, గారడీలు చెయ్యడం భాష విషయంలో శ్రీశ్రీని పోలినట్టుగా ఉంటాయి. శ్రీశ్రీ గొప్పదనం వీటిని మించిన విషయాల్లో రుజువైనట్టే బాలమురళి సంగీతంలో కూడా మరింతగా జరగాలి. ఏ బడేగులామలీయో, అమీర్‌ఖానో పాడుతునప్పుడు వారు శ్రోతలను లక్ష్యపెడుతున్నట్టుగా ఉండదు. బాలమురళిగారు వారికే మాత్రం తీసిపోడు గనక ఆయన కచేరీలు ప్రేక్షకుల స్పందనకు అతీతంగా ఉండాలనిపిస్తుంది. అలాగే పక్కవాద్యాలను బోల్తా కొట్టించడం వంటివి పెద్దగా ఉపయోగపడవు. సంగీతం అనేది బలప్రదర్శన స్థాయిని మించి, ఒక కళాకారుడి ఆత్మను ఆవిష్కరించేదిగా పరిణమిస్తే ఎంతో బావుంటుంది.

బాలమురళికన్నా వయసులో చిన్నవారైన సినీ గాయనీగాయకులందరూ పట్టుతప్పి, గాత్రంలో వెనకబడడం చూస్తూనే ఉన్నాం. ఆయన మాత్రం ఎప్పటిలాగే బ్రహ్మాండంగా పాడుతున్నాడు. ఆయనను అందుకోవడం కష్టం గనకనే ఆయనకు ఎక్కువమంది శిష్యులు తయారవలేదు. శాస్త్రీయ సంగీతంలోని అంశాలన్నిటిలోనూ ఆయన తన ఆధిపత్యాన్ని చూపగలిగాడు. ఆయన కేవలం ఒక భావయుక్తమైన గాయకుడు అనో, అందంగా పాడగలిగినవాడు అనో అనుకోవడం సరైన పని కాదు. కర్నాటక సంగీతాన్ని సంకుచితమైన చట్రంలో బిగించినవారే అలా అనుకుంటారు. ఒక సందర్భంలో ఈమని శంకరశాస్త్రిగారు అనేక రకాలైన గమకాలను వినిపించారు. అందులో మొదటి సెట్ పాశ్చాత్య, హిందుస్తానీ, కర్నాటక సంగీతాలన్నిటిలోనూ వినబడతాయి. రెండో రకం హిందుస్తానీ, కర్నాటక సంగీతాలలో వినబడతాయి. మూడో రకం కర్నాటక సంగీతంలో మాత్రమే వినబడతాయి. దీనర్థం ఏమిటంటే కర్నాటక సంగీతంలో అన్ని గమకాలనూ వాడుకోవచ్చు. అలా కాకుండా కేవలం మూడో సెట్ మాత్రమే ఉపయోగించుకుంటే కర్నాటక సంగీతం సంకుచితంగా తయారవుతుంది. బాలమురళి అన్ని గమకాలనూ పాడి, కర్నాటక సంగీతపు పరిధిని విస్తృతం చేస్తున్నారని నా అభిప్రాయం. అందుకు మెచ్చుకోవడం మాని, ఆయనను విమర్శించడం తగని పని. శతాబ్దానికో, రెండు శతాబ్దాలకో ఒకసారి ఆవిర్భవించే గొప్ప విద్వాంసుల్లో బాలమురళీకృష్ణ ఒకరు.

బాలమురళీకృష్ణ గారి సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య గారు రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణగారు ఉపోద్ఘాతం రాసారు. అన్నవరపు రామస్వామి ‘ఆశీర్వచనం’ రాశారు. ఈ పుస్తకం వెల వంద రూపాయలు. ప్రతులకు భారతీరాధ పబ్లికేషన్స్, 1-158, విద్యావికాస్ ప్రక్కన, సత్రంపాడు, ఏలూరు 534007 ని సంప్రదించవచ్చు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...

 

(21 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. మురళి నందుల అభిప్రాయం:

    September 2, 2008 9:58 am

    చక్కటి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.

  2. T.Raja gopal అభిప్రాయం:

    September 2, 2008 1:32 pm

    శ్రీ. బాలమురళి గారి గురించి, నాకు తెలియని చాల చక్కని
    విశేషాలు వ్రాసారు. ధన్యవాదములు.

  3. baabjeelu అభిప్రాయం:

    September 3, 2008 5:23 am

    ఆరుద్ర, బాలమురళీ మీద రాసిన వ్యాసం, తపాలా శాఖ వారి దయ వల్ల గాల్లో కలిసిపోయిందని చాలా ఏళ్ళ కిందట చదివినప్పుడు కలిగిన బాధ, ఈ వ్యాసంతో ఉపశమించింది.

    బాలమురళీ ఛలోక్తులు:

    బొంబాయిలో రంగ్ భవన్ కచేరీ లో, స్వాతి తిరునాళ్‌ కీర్తన ముందు, “ఈ హిందీ పాట, ఒక మళయాళీ రాజుగారు రాసింది. ఒక మళయాళీ సినిమా కోసం, వరస కట్టి పాడింది, తెలుగునాట పుట్టి, తమిళనాట్లో పెరిగిన కుర్రాడు. ఆ కుర్రాణ్ణి నేనే.”

    ఈ కచేరీలోనే “ఒరునాళ్ పోదుమా …” మొదలెట్టి, పాట ఆపి “పోగాదు ముడిచిట్టుమా?” అనడం.

    ఈ కచేరీలోనే “రబీంద్రొ షొంగీత్” మొదలెట్టినపుడు, వెనక వరసలో కూచున్న బెంగాలీ “ఖూబ్ భాలో” అన్నప్పుడు, ఆశ్చర్యం వేసింది.

    ఆగష్టు 24, 2008 న రవీంద్రభారతి లోజరిగిన కార్యక్రమం లో, “ఇలా అన్నీ పాడేస్తే ఇక నన్నెవరూ కచేరీలకి పిలవరు.” రసికులిచ్చిన లిస్ట్ చూసి.

    ఎస్. జానకి గారు, స్టేజి దగ్గరకెళ్ళి, “దేవీ బ్రోవ సమయమిదే” అని నాలుగైదు సార్లు గట్టిగా అడిగేరు. బాలమురళీ “ఇదేనా?”

    “తుంగా తరంగే” పాడమని ఎవరో రాసి పంపితే, “అవన్నీ బాలమురళీ గా వున్నప్పుడు పాడినవి.”

    కచేరీ వినడానికి వచ్చిన వాళ్ళని బట్టి కచేరీ చెయ్యడం ఈయనొక్కరే చెయ్యగలరని నా నమ్మకం.

    బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు కలిసి “ఎంకి పాటలు” కూడా పాడేరు. భక్తిరంజని కార్యక్రమం లాగే వుంటుంది. బహుశా అందుకే ఎవరూ వాటి ఊసు ఎత్తరేమో?

  4. mOhana అభిప్రాయం:

    September 3, 2008 9:19 am

    బాలమురళీకృష్ణగారిని గురించిన వ్యాసం చదవడానికి బాగుంది. వారు తెలుగు సినిమాలలో పాడిన పాటలను అందరూ వినే ఉంటారు. వీరు మిగిలిన దక్షిణ భాషల సినిమాలలో కూడా పాడారు. అందులో కొన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. మలయాళంలో దక్షిణామూర్తి మాస్టారు దర్శకత్వంలో గానం అనే చిత్రంలో వీరు పాడారు. ఆ పాటలను ఇక్కడ వినగలరు -

    గానం (మళయాళం) (devaragam.com నుండి)

    ఇందులో ఒక స్వాతి తిరునాళ్ పాట బాలమురళిగారు సుశీలగారికి నేర్పినట్లు ఉంటుంది.

    తమిళములో నాకు తెలిసి వీరి మూడు సినిమా పాటలు ప్రసిద్ధమైనవి. అవి -

    1. కలైక్కోయిల్ అనే చిత్రంలో విశ్వనాథన్-రామమూర్తి సంగీత దర్శకత్వంలో తంగ రదం వందదు వీదియిలే అనే పాట. ఇంటర్నెట్లో నాకు ఆ పాట లభ్యము కాలేదు. మిగిలినవి -

    2. బాబ్జీలుగారు చెప్పిన తిరువిళైయాడల్లోని రాగమాలిక ఒరు నాళ్ పోదుమా (సంగీతం - మహాదేవన్). దానిని ఇక్కడ వినగలరు -

    ఒరు నాళ్ పోదుమా (musicindiaonline నుండి)

    3. మరొకటి ఇళయరాజా దర్శకత్వములో కవిక్కుయిల్లోని చిన్న కన్నన్ అళైక్కిరాన్

    చిన్న కన్నన్ అళైక్కిరాన్ (musicindiaonline నుండి)

    కన్నడ సినిమాలలో వీరు చాల అందంగా పాడారు. నాకు తెలిసినవి - సంధ్యారాగ (ప్రసిద్ధ రచయిత అ.న. కృ. వారి నవలపై ఆధారం). ఇందులో వీరు మరియు భీమసేన్ జోషీగారు ఇద్దరు పాడారు. ఇందులో రెండు ఈ పరియ సొబగు (పురందరదాసు), నంబిదె నిన్న నాద దేవతె పాటలను యూట్యూబులో వినవచ్చు.

    మరొకటి హంసగీతె. ఇందులో శ్యామశాస్త్రి పాటను అత్యద్భుతముగా పాడారు. అంతేకాక జయదేవుని అష్టపదులను ఎం. ఎల్. వసంతకుమారితో పాడారు. ఈ పాటలను ఇక్కడ వినవచ్చు -

    హంసగీతె (కన్నడ) (musicindiaonline నుండి)

    కన్నడములోని మూడవ చిత్రం సుబ్బా శాస్త్రి. ఇది ఒక మస్ట్ సీ చిత్రము. దీని సంగీత దర్శకుడు వీణా దొరైస్వామి అయ్యంగారులు. ఇందులో దేవరనామములను మురళికృష్ణగారు చాల చక్కగా పాడారు. ఈ పాటలను ఇక్కడ వినగలరు -

    సుబ్బా శాస్త్రి (కన్నడ) (musicindiaonline నుండి)

    ఈ చిత్రపు మరొక అందమైన పాట (నాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం) శ్రీరంగం గోపాలరత్నంగారు పాడిన కృష్ణన కొళలిన కరె. దీనిని నేను ఒకప్పుడు తెలుగులో అనువాదం చేసి రచ్చబండలో ప్రచురించినట్లు గుర్తు.

    - మోహన

  5. Rohiniprasad అభిప్రాయం:

    September 3, 2008 7:11 pm

    మరొక ముచ్చట గుర్తుకొచ్చింది. చిన్నతనంలో తనను పరీక్షించడానికొచ్చిన ఒక విద్వాంసుడు తలొక్క చేత్తో తలొక కాలంలో ఆదితాళం వేసి చూపుతూ, ఆ విద్యను కుర్రవాడికి నేర్పమని బాలమురళి గురువుకు సలహా ఇచ్చాడట. అంటే ఒక వేగంతో ఒక చేత్తోనూ, దానికి రెండింతల వేగంతో మరో చేత్తోనూ వేళ్ళు కదుపుతూ ఆదితాళాన్ని సూచించడం అన్నమాట. ఇది చూసిన బాలమురళి తానుకూడా వెంటనే అలా చేసి చూపడమే కాక చేతులు మార్చి మళ్ళీ తాళం వేసి చూపాడట. మీరలా చెయ్యగలరా అని ఆ వచ్చినాయనను బాలమురళి అడిగితే ఆయన చల్లగా జారుకున్నాడట. ఈ రకమైన అవయవ నియంత్రణ ఆదిభట్ల నారాయణాదాసుగారికి ఉండేదనీ, ఆయన ఏకకాలంలో పంచముఖి అనే అయిదురకాల తాళాలను ఒకేసారి (రెండు కాళ్ళూ, రెండు చేతులూ, నోటిపాట ద్వారా) వేసి చూపేవాడనీ అంటారు.

  6. peddada sundera ramakrishna అభిప్రాయం:

    September 4, 2008 1:35 am

    శ్రీ బాలమురళి గారి గురించి చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. బాలమురళి వారు ఒక జీనియస్. వారు కట్టిన రాగాలు గురించి మీరు మరింత వివరణ ఇవ్వమని మా ప్రార్ధన.

  7. విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    September 4, 2008 8:46 am

    శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.

    ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:

    1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా, శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.

    2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.

    మోహనరావుగారికి:

    మీ అభిప్రాయంలో, మీరిచ్చిన లింకులకి ధన్యవాదాలు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  8. రంగ అభిప్రాయం:

    September 4, 2008 2:41 pm

    “పాడటానికి నేనూ, వాయించటానికి తమ్ముడు చిట్టిబాబూ చాలు” అని “అన్నగారు బాలమురళి” అనే వారని చిట్టిబాబుగారన్నారు. తమిళ (గాత్ర) విద్వాంసుల ప్రతిభ మీద గబుక్కున జోక్స్ వేసేయటం ఇద్దరికీ అలవాటనుకుంటాను. అది అనేక యుద్ధాల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమో, నిశ్చతమైన అభిపాయమో, లేక కేవలం పెట్టీనెస్సో వెంటనే తెలిసేది కాదు.

    బాలమురళీగారు ఆత్మకథ వ్రాశారు కాదా? ఎక్కడో సీరియల్ గా చూసిన గుర్తు. (పినాకపాణి గారి ఆత్మకథతో కన్ఫ్యూస్ అవుతున్నానేమో?)

    చక్కటి వ్యాసాన్ని అందినంచినందుకు రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

  9. baabjeelu అభిప్రాయం:

    September 4, 2008 8:57 pm

    రోహిణీ ప్రసాద్ గారూ,
    పెద్దాడ సుందర రామకృష్ణ గారి “ప్రార్థన” అద్భుతం.
    సంగీతం లో అ, ఆ లు రాని వాళ్ళం బాలమురళీ కచేరలకి, హాజరవుతాం. అలాగే మరో నాలుగు పాసులెక్కువ తీసుకుని, గేటు బయట పాసుల్లేని వాళ్ళకి మిగిలిన పాసులిచ్చి సంతోషపడే వాళ్ళూ ఉంటారు. కచేరీ కొచ్చినవాళ్ళలో, నార్తిండియన్సూఎక్కువే ఉంటారు. వీళ్ళతో సమానంగా, “నా మొహం. ఏముక్కకాముక్క విడగొట్టి, ఏ కీలుకాకీలు విరిచేసి, అడ్డదిడ్డంగా పాడతాడు. అదేం శాస్త్రీయ సంగీతం?” అని అనేవాళ్ళూ ఉన్నారు. మిగిలిన విద్వాంసులకి ఇలాటి పరిస్థితి లేదు.
    బాలమురళీ సంగీతం గురించి ఇంతకన్నా ఇంకొంచెం వివరంగా, ఇంకో వ్యాసం రాయాలి మీరు.

  10. baabjeelu అభిప్రాయం:

    September 6, 2008 4:15 am

    రోహిణీ ప్రసాద్ గారూ,

    మొత్తం వ్యాసం మీద, ఒక్కసారి కూడా “వాగ్గేయకారుడు” అని వాడలేదు మీరు, బాల మురళీ గురించి.

    డా. సి.నారాయణ రెడ్డి “అన్నమయ్యతో ప్రారంభమైన, తెలుగు వాగ్గేయకారుల పరంపర, ప్రస్తుతం, బాలమురళీ దగ్గర సేద దీరుతోంది” అన్నారు.

    బాలమురళీ సొంత కీర్తనలూ, కృతులూ రాసేరంటారు. “ఉన్నవాటికి తోడు, ఈ మధ్యని స్వంత కీర్తనలే ఎక్కువైపోతున్నయి, ఈయన కచేరీల్లో” అనికదా బాలమురళీ విమర్శకులు చిందులు కూడా తొక్కుతారు.

  11. rama అభిప్రాయం:

    September 6, 2008 6:06 am

    బాబ్జీలు గారూ,

    రోహిణీప్రసాద్ గారేమంటారో నాకు తెలీదుగానండీ .. అదేంటోగానీ, “కవి” అన్న పదం లోని ఆకర్షణ అలాంటిదనుకుంటాను.. చాలామందికి తాము “కవులం కాబోలు” అనే భ్రమ ఒకటి వుంటుంది. తీరా పేరు వచ్చేసరికి దాన్ని నిజమే అని వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు. పేరు వల్ల వచ్చే అతిశయం ఒకటి వుంటుంది పైగా. అందువల్ల వాళ్ళకి వాస్తవాన్ని చెప్పే వాళ్ళు ఎవరూ వుండరు చాలసార్లు. మన బాలమురళి గారి “వాగ్గేయకారితనం” కూడ అలాంటిదే. ఆయన వాగ్గేయకారుడు అని అనుకుంటున్నాడు. నమ్ముతున్నాడు. ఏంచెయ్యగలం.

    నారాయణ రెడ్డి ప్రతీ వాళ్ళకీ అలుపు లేకుండా “కితాబులు” ఇవ్వటానికి అలవాటు పడిపొయాడా.. మరి బాలమురళిని ఆయన “వాగ్గేయకారుడు” అనకపోతే మనం ఆశ్చర్యపడాలి గానీ.. అలా అంటే అందులో వింత ఏముంది?? సినారె కవులంటూ ముందుమాటలు రాసిన వాళ్ళు ఎవరూ ఇవాళ కవులుగా ఎక్కడున్నారో మనకి తెలీదు. రేపు మన బాలమురళి ఎక్కడుంటారో “వాగ్గేయకారుడిగా” కూడా మనకి తెలీదు. సినారె కీ బాలమురళి కీ తెలిస్తే చాలు అని అనొచ్చు మీరు. నేనూ అదే అంటాను.[నేను గాయకునిగా బాలమురళి గాత్రాభిమానిని..ఆయన “వాక్” మీద నాకేమంత సరదా లేదు].

    భవదీయ..
    Rama

  12. Rohiniprasad అభిప్రాయం:

    September 6, 2008 8:44 am

    బాలమురళి కొన్ని వందల సందర్భాల్లో కచేరీలు చేసి, ఇంటర్వ్యూలిచ్చి, అభిమానులతో ముచ్చటించి ఉంటారు గనక వాటిలో చాలా విషయాలు పాఠకులకు తెలిసే అవకాశం ఉంటుందని నేననుకున్నాను. నేనేదో కొత్తగా కనిపెట్టినట్టు కాకుండా, నాకు వ్యక్తిగతంగా తెలిసిన కొన్ని వివరాలను (ఆయన సంగీతపు వ్యక్తిత్వానికి అద్దంపట్టేవి) మాత్రమే రాశాను. ఆయన వాగ్గేయకారుడనీ, కొత్త రాగాలు తయారుచేశాడనీ, పంతొమ్మిదేళ్ళకే 72 మేళకర్తల్లోనూ రచనలు చేశాడనీ అందరికీ తెలిసినదే కదా అని ప్ర్రత్యేకంగా రాయలేదు. అయితే ఈ కామెంట్లన్నీ చదివాక మరొక వ్యాసం రాసి పంపవలసిన అవసరం ఉందనిపిస్తోంది. అందుకు ప్రయత్నిస్తాను. మోహనరావుగారు ఆడియో లింకులిచ్చి మంచిపని చేశారు.

  13. baabjeelu అభిప్రాయం:

    September 6, 2008 11:36 am

    rama గారూ,
    సినారె ని వొదిలెయ్యండి. సినారె certification బహుశా అంత విలువ లేనిదయుండొచ్చు.
    బాలమురళి “వాగ్గేయకారితనం” మీరెందుకు ఒప్పుకోట్లేదో కొంచెం వివరిద్దురూ?
    రేపు ఎవరు ఎక్కడుంటారో ఎవరూ చెప్పలేరు. చక్కగా చెప్పేరు.
    ఇవాళ సంగతి ఏవిటి?

  14. Rohiniprasad అభిప్రాయం:

    September 6, 2008 8:14 pm

    బాలమురళీకృష్ణను వాగ్గేయకారుడు అనడానికి రమ/రామ గారికేదో అభ్యంతరం ఉన్నట్టుంది. నిజానికి అదొక ఫ్యూడల్ పదం. పాటలు రాసి ట్యూన్ కట్టినవారెవరినైనా వాగ్గేయకారుడు అనవచ్చు. నేనూ ఆ పని చేశాను, రవీంద్ర జైన్ చేస్తూనే ఉన్నాడు కనక రమ/రామ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సిద్ధాంతరీత్యా మేమూ వాగ్గేయకారులమే. మరి రజనీకాంతరావుగారి నేమనాలి?
    తన రచనల గురించి బాలమురళీకృష్ణ ఏమన్నారో నేను తరవాతి వ్యాసంలో రాస్తాను. బాలమురళీకృష్ణ రచనల గురించి రమ/రామ గారికి సురేశ్ వాడ్కరంత గొప్ప అభిప్రాయం లేకపోవచ్చు. ఎవరిష్టం వారిది. నా మటుకు నాకు ఈ పాతకాలపు tags ఈ రోజుల్లో వాడడం అంతగా నచ్చదు.

  15. కొత్తపాళీ అభిప్రాయం:

    September 7, 2008 3:55 am

    బాలమురళీ “వాగ్గేయకారితనం” ఋజువు చెయ్యడానికి ఒకే ఒక్క మాట చాలు - తిల్లానా.

  16. rama అభిప్రాయం:

    September 7, 2008 5:22 am

    బాబ్జీలు గారు !! విశ్లేషణ ఇంకెవరు చేసినా నేను వింటాను. నాకు ఆనందం ప్రమాణం! రసాస్వాదనని కలిగించాలి. “వాక్కు“ ఎప్పుడైనా ఎవరిదైనా!

    అన్నమయ్య ..త్యాగయ్య ..క్షేత్రయ్య ..యాగంటివారి తత్వాలు ..వింటున్నప్పుడు కలిగే అక్షరానందం నాకు ..బాలమురళీ రాసిన వాటిల్లో ఎప్పుడూ కలగలేదు. మీలో ఎవరైనా ఆయన అక్షరం అన్నమయ్య పదం తో సమానమైన ఆనందం ఇచ్చిందని _త్యాగరాజ కీర్తన వింటున్నప్పుడు కలిగే ఆనందం కలిగించిందనీ చెప్తే ..వివరించి చూపితే.. నేను ఒక వేళ పొరబడితే గనక తప్పకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు నా అభిప్రాయాన్ని సవరించుకోగల అవకాశం మరి ఇవ్వాల్టి వరకూ కలగలేదు. గేయకారుడిగానే తప్ప వాగ్గేయకారుడిగా బాలమురళి నన్ను ఆకట్టుకోలేదు.

    “ఖగరాజు, నీ ఆనతివిని వేగ చనలేదో! గగనానికి ..ఇలకూ బహుదూరంబనినాడో! జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదూ” అన్న వాక్యాలలోని “ఆర్తిని“ మీరు బాలమురళీ “వాక్” లో దర్శించారా??

    “మగువ తన కేళికామందిరము వెడలె” అన్న మువ్వగోపాల పదం లోని సరసతని మీరు బాలమురళీ “వాక్” నించి అనుభవించారా?

    ”జగడపు చనవుల జాజర.. సగినల మంచపు జాజర”__అన్న అన్నమయ్య వాక్కులలో విరజిల్లే తూగుని మీరు బాలమురళీ “వాక్కు” లలో విన్నారా?? ఇదే చెప్పండి చాలు.

    నేను వినలేదు గనక బాలమురళీ “వాగ్గేయకారితనాన్ని” ఒప్పలేదు.. ఏ కళకి ఆ కళ విలక్షణమైనది. దేని విశిష్టత దానిది. బాలమురళీ కర్నాటక సంగీతానికి అమరిన ఒక ఆభరణం. కానీ తెలుగు “వాగ్గేయకారితనం” ఆయనలో లేదు. ఈ రెండూ వేరు వేరు. ఒకదాన్లో గొప్ప అయినంత మాత్రన అంతే సమానంగా మిగతా కళల్లో కావాలని ఎక్కడాలేదు.

    Rama.

  17. rama అభిప్రాయం:

    September 8, 2008 1:47 am

    rohiNiprasad garu.. asalu aamaatakoste sastreeya samgeetamantaa mothamgaa mari ” fuedal” kaaLa avutunde ??danigurinchi “prajaswamika pramaNalato” marela matladukuntam?? prateedanikee pramaNalu vuntayi kadandee !! .meeru anesukunte saripotunda?? sastram kooda oppali.. sarasulu ounanianaali. meerichhina nirvachanam prakaram asalu vaggeyakaarulu kaanivarantoo evaroovundaranukuntaanu. political slogans ki padalu andinche vaalloo.. AD films ki matalani supply chesevaritosaha antaa telugu “vaggeyakarule”

    bhavadeeya RAMA/ rama.

  18. mOhana అభిప్రాయం:

    September 8, 2008 8:10 am

    వాగ్గేయకారులపైన చర్చ జరుగుతుంది కనుక ఇక్కడ
    కొన్ని విషయాలను గురించి చెప్పాలి. కాకి నలుపే,
    కోకిల నలుపే, కాని వసంతఋతువులో కాకి కాకే, కోకిల
    కోకిలే అన్నట్లు, ఒక పాట వ్రాసి దానికి ఒక వరుస
    కట్టినంత మాత్రాన ఒక వ్యక్తిని వాగ్గేయకారుడు అనలేము.
    వాగ్గేయకారునికి సాహిత్యం బాగా తెలిసి ఉండాలి. భాషలలో
    ప్రజ్ఞ ఉండాలి. ఛందస్సు, వ్యాకరణం తెలిసి ఉండాలి.
    అలంకారాల ఉపయోగం తెలిసి ఉండాలి. సంగీత శాస్త్రంలో
    గొప్ప ప్రతిభ ఉండాలి. మూడు కాలాలలో పాడే శక్తి ఉండాలి
    అతని కంఠానికి. సంగీతశాస్త్రంలోని వివరాలను చక్కగా
    ఎరిగి ఉండాలి. రాగ తాళ లయాదుల జ్ఞానం క్షుణ్ణంగా
    అవగాహన చేసికొని ఉండాలి. రసానుభూతిని కలిగి
    ఉండాలి. స్వరాల ఉపయోగాన్ని తెలిసికొని ఉండాలి.
    వివిధ విధాలైన కృతులను వ్రాసి వాటిని సంగీతంతో
    జీవంతం చేసి ఉండాలి. ఉదాహరణకు, త్యాగరాజు
    పాటలను మాత్రమే కాదు, రెండు యక్షగానాలను
    కూడా వ్రాశారు. ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్లు ఏ
    కొందరు మాత్రమే నిజంగా వాగ్గేయకారులు.
    మిగిలినవారు “నేను కూడా వాగ్గేయకారుడినే” ఆని
    అనుకొన్నవారు. విధేయుడు - మోహన

  19. కొత్తపాళీ అభిప్రాయం:

    September 8, 2008 8:19 am

    వాగ్గేయకారులు అనే మాట ఫ్యూడల్ పదం ఎలాగైందో నాకర్ధం కాలేదు!
    గేయ సాహిత్యము రాసుకుని దానికి సంగీతం సమకూర్చినంత మాత్రాన అది చేసిన ప్రతివారూ వాగ్గేయకారులైపోరని రోహిణీప్రసాదుగారు తెలియనట్టుగా మాట్లాడ్డం విడ్డురంగా ఉంది. ఇంత మాత్రానికి దానికి “పాతకాలపు tags” అని లేనిపోని రంగు అద్దడం కూడా ఆశ్చర్యంగా ఉంది.
    నచ్చడం నచ్చకపోవడం వేరే సంగతి. దాన్ని గురించి నాకు మాట్లాడ్డం ఇష్టం లేదన్నా అదో పద్ధతి. బాలమురళీ అసలు వాగ్గేయకారుడే కాదు అనడం (రోహిణీ ప్రసాదు గారు కాదు, ఇంకెవరో అన్నారు), లేక ఇలాంటి “పాతకాలపు tags” వాడ్డం ఇష్టం లేదనడం హాస్యాస్పదంగా ఉంది.

  20. Rohiniprasad అభిప్రాయం:

    September 8, 2008 8:19 pm

    వాగ్గేయకారులకి మోహనగారు సరైన నిర్వచనం చెప్పారు. దాన్నిబట్టే అదొక పాతకాలపు tag అని తెలుస్తోంది కదా. ఆధునికులకి ఇటువంటి పదాలు అనవసరమనే నా ఉద్దేశం. రమగారికి బాలమురళి సాహిత్యం ఇంప్రెసివ్ గా లేదన్నారు. దానికి అభ్యంతరం ఉండదు. అయితే ఇప్పటి సమాజంలో, ఇప్పటి పరిస్థితులకు స్పందించే కళాకారులు అప్పటివారిలాగా ఎలా రాయగలరు? డబ్బింగు పాటలు రాసేవారూ, త్యాగరాజూ ఒకటేనని నేనంటానా? Modern context లో వాగ్గేయకారుణ్ణి నిర్వచించడం కష్టమని అనిపిస్తుంది.

  21. mOhana అభిప్రాయం:

    September 9, 2008 9:10 am

    నా వరకు అన్ని నిర్వచనాలకు బద్ధులైన చివరి క్లాసికల్ వాగ్గేయకారులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు వారి శిష్యులైన మైసూర్ వాసుదేవాచార్యులు. మిగిలినవారు ఆ ఔన్నత్యాన్ని అందలేదు అని నా భావన. అందులో వాసుదేవాచార్యులు సుమారు వంద సంవత్సరాలు జీవించారు. చివరి వరకు గాన విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. వీరి మాతృభాష కన్నడము అయినా కూడా తెలుగులోనే రాశారు. వీరికి సంస్కృతములో ఎనలేని పాండిత్యము. వీరి గురువుగారే వీరివద్ద సంస్కృతములో రాసినది చదివిచూడమనే వారట! బాలమురళిగారి పాటలను మిగిలిన గాయకులు తమ కచేరీలలో ఇప్పుడు కూడా పాడుతున్నారా, ఈ విషయం నాకు అంతగా తెలియదు. గాయకులందరు వీరి పాటలను “బ్రోచేవారెవరురా..” లేక “రఘువంశ సుధాంబుధి..” లా పాడుతుంటే వీరు కూడా వారిలాటి మహనీయ వాగ్గేయకారులే. అందరూ వాగ్గేయకారులే. కాని Some are more equal than others అని అంటారు గదా! విధేయుడు - మోహన

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a